Saturday, July 31, 2010

మా సీతారాంపురం కధలూ,కబుర్లు- చిరంజీవి మా బస్ మేట్

మొన్న ఒకాయన మీ సీతారాంపురం ఎక్కడ అని అడిగారు.
మా ఊరికి ఒక పక్క గోదావరి మరో పక్క సముద్రం ఉంది.
నర్సాపురానికికి, మొగల్తూరికి మధ్యలో ఉంది మా ఊరు.
మొగల్తూరు అంటే గుర్తొచ్చింది.సినీ స్టార్,ప్రజారాజ్యం అధ్యక్షుడు చిరంజీవి రోజూ మేము వెళ్ళే బస్సులోనే కాలేజికి వెళ్ళేవాడు.చిరంజీవి వాళ్ళు పాతకాలవ అనే ఊళ్ళో ఉండే వాళ్ళు.
అతను శ్రీ వై ఎన్ కాలేజి,నేను బిజిబిఎస్ వుమన్స్ కాలేజి.
అప్పట్లో అతని పేరు శివశంకర ప్రసాద్. కండక్టర్ సీటు పక్కన డోర్లో నిలబడి పోజులు కొడుతూ ఉండేవాడు.
మొన్నీ మధ్య "లాడ్లి మీడియా అవార్డ్స్" ఫంక్షన్ కి అతన్ని పిలవడానికి వెళ్ళినపుడు బస్సు విషయాలు,ఫోజుల సంగతులు చెబితే పడీపడీ నవ్వాడు.ఇంకా మీకు ఆ విషయాలన్ని గుర్తున్నాయే అంటూ ఆశ్చర్యపోయాడు.ఇంకా చాలా గుర్తున్నాయి చెప్పనా అంటే వద్దులెండి హాయిగా ఉన్నాను అన్నాడు.
కొంచం పెద్దవాళ్ళమయ్యాక బుస్సుల్లో ఎక్కేవాళ్ళం కానీ అంతకు ముందు అంతా నడకే.రోజుకి రానూ పోనూ ఎనిమిది కిలోమీటర్లు నడిచేవాళ్ళం.నడవలేనప్పుడు సైకిల్ లిఫ్ట్ అడిగే వాళ్ళం.
ఎంత కష్టపడితే డిగ్రీ చేతికొచ్చిందని.మాది చాలా పెద్ద ఉమ్మడి కుటుంబం.మా తిండి తిప్పల గురించి పెద్దగా ఎవ్వరూ పట్టించుకునేవారు కాదు.
మా ఊరు కల్పవృక్షం లాంటిది.రకాల పడ్లతోటలతో పచ్చగా కళకళ్ళాడుతూ ఉంటుంది.మాకు కడుపునిండా తిండి పెట్టేవి మా ఊరి చెట్లు.మామిడి,జీడి మామిడి,సపోటా,సీతాఫలం ముంజెలు,తేగలు అబ్బో ఎన్నో పళ్ళు.మా కడుపులు నింపే అద్భుతమైన ఫలాలు.అందుకే నాకు చెట్లంటే అంత ప్రేమ.Thursday, July 29, 2010

మా సీతారాంపురం కధలూ,కబుర్లూ

ముసురుపట్టిన ఈ సాయంకాలం

పదే పదే మా ఊరిని గుర్తుకు తెస్తోంది.ఇలాంటి సాయంకాలాలంటే చిన్నప్పుడు ఎంత ఇష్టంగా ఉండేది.
వర్షం మీద ఇష్టం కాదు.ముసురు పట్టిన సాయంకాలాల్లో మాత్రమే చేసే చింతపండు,ఆవపిండి తో చేసే ఘాటైన పులిహోర మీద ప్రేమ.ఇంకేమీ వండే వాళ్ళు కాదు.కంచం నిండా కావలసినంత పులిహోర,ఆవకాయ ముక్క.అంతే.అబ్బ! ఎంత బావుండేది.ముక్కులు ఎగపీల్చుకుంటూ వేడి వేడిగా తిటుంటే నా సామి రంగా! ఆ ఘాటు, ఆ రుచి తిని చూడాలే కానీ ఎంతని వర్ణించను.
మా ఇంట్లో ఓ యాభై మంది దాకా పిల్లకాయలుండే వాళ్ళం.
అందరం పొలోమని కంచాలేసుకుని పులిహోర కోసం ఎగబడిపోయే వాళ్ళం.వర్షా కాలంలో మాత్రమే వండుతారు అదీ బాగా ముసురు పట్టినప్పుడు.
అందుకే నాకు ముసురు పట్టిన ఈ నాలుగు రోజులుగా మా ఊరు,మా ఆవపిండి పులిహోరా,మా పిల్లమూకా తెగ గుర్తుకొస్తున్నారు.మా ఊరితో నాకెన్ని ఇలాంటి అనుభవాలో.ఎన్ని అద్భుతమైన అనుభూతులో!ఎంత సంతోషమో అవన్ని గుర్తు చేసుకుంటే.

చల్లగా కల్లు లాగించేసి .........

కొంతమంది సాహితీ మిత్రులం కలిసి మార్చి నెలలో విశాఖ పట్టణం వెళ్ళేం.ఆ ముందు రోజు భల్లుగూడా వెళ్ళేం.చాలా కష్టపడి కొండలెక్కి గుట్టలెక్కి,అడవిదారిన పడి నడుస్తూ భల్లుగూడా వెళ్ళొచ్చాం.పోలీసుల అత్యాచారాలకు గురైన గిరిజన మహిళలతో మాట్లాడాం.తిండి తిప్పలు లేకుండా అర్ధ రాత్రి వైజాగ్ చేరాం.
నిద్రలేని రాత్రి గడిపి ఉదయాన్నే ఊరి మీద పడ్డాం.
శ్యామల గారు "మీ స్ఫూర్తితో కారు కొని నేనే నడుపుతున్నా మీరు చూడాల్సిందే " అంటూ కారేసుకుని వచ్చేసారు.
మరింకేం పదండి భీమునిపట్ట్ణం చూసొద్దాం అంటూ పొలోమని నేను, కవయిత్రి శిలాలోలిత,నా నేస్తం గీత బయల్దేరాం.డ్రైవింగ్ నేనే.
బుద్ధిగా భీమిలి వెళ్ళి సముద్రంతో కాసేపు ఆటలాడి రావొచ్చు కదా.
అబ్బే అంత బుద్ధి ఎక్కడిది?
నూకరాజు ఆయన భార్యామణి నూకాలమ్మ కల్లు కుండల్ని సైకిల్ మీద మోసుకొస్తూ మా కంట పడ్డారు.
వాళ్ళని ఆపి ముచ్చట్లు మొదలు పెట్టాం.
"ఏటి హైదరాబాదు నుంచొచ్చారా.కల్లు గానీ రుచి సూత్తారేటి."అన్నాడు నూకరాజు.
"అందులో నువ్వేమి కలపలేదుగా?"
"అబ్బే! అమ్మోరి తోడు మావు అలాంటి పనులు సేయం."అన్నాడు.
సరే మేము కారు దిగాం.నూకరాజు తాడిచెట్టు ఎక్కాడు.
తాటి ఆకు కోసి చక్కగా కడిగి దొన్ని తయారు చేసాడు.
మేం గడ్డి మేటు దగ్గర కూర్చుని ఇలా కల్లు ఆరగిచాం.
అందులో ముగ్గురు మొదటి సారి ముట్టుకున్నారు.
చల్లగా కల్లు లాగించేసి సముద్రంలో చాలాసేపే ఆడాం.
ఇందులో కొసమెరుపు ఏమిటంటంటే ఆ రోజు తొమ్మిదిన్నరకి నేను ఒక సాహితీ కార్యక్రమానికి అధ్యక్షత వహించాల్సి ఉండడం.
కల్లు తాగితేనేం నేనే కారు డ్రైవ్ చేస్తూ తొట్లకొండ మీదికెళ్ళి,
కొంతసేపు కింది సముద్రాన్ని వీక్షించాం.
ఇన్నీ చేసి తొమ్మిదిన్నరకి ఠంచనుగా నా అధ్యక్ష పీఠం మీద కూర్చున్నానోచ్

