Tuesday, December 18, 2012

ఈ శనివారం సాయంత్రం ఈ జ్యేష్ట పౌరుల సాన్నిధ్యంలో.....

ఈ రోజు సాయంత్రం ఎందుకో అబ్బూరి చాయా దేవిగారి దగ్గరికి వెళ్ళాలనిపించింది.
నాలుగింటికి వస్తానని ఫోన్ చేసాను.
వెళ్ళేసరికి నాకోసం టీ తెచ్చి ఉంచారు.
రెండు రకాల స్వీట్స్ పెట్టారు.
తను ఈ మధ్య చేసిన బొమ్మలు చూపించారు.
వాటర్ బాటిల్ తో చేసిన క్వీన్ విక్టొరియా బొమ్మ చూడండి ఎంత బాగుందో.
నడుం మీద చేతులుంచి ఎంతో కాంఫిడెంట్ గా ఉన్న ఇద్దరు ఇండియన్ వుమన్ బొమ్మలు ఎంత చూడ ముచ్చటగా ఉన్నాయో!!
ఎనభైలలో పడిన చాయాదేవి గారు ఎంత హాయిగా లైవ్లీగా ఉన్నారో మీరే చూడండి.
సి.ఆర్ ఫౌండేషన్ లో ఉన్న తన ఫ్రెండ్స్ అందరిని నాకు పరిచయం చేసారు
.ఇంకొక అమ్మమ్మ గారికి తొంభై ఏళ్ళు.ఎంత హుషారుగా ఉన్నారంటే నా చెయ్యి పట్టుకుని తన రూం లోకి లాక్కెళ్ళి
తను చేసిన క్రోషో అల్లికల్ని చూపించారు.
నేను అమెరికన్ సిటిజెన్ ని నాకక్కడ అన్ని సదుపాయాలూ ఉన్నాయి కానీ నాకు ఇంగ్లీషు సరిగా రాదు.
నన్ను హాస్పిటల్ లో వేస్తే ఏ రోగమొచ్చిందో,ఎక్కడ నొప్పిగా ఉందో ఆ డాక్టర్లకి చెప్పలేనుగా అందుకే ఇండియా వచ్చేసాను.అంటూ ఒకటే నవ్వులు.



ఆవిడ నన్ను వదలకుండా పట్టుకుని రావడం వరకే నీ పని పోవడం నీ పని కాదు, నేను వదలనుగా అంటూ ఒకటే కబుర్లు.

ఆవిడకి తొంభై ఏళ్ళంటే నమ్మలేం.

ఆవిడకి బై చెప్పి వస్తుంటే ఇదిగో వీళ్ళ పైలా పచ్చీసు ఆట.జొకులు ,నవ్వులు.
ఈ అమ్మమ్మ గారు హాయిగా ఫోన్ లో ముచ్చట్లు.

ఓ గంట వారందరితోను గడిపి శాంతసుందరి గారింటికి బయలుదేరాను.
శాంతసుందరి గారు కొడవటిగంటి కుటుంబరావు గారి అమ్మాయి.
నేను వారింటికి వెళ్ళి కూర్చుంటుండగానే వరూధిని గారు వచ్చి మాదగ్గర కూర్చున్నారు.
కుటుంబ రావు గారి సహచరి వరూధిని గారని మీలో చాలా మందికి తెలుసనే నేను అనుకుంటున్నాను.
వరూధిని గారి కబుర్లు,సూటిగా వుండే వారి మాటలు వినాల్సిందే.
ఓ గంట సేపు నవ్వి నవ్వి నాకు పొట్టలో నొప్పి వచ్చింది.
సమకాలీన మతాధిపతులు,రాజకీయ నాయకులు,టీవీ సీరియళ్ళు,యాంకర్ల వెర్రిమొర్రి వేషాలు,హిందు పేపర్ లో వార్తల నాణ్యత,
భారతీయుల్లో పొంగి పొర్లుతున్న భక్తి రసం
ఆత్మ విశ్వాసం లేని అణుశాస్త్రవేత్తలు వరూధిని గారి మాటల ప్రవాహం లో గిలగిల్లాడారు.
ఆవిడ సెన్సాఫ్ హ్యూమర్ విని తీరాల్సిందే కానీ నేను చెప్పడం కుదరదు.
ఈ శనివారం సాయంత్రం ఈ జ్యేష్ట పౌరుల సాన్నిధ్యంలో వారి అద్భుతమైన మాటలు వింటూ,చర్యలు చూస్తూ గడపగలగడం అబ్బో నాకు ఎంత సంతోషమైందో చెప్పలేను.
ఆ సంతోషాన్ని మీకూ పంచాలనే నా ప్రయత్నం.

