Sunday, May 22, 2011

గోరంత దీపం కొండంత ధైర్యం
మధ్యాహ్నం పేపర్లు చదువుతూ యధాలాపంగా టివి వేపు చూస్తే గోరంత దీపం సినిమా వస్తోంది ఏదో చానల్ లో.
ఆ సినిమా చూసినపుడల్లా వాణిశ్రీ నటన అద్భుతమనిపిస్తుంది.
చివరి సీన్లో బాపు సరుగుడు కర్రతో మోహన్ బాబును కొట్టించిన దృశ్యం చాలా స్ఫూర్తిదాయకంగా ఉంటుంది.
రాధా కళ్యాణం లాంటి సినిమాల్లో పరమ సాంప్రదాయంగా కనబడే బాపు గోరంత దీపం లో మాత్రం నీ వేపు కన్నెత్తి చూసేవాడిని నిలువునా చితక్కొట్టు అని చెప్పారు.
అలాగే తొలికోడి కూసింది అనే సినిమాలో కే.బాలచందర్ అత్యాచారం చెయ్యడానికి ఎవడైనా ప్రయత్నిస్తే వాడి మర్మావయవం మీ ఈడ్చి తన్నమని చెప్పాడు.
ఆ సినిమా లో హలం అనుకుంటాను ఒంటరిగా వెళుతూ ఉంటుంది.పోకిరీ వాడొకడు ఆమె వెంట పడతాడు.
ఆమె ఒరేయ్ వద్దురా.నా దగ్గరకు రాకు అంటుంది.కామం తో కళ్ళు మూసుకుపోయి వాడు ఆమెని చెట్టు వెనక్కి లాక్కెళ్ళతాడు.
మరు క్షణమే హమ్మో! అయ్యో! అంటూ రెండు చేతులూ తొడల మధ్య పెట్టుకుని పడుతూ లేస్తూ పరుగులు పెడుతుంటాడు.
ఇద్దరు గొప్ప దర్శకులు మహిళలు ప్రతి నిత్యం ఎదుర్కొనే రెండు సమస్యలకు ఎంత చక్కటి పరిష్కారం చూపించారు.
నీ మీద నీకిష్టం లేకుండా చెయ్యిపడితే తిరగబడ్డమే పరిష్కారం.
నాలుగు తన్ని నిన్ను నువ్వు రక్షించుకోవడమే పరిష్కారం.

హేట్స్ ఆఫ్ టూ బాపూ అండ్ బాలచందర్.

Saturday, May 21, 2011

అమ్మ పేరు పదోతరగతి సర్టిఫికెట్లోకి ఎక్కిందహో!!!!


ఎన్నాళ్ళకెన్నేళ్ళకి!!
అమ్మ పేరు పదోతరగతి సర్టిఫికెట్లోకి ఎక్కిందహో!!!!
అయ్యారే!ఎంత సొగసైన వార్త.
దీనిలో అద్భుతమేమంటే ఈ సంవత్సరం పిల్లలే పట్టుబట్టి తల్లి పేరు రాయించుకున్నారు.
పిల్లలూ మీకు బోలెడన్ని అభినందనలు.
తల్లులూ మీకు పాదాభివందనాలు.

Friday, May 20, 2011

నా స్నేహితుల కోసం ఈ ప్రకటన ఎవరికైనా ఉపయోగపడుతుందేమో!

                                              
స్థిరాస్తులు కొంటున్నారా?


