Tuesday, June 29, 2010

ప్రేమ భాష్యం

ఒకరినొకరు ప్రేమించండి
అయితే మీ ప్రేమను ఆంక్షాగ్రస్తం కానీకండి
మీ ఇరువురి ఆత్మల తీరాల మధ్య
కదిలే సంద్రం కావాలి మీ ప్రేమ
ఒకే ప్రేమ చషకాన్ని ఒంపుకునేకన్నా
ఒకరికొరకై ఒకరు
వేర్వేరు మధుపాత్రలు
నింపుకోవడంలోనే ప్రేమ ఉన్నది
మీకున్నది చెరిసగం పంచుకు తినడంలో సౌఖ్యమున్నది
అలాగని ఒకే కంచంలో భుజించనక్కర లేదు
కలిసి సాగించే గాన నృత్యాలు సృజించే మేలిరకం హాయిలో
ఏకాంత విరహ సౌఖ్యాన్ని విస్మరిచరాదు సుమా!
ఒకే శబ్ద సౌందర్యాన్ని నిర్మించే వీణ తీగలు సైతం
విడి విడిగానే స్పందిస్తాయి కదా!
మనసు విప్పి మాటలు చల్లుకోవడం మహత్తరంగా ఉంటుంది
కానీ మనసు నిచ్చి పుచ్చుకోవడం అన్నది అర్ధం లేని మాట.
మనందరి ఉద్వేగాలకు,ఉల్లాసాలకు మూలాధారమైన
గుండె మనుగడ మన చేతిలో లేదన్నది నిజం కదా!
ఒకరికొకరు తోడయి సమస్యల సహారాను
సరదా సమీరాలను కలిసి స్వీకరించండి
అయితే
నిలిపి ఉంచే మూల స్పంభాలు సైతం
విడి విడిగానే ఉంటాయి చూసారు కదా!
ఆకుపచ్చని ఆరోగ్యాన్ని వెదజల్లే మర్రి చెట్టు
వేప వృక్షం పరస్పర చాయలో పరిమళాలు ఒలికించవు కదా!


- ఖలీల్ జీబ్రాన్

Monday, June 14, 2010

శాంభవి ఉండాల్సింది గుళ్ళో కాదు బడిలో- మానవ హక్కుల కమీషన్ తీర్పు

శాంభవి అందరిలాంటి పాపే అని ఆమెకు చదువుకునే హక్కు ఉందని
ఆమెను తక్షణం ఎలిమెంటరి పాఠశాలలో చేర్పించాలని కర్నూల్ కలక్టర్ ను ఆదేశిస్తూ మానవ హక్కుల కమీషన్ చైర్ పర్సన్ జస్టిస్ సుభాషణ్ రెడ్డి తీర్పు వెలువరించారు.కిక్కిరిసిన మీడియా ముందు ఈ తీర్పు వెలువడింది.
తీర్పు ఆర్డర్ కోసం ఈ వెబ్సైట్ చూడండి
http://www.hydjvv.blogspot.com/

Monday, June 7, 2010

ఈ "కర్మ" భూమిలో పుట్టిన మహిళ కన్నా పులులే నయం

జాతీయ నేరాల నమోదు సంస్థ ప్రతి సంవత్సరం విడుదల చేసే నేరాల నివేదిక విడుదలైంది. మన రాష్ట్రం మహిళలకు సంబంధించి అక్షరాస్యతలో అట్టడుగు భాగాన, అత్యాచారాల్లో, నేరాల్లో అగ్రభాగాన నిలబడింది. దాదాపు ఇరవై కోట్ల జనాభా ఉన్న ఉత్తర ప్రదేశ్‌ మన వెనుక ఉండటం, ఎనిమిదన్నర కోట్ల జనాభా ఉన్న మన రాష్ట్రం మహిళల పట్ల నేరాల్లో అగ్ర స్థానాన ఉండటం చాలా విషాదకరమైన అంశం.

రాష్ట్రంలో ఉన్న మహిళలు ఒక అభద్రతలో బతుకుతున్నారనడం అతిశయోక్తి కాదు. చదువుకుంటున్న ఆడపిల్లలు ప్రేమ పేరుతో ఎన్ని రకాల దాడులకు గురవుతున్నారో మనం చూస్తూనే ఉన్నాం. ప్రేమించమని వేధించే వాళ్ళ సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. ఒకడు యాసిడ్‌ పోస్తాడు. ఒకడు బిల్డింగు మీంచి తోసేస్తాడు. ఒకడు ఏకంగా ఆడపిల్ల ఇంటికే వెళ్లి తల్లిదండ్రుల్ని కత్తులతో పొడిచేస్తాడు. ప్రేమించానని చెప్పి ఆడపిల్ల గొంతు కోసేస్తాడు. ఇంకొకడు క్లాస్‌రూమ్‌లో ఉన్న పిల్ల మీద పడి అందరి ముందూ చంపేస్తాడు. ఇంకొకడు ఆడపిల్లని ఎత్తుకెళ్లిపోతాడు. ఇన్ని రకాల హింసారూపాలను అనుభవిస్తూ ఆడపిల్లలు అహరహం నలిగిపోతున్నా, ప్రాణాలు కోల్పోతున్నా ప్రభుత్వానికి కనీసం చీమకుట్టినట్టు కూడా ఉండదు. మొన్నటికి మొన్న పసిపిల్ల, తొమ్మిదో తరగతి చదువుతున్న లలిత యాసిడ్‌ దాడికి గురై నరకయాతన పడి కన్నుమూసింది.

