Tuesday, February 11, 2020

నా మీద వాలిన ఛాయాదేవి ఛాయ


ఎప్పటిమాట. పచ్చగా, చల్లగా, కుటీరం లాగా ఉండే ఆ ఇంటికి తొలిసారి ఎప్పుడెళ్ళాను. తొలిచూపులోనే ఆవిడతో ప్రేమలో పడిన సంఘటనలో నిజానికి, ఆరోజు చాలాసేపు మాట్లాడింది అబ్బూరి వరదరాజేశ్వరరావుగారితో. ‘లోహిత’నుప్రారంభించినప్పుడు జయ ప్రభతో కలిసి బాగ్‌లింగంపల్లిలోని ఛాయాదేవిగారింటికి వెళ్ళినపుడు ఆయన గలగలా మాట్లాడుతుంటే ఆవిడ లోపల్నించి తినడానికి ప్లేటులో అమర్చిన జంతికలో, మురుకులో తెచ్చారు. అంతకుముందు ఫోటోలో చూసానేమోగానీ ప్రత్యక్షంగా చూడలేదు. ఆవిడ ముఖంలో ఆవరించి ఉన్న ప్రశాంతత, మెత్తటి మాట.. నా మనసులో ముద్రపడిపోయింది. ఆరోజు ఆవిడ ఎక్కువగా మాట్లాడలేదు. ఆయన మాట్లాడారు. పచ్చటి కుటీరంలో ప్రశాంత మూర్తిని చూసాను.
ఛాయాదేవి గారితో నా పరిచయం అలా మొదలైంది. రెండున్నర దశాబ్దాల అనుబంధం. ఎన్ని సార్లు ఆ ఇంటికెళ్ళానో, ఏమేమి కబుర్లు చెప్పుకున్నామో! కాలింగ్‌బెల్‌తో సహా ఎంత కళాత్మకంగా ఆ ఇంటిని అలంకరించుకున్నారో… ఆ ఇంటికి వెళ్ళగానే కాళ్ళకు చుట్టుకునే ఆమె పెంపుడు పిల్లలు. తనకి ఇష్టమని ఎక్కడి వెళ్ళినా ఏదో ఒక పిల్లి బొమ్మని తెచ్చి ఇస్తే ఎంత సంబరపడిపోయేవారో! పిల్లులంటే ఎంత ప్రేమో!
భూజానికి ఒక బ్యాగ్‌ తగిలించుకుని బాగ్‌లింగంపల్లి రోడ్లమీద నడయాడిన ఛాయదేవిగారు ఎవ్వరికీ ఏ పనీ చెప్పేవారు కాదు. పోస్టాఫీసుకి, బ్యాంకుకి, షాప్‌లకి అలా అలవోకగా నడుచుకుంటూ వెళ్ళిపోయేవారు. వాటర్‌ బిల్లు కరెంటుబిల్లు కట్టడానికి కూడా తనే వెళుతుంటే నాకివ్వండి నేను కట్టిస్తాను అంటే ‘అబ్బే! ఎందుకమ్మా. మీకు శ్రమ నడిస్తే ఆరోగ్యంకదా!’ అని ఏదో ఒక జోక్‌ వేసేవారు. చాలా తరచుగా భూమిక ఆఫీసుకు వచ్చేవారు. ఏదో పుస్తకం కావాలని తీసుకునే వారు. ఫోన్‌ చేసి ఈ పుస్తకం తెచ్చిపెట్టు అని ఏనాడూ అడగలేదు. తన పనులన్నీ తనే చేసుకోవాలి. మూర్తీభవించిన ఆత్మగౌరవరూపం.
భూమికతో అలరారిన రెండున్నర దశాబ్దాల ఆత్మీయ అనుబంధం. భూమిక సంపాదక సభ్యులుగా కొనసాగుతూ ఎప్పటికప్పుడు నేనేమీ చేయడం లేదంటూ, నా పేరు తీసేయమంటూ అడిగేవారు. మీరేమీ చెయ్యక్కరలేదు మీరు భూమికకు ఎంతో చేసారు. భూమిక ఎప్పుడు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా మీరే కదా ఆదుకున్నారు. మీ పేరు తియ్యం అని నేను పోట్లాడేదాన్ని. కానీ మొన్న మే నెలలో నా పేరు సంపాదవర్గంలో తీసేయండి. ఇంకెవరినైనా పనిచేసేవాళ్ళని పెట్టుకోండి. ఇది నా రిక్వెస్ట్‌ ప్లీజ్‌ నా మాట వినండి అంటూ బలవంతంగా తన పేరు తీసేయించారు. ఆవిడ అంత గట్టిగా కోరుతుంటే కాదనలేకపోయాను. పేరు తీసేసినంత మాత్రాన భూమికతో తన అనుబంధం తగ్గిపోతుందా ఏమిటి? తన లైబ్రరీ అంతా భూమికకే ఇచ్చారు. లైబ్రేరియన్‌గా తన అనుభవాన్ని రంగరించి కాటలాగ్‌ ఎలా తయారుచేసుకోవాలో, పుస్తకాలు ఎలా అమర్చుకోవాలో ఎన్నోసార్లు నేర్పారు. ఆవిడ క్రమశిక్షణలో ఆరోవంతు కూడా నాకు అలవడకపోవడానికి కారణం నా స్వభవం వల్లనే.