కొనేముందు కొంచం ఆలోచించండి.
భూమి వ్యవహారాల్లో నిపుణుల అభిప్రాయం తీసుకోవాలేమో చూడండి.
ఎందుకంటే
***  మీరు కొనాలనుకుంటున్న భూమికి క్లియర్ టైటిల్ ఉందా?
*** అవి ఎస్సైండ్ భూములేమో??
*** అవి దేవాదాయ ధర్మాదాయ శాఖ వారి భూములేమో??
*** అవి వక్ఫ్ భూములేమో??
*** ప్రభుత్వ భూములేమో???
పైవేవీ కాదనుకుంటే మీకు అమ్మజూపుతున్న వ్యక్తివి అవునో కాదో???
ఒకవేళ ఆ వ్యక్తికే చెందినా ఇంతకు ముందే ఎవరికైనా అమ్మాడేమో???
మీరు కొనదలుచుకున్న భూమి నివాస యోగ్యమో కాదో???
మనం ఒక స్థిరాస్తిని అది ప్లట్ కావొచ్చు,ఫ్లాట్ కవొచ్చు, ఇల్లు కావొచ్చు వాటి చుట్టూ ఎన్నో సమస్యలుండి ఉండొచ్చు.
జీవిత కాలం కష్టపడి సంపాదించిన సొమ్ముతో కొనుక్కున్న ఆస్థులు చిక్కుల్లో పడి కోర్టుల చుట్టూ తిరిగే ప్రమాదం ఎదుర్కోవాలా??
అవసరం లేదు
హాయిగా కొనుక్కోండి
కొనేముందు ఒక్కసారి భూమి విషయాల్లో నైపుణ్యం సాధించిన మా అనుభవాన్ని వినియోగించుకోండి.
ఇంకెందుకు ఆలస్యం
సంప్రదించండి


9441867576

Wednesday, May 18, 2011

పెళ్ళిళ్ళ బజార్లో ఇంకా నిర్లజ్జగా వరవిక్రయాలు.

కాళ్ళకూరు నారాయణ రావు గారు "వరవిక్రయం" నాటకం రాసి దాదాపు 90 ఏళ్ళయ్యింది.
అందులో నాయకురాలు కాళింది.

"కట్నమే కోరివచ్చిన ఖరముతోడ
దగుదునని కాపురము సేయు కంటే
బెండ్లియే మానుకొని మగబిడ్డవలె
తల్లిదండ్రుల కడ నుడుత తప్పిదంబే?"
అంటుంది.

కట్నం కోరే పెళ్ళికొడుకులనూ,కట్నాలకు,లాంచనాలకూ బేరాలాడె పెళ్ళికొడుకు తండ్రులను ఊద్దేశించికాళింది తండ్రి ఇలా అంటాడు.

"....... అబ్బాయి పెండ్లితో నప్పుసప్పులు తీర్చి
నిలవ సేయగ జూచు నీచులార
ముడుపులుగొని తెచ్చి ముంగలనిడుదాక
పల్లకి ఎత్తని పశువువులారా
ఏమి యన్యాయ మిదిపూర్వమెన్నడేని
వరుల నిటు విక్రయించు వారు గలరే??
పుణ్యతరమైన మన పుణ్యభూమి యందు
గటగటా నరమాంస విక్రయయము దగునే!"

బుద్ధి తెచ్చుకున్న కాళింది అక్కను వివాహం చేసుకోవడనికి ముందుకొచ్చిన వరుడు

"కట్నాలకై పుస్తకములు చేగొని  పాఠ
శాలలకేగెడు చవటలారా!పిలిచి కాళ్ళు కడిగి పిల్లనిచ్చిన వారి
కొంపలమ్మించెడి కుమతులారా
అల్క పాంపులెక్కి అవి ఇవి కావలె
నని శివమాడెడి అధములారా
ఎంత పెట్టిన తిని యెప్పటికప్పుడు
నిష్టురోక్తులే పల్కు నీచులారా"

భర్తకి మామగారికి బుద్ధి చెప్పిన కమల కాళింది అక్క

"....... కోరిన వెల ఇచ్చి కొని తెచ్చుకున్న
దాసులకు దాస్యము సేయు సుదతులారా
మీ వివాహములకై మీ వారు రుణముల
పాలౌట గని యోర్చు పడతులారా
ఎంచి చూడగ స్త్రీ జాతి కింత కన్న
గౌరవము లేమి ఇల మరి కలదే?చాలు
జాలు నికనైన పౌరుష జ్ఞానములను
గలిగి మెలగుడు సత్కీర్తి గనుడు"

