Thursday, September 30, 2010

యూ ఎన్ ఎఫ్ పి ఎ -లాడ్లీ మీడియా అవార్డ్ ఫర్ జన్డర్ సేన్సిటివిటి ఇన్ మీడియా

ఎంట్రీలకు ఆహ్వానం

ఆడ శిశువులను అంతమొందించే విష సంస్కృతిని... కూకటి వేళ్లతో పెకిలించేందుకు... ఐరాస పాపులేషన్‌ ఫండ్‌, పాపులేషన్‌ ఫస్ట్‌ సంస్థలు నడుం బిగించాయి. ఆ దిశగా కృషి చేసే వారిని సత్కరించేందుకు... జాతీయ స్థాయిలో 'లాడ్లీ మీడియా అవార్డు'లను నెలకొల్పాయి. జాతీయ స్థాయి అవార్డు అందుకున్న 'భూమిక'  దక్షిణ భారతంలో లాడ్లీ అవార్డుల పర్యవేక్షణ బాధ్యతలు చేపట్టింది. ఆ అవార్డులకు సంబంధించి మరిన్ని వివరాలు...

 మహిళల హక్కులు, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న 'భూమిక హెల్ప్‌లైన్‌' వ్యవస్థాపకురాలు కొండవీటి సత్యవతి 2008 సంవత్సరానికి గాను జాతీయ అవార్డ్ (లాడ్లీ మీడియా అవార్డు) గెలుచుకున్నారు. 'భూమిక'లో సంపాదకీయానికి ఆ అవార్డు లభించింది. .

'లాడ్లీ' అంటే ప్రియమైన అనీ... నవ్వుల పాపాయి అనీ అర్థం. అలాంటి అమ్మాయిని, గారాలపట్టిని పుట్టకముందే చంపేయకుండా... ఆనందమైన జీవితాన్ని అందించమంటూ... ఐరాస పాపులేషన్‌ ఫండ్‌ కొన్నేళ్లుగా ప్రచారం చేస్తోంది. దేశవ్యాప్తంగా చైతన్యం తెచ్చే దిశలో వడివడిగా నడక సాగిస్తోంది. 'స్త్రీ సమస్యలపై ప్రతిఘటించాలి.. పోరాడాలి.. బాలికల సంఖ్య పెంచాలి' అంటూ పిలుపునిస్తోంది. అల్ట్రా సౌండ్‌ స్కానింగ్‌ కేంద్రాల్లో పొట్టలో ఉన్నది అమ్మాయా లేదా అబ్బాయా అని చెప్పడం నేరమంటూ బోర్డులు పెట్టడమే కాదు... వైద్యుల నుంచి నర్సుల దాకా ప్రతి ఒక్కరూ ఆ నియమాన్ని కచ్చితంగా పాటించేలా చూడాలని ప్రభుత్వాన్ని కోరుతోంది. ఆడయినా, మగయినా... అమ్మానాన్నలకు ముద్దుబిడ్డలే అంటూ ప్రచారం నిర్వహిస్తోంది. ఈ స్ఫూర్తిని పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లే పత్రికలు, ప్రసార మాధ్యమాలు, వాటిల్లో పనిచేసే విలేకరులను ప్రోత్సహించేందుకు ప్రాధాన్యమిస్తోంది. ఆ క్రమంలో ఏర్పాటు చేసినవే లాడ్లీ మీడియా అవార్డులు. 'కేవలం మీడియా వారే కాదు, భ్రూణ హత్యల నివారణకు ఆడ శిశువుల సంరక్షణకు కృషిచేసే సంస్థలు సైతం దరఖాస్తులు పంపుకోవచ్చు...'
ఎంట్రీలు పంపవచ్చు.
 
ఇటు కుటుంబంలో అటు సమాజంలో బాలికల హక్కుల్ని గుర్తిస్తూ జండర్‌ అవగాహనతో రచనలు చేస్తున్న వారికి అవార్డు ఇచ్చి గౌరవిస్తుంది.
 