Monday, December 3, 2012

పదహారు రోజులు కాదు… మూడొందల అరవై ఐదు రోజుల ఉద్యమం కావాలిప్పుడు


నవంబరు 25 నుండి డిసెంబరు 10 వరకు స్త్రీలపరంగా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో భిన్నమైన కార్యక్రమాలు జరుగుతాయి. చాలా సంవత్సరాలుగా ఇవి జరుగుతున్నాయి. స్త్రీల మీద అమలవుతున్న హింసకు వ్యతిరేకంగా నవంబరు 25ని ‘వయొలెన్స్‌ అగెన్‌స్ట్‌ విమెన్స్‌ డే’ అంటూ మొదలుపెట్టి అంతర్జాతీయ మానవహక్కుల దినం డిసెంబరు 10తో ఈ కార్యక్రమాలు ముగుస్తాయి.

ఒక్కోదేశంలో ఒక్కో కార్యక్రమం. మన దేశంలో కూడా వివిధ రాష్ట్రాల్లో భిన్నమైన ప్రోగ్రామ్‌లు చేస్తున్నారు. దీనిని 16 రోజుల ఏక్టివిజమ్‌గా కూడా పిలుస్తున్నారు. రోజుకో రకమైన హింస గురించి మాట్లాడినా గానీ ఈ రోజు స్త్రీల మీద అమలవుతున్న హింసా రూపాల గురించి మాట్లాడాలంటే ఈ పదహారు రోజులు ఏం సరిపోతాయి? ఎక్కడ మొదలు పెట్టి ఎక్కడ ఆపాలి? ఏ హింస గురించి ఎక్కువ మాట్లాడి ఏ హింస గురించి తక్కువ మాట్లాడాలి?
అమ్మ కడుపులో భద్రంగా పడుకున్న పసికందుని చంపే క్రమం గురించి మాట్లాడాలా? పుట్టగానే, ఆడశిశువని తెలియగానే నోట్లో వడ్లగింజ వేసో, ముక్కు చెవులు మూసేసో చంపేసే అమానవీయత గురించి మాట్లాడాలా? సొంతపిల్లల్ని వయసు, వావి, వరస ఏమీ లేకుండా లైంగికంగా దాడి చేస్తున్న తండ్రుల గురించి మాట్లాడాలా? చదువు చెప్పాల్సిన పంతుళ్ళు ఆడపిల్లల్ని లైంగికంగా కాల్చుకుతింటున్న సంఘటనల గురించి మాట్లాడాలా? పెళ్ళయితే కుటుంబ హింస, పెళ్ళి చేసుకోకపోతే ఒంటరిమహిళగా ఎదుర్కొనే హింస, రోడ్డు మీద హింస, పనిచేసేచోట హింస, యుద్ధహింస, మతహింస ఏ హింస గురించి మాట్లాడాలి? ఎంత కాలం ఇలా మాట్లాడాలి?
ప్రపంచవ్యాప్తంగా కోట్లాది స్త్రీలు గొంతు చించుకుని ఎలుగెత్తి ”హింస లేని సమాజం స్త్రీల హక్కు. అన్ని హింసలకు వ్యతిరేకంగా పోరాడదాం” అంటూ నినదిస్తున్నారు. ఎవరు వింటున్నారీ మాట? ఎవరి చెవులద్వారా ఎవరి గుండెల్లోకి చేరుతోంది ఈ ఘోష? అసలు ఎవరైనా వింటున్నారా? ఆ వింటున్న వాళ్ళకి తల్లి వుండదా? తోడపుట్టిన