Friday, November 2, 2012

మహిళలు నడుపుతున్న పత్రికలు నాడు-నేడు

                                       -కొండవీటి సత్యవతి

తెలుగు పత్రికలకు నూట యాభై     సంవత్సరాల చరిత్ర ఉంది. మొదటి తెలుగు పత్రిక ఎప్పుడు ప్రచురితమైంది? ఆ పత్రిక ఏది? ఎవరు ప్రచురించారు అనే అంశం మీద భిన్న అభిప్రాయాలున్నాయి. ''ఆంధ్రజాతి అక్షర సంపద తెలుగు పత్రికలు'' పేరుతో శ్రీ పొత్తూరి వెంకటేశ్వరరావు గారు రాసిన పుస్తకం ప్రకారం తెలుగులో తొలి పత్రిక ''వృత్తాంతి''. ఈ పత్రిక ఆవిర్భావం జరిగింది 1832-38 మధ్య అని వారు పేర్కొన్నారు. ఈ పత్రిక వారపత్రికగా మద్రాసు నుంచి ప్రతి గురువారం వెలువడేది. మండిగ వెంకట రాయశాస్త్రి ''వృత్తాంతి'' సంపాదకులు. ఆ తరువాత 1878 సంవత్సరంలో కందుకూరి వీరేశలింగం రాజమండ్రిలో స్థాపించిన ''వివేక వర్ధని' పత్రికను గురించి ప్రముఖంగా చెప్పుకోవాలి. వీరేశలింగం పంతులు పత్రికల్ని ఒక ఉద్యమంలా నిర్వహించాడు. స్త్రీల కోసం కూడా వీరేశలింగం ఒక పత్రికను ప్రారంభించాడు. దానిపేరు ''సతీహిత బోధిని'' ఇది మాసపత్రిక. స్త్రీల ఆరోగ్యం, నీతి సూత్రాలు, భార్యలుగా స్త్రీల విద్యుక్త ధర్మాలు మొదలైన వాటిమీద ఈ పత్రికలో వ్యాసాలుండేవి.

    తెలుగులో తొలి తెలుగు పత్రిక 'వృత్తాంతి' అనుకుంటే స్త్రీల కోసం నడిచిన తొలిపత్రిక ఏది? స్త్రీలు నడిపిన మొదటి పత్రిక ఏది అనే విషయంలో కూడా స్పష్టమైన ఆధారాలున్నట్టు కనపడదు. స్త్రీల కోసం ప్రత్యేకంగా పత్రికలు నడపాల్సిన అవసరముందని ఆలోచన చేసిన వారిలో ప్రథములు కందుకూరి వారే. వారు 'సతీహిత బోధిని' పేరు గల ఒక స్త్రీల పత్రికను నడిపారు. స్త్రీ విద్య గురించిన ప్రచారం ఈ పత్రికలో ఉండేది.

    ఆ తరువాత అంటే 1893లో ''తెలుగు జనానా'' పత్రిక వెలువడింది. ఈ పత్రికను రాయసం వెంకట శివుడు ప్రారంభించి చాలా కాలం పాటు నడిపారు. స్త్రీ విద్య, స్త్రీల కోసం పాటలు, పద్యాలు, స్త్రీలు రాసిన రచనలు ఈ పత్రికలో ప్రచురించేవారు. తెలుగులో తొలి కథ రాసిన బండారు అచ్చమాంబ రచనలు చాలా తరచుగా ఈ పత్రికలో ప్రచురితమవుతూ ఉండేవి.

    1902లో ఎస్‌.సీతారామయ్యగారు కేవలం స్త్రీల కోసం ప్రారంభించిన పత్రిక ''హిందూ సుందరి''. ఆరోజుల్లో ''హిందూ సుందరి'' చాలా ప్రాచుర్యం పొందిన పత్రిక. స్త్రీలకు సంబంధించిన ఎన్నో అంశాలు ఈ పత్రికలో ఉండేవి. స్త్రీ విద్య, బాల్యవివాహాలు, స్త్రీల సంఘాల ఆవశ్యకత వంటి భిన్న అంశాల మీద స్త్రీలు రాసిన కథలు, వ్యాసాలు, ఉపన్యాసాలు ఇందులో ఉండేవి. తెలుగు సాహిత్యానికి దృవతారలాంటి భండారు అచ్చమాంబ రాసిన తొలికథ ''ధనత్రయోదశి'' 1902లో హిందూ సుందరిలోనే ప్రచురితమైనది.

    స్త్రీల కోసం నడిచే పత్రికల నిర్వహణ కూడా స్త్రీలే చేపట్టాలనే ఆలోచన చేసినవారు కూడా 'హిందూ సుందరి'ని ప్రారంభించిన సీతారామయ్యగారే కావడం గమనార్హం. వీరి కోరిక, ఆశయం ఫలించి 1904లో మొసలికంటి రమాబాయమ్మ, వెంపటి శాంతాబాయమ్మగార్లు హిందూ సుందరి ప్రతికాధిపతురాండ్రయినారు. అంటే వందేళ్ళ క్రితమే ఒక పత్రికకు ఇరువురు స్త్రీలు అధిపతులయ్యారన్నమాట. బహుశా వీరివురే తెలుగులో మొట్టమొదటి మహిళా సంపాదకులు, జర్నలిస్టులు కూడా అయ్యుండవచ్చు.

    ఆ తరువాత 1910లో పులుగుర్త లక్ష్మి నరసమాంబ 'సావిత్రి' అనే పత్రికను నిర్వహించారు. ఇది కాకినాడ నుండి ప్రచురితమయ్యేది. లక్ష్మీ నరసమాంబ మంచి వక్త.  హిందీ, బెంగాలీ భాషలలో గొప్ప పాండిత్యమున్నదామెకు. స్త్రీలకు విద్య అవసరమని వాదిస్తూ, తన పత్రిక ద్వారా ప్రచారం చేసేది. కందుకూరి సంఘ సంస్కరణోద్యమం పట్ల ఈమెకు వ్యతిరేక భావాలుండేవి. ఈ అంశమై సావిత్రిలో చర్చోపచర్చలు జరుగుతుండేవి. పత్రికను ప్రోత్సహించమని ఈమె చేసిన నిజ్ఞప్తిని గమనిస్తే ఆనాటికీ, ఈనాటికీ స్త్రీల పత్రికల ఆర్థిక స్థితిలో ఏమి మార్పులేదని అర్థమవుతుంది.

