Saturday, January 29, 2011

నేను చచ్చి బతికి ఈవాల్టికి 26 సంవత్సరాలు


అవునండి.1985 లో నేను ఓ నాలుగ్గంటలు చనిపోయాను.
నా గుండెను ఓపెన్ చేసి డాక్టర్లు నా గుండె లయను ఆపేసి
తాత్కాలికంగా హార్ట్ లంగ్ మిషన్ కి అనుసంధానించారు.
నా గుండెకున్న రూపాయి బిళ్ళంత కన్నాన్ని ఓ స్పెషల్ మెటీరియల్తో కుట్టేసి
ఆపేసిన నా గుండెకు షాక్ ఇచ్చి మళ్ళి లయలోకి తెచ్చారు.
అంటే ఓ నాలుగ్గంటలు నేను డెడ్ అన్నమాట.
ఈ మాటలు హార్ట్ లంగ్ మెషీన్ ఆపరేటర్ మధు సూదన్ చెప్పాడు.
చాలా సార్లు ఆపేసిన గుండె షాక్ ఇచ్చినా తిరిగి కొట్టుకోదట.
అంటే పేషంట్ హరీ అన్న మాట.
నాకు 30 ఏళ్ళపుడు చాలా సీరియస్ అనారోగ్యం చేసి తిన్నదంతా కక్కేసే దాన్ని.
రోగమేంటో ఎవ్వరికీ అంతుబట్టలేదు.
నా డాక్టర్ ఫ్రెండ్ అనిత ఎందరో డాక్టర్లకి చూపించి ఆఖరికి
డా: అరవింద్ దగ్గరికి తీసుకెళ్ళింది.
అప్పటికి ఖంగ్ ఖంగ్ మని దగ్గుతున్నా.
ఆయన చెష్ట్ స్పెషలిష్ట్.గుండె మీద స్టెత్ పెట్టి అలాగే ఉండిపోయాడు.
మాకేమీ అర్ధం కాలేదు.
ఆయన వివరంగా చెప్పింది విని అందరం షాక్ అయ్యాం.
నాకు పుట్టుకతోనే (కంజినేటల్)గుండెకి పెద్ద కన్నం ఉంది.
ఇంత కాలం ఎవ్వరూ కనిపెట్టలేదు.
చెడు రక్తం,మంచి రక్తం కలగలిసిపోవడం వల్ల లోపల ఇన్
ఫెక్ట్ అయ్యి దగ్గు రావడం దానిటొ పాటు తిన్నదంతా వాంతి అవ్వడం.
నాకు అర్జంటుగా ఓపెన్ హార్ట్ సర్జరి చెయ్యాలని లేకపోతే ప్రాణ హాని అని అరవింద్ చెప్పారు.
హమ్మో ! ఓపెన్ హార్ట్ సర్జరీ!!!!
ఇప్పుడు చాలా ఈజీనే.1985 లో అపోలోలు కేర్లు ఎక్కడున్నాయ్.
ఉన్నా మన దగ్గర డబ్బులెక్కడివి.
అప్పటికి మేము రిజిస్టర్ మారేజ్ చేసుకుని (1981)
నాలుగేళ్ళు.ఇంకా అవతలి పెద్దలతో ఒద్దిక కుదరలేదు.
నా సహచరుడు చాలా ధైర్యంగా ఈ అంశాన్ని ఎదుర్కున్నాడు.
నాకు కొండంత అండగా నిలబడ్డాడు.
బయటకెళ్ళి ఆపరేషన్ చేయించుకునే ఆర్ధిక స్తోమత లేక
గాంధీ హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యాను.
చాలా గొప్ప డాక్టర్ల బృందం డా: పివి సత్యనారాయణ గారు,డా:హరిప్రేం డా: శకుంతల వీళ్ళు నన్ను కంటికి రెప్పలా కాపాడారు.థొరాసిక్ సర్జన్ అయిన పివి సత్యనారాయణ గారు
ఆపరేషన్ చేసి రాత్రంతా రికవరి రూంలో ఉన్నారు.
అరుణ అనే నర్సు నన్ను ఎంత ప్రేమగా చూసిందంటే ఆమె గుర్తొస్తే ఇప్పటికి నా కళ్ళల్లో నీళ్ళొస్తాయి.
నా సహచరుడు రాత్రి పగలు బాత్ రూంలపక్కన కూచుని నాకు సేవ చేసాడు.
గవర్నమెంట్ ఆసుపత్రి అయినా గాంధీ ఆసుపత్రి అయినా అద్భుతమైన డాక్టర్లు సేవా నిరతి వల్ల నేనీ రోజు ఈ టపా రాయగలుగుతున్నాను.
ముప్ఫయ్యేళ్ళ చిన్న వయసులో అంత పెద్ద ఆపరేషన్ చేయించుకున్నా నేనెప్పుడూ హమ్మో నాకు ఓపెన్ హార్ట్ సర్జరీ అయ్యింది అని సెల్ఫ్ పిటి లోకి వెళ్ళలేదు.చచ్చి బతికాను కదా అనిపిస్తుంటుంది అంతే.