వాళ్ళుండరా? సహచరో, సహవాసో వుండరా? కూతుళ్ళుండరా? వుంటారు. అందరూ వుంటారు. తాము నానారకాల హింసలకి పాల్పడుతూ, తమ వాళ్ళని భద్రంగా వుంచుతున్నామనే భ్రమలో ఇళ్ళల్లో బంధించాలనుకుంటున్నారు. ఓ పక్క స్త్రీల బతుకుల్ని హింసామయం చేస్తూ…మరో పక్క మేమే స్త్రీల రక్షకులంటూ ఫోజు కొట్టడం ఎలాంటి నీతి అవుతుంది? పురుషులు పాటిస్తున్న ఈ ద్వంద్వ నీతి కోట్లాది స్త్రీల జీవితాలను ఎలా ఛిద్రం చేస్తున్నాయో గణాంకాలు చెబుతూనే వున్నాయి. ‘అన్ని హింసలకు వ్యతిరేకంగా పోరాడదాం” అనే నినాదం ఎవరిని ఉద్దేశించింది? పురుషుల్నా? వ్యవస్థల్నా? ప్రభుత్వాలనా? వివిధ హింసలతో వేలాది స్త్రీల మరణాలకు కారణమౌతున్న శత్రువు అసలు ఎవరు? ఎవరి మీద మనం పోరాడుతున్నాం.స్త్రీల రక్షణ కోసం బోలెడు చట్టాలు తెచ్చాం మా పని అయిపోయింది అంటుంది ప్రభుత్వం. ప్రభుత్వాలు స్త్రీల పక్షపాతంతో వ్యవహరిస్తూ, వాళ్ళ కోసం కొత్త కొత్త చట్టాలు తెస్తూ, మమ్మల్ని రాచిరంపాన పెడుతోంది అంటున్నాయి పురుషవాద సంఘాలు. అంతేకాదు పురుషుల్ని వేధించే స్థితికి మహిళలు చేరిపోయారని, చట్టాలను దుర్వినియోగం చేస్తున్నారని కూడా ఆరోపించి, దూషిస్తున్నారు. ఇదే నిజమైతే…హింస ఎందుకు పెరుగుతోంది? హింసారూపాలెందుకు మారుతున్నాయి.? ఆలోచించి, విశ్లేషించే ఆసక్తిగాని అసలు కారణాలను అన్వేషించే సహనం కానీ లేని కొంతమంది పురుషులు స్త్రీలు చట్టాలను దుర్వినియోగం చేస్తున్నారు. అంతే… అవతలి వైపు చూసే అవసరం మాకు లేదు అంటూ మొండికేస్తున్నారు.
నిజమే! ప్రభుత్వం మహిళల ఉద్ధరణ కోసం కొత్త చట్టాలను తేస్తూనే వుంది. అంతర్జాతీయ వొప్పందాల ప్రకారం స్త్రీల మీద హింసను అంతం చేసే చట్టాలను తీసుకురావాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద వుంది. ఇంకా ఎన్నో క్యూలో వున్నాయి కూడా. ఇవన్నీ మహిళలకి అండగా, రక్షణగా ఎందుకుండటం లేదు? దీనికి కారణం ఒక్కటే. ప్రభుత్వం తెస్తున్న కొత్త చట్టాలన్నీ ఆచరణ యోగ్యం కాని విధంగానే మిగిలిపోతున్నాయి. కొత్త చట్టాల అమలుకు కావలసిన బడ్జెట్‌లు, వనరులు మంజూరుకావు. వాటిని పఠిష్టంగా