విజ్ఞులు,మేధావులు,ఆధునికులు, పురుషవాదులు,ఆధునిక,అమానవీయ
వర విక్రయం గురిచి ఎందుకు మాట్లాడరో!!!!!!!
ఆనాడే ఆ మహానుభావుడు నరమాంస విక్రయమని ఈసడించినా
అత్యాధునిక యువకులు తమని తాము వేలకి, లక్షలకి, ఒండొకచోట కోట్ళని తమని తాము సిగ్గు శరం,ఆత్మాభిమానం,ఆత్మగౌరవం లేకుండా అమ్ముకుంటున్నారే???
మమ్మల్ని మేము అమ్ముకోం.మీ అమ్మాయికి మీ అబ్బాయికిచ్చినట్టు ఉనందాంట్లో పంచి ఇవ్వండి.ఉభయులకూ గౌరవంగా ఉంటుంది అని ఎందుకు అనడం లేదు.
ఎందుకు??????????????????????
Monday, May 16, 2011

దిబ్బపాలెం దిబ్బ,గంగవరం గల్లంతు ఆహా!!! ఏమి దైవ భక్తి. శెభ్హాష్.

గంగవరం పోర్ట్ అభివృద్ధి పేరుతో దిబ్బపాలెం,గంగవరం గ్రామాలను నేలమట్టం చేసిన ప్రభుత్వం,ఈనాటికి ఆ రెండు గ్రామాల నిర్వాసితులను రోడ్లమీడదే  బతకమంటూంది.


గంగవరం పోర్ట్ కాంట్రాక్టర్ ఎంత మిగుల్చుకున్నాడో కానీ బెజవాడ దుర్గకి 40 లక్షల విలువైన బంగారు హారం సమర్పించాడంట.

రెండు గ్రామాలకు చెందిన వేలాదిమంది కూడూ,గూడూ కోల్పోయి ఏడుస్తుంటే,ఇస్తామన్న ఉద్యోగాలూ ఇవ్వకుండా కోర్టుల చుట్టూ తిప్పుతుంటే,కాంట్రాక్టర్ గారి ఔదార్యం అబ్బో ఎంత వెగటు పుట్టిస్తుందో!!!!!