ఇక వివాహిత స్త్రీలు అనుభవిస్తున్న గృహహింసకు అంతమే లేకుండా ఉంది. గృహహింస నుంచి రక్షణ కల్పించే చట్టమొచ్చి నాలుగు సంవత్సరాలవుతోంది. ఎంతమంది స్త్రీలను కుటుంబ హింస నుంచి రక్షించింది ఈ చట్టం అని ఆరా తీస్తే ఆ సంఖ్య వందల్లో కూడా ఉండదు. లక్షల సంఖ్యలో మహిళలు నిత్యం హింసను అనుభవిస్తూ, ధైర్యం చేసి కొంతమంది మహిళలు రక్షణాధికారుల దగ్గరకొచ్చి కేసులు నమోదు చేసినా, ఆ కేసులు కూడా మాములు కేసుల్లాగానే సంవత్సరాల తరబడి కోర్టుల్లో మగ్గుతున్నాయి. న్యాయవ్యవస్థకి జండర్‌ సెన్సిటివిటీ లేదనడానికి, జాతీయ నేరాల చిట్టాలో మహిళలపట్ల పెరిగిపోతున్న నేరాల సంఖ్య వీరికేమాత్రమూ పట్టదనేది స్పష్టంగా అర్థమౌతుంది. హింసకు గురవుతున్న స్త్రీలకు సకాలంలో సహాయం, అది పోలీసుల నుంచి, ప్రొటక్షన్‌ అధికారులనుంచి, న్యాయస్థానాల నుంచి అందిన రోజు ఈ నేరాల సంఖ్య కూడా తగ్గుతుంది. మహిళలపై రకరకాల హింసలకు పాల్పడుతున్న నిందితులు ఎలాంటి శిక్షలూ లేకుండా తప్పించుకుంటున్నారు. ఎలాంటి శిక్షలులేని చోట నేరాలు పునరావృతమవుతాయి తప్ప తగ్గు ముఖం పట్టవు. ఎంత క్రూరమైన, హీనమైన నేరం చేసిన వాడైనా కాలరెత్తుకుని సభ్య సమాజంలో తిరుగుతున్నప్పుడు, ఎలాంటి శిక్షలూ అమలులేనప్పుడు మహిళలపై నేరాలు ప్రతి సంవత్సరం ఇలా పెరుగుతూనే వుంటాయి.

ప్రతి సంవత్సరం విడుదలయ్యే ఈ నేరాల వివరాల్ని ప్రభుత్వం ఎలా తీసుకుంటుందో అర్ధం కావడం లేదు. తీవ్రమవుతున్న పరిస్థితులననుసరించి ఏమైనా కొత్త చర్యలు, మహిళల కోసం కొత్త సదుపాయాలు, నేరాలను తగ్గించడానికి ప్రణాళికలు ఏమైనా సిద్ధం చేస్తుందా? అంటే అనుమానమే. కొత్త ప్రణాళికల మాటేమోగాని మహిళల కోసం ఏర్పాటైన కొన్ని ముఖ్య సంస్థలు, వ్యవస్థలు మూలనపడి మూలుగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా మహిళలపై నేరాలను అదుపు చేయడానికే కాదు ఆపడానికి అట్టహాసంగా ఏర్పాటైన ‘ఉమెన్‌ ప్రొటక్షన్‌ సెల్‌’ ఉన్నట్లా లేనట్లా అన్నట్టు ఉంది. ఉనికిని కోల్పోయిన ఈ సెల్‌ని పటిష్టపరచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మహిళ హోం మినిష్టర్‌గా ఉన్న చోట మహిళలపై ఇంత పెద్ద స్థాయిలో హింసలు పెచ్చరిల్లడం సిగ్గుచేటు. ప్రతి పోలీస్‌స్టేషన్‌లోనూ సపొర్ట్‌సెంటర్స్‌ పెడతామని, మహిళలకు అన్ని విధాలుగానూ రక్షణ కల్పిస్తామని యాసిడ్‌ దాడులకు పాల్పడే వారిని కఠినంగా శిక్షిస్తామని కంటతడి పెట్టి మరీ ప్రకటించిన హోం శాఖామాత్యులు ఏ రాజకీయాల్లో మునిగితేలుతున్నారోగాని మహిళల సంగతి మర్చిపోయారు.