ఇందులో ఓ కొస మెరుపు:

ఇంకో రెండు రోజుల్లో ఆపరేషన్ ఉందనగా దూరదర్శన్ లో సాగర సంగమం సినిమా వేస్తున్నారని తెలిసింది.
ఆ రోజు ఆదివారం.
డాక్టర్లని ఇంటికెళతానని అడిగి, ఒద్దనిపించుకుని, గొడవపడి ఇంటికెళ్ళి సాగర సంగమం చూసి సోమవారం పొద్దున్నే ఆసుపత్రికి వచ్చేసాను.
ఆ మర్నాడే జనవరి 30 న ఆపరేషన్ అయ్యింది.
ఇదండి సంగతి.

Monday, January 24, 2011

కన్నభిరాన్‌కి కృతజ్ఞతాభివందనాలతోశంకరన్‌గారు చనిపోయినపుడు హెచ్‌ఆర్‌ఎఫ్‌ మురళి మా ఆఫీసులో వున్నాడు. మేమిద్దరం ఏదో విషయం మీద సీరియస్‌గా మాట్లాడుకుంటున్నపుడు అతనికి ఫోన్‌ వచ్చింది. శంకరన్‌గారు చనిపోయారని ఎవరో చెప్పారు. మురళి వెంటనే వెళ్ళడానికి తయారైపోయాడు. 'నిబద్ధతతో పనిచేసే వ్యక్తులు ఇలా ఒకరి తర్వాత ఒకరు, చనిపోవడం చాలా బాధగా వుంది. గొట్టిపాటి నరేంద్రనాథ్‌, వనజ, బాలగోపాల్‌ ఇపుడు శంకరన్‌. బాధితుల పక్షాన పనిచేసే, మాట్లాడేవాళ్ళు కనుమరుగైపోవడం చాలా విషాదంగా వుంది. మురళీ'' అంటే మీకు మరింత బాధ కల్గించే విషయం ఇంకోటుంది అన్నాడు. 'ఏమిటది?' నేను ఆతృతగా అడిగేను. 'కన్నభిరాన్‌కి ఆరోగ్యం బాగా లేదు. ఒక కాలు తీసేసారు తెలుసా?' అంటూ అతను వెళ్ళిపోయాడు. ''ఆ...'' అంటూ నేను అలాగే వుండి పోయాను. చాలా దు:ఖం కల్గించే వార్త అది. అదే మూడ్‌లో శంకరన్‌ గారింటికి వెళ్ళాను. కన్నభిరాన్‌ కళ్ళల్లో మెదులుతూనే వున్నారు. శంకరన్‌ గారితో నాకు పెద్దగా పరిచయం లేదు కానీ ఆయన గురించి ఎంతో విని వున్నాను. ప్రశాంతంగా వున్న ఆయన ముఖం చూడగానే కళ్ళల్లో నీళ్లొచ్చాయి. కన్నభిరాన్‌గారి కాలు తీసేసిన విషాదం కూడా అందులో కలగలసి ఆ రోజంతా బాధగానే గడిచింది.

కన్నాభిరాన్ ఎన్నో సమావేశాలలో ఎంతో అభినివేసంతో మాట్లాడటం విని ఉన్నాను కాని వనజ చనిపోయినపుడు అంత పెద్ద మనిషి గద్గద స్వరంతో దాదాపు