ఉత్తమ వార్తాకధనాలు, సంపాదకీయాలు, ఫీచర్స్ పోటీ పరిధిలోకి వస్తాయి. ప్రచార, ప్రసార, వెబ్‌సైట్‌ మాధ్యమాల్లో పని చేస్తున్న విలేకరులు తమ ఎంట్రీలని పంపవచ్చు.నిబందనల్ని అనుసరించి, పంపిన వాటిలో ఉత్తమమైన వాటికి లాడ్లీ మీడియా అవార్డులు బహుకరిస్తుంది.
 
రచనలు,ప్రసారాలు జూన్ 30 2009 నుండి జూలై 31 2010 మధ్య కాలం  వచ్చి ఉండాలి.
 
 
ఎంట్రీ ఫారాల కోసం
 కొండవీటి సత్యవతి (భూమిక)

హెచ్ ఐ జి II
బ్లాక్ 8
ఫ్లాట్ 1
బాగలింగంపల్లి
హైదరాబాద్-44
040-27660173

You can also download from http://www.papulationfirst.org/

Thursday, September 23, 2010

మాతృత్వం,మన్నూ,మశానం లేని మా కోడిపెట్ట

రెండున్నర నెలల క్రితం మా ఇంట్లో పది కోదిగుడ్లను పొదిగిస్తే ఐదు పిల్లలొచ్చాయి.

అవి పుట్టిన క్షణం నుంచి నేను వాటి జీవన శైలిని గమనిస్తున్నాను.
తల్లి కోడి పిల్ల కోళ్ళను ఎంత అపురూపంగా చూసుకుంటుందో చూస్తూనే ఉన్నాను.వాటికి తినడం నేర్పించడం,తను తినకుండా పిల్లలకే తిండి వదిలేయడం,అంతెత్తున గద్ద కనిపించగానే చిత్రంగా అరవడం,పిల్లలన్ని తల్లి రెక్కల్లో దూరిపోవడం,బుల్లి కాళ్ళతో తవ్వడం నేర్పించడం తల్లికోడి ఎంతో నిష్ఠగా చేస్తూ ఉంటుంది.
నేలను తవ్వి,తవ్వి కాళ్ళు నొప్పిపెట్టగానే తల్లికోడి కాళ్ళను, రెక్కల్ని సాచి ఎక్సర్ సైజ్
చెYYఅడం,దాన్నీ పిల్లకోళ్ళు ఇమిటేట్ చేయడం చూసి తీరాల్సిందే.
ఇలా రెండు నెలపాటు తల్లికోడి అవిశ్రాంతంగా పిల్లకోళ్ళకి సమస్తం నేర్పేస్తుంది.గద్ద నుంచి,కాకుల్నిచి ఎలా తప్పించుకోవాలో చక్కగా చెబుతుంది.పిల్లకోళ్ళు అన్నీ నేర్చేసుకుని తమంత తాము తిండి వెతుక్కోవటం,గద్ద వస్తే చెట్లలోకి పారిపోవడం పక్కాగా నేర్చేసుకుంటాయ్.
ఇరవై ఒక్కోరోజు గుడ్డును పగలగొట్టుకుని పిల్లలొచ్చినంత సహజంగానే అరవై ఒక్కోరోజు నుండి తల్లి కోడి గమ్మత్తుగా ప్రవర్తించడం మొదలుపెడుతుంది.పిల్లాల్ని పొడవడం,దూరంగా తరిమెయ్యడం,తిండి కనబడితే ఎగబడి తనే తినెయ్యడం చేస్తుంది.పిల్లలని ఎంతో ప్రేమతో రెక్కల కింద పొదుపుకున్న తనే వాటిని భ్యంకరంగా పొడుస్తూ దూరంగా తరిమేస్తుంది.
ఈ దశలో మెల్లగా పుంజు దగ్గరవ్వడం రెండు దొస్తానా నడపడం మొదలౌతుంది.అంతకు ముందు చచ్చినా పుంజును దగ్గరకు రానివ్వదు.పిల్లల్ని సాకేటప్పుడు పుంజును దగ్గరకు రనీయదు.పుంజు,పెట్ట చెట్టపట్టలేసుకుని తిరగడంపెట్ట మళ్ళీ గుడ్లుపెట్టడం మొదలౌతుంది.