Tuesday, July 27, 2010

నాకు చట్రాలను చూస్తే చచ్చే భయం

నాకు చట్రాలను చూస్తే చచ్చే భయం
అలాగని చావంటే భయమేలేదు
పుట్టిన క్షణమే చావూ సిద్ధమయ్యే ఉంటుంది
అలాగని క్షణక్షణం చావక్కరలేదుగా
బతకడం ఎంత సంబరమో కొందరికి
చెట్టుని చూస్తే సంబరం
పిట్టని చూస్తే రివ్వున ఎగరాలన్నంత ఉత్సాహం
ఆకాశంలోని నీలం రంగు
అవని అంతా కమ్ముకున్న నల్ల రంగు,ఎర్ర రంగు
తొలి వేకువలో తూరుపు సింధూరం
సాయం సంధ్యలో కెంజాయ
ఆషాడమాసంలో ఉరుముతూ వేంచేసే తొలి మేఘం
నిట్టనిలువునా పులకింతలు రేపే తొలకరి జల్లు
ఈ ప్రకృతి పచ్చదనాన్ని
ఈ రంగు రంగుల సీతాకోకచిలుకల్ని
నా కోసమే నట్టనడిరాత్రి పూసిన బ్రహ్మకమలాలు
సంపెంగ చెట్టు చూస్తే చిన్నదే
కళ్ళు విప్పి చూస్తే కణుపు కణుపూ మొగ్గలే
తెల్లారి చూస్తే కమ్మటి సువాసనలతో పువ్వులే పువ్వులు
ఈ అనార్ చెట్టు ఎంత ఉందని
అబ్బో ఎర్రెర్రగా ఎన్ని పూలు పూసిందో
ఈ గోగుపూల తీగకేమొచ్చిందో గోడంతా పాకేసింది
నక్షత్రాలను తెచ్చి పువ్వుల్లా పూయించేసింది
ఈ మాధవీలతను చూస్తే చాలు
గుండెల్లో బాల్యపు జేగంటలు మోగుతాయి
బులిబుల్లి గిన్నెల్నిండా
మధువు నింపుకున్న మధుమాలతులు
వస్తున్నానుండవోయ్ పొగడపూలమ్మా
నా మీద అలకేనా పూలన్నీ అలా ముడుచుకుపోయాయ్
ముందు నీ దగ్గరకే వస్తే తొందరగా పోగలానా
పొగడపూల మీద మోహం పొయ్యేదా చెప్పు
అరే! అరే! అంత కోపమా ఆకాశమల్లెమ్మా
నువ్వు రావడానికి నా మీద రాలడానికి
ఇంకా చాలా టైం ఉందిలేమ్మా
అమ్మో!ఆ ముళ్ళన్నీ నన్ను గుచ్చడానికేనా మొగలిరేకమ్మా
నిన్ను ముట్టుకోకుండా
నీ ముళ్ళు గుచ్చుకోకుండా శ్రావణం గడిచేనా
నాగమల్లివో తీగమల్లివో
నయనానందకరం నవనవోన్మేషణం
ఆగవోయ్ ఎర్రకలువ పిల్లా
ఏమా తొందర వస్తున్నానుండు
అదంతా నా మీద కోపమేనా
మూతి ముడిచినట్టు ముడుచుకుపోయావ్
ఆహా!ఏమి ఈ ప్రకృతి?       
ఏమి ఈ వైవిధ్యం
జనాలు బోరుకోడుతుందని ఎందుకంటారు?
చుట్టూ ఇంత సౌందర్యం
ఇంత వైవిద్య్హం
ఇంత పచ్చదనం
ఇన్ని రంగులు
ఇంకేం కావాలి?
మనుష్యులతో సజీవ సంబంధం
మన చుట్టూ పరిసరాలతో
మమేకమయ్యే ఆత్మీయబంధం
ఇది చాలదా బతకడానికి?
ఎందుకు చట్రాల్లో బంధీ అవ్వడడం?
అన్నిచట్రాలని తెంపుకుందాం రండి
హాయిగా ఎగిరిపోదాం పదండి.
మన చుట్టూ ఉన్న వాళ్ళకి అండ మనమయితే
ఈ సమస్త ప్రకృతి మనకి కొండంత అండ కాదా?

Saturday, July 24, 2010

మానవ ప్రవృత్తి వైపరీత్యాల ఫలితం…

మానవజాతిపై తన పంజాను విసిరి విధ్వంసం సృష్టిస్తున్న వైరస్‌కి పాతికేళ్ళు నిండాయి. ఈ ఇరవై అయిదు సంవత్సరాలలో కోట్లాదిమంది దీని బారిన పడ్డారు. ప్రాణాలు కోల్పోయారు. ప్రపంచంలోని ఏదో మూల ప్రతిరోజూ ఎవరో మరణిస్తూనే వున్నారు. చికిత్స లేని ఈ వైరస్ సృష్టిస్తున్న విధ్వంసానికి యువత, స్త్రీలు, అమాయక పిల్లలు ఆహుతైపోతున్నారు. ఇదేమీ ప్రకృతి వైపరీత్యం కాదు. ఇంతమంది చనిపోవడానికి కారణం అందరికి తెలుసు. హెచ్ఐవి ఎలా వస్తుందో, ఎందుకొస్తుందో తెలుసు. కానీ రాకుండా ఎలా కాపాడుకోవాలో అర్థం కాకపోవడం నిజంగా ఎంతో విషాదకరం. ఆ దిశగా ఆచరణాత్మక అడుగు జనబాహుళ్యం నుంచి పడకపోవటం మరీ విషాదం.

పితృస్వామ్య సమాజంలో పురుషుడి మీద ఆధారపడి బతుకుతున్న స్త్రీలు, తమమీద అమలవుతున్న హింసల్ని నోరెత్తి ప్రశ్నించలేని స్థితిలో వున్న స్త్రీలు, భర్తల విశృంఖల లైంగిక జీవితాన్ని తలొంచి ఒప్పుకోవడం ద్వారా, హెచ్ఐవికి గురవుతున్న వీరి ఒంటరి పోరాటాలకు అండగా నిలవడం, వారి వాణిని విన్పించడం భూమిక తన బాధ్యతగా భావించింది. ఈ సంచికలో ఎంతోమంది ఇలాంటి స్త్రీల జీవిత వ్యధలున్నాయి. గుండెల్ని మెలిపెట్టే కథలున్నాయి. వీరిపట్ల మానవీయ కోణాన్ని ఆవిష్కరించడమే మా లక్ష్యం. ఈ కథనాల్లోని స్త్రీల అసలు పేర్లను రి పట్ల గౌరవం మేరకు మార్చడం జరిగింది.

నిజానికి ప్రపంచ మానవాళి ఆరోగ్య చరిత్ర అంతా వైరస్‌తో కొనసాగిన పోరాటాల చరిత్ర.సుదీర్ఘంగా సాగుతున్న ఈ పోరాటంలో మానవుడే చిరంజీవి.

