Tuesday, June 23, 2015

చెట్టు మీద పిట్టల్లే నన్ను స్వేచ్చగా పెంచిన నాన్న.ఈ రోజు తండ్రుల దినమట.
మా నాన్నని తలుచుకుంటుంటే ఏమి గుర్తొస్తుంది.
ఆయన రోజంతా చేసిన కష్టం గుర్తొస్తుంది.
పొలంలో ఆరుగాలం పనిచేసిన రోజులు గుర్తొస్తాయి.
మా ఆవు కోసం పచ్చగడ్డి కోసుకొచ్చి మా వీధి అరుగు మీద అలా వొరిగి నిద్రపోయే నా నాన్న గుర్తొస్తాడు.
మా ఆవు కోసం చిట్టు... తవుడు గంపలో కలుపుతుంటే చెంబుతో నీళ్ళు పోసిన దృశ్యం గుర్తొస్తుంది.
మా తోటల్లో కూరగాయల మొక్కలకు దిగుడు బావిలోంచి బుడ్లజోడుతో (మట్టి కుండలు) నీళ్ళు ముంచి పోస్తుంటే నేనూ ఓ కుండ తీసుకుని ఆయన వెనకే నీళ్ళు పోసిన జ్ఞాపకాలు...
నన్ను స్కూల్ చేర్పించడానికి నరసాపురం తీసుకెళ్ళి అది ఏ స్కూలో తెలియకుండానే ఓ కొండపల్లి చేంతాడంత పేరున్న "హిదూ స్త్రీ పునర్వివాహ సహాయక సంగం స్కూల్" లో (అది ఓరియంటల్ స్కూల్ అని తెలిసో తెలియకో) నన్ను జాయిన్ చేసిన జ్ఞాపకం.
(అందరూ నన్ను విడో హోం లో చదువుతోంది అని వెక్కిరించేవారు.అప్పటికి విడోస్ అంటే ఎవరు అని నాకు తెలియదు.)
నేను కష్టాతి కష్టం గా డిగ్రీ పూర్తి చేసి ఇంట్లో ఉన్నప్పుడు "పద హైదరాబాద్ పోదాం నీకు ఉద్యోగమొస్తుంద"ని నన్ను ఈ మహానగరానికి తెచ్చి ఎలాంటి సంకోచం లేకుండా నన్ను మా చిన్నాన్న ఇంట్లో వదిలేసి వెళ్ళిపోయిన జ్ఞాపకం..
.నా జీవిత గమనం...గమ్యం నిర్ణయమైన సమయం..
మా అక్కలు..అన్న తమ్ముళ్ళు నాన్న గారూ అని పిలిచినా
నేనొక్కదాన్నే నాన్నా...నువ్వు అని పిలిచిన నాన్న...మా దొడ్డమనిషి.
వ్యవసాయం చేసిన రైతు...
అప్పుడప్పుడూ వ్యాపారం చేసి అమాయకంగా మునిగిపోయిన నాన్న.
నాన్న 50 ఏళ్ళకే మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయాడు.
ఆయనకి ఖరీదైన వైద్యం చేయించే స్థోమత మాకు లేదు.
బిపి పెరిగి తలలో నరాలు చిట్లి చనిపోయాడు నాన్న.
నేను ఆయన్ని చివరి చూపు కూడా చూడలేదు.
నేను చాలా కష్టపడి హైదరాబాద్ నుంచి వెళ్ళినా అప్పటికే అంతా అయిపోయింది.
నాన్న చాలా అరుదుగా షర్ట్ వేసుకునేవాడు.
షర్టులుండేవి కాదు.
నన్ను ఆడపిల్లగా కాకుండా మనిషిగా పెంచిన నాన్న..
చెట్లెక్కడం..
చేపలు పట్టడం...
సైకిల్ తొక్కడం...
గొడ్దళ్ళతో కట్టెలు కొట్టడం నేర్పిన నాన్న...
నువ్వాడపిల్లవి..అది చేయొద్దు.. ఇది చేయొద్దు... అలా తిరగొద్దు అని ఏనాడు చెప్పకుండా నన్ను చెట్టు మీద పిట్టల్లే స్వేచ్చగా పెంచిన నాన్న...
నన్ను హైదరాబాద్ తెచ్చి నా జీవితాన్ని అనూహ్య మలుపు తిప్పిన నాన్నని తలుచుకుంటే ఎంత సంతోషమో నాకు.
నా దగ్గర ఉన్న నాన్న ఒకే ఒక్క ఫోటో ఇది.వెనక రైలుపెట్టెల్లాగా ఉన్న మా ఇల్లు...
మండువా లోగిలి.
ఎడం వైపు నుండి రెండో వ్యక్తి మా నాన్న.పేంటు వేసుకున్న వాడు మా ఆఖరి చిన్నాన్న