    ''సోదర సోదరీమణులారా! వ్యయ ప్రయాసలకోర్చి స్త్రీల విద్యాభివృద్ధి కొరకే పత్రికను ప్రకటించుచున్నాము. తపాలా ఖర్చు, కాగితపు ఖర్చు, అచ్చు ఖర్చులకు సంవత్సరమునకు బంపెడు 12 పత్రికలకును రూ||1-0-0 అగుచున్నది. తక్కిన గుమాస్తా ఖర్చు, ఉత్తర ప్రత్యుత్తరములకగు పోస్టు ఖర్చు మున్నగునవి మేము భరించుచున్నాము.  ఈ పనియందు మేమభిలషించిన స్త్రీ విద్యాభివృద్ధియే మా లాభము. కాబట్టి విద్యాభిమానులెల్లరు మా యుద్యమమునకు దోడ్పడి మేమందింపవోవుచున్న వి.పి.ని స్వీకరింప బ్రార్థించుచున్నాము......'' లక్ష్మీ నరసమాంబ ఎంత కష్టపడి స్త్రీల అభ్యున్నతి కోసం 'సావిత్రి' పత్రికను నడిపిందో ఈ ప్రకటన చూస్తే అర్థమౌతుంది. భండారు అచ్చమాంబ రాసిన 'అబలా సచ్చరిత్ర రత్నమాల' 'సావిత్రి'లోనే ప్రచురింపబడింది. తెలుగులో తొలి స్త్రీల చరిత్రగా వినుతికెక్కిన 'అబలా సచ్చరిత్ర రత్నమాల' పుస్తక రూపంలో వచ్చినప్పుడు ఈ గ్రంథానికి లక్ష్మీనరసమాంబ ముందుమాట రాసింది.

    1914లో వింజమూరి వెంకట రత్నమ్మ అనే ఆమె కాకినాడ నుంచి 'అనసూయ' పేరుతో ఒక పత్రికను నడిపింది. ఆనాటి మహిళోద్యమానికి 'అనసూయ' ఎనలేని సేవ చేసింది. వింజమూరి వెంకట లక్ష్మీ నరిసింహరావు ఈ పత్రిక ప్రకాశకులు. వెంకట రత్నమ్మ ప్రతికాధిపురాలు.ఈ పత్రికలో స్త్రీలకు, బాలికలకు ఉపయోగపడే రచనలను ప్రచురిస్తుంటామని, గృహనిర్వహణ, ప్రకృతి శాస్త్రాలు, పురాణ స్త్రీల చరిత్రలు, వివిధ రంగాలలో వన్నెకెక్కిన ప్రపంచ ప్రసిద్ధ మహిళల చరిత్రలు మొదలగువాటిని ప్రచురిస్తామని చెప్పుకున్నారు. ఆ కాలంలో అప్పుడప్పుడే విస్తరిస్తున్న అభ్యుదయ భావాలు ఈ పత్రిక తొలి సంచికలో కన్పిస్తూండటం విశేషం.

    1918లో అంటే ఇరవయ్యవ శతాబ్ది రెండవ దశకంలో స్త్రీలు సంపాదకులుగా వెలువడిన మరో పత్రిక  ''సౌందర్యవల్లి''. గాడిచర్ల హరిసర్వోత్తమరావు భార్య రమాబాయి ఈ పత్రిక ప్రకాశకురాలు, సంపాదకురాలు. ''సౌందర్యవల్లి' పత్రికను ఎందుకు ప్రారంభించామో చెబుతూ '' యింకను ఆంధ్రదేశమున మాసపత్రికా ప్రకటనము సక్రమముగా అభివృద్ధి మార్గము పట్టలేదు. ఈ కొరతను తీర్చవలయుననుట మా యుద్ధేశ్యము......అయితే స్త్రీల సంక్షేమం కోసం ఉద్ధేశించిన రచనలే ఎక్కువగా ఉన్నప్పటికినీ 'సౌందర్యవల్లి' పత్రిక మీద స్త్రీల పత్రిక అని ఎక్కడా లేదు. స్త్రీల కోసం ప్రత్యేకం ఒక విశ్వవిద్యాలయం ఉండాలని మొదటిసారిగా ఒక ప్రతిపాదన చేసిన కీర్తి, గౌరవం సౌందర్యవల్లి పత్రికకు దక్కుతాయి. స్త్రీ విద్యావసరాలను గుర్తించి, ప్రత్యేక విశ్వవిద్యాలయం ఉండాలని ప్రతిపాదించిన రమాబాయి, గాడిచెర్ల హరిసర్వోత్తమరావుల ముందుచూపు ఎంతైనా కొనయాడదగినది.

    తరువాత ప్రముఖంగా చెప్పుకోవలసిన పత్రిక 'గృహలక్ష్మి''. ఈ పత్రికను 1928 సంవత్సరంలో స్థాపించి ఉజ్వలంగా నడిపిన వారు డాక్టర్‌ కె.ఎన్‌.కేసరి. స్త్రీల అభివృద్ధి కోసం కృషి చేసిన గృహలక్ష్మి 1960 వరకు కొనసాగడం విశేషం. స్త్రీలు అన్ని రంగాల్లోను, శారీరకంగా, మానసికంగా పురుషులతో సమానమని ధృడంగా నమ్మిన పత్రిక 'గృహలక్ష్మి'. స్త్రీల ఆరోగ్యం, విద్య మొదలైన అంశాలమీద రచనలు ప్రచురితమయ్యేవి. రచయిత్రుల ప్రతిభను గుర్తిస్తూ వారికి గృహలక్ష్మి స్వర్ణకంకణం అవార్డును ప్రతి సంవత్సరం ప్రధానం చేయడం 'గృహలక్ష్మి' ప్రత్యేకత. ఈ పత్రిక నిర్వహణలో మహిళల పాత్ర లేకపోయినప్పటికీ మహిళలలో ఉన్నతాదర్శాలు కలిగించడం, వారి హక్కుల కోసం రచనల ద్వారా పోరాడటం తన లక్ష్యాలుగా గృహలక్ష్మి నిర్ధేశించుకున్నట్లుగా ఆ పత్రిక ప్రతులను చూస్తే అర్థమవుతుంది. ''స్త్రీల ఆరోగ్య సౌభాగ్యములను పెంపొందించుటకేర్పడిన సచిత్ర మాస పత్రిక'' అని గృహలక్ష్మి కవర్‌ పేజీమీద ముద్రించి ఉంటుంది. 1953లో తన 78వ ఏట మరణించే వరకూ కేసరిగారు ఎంతో ఉత్సాహంగా పత్రిక పనిని, గృహలక్ష్మి అవార్డు పనిని కొనసాగించారు. గృహలక్ష్మి మద్రాసు నుండి వెలువడేది.