మానవ రోగ నిరోధక వ్యవస్థను క్షీణింప చేసే వైరస్ గడిచిన పాతికేళ్ళుగా ప్రపంచ వ్యాప్తంగా ఒక విధ్వంసాన్ని సృష్టిస్తూ ముందుకు సాగుతున్నది. ఉత్పాదక సామర్థ్యం కలిగిన వయోవర్గాల వారికి అధికంగా సోకుతూ ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థలను అనిశ్చిత భవిష్యత్తులోకి నెట్టివేసింది. నివారణ తప్ప, చికిత్సలేని ఈ వ్యాధిని అరికట్టేందుకు చైతన్యాన్ని మించి వాక్సిన్ లేదు. బాధ్యతాయుత నడవడికను మించిన నివారణా మార్గం మరొకటి లేదు. ఈ వైరస్ మానవ బలహీనతనే తన బలంగా మార్చుకుని ముప్పును కల్గిస్తున్నది. ముఖ్యంగా మానవ లైంగిక ప్రవర్తనల మీద ఒక కఠినమైన తీర్పును ప్రకటిస్తున్నది. అభివృద్ధి చెందుతున్న దేశాలలోనే ఇది బలంగా కేంద్రీకరింపబడుతున్న కారణంగా ఆయా దేశాలు చాలా సంక్షోభాలకు నిలయమైయ్యాయి. ఇప్పటి దాకా సాధించుకున్న ప్రగతి అంతా కళ్ళముందు ఇసుక గూడులా కూలిపోవడం అంతర్జాతీయ అనుభవాలు చెపుతున్న పాఠం. భారతదేశ విషయానికి వస్తే, రాష్ట్రానిదే హెచ్ఐవి వ్యాప్తి తీవ్రతలో అగ్రస్థానం. పధ్నాలుగు జిల్లాల్లో వ్యాప్తి తీవ్రత 2 శాతం మించిందని గణాంక వాస్తవాలు తెలుపుతున్నాయి. పదేళ్ళ కిందట హైరిస్క్ గ్రూప్‌గా గుర్తింపబడిన కమర్షియల్ సెక్స్ వర్కర్లు, ట్రక్ డ్రైవర్లు, వలసపోయే కార్మికులు వీరికి మాత్రమే వస్తుందనుకునేవారు. ఈవేళ ఇది సాధారణ ప్రజానీకం మధ్యకి కూడా వచ్చింది. ఇప్పుడు హైరిస్క్ గ్రూపంటే - చైతన్యం, అవగాహన, ఆచరణ ఎవరిలో తక్కువ వుంటుందో వారే. నిస్సహాయంగా దీని బారిన పడుతున్నది కూడా వారే.
మనుగడకోసం, మనగలగడంకోసం చేసే జీవన పోరాటంలో దీనిబారిన పడుతున్నవారు కొందరైతే, జీవన శైలిలో వచ్చిన మార్పు కారణంగా దీని బారిన పడుతున్నవారు ఎక్కువమంది. జీవిక కోసం ఈ వ్యాధి బారిన పడుతున్న వర్గంవారు ఈవేళ పూర్తి చైతన్యాన్ని కలిగి వుండడమే కాక దీనివల్ల ముప్పేమిటో గ్రహించగలిగారు. ఎటుతిరిగి జీవన శైలులు తెచ్చిపెట్టిన మార్పుల ఫలితంగా దీని బారిన పడ్డవారుగాని, పడబోతున్నవారుగాని తాము ప్రమాదంలో వున్నామనే సంగతిని గుర్తించడం లేదు.

ప్రకృతి వైపరీత్యాలు కొద్దిమందిని నిర్మూలిస్తాయేమో! కొంత ఆస్తినష్టం కల్గిస్తాయేమో! కానీ మానవ ప్రకృతి వైపరీత్య ఫలితం వర్తమానాన్నే కాక భవిష్యత్తును కూడా లేకుండా చేస్తున్నది. అందుకే ప్రతి ఒక్కరం హెచ్ఐవి/ ఎయిడ్స్ అనే అంశాన్ని గురించి తప్పకుండా ఆలోచించాలి. పట్టించుకోవాలి. ఇది నా సమస్య అని భావించాలి. ప్రతి ఇల్లూ హెచ్ఐవి/ ఎయిడ్స్ చైతన్యస్థావరంగా మారాలి. ప్రతి హృదయమూ హెచ్ఐవి సోకినవారిపట్ల ఆదరణ, సంరక్షణా కేంద్రం కావాలి.

మనం ఈ హెచ్ఐవి/ ఎయిడ్స్ లాంటి మహా వ్యాధులను సమర్థవంతంగానే ఎదుర్కోగలం. ఇది కేవలం ఎ.పి. ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ చేసే పనిమాత్రమే అని భావించకుండా, లేదా స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వం చేయాల్సిన పనులని కాకుండా హెచ్ఐవి వల్ల ముప్పు తెలిసిన ప్రతి ఒక్కరూ తమ తోటివారిని చైతన్యపరచాలి. ఏ ఒక విడి వ్యక్తి సమస్య కాదని గుర్తించాలి. లేదా ఏ ఒక కుటుంబ సమస్యో, లేక ఒక గ్రామ సమస్యో అని కాకుండా ఉమ్మడి సమస్యగా భావించాలి. దీన్ని అరికట్టేందుకు నడుం బిగించాలి. తొలి విడత, మలి విడత ‘ఆశ’ కార్యక్రమం కాని, ఇప్పుడు కొనసాగుతున్న ‘బి బోల్డ్’ మరియు రెడ్ రిబ్బన్ క్లబ్ ప్రచార కార్యక్రమాల లక్ష్యం కూడా చైతన్యమే. ఆ చైతన్యం ఆచరణగా అనువదింపబడడమే ఏ ప్రయత్న పరంపరల లక్ష్యమైనా.

ఇక బాల్యవివాహాలను తీసుకుంటే - పేదరికం, పనులు లేకపోవడం, చేతి వృత్తుల ధ్వంసం సృష్టిస్తున్న ఆకలి ముందు మానవీయ కోణాలన్నీ మసిబారిబోతున్నాయి. పిల్లల్ని పెంచడం, తిండి పెట్టడం అనేది వలస కార్మికులకు భరించరాని భారంగా పరిణమించి, బాల్య వివాహాలను జరిపించేసి బరువు దింపేసుకోవడం తప్ప గత్యంతరం లేని పరిస్థితి ఏర్పడింది. ఫలితంగా ఈ రోజు విపరీతంగా బాల్యవివాహాలు జరుగుతున్నాయి. సామాజిక కార్యకర్తలు, స్వచ్ఛంద సంస్ధలు, ప్రభుత్వం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇవి పెరుగుతున్నాయేగానీ తగ్గడం లేదు. నిఘా పెట్టి ఆపగలిగినవి కొన్నే. పంధొమ్మిదేళ్ళకే పాజిటివ్‌లుగా మారిన స్త్రీలు బాల్య వివాహ బాధితులు కూడా అవుతున్న కారణం పేదరికమే. మహిళల అక్రమ రవాణా వెనుక వున్నదీ పేదరికమే. ఈ అక్రమ రవాణా ద్వారా తరలించబడిన వీరంతా సెక్స్ వృత్తిలోకి దింపబడి పాజిటివ్‌లుగా మారుతున్నారు. హెచ్ఐవి/ ఎయిడ్స్ గురించి మాట్లాడాలంటే, ఖచ్చితంగా ఈ అంశాలను సంబోధించాల్సి వుంటుంది. ఇట్లాంటి అంశాలను వెలుగులోకి తెస్తునే మెరుగైన సమాజం కోసం మీడియా మరింత బాధ్యతగా, భాగస్వామ్యాన్ని స్వీకరిస్తూ తాను వెదజల్లుతున్న సమాచారాన్ని, వినోదాన్ని పున: పరిశీలించుకోవాలి.