కన్నీళ్ళ పర్యంతమవ్వడం ఆశ్చర్య పరిచింది.
కన్నభిరాన్‌ గురించి రాయడానికి, ఆయనను స్మరించుకోవడానికి నా జీవితంలో జరిగిన ఓ సంఘటన ప్రస్తావించాలి. 1985 లో ఎన్‌టిరామారావు ప్రభుత్వ హయాంలో ప్రభుత్వోద్యోగుల దీర్షకాలం సమ్మె చేసారు. 53 రోజులపాటు జరిగిన సమ్మె అది. అపుడు నేను ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌లో ఉద్యోగం చేస్తున్నాను. ఎపిఎన్‌జివో అసోసియేషన్‌లో చాలా చురుకుగా పాల్గొంటున్న రోజులు. ఉమన్స్ వింగ్ సిటీ కన్వీనర్‌గా వున్నాను. 53 రోజుల సమ్మెలో పెద్ద ఎత్తున జరిగిన నిరసన కార్యక్రమాలు ధర్నాలు, పికెటింగులు, ర్యాలీలు అన్నింటిలో ముందుండేదాన్ని.సమ్మె ముగింపునకు వచ్చే ముందు సెక్రటేరియట్‌ దగ్గర గుర్రాలనెక్కిన మౌంటెడ్‌ పోలీసులు మా మీద లాఠీఛార్జీ చేసినపుడు మేము కిందపడిపోతే ప్రమీల అనే ఉద్యోగినికి కన్ను మీద లాఠీ తగిలి రక్తం చిల్లింది. నా మీద నుంచి గుర్రం నడిచిపోయింది. ఒళ్ళంతా దెబ్బలు. ఆ రోజు ఆ దృశ్యం ఎంత భయానకంగా ఉండిందంటే, ఇపుడు గుర్తు చేసుకుంటే ఒళ్ళు గగుర్పొడుస్తోంది. ఎంతో మంది ఉద్యోగుల గాయపడ్డారా రోజు.
సమ్మె మరింత తీవ్రమైంది. రామారావు ఎక్కడా దిగి రావడం లేదు. సమ్మెలో పాల్గొనకుండా ఆఫీసులకు హాజరౌతున్న ఉద్యోగులను ఆపే కార్యక్రమం ఇచ్చింది అసోసియేషన్‌. ఈనాడు ఎదురుగా ఉన్న ఆర్టి ఏ కార్యాలయంలో చాలా మంది తాత్కాలిక ఉద్యోగులు విధులకు హాజరౌతున్నారని తెలిసి వాళ్ళను ఆపడానికి ఆకడికెళ్ళాం.గేటు దాటి లోపలికెళ్ళామో లెదో పోలీసులొచ్చారు.మేము పరుగులు తీసాం.అప్పుడు నక్సలైట్ ల కాల్పుల్లో చనిపోయిన వ్యాస్ కమీషనర్ గానో డిసి పి గానో ఉండేవాడు.అతనికి దొరికితే జైలే అని అప్పటికే చాలా మంది భయపెట్టారు.అంతే గోడలు దూకి పారిపోయాం.
అక్కడ గోడ దూకి పారిపోయిన వాళ్ళం ఇళ్ళకెళ్ళ కుండా కొంచం సందులో ఉండే
హైదర్‌గూడాలో వున్న పంచాయితీ రాజ్‌ కార్యాలయంలో పికెటింగు చేసాం. ఒక్క ఉద్యోగిని కూడా లోపలికెళ్ళకుండా అడ్డుకున్నాం. ఆఫీస్‌ ప్రధాన ద్వారం ముందు భౌఠాయించాం. పోలీసులొచ్చారు. బరా బరా ఈడ్చారు. లాఠీల్తో కొట్టారు. నన్ను, అరుణ అనే ఉద్యోగినిని అరెష్ట్ చేసారు. పోలీస్‌ జీప్‌లో ఎక్కించుకుని నారాయణగూడా పోలీస్‌స్టేషన్‌కి తీసుకెళ్ళారు. కేసు బుక్‌ చెయ్యకుండా సాయంత్రం వదిలేస్తారని మా వాళ్ళు చెప్పారు కానీ మమ్మల్ని వదలలేదు. సాయంత్రందాకా పోలీస్‌స్టేషన్‌లో కూర్చోబెట్టి, రాత్రివేళకి పోలీస్‌ కంట్రోల్‌ రూమ్‌కి తెచ్చారు. కంట్రోల్‌రూమ్‌లో క్రిమిననల్స్ ఉంటారని తెలుసు. వాళ్ళతో పాటు మమ్మల్ని ఉంచుతారని ఊహించలేదు. మేము ఎంత గొడవ చేసినా పట్టించుకోకుండా క్రిమినల్స్‌తో పాటు మమ్మల్ని రాత్రంతా కంట్రోల్‌రూమ్‌లో పడేసారు. అర్ధరాత్రివేళ అసోసిసియేషన్‌ సభ్యులొచ్చి దుప్పట్లు ఇచ్చి, రేపు ఉదయమే బెయిల్‌ దొరుకుతుందని, మన కేసులన్నీ కె.జి.కన్నభిరాన్‌ గారు చూస్తారని, ఆయన రేపు కోర్టుకొచ్చి బెయిల్‌ ఇప్పిస్తారని చెప్పి వెళ్ళిపోయారు. దుప్పటి చుట్టుకుని కూర్చుని ఆ రాత్రంతా జాగరణ చేసాం. తిండి లేదు. నిద్ర లేదు. మా చుట్టూ వున్న నిందితుల్ని చూడాలంటే భయం. అలాగే ఆ రాత్రి గడిచింది.
ఆ రాత్రి కంట్రోల్ రూంలో అనుభవించిన బాధ గుర్తొస్తే ఇప్పటికీ కళ్ళు చెమ్మగిల్లుతాయి.
మర్నాడు పోలీస్‌ వాహనంలోనే సివిల్‌ కోర్టుకి తీసుకొచ్చారు పోలీసులు. బట్టలు నలిగిపోయి, జుట్టు చెదిరిపోయి, ఎర్రబడ్డ కళ్ళతో కోర్టు ఆవనఫలో ఓ చెట్టు కింద నిలబడ్డాం. కన్నభిరాన్‌ ఎప్పుడొస్తారా అని వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్న మాకు ఓ భయంకరమైన అనుభవం ఎదురైంది. ఒకరిద్దరు అడ్వకేట్‌లు మా వేపు అదోలా చూడం గమనించాం.
తల చెదిరిపోయి రాత్రంతా నిద్రలేక ఎర్రబడ్డ కళ్ళు,తిండిలేక పీక్కుపోయిన ముఖం ఇదీ మా అవతారం.
అయితే మమ్మల్ని లాడ్జీ లో అరెస్ట్ చేసి తీసుకొచ్చారని అడ్వకేట్లు భావిస్తారని నేను అనుకోలేదు.
నా సహచరుడు కూడా న్యాయవాదే.అయితే సమ్మెలో పాల్గొని అరెస్ట్ అయ్యే ఉద్యోగుల కేసులన్నీ కన్నభిరాన్ చేపట్టడం వల్ల,అలా అని మా అసోసియేషన్ వాళ్ళు చెప్పడం వల్ల మేము ఆయన రాక కోసం ఎదురుచూస్తూ నిలబడ్డాం.ఒకడు సమీపానికి వచ్చి ఏ లాడ్జిలో దొరికారు. మీ కేసు నేను వాదిస్తాను. ఎక్కువ ఫీజు ఇవ్వక్కరలేదులే అంటూ వెకిలిగా నవ్వాడు. ఏమనుకుంటున్నాడు వీడు మా గురించి. రాత్రంతా వ్యభిచారం చేసి లాడ్జీలో దొరికిన మనుష్యుల్లా కనబడుతున్నామా వీడికి. కోపం కట్టలు తెంచుకుంది. బాగా తిట్టి పంపాం వాడిని. కాసేపటికి ఇంకొకడు వచ్చాడు. ''కొత్తా ఏమిటి? అంత కోపమెందుకు? మీ కేసు వాదిస్తామంటే తిడతారేంటి? ఇంతకీ ఏ హోటల్‌లో రైడ్‌ జరిగింది?'' నేను వాడిని కొట్టినంత పనిచేసాను. ఛీ..ఛీ.. వీళ్ళు న్యాయవాదులా? ఇంత సంస్కార హీనంగా మాట్లాడతారా? కోర్టుకొచ్చే మహిళలు వ్యభిచారులే అయ్యుంటారని వీళ్ళ ఘోరాభిప్రాయం చూసాకా అసహ్యమన్పించింది. కోపం, ఉక్రోషంతో రగిలిపోతున్న వేళ దూరంగా మా వాళ్ళు, కన్నభిరాన్‌గారు వస్తూ కనబడ్డారు. ఆయన్ను చూడగానే నాకు బాగా ఏడుపొచ్చేసింది. వాళ్ళు ఇలా మాట్లాడారని ఆయనకు చెప్తాం. ఎవరయ్యా అలా మాట్లాడింది. వీళ్ళు ప్రభుత్వోగులు. సమ్మెలో పాల్గొని అరెష్ట్ అయ్యారు. ముందు వెనకా చూసుకోకుండా మాట్లాడ్డమేనా? అని గట్టిగా కేకలేసారు. పది నిమిషాల్లో మాకు బెయిల్‌ మంజురైంది. మేము ఇంటికెళ్ళిపోయాం ఓ అరగంట తర్వాత.