    బరంపురం నుండి వెలువడిన 'ఆంధ్రలక్ష్మి' గురించి కూడా ప్రముఖంగా ప్రస్తావించాల్సివుంది. 1921 సంవత్సరంలో కళ్ళేపల్లి వెంటక రమణమ్మ సంపాదకురాలుగా ''ఆంధ్రలక్ష్మి' పత్రిక మహిళల సంక్షేమం కోసం మొదలైంది. తొలి సంచికలో సంపాదకీయం రాస్తూ వెంకట రమణమ్మ ఇలా రాసారు. ''మొట్టమొదటి జనానా పత్రికయు, పిమ్మట హిందూ సుందరియు, తుట్టతుదకు అనసూయయు వెలువడి దేశమునకెంతయో సేవ చేయుచుండి క్రమముగా నిలిచిపోయినవి. అట్టి లోపమును బాపుటకై స్త్రీల కుపయుక్తమగు నొక తెలుగు పత్రికను వెలువరించి శక్త్యానుసారము దేశసేవ చేయవలెనను కుతూహలము నన్ను బురికొల్పుటచే నీ పత్రికను ప్రచురింప సాహసించితిని''. ఈ పత్రికకు స్త్రీల చేత చందాలు కట్టించడానికి గాను 'శారద లేఖలు'' అనే శీర్షిక కింద ఉత్తరాలు రాయడం కనిపిస్తుంది. అలాంటి ఒక ఉత్తరం '' మా పట్టణవాస స్త్రీలకు నాటకములయందున్న యభిలాష పత్రికలయందులేదు. పకోడీలయందున్న యభిరుచి పత్రికల యందు లేదు. ఉన్నచో ఏడు దినములు చిరుతిండి కట్టిపెట్టినచో యేడాది పత్రిక చదువవచ్చును కదా!'' అని ఒక పాఠకురాలు రాసింది. దేశ దేశాల్లోని స్త్రీలకు సంబంధించిన వార్తలను ఈ పత్రిక ప్రచురించేది. అప్పటి బళ్ళారి తాలూకా బోర్డులో ఒక స్త్రీకి సభ్యత్వం లభించిన వార్తను ముఖ్యమైన వార్తగా ప్రచురించింది.

    ఆంధ్రమహిళా సభ వ్యవస్థాపకురాలు, ప్రముఖ సంఘ సేవికురాలు గుమ్మిడిదల దుర్గాబాయమ్మ 1943లో స్థాపించిన 'ఆంధ్రమహిళ'  గురించి మాట్లాడుకోవాలి. స్వాతంత్య్ర సమరంలో కార్యకర్తగా పాల్గొని, నాయకత్వస్థాయికి ఎదిగి, సి.డి.దేశ్‌ముఖ్‌ని వివాహం చేసుకున్న తర్వాత దుర్గాబాయ్‌దేశ్‌ముఖ్‌గా ప్రాచుర్యం పొందిన దుర్గాబాయమ్మ ఆంధ్రరాష్ట్రంలో మహిళల ఉన్నతి కోసం తన జీవితాన్ని అంకితం చేసింది. రెండు దశాబ్దాలపాటు 'ఆంధ్రమహిళ' పత్రికను నడిపింది. మారుతున్న సమాజంలో మహిళలెదుర్కొనే సమస్యల పట్ల అవగాహనతో రచయిత్రులు రాసే రచనలు ఇందులో ఉండేవి. కనుపర్తి వరలక్ష్మమ్మలాంటి స్వాతంత్రోద్యమ నాయకురాండ్ర రచనలతోపాటు మాలతీచందూర్‌, కె.రామలక్ష్మి లాంటి ఆధునిక రచయిత్రుల రచనలు ఆంధ్రమహిళలో ఉండేవి. దుర్గాబాయమ్మ సంపాదకీయాలు చాలా పదునుగా, ఘాటుగా ఉండేవి. ఎవ్వరినైనా విమర్శించటానికి వెనుకాడేదికాదు. ఉమ్మడి మద్రాసు ప్రభుత్వంలో ప్రకాశం మంత్రివర్గం ఏర్పడినప్పుడు మహిళాభ్యుదయానికి ప్రత్యేక విధానాన్ని రూపొందించవలసిందిగా సూచిస్తూ 1947 మార్చి సంచిక పంపాదకీయంలో ఇలా రాసారు.

    '' వీరి ఆశయంలో పెద్ద లోటు కనిపిస్తూయుంది. స్త్రీ జనాభ్యుదయానికి దోహదమిచ్చే కార్యక్రమమునకు ప్రోత్సాహం లేకపోయింది. హరిజనుల గోడు, కుటీర పరిశ్రమల దుస్థితి ప్రభుత్వం వారి గమనానికొచ్చాయి. పెద్ద స్కీములు మొదలెట్టారు. పెద్ద మొత్తాలు ప్రత్యేకించారు. జాతీయాభ్యుదయాలలో ముఖ్య విషయాలైన వీటి పునరుద్ధరణకు కొత్త కొత్త ప్రభుత్వ శాఖలు, ఉద్యోగులు సృష్టించబడ్డ విషయం చూస్తూనేయున్నాం. కాని,  మహిళాభ్యుదయం విషయంలో మటుకు ప్రభుత్వం కొంత అశ్రద్ధ వహించింది''. ప్రభుత్వం యంత్రాంగంలో స్త్రీల సంక్షేమం కోసం ఒక ప్రత్యేక శాఖ ఏర్పాటు చేయాలని దుర్గాబాయమ్మగారు ఆనాడే 'ఆంధ్రమహిళ' ద్వారా సూచించారు. మహిళలు స్వశక్తి మీద ఆధారపడే విధంగా విద్య నేర్చుకుని చిన్న చిన్న పరిశ్రమలను ఏర్పాటు చేసుకోవడం ద్వారా స్త్రీల సముద్ధరణ జరగాలని ఆమె ప్రభోధించేవారు.