Saturday, May 14, 2011

ఇదే నా సరికొత్త ఎజండానిన్న రాత్రి నేనో కల కన్నాను

ఆహా ఏమి ఆ కల,ఎంత అద్భుతమైన కల
నువ్వూ నేనూ పక్క పక్కనే నడుస్తున్నాం
చేతిలొ చెయ్యేసి భుజం భుజం కలిపి
ఆకుపచ్చటి పచ్చిక బయిళ్ళ మీద
నేనొక అడుగు ముందుకెయ్య లేదు
నువ్వొక అడుగు ముందుకెయ్యలేదు
సమానంగా అడుగుల లయలో
ఏకబిగిన నడుస్తున్నాం
ఏవేవో అడ్డంకులులు ఎవరెవరివో ఆర్తనాదాలు
సూట్కేసుల్లోంచి బట్టల్ని కుమ్మరించినట్టు
ఆడపిల్లల శవాల దృశ్యాలు
హాయిగా ఆడుకునే పసిపిల్లల మీద
మగమౄగాల దాడులు
చదువుకునే చోట చీడపురుగుల చీదర
ఇంటిబయట ఎంతటి అభద్రతో
ఇంటి నాలుగ్గోడల మధ్య అంతే అభద్రత
నువ్వూ నేనూ చేతిలో చెయ్యేసి
నడుస్తున్నాం కదా
మన మధ్య ఇటీవలి కాలంలో
ఇంత సయోధ్య ఎలా కుదిరిందో
ఇంత ప్రజాస్వామిక వాతావరణం
ఎలా సంభవించిందో
మన మాటల్లోనే దొర్లుతోంది
హింస లేని జీవితమంటే
ఇంటా బయటా ప్రజాస్వామిక సంబంధాలుండాలంటే
అన్నింటా సమాత్వం నెలకొల్పాలంటే
అది నువ్వూ నేనూ కలిసి సాధించాల్సిందే
నన్నొదిలేసి నువ్వెళ్ళిపోయినా
నిన్నొదిలేసి నేనెళ్ళిపోయినా
మనం ఒంటరి దీవులమే అవుతాం
ఎవరికి వారౌ స్వార్ధపరులమే అవుతాం
మనం పక్క పక్కనే నడుస్తూ
ఎన్ని కలలు కంటున్నాం
ఎన్ని కొత్త ఆలోచనలు చెస్తున్నాం
అన్నింటా సమానత్వం అని నేనంటుంటే
నువ్వు సై అనడం
అబ్బో నీ మీద నా కెంత ప్రేమని
నువ్వింత మారాక నాతో సై అన్నాక
అంతా జాంతా నై అనేచోట
నువ్వింత ప్రజాస్వామికంగా మారి
పురుషస్వామ్యం పడగ మీద కొట్టాకా
నిన్ను ప్రాణప్రదంగా ప్రేమించడమే నా పని
ఆడపిల్లలక్కూడా అన్నింటిలో
ఇంటిలో, పొలంలో,ఫ్యాక్టరీలో
ఒక్కటేమిటి స్థిర చర వనరుల్లో
సగభాగమివ్వడడమే
అన్ని రకాల హింసలకు చెల్లు చీటి
అని నువ్వంటుంటే నా చెవుల్ని
నేనే నమ్మలేకపోయాను
నీ  మాటే నా మాట కదా 
పద పోదం దండోరా వెయ్యడానికి
నువ్వు నేను కలిసి సంపాదించిన అన్నింటిలోను
అన్ని వనరుల్లో సమాన వాటా
అన్ని రిజిస్ట్రేషన్లల్లో అన్ని లావాదేవీల్లోనూ
మనిద్దరి పేర్లూ ఉండాల్సిందే
ఇదే మన కొత్త నినాదం
ఇదే మన సరికొత్త ఎజండా

Thursday, May 12, 2011

గినీ పిగ్ లౌతున్న గిరిజన బాలికలునేను 2010 జూలై లో ఈ వ్యాసం రాసాను.