సిటీ సివిల్‌ కోర్టులో ఆ రోజుల జరిగిన సంఘటనలో అవమానపడి, దు:ఖపడుతూ నిల్చుని వున్న మాకు కన్నభిరాన్‌ కనబడగానే కొండంత ధైర్యం వచ్చింది. ఆయన రావడం ఆలస్యమై వుంటే ఆ రోజు అక్కడ ఏమై వుండేది? ఆయన్ని చూడగానే ఎంత సంతోషం కల్గిందో నేనిపుడు వర్ణించలేను. చల్లగా, చిన్నపిల్లాడిలా నవ్వే కన్నభిరాన్‌ నవ్వు నాకిప్పటికీ కళ్ళకు కట్టినట్టే వుంది. నాకున్న ఇలాంటి అనుభవాలు లక్షలాదిమందికి వుండి వుండొచ్చు. ఎందుకంటే ఎంతోమంది హక్కులకోసం పోరాడిన మనిషి ఆయన. పౌరహక్కులకు చిరునామా కన్నభిరాన్‌. ఆయన మరణం హక్కుల ఉద్యమానికి తీరని లోటు. సామాన్య మనుష్యుల కోసం, బాధితులకోసం నిరంతరం ఆలోచించి, వాళ్ళ కేసుల్ని వాదించి, వాళ్ళకి కొండంత అండగా వున్న కన్నభిరాన్‌లాంటి వ్యక్తులతో పెనవేసుకున్న చిన్న అనుభవ శకలమైనా మనపట్ల మనకి

గౌరవం పెంచేదిగా వుంటుందనడంలో ఎలాంటి సందేహమూ లేదు. బాలగోపాల్‌, కన్నభిరాన్‌ లాంటి నిబద్ధత కల్గిన, అరుదైన మనుష్యులు బతికిన కాలంలో మనమూ బతికాం, వాళ్ళతో ఎంతో కొంత సమీపంలో మెలిగాం అనే ఆలోచన గొప్ప తృప్తినీ, సంతోషాన్ని ఇస్తుంది.
!

Sunday, January 23, 2011

ఫోనులో… సాంత్వన !