ఛాయాదేవిగారితో నా అనుబంధం, నా అనుభవాలు ఈ సంపాదకీయంలో ఎక్కడ ఇముడుతాయి. జ్ఞాపకాలు ఒక దానికి ఇంకొకటి ఒరుసుకుంటూ కళ్ళ ముందుకొస్తున్నాయి. మనసంతా కిక్కిరిసి పోతోంది. అక్షరాలుగా అమరాలంటే… ఇక్కడ చాలదు. ఓ పుస్తకంమే రాయల్సి ఉంటుంది. ఆవిడతో నా జ్ఞాపకాలు 2012కి ముందు ఆ తర్వాతగా విడిపోయాయి. బాగ్‌లింగంపల్లి ఇంట్లోను, అన్ని సాహిత్య సమావేశాల్లోను రోడ్ల మీద నడుస్తూ, తన పనులు చేసుకుంటూ తిరిగిన ఛాయదేవిగారు, అన్నీ వదిలేసి, ఆఖరికి తన జ్ఞాపకాలతో నిండిన పచ్చటి పొదరిల్లులాంటి ఇంటిని హఠాత్తుగా అమ్మేసి, సి.ఆర్‌. ఫౌండేషన్‌లో ఓ గదికి పరిమితమైపోయిన ఛాయదేవి గారుగా నా జ్ఞాపకాలు విడిపోయాయి. కానీ అది నా భ్రమ మాత్రమే. ఎంతో ప్రేమగా, కళాత్మకంగా అమర్చుకున్న ఇంటితో బంధాన్ని పుటుక్కున్న తెంపేసుకుని, ఎలాంటి వేదనని, మానసిక క్షోభని మచ్చుకైనా కనబడనివ్వకుండా తన ఒకే ఒక గదిని మరింత కళాత్మకంగా అమర్చుకున్న ఛాయదేవి ఎప్పుడూ ఒకేలా ఉన్నారు. తనెక్కడున్నా ఆ పరిసరాల్ని సృజానాత్మకంగా తయారుచేసుకోగల అద్భుతమైన కళాహృదయం ఆమెకే పరిమితం. జిడ్డు కృష్ణమూర్తి జీవన తాత్వికతని పుణికిపుచ్చుకుని, తన జీవితంలోకి, తన మార్గంలోకి అనువదింపచేసుకున్న అపురూప వ్యక్తిత్వం ఆమెకే సొంతం.
ఆవిడ కథల గురించి, ఆవిడ సాహిత్యం గురించి, ఆవిడకొచ్చిన అవార్డుల గురించి నేను రాయబోవడం లేదు. ఆమె సాహిత్యాన్ని తూకం వేసే పని నేను చెయ్యదలుచుకోలేదు. వ్యక్తిగా, స్ఫూర్తి ప్రదాతగా మాత్రమే నేను రాయాలనుకుంటున్నాను. చరిత్ర చీకటిలో మరుగున పడిపోయిన భండారు అచ్చమాంబను వెలుగులోకి తెచ్చింది, నా చేత అచ్చమాంబ జీవిత చరిత్రను రాయించిందీ ఛాయాదేవిగారే అని మాత్రం సగర్వంగా చెప్పదలచుకున్నాను. ఒకానొక కథా వర్క్‌ షాప్‌ రిపోర్ట్‌ని యధాతధంగా యాభైపేజీలు రాసిన ఛాయాదేవి గారు కె. లలిత ప్రస్తావించిన అచ్చమాంబ కథ గురించి రాయడం, అది చదివి నేను చాలా ఉత్సాహంగా అచ్చమాంబ గురించి శోధించి ఓ పెద్దవ్యాసం రాయడం, బ్రౌన్‌ అకాడమీ కోసం పుస్తకం రాయమని ఛాయాదేవి గారు అడగడం ఫలితం, అచ్చమాంబ ‘సచ్ఛరిత్ర పుస్తకర’ నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని సందర్భం. ఆవిడకు శిరస్సువొంచి నమస్కరించడం మినహా ఏమి చెయ్యగలను.
2012లో బాగ్‌లింగంపల్లి నుంచి కొండాపూర్‌ వెళ్ళిపోయినప్పుడు తనని చూడడానికి వెళ్ళినప్పుడు ‘మీ పేరుమీద రెండు
ఉత్తరాలు పోస్ట్‌ చేసాను నిన్ననే. మీరొస్తారని తెలియదు. తెలిస్తే మీకే ఇచ్చేదాన్ని’ అన్నారు. భూమికకు ఏదైనా కథో, వ్యాసమో రాసి పంపారేమో అనుకున్నాను. కానీ అది కథకాదు. ‘ఈహోమ్‌కి వచ్చాక వాళ్ళు ఒక ఫారమ్‌ ఇచ్చి పూర్తి చేయమన్నారు. అందులో ఒక ప్రశ్న ఏమిటంటే ”మీకు అనారోగ్యం కలిగినా, ఇంకేమైనా ప్రమాదం జరిగినా వెంటనే మేము తెలియచేయాల్సిన వ్యక్తి పేరు, ఫోన్‌, అడ్రస్‌ రాయమన్నారు. నేను మీ పేరు రాయాలని అనుకున్నాను. ఆ విషయమే మీకు ఉత్తరం రాసాను” అన్నారు. ”తప్పకుండా మీరు నా పేరు రాయండి. మీకు ఎప్పుడు అవసరమైతే అప్పుడు నేనొచ్చేస్తాను.” అని చెప్పాను.