మన రాష్ట్రంలో మహిళా శిశుసంక్షేమానికి మంత్రి లేరు. మహిళలు ఎన్నో ఆశలు పెట్టుకున్న ‘మహిళా కమీషన్‌’ రాజకీయాల కుళ్లులో కూరుకుపోయి కనుమరుగైంది. మహిళలకోసం రాజ్యాంగ ప్రతిపత్తితో ఏర్పాటైన మహిళా కమీషన్‌, రాజకీయ జోక్యంతో కుంటుపడి, ఓ కౌన్సిలింగుసెంటర్‌ు స్థాయికి దిగజార్చబడింది. మహిళల అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం ఉండాల్సిన ప్రధాన వ్యవస్థలు, సంస్థలు ఇలా మూలనపడి మూలుగుతుంటే, ప్రతి సంవత్సరం మహిళల మీద నేరాలు ఇలాగే పెరుగుతాయి. రాజకీయ నాయకుల, ప్రభుత్వాల నిర్లక్ష్యానికి వందలాది స్త్రీలు బలవన్మరణాలకు గురవుతూనే ఉంటారు.

ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని మహిళా కమీషన్‌ను, ఉమెన్‌ ప్రొటక్షన్‌ సెల్‌ను పునరుద్ధరించాల్సిన అవసరముందని అర్ధం చేసుకోవాలి. స్త్రీలకు ఏవైతే సహాయ సంస్థలున్నాయో వాటన్నింటినీ ప్రక్షాళణ చేయకపోతే మహిళల పరంగా ఆంధ్ర రాష్ట్రం అన్నపూర్ణ కాదు అధోరాష్ట్రమవుతుంది.

కొసమెరుపు: ఇటీవల ఎక్కడా చూసినా , రోడ్ల మీద, టివీల్లో, పత్రికల్లో పులుల్ని చంపడం నేరం. పద్నాలుగొందలే మిగిలాయి. పులుల్ని రక్షించండి అని పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ‘మహిళలు హింసకు గురై పెద్ద సంఖ్యలో చనిపోతున్నారు. హింసకు పాల్పడటం నేరం. హింస లేని సమాజం స్త్రీల హక్కు. హింసకు పాల్పడిన వారు కఠినంగా శిక్షించబడతారు’ అని ప్రచారమెందుకు చేయరు! జంతువుకన్నా హీనమా ఈ రాష్ట్రంలో మహిళ???

Tuesday, June 1, 2010

అంతర్జాలం లో తెలుగు మహిళా బ్లాగర్ల విజయ ఢంకా

ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా వందమంది మహిళలు తెలుగు బ్లాగ్ రాజ్యాన్ని ఏలేస్తున్నారు.
మహిళల బ్లాగ్ లంటే ఏముంటాయిలే వంటలు,వోమన గుంటలు అని వెక్కిరించే బి.సీ కాలం నాటి పురుషపుంగవులకు దిమ్మతిరిగేలా (ఈ చురక అలాంటివారికే పరిమితం)కళ్ళు జిగేల్మనేలా నవనవోన్మేషంగా, వైవిధ్యభరితంగా రూపుదిద్దుకున్న మహిళా బ్లాగర్ల బ్లాగులివిగో.ఒక్కొక్కటి దేనికదే సాటి.


కధలు,కవితలు,పాటలు,పల్లవులు,ప్రయాణానుభవాలు,ఆరోగ్య చిట్కాలు,ఉత్తరాలు,వంటింటి కబుర్లు,స్నేహ సౌరభాలు,గుండెల్లొ కువకువ లాడే ఊసులు,మనసులోని మాటలు,సామాజిక అంశాల మీద అద్భుతమైన విశ్లేషణలు,స్త్రీల సమస్యలపై సూటైన రాతలు.


నేను ముందే రాసినట్టుగా విభిన్నాంశాల సమాహారమే మహిళలు నిర్వహిస్తున్న బ్లాగులు. అసహనాలు, అసూయావేశాలు పక్కనపెట్టి తేట కళ్ళతో చదివి చూడండి. నచ్చకపోతే ఒదిలేయండి. నచ్చితే సంతోషం మీదే కదా.


తెలుగు మహిళా బ్లాగర్లపై సమగ్ర వ్యాసం .. ఇక్కడ భూమికలో ..

నా మీద వాలిన ఛాయాదేవి ఛాయ

ఎప్పటిమాట. పచ్చగా, చల్లగా, కుటీరం లాగా ఉండే ఆ ఇంటికి తొలిసారి ఎప్పుడెళ్ళాను. తొలిచూపులోనే ఆవిడతో ప్రేమలో పడిన సంఘటనలో నిజానికి, ఆరోజు ...