జీవితమన్నాక ఎన్నెన్నో సమస్యలు…వాటినెదుర్కొని ముందుకు సాగాలనే అందరి ప్రయత్నమూ. కానీ ఒక్కోసారి ధైర్యం సన్నగిల్లుతుంది. మనసంతా చీకటి ఆవరిస్తుంది. ఎవరితో చెప్పుకోవాలో తెలియదు. ఒక్కోసారి ఇక చాలు… ఈ లోకం నుంచి నిష్క్రమిద్దామని కూడా అన్పించవచ్చు. అలాంటి వారికి నేనున్నానని ఎవరైనా అండగా నిలబడితే… నాలుగు మంచి మాటలతో మెరుగైన భవిష్యత్తుపై చిగురంత ఆశ కలిగేలా చేస్తే… ఆ పనే చేస్తోంది భూమిక హెల్ప్‌లైన్‌.
కేవలం టెలిఫోన్‌లో మాట్లాడడం ద్వారా కొంతకాలంలోనే ఎంతోమంది జీవితాల్లో వెలుగు తేగలిగిన ఈ హెల్ప్‌లైన్‌ ఇప్పుడు ఎందరికో స్ఫూర్తి అయింది. సంఘసేవ పట్ల ఆసక్తి కల కొందరు ఆయా ప్రాంతాల్లో సొంతంగా ప్రారంభించగా, వెలుగు పథకం కింద జిల్లాల్లో ఇలాంటి హెల్ప్‌లైన్స్‌ ఏర్పాటుచేయడానికి ప్రభుత్వం తరఫునా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఒక్కో జిల్లా నుంచీ ఐదుగురు సభ్యులను ఎంచుకుని వారికి శిక్షణ ఇచ్చే బాధ్యతను కూడా భూమిక హెల్ప్‌లైన్‌ చేపట్టింది. ఈ నేపథ్యంలో హెల్ప్‌లైన్‌ గురించి వ్యవస్థాపకురాలు కొండవీటి సత్యవతి ‘వసుంధర’కు వివరించారు.

‘భూమిక’ తోనే మొదలు

‘పదిహేనేళ్లుగా నేను భూమిక పత్రిక ద్వారా స్త్రీ సమస్యలపై పోరాడుతున్నాను. కార్యాలయానికి పలువురు మహిళలు చేసిన ఫోన్లు చూశాక అలాంటి వారికి సాంత్వనిచ్చి..భద్రతాభావాన్ని పెంచే హెల్ప్‌లైన్‌ను ఎందుకు ప్రారంభించకూడదన్న ఆలోచన వచ్చింది. ఆ యోచన కార్యరూపం దాల్చింది. ఇప్పటిదాకా పదివేల పైగా కేసులను పరిష్కరించాం’అని వివరించారామె.
ఎలా పనిచేస్తుంది?
భూమిక టోల్‌ఫ్రీ నంబరుకి ఫోన్‌ చేస్తే ఫోన్‌ చేసినవారికి బిల్లు పడదు. ఎం.ఎ. సోషల్‌ వర్క్‌ చేసి కౌన్సెలింగ్‌లో ప్రత్యేక శిక్షణ పొందిన వారు ఇక్కడ కౌన్సెలర్లుగా ఉన్నారు. ఉదయం ఎనిమిదినుంచి రాత్రి పదకొండు వరకు ఈ నంబరు సేవలందిస్తుంది. చాలావరకు కేసులకు కౌన్సెలింగ్‌ సరిపోతుందని, నిపుణుల అవసరం ఉన్నప్పుడు మళ్లీ చేయమని చెప్తామని, అవసరమైతే ఇతర కౌన్సెలింగ్‌ కేంద్రాల నంబర్లు, వారి వారి ప్రాంతాల్లో సహాయం అందించగల సంస్థల నంబర్లు కూడా వారికి ఇస్తామని ఆమె చెప్పారు. ఇక్కడ సేవలందించడానికి కొందరు వృత్తి నిపుణులు కూడా తరచూ వస్తుంటారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలనుంచీ ఫోన్లు వస్తుంటాయనీ కోస్తా ఆంధ్రా, గుంటూరు, ప్రకాశం, తదితర జిల్లాలనుంచీ వచ్చేవే అధికమన్నారు. ఎక్కువ శాతం కేసులు గృహహింసకు సంబంధించినవేననీ వివరించారు. అయితే గత రెండు నెలలుగా వివాహేతర సంబంధాలకు సంబంధించిన కేసులు ఎక్కువగా రావడం ఆశ్చర్యం కలిగిస్తోందన్నారామె. ఒత్తిడినెదుర్కొంటున్న విద్యార్థినులు, అపరిపక్వ ప్రేమలు వాటి తాలూకు పరిణామాలకు సంబంధించిన కేసులూ ఎక్కువగానే వస్తున్నాయని కార్యకర్తలు వివరించారు.
మంచి పని ఇప్పిస్తానని చెప్పిన బ్రోకరుని నమ్మి గోదావరి జిల్లానుంచి మాల్దీవులకు చేరిందో మహిళ. అక్కడికెళ్ళాక తాను మోసపోయానన్న విషయం తెలిసి .ఎలాగో భూమిక హెల్ప్‌లైన్‌ ద్వారా సంప్రదించింది. తర్వాత ఆమెను క్షేమంగా ఇల్లు చేర్చగలగడం తనకెంతో సంతృప్తినిచ్చిందంటారు సత్యవతి. పాస్‌పోర్టు తదితర పత్రాలేవీ లేకుండా విమానం దిగిన ఆ మహిళను అధికారులు తిరిగి త్రివేండ్రం పంపించేశారు. తెలుగు తప్ప మరో భాషరాని ఆమెను తెలుగు వనితగా గుర్తించి కేరళలోని ఓ స్వచ్ఛంద సంస్థ సత్యవతికి ఫోన్‌ చేసింది. వెంటనే ఆమెతో మాట్లాడి వివరాలు తెలుసుకుని, ఛార్జీలకు డబ్బు పంపి, క్షేమంగా ఇల్లు చేరుకునేలా చేశాం. మరో కేసులో అత్యాచారం చేయబోయిన కన్నతండ్రినుంచి ఇద్దరు కుమార్తెలను కాపాడామన్నారు. ఇలాంటి సీరియస్‌ కేసుల విషయంలో పోలీసు అధికారులు, జిల్లాల్లో న్యాయమూర్తులు, ఇతర ఉన్నతాధికారులతోనూ సంప్రదించి బాధితులకు న్యాయం కోసం పోరాడుతున్నామన్నారు.చెప్పుకుంటూ పోతే ఎన్నో కేసులు.