చాలా సార్లు ఆ ఉత్తరం చదవాలనుకునేదాన్ని ఇప్పుడెందుకులే అని విరమించుకునేదాన్ని, ఆవిడ కన్నుమూసాకే ఆవిడిచ్చిన కవర్‌ తెరిచాను. ఇప్పుడు నాతోపాటు అందరూ చదివారు. నా మీద ఆవిడకున్న నమ్మకం, విశ్వాసం, నన్ను తన కూతురుగా భావించిన ఆ విశాలత్వం నన్ను వివశురాలిని చేసాయి. అందరి సహకారంతో ఆవిడ కోరుకున్న విధంగా ఎలాంటి కర్మకాండలూ లేకుండా, తన కళ్ళని ఎల్‌వి ప్రసాద్‌ ఐ ఆసుప్రతికి, తన పార్థివ శరీరాన్ని వైద్యవిద్యార్థుల పరిశీలనార్థం ఇఎస్‌ఐ మెడికల్‌ కాలేజీకి డొనేట్‌ చేసాం. ఇంక ఆవిడ నా మీద పెట్టిన పెద్ద బాధ్యత తను రాసిన విధంగా ఫిక్స్‌డ్‌ డిపాజిట్లను ఆయా వ్యక్తులకు అందించడం. వీలు వెంబడి ఆ పని పూర్తి చేస్తాను.
అబ్బూరి ఛాయాదేవి గారితో నాకున్న మానసిన సాన్నిహిత్యం, అనుబంధం గురించి రాయడానికి ఈ సంపాదకీయం సరిపోదు. భూమిక సంపాదక సభ్యులుగా తన స్మ ృతికి నివాళిగా మాత్రమే ఇది సరిపోతుంది.
మనందరికీ అత్యంత ఆత్మీయురాలు, గొప్ప మానవీయతతో అలరారే అద్భుత చైతన్యమూర్తి
అబ్బూరి ఛాయాదేవి గారికి నా అశ్రునివాళి.

కొత్త చరిత్రను లిఖించిన షాహీన్‌బాగ్‌ మహిళలు


-------కొండవీటి సత్యవతి
..................
లామకాన్‌లో రాజ్యాంగ ప్రవేశికను అందరి చేత చదివించి, చివరి వాక్యం చదువుతున్నప్పుడు నా గుండె పులకించి, నా శరీరమంతా పాకింది ఆ పులకింత. ఆ మాట బహిరంగంగా అందరి ముందు ప్రకటించాను కూడా. అదే పులకింత ఇంకొంత ఉద్వేగంతో మిళితమై షాహీన్‌బాగ్‌లో అడుగుపెట్టినప్పుడు కలిగింది. డిశంబరు 15 నుండి నా లోపలొక స్వప్నంగా తిరుగాడుతున్న షాహీన్‌బాగ్‌లో అడుగు పెట్టడం గొప్ప అనుభవం. ఢిల్లీలో జరుగుతున్న ఉమన్‌ స్టడీస్‌ కాన్‌ఫరెన్స్‌ మీద కన్నా నా మనసు ఢిల్లోలో ఎన్నో ప్రాంతాల్లో జరుగుతున్న మహిళల మౌన నిరసన ప్రాంతాల మీద లగ్నమైంది.
నేను ప్రశాంతి కాన్‌ఫరెన్స్‌ మధ్యలోనే షాహీన్‌బాగ్‌ వైపు వెళుతున్న ఫ్రెండ్‌ కారులో బయలుదేరి, మెట్రో ఎక్కి షాహీన్‌బాగ్‌ ప్రయాణమయ్యాం. మెట్రో దిగి ఈరిక్షాలో మహిళల మౌన నిరశన జరుగుతున్న టెంట్‌ దగ్గరికెళ్ళాం. టెంట్‌ నిండా కూర్చున్న మహిళలు, స్టేజి దగ్గరున్న వాలంటీర్స్‌ మమ్మల్ని సాదరంగా ఆహ్వానించారు. కుర్చీలేసి కూర్చోబెట్టారు. మంచినీళ్ళు, ఆ వెంటనే టీ తెచ్చి ముందు పెట్టారు. టీ తాగమని చెబితే చాలా బాధపడిపోయి సమోసాలు తెచ్చి ఇవి తప్పకుండా తినాలి అంటూ బలవంత పెట్టారు.
అక్కడంతా అలుముకుని ఉన్న ఆ చలివేళ వాళ్ళ నులివెచ్చని ప్రేమ మమ్మల్ని వెచ్చ0గా తాకింది. మేము హైదరాబాదు నుండి వచ్చాం, మేమంతా మీ వెనక, మీతోనే ఉన్నామని చెప్పినప్పుడు పెద్ద పెట్టున హర్షధ్వానాలు చేసారు.ప్రేమతో హత్తుకున్నారు. మేము స్టేజ్‌ దగ్గర కూర్చున్న వారితో మాట్లాడాము. పెద్దలతో,పిల్లలతో మాట్లాడుతుంటే వారిలో ఉప్పొంగుతున్న ఉద్వేగాలు, భయాలు మమ్మల్ని కూడా ముంచెత్తాయి. టెంట్‌ నిండా కూర్చున్న మహిళలు కొందరు లేచి వెళుతుంటే మరి కొందరు వస్తున్నారు. ఇళ్ళకెళ్ళి పనులు పూర్తిచేసుకుని వచ్చేవారు, పిల్లలకి వంటచేసి పెట్టి వచ్చే వారితో అక్కడ మహిళా ప్రవాహం అటూ ఇటూ కదులుతున్నట్టుగా ఉంది. ఇళ్లలో పనిచేసేవారు, కూరగాయలమ్ముకునేవారు ఆ పనులన్నీ పూర్తిచేసుకని వచ్చి రాత్రంతా టెంట్‌లో కూర్చుంటున్నారు.