పిల్ల కోళ్ళు స్వతంత్రంగా తిండి వెతుక్కోవడం,స్వేచ్చగా తమంత తామే తిరగడం ,గద్దలనుచి ఇతర జంతువుల్నించితమని తామే రక్షించుకోవడం నేర్చేసుకుంటాయి.

ఈ పరిశీలనలో నేను నేర్చుకున్న అంశం ,గొప్ప పాఠం ఏమిటంటంటే పక్షులైనా,పిల్లలైనా సరే అన్నీ నేర్పించివదిలేయాలి.వాళ్ళకు ఎంతవరకు రక్షణ అవసరమో అంతవరకే మనం పట్టించుకోవాలి.వాళ్ళ బతుకుల్ని వాళ్ళను బతకనిస్తే అన్ని వాళ్ళే నేర్చుకుంటారు.తమని తాము రక్షించుకోవడం,తిండి సంపాదించుకోవడం నేర్పిస్తే అందరూ నేర్చుకుంటారు.ముఖ్యంగా ఆడపిల్లల్నీన్నీ నేర్పించి చదువు చెప్పించి,శారీరక ధృడత్వాన్ని అలవరైచే ఆటల్ని నేర్పించి సమాజంలోకి వదిలేసి చూడండి.బ్రహ్మాణ్డంగా నెగ్గుకొస్తారు.
అలా కాకుండా చిన్నప్ప్టి నుండి ఏడుపు కధల్ని చెబుతూంటే ఏడుస్తూనే ఉంటారు.
బుల్లి బుల్లి కోడిపిల్లలు బతుకు పోరు ఏలా చెYYఅలోచక్కగా నేర్చుకున్నపుడు బుర్ర,బుద్ధి ఉన్న మనుష్యులు నేర్చుకోలేరా?సిగ్గుచేటు కదా!
కొసమెరుపు:తల్లి వదిలేసిన పిల్ల కోళ్ళని అపుడపుడూ తండ్రి కోడ్పుంజు ఇలా పలకరిత్సూ ఉంటుంది.

Saturday, September 18, 2010

రేవులో తాడిలా ఎదిగిన వెదురు బియ్యం మొక్క

ఈ మొక్క చూసారా?వెదురు బియ్యం మొక్క.కొమ్మలూ,రెమ్మలతో,పొడవైన కంకులతో చూడముచ్చటగా ఉంది కదా?
ఏమి లాభం.ఒక్క బియ్యం గింజని కూడా సంపాదించలేం.
కంకి మాత్రం పొడుగ్గా,సూదివాటంగా ఉంటుంది.
ముట్టుకుంటే చాలు జలజలా రాలిపోతాయి బియ్యపు గింజలు.
గింజ గట్టిగా కొర్రల్లాగా ఉంటుంది.
ఈ బియ్యాన్ని ఎలా జాగ్రత్త చెయ్యాలో ఎవరైనా చెబుతారా???

Wednesday, September 8, 2010

కొట్టేసినందుకు రోజూ బెదిరిస్తున్న చెట్టు

ఈ చెట్టు చూసారా?నేను వద్దంటున్నా వినకుండా కూరగాయల మొక్కలకు నీడ వస్తుందని మా వాళ్ళు కొట్టేసారు.దీనిని కొట్టినందుకు నేను వారం రోజులు నా సహచరుడితో మాట్లాడలేదు.ఓ రోజంతా ఏమీ తినలేదు.చెట్టును కొడితే నాకు అంత బాధగా ఉంటుంది.మొత్తం కొట్టొద్దన్న మాటను విని ఇదిగో ఇలా వదిలేసారు.తలలేని ఆ చెట్టేమో తర్జని చూపిస్తూ బెదిరిస్తోంది.నాకు దానిని చూస్తుంటే అలాగే అనిపిస్తోంది.
దానికి చిగుర్లు ఎప్పుడొస్తాయా అని నేను చూస్తుంటే అదేమో చూపుడు వేలితో నన్ను బెదిరిస్తూ, కొట్టేస్తుంటే పట్టించుకోలేదు కదా అని నన్ను నిలదీస్తున్నట్టు అనిపిస్తోంది.