హెల్ప్‌లైన్‌లో…

ఫోన్‌ మోగగానే తీస్తారు.

ఫోన్‌ చేసిన స్త్రీ చెప్పేదంతా సహనంతో, సానుభూతితో వింటారు.

వివరాలన్నీ అత్యంత గోప్యంగా ఉంచుతారు.

కేసుని బట్టి అవసరమైన సలహాలు, సూచనలు ఇస్తారు తప్ప తీర్పరితనంతో వ్యవహరించరు.

పరిస్థితి మరీ సీరియస్‌గా ఉందనుకుంటే స్థానిక పోలీసు యంత్రాంగం, కుటుంబహింస చట్టానికి సంబంధించిన రక్షణాధికారి, స్వచ్ఛంద సంస్థలవారిని అప్రమత్తం చేస్తారు.

(సలహా, సమాచారం కోసం టోల్‌ ఫ్రీ నంబర్‌: 1800 425 2908 సంప్రదించవచ్చు)
(ఈనాడు వసుంధర సౌజన్యంతోFriday, January 21, 2011

నా ట్రాఫిక్ కానిస్టేబుల్ మితృడు


ఎలా పరిచయమయ్యాడో గుర్తులేదు కానీ బేగంపేట్ ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర డ్యూటీ లో ఉండే ఓ కానిస్టేబుల్ తో స్నేహమయ్యింది.
స్నేహమంటే ఎప్పుడూ మాట్లాడుకున్నది లేదు.
కలిసింది లేదు.ప్రతి రోజు ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర కనబడతాడు.
నేను సిగ్నల్ దగ్గర కారు ఆపగానే అట్టెన్షన్లో కొచ్చి చక్కగా నవ్వుతూ సెల్యూట్ చేస్తాడు.
దూరంగా ఉంటే కనుక చెయ్యి ఊపి చిర్నవ్వుతాడు.
ఆ సిగ్నల్ దగ్గర అతను లేకపోతే ఏదో వెలితిగా ఉంటుంది నాకు.
నేను దాదాపు ఆరు గంటలకి ఇంటికొస్తాను.
నేనొచ్చే సమయం తెలుసు కాబట్టి నా కోసం ఎదురు చూస్తున్నట్టు అనిపిస్తుంది.
బేగంపేట్ సిగ్నల్ కి రాగానే నా కళ్ళు అతని కోసం వెతుకుతాయి.
అతని నవ్వు చాలా స్వచ్చంగా,పసిపిల్లాడి నవ్వు లాగా ఉంటుంది.
ఆ నవ్వు లోని తేటతనం నాకు నచ్చి రోజూ అతని కోసం చూస్తాను.
ఎప్పుడూ మాట్లాడాలనిపించలేదు.
అతను నాతో మాట్లాడ్డానికి ప్రయత్నించలేదు.
దుమ్మూ ధూళీ,కాలుష్యం మధ్య నిలబడి కూడా మల్లెపువ్వులాంటి నవ్వుల్ని
ఆయాచితంగా,అవ్యాజంగా వెదజల్లే నా ట్రాఫిక్ కానిస్టేబుల్
మితృడి గురించి మీకు చెప్పాలనిపించి రాసాను.

Wednesday, January 19, 2011

నిండుపున్నమి పండు వెన్నెలలో నేనొక్కదాన్నీ
ఈ రోజు పౌర్ణమి.