ఎముకలు కొరికే చలిలో పైన టార్పాలిన్‌ తప్ప ఏమీ లేని ఆ టెంట్‌లో పిల్లలు, పెద్దలు, వృద్ధులు రాత్రి పగలు కూర్చుని కొనసాగిస్తున్న నిరసన దీక్షలకు దీటైన దీక్షలు చరిత్ర పొడుగునా దివిటీ వేసి వెదికినా కనబడవు. స్వచ్ఛందంగా, తమకు తాముగా తరలివచ్చి నిరసన దీక్షలో కూర్చుంటున్న ఈ మహిళలు నిజానికి షాహీంబాగ్‌లో ఓ కొత్త చరిత్రను సృష్టించారు. నాయకత్వమంటూ లేని ఈ ఉద్యమం గొప్ప గొప్ప నాయకుల్ని తయారుచేస్తోంది. ఎన్నడూ రోడ్డు మీదికొచ్చి గొంతెత్తని ఈ మహిళలు మొత్తం గొంతు విప్పి దిక్కులు పిక్కటిల్లేలా నినాదాలిస్తున్నారు.
తమలో అణిగిమణిగి ఉన్న అన్ని సృజనాత్మక ప్రక్రియల్ని వెలికి తీస్తున్నారు. పాటలు పాడుతూ, నినాదాలకి గొంతు కలుపుతూ తమ కొత్త పాత్రని చూసి తామే అబ్బురపడుతూ రోజులతరబడి శిబిరంలో గడుపుతున్నారు. షాహీన్‌బాగ్‌ మహిళల్ని పెద్ద ఎత్తున కదిలించి కదం తొక్కించిన సంఘటన, 82 సంవత్సరాల బిల్కిస్‌ బేగం, 80 సంవత్సరాల నూరున్నీసాలను డిశంబర్‌ చలిలో శిబిరంలోకి రప్పించిన సంఘటన… ప్రభుత్వం ఆదరాబాదరాగా ఆమోదించిన పౌరసత్వ సవరణ చట్టానికి, ఎన్‌ఆర్‌సికి వ్యతిరేకంగా జామియా యూనివర్సిటీలో జరుగుతున్న నిరసనల ప్రభావంతో డిశంబరు 14 న 14 మంది స్థానిక మహిళలు 24/7 మౌన ఉద్యమం మొదలు పెట్టారు.
డిశంబరు 15వ తేదీన వందలాది మంది పోలీసులు, యూనివర్సిటీ నుండి అనుమతిలేవి తీసుకోకుండానే లోపలికి చొరబడి విద్యార్ధుల్ని విచక్షణారహితంగా కొట్టడం, రబ్బర్‌ లాఠీలు, టియర్‌ గ్యాస్‌ ఉపయోగించడంతో ఎంతో మంది విద్యార్థులు గాయపడ్డారు. ఆ రాత్రి 100 మంది విద్యార్థులను నిర్భందించి తెల్లవారుఝామున 3.30 గంటలకి వదిలిపెట్టారు. 200 వందలమంది గాయాలతో ఎయిమ్స్‌లో అడ్మిట్‌ అయ్యారు. ఇద్దరు విద్యార్థులకు బుల్లెట్‌ గాయాలయ్యాయి. జామియా విద్యార్థులకు షాహీన్‌ అబ్దుల్లా, చందా యాదవ్‌, లడడా ఫర్జానా, ఆయేషా రెన్నాల మీద పోలీసులు దాడి చేసారు. షాహీన్‌బాగ్‌కు కూత వేటు దూరంలో ఉన్న జామియా యూనివర్సిటిలో జరిగిన పోలీసుల దౌర్జన్యం, విద్యార్ధులకు గాయాలవ్వడం షాహీన్‌ బాగ్‌ను కదిలించింది. కన్నీరు పెట్టించింది. షాహీన్‌ బాగ్‌ నుండి ఎంతోమంది జామియాలో చదువుకుంటున్నారు.
డిశంబరు 14న వేళ్ళమీద లెక్కించే సంఖ్యలో మహిళలు మొదలుపెట్టిన మౌన నిరసనలో వందల, వేల సంఖ్యలో మహిళలు పాల్గొనడం మొదలైంది. యమునా నది పక్కన, నోయిడా వెళ్ళే రహదారిని మూసేసి నిరసన శిబిరంలో వేలాది మంది మహిళలు రాత్రీ పగలు తేడా లేకుండా కూర్చోవడం మొదలైంది. మామూలు, సాధారణ మహిళలు, చిన్నా చితకా పనులు చేసుకునే వారు, ఇళ్లల్లో పనిచేసేవారు, హోం మేకర్స్‌ తమ పనుల్ని వేగంగా ముగించేసుకుని శిబిరంలో కూర్చోవడానికి వస్తున్నారు. ”నేను కూలి పనికెళతాను. పగలు పనిచేసుకుని రాత్రి శిబిరంలో కూర్చుంటున్నాను. మా బతుకులు, మా పిల్లల భవిష్యత్తు ఏమౌతుందోననే భయం నన్ను ఇక్కడికి రప్పిస్తొంది. నేను ఎప్పుడూ ఇంటి నుండి బయటకొచ్చి ఇలాంటి ధర్నాలో పాల్గోలేదు. అందరితో కలిసి కూర్చోవడం చాలా ధైర్యానిస్తోంది.” అని చెప్పింది షబ్నం.