Friday, September 3, 2010

”అమ్మ ఇంట్లో వంట చేయును. నాన్న సంపాదించి తెచ్చును”. ఇక్కడే ఆగిపోయిన పాఠ్యాంశాలు

ఇటీవల ఒక డిగ్రీ కాలేజీలో ఒక సమావేశం ఏర్పాటు చెయ్యడం జరిగింది. ఆ కాలేజీ ప్రిన్సిపాల్‌ నాకు మిత్రురాలు. విద్యార్థులెదుర్కొంటున్న సమస్యల గురించి, ‘ప్రేమ’ దాడుల గురించి ఇంకా వారు ప్రస్తావించే అంశాల మీద ఈ మీటింగులో మాట్లాడాలని, వారిని చర్చల్లో చురుకుగా పాల్గొనేెలా ప్రోత్సహించాలని తను చెప్పింది. ‘జండర్‌ సెన్సిటివిటీ ‘ గురించి కూడా మాట్లాడాలని నేను సూచించాను. నాతో పాటు ఇంకో ఫ్రెండ్‌ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.

పదకొండు గంటలకి మీటింగు మొదలైంది. మూడొంతులు మగపిల్లలు, ఒక వంతు ఆడపిల్లలు వున్నారు. మగపిల్లలు అల్లరిగా కామెంట్స్‌ చేస్తున్నారు. అమ్మాయిలు ముసి ముసి నవ్వులు ఒలకబోస్తూ, ముడుచుకుని కూర్చున్నారు. నేను కొంత ఆశ్చర్యపోయాను. అమ్మాయిలు ఇంకా ఇంత ఒద్దికగా కూర్చునే వుంటున్నారా? వాళ్ళుకూడా బాగా అల్లరి చేస్తారేమోనని నేను అనుకున్నాను. కానీ అలా జరగలేదు. యుగాలు గడిచినా ఈ బిడియం, ఒద్దిక వీళ్ళను వొదలవా అన్పించింది.

మేము పిల్లల్ని చర్చల్లోకి దింపడానికి ప్రయత్నిస్తూ మీకు మళ్ళీ పుట్టడానికి అవకాశమొస్తే, ఆ జన్మలో అమ్మాయిగా పుట్టాలను కుంటారా?” అబ్బాయిగా పుట్టాలనుకుంటారా?” అని అడిగాం. అబ్బాయిలంతా మగవాళ్ళగానే అని అరిచారు. అమ్మాయిల వేపు నుంచి పెద్దగా రెస్పాన్స్‌ రాలేదు. సరే అయితే మీరు అబ్బాయి గానే ఎందుకు పుట్టాలని కోరు కుంటున్నారో ఒక్కొక్కరూ వచ్చి చెప్పండి. అంటే వరుసగా కుర్రాళ్ళు లైన్‌ కట్టారు. వాళ్ళు చెప్పిన పాయింట్లు ‘స్వేచ్ఛ వుంటుంది. బలముం టుంది. ఏమి చెయ్యాలన్పిస్తే అది చెయ్యొచ్చు. ఎక్కడికి పోవాలంటే అక్కడికి పోవచ్చు. అమ్మాయిలని ఏడిపించ వచ్చు. ఇంకా చాలా చాలా చెయ్యొచ్చు.” అంటూ చెప్పుకుపోయారు. అమ్మాయిలు కొంతమంది ముందుకొచ్చి మాట్లాడారు కానీ స్పష్టంగా వ్యక్తీికరించలేకపోయారు. ”ఆడవాళ్ళకి సహనముంటుంది. ఆడవాళ్ళు లేకపోతే ఇల్లు నడవదు. పిల్లల్పి ఎంతో ప్రేమగా చూస్తారు” లాంటి సమాధానంతో వాళ్లు మాట్లాడారు. ఆ తర్వాత ఆడవాళ్లు ఏ పనులు చేస్తారు? మగవాళ్ళు ఏ పనులు చేస్తారు. అన్ని పనుల్ని అందరూ చెయ్యగలరా? అని అడిగాం.