    1943లో రాచమళ్ళ సత్యవతీదేవి సంపాదకత్వంలో ''తెలుగుతల్లి'' పత్రిక నడిచింది. అభ్యుదయ రచయితల సంఘానికి సొంత పత్రిక ఏర్పడటానికి ముందు అభ్యుదయ సాహిత్య ప్రచురణలో మొదటగా ఉపయోగపడిన పత్రిక 'తెలుగుతల్లి'.

    హైదరాబాదు నుంచి వెలువడిన మొట్టమొదటి పత్రికగా ప్రాచుర్యం పొందిన 'వనిత' అతి కొద్దికాలమే వెలువడినప్పటికీ విలువైన సమాచారంతో, మహిళల సమస్యలపై దృష్టిపెట్టిన పత్రిక. ప్రముఖ స్త్రీవాద రచయిత్రి, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత అబ్బూరి ఛాయాదేవి గారి సంపాదకత్వంతో నడిచిన 'వనిత' తెలుగు పత్రికల చరిత్రలో చెరగని స్థానం సంపాదించుకున్నది. నాయని కృష్ణకుమారి, తురగా జానకీరాణి, ఉన్నమ విజయలక్ష్మి ఆంధ్ర యువతీ యండలి వ్యవస్థాపకురాలు యల్లాప్రగడ సీతాకుమారి గార్ల వంటి ప్రసిద్ధుల రచనలు 'వనిత'లో ఉండేవి. అబ్బూరి వరద రాజేశ్వరరావుగారి సోదరి, అప్పట్లో డి.ఈ.వో.గా పనిచేసిన సత్తిరాజు రాజ్యలక్ష్మిగారు పిల్లల వికాసం గురించి రాసిన  రచనలుండేవి. సంపాదకురాలుగా స్త్రీలలో చైతన్యం కలిగించే రచనలను ప్రచురించడం అబ్బూరి ఛాయాదేవిగారు అనుసరించిన విధానంగా కనిపిస్తుంది ఈ పత్రికలోని రచనలు గమనిస్తే. అప్పట్లో హైద్రాబాద్‌లోని బర్కత్‌పురా ప్రాంతంలో ''ఆంధ్ర యువతీ మండలి'' ప్రాంగణం సేవాభావం కలిగిన పలువురు ప్రముఖ మహిళలకు వేదికగా ఉండేది. హైదరాబాద్‌ సంస్థానం ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు భార్య అనంత లక్ష్మీదేవి ఆంధ్ర యువతీ మండలికి అధ్యక్షురాలిగా ఉండటం విశేషం.

    అబ్బూరి ఛాయాదేవి గారి సంపాదకత్వంతో వెలువడిన 'వనిత' తర్వాత వచ్చిన వనితాజ్యోతి, మహిళ, వనిత లాంటి పత్రికలు వ్యాపారాత్మక ధోరణిలో నడిచాయి. ఇవి స్త్రీల పత్రికలే అయినప్పటికీ వీటిని నిర్వహించినవారు మాత్రం పురుషులే. కుటుంబంలోను, సమాజంలోను యధాస్థితి కొనసాగేవిధంగా పితృస్వామ్య భావజాలానికి లోబడే రచనలతో ఈ పత్రికలు నడిచేవి. అప్పుడప్పుడూ వరకట్నం లాంటి సమస్యల మీద వ్యాసాలు ప్రచురించినప్పటికీ కుట్లు, అల్లికలు, గృహలంకరణ, సౌందర్యపోషణ, వంటలు లాంటి వాటి చుట్టూనే ఈ పత్రికలు కేంద్రీకృతమవుతూ, స్టీరియోటైప్‌ (మూస నమూనాలు) పాత్రలకే మహిళల్ని పరిమితం చెయ్యడం కనిపిస్తుంది.

    ఇరవయ్యవ శతాబ్ది చివరి దశకంలో వచ్చిన కొన్ని  పత్రికలు వామపక్ష, స్త్రీ వాద భావజాలంతో తమవైన ముద్రను కలిగి ఉండడం మనం గమనించవచ్చు. ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులనెదుర్కొంటూ కొంత కాలం నడిచి మూతపడిన పత్రికలు కూడా చాలానే ఉన్నాయి. 

    1978లో ప్రారంభమై సుమారు ఐదు సంవత్సరాల పాటు వెలువడిన పత్రిక 'నూతన' ఈ విలక్షణ మాసపత్రిక సంపాదకురాలు ఎం.రత్నమాల. 'నూతన' వర్కింగ్‌ ఎడిటర్‌గా 'నమ్ము' కొంతకాలం పనిచేశారు. ఈ పత్రికలో కథలు, కవిత్వం, పాటలు ప్రచురించేవారు. ప్రజా సమస్యలమీద వ్యాసాలతోపాటు 'స్త్రీ విముక్తి' పేరుతోమహిళల పేజీ ఉండేది. కొత్తగా రాయడం మొదలుపెట్టిన రచయితలను ఈ పత్రిక చాలా భిన్నమైన పద్ధతిలో ప్రోత్సహించేది. వారి రచనల్లోని లోటుపాట్లను చెప్పి సలహాలిస్తూ రచయిత బాగా అర్థం చేసుకుని తిరిగి పంపితే పత్రికలో ప్రచరించేవారు. 'ఈనాడు' దినపత్రికలో సబ్‌ ఎడిటర్‌గా పనిచేసిన రత్నమాల సంపాదకురాలుగా 'నూతన' పత్రిక ఐదేళ్ళపాటు నడిచి ఆగిపోయింది.

    1970 సంవత్సరంలో అప్పటికి ముప్పాళ్ళ రంగనాయకమ్మగానే పిలవబడుతున్న రంగనాయకమ్మ గౌరవ సంపాదకురాలుగా మొదలైన మాసపత్రిక 'వసుధ' సీరియల్స్‌, కథలు, కవితలు ప్రచురించేవారు. మంచి ప్రమాణాలతో, చదివించే గుణంతో ఎన్నో ఫీచర్లు, వ్యాసాలు ఉండేవి. చలం ఇష్టాగోష్ఠిలాంటి శీర్షికలు పత్రికను పదికాలాలు దాచుకునే విధంగా ఉండేవి. హాస్య,వ్యంగ్య రచనలకు పెద్దపీట వేయడం 'వసుధ' ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు.