”మేము ఈ దేశంలో పుట్టాం. ఇక్కడే చస్తాం. రోజుకి ఐదు సార్లు ఈ భూమికి వంగి దండం పెడతాం. ఈ భూమిని ముద్దాడతాం. అలాంటి భూమి మాది కాకుండా ఎలా పోతుంది” నౌహర్‌ బేగం. ”భారత్‌ సంవిధాన్‌లో మతం లేదు. ఎవరి ధర్మాన్ని వారు పాటించుకోవచ్చు కదా. మేము ముస్లింలమని మా మీద ఇంత వివక్ష ఎందుకు. మేము పేదవాళ్ళం. కడుపు నింపుకోవడం కోసం ఎక్కడెక్కడో పోతుంటాం. మా దగ్గర కాగితాలేముంటాయి” నస్రత్‌. ”మతం ఆధారంగా పౌరసత్వం ఇస్తామనడం భారత దేశ లౌకిక స్ఫూర్తికి విరుద్దం. మేము పౌరసత్వ సవరణ చట్టానికి విరుద్ధంగా పోరాడుతున్నాం.” సలీమ్‌. మేము శిబిరంలో మహిళలతో, పిల్లలతో మాట్లాడుతున్నాం. వేదిక మీదకొచ్చి మాట్లాడమని వాలంటీర్లు పిలిచారు. మేము హైదరాబాద్‌ నుండి వచ్చామని, మహిళా ట్రాన్స్జెండర్‌ జేయేసి తరఫున సాలిడారిటి తెలుపుతున్నామని చెప్పగానే పెద్ద ఎత్తున హర్షాన్ని వ్యక్తం చేసారు. మేము మాట్లాడడానికి వేదిక మీదికి వెళుతుండగానే పెద్దగా వర్షం మొదలైంది. విపరీతమైన చలికి తోడు వర్షం.
ప్లాస్టిక్‌ షీట్స్‌తో కప్పిన శిబిరంలో వర్షపు నీరు జారడం మొదలైంది. మేము తడిసిపోతామని ఎంత ఆదుర్దా పడ్డారో. కుర్చీలు అటూ ఇటూ జరుపుతూ మా మీద నీళ్ళు పడకుండా చాలా ప్రయత్నం చేసారు. హఠాత్తుగా కరెంట్‌ పోయింది. చిమ్మ చీకటి. వెంటనే శిబిరం చుట్టూ ఓ అపూర్వమైన దృశ్యం రూపుకట్టింది. శిబిరం చుట్టూ నిలబడి ఉన్న మగవారు సెల్‌ ఫోన్‌ లైట్స్‌ వెలిగించి పైకెత్తి పట్టుకున్నారు. శిబిరం చుట్టూ కాగడాలు వెలిగించినట్టు కనబడింది. శిబిరంలోకి పురుషులకు, మగపిల్లలకు ప్రవేశం లేదు. వారంతా బయటే నిలబడి ఉన్నారు. ఆ చీకట్లో మహిళలు త్రివర్ణ పతాకాలు చేతపట్టి దిక్కులు పిక్కటిల్లేలా నినాదాలివ్వడం మొదలుపెట్టారు. షాహీన్‌ బాగ్‌ వారి నినాదాలకు ప్రతిధ్వనించింది.
మహిళలు ఎలాంటి తారతమ్యాలు లేకుండా ఒక చోట చేరడంలోనే షాహీన్‌ బాగ్‌ సొగసు ఉందనిపించింది నాకు. ”మేము అహంకారంతో మా మహిళల్ని నాలుగు గోడల మధ్య బంధిస్తాం. అది పొరపాటని మాకు అర్థమౌతోంది. మహిళలు ఏకమై ఒక చోట చేరితే దాని ప్రభావం ఎలా ఉంటుందో మాకు అర్థమైంది. మా మీద ఉపద్రవంలా వచ్చిపడిన పౌరసత్వ సవరణ చట్టాన్ని వెనక్కి తీసుకునేవరకు మా మహిళలు పోరాడతారని నాకు గట్టి నమ్మకం. కలిగింది”. పితృస్వామ్యం బీటలు వారుతున్నదా అనిపించింది అతని మాటలు వింటుంటే. వర్షం తగ్గలేదు. కరెంట్‌ రాలేదు. మైక్‌ లేకపోవడం వల్ల మేము స్టేజిమీద మాట్లాడలేకపోయాం. శిబిరంలో కిక్కిరిసిన మహిళలు, పిల్లలు, బయట పురుషులు, నినాదాల హోరు. వర్షం బాగా పెరిగిపోతోంది.
మేము ద్వారకా వరకూ వెళ్ళాలని, చాలా దూరమని చెప్పి బయలుదేరాం. మహిళలు ఒకరి తర్వాత ఒకరు హత్తుకుంటూ ”బహుత్‌ షుక్రియా, మద్దత్‌ దియా ఆప్‌ ధన్యవాద్‌” అంటూ బయటవరకు సాగనంపారు. పిల్లలు పోటీలుపడి షేక్‌ హేండ్స్‌ ఇచ్చారు. బయట నిలబడ్డ మగవాళ్ళు మాకు దారి ఇస్తూ ”షుక్రియా” అంటుంటే మేము సన్నటి రోడ్డులోకి నడిచాం. సన్నటి చినుకులతో దారంతా చిత్తడి చిత్తడిగా ఉంది. జారతానేమో అని భయపడుతూ నడుస్తుంటే ఏమైనా తినేసి పోదామా అంది ప్రశాంతి. ఓ చిన్న హోటల్‌లోకి వెళ్ళాం. అక్కడ టిఫిన్‌ తింటున్న ఒక అబ్బాయితో చాలా సేపు చర్చ నడిచింది. ప్రశాంతి అతనితో మాట్లాడుతుంటే నా మనసు షాహీన్‌బాగ్‌ అనుభవాన్ని లోపలికి ఇంకించుకుంటోంది. గాయపడ్డ జామియా విద్యార్ధుల మీద ప్రేమతో మొదలైన ఉద్యమం అంకురంలా మొదలై మహా వృక్షమైన తీరు అబ్బురపరుస్తోంది. జామియా విద్యార్థులు పౌరసత్వ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ప్రారంభించిన ఉద్యమాన్ని షాహీన్‌ బాగ్‌ మహిళలు అందుకున్న వైనం అపూర్వం, చారిత్రకం.