గ్లోబలైజేషన్‌లో వస్తు సముదాయాన్ని దిగుమతి చేసుకున్నంత తేలికగా జీవితం పట్ల మన చైతన్యాన్ని సరైన దృక్పథాలతో కూడిన జీవన విధానాలను దిగుమతి చేసుకోలేకపోతున్నాం. యువతకి సమీప గతంనుంచి గాని తమ వర్తమానం నుంచిగాని ఒక రోల్ మోడల్ ఎవరూ లేకుండా పోయారు. వారికి సామాజిక నాయకత్వం వహించగల వారు కరువయ్యారు. తామే ఒక రోల్ మోడల్‌గా రూపొందగలమన్న విలువలు, దృక్పథంతో కూడిన విద్య వారికి అందడం లేదు. జీవిత పరమార్ధమూ, ప్రయోజనమూ వాళ్ళకి అర్థం కాకుండా పోయాయి. సో! మన పాఠ్యాంశాల్లో జీవన నైపుణ్యాలను ఏ విధంగా బోధిస్తున్నామో, కుటుంబ విద్య మరియు సామాజిక విద్య బోధించాలి. ప్రస్తుతం దృక్పథమూ, దిశా నిర్దేశం లేని, వ్యక్తి కేంద్రక విద్యవైపు సమాజం వెళుతున్నది. ఒక రకంగా ఆయా వ్యక్తుల సామాజిక బాధ్యతల నించి స్వచ్ఛంద విరమణవేపు ప్రపంచీకరణ మనల్ని నెడుతున్నది.
ఆంధ్రదేశంలోని పురుషుల్లో ప్రతి అయిదుగురిలోను ఒకరు లైంగిక సుఖాన్ని వివాహ వ్యవస్థ వెలుపల కొనుక్కోవడం వల్ల అమాయకమైన మహిళలు ఏ కోణంలో చూసినా అధికాధికంగా దీని బారిన పడుతున్నారు. రిస్క్ బిహేవియర్ వున్న ఈ పురుషులు పరీక్షలు చేయించుకుని మందులు వాడుతూ భార్యకి ఆలస్యంగా చెప్పడమో, చెప్పకుండా వుండడమో చేస్తూ జాప్యం చేస్తున్నారు. పర్యవసానంగా మహిళలు చిన్నవయస్సులో దీని బారిన పడ్డం తమ ప్రాణాల్ని కోల్పోవడం, భర్తల్ని కోల్పోవడం అనే విషాదాన్ని ఎదుర్కొంటున్నారు.
ఈ సంచికను రెండోసారి కూడా తేగలగడం మాకు సంతోషాన్ని కల్గిస్తున్నా, కళ్ళకు కడుతున్న విధ్వంస దృశ్యాన్ని ఆవిష్కరించడం చాలా బాధాకరంగా వుంది. ఈ సంచిక కోసం మేము నిర్వహించిన ఇంటర్‌వ్యూలు, పాజిటివ్‌లుగా జీవిస్తున్న యువతుల జీవితాలు మనసును కలిచివేసిన మాట వాస్తవం. అయితే వారి మాటల్లోని ఆశావహ దృక్పథం, జీవితం పట్ల వారి ప్రేమ మా కళ్ళను నింపేసాయి. గుండెల్లో ఎక్కడో ఓ ముల్లు గుచ్చుకున్న వేదన. ఈ వేదనే మా చేత ఈ సంచికకు రూపకల్పన చేయించి, ఒక చైతన్య దీపికలా భూమికను తీర్చి దిద్దేలా చేసింది. ఈ సంచిక రూపకల్పనలో, సంపాదకీయం రాయడంలో నా సహ సంపాదకుడు సీతారాం అందించిన సహకారం వెలకట్టలేనిది.
ఎటూ చూసినా కటువైన వాస్తవాలు ప్రతి మూడు నాలుగిళ్ళ అవతల కన్పిస్తూ వున్నాయి. ఆంధ్రదేశపు భవిష్యత్ చిత్రపటంలో పురుషుల్ని కోల్పోయిన కుటుంబాలు, మహిళల్ని కోల్పోయిన కుటుంబాలు, పిల్లల్ని పాజిటివ్‌లుగా మిగిల్చిన కుటుంబాలు, తల్లిదండ్రుల్ని కోల్పోయిన పిల్లల కుటుంబాలు మరింతగా పెరగబోతున్న వాస్తవాన్ని గమనించినపుడు భయం స్థానంలో బాధ్యత, అపోహ స్థానంలో అవగాహన, ఆందోళన స్థానంలో స్వయం నిర్దేశిత ఆచరణ -ఈ మహావ్యాధుల యుగంనించి మనల్ని అపూర్వంగా ఒడ్డుకు చేర్చగలవు అని విశ్వసిద్దాం. ఎయిడ్స్ వ్యాప్తిని అరికట్టడానికి, రూపొందబోయే వాక్సిన్‌ల కన్నా, విడుదల కాబోయే యాంటి రెట్రో వైరల్ డ్రగ్స్ కన్నా విలువైనవి మమత, మానవీయ స్పర్శలు. ఆ స్పర్శని ద్విగుణీకృతం చేసే ఏ చిన్న ప్రయత్నమైనా వైరష్లతో సహజీవనం చేస్తున్న మానవాళిని కాపాడగలుగుతుంది. అందుకొక ఉమ్మడి చైతన్యం కావాలి. మరి చైతన్యమంటే… అన్ని అవరోధాలను అధిగమించటం. ఎయిడ్స్ ని అంతమొందించటం. ఎయిడ్స్ రహిత ఆంధ్రదేశాన్ని స్నప్నించడం.సురక్షితమైన లైంగిక ప్రవర్తనలను ప్రతి ఒక్కరు కలిగి వుండటం, రిస్క్ ఎవరెవరికి ఎక్కడ ఏ మేరకు వుందో గుర్తించడం, రిస్క్ ను తగ్గించుకునేందుకు ప్రయత్నించడం, సుఖ వ్యాధులకు సంకోచ బిడియాలు లేకుండా చికిత్స చేయించుకోవడం, గర్భిణీ స్త్రీలకు హెచ్ఐవి పరీక్షలు తప్పక చేయించడం, ప్రసవం ప్రభుత్వాసుపత్రిలో జరిగేలా చూడటం, పుట్టబోయే బిడ్డకు హెచ్ఐవి సోకకుండా చూడగలగటం, పెళ్ళికి ముందు తప్పని సరిగా హెచ్ఐవి పరీక్షలు జరిపించుకోవడం, ప్రతీ ఒక్కరు హెచ్ఐవి స్టేటస్ తెలుసుకోవటం, 2007 నాటికి పుట్టబోయే ఏ పసికందుకు హెచ్ఐవి రాకుండా ప్రయత్నించడం, హెచ్ఐవి సోకిన వారిని సమాదరించడం, వివక్ష చూపక పోవడం మన ముందున్న ఒక సుదీర్ఘ ప్రయాణం-

చైతన్యమే దారి దీపం- ధైర్యమే కవచం.

హెచ్ఐవి/ ఎయిడ్స్ ప్రత్యేక సంచిక


భూమిక December 2006

Monday, July 19, 2010

స్నేహ గీతం

తెల తెల్లటి సంపెగపూలు
ఎర్రెర్రటి అనార్ పూలుపాలనురుగులాంటి నక్షత్రపుష్పాలు
నల నల్లని మబ్బుతునకలు
చల చల్లని చిరుజల్లులు
హాయైన వేళ
మనసు ఊయలలూగే ఈ వేళ
నేస్తం!
నీ చేతిలో చెయ్యేసి
ఆకాశం అంచుల దాకా నడవాలనిపిస్తుంది.
అంతు దరిలేని కబుర్లని కలబోసుకోవాలనిపిస్తుంది.