దానికి సంబంధించిన ఎంక్వైరి రిపొర్ట్ వచ్చింది.
చాలా అమానుష,అనైతిక పద్ధతులకు పాల్పడ్డారో ఈ లింక్స్ లో చూడండి.
http://www.thehindu.com/news/national/article2012444.ece
http://www.hardnewsmedia.com/2011/05/3964
ఇటీవల ఖమ్మం జిల్లాలోని గిరిజన ప్రాంతాల్లో నలుగురు గిరిజన బాలికలు మరణించారు. ఈ మరణాలు సహజంగా సంభవించినవి కావు. హ్యూమన్‌ పాపిల్లోమా వైరస్‌ (హెచ్‌.పి.వి) వాక్సిన్‌ తీసుకోవడంవల్ల ఈ మరణాలు సంభవించాయన్న విషయం బయట ప్రపంచానికి తెలిసింది. అసలు ఈ హెచ్‌.పి.వి వైరస్‌ వాక్సిన్‌ని ఈ పిల్లలకి ఎందుకిచ్చారు? ఎవరికిచ్చారు? ఎలా ఇచ్చారు? ఈ ప్రశ్నలన్నింటి గురించి కూలంకషంగా ఆలోచిస్తే, తీగ లాగితే డొంకంతా కదిలింది. చిన్న తీగ అనుకున్నది కాస్తా చాలా పెద్దదిగా, డొంక కాస్తా కాలసర్పాలు తిరిగే కారడవిలాగా తయారై, వాటి వివరాలు చదువుతూంటే, అర్థం చేసుకుంటూంటే వెన్నులోంచి నాగుపాము జర జరా పాకిన విభ్రాంతి కలిగింది.
వివరాల్లోకి వెళితే ”పాత్‌ ఇంటర్నేషనల్‌’ అనే అంతర్జాతీయ మందులకంపెనీ,
మరియు ఆయా రాష్ట్రాల సంయుక్త ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్‌లో ఖమ్మం జిల్లాలోను, గుజరాత్‌లోని కొన్ని ప్రాంతాల్లోను హెచ్‌.పి.వి వాక్సినేషన్‌ కార్యక్రమం ప్రారంభించాయి. ఈ కార్యక్రమం మొదలయ్యాక ఖమ్మంలోని ఏజన్సీ ప్రాంతంలో నలుగురు ఆడపిల్లలు మృత్యువాత పడ్డారు. హెచ్‌.పి.వి వాక్సిన్‌ వేసిన తరువాత తీవ్రమైన సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఏర్పడి ఈ పిల్లలు చనిపోయారు.
ఈ విషాద సంఘటన జరిగిన తర్వాత దాదాపు 50 సంఘాలు- వీళ్ళల్లో ప్రజారోగ్య రంగంలో పనిచేసే నిపుణులు, హెల్త్‌ నెట్‌వర్క్స్‌, వైద్య నిపుణులు, మానవ హక్కుల కార్యకర్తలు, మహిళా సంఘాలకు చెందినవారున్నారు. వీరంతా ఈ అంశమై గళమెత్తారు. ఈ వాక్సీన్‌ భద్రత గురించి, ఈ ప్రాజెక్టు అమలు తీరు గురించి ప్రభుత్వానికి మెమొరాండంలు సమర్పించారు. ఖమ్మం జిల్లాలో ఎక్కడైతే (14,000) పధ్నాలుగు వేలమంది ఆడపిల్లలకి హెచ్‌.పి.వి వాక్సిన్‌ వేసారో ఆ అన్ని ప్రాంతాల్లోను స్థానిక సంఘాలవారు నిజ నిర్ధారణ చేసినపుడు చాలా భయానకమైన వివరాలు వెలుగులోకొచ్చాయి. ఎంత అమానవీయంగా, ఎంత నిర్లక్ష్యంగా ఈ వాక్సిన్‌లు ఈ అమాయక, గిరిజన ఆడపిల్లలకి వేసారో అర్ధమై కడుపు రగిలిపోయింది. ఈ పిల్లలంతా 10-14 సంవత్సరాల వయస్సులో వున్నవారు. వీరందరికీ మూడు డోసులు హెచ్‌.పి.వి వాక్సిన్‌ వేసేసారు. వీరిలో చాలామంది పిల్లలు తీవ్రమైన కడుపునొప్పి, తలనొప్పి, మూడ్స్‌లో మార్పులు, ముందుగానే ముట్లు రావడం, తీవ్ర రక్తస్రావం, మెన్స్‌స్‌ సమయంలో క్రాంప్స్‌ రావడంలాంటి సైడ్‌ ఎఫెక్ట్స్‌కు గురయ్యారు. నలుగురు ఆడపిల్లలు ఏకంగా చనిపోవడమే జరిగింది.
ఈ వాక్సిన్‌ వేసేటపుడు ఈ పిల్లలకి చెప్పినదేమిటంటే, దీన్ని వేయించుకోవడంవల్ల మీకు ఎప్పటికీ గర్భాశయముఖద్వార కాన్సరు రాదు అని మభ్యపెట్టడం. అయితే ఫార్మాస్యూటికల్‌ కంపెనీలవాళ్ళు మాత్రం హెచ్‌.పి.వి వాక్సిన్‌లు వేయించుకోవడంవల్ల హెచ్‌.పి.వి వైరస్‌ ఇన్‌ఫెక్షన్‌ నుంచి రక్షణ మాత్రమే దొరుకుతుందని చెబుతున్నారు. గర్భాశయ ముఖద్వార కాన్సరు లాంటి భయంకరవ్యాధి గురించి వీళ్ళని మభ్యపెట్టడం చాలా అమానుషమైన విషయం. నిజానికి ఈ వాక్సిన్‌ ప్రభావం 3-5 సంవత్సరాలకు మాత్రమే ఉంటుందనేది ఇప్పటికే అభివృద్ధి చెందని దేశాల్లో నిర్ధారణ అయ్యింది. ఈ వాక్సిన్‌ నిజ స్వభావం, ఎలా పనిచేస్తుంది. దేనికి రక్షణనిస్తుంది, దీనివల్ల వచ్చే దుష్ఫ్రభావాలేంటి, తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి లాంటివేవీ వివరించకుండా, ఎలాంటి ముందస్తు ప్రణాళిక లేకుండా అమాయక గిరిజన ప్రాంతాల బాలికల మీద దీన్ని ప్రయోగించడం ఎంత అన్యాయమో, అనైతికమో అందరం అర్థం చేసుకోవాలి.