ఎప్పుడూ ఇలాంటి ఉద్యమాల్లో పాల్గొనని, తమ పనులకు, ఇళ్ళకు మాత్రమే పరిమితమై ఉండే సాధారణ మహిళలు వేలాదిగా తరలి వచ్చి పగలూ, రాత్రి నిరశన శిబిరాల్లో పాల్గొనడం గొప్ప చారిత్రాత్మక సన్నివేశం. నిజానికి షాహీంబాగ్‌ మహిళలు ఓ కొత్త చరిత్రను తమదైన పద్ధతిలో లిఖించడం ప్రారంభించారు. భారత దేశానికే కాకుండా యావత్‌ ప్రపంచానికి దిశా నిర్దేశంం చేస్తున్నారు. ఇప్పుడు షాషీన్‌ బాగ్‌ మహిళలు గుండె ధైర్యాన్ని, ఐకమత్యాన్ని, స్వేచ్ఛని సెలబ్రేట్‌ చేసుకుంటున్నారు. గుండెల్లో దిగులు, భయం, అభద్రత కమ్ముకుని ఉన్నప్పటికీ ”తాము దేశ రాజ్యాంగం కోసం, ప్రజాస్వామ్యం కోసం, లౌకిక స్ఫూర్తికోసం పోరాడుతున్నామని” ఈ మహిళలు ఢంకా భజాయించి చెపుతున్నారు. ”ఇది రెండో స్వాతంత్య్ర పోరాటం. రాజ్యాంగం దాడికి గురౌతుంటే చూస్తూ ఊరుకోం. మేము ఈ దేశ వాసులం. ఆ స్ఫూర్తిని కాపాడుకోవడానికే మేమిక్కడ కూర్చున్నాం” అని చెబుతున్నారు 82 సంవత్సరాల బిల్కిస్‌ బేగం. ”హం కాగజ్‌ నహీ దిఖాయేంగే” అంటున్న పిల్లల గొంతులు మా వెనక వినిపిస్తూనే ఉన్నాయి. షాహీన్‌బాగ్‌ ను తిరిగి తిరిగి చూస్తూ, గొప్ప ఉద్వేగాన్ని, స్పూర్తిని గుండెల్లో నింపుకొని మేము ఆటో కోసం ముందుకు నడిచాం.
మర్నాడు రెండు మహిళల నిరశన శిబిరాలకు వెళ్ళాలని అనుకున్నాం. ఒకటి హౌస్‌ రాణి, రెండోది హజ్రత్‌ నిజాముద్దీన్‌ శిబిరం దగ్గర జరుగుతున్న ”వసంత పంచమి” కార్యక్రమాన్ని చూడాలని మధ్యాహ్నమే బయలు దేరి హౌస్‌ రాణి శిబిరానికి వెళ్ళాం. ఇది కూడా షాహీన్‌బాగ్‌కి ఏమీ తీసిపోదు. పింజరా థోడ్‌ అనే స్వచ్చంద సంస్థ నుండి దేవకి అక్కడ వాలంటీర్‌గా ఉన్నారు. శిబిరం నిండా మౌనంగా కూర్చున్న మహిళలతో మేము మాట్లాడాము. ఇక్కడ పిల్లలు భలే ఏక్టివ్‌గా ఉన్నారు. సి.ఏ ఏ, ఎన్‌ ఆర్సి గురించి చిన్న పిల్లలు కూడా స్పష్టంగా మాట్లాడటం ఆశ్చర్యం కలిగించింది. వాళ్ళు వేసిన బొమ్మలు అక్కడ తగిలించి ఉన్నాయి. మేము వారికి సంఘీభావం ప్రకటించడానికి వచ్చామని, మహిళా ట్రాన్స్‌జెండర్‌ జేయేసీ నుండి అందరితో కలిసి హైదరాబాద్‌ చాలా కార్యక్రమాలు చేస్తున్నామని మా మద్దతు మీకెప్పుడూ ఉంటుందని చెప్పాము. మా పట్ల అక్కడి మహిళలు వ్యక్తం చేసిన ప్రేమ, అభిమానం మా కళ్ళల్లో నీళ్ళు తెప్పించాయి.