Thursday, July 15, 2010

సోంపేట విషాదం-"అభివృద్ధి" పేరు తో విధ్వంశం.

అభివృద్ధి పేరు మీద జరుగుతున్న విధ్వంశంలో మరో నలుగురు అమాయక రైతు,మత్స్యకారుల బలిదానం జరిగింది.టి వి.లో కనబడిన భయానక,బీభత్స దృశ్యాలు మనస్సును కలిచివేసాయి.గుండెల్లో మంట పుట్టించాయి.పచ్చటి పంట పొలాలతో,మత్స్యకారులకు జీవికనిచ్చే జలాశయాలతో నిండి ఉన్న ప్రాంతాన్ని ధర్మల్ ప్రాజెక్టుకు కట్టబెట్టాలనే దుర్మార్గాన్ని అందరూ వ్యతిరేకించాలి.మా పొలాలను ఇవ్వమనే హక్కు రైతులకుంది.

పది ఉద్యోగాలు ఎర చూపి వందలాది ఎకరాలను గుంజుకునే దుర్మార్గ అభివృద్ధి లోని మోసాన్ని అర్ధం చేసుకోవాలి.
సోంపేట బాధితులకు అండగా ఉండాల్సిన అవసరం ఉంది.
సోంపేట ఘటనకు నిరసనగా ఈ రోజు ఉదయం అంబేద్కర్ విగ్రహం ముందు జరిగిన నిరసన ప్రదర్శనలో నేనూ పాల్గొన్నాను.నా సామాజిక బాధ్యతను నెరవేర్చుకున్నాను.

Saturday, July 10, 2010

పోలీస్‌స్టేషన్‌ ఆవరణలో మహిళా సహాయ కేంద్రాలు

భారతదేశంలో లైంగిక అసమానతల్ని రూపుమాపే దిశగా, మహిళలపై హింసని నిర్మూలించడం, లింగ వివక్షతపై చైతన్యం కల్గించడం, మహిళా సాధికారతవంటి కార్యక్రమాలతో ఆక్స్‌ఫాం ఇండియా పనిచేస్తోంది.
మహిళలపై నానాటికీ పెచ్చరిల్లుతున్న హింస మానవహక్కుల విఘాతంగా పరిణమిస్తున్న నేపధ్యంలో బాధితుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని పోలీస్‌స్టేషన్‌లలో మహిళా సహాయక కేంద్రాలను నెలకొల్పడమన్నది ఒక వ్యూహాత్మక ప్రతిపాదనగా ముందుకొచ్చింది. రాష్ట్ర హోంశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కూడా ఈ ప్రతిపాదన గురించి పదే పదే ప్రస్తావిస్తూ తొలిదశలో పది పోలీస్‌స్టేషన్‌లలో సపోర్ట్‌ సెంటర్లను ప్రారంభించబోతున్నామని ప్రకటించి ఉన్నారు.
2004లో పోలీస్‌ కంట్రోల్‌ రూమ్‌ ప్రాంగణంలోకి మహిళా పోలీస్‌ స్టేషన్‌లో ఆంధ్రప్రదేశ్‌లోనే తొలిసారిగా ఆక్స్‌ఫాం, స్వార్డ్‌ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో మహిళా సహాయక కేంద్రం ప్రారంభమైంది. ఈ సహాయ కేంద్రం ఏర్పాటు నేడు పౌర సమాజమూ, ప్రభుత్వం మధ్య అద్భుత సమన్వయ సహాకారానికి తార్కాణంగా నిలిచిందంటే అతిశయోక్తి కాదు.
ఈ అనుభవంతోనే వరంగల్‌, కరీంనగర్‌, అనంతపురంలో కూడా ఈ సహాయ కేంద్రాలు ఏర్పడినాయి. ఈ నెల 23 వ తేదీన హైదరాబాద్‌ లోని ఉమన్‌ ప్రొటక్షన్‌ సెల్‌ ప్రాంగణంలో రాష్ట్రస్థాయిలో పనిచేయడానికి మరొక సహాయ కేంద్రం ఏర్పాటయింది. (జూన్‌ 23న అదనపు డి.జి.పి. ఏ శివనారాయణ, ఐపిఎస్‌, ఎస్‌. ఉమాపతి, ఐపిఎస్‌, ఐజి, సిఐడిగార్లు ఈ సెంటర్‌ను ప్రాంభించారు. ఆక్స్‌ఫామ్‌ మానేజర్‌ శ్రీ అన్వర్‌, ప్రోగ్రామ్‌ ఆఫీసరు రంజనా దాస్‌, భానుజ, నారాయణస్వామి (అనంతపురం) గిరిజ, అధిక సంఖ్యలో పోలీసులు, రచయిత్రులు, న్యాయవాదులు పాల్గొన్నారు. ఆక్స్‌ఫాం, ఎ.పి.పి.ఎస్‌, భూమికల సంయుక్త ఆధ్వర్యంలో ఈ సెంటర్‌ నడుస్తుంది.
హన్మకొండ పోలీస్‌స్టేషన్‌లో శ్రీ దామోదర్‌ ఆధ్వర్యంలో నడుస్తున్న సర్వోదయ యూత్‌ ఆర్గనైజేషన్‌ పర్యవేక్షణలో మార్చి 5, 2010 నాడు ఒక సహాయ కేంద్రం మొదలైంది. ఇప్పటివరకు 64 కేసులు వీరి కేంద్రంలో రిజిస్టరు అయ్యాయి. ఒక్క హన్మకొండ చుట్టు పక్కల మండలాల నుంచే కాక మొత్తం వరంగల్‌ జిల్లా నుండి బాధిత మహిళలు ఈ పోలీస్‌స్టేషన్‌కి వస్తున్నారు. 24 కేసులను ఇక్కడ పరిష్కరించగలిగారు. కొన్ని కేసులు ప్రాసెస్‌లో వున్నాయి. కొన్ని కేసుల్ని రక్షణాధికార్లకు పంపితే కొన్ని కోర్టుకు వెళ్ళాయి. ఈ సెంటర్‌కి వస్తున్న మహిళలు ఎక్కువ శాతం గృహహింస బాధితులు. అలాగే బహుభార్యాత్వం కేసులు, వివాహేతర సంబంధాలకు సంబంధించిన కేసులు ఎక్కువగా వస్తున్నాయని కౌన్సిలర్స్‌ చెప్పారు.
ఈ సెంటర్‌లో ప్రొఫెషనల్‌ వర్కర్స్‌ జయ, విశ్వజలు ఉదయం నుండి సాయంత్రం వరకు వుంటారు. బాధిత స్త్రీలతో మాట్లాడతారు.
ఈ సపోర్ట్‌ సెంటర్‌ మా స్టేషన్‌లో రావడం వల్ల మాకు వత్తిడి చాలా తగ్గింది.రకరకాల సమస్యల మీద వచ్చే మహిళలకి సెంటర్‌లో వుండే సోషల్‌ వర్కర్స్‌ చాలా సహకరిస్తున్నారు. మా దగ్గర చెప్పుకోలేని వ్యక్తిగత సమస్యల్ని వాళ్ళతో చెప్పుకోగలుగుతున్నారు. సివిల్‌ సోసైటీకి, పోలీసులకి మధ్య ఇలాంటి సమన్వయం చాలా బావుంది. ఈ సెంటర్‌ చాలా ఉపయోగకరంగా వుంది.
రవికుమార్‌, ఎస్సై, హన్మకొండ పోలీస్‌స్టేషన