మగపిల్లలు ఏక కంఠంతో మగవాళ్ళే ఎక్కువ కష్టపడతారు. ఆడవాళ్ళు అన్ని పనులూ చెయ్యలేరు. మగవాళ్ళు సంపాదించి తెస్తే ఆడవాళ్ళు ఇంట్లో కూర్చుని తింటారు. అని ఒక కుర్రాడు అంటే, ఇపుడు ఆడవాళ్ళు కూడా ఉద్యోగాలు చేసి సంపాదిస్తున్నారు కదా. ఇక్కడ మీ లెక్చరర్స్‌ వున్నారు కదా! అంటే ఆ కుర్రాడు నాలుక్కరుచుకుని తలవంచుకున్నాడు. హఠాత్తుగా ఓ కుర్రాడు ” ఔరత్‌ లోగు కుచ్‌ నహీ కర్తే ఘర్‌మే ఆగు లగాతే” అన్నాడు. అక్కడున్న అందరం అదిరిపడ్డాం. ఆడవాళ్ళు ఇంట్లో ఏ పనీ చెయ్యరు. మంటలు రేపుతుంటారు’ అని ఆ కుర్రాడు అన్న మాట మాకు శూలంలా తగిలింది. అమ్మాయిలు అతడికి ధీటుగా సమాధానమిస్తారేమోనని చూసాం. కానీ ఒక్క అమ్మాయి నోరు విప్పలేదు.

ఆ తర్వాత మేము ప్రపంచ వ్యాప్తంగా ప్రతి దినం స్త్రీలుచేసే పనుల మీద ‘యూనిసెఫ్‌’ రూపొందించిన ఒక పోస్టర్‌ని ప్రదర్శించి దీన్ని మీరు ఎలా అర్ధం చేసుకుంటారు. అని అడిగాం. ఆ పోస్టర్‌లో ఎన్నో  చేతుల్ని కలిగి, ఒక్కో చేత్తో ఒకో పని-ఇంటిపని, పిల్లల పని, వంట పని, పొలం పని, పశువుల పని,  నీళ్ళు తేవడం, వంట చెరుకు తేవడం, పెద్దల సంరక్షణ, బట్టలుతకడం, వాహనాలు నడపడం,ఉద్యోగం, బయట పని-నర్సులుగా, డాక్టర్లుగా, టీచర్లుగా, అధికారులుగా, పోలీసులుగా, సైనికులుగా ఇలా ఎన్నో అవతారాల్లో అనుక్షణం పనిచేసే స్త్రీమూర్తి చిత్రమది. ఆ తర్వాత ” ప్రపంచం మొత్తంలో మూడొంతుల పనిని స్త్రీలే చేస్తారని, కాని వారికి వనరుల్లో ఒక్క శాతం వాటా కూడా లేదని” యునైటైడ్‌ నేషన్స్‌” రూపొందించిన కోటేషన్‌ని వాళ్ళ ముందు పెట్టాం. ఇపుడు మళ్ళీ చెప్పండి. స్త్రీలు ఏ పనీ చెయ్యకుండా ఊరికే ఇంట్లోనే వుంటారా? మీ ఇంట్లో మీ అమ్మ ఏమేం పని చేస్తుందో, మీ కంచంలోకి అన్నం ఎలా వస్తుందో ఎప్పుడైనా ఆలోచించారా?