అక్కడ కొంత సమయం గడిపి శిబిరం బయటకొస్తుంటే జి.ఎన్‌ సాయిబాబా గారి సహచరి వసంత కలిసారు. పరస్పరం ఆశ్చర్యపోయి, పల్కరించుకుని మళ్ళీ శిబిరంలోకి తిరిగొచ్చి మరికొంత సేపు గడిపాం. వసంత తన ప్రసంగంలో సాయిబాబాని ఎలా అన్యాయంగా కేసులో ఇరికించి జైల్లో పెట్టారో, వీల్‌ చెయిర్లో జెయిల్లో ఆయన పడుతున్న ఇబ్బందుల గురించి చెప్పినప్పుడు, వింటున్న మహిళల కళ్ళల్లో సన్నటి నీటి పొర చూసాన్నేను. అందరూ ”హం దువా కరేంగే” అంటూ వసంతకు భరోసా ప్రకటించారు. మేము బయలుదేరుతుంటే రేపు కూడా రండి అంటూ పిల్లలు మా వెంట వచ్చారు. తప్పకుండా ప్రయత్నం చేస్తామని చెప్పి ముగ్గురం ఆటోలో నిజాముద్దీన్‌ దర్గాకు బయలుదేరాం. చలి ఈడ్చి కొడుతోంది. గడగడలాడుతూ దర్గా దగ్గర ఆటో దిగాం. మెయిన్‌ రోడ్డు పక్కనే ఉంది ఈ శిబిరం. అడుగు పెట్టలేనంతగా కిటకిటలాడుతోంది. మేము వెళ్ళేసరికి కవ్వాలీ జరుగుతోంది. మహిళలు, పిల్లలు వస్తూనే ఉన్నారు. నిలబడడానికి కూడా జాగా లేకపోవడంతో కొంతమంది మహిళలతో మాట్లాడి బయటకు వచ్చేసాం. చలి విపరీతంగా ఉంది. అక్కడ గుమిగూడిన వారందరికీ చలిని మించిన ఉపద్రవం తమ జీవితాలమీద విరుచుకుపడిందని అర్ధమైంది. వాళ్ళు చలిని జయించారనిపించింది.
30 వ తేదీన గాంధీని హత్య చేసిన రోజున మౌన నిరసన ర్యాలీ చేస్తున్నారని సమాచారం వచ్చింది. అలాగే డిల్లీలోని పలు ప్రాంతాల్లో మానవహారం చేస్తున్నారని కూడా తెలిసింది. కాన్‌ఫరెన్స్‌ హాల్‌కి దగ్గరలోనే ఒక మాల్‌ నుండి కొవ్వుత్తులతో మౌన ప్రదర్శనకి మేము వెళ్ళాం. మేము ప్లే కార్డ్స్‌ పట్టుకుని కొవ్వొత్తులు వెలిగించుకుని మౌనంగా బయలుదేరగానే మా చుట్టూ అక్కడక్కడా నిలబడిన కొంతమంది ఎబివిపి/ బిజెపి కార్యకర్తలు పెద్ద పెట్టున సి ఏ ఏ కి మద్దతుగా నినాదాలిస్తూ మా పక్కనే నడవడం మొదలుపెట్టారు. మేము మౌనంగా నడుస్తున్నాం. వాళ్ళు పెద్దగా మోడీకి , బిజేపీకి అనుకూల నినాదాలతో అరుస్తున్నారు. మా ర్యాలీ నడుస్తూనే ఉంది. మధ్యలో చాలామంది మహిళలు వచ్చి చేరారు. ర్యాలీ చాలా పెద్దగా తయారైంది. మేము నినాదాలు ఇవ్వడంలేదు. వాళ్ళు రెచ్చగొట్టే మాటలంటున్నా మేము పట్టించుకోలేదు. షాహీన్‌బాగ్‌కి వ్యతిరేకంగా నినాదాలిచ్చారు. దేశ ద్రోహులని, అర్బన్‌ నక్సలైట్లని, హిందువులకి వ్యతిరేకులని, పాకిస్తాన్‌ సపోర్టర్స్‌ని నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారు. ఇటు శాంతంగా ఉన్నాం కానీ అటువైపు ఉద్రేకాలు పెరుగుతున్నాయి. పోలీసులు అలర్ట్‌ అయ్యారు. వందల్లో పోలీసులు వచ్చేసారు. మహిళా కానిస్టేబుల్స్‌ వచ్చారు. ఓ పెద్ద తాడును మాకు వాళ్ళకు మధ్యలో పెట్టి మహిళా పోలీసులు మా పక్కనే నడవసాగారు. వాళ్ళు మామీద దాడిచేస్తారేమో అనేంతగా మామీదికి రాబోయారు. కానీ పోలీసులు వాళ్ళని మా వైపు రానియ్యలేదు. దాంతో పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలిచ్చారు. అలాంటి ఉద్రిక్త పరిస్థితుల్లోనే మూడు కిలోమీటర్లు నడిచాం. ఒక స్పోర్ట్‌ కాంప్లెక్స్‌ దగ్గర ఆగాం. అక్కడ చాలామంది గుమిగూడి ఉన్నారు. గాంధీ ఫోటో పెట్టి వైష్ణవజనతో పాటతో మీటింగ్‌ మొదలైంది. అప్పటికే చాలా ఆలస్యమైంది. బాగా అలసిపోయాం.క్యాబ్‌ బుక్‌ చేసుకుని హోటల్‌కి బయలుదేరాం.
ఆనాటి ర్యాలీ లో జరిగిన సంఘటనలు నిరసన ప్రదర్శనలు జరిగే అన్ని చోట్లా మొదలవుతాయోమోనని నాకు అనిపించింది.ఎవరైనా రాళ్ళు లాంటివి విసిరి ర్యాలీని చెదరగొట్టాలనుకుంటే ఏమి జరుగుతుందా అనే భయం కూడా కలిగింది.