కృషి సపోర్ట్‌ సెంటర్‌ ఫర్‌ వుమెన్‌, కరీంనగర్‌

కరీంనగర్‌ సపోర్ట్‌ సెంటర్‌ ఏర్పాటులో జిల్లా ఎస్‌.పి శ్రీ శివశంకర్‌రెడ్డి గారి సహకారం చాలా వుంది. ఆయన వ్యక్తిగతంగా ఎంతో శ్రద్ధ తీసుకుని, ఈ సెంటర్‌ని మొదలు పెట్టించారు. స్థానికంగా పనిచేస్తున్న కృషిి సంస్థ ఆధ్వర్యంలో ఈ సెంటర్‌ పనిచేస్తుంది. శ్రీ గోపిచంద్‌ కృషిి డైరెక్టర్‌గా వున్నారు.
ఇప్పటివరకు ఈ సెంటర్‌కి 49 కేసులు వచ్చాయి. ఇందులో 42 కేసులు పరిష్కరింపబడగా మిగిలిన కేసులు ప్రాసెస్‌లో వున్నాయి. గృహహింసకు సంబంధించిన కేసులే అధికంగా వస్తున్నప్పటికీ వివాహేతర సంబంధాలు, బహు భార్యాత్వ కేసులు కూడా వస్తున్నాయి. సురేఖ, మంజులలు సోషల్‌ వర్కర్క్‌గా ఈ సెంటర్‌లో పనిచేస్తున్నారు. జిల్లా ఎస్‌.పి స్వయంగా మహిళా పోలీస్‌ స్టేషన్‌కి రిఫర్‌ చేసిన కేసులో సెంటర్‌లో పనిచేస్తున్న సోషల్‌ వర్కర్స్‌ సమర్ధవంతంగా చర్యలు తీసుకోగలిగారు. ఎన్‌టిపిసిలో పనిచేసే ఒక వ్యక్తి వివాహేతర సంబంధాలు కొనసాగిస్తూ భార్యాపిల్లలను ఇంట్లోంచి వెళ్ళగొట్టాడు. కలత చెందిన ఆమె ఆత్మహత్యకు ప్రయత్నించి ఆసుపత్రి పాలైంది. కోలుకున్నాక జిల్లా ఎస్‌పిని కలిసి న్యాయం చేయమని కోరింది. ఆయన సెంటర్‌కి రిఫర్‌ చేసారు. సోషల్‌ వర్కర్స్‌ ఆమెతో సావధానంగా మాట్లాడి విషయాలు తెలుసుకుని ఆమెకు మానసిక స్థైర్యాన్నిస్తూ కౌన్సిలింగు చేసారు. ఆమెకు అన్ని రకాలుగాను ధైర్యం చెప్పి, ఆమెను ఇంటి నుండి వెళ్ళగొట్టిన భర్తను పోలీసుల సహాయంతో అరెస్ట్‌ చేయించి రిమాండ్‌కు పంపగలిగారు.గృహహింస నిరోధక చట్టం 2005 గురించి ఆమెకు వివరించి ఆమెకు కావలసిన ఉపశమనాల గురించి కూడా ఆమెకు వివరించడం జరిగింది.
సంప్రదించాల్సిన ఫోన్‌ నెం. 9963026110
మా పోలీస్‌స్టేషన్‌లో సపోర్ట్‌ సెంటర్‌ వచ్చినాక మా పనిభారం చాలా తగ్గింది. సమస్యలతో వచ్చిన మహిళలపట్ల సెంటర్‌లో వున్న సోషల్‌ వర్కర్స్‌ వెంటనే స్పందించి వాళ్ళతో సానుకూలంగా సావధానంగా మాట్లాడతారు. మాలాగే ఫీల్ట్‌ విజిట్‌ కెళ్ళి వాళ్ళ సమస్యల్ని అర్ధం చేసుకుంటారు. చాలా ఓపికగా కౌన్సిలింగు చేస్తారు. స్వచ్ఛంద సంస్థలతో కలిసి పనిచేయడం చాలా బావుంది. మేము, వాళ్ళు కలిసి బాధిత స్త్రీలకు అండగా వుంటున్నాం. నిజానికి ప్రతి పోలీస్‌ స్టేషన్‌లోను ఇలాంటి సపోర్ట్‌ సెంటర్లుండాలి. రకరకాల సమస్యలతో మా దగ్గరకొస్తారు. ఈ సెంటర్‌లో కూర్చొబెట్టి వివరంగా మాట్లాడాల్సిన అవసరం వుంటుంది. వాళ్ళకి ఏమేమి సహాయాలు అందుబాటులో వుంటాయో కూడా వివరిస్తారు. ఈ సెంటర్‌ కొచ్చిన స్త్రీలు పోలీస్‌స్టేషన్‌కి వచ్చామని, తమ సమస్యలు పరిష్కారమవుతాయని భావిస్తున్నారు.
సువర్ణ, ఎస్సై మహిళా పోలీస్‌స్టేషన్‌, మంకమ్మతోట, కరీంనగర్‌

Thursday, July 8, 2010

చంచల్ గూడ మహిళా జైలు సందర్శన

మొన్న నేను చంచల్ గూడా లోని మహిళ జైలు కు వెళ్ళాను.
నేను అరెస్ట్ అయ్యి వెళ్ళేననుకునేరు.
జైలులో ఉన్న మహిళల సమస్య లు తెలుసుకునేందుకు,వారికి కౌన్సిలింగ్ ఇచ్చేందుకు ఐ జి ప్రిజన్స్ నాకు అనుమతి ఇచ్చారు.
నేను ప్రతి పదిహేను రోజులకు ఒకసారి జైలుకు వెళ్ళొచ్చు.
మహిళా ఖైదీలతో మాట్లాడవచ్చు.వాళ్ళ సమస్యల పరిష్కారానికి కృషి చెయ్యొచ్చు.
 దాదాపు వందమందితో మాట్లాడాను.
వాళ్ళ వాళ్ళ సమస్యలు చెప్పుకున్నారు.కొంతమంది జైలులో ఉన్నట్టు తమ ఇంట్లో వాళ్ళకు తెలియదని వాళ్ళతో చెప్పమని కోరారు.కొంత మంది అప్పీల్ విషయమై అడ్వొకేట్ తొ మాట్లాడమన్నారు.
ఒకామె అయితే తనను తన తల్లిని అరెస్ట్ చేసి తీసుకొచ్చేరని,తన నాలుగేళ్ళ కొడుకు ఒక్కడూ గుడెసె లో ఉండిపోయాడని,వాడిని వెతికించమని వెక్కి వెక్కి ఏడుస్తూ అడిగింది.గుడిశె ఎక్కడుంది అని అడిగితే అరే మైశమ్మ గుడి దగ్గర అంది.
నిన్న ఉదయం నుంచి మధ్యాహ్నం దాకా బండ్లగూడాలోని అరేమైసమ్మ గుడి చుట్టుపక్కల వెతికాను కానీ పిల్లాడు లేడక్కడ.అస్సలు గుడిశే లేదు.పోలీస్ స్తేషన్లో కంప్లైంట్ ఇచ్చి ఇంటికొచ్చేసా.
ఒక్కొక్కరిది ఒక్కో సమస్య.
శిక్షలు పడిన వాళ్ళవి ఒక రకమైన సమస్యలు.అండర్ ట్రెయిలర్ లవి భిన్నమైన సమస్యలు.వాళ్ళ కోసం ఎవ్వరూ రాక కొందరు; బెయిల్ ఇప్పించే వాళ్ళు లేక కొందరూ,షూరిటీలు లేక కొందరూ.
వీటన్నిటి మీదా పని చేయాలని ప్రయత్నం.