వితంతువుల దినోత్సవమట

మనకి అన్నీ ఉత్సవాలే
ఏముంది సెలబ్రేట్ చేసుకోవడానికి??
ఏమి సాధించామట???
భళ్ళున గాజులు పగలకొట్టడం మానేసారా???
కృరంగా బొట్టు చెరిపేయడం మానేసాసా??
తెల్ల చీరలు కట్టించడం మానేసారా??
సొంత బిడ్డల పెళ్ళి మంటపంలోకి గౌరవంగా పిలవడం నేర్చేసుకున్నారా??
"పరమ పవిత్రత" ఆపాదించి అందరి మెడలకి తాకించే తాళి బొట్టుని ఆమె మెడకి కూడా తాకించే సంస్కారం అలవరుచుకున్నారా?
పొద్దున్నే కళ్ళబడితే తుపుక్కున ఊసే అమానవీయాన్ని మానవీయమంచేసుకున్నారా???
ఏమి సాధించారని వితంతు దినోత్సవం జరుపుకుంటారు???
అసలు స్త్రీలు ముత్తైదువులుగా...వితంతువులుగా ఎందుకు విడదీయబడాలి???
ప్రపంచంలో వితంతువులే కానీ భార్యలు పోయినవాళ్ళు ఎందుకుండరు?
వాళ్ళకో పేరు ఎందుకు లేదు???
ఒక వికారమైన రూపమెందుకు లేదు??
భార్య చనిపోయిన నెలలోనే రెండో పెళ్ళికి సిద్ధమయ్యే మగవాళ్ళ...
వాళ్ళ మనశ్శరీరాల మీద భార్యా విహీనత గుర్తులేమీ ఉండక్ఖరలేదు.
అదే స్త్రీలైతే...మనసు నిండా దిగుళ్ళు...
వికృతం చేసిన శరీరాలు అందంగా ఉండే ఆమెను అందవిహీనను చేసేదాకా సాగే పరమ అసహ్యకరమైన తంతులు...
భార్య పోయిన నాటినుంచే బయట ప్రపంచంలో స్వేచ్చగా తిరిగే భార్యావిహీనుడు..
ఆమె మాత్రం చీకటి గదిలో కుళ్ళి కుళ్ళి శోకాలు పెట్టి ఏడవాలి.
ఎవ్వరికీ కనబడకూడదు...
అశుభం..
.అధ్వాన్నమైన వ్యవస్థ ఇది.
ఏది శుభం ఏది అశుభం???
ఎవరు నిర్ణయిస్తారు??
ఆచారాలు...కట్టుబాట్లు,సంప్రదాయాలు అన్నీ ఆడవాళ్ళకే
పురుషుడెప్పుడూ అచ్చోసిన ఆబోతులా స్వేచ్చగానే ఉంటాడు.
ఏ ఆచారమూ,ఏ కట్టుబాటూ,ఏ సంప్రదాయమూ అతడిని కట్టడి చేయలేదు.
ఎంత ఘోర అపరాధం ఇది???
ఈ అపరాధాన్ని భారతీయ సమాజం వేలాది ఏళ్ళుగా కొనసాగిస్తూనే ఉంది.
భర్త చనిపోతే ఆమెని మనిషిగా లెక్కగట్టని అమానవీయ సమాజం...
కడుపు నిండా తిననివ్వని,కంటి నిండా నిద్రపోనివ్వని భయంకర సమాజం.
మధురలో,బృందావనం లో,ఎన్నో గుళ్ళ దగ్గర హీనాతి హీనంగా బతుకుతున్న వేలాది వితంతువులు భారతీయ సమజం తయారు చేసిన మహా గాయాలు..