పధ్నాలుగు వేలమంది ఆడపిల్లల్ని ఎంపిక చేసిన విధానం, వారి ”అంగీకారం” తీసుకున్న పద్ధతి చాలా అనుమానాస్పదమైంది. ఈ ప్రాజెక్టు అమలు కోసం, కావలసిన ఆడపిల్లల ఎంపిక కోసం ఆశ్రమ పాఠశాలల్ని ఎంచుకుని, కనీసం వారి తల్లిదండ్రులకి తెలపకుండా హాస్టల్‌ వార్డెన్‌/ఇంఛార్జి టీచర్‌ నోటిమాటనే అంగీకారంగా తీసుకున్నారు. బయట నుంచి పాఠశాలకొచ్చే పిల్లల తల్లిదండ్రుల నుంచి ”అంగీకార పత్రం” మీద సంతకాలో, వేలి ముద్రలో తీసుకున్నారు. ఈ అంగీకార పత్రంలో కనీసం ఈ వాక్సిన్‌ ఏమిటనిగానీ తీసుకుంటే ఏ ఇబ్బందులు వస్తాయి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే సమాచారం లేదు. ఒక హాస్టల్‌లో ఒక వార్డెన్‌ ఈ వాక్సిన్‌ ప్రక్రియని వ్యతిరేకిస్తే, ఇది ”మాండేటరీ” అంటూ ఆమె నోరు నొక్కేసారు. ఇంత అనైతికంగా, అమానవీయంగా ”అంగీకారం” పొందిన విదేశీ కంపెనీలు పధ్నాలుగు వేల మంది ఆడపిల్లలకి ఈ వాక్సిన్‌లు వేసాయి. ఈ ప్రక్రియ అంతా ‘ఎన్‌ఆర్‌హెచ్‌ఎం’ బ్యానర్‌ కింద జరగడం మరింత షాక్‌ని కల్గిస్తోంది.భద్రాచలం గిరిజన ప్రాంతాల్లో వైద్య సదుపాయాల పరిస్థితి దయనీయంగా వుంటుంది. ఆ ప్రాంతంలో ఒక్క గైనకాలజిస్టు లేదంటే అతిశయోక్తి కాదు. గైనకాలజిస్టు ఆధ్వర్యంలో జరిగే ” పాప్‌స్మియర్‌” పరీక్ష వెసులుబాటు లేకుండానే (హెచ్‌.పి.వి వాక్సిన్‌ వేయించుకున్న వాళ్ళకి ఇది చాలా ముఖ్యమైన పరీక్ష) ఈ వాక్సిన్‌లు వేయడం ఎంత భయంకర నిర్లక్ష్యమో అర్థ్ధం చేసుకోవాలి. ఈ ప్రాజెక్టును అమలు చేస్తున్న విదేశీ కంపెనీ ‘పాత్‌’కి బిల్‌ అండ్‌ మెలిందా గేట్స్‌ పౌండేషన్‌ ఫండింగు ఇస్తోంది. లాభాల వేటలోనే విదేశీ కంపెనీలు పనిచేసినా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వీటికి వత్తాసు పలకడం, పర్మిషన్స్‌ ఇవ్వడం చాలా దారుణమైన అంశం. ”యూనివర్సల్‌ ఇమ్యూనైజేషన్‌” పేరుతో ఇవి జరగడం ప్రజల్ని భ్రమపెట్టడమే.
నలుగురు గిరిజన బాలికల బలిదానం జరిగాకైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి, హెచ్‌.పి.వి. వాక్సిన్‌ భద్రత గురించి, పర్యవసానాల గురించి, ఈ కార్యక్రమం కోసం జరిగిన ఒప్పందాల గురించి ప్రజలకి తెలియచెయ్యాలి. అభివృద్ధికి నోచుకోని, అన్నెంపున్నెం ఎరుగని అమాయక గిరిజన ప్రాంతాల ఎంపికలోనే దారుణమైన మోసం దాగుంది. ”అంగీకారం పత్రం”లోనే ద్రోహం వుంది. ఈ మొత్తం వ్యవహారం మీద సమగ్ర దర్యాప్తు జరిపించి నిజానిజాలు వెల్లడించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద వుంది. పిల్లల్ని కోల్పోయిన తల్లిదండ్రులకి నష్టపరిహారం ఇవ్వాల్సిన నైతిక బాధ్యత కూడా వుంది. భవిష్యత్తులో ఇలాంటి ప్రాజెక్టులు చేపట్టేటపుడు ప్రజలకు వివరించి, వారి సంపూర్ణ అంగీకారంతోనే చెయ్యాలిగాని రహాస్యంగా, గుట్టు చప్పుడుకాకుండా మారుమూల గిరిజన ప్రాంతాల్లో మొదలుపెట్టడం అన్యాయం, అమానుషం, అనైతికం.