    1989లో హైద్రాబాదు నుండి వెలువడిన 'లోహిత' తెలుగులో వచ్చిన మొదటి స్త్రీవాద కరపత్రిక. లోహిత అంటే ఎరుపు. స్త్రీవాద సాహితీ సమాఖ్య ప్రచురణ కింద ఈ కరపత్రిక సంవత్సరం లోపు నడిచింది. పత్రిక మొదటిసంచికలో ''శతాబ్దాలుగా అణగారిపోయి ఉన్న ఆడవాళ్ళ విముక్తి కోసం ఈ నూతన సంవత్సరం స్త్రీవాద సాహిత్య వేదికగా 'లోహిత'ను వెలువరిస్తున్నాం'' అని రాశారు. అలాగే ఈ తొలి సంచికలో జయప్రభ వ్యాసం, కొండవీటి సత్యవతి కథ'ఊరేగింపు' ప్రచురించబడినాయి. 'లోహిత' పత్రికను కొండవీటి సత్యవతి, జయప్రభ సంయుక్తంగా నిర్వహించారు.

    1992 సంవత్సరంలో విజయవాడలో మొదలైన మహిళల త్రైమాస పత్రిక 'మాతృక''? ప్రగతిశీల మహిళల కరదీపిక మన మాతృక'' అని ముఖపత్రం మీద ట్యాగ్‌లైన్‌ ఉంటుంది. కె.రమ మాతృక సంపాదకురాలుగా ఉండేవారు. సంపాదక వర్గంలో రమ, టాన్యా, వి.సంధ్య, జి.ఝాన్సీ, విమల ఉన్నారు.

    ''సమాజంలో సగభాగంగా ఉన్న మహిళలకు సమాన హక్కులు ఆచరణలో గ్యారంటీ లేని ఏ వ్యవస్థ కూడా మహిళా ప్రయోజనాలకు వ్యతిరేకమైనదే. అలాంటి వ్యవస్థ కోసం ముస్లిం,క్రైస్తవ, హిందూ మహిళలందరూ ముందడుగు వేయాల్సిన అవసరం ఉంది'' అని ఒక సంపాదకీయంలో రాశారు. మహిళల హక్కుల కోసం పోరాడే ఉద్యమాలను ఈ పత్రిక సమర్థిస్తుంది. మద్ధతు ఇస్తుంది. మహిళలపై జరిగే దౌర్జన్యాలను, అత్యాచారాలను గురించి తెలియజేస్తుంది.

    1993 ఏప్రిల్‌ నుండి 1998 ఆగస్టు వరకు నడిచిన పత్రిక 'ఆహ్వానం' ఇది స్త్రీల పత్రిక కానప్పటికీ స్త్రీల ఆధ్వర్యంలో నడిచిన పత్రిక సమయం సామ్రాజ్యలక్ష్మి(ఎస్‌.ఎస్‌.లక్ష్మి) వ్యవస్థాపక సభ్యులుగా, సంపాదకురాలుగా ఈ పత్రిక నడిచింది. సకుటుంబ మాసపత్రిక అనే ట్యాగ్‌లైన్‌ 'ఆహ్వానం' కింద ఉంటుంది. సాహిత్యం, సంగీతం, సైన్స్‌, నృత్యం గురించిన కాలమ్స్‌ ఉండేవి. ఆయా రంగాలలో ప్రముఖులతో పరిచయాలు, ఉన్నత ప్రమాణాలతో ఉండే కథలు, కవితలు దీనిలో ప్రచురించేవారు. పి.సత్యవతి, ఓల్గా లాంటి స్త్రీవాద రచయిత్రులు, అల్లం రాజయ్య, గంటేడు గౌరు నాయుడు, తమ్మేటి రఘోత్తమరెడ్డి లాంటి ప్రఖ్యాత కథకుల కథలు, ఆహ్వానంలో ఉండేవి. ''ఇప్పుడు ప్రముఖులైన, మంచిపేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న రచయిత/రచయిత్రులందరూ ఒకప్పుడు ఆహ్వానంలో కథ రాసినవారే'' అంటారు ఎస్‌.ఎస్‌.లక్ష్మి. ఉన్నత ప్రమాణాలతో నడిచిన 'ఆహ్వానం' పత్రిక ఆర్థిక ఇబ్బందులతో 1998లో ఆగిపోయింది.

    స్త్రీల సమస్యల మీద, సామాజికాంశాల మీద పదునైన సంపాదకీయాలతో కాత్యాయని నడిపిన 'చూపు' పత్రిక గురించి తప్పక తెలుసుకోవాలి. ఈ పత్రిక ఎప్పుడు మొదలైంది ఎప్పుడు ఆగిపోయింది లాంటి వివరాలు తెలియలేదు. కాత్యాయనిని అడిగినప్పటికీ తన పనుల హడావిడిలో తను, ఇరవై తారీఖు నేను ఈ వ్యాసాన్ని 'చైైతన్య మానవి' వారికి ఇవ్వాల్సి ఉండడం చేత 'చూపు' వివరాలు సేకరించలేకపోయాను. కానీ  'చూపు' లాంటి సీరియస్‌ పత్రికల అవసరం ఇప్పుడెంతో ఉంది.

    హక్కుల న్యాయవాది, సామాజిక కార్యకర్త ఎం.ఏ వనజ నడిపిన విలక్షణ పత్రిక 'తర్జని' గురించి తప్పక ప్రస్తావించుకోవాలి. అంతకుముందు 'దిశ న్యూస్‌ లెటర్‌'ని తెచ్చిన వనజ 2006 ఏప్రిల్‌ నుండి 'తర్జని' పత్రికను ప్రారంభించింది. వివిద సామాజిక అంశాల మీద లోతైన విశ్లేషణలతో, చట్టాల గురించి, చట్టాలెందుకు అమలవ్వడం లేదు? ఎలా అమలు చేయించుకోవాలి? లాంటి అంశాల మీద పాఠకుల్ని చైతన్యపరిచే వ్యాసాలతో తర్జని నడిచింది. రెండేళ్ళ క్రితం మరణించిన వనజ లేని లోటు, 'తర్జని' పత్రికలేని లోటు ఈరోజు స్పష్టంగా తెలుస్తోంది. బాలల, మహిళల, వికలాంగుల, అణగారిన వర్గాల వారి హక్కుల కోసం పోరాడుతూ, వారిని చైతన్యపరిచేలా నడిచిన 'తర్జని' లాంటి పత్రికల అవసరం ఈరోజు చాలా ఉంది.