నెత్తురోడుతూ,నిలవనీడ లేక,తినడానికి తిండి లేక,పురుష సన్యాసుల నుంచి నిరంతరం లైంగిక హింసకి,దోపిడీకీ గురౌతున్న మధుర వితంతువుల దుఖం ఈ దేశం లోని నదులన్నింటిలో లోను కలసి ప్రయాణిస్తోంది.
మీరు మరీ విడ్డూరంగా రాస్తున్నారు..
.రోజులు మారిపోయాయి...
ఇప్పుడెవ్వరూ ఆ పద్ధతుల్ని పాటించడం లేదు
అని సన్నాయి నొక్కులు నొక్కే వాళ్ళకి నా సూటి ప్రశ్న...
దయ చేసి మీ కళ్ళదాలను మార్చుకోండి...
నగర నేపధ్యం లోంచి వ్యాఖ్యానించడం మానండి...
పల్లెల్లో ఇప్పటికీ యదేచ్చగా అన్ని సాగుతున్నాయి...
చైత్యన్యవంతులైన కొంతమంది అడ్డుకుని ఆపగలుగుతున్నారు
కానీ మెజారిటీ చూస్తే ఎక్కువ మంది తుచ తప్పక పాటిస్తున్నారు.
నేను చాలా దగ్గరగా చూసాను.
చాపకింద నీరులా కొన్ని చోట్ల కనబడకుండా కొనసాగుతోంది.
మన భాష లోంచి పునిస్త్రీలు,వితంతువులు అనే పదాలు పోలేదు.
పేరంటాలకి పునిస్త్రీలే ఇంకా అర్హులు.
తన సొంత బిడ్డల పెళ్ళి మంటపంలోకి వితంతువులకు అనుమతి లేదు.
భరత స్త్రీకి నిర్వచనం ముత్తయుదువే...
బొట్టు కాటుక,తలనిండా పూలు,రంగు రంగు చీరలు కట్టినవాళ్ళే భారతీయ స్త్రీ నమూనాలు.
పరమ వికారమైన, కడుపులో పేగులు లుంగ చుట్టుకుపోయే దృశ్యాలు...
యుద్ధంలో మరణించిన "వీరుల" కు మరణానంతరం ఇచ్చే పరమవీర చక్రాలను అందుకోవడానికి తలనిండా ముసుగుతో తెల్ల చీరలు కట్టి కుంగిపోతూ వచ్చే స్త్రీలు.
వైధవ్యానికి ప్రతీకలు గా కనబడతారు.
పైగా వ్యాఖ్యానాల్లో ఫలానా సైనికుడి వితంతువు అని చెబుతారు తప్ప ఆమె పేరు ప్రస్థావించని మొరటు సంస్కృతి.
మగవాళ్ళు ఫలానా ఆమెకి వితంతువుడు అని చెప్పగా విన్నారా??
యుద్ధాలు చేసి చనిపోయేది మగవాళ్ళే కదా అంటారా??
స్రీలను వితంతువులుగా...పునిస్త్రీలుగా విభజించి అవమానించే సంస్కృతి పోవాలంటే ఏం చెయ్యాలో మనం ఆలోచించాలి.
ఆ పదాలను భాషలోంచి తీసెయ్యాలంటే ఏం చేయాలి???
ముత్తైదువులని,పునిస్త్రీలని,వితంతువులని స్త్రీలని విభజించే దుర్మార్గ సంస్కృతిని వ్యతిరేకిద్దాం రండి.

నా మీద వాలిన ఛాయాదేవి ఛాయ

ఎప్పటిమాట. పచ్చగా, చల్లగా, కుటీరం లాగా ఉండే ఆ ఇంటికి తొలిసారి ఎప్పుడెళ్ళాను. తొలిచూపులోనే ఆవిడతో ప్రేమలో పడిన సంఘటనలో నిజానికి, ఆరోజు ...