Friday, July 2, 2010

Sunday, May 8, 2011

ప్రకృతి, నా తల్లి వేరు వేరు కాదు నాకు

మా అమ్మ పేరు కాశీ అన్నపూర్ణ.అమ్మ పుట్టినపుడు వాళ్ళ తాత గారు కాబోలు కాశీ వెళ్ళేరట.అందుకని అలా పేరు పెట్టేరు.అమ్మకి ఒక అక్క..ఇద్దరు చెల్లెళ్ళు.వాళ్ళ నాన్నని (మా తాతయ్యని)బాబాయి అని పిలిచేది. వాళ్ళ బాబాయి గురించి చాలా చెప్పేది. గ్రామాల్లో భూస్వాములు ఎలా ప్రవర్తిస్తారో అలాగే ప్రవర్తించేవాడాయన.గుర్రం మీద తిరుగుతూ,కనిపించిన ఆడపిల్లనల్లా చెరబడుతూ ,తింటూ, తాగుతూ వుండేవాడట.మేము చూళ్ళేదు కాని అమ్మ చెప్పేది.


అమ్మకి తన పుట్టిల్లంటే ఎంతో ప్రేమ.మా అమ్మమ్మ, తాతయ్య అరాచకాలలకి,అక్రుత్యాలకి నిలువెత్తు నిదర్శనంలా ఉండేదట. చెప్పుకోలేని వ్యాధేదో ఆమెని పట్టి పీడించేదని,దానితోనే ఆమె చనిపోయిందని అమ్మ బాధ పడేది. అమ్మమ్మ చనిపోవడంతో ఇద్దరి చెల్లెళ్ళ బాధ్యత అమ్మ మీదే పడింది.వాళ్ళ పెళ్ళిళ్ళు, పురుళ్ళు తనే చూసింది.దాయాదుల పంచన ఉంటూ,తల్లిని, తండ్రిని కోల్పోయి,ఆస్తులు చేజారిపోయి అమ్మ అష్ట కష్టాలు పడిందని,అయినా తనకు పుట్టిల్లంటే,దాయాదుల పిల్లలంటే చాలా ఇష్టమని అక్క అంటుంది.

నేను పుట్టిన పది రోజులకి మా అమ్మమ్మ చనిపోయిందట.అమ్మ నన్ను మా పెద్దక్కకి వదిలేసి వెళ్ళిపోయింది.నెను ఎలక పిల్లలాగా ఇవాళొ రేపో పోతానన్నట్టు ఉండేదాన్నట.ఓ చింపిరి చాప మీద దొర్లుతూ ఉండేదాన్నట.అక్కకి తీరికైనపుడు కొన్ని పాలు తాగించేదట.