Wednesday, July 7, 2010

నిన్న రాత్రి పూసిన బ్రహ్మ కమలం ఇదిగో

నిన్న రాత్రి పూసిన బ్రహ్మ కమలం ఇదిగో.

బ్రహ్మకమలాలండీ బ్రహ్మకమలాలు

 (నిన్న పూసిన పువ్వు ఫోటో అప్ లోడ్ అవ్వలేదు.ఇవి పాత ఫోటోలు)
జూన్ నెల వచ్చిందంటే చాలు
మా ఇంట్లో బ్రహ్మ కమలాలు
బ్రహ్మాండంగా విడవడం మొదలౌతుంది.
నిన్న రాత్రి వర్షం పడుతూ ఉంది.
బ్రహ్మకమలం విచ్చుకోవడం,సువాసనలు వెదజల్లడం.
చిరుజల్లుల్లో తడుస్తూ కొంచం సేపు చూస్తూ కూర్చున్నాను.
కాసేపటికి మొత్తం తడిసిపోయాను.
అద్భుతంగా విచ్చుకుంటున్న పువ్వుని అలా వర్షంలో ఒంటరిగా
వదిలేయాలంటే ఎంత దుఖమో.
పోనీ కుండీని తీసుకెళదామా అంటే మొయ్యలేనంత బరువుంది.
ఏం చెయ్యాలి??
పువ్వుని కోసుకుని నీళ్ళల్లో వేసి ఇంట్లోకి పట్టుకెళ్ళిపోయా.
ఇల్లంతా ఘాటైన వాసన కమ్ముకుంది.
బోలెడన్ని ఫోటోలు తీసా. మీ కోసం కొన్ని.

Saturday, July 3, 2010

మా ఇంట్లో కాపురం పెట్టిన పిచ్చుకలుకర్నూల్ లో మా ఇంట్లో ప్రస్తుతం పిచ్చుకలు హాయిగా కాపురం పెట్టాయి.
వాటికోసం బుల్లి ఇల్లు,ధాన్యపు కుచ్చులు,పక్కనే పచ్చటి వేప చెట్టు.
ఎంత హాయి కదా.ధాన్యపు కంకుల్ని ఇంత పొందిగ్గా అల్లే చంద్రుడు మా ఊరిలో ఉన్నాడు.ఈ కంకుల్ని ఈ పిచ్చికల జంట కోసం మా ఊరి నుండి తెచ్చానండోయ్.
మేము వెళ్ళినపుడల్ల మాకు కనువిందుగా,వీనులవిందుగా కిచ,కిచలాడుతూంటాయి.
చూడండి వాటి సొగసు.

Friday, July 2, 2010

గినీ పిగ్ లౌతున్న గిరిజన బాలికలు

ఇటీవల ఖమ్మం జిల్లాలోని గిరిజన ప్రాంతాల్లో నలుగురు గిరిజన బాలికలు మరణించారు. ఈ మరణాలు సహజంగా సంభవించినవి కావు. హ్యూమన్‌ పాపిల్లోమా వైరస్‌ (హెచ్‌.పి.వి) వాక్సిన్‌ తీసుకోవడంవల్ల ఈ మరణాలు సంభవించాయన్న విషయం బయట ప్రపంచానికి తెలిసింది. అసలు ఈ హెచ్‌.పి.వి వైరస్‌ వాక్సిన్‌ని ఈ పిల్లలకి ఎందుకిచ్చారు? ఎవరికిచ్చారు? ఎలా ఇచ్చారు? ఈ ప్రశ్నలన్నింటి గురించి కూలంకషంగా ఆలోచిస్తే, తీగ లాగితే డొంకంతా కదిలింది. చిన్న తీగ అనుకున్నది కాస్తా చాలా పెద్దదిగా, డొంక కాస్తా కాలసర్పాలు తిరిగే కారడవిలాగా తయారై, వాటి వివరాలు చదువుతూంటే, అర్థం చేసుకుంటూంటే వెన్నులోంచి నాగుపాము జర జరా పాకిన విభ్రాంతి కలిగింది.

వివరాల్లోకి వెళితే ”పాత్‌ ఇంటర్నేషనల్‌’ అనే అంతర్జాతీయ మందులకంపెనీ,
మరియు ఆయా రాష్ట్రాల సంయుక్త ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్‌లో ఖమ్మం జిల్లాలోను, గుజరాత్‌లోని కొన్ని ప్రాంతాల్లోను హెచ్‌.పి.వి వాక్సినేషన్‌ కార్యక్రమం ప్రారంభించాయి. ఈ కార్యక్రమం మొదలయ్యాక ఖమ్మంలోని ఏజన్సీ ప్రాంతంలో నలుగురు ఆడపిల్లలు మృత్యువాత పడ్డారు. హెచ్‌.పి.వి వాక్సిన్‌ వేసిన తరువాత తీవ్రమైన సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఏర్పడి ఈ పిల్లలు చనిపోయారు.

ఈ విషాద సంఘటన జరిగిన తర్వాత దాదాపు 50 సంఘాలు- వీళ్ళల్లో ప్రజారోగ్య రంగంలో పనిచేసే నిపుణులు, హెల్త్‌ నెట్‌వర్క్స్‌, వైద్య నిపుణులు, మానవ హక్కుల కార్యకర్తలు, మహిళా సంఘాలకు చెందినవారున్నారు. వీరంతా ఈ అంశమై గళమెత్తారు. ఈ వాక్సీన్‌ భద్రత గురించి, ఈ ప్రాజెక్టు అమలు తీరు గురించి ప్రభుత్వానికి మెమొరాండంలు సమర్పించారు. ఖమ్మం జిల్లాలో ఎక్కడైతే (14,000) పధ్నాలుగు వేలమంది ఆడపిల్లలకి హెచ్‌.పి.వి వాక్సిన్‌ వేసారో ఆ అన్ని ప్రాంతాల్లోను స్థానిక సంఘాలవారు నిజ నిర్ధారణ చేసినపుడు చాలా భయానకమైన వివరాలు వెలుగులోకొచ్చాయి. ఎంత అమానవీయంగా, ఎంత నిర్లక్ష్యంగా ఈ వాక్సిన్‌లు ఈ అమాయక, గిరిజన ఆడపిల్లలకి వేసారో అర్ధమై కడుపు రగిలిపోయింది. ఈ పిల్లలంతా 10-14 సంవత్సరాల వయస్సులో వున్నవారు. వీరందరికీ మూడు డోసులు హెచ్‌.పి.వి వాక్సిన్‌ వేసేసారు. వీరిలో చాలామంది పిల్లలు తీవ్రమైన కడుపునొప్పి, తలనొప్పి, మూడ్స్‌లో మార్పులు, ముందుగానే ముట్లు రావడం, తీవ్ర రక్తస్రావం, మెన్స్‌స్‌ సమయంలో క్రాంప్స్‌ రావడంలాంటి సైడ్‌ ఎఫెక్ట్స్‌కు గురయ్యారు. నలుగురు ఆడపిల్లలు ఏకంగా చనిపోవడమే జరిగింది.