    1993 జనవరిలో ప్రారంభమైన మరో స్త్రీల పత్రిక 'భూమిక' 1989లో వెలువడిన 'లోహిత' తర్వాత తెలుగులో సమగ్రమైన స్త్రీవాద పత్రికగా ప్రారంభమైన పత్రిక భూమిక'. మొదట్లో త్రైమాస పత్రికగా ప్రారంభమై, ద్వైమాస పత్రికగా కొంతకాలం కొనసాగి 1999 నుండి మాసపత్రికగా నిలదొక్కుకున్నది. అన్వేషి రీసెర్చ్‌ సెంటర్‌ ఆఫ్‌ ఉమెన్‌ సహకారంతో మొదలైనప్పటికీ భూమిక కొండవీటి సత్యవతి యాజమాన్యంలో, ఆమె సంపాదకత్వంలోనే నడుస్తోంది. గత 20 సంవత్సరాలుగా అవిచ్ఛిన్నంగా నడుస్తున్నది ''భూమిక''

    స్త్రీ విషయాలను, స్త్రీ సమస్య'ను పునరాలోచించి ఒక అంచనా వెయ్యటానికి కావాల్సిన అంశాలను పొందుపరిచే ముఖ్యోద్ధేశ్యంతో తెలుగులో స్త్రీల పత్రిక 'భూమిక' తీసుకురావాలనుకున్నాం' అంటూ భూమిక ఉద్ధేశ్యాలను పేర్కొన్నారు. ముఖ్యంగా స్త్రీ వాద దృక్పధం నుండి సాంఘిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులను విశ్లేషణాత్మకంగా పరిశీలించడం, ఏమాత్రం గుర్తింపు పొందని, అంచులకు నెట్టివేయబడిన 'స్త్రీల చరిత్ర, కళలు, సాహిత్యాలను వివిధ భాషల నుండి సేకరించి ప్రచురించడం......'' మొదలైన పంధొమ్మిది ఉద్ధేశ్యాలతో భూమిక వెలువడుతోంది. ప్రారంభంలో కార్యనిర్వాహక వర్గంలో జి.భారతి, కె.సజయ, వి.వసుధ, టిఎస్‌ఎస్‌ లక్ష్మి, ఎ.ఉమామహేశ్వరి, డి.మనోరమ, సి.ఉషారాణి, సభ్యులు, అడ్వయిజరీలో వసంత కన్నభిరాన్‌, కె.లలిత, శాంతా రామేశ్వరరావు, రమా మేల్కొటే,    సూసీతారు, వీణాశతృజ్ఞ సభ్యులు. తరువాత కాలంలో పాతవారు వెళ్ళిపోయి సభ్యులు చేరినా అడ్వయిజరీలో మాత్రం ఎవ్వరూ వెళ్ళిపోలేదు. మరికొంతమంది చేరారు.

    'భూమిక' స్త్రీ వాద పత్రికే అయిన్పటికీ అనేక సామాజిక అంశాల మీద ప్రత్యేక సంచిక లెన్నో వెలువడ్డాయి. దశాబ్ది ప్రత్యేక సంచిక, 2012 మార్చిలో ద్విదశాబ్ది ప్రత్యేక సంచిక వెలువడ్డాయి. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నప్పటికీ భూమిక నిరంతరాయంగా, ప్రతి సంచికలోను ఆసక్తిదాయకమైన, ఆలోచనాత్మకమైన వ్యాసాలు, కథలు, ఇతర రచనలతోను కొనసాగుతున్నది.

    వామపక్షభావాలతో వెలువడుతున్న మరో పత్రిక 'మహిళా మార్గం'. మొదట్లో ఈ పత్రిక ఎం. విష్ణుప్రియ సంపాదకత్వంలో తిరుపతి నుండి వెలువడేది. ఆ తర్వాత పి.పవన సంపాదకత్వంలో హైద్రాబాదు నుండి రావడం జరిగింది. పవనతోపాటు సంపాదక వర్గంలో ఎం. విష్ణుప్రియ, బి.అనూరాధ, జి.రేణుక ఉన్నారు. ''మన సమాజం స్త్రీలను ఒక రకంగాను, పురుషులను మరో రకంగాను నిర్ణయించింది. స్త్రీని పురుషుడికి బానిసగా మార్చే క్రమంలోనే ఈ నిర్వచనాలు వచ్చాయి. ''అటు సమాజంలో స్త్రీల పట్ల అమలయ్యే వివక్ష గురించి మహిళా మార్గం రాసిన అంశాలు ఈ పత్రిక విధానాలను పట్టిస్తున్నాయి. పనిచేయని ప్రభుత్వ సంస్థల్ని విమర్శించటంలో మహిళా మార్గం ముందుంటుంది. ప్రస్తుతం మహిళా మార్గం క్రమబద్ధంగా రావడంలేదు.

    వామపక్ష భావాలతో, స్త్రీల ఆధ్వర్యంలోను మొదలైన మరో పత్రిక 'చైతన్య మానవి' 'ఐద్వా' (ఆలిండియా డెమోక్రటిక్‌ ఉమెన్స్‌ అసోసియేషన్‌) ఈ పత్రికను ప్రచురిస్తోంది. ఎస్‌.పుణ్యవతి 'చైతన్య మానవి' సంపాదకురాలు. మల్లు స్వరాజ్యం, అల్లూరి మన్మోహిని, టి.జ్యోతి, కె.స్వరూపరాణి సంపాదక వర్గంలో ఉన్నారు.'మానవిగా' మొదలైన ఈ పత్రిక ప్రస్తుతం 'చైతన్య మానవి' పేరుతో నడుస్తోంది. ''మహిళా ఉద్యమ కరదీపిక'' ట్యాగ్‌లైన్‌ ఉంటుంది. కథలు, కవితలు, వ్యాసాలు, ఉద్యమ వార్తలు దీనిలో ప్రచురితమవుతాయి. 'ఐద్వా' చేపట్టే అన్ని రకాల పోరాట వార్తలు ఇందులో చోటు చేసుకుంటాయి. పది సంవత్సరాలుగా 'మానవి' నిరంతరాయంగా వస్తూనే ఉంది. 