పౌర్ణమి ప్రతి నెల వస్తుంది కదా.కొత్త ఏముంది.
సూర్యుడు రోజూ ఉదయిస్తాడు.రోజూ అస్తమిస్తాడు.
అయినా సరే ఉదయాస్తమయాలు రెండూ చూసినపుడల్లా మైమరిపిస్తాయి.
ఇంక నిడు పున్నమి గురించి వేరే చెప్పాలా?
"నిండు పున్నమి పండు వెన్నెలలో
నిను చేరగ అంటూ బాలసరస్వతి మెత్తటి మాధుర్యపు పాట
వింటూ వెన్నెల్లో హాయ్ హాయ్ గా నడుస్తుంటే
ఎంత బావుంటుంది.
నాకు ఈ రోజు ఎందుకో వెన్నెల్లో ఒళ్ళంతా తడుపుకోవాలనిపించింది.
వెన్నెలని మాత్రమే వెంటేసుకుని తిరగాలనిపించింది.
హుస్సైన్ సాగర్ మీద దర్జాగా,నిండుగా,మహా గీరగా
పోజులు కొడుతూ మల్లెపూవంటి వెన్నెల్ని ఒలకబోస్తున్న చంద్రుడితో
చక్కర్లు కొట్టాలనిపించింది.
ఆలస్యమేముంది. బూట్లు గీట్లు తగిలించి వాకింగ్ అవతారమెత్తి
ఒక్కదాన్నే డ్రైవ్ చేసుకుంటూ నెక్లెస్ రోడ్ కి పయనమయ్యాను.
ఏకాంతంగా ఉండే ప్రదేశాన్ని చూసుకుని హాయిగా కూర్చున్నాను.
మొబైల్ లో దాచుకున్న బాలసరస్వతి పాటలు
"రెల్లుపూల పానుపుపై జల్లుజల్లుగా ఎవరో చల్లినారమ్మా వెన్నెలా"
పాటలు వింటూ
తిలక్ అమృతం కురిసిన రాత్రిని గుర్తుతెచ్చుకుంటూ
పారవశ్యంలో మునిగిపోయాను.
ఆ హాయి, ఆ నిరామయ స్థితి ఎంత సేపుందో కానీ
కళ్ళు తెరిచి చుట్టూ చూద్దునుకదా నా మైమరపంతా ఆవిర్రైపోయింది.
అంత ఆనందమయమైన ఆ సమయంలో
భావితరం చెట్టుకొకరుగా అతుక్కునిపోయి
నానా విన్యాసాలు చేస్తూ కంటపడ్డారు.
చేతుల్ని పెనవేసిన వాళ్ళు,కౌగిళ్ళలో కూరుకుపోయిన వాళ్ళు,
చుంబనాల్లో మునిగిపోయిన వాళ్ళు వామ్మో!!!!!
ఇందాక చూళ్ళేదేమిటి చెప్మా అని ఝడుసుకుని
అక్కడి నుంచి లేచిపోయాను.
అలా నడుచుకుంటూ వెళుతుంటే నాకు హఠాత్తుగా పాత మల్లీశ్వరి సినిమా,
ఓ వెన్నెల రాత్రి ఏటి ఒడ్డున కూర్చుని
"మనసున మల్లెల మాలలూగెనే కన్నుల వెన్నెల జాలువారెనే (కరెక్టేనా?)
ఎంత హాయి ఈ రేయి నిండెనో
ఎన్ని నాళ్ళకీ బతుకు పండెనో
నాగరాజు,మల్లి పాడుకున్న పాట,ఆ సన్నివేశం గుర్తొచ్చాయి. చెట్లకి అతుక్కుపోయిన పిల్లల్ల్ని చూస్తే చాలా బాధేసింది.
వెన్నెల పాటల్ని వింటూ,నాతో నేను ఎంజాయ్ చేస్తూ,
లడ్డులాగా, గుండ్రంగా ,దూరంగా ఊరిస్తున్న చంద్రుణ్ణి దొంగచూపులు చూస్తూ
దొరికితే బావుణ్ణే గబుక్కున మింగేద్దునే
అనుకుంటూ ఈ రాత్రి అనుభవాన్ని గుండెల్లో అద్దుకుంటూ ఇంటికి బయలుదేరా!!!!!!!!!!!!!!!!!!


Monday, January 17, 2011

మై లిటిల్ ఫ్రెండ్ -బర్త్ డే గిఫ్ట్


వీడి పేరు ప్రద్యుమ్న.
మేము paddy అని పిలుస్తాము,
వాళ్ళ అమ్మ నాన్న ప్రద్యు అని పిలుస్తారు.
వాడికి నాలుగు నెలలప్పుడు మాకు పరిచయమయ్యాడు.
ఇప్పుడు వాడికి 14 సంవత్సరాలు.
ఫిబ్రవరి 22 వాడి పుట్టిన రోజు.
ఈ పధ్నాలుగేళ్ళుగా వాడు మాకు అత్యంత ప్రియమయినవాడు.
మాకు చాలా ఆత్మీయుడు వాడు.
సంక్రాంతికి నాకు రెండు రోజులు ఖాళీ దొరికింది.
హెల్ప్ లైన్ పని నడుస్తూనే ఉంది
జలగావ్ మహరాష్ట్రలో ఒకమ్మాయిని సేవ్ చేసాము.
వాళ్ళ అమ్మా నాన్నలే ఆ పిల్లను ఇంట్లో బంధిస్తే జలగావ్ ఎస్.పి చొరవతో
ఆ సమస్యను పరిష్కరించాము.
అయినా కొంత సమయం మిగిలింది.
మా paddy పాత ఫోటోలన్ని బయటకు తీసాను.
వాడి బర్త్ డే బహుమతిగా ఇవ్వాలని ఇదిగో ఈ ఫోటో తయారు చేసాను.
వాడు సాయంత్రం వాళ్ళింట్లోను,రాత్రి మా ఇంట్లోను బర్హ్ డే సెలబ్రేట్ చేసుకుంటాడు.
శెలవులొస్తే మా ఇంట్లోనే ఉంటాడు.
వాడూ నేనూ కలిసి తెగ తిరుగుతాం.
ఈట్ స్ట్రీట్,ఐమాక్ష్,వాల్డెన్,కేఫ్ కాఫి డె ఇలా బోలెడంత తిరుగుతాం.
తెగ ముచ్చట్లు చెప్పుకుంటాం.
మా ఇద్దరికి వాడంటే ప్రాణం.