అమలు పరిచే వ్యవస్థలు రూపొందవు. చట్టం అందమైన భాషలో, అద్భుతమైన పదజాలంతో రూపొంది కాగితం పులిలా గాండ్రిస్తుంటుంది. ఆ గాండ్రింపులకే భయపడి పురుష ప్రపంచం ప్రభుత్వం స్త్రీల పక్షం అంటూ నింద వేస్తుంది. మరింత హింసని ప్రేరేపిస్తుంది. పఠిష్టమైన ఆచరణకు నోచుకొని చట్టాలు మరో వంద వచ్చినా స్త్రీలకు వొరిగేందేమీ లేదు. జిల్లా ప్రధాన కేంద్రంలో కూర్చున్న రక్షణాధికారి ఆ జిల్లాలోని స్త్రీలందరిని గృహహింస నుంచి కాపాడుతుందనుకోవడం ఎంత భ్రమో! చట్టాలొక్కటే స్త్రీలను హింసల్నుండి రక్షిస్తాయనుకోవడం అంతే భ్రమ.
మరి.. స్త్రీల మీద హింస ఇంత భయానక స్థితికి చేరి మూడేళ్ళ బాలికనుండి ఎనభై ఏళ్ళ వృద్ధురాలికి కూడా రక్షణ లేని స్థితి ఇటు కుటుంబంలోను, అటు సమాజంలోను పెచ్చరిల్లిపోతుంటే స్త్రీల ఉద్యమం ఏం చేస్తోంది? గతంలో కార్చిచ్చుల్లా వ్యాపించిన సారా ఉద్యమం స్థాయిలో హింసకు వ్యతిరేకంగా దేశవ్యాప్త ఉద్యమం ఎగిసిపడాల్సిన వేళ మనమెందుకు పదహారు రోజుల కార్యక్రమానికో, మార్చి ఎనిమిది సంబరాలకో పరిమితమై పోయాం. అవి కూడా ప్రాజెక్టుల్లో ఒదిగిపోయి అనేక పరిమితుల్లో ఎందుకు కుంచించుకుపోతున్నాయి. స్త్రీల ఉద్యమం స్వచ్ఛంద సంస్థల ఏక్టివిజమ్‌గా ఎందుకు మారిపోయింది? నేను పిల్లల గురించి, నువ్వు మహిళల గురించి, మరొకరు హెచ్‌ఐవి గురించి, ఇంకొకరు ట్రాఫికింగ్‌ గురించి మాత్రమే మాట్లాడుతూ, ప్రాజెక్ట్‌ ఓరియెంటెడ్‌ పదజాలమే వాడుతూ… భారత స్త్రీల ఉద్యమం ఎక్కడో దారి తప్పింది. మనం మళ్ళీ గాడిలో పడాలంటే, ఎక్కడ తప్పిపోయాయో అన్వేషించుకోవాలంటే ఇపుడు కావలసింది పదహారు రోజుల ఏక్టివిజమ్‌ మాత్రమే కాదు మూడొందల అరవై అయిదు రోజుల ఉద్యమం… స్త్రీల ఉద్యమం. అట్టడుగు స్థాయినుంచి ఢిల్లీదాకా విస్తరించి ఉవ్వెత్తున ఎగిసిపడాల్సిన ఉద్యమం. ఆ ఉద్యమమే నేటి ఆవశ్యకత. ఆ ఉద్యమమే అన్నిరకాల హింసలకి సమాధానం..

నా మీద వాలిన ఛాయాదేవి ఛాయ

ఎప్పటిమాట. పచ్చగా, చల్లగా, కుటీరం లాగా ఉండే ఆ ఇంటికి తొలిసారి ఎప్పుడెళ్ళాను. తొలిచూపులోనే ఆవిడతో ప్రేమలో పడిన సంఘటనలో నిజానికి, ఆరోజు ...