పిల్లలు నిశ్శబ్దంగా కూర్చున్నారు. ‘ఆగ్ లగాతే’ అన్న కుర్రాడు ఆశ్చర్యంగా పోస్టర్‌ని చూడ్డం గమనించాను. ”మీకు స్వేచ్ఛ వుందని. ఏమైనా చెయ్యగలమనీ చెప్పారు కదా! మీ అక్క చెల్లెళ్ళకి ఈ స్వేచ్ఛ ఎందుకు లేదో! మీలాగా ఎందుకు బయట ఫ్రీగా తిరగలేకపోతున్నారో ఆలోచించారా? అని అడుగుతూ ‘టీజింగు’ గురించి అమ్మాయిల్ని ఏడిపించడం గురించి అడిగాం. మేము ‘టీజ్‌ చెయ్యడం అమ్మాయిలకి ఇష్టం. అయినా ఈ రోజుల్లో అమ్మాయిలు కూడా టీజ్‌ చేస్తున్నారు. అసలు వీళ్ళు వేసుకునే డ్రెస్సులు మమ్మల్ని రెచ్చగొట్టేలా వుంటాయి. అందుకే వెంటపడి ఏడిపిస్తాం.” అన్నారు కుర్రాళ్ళు. మీరు కూడా షార్ట్‌లు, చెడ్డీలు, గోచీలు పెట్టుకుని తిరుగుతారు కదా! అమ్మాయిలు మీ వెంట పడతారా? చీరలు కట్టుకున్న వాళ్ళ మీద కూడా అత్యాచారాలు జరుగుతున్నాయి కదా! ఈవ్‌ టీజింగుకి, రేప్స్‌కి, వస్త్రధారణకి సంబంధంలేదని తేలిపోయింది కదా! అంటే నిశ్శబ్దం. అలాగే ప్రేమ దాడుల మీద హాట్‌ హాట్‌ చర్చ జరిగింది. ”ప్రేమించడం మా హక్కు. మమ్మల్ని ప్రేమించకపోతే చంపడం కూడా మా హక్కు” లాంటి వాదనల్లోంచి- అమ్మాయిలు మిమ్మల్ని బలవంతంగా ఎందుకు ప్రేమించాలి. ప్రేమ సహజంగా వికసించాలిగానీ, ప్రేమించక పోతే యాసిడ్‌ పోస్తాం. కత్తుల్తో నరుకుతాం అంటే అది ప్రేమ అవుతుందా? ప్రేమకి, యాసిడ్‌కి, కత్తులకి ఎలా పొంతన కుదురుతుంది. అమ్మాయిలకి ‘నో’ అనే హక్కు వుంటుంది కదా! అంటే మగపిల్లల వేపు మహా నిశ్శబ్దం.

రెండు గంటలకి సమావేశం ముగిసింది. హాలు విడిచి వెళుతున్న రేపటి తరాన్ని చూస్తుంటే ఎంత దిగులేసిందో చెప్పలేను. వాళ్ళ మనసుల్లో, బుర్రల్లో నిండిపోయిన బూజు భావాలు, స్టీరియోటిపికల్‌ ఇమేజీలు నన్ను భయభ్రాంతను చేసాయి. రొడ్డ కొట్టుడు పాఠాలు తప్ప జీవితానికి అవసరమయ్యే పాఠాలు, మానవ సంబంధాలు, మానవ హక్కులు, జండర్‌ సమానత్వం, సమాజం గురించిన అవగాహన వాళ్ళకు అందియ్యని విద్యావిధానం మీద రోత పుట్టింది. విజ్ఞానాన్ని, విలువల్ని, సాహిత్యాన్ని, చక్కటి ప్రేమ భావనలని వాళ్ళకి దూరం చేసిన సమస్తం మీద- ముఖ్యంగా మీడియా, రాజకీయ నాయకులు, విద్యావిధానంమీద అలవికాని కోపంతో నా మనసు రగిలిపోయింది. సాధ్యమైన కాలేజీలు తిరిగి ఇలాంటి సమావేశాల ద్వారా యువ తరంతో మాటామంతీ కలపాలని బలమైన నిర్ణయం చేసుకున్నాక మనసు శాంతించింది.

నా మీద వాలిన ఛాయాదేవి ఛాయ

ఎప్పటిమాట. పచ్చగా, చల్లగా, కుటీరం లాగా ఉండే ఆ ఇంటికి తొలిసారి ఎప్పుడెళ్ళాను. తొలిచూపులోనే ఆవిడతో ప్రేమలో పడిన సంఘటనలో నిజానికి, ఆరోజు ...