ఈ వాక్సిన్‌ వేసేటపుడు ఈ పిల్లలకి చెప్పినదేమిటంటే, దీన్ని వేయించుకోవడంవల్ల మీకు ఎప్పటికీ గర్భాశయముఖద్వార కాన్సరు రాదు అని మభ్యపెట్టడం. అయితే ఫార్మాస్యూటికల్‌ కంపెనీలవాళ్ళు మాత్రం హెచ్‌.పి.వి వాక్సిన్‌లు వేయించుకోవడంవల్ల హెచ్‌.పి.వి వైరస్‌ ఇన్‌ఫెక్షన్‌ నుంచి రక్షణ మాత్రమే దొరుకుతుందని చెబుతున్నారు. గర్భాశయ ముఖద్వార కాన్సరు లాంటి భయంకరవ్యాధి గురించి వీళ్ళని మభ్యపెట్టడం చాలా అమానుషమైన విషయం. నిజానికి ఈ వాక్సిన్‌ ప్రభావం 3-5 సంవత్సరాలకు మాత్రమే ఉంటుందనేది ఇప్పటికే అభివృద్ధి చెందని దేశాల్లో నిర్ధారణ అయ్యింది. ఈ వాక్సిన్‌ నిజ స్వభావం, ఎలా పనిచేస్తుంది. దేనికి రక్షణనిస్తుంది, దీనివల్ల వచ్చే దుష్ఫ్రభావాలేంటి, తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి లాంటివేవీ వివరించకుండా, ఎలాంటి ముందస్తు ప్రణాళిక లేకుండా అమాయక గిరిజన ప్రాంతాల బాలికల మీద దీన్ని ప్రయోగించడం ఎంత అన్యాయమో, అనైతికమో అందరం అర్థం చేసుకోవాలి.

పధ్నాలుగు వేలమంది ఆడపిల్లల్ని ఎంపిక చేసిన విధానం, వారి ”అంగీకారం” తీసుకున్న పద్ధతి చాలా అనుమానాస్పదమైంది. ఈ ప్రాజెక్టు అమలు కోసం, కావలసిన ఆడపిల్లల ఎంపిక కోసం ఆశ్రమ పాఠశాలల్ని ఎంచుకుని, కనీసం వారి తల్లిదండ్రులకి తెలపకుండా హాస్టల్‌ వార్డెన్‌/ఇంఛార్జి టీచర్‌ నోటిమాటనే అంగీకారంగా తీసుకున్నారు. బయట నుంచి పాఠశాలకొచ్చే పిల్లల తల్లిదండ్రుల నుంచి ”అంగీకార పత్రం” మీద సంతకాలో, వేలి ముద్రలో తీసుకున్నారు. ఈ అంగీకార పత్రంలో కనీసం ఈ వాక్సిన్‌ ఏమిటనిగానీ తీసుకుంటే ఏ ఇబ్బందులు వస్తాయి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే సమాచారం లేదు. ఒక హాస్టల్‌లో ఒక వార్డెన్‌ ఈ వాక్సిన్‌ ప్రక్రియని వ్యతిరేకిస్తే, ఇది ”మాండేటరీ” అంటూ ఆమె నోరు నొక్కేసారు. ఇంత అనైతికంగా, అమానవీయంగా ”అంగీకారం” పొందిన విదేశీ కంపెనీలు పధ్నాలుగు వేల మంది ఆడపిల్లలకి ఈ వాక్సిన్‌లు వేసాయి. ఈ ప్రక్రియ అంతా ‘ఎన్‌ఆర్‌హెచ్‌ఎం’ బ్యానర్‌ కింద జరగడం మరింత షాక్‌ని కల్గిస్తోంది.భద్రాచలం గిరిజన ప్రాంతాల్లో వైద్య సదుపాయాల పరిస్థితి దయనీయంగా వుంటుంది. ఆ ప్రాంతంలో ఒక్క గైనకాలజిస్టు లేదంటే అతిశయోక్తి కాదు. గైనకాలజిస్టు ఆధ్వర్యంలో జరిగే ” పాప్‌స్మియర్‌” పరీక్ష వెసులుబాటు లేకుండానే (హెచ్‌.పి.వి వాక్సిన్‌ వేయించుకున్న వాళ్ళకి ఇది చాలా ముఖ్యమైన పరీక్ష) ఈ వాక్సిన్‌లు వేయడం ఎంత భయంకర నిర్లక్ష్యమో అర్థ్ధం చేసుకోవాలి. ఈ ప్రాజెక్టును అమలు చేస్తున్న విదేశీ కంపెనీ ‘పాత్‌’కి బిల్‌ అండ్‌ మెలిందా గేట్స్‌ పౌండేషన్‌ ఫండింగు ఇస్తోంది. లాభాల వేటలోనే విదేశీ కంపెనీలు పనిచేసినా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వీటికి వత్తాసు పలకడం, పర్మిషన్స్‌ ఇవ్వడం చాలా దారుణమైన అంశం. ”యూనివర్సల్‌ ఇమ్యూనైజేషన్‌” పేరుతో ఇవి జరగడం ప్రజల్ని భ్రమపెట్టడమే.

నలుగురు గిరిజన బాలికల బలిదానం జరిగాకైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి, హెచ్‌.పి.వి. వాక్సిన్‌ భద్రత గురించి, పర్యవసానాల గురించి, ఈ కార్యక్రమం కోసం జరిగిన ఒప్పందాల గురించి ప్రజలకి తెలియచెయ్యాలి. అభివృద్ధికి నోచుకోని, అన్నెంపున్నెం ఎరుగని అమాయక గిరిజన ప్రాంతాల ఎంపికలోనే దారుణమైన మోసం దాగుంది. ”అంగీకారం పత్రం”లోనే ద్రోహం వుంది. ఈ మొత్తం వ్యవహారం మీద సమగ్ర దర్యాప్తు జరిపించి నిజానిజాలు వెల్లడించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద వుంది. పిల్లల్ని కోల్పోయిన తల్లిదండ్రులకి నష్టపరిహారం ఇవ్వాల్సిన నైతిక బాధ్యత కూడా వుంది. భవిష్యత్తులో ఇలాంటి ప్రాజెక్టులు చేపట్టేటపుడు ప్రజలకు వివరించి, వారి సంపూర్ణ అంగీకారంతోనే చెయ్యాలిగాని రహాస్యంగా, గుట్టు చప్పుడుకాకుండా మారుమూల గిరిజన ప్రాంతాల్లో మొదలుపెట్టడం అన్యాయం, అమానుషం, అనైతికం.

Thursday, July 1, 2010

పొగడ పూల వర్షం

తెల్లవారుఝామున తొలివేకువ వేళ వర్షంతో పాటు మా ఇంట్లో పొగడపూల వర్షం కూడా కురిసింది.ఒకటా రెండా చెట్టు కిందంతా పరుచుకున్న పూలని ఏరడానికి అరగంట పట్టింది.
నడుం నొప్పి వచ్చింది కానీ పొగడపూలని ఏరడంలో ఉన్న సంతోషం ముందు ఈ నొప్పులెంత?
వర్షం శుభ్రంగా కడిగి మరీ పూలని రాల్చింది.
సువాసనలు వెదజల్లుతూ ఎంత తేటగా ఉన్నాయో చూడండి.
ఈ బొకే చూసారా? నా నేస్తం గీతకి ఇవ్వడానికి నేనే తయరు చేసా.
పొగడపూల బొకే మీరెప్పుడూ చూసి ఉండరు.
పూలతో పాటు సువాసనలూ మీకు పంచే వీలుంటే బావుండు.

నా మీద వాలిన ఛాయాదేవి ఛాయ

ఎప్పటిమాట. పచ్చగా, చల్లగా, కుటీరం లాగా ఉండే ఆ ఇంటికి తొలిసారి ఎప్పుడెళ్ళాను. తొలిచూపులోనే ఆవిడతో ప్రేమలో పడిన సంఘటనలో నిజానికి, ఆరోజు ...