    గత కొన్ని సంవత్సరాలుగా చిత్తూరు జిల్లా నుండి ఒక అపూర్వమైన స్త్రీల పత్రిక వెలువడుతోంది. ఇది 'వెలుగు' ప్రోగ్రామ్‌ కింద మొదలైంది. దీని పేరు ''నవోదయం'' ''గ్రామీణ పేద మహిళలే రాసుకుంటున్న పత్రిక'' అని కవర్‌ పేజీ మీద రాసి ఉంటుంది. గ్రామీణ   స్త్రీలే ఎడిటర్లు, రిపోర్టర్లుగా ఉన్నారు. వారి వారి గ్రామాల్లోని సమస్యల గురించి, తాము సాధించిన విజయాల గురించి, సారా సమస్య గురించి ఇందులో రాస్తూంటారు. తమ ప్రాంతాల్లోని ఉద్యోగుల అవినీతి గురించి, గ్రామాల్లోని ఆరోగ్య సమస్యల గురించి నవోదయంలో రచనలు ప్రచురిస్తారు. బహుశా గ్రామీణ స్త్రీల ఆధ్వర్యంలో మహిళల కోసం మహిళల చేత నడపబడుతున్న విలక్షణ పత్రిక నవోదయంగా గుర్తించాల్సి ఉంటుంది. జాతీయ స్థాయిలో జరిగే మహిళా జర్నలిస్ట్‌ల కాన్ఫరెన్స్‌లన్నింటికీ ఈ గ్రామీణ మహిళలు హాజరవుతూ తమ అనుభవాలను పంచుకుంటుంటారు.

    ప్రముఖ సంఘ సేవకురాలు మల్లాది సుబ్బమ్మగారి ఆధ్వర్యంలో 'స్త్రీ స్వేచ్ఛ' పేరుతో ఒక పత్రిక చాలాకాలం నడిచింది. స్త్రీల అంశాల మీద కథలు, వ్యాసాలు ప్రచురించేవారు. తను చేసే వివిధ కార్యక్రమాలకు ఈ పత్రిక  వేదికగా చేసుకునేవారు సుబ్బమ్మగారు. ఈ పత్రిక ఆగిపోయి చాలా కాలమైంది. వాసిరెడ్డి కాశీరత్నంగారు ఒక మహిళా పత్రికను నడుపుతున్నారు. చిన్న వయస్సులో అకాల మరణం పాలయిన వేముగంటి సుజాతారావ్‌ మహిళల కోసం ఒక పత్రిక నడిపింది. ( ఈ రెండు పత్రికల వివరాలు తెలియరాలేదు)

    తెలుగు పత్రిక కానప్పటికీ ఒక మహిళ ఆధ్వర్యంలో రెండు దశాబ్దాల పాటు విజయవంతంగా నడిచి, ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆగిపోయిన ''మానుషి'' పత్రిక గురించి తప్పక కుండా చెప్పుకోవాలి.'మానుషి'ని ప్రారంభించి, నిర్వహించి, సంపాదకురాలుగా కొనసాగినవారు మధుకిష్వర్‌. గొప్ప నిబద్ధతతో స్త్రీల కోసం నడిపిన పత్రిక ఇది. స్త్రీల దృష్టికోణం నుండి, స్త్రీల వాస్తవ సమస్యలను ప్రచురించే పత్రిక 'మానుషి'. స్త్రీలను వేధించే ఎన్నో సమస్యల గురించి, సమాజంలో స్త్రీలకు జరుగుతున్న అన్యాయాలను గురించి, చట్టబద్ధంగా వారికి సంక్రమించాల్సిన హక్కుల గురించి, పోరాడ్డంలో మానుషి ముందుండేది. అలాగే ఢిల్లీ నుండి వెలువడి ఆగిపోయిన పత్రిక ''లాయర్స్‌ కలెక్టివ్‌''. ప్రముఖ న్యాయవాది ఇందిరాజైసింగ్‌ ఆధ్వర్యంలో నడిచిన ఈ పత్రికలో స్త్రీలకు సంబంధించిన న్యాయపరమైన హక్కులు, చట్టాల గురించి వ్యాసాలుండేవి. ముఖ్యమైన కేసులు, తీర్పులు, స్త్రీలకు అవసరమైన న్యాయ అంశాలు కూడా ఈ పత్రికలో ఉండేవి. ఇది కూడా ఆగిపోయి చాలా కాలమే అయ్యింది.

    తెలుగులో స్త్రీల ఆధ్వర్యంలో స్త్రీల కోసం పత్రిక ప్రారంభమై వందేళ్ళు పైనే దాటినప్పటికీ ఇప్పటికి కూడా పట్టుమని పది పత్రికలు కూడా స్త్రీల కోసం నడవడంలేదు. ప్రస్తుతం నడుస్తున్నవి కూడా ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్నాయి. సమాజంలోని అన్ని రంగాల్లోను వివక్షకు గురవుతూ సవాలక్ష సమస్యలతో సతమతమవుతున్న మహిళలు తమంత తాముగా పెద్ద పెద్ద పత్రికల్ని నెలకొల్పి, నిర్వహించడం ఈ అత్యాధునిక కాలంలోను అసాధ్యంగానే ఉంది. ఆస్తిహక్కు సంపాదించుకున్నప్పటికి అమలుకు నోచుకోనిచోట, కుటుంబ వనరుల్లో గానీ, సమాజ వనరుల్లో గానీ తమకంటూ ఖచ్ఛితమైన వాటాలేని స్త్రీలు స్వతంత్రంగా ఏపని చేయాలన్నా ఎన్నో అడ్డంకుల్ని ఎదుర్కోవలసి వస్తుంది. పత్రికలు నడపడం కత్తిమీద సాములాంటి వ్యవహారం. ఒక ఆశయానికి కట్టుబడి నిబద్ధతతో నడిపే పత్రికలు వ్యాపార ధోరణికి వ్యతిరేకంగా ఉండడంతో వనరుల సమస్యను పెద్ద ఎత్తున ఎదుర్కోవాల్సి ఉంటుంది. అడ్డదిడ్డమైనవి, స్త్రీలను కించపరిచే వ్యాపార ప్రకటనలకు దూరంగా ఉండటం, ప్రభుత్వ ప్రకటనలు అందకపోవడం కూడా పెద్ద సమస్యే. లాభాపేక్ష లేకపోవడం, స్త్రీల అంశాలే ఊపిరిగా ఉండటం వల్ల కూడా ఈనాడు స్త్రీలు నడుపుతున్న పత్రికలు కొనఊపిరితో కొనసాగడానికి కారణం. 'మానుషి' లాంటి విశిష్టమైన పత్రికలు ప్రకటనలను తీసుకోకపోవడం, దానిని ఒక పాలసీ కింద అమలు చేయడం వల్ల ఆర్థికంగా కుంగిపోయి పత్రిక ఆగిపోయే స్థితి  వచ్చింది. ఈ బాటనే స్త్రీల పత్రికలు నడుపుతున్న వారందరూ నడవడం వల్లను, తమ పత్రికల్ని వ్యాపారాత్మకం, లాభాత్మకం చేసుకోలేక, చేసుకోవడం ఇష్టంలేక మూసేసుకోవడానికైనా ఇష్టపడుతున్నారు కానీ ఈనాటి ప్రధాన స్రవంతి ప్రతికారంగం అనుసరిస్తున్న విధానాలను అనుసరించలేకపోతున్నారు.