31న ప్రశాంతి వేరే పని మీద వెళ్ళిపోయింది. నేను వసంత వాళ్ళింటికి వెళ్లాను. ఇద్దరం కలిసి మరిన్ని నిరసన శిబిరాలకి వెళ్ళాలని ప్లాన్‌ చేసుకున్నాం. వసంత వాళ్ళింటికెళ్ళగానే నాగపూర్‌ జైల్లోఉన్న సాయిబాబా గారు బాగా గుర్తొచ్చారు. వంట చేస్తూనే వసంత సాయిబాబా గారి ఆరోగ్య పరిస్థితి గురించి చెబుతూ ఉన్నారు. ఆయనకి దాదాపు 20 రకాల ఆరోగ్య సమస్యలున్నాయని ఆయన కుడి చేయి సరిగ్గా పనిచేయడం లేదు. రాయలేకపోతున్నారు అని చెబుతూ ప్రపంచవ్యాప్తంగా ఆయనని విడుదల చేయమని ఎంతోమంది ప్రముఖలు రాసిన ఉత్తరాలను చూపించారు. డిల్లీ యూనివర్సిటీలోని క్యార్టర్ని ఖాళీ చేయించారని, అద్దెకు ఇల్లు దొరకడం చాలా కష్టమైందని చెబుతూ, ఇప్పుడుంటున్న ఈ ఇల్లు ఒక రిటైర్డ్‌ ఐఎఎస్‌ ఆఫీసర్‌ ఇచ్చారని, సాయిబాబాగారిని ఆన్యాయంగా జైల్లో పెట్టారని ఆమె నమ్ముతూ తక్కువ అద్దెకు ఈ ఇల్లు ఇచ్చారని చెప్పారు. సాయిబాబా గారికి సగం జీతం వస్తున్నదని, ప్రస్తుతం దానిని కూడా ఆపేయాలనే కుట్ర చేస్తున్నారని బాధపడుతూ చెప్పారు.
సాయిబాబాగారి వీల్‌ చైర్‌ పాడైపోయిందని ఉత్తరం వచ్చింది, కొత్తది కొనాలంటే 25 వేలు అవుతుందని, అది లేకపోతే తనకి చాలా ఇబ్బందని చెప్పినప్పుడు మీరు ఏమీ అనుకోనంటే ఆ వీల్‌ చైర్‌ నేను కొంటానండి. నాకు నెల నెలా పెన్షన్‌ వస్తుంది దాన్ని ఇలాగే ఖర్చు పెడతాను. నిజంగానా అని ఆవిడ ఆశ్చరపోయారు. నిజంగానే మీరు వీల్‌ చైర్‌ కొనేసి బిల్లు నాకు పంపండి నేను ఆన్‌లైన్లో చెల్లించేస్తానని చెప్పాను. లంచ్‌ చేసేసి మేము బయట పడ్డాం. ఆటోలెక్కి, ఈ రిక్షాలెక్కి, మెట్రోలెక్కి మూడు మహిళల నిరసన శిబిరాలకు వెళ్ళాం. శీలంపూర్‌, కేదంపురి, చాంద్‌ బాగ్‌ ప్రాంతాలకు వెళ్ళాం. ఇవన్నీ షాహీన్‌బాగ్‌ స్పూర్తితో అదే పద్దతిలో నడుస్తున్నాయ్‌. మహిళలు,పిల్లలు గొప్ప ఉత్సాహంతో కనబడ్డారు. నినాదాలు, పాటలతో మారుమోగుతున్నాయ్‌. మూడు చోట్ల నేను వసంత వారి పోరాటాలకు మద్దతుగా మాట్లాడాం. వసంత సాయిబాబా గారి గురించి చెప్పగానే అందరూ ఉద్వేగానికి గురయ్యారు. మేము వారి రిలీజ్‌ కోసం ప్రార్ధన చేస్తామని చెప్పారు.
అక్కడికి దగ్గరలోనే మరో మూడు శిబిరాలున్నాయి వెళ్ళండని చెప్పారు కానీ ఆరోజే హైదరబాద్‌కి నా తిరుగు ప్రయాణం. టైం సరిపోదని వాళ్ళతో చెప్పి, వసంతని ఇంట్లో దింపేసి నేను ఎయిర్‌పోర్ట్‌కు బయలుదేరాను. ఉమన్‌ స్టడీస్‌ కాన్‌ఫరెన్స్‌ కోసం వెళ్ళినా అక్కడ హజరైంది తక్కువే. షాహీన్‌బాగ్‌ మహిళలతో సహా వందలాది మహిళల్ని వాళ్ల ఉత్సాహాన్ని, ఉద్వేగాలని చాలా దగ్గరగా చూసి, వాళ్ళ పోరాటంలో మమేకమవ్వడం చాలా స్పూర్తినిచ్చింది. షాహీన్‌బాగ్‌ పోరాటస్థలం నుంచి కొంచం మట్టి తీసుకురా అన్న మితృల కోసం నేలమీదకి వొంగి మట్టిని తీసుకుంటుంటే రాజ్యాంగ ప్రవేశిక చదివినప్పటి పులకరింత మళ్ళీ నా వొళ్ళంతా పాకి గొప్ప ధైర్యాన్నిచ్చింది.జిందాబాద్‌ షాహీన్‌బాగ్‌… జిందాబాద్‌ మహిళల మౌన నిరసన ప్రదర్శన శిబిరాలు…

నా మీద వాలిన ఛాయాదేవి ఛాయ

ఎప్పటిమాట. పచ్చగా, చల్లగా, కుటీరం లాగా ఉండే ఆ ఇంటికి తొలిసారి ఎప్పుడెళ్ళాను. తొలిచూపులోనే ఆవిడతో ప్రేమలో పడిన సంఘటనలో నిజానికి, ఆరోజు ...