Friday, January 14, 2011

మా ఇంట భోగి మంట
మా ఇంట్లో ఈ రోజు భోగి మంట వేసాం
పెద్ద పెద్ద దుంగలతో పాటు చెదలు పట్టిన కబోర్డ్స్ కూడా కాల్చేసాం.
మా అత్త గారు దర్జాగా కూర్చుని భోగి మంటని చూసారు.

పిల్లలు భలే ఎంజాయ్ చేసారు.
నా సహచరుడు,మా హాయ్ (కుక్కపిల్ల) కూడా మాతో చేరారు.

Thursday, January 13, 2011

సంక్రాంతి శుభాకాంక్షలు-రావి ఆకులతో గ్రీటింగ్

మితృలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.

వివిధ దశల్లో రావి ఆకులెలా ఉంటాయో చూడండి.

నేనే దీన్ని మీకోసం తయారు చేసా.

Monday, January 3, 2011

ఊరికి ఒకరిని ఉంచుకోవాలంటుంది నా ఫ్రెండ్

ఎందుకలా ఆముదం తాగిన ముఖం పెట్టారూ.
టైటిల్ చూడగా చూడగా ఏవేవో స్ఫురించేస్తున్నయ్ కదూ.
ఉంచుకోవడం పదం వింటేనే వెర్రిక్కిపోతారేంటి?
అయ్యబాబోయ్!అమ్మబాబోయ్!!!
నా ఫ్రెండ్ చెప్పేదేంటంటే మన కోసం రకరకాల పనులు చేసిపెట్టడానికి రకరకాల మనుష్యుల్ని ఉంచుకున్నట్టే
అంటే కారు తోలడానికి డ్రైవర్,ప్రయాణాలు చెయ్యడానికి ట్రావెల్ ఏజెంట్, స్టేషంకో బస్ స్టాండ్ కో వెళ్ళడానికి కేబ్ డ్రైవర్,బట్టలుతికి ఇస్త్రీ చెయ్యడానికి దోభి,వంట చెయ్యడానికి కుక్,
సొంత ఆఫీస్ ఉంటే అసిస్టంట్స్ వగైరా లన్న మాట.
మనం రక రకాల పనుల కోసం డబ్బిచ్చి రకరకాల మనుష్యుల్ని ఉంచుకుంటాం.
వాళ్ళతో పనులు చేయించుకుంటాం.
నా ఫ్రెండ్ అంటుంది కదా మనం వేరే ఊళ్ళకు వెళ్ళినపుడు కూడా ఇలా మనుష్యుల్ని ఉంచుకునే సౌకర్యం ఉంటే ఎంత బావుంటుంది.పనులన్ని చకచకా అయిపోతాయి కదా!!!!
కొత్త ఊర్లో అడుగెట్టగానే రిసీవ్ చేసుకోవడానికి,ఇంట్లోనో,మీటీంగ్ లోనో దింపడానికి ఓ టేక్ష్సి,
ఊళ్ళో వింతల్ని చూపించడానికి ఓ గైడ్,ఉండడానికి మంచి హోటల్,ప్రేమగా తిండి తిప్పలు చూడ్డానికి ఓ సర్వర్,
ఈ లిష్ట్ కొండపల్లి చేంతాడులా సాగుతుంది లాగితే.
ఇంతకీ నే చెప్పొచ్చేదేంటంటే
ఉన్న ఊళ్ళోను,విజిట్ చేసే ఊళ్ళల్లోను ,మనకి సహాయమందించే చేతుల్ని ఉంచుకోవాలని నా ఫ్రెండ్ చెవినిల్లు కట్టుకుని పోరి చెబుతోంది.
ఇంత మంచి పదాన్ని ఆయన ఆవిడను ఉంచుకున్నాడు,ఆమె ఆయన్ను ఉంచుకుంది అంటూ కించపరచడం ఏమీ బాగోలేదు సుమండీ.
ఓ ఆడ మగ మధ్య,లేదా ఓ మగ ఆడ మధ్య ఉండేది ఒక సంబంధం.ఒక రిలేషన్ షిప్.
పెళ్ళైతే ఒక పేరు పెళ్ళి కాకపోతే ఇంకో పేరు.
దాన్ని ఉంచుకోవడం అనకూడదేమో ఒక సారి ఆలోచించండి.Saturday, January 1, 2011

నా పుట్టిన రోజును ప్రపంచమంతా పండగలా చేసుకుంటోంది.నా పుట్టిన రోజును ప్రపంచమంతా పండగలా చేసుకుంటోంది.


అందరికీ బోలెడన్ని థాంక్యూలు.

నా మీద వాలిన ఛాయాదేవి ఛాయ

ఎప్పటిమాట. పచ్చగా, చల్లగా, కుటీరం లాగా ఉండే ఆ ఇంటికి తొలిసారి ఎప్పుడెళ్ళాను. తొలిచూపులోనే ఆవిడతో ప్రేమలో పడిన సంఘటనలో నిజానికి, ఆరోజు ...