    నిజానికి ఈనాటి పత్రికా రంగం స్వరూపమే పూర్తిగా మారిపోయింది. వ్యాపార దృష్టి వివరీతంగా పెరిగింది. పత్రికా నిర్వహణ కోట్ల రూపాయల్లోకి మారిపోయింది. ధన సంపాదనకు ఏమాత్రం ఉపకరించని భాష, సాహిత్య, స్త్రీల, అణగారిన ప్రజల అంశాలు క్రమంగా దూరమై రాజకీయాలు, సినిమా వార్తలు, క్రికెట్‌లాంటి క్రీడా వార్తలు, వాణిజ్య ప్రకటనలతోను నిండిపోయాయి. స్వాతంత్య్రోద్యమం నాటి ఉన్నత విలువలు, మిలిటెన్సీ ఈనాటి పత్రికల్లో లేకపోవడానికి కారణం కూడా వ్యాపారదృష్టే. సామాజిక వనరుల్ని కొల్లగొట్టి రాజకీయ పార్టీలు పెట్టిన రాజకీయ నాయకులు కోట్లాది అక్రమ సొమ్ముల్ని పెట్టుబడిగా పెట్టి పత్రికలు పెట్టి తమ తమ బాకాలను ఊదుకోవడం ఈనాటి వాస్తవం. తమ వ్యాపారాలను పెంపొందించుకోవడానికి పత్రికల్ని నడపడం కూడా మనం చూస్తున్నాం.

    పై నేపథ్యంలోంచి చూసినప్పుడు మహిళలు పత్రికలు నిర్వహించడం ఎంత కష్టసాధ్యమైన అంశమో అర్థం చేసుకోవచ్చు. నిజానికి ఈరోజు వందల్లో, వేలల్లో స్త్రీల కోసం పత్రికలు నడవాల్సిన అవసరం ఉంది. ప్రపంచీకరణ విసిరిన పెను సవాళ్ళ మధ్య, పెచ్చరిల్లిపోతున్న హింస, ఇంటా బయటా స్త్రీల జీవితాలను అతలాకుతలం చేస్తున్నవేళ వేనవేల పత్రికలు స్త్రీల గొంతును వినిపించాల్సి ఉంది. దేశవ్యాప్తంగా ఎన్నో స్త్రీల పత్రికలు నడుస్తూ, స్త్రీలకు అండగా ఉండాల్సిన అవసరం ఉంది. మెయిన స్ట్ట్రీమ్‌కి ధీటుగా సమాంతర ప్రత్యామ్నాయ పత్రికలు నడవాలి. వీటిని నడపడం చాలా సమస్యలతో కూడుకున్నదే అయినప్పటికీ స్త్రీల పత్రికలు, సమాంతర పత్రికలు లేకపోతే, అవి ఆగిపోతే పేద ప్రజల, దళితుల, ఆదివాసీల, అణగారిన ప్రజల గొంతుకూడా వినబడదు. ముఖ్యంగా స్త్రీల గొంతు శాశ్వతంగా వినబడకుండా పోతుంది. ప్రధాన స్రవంతి పత్రికలకు ఈ అంశాలు ''లాభదాయకమైనవి'' కావు. పేద ప్రజల, మహిళలు ఆశలు, ఆకాంక్షలు, సమస్యలు మెయిన్‌ స్ట్రీమ్‌ మీడియాకు పట్టవు. లాభాలే వారి మంత్రం. వాటి కోసం స్త్రీల శరీరాలను కూడా వాణిజ్య ప్రకటనల' రూపంలో సొమ్ము చేసుకునే దిగజారుడుస్థితి కొనసాగుతున్న చోట, వారునడిపే స్త్రీ పేజీలు కూడా వ్యాపారాత్మకంగానే ఉంటున్నాయి.

    ఇంతటి వ్యతిరేక వాతావరణంలో కూడా స్త్రీల కోసం లాభాపేక్ష లేకుండా నిబద్ధతతో కొన్ని పత్రికలు నడుస్తుండడం సంతోషించాల్సిన అంశం. స్త్రీల సమస్యలు విపరీతంగా పెరిగిపోతున్న ఈనాటి తరుణంలో మరిన్ని పత్రికలు రావాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం నడుస్తున్న స్త్రీల పత్రికలు కొనసాగాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

    పదేళ్ళు పూర్తి చేసుకుంటున్న 'చైతన్యమానవి' ఐద్వా లాంటి జాతీయస్థాయి సంస్థ ఆధ్వర్యంలో నడవడం అభినందనీయం. 'చైతన్య మానవి' మరింత సమగ్రంగా, సుస్థిరంగా మనగలగాలని  కోరుకుంటున్నాను.

No comments:

నా మీద వాలిన ఛాయాదేవి ఛాయ

ఎప్పటిమాట. పచ్చగా, చల్లగా, కుటీరం లాగా ఉండే ఆ ఇంటికి తొలిసారి ఎప్పుడెళ్ళాను. తొలిచూపులోనే ఆవిడతో ప్రేమలో పడిన సంఘటనలో నిజానికి, ఆరోజు ...