మా అమ్మ ఓ పెద్ద ఉమ్మడి కుటుంబంలో చాకిరీ యంత్రంలా పనిచేసిది.మా తాత(మా నన్న నాన్న)కి ఏడుగురు కొడుకులు,ఇద్దరు కూతుళ్ళు.నాకు ఊహ తెలిసేటప్పటివరకు అందరూ కలిసే ఉండేవార్ళ్ళు.ఈంట్లోని ఆడవాళ్ళు పూటకి ఏభై మందికి వండి పోసేవాళ్ళట.ముందు మగవాళ్ళు,తర్వాత పిల్లలు తిన్నాక ఏమైనా మిగిలి ఉంటేనే ఆడవాళ్ళకి.చాలా సార్లు గంజి నీళ్ళే ఉండేవని అమ్మ అంటూ ఉండేది.అమ్మ కన్నా ఉమ్మడి కుటుంబంలోని బాధలు,కష్టాలు పెద్దక్క ఎక్కువ అనుభవించింది.చెళ్ళెళ్ళ బధ్యతల వల్ల అమ్మ ఎక్కువగా పుట్టింట్లో ఉండేదట.

మా పెద్దాక్క అమ్మని చాలా జాగ్రత్తగా చూసుకునేది.మా తాత వంట వస్తువుల్ని తూకం ప్రకారం ఇవ్వడం వల్ల చివరగా తినే ఆడవాళ్ళకి చాలా సార్లు ఏమీ ఉండేది కాదు.ఆడవాల్లు తిన్నరా లేదా అని ఎవరికి పట్టేది కాదట.మా అక్క వళ్ళని వీళ్ళని అడిగి ఏవేవో తెచ్చి అమ్మకి పెట్టేదట.అమ్మ తోడికోడళ్ళు ఆరుగురు.అందులో కొందరు అమ్మతో తగవులు పడేవారట.అమ్మకి తగవులంటే భయం.గొడవలంటే భయం.తగవులు మొదలైతే భయపడి ఇంట్లోకి వెళ్ళిపోయి తలుపు గడియ పెట్టుకునేదట.

అమ్మ ఎన్నో ఆలోచనలు చేస్తూ ఉండేది.

తనకి మంచి మంచి రంగుల చీరలన్నా, నగలన్నా ఎంతో ఇష్టం.మాచింగ్ జాకెట్టు లేకుండా చీర కట్టేది కాదు.శరీరం పట్ల ఎంతో స్రద్ధ.అన్నీ శుభ్రంగా, శుచిగా ఉండాలి.ఆవిడ తినే పళ్ళెం,తాగే గ్లాసు ఎవరూ ముట్టుకోకూడదు.తను ఉండే చొటునల్లా అవన్ని ప్రత్యేకంగా పెట్టే వాళ్ళం.అమ్మ తనని తాను ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా భావించుకొనేది.తన జీవిత విధానమంతా చాలా డిఫరెంట్ అనుకునేది.శరీరం మీద చిన్న ముడత కనబడినా "చూడవే ఈముడత అసహ్యంగా" అని బాధపడిపోయేది.అమ్మా!నీ వయస్సుకి వస్తాయమ్మా అంటే,ఏమోనే చిరాగ్గా ఉంది చూడ్డానికి అనేది.ఎనభై సంవత్సరాల వయస్సులో కూడా జుట్టు పట్ల ఎంతో శ్రద్ధ.తానే ఓ హెర్బల్ ఆయిల్ తయారు చేసుకుని తలకి పట్టించేది.ఆశ్చర్యంగా నిగనిగలాడుతూ జుట్టు మొలుచుకొచ్చింది.ఆ ఆయిల్ నన్ను పెట్టుకోమని సతాయించేది.నీకు దేనిపట్ల స్రద్ధ లేదని తిట్టేది నన్ను.చివరి దశలో ఆరోగ్యం బగోకుండా మంచం మీద ఉన్నపుడ్ కూడా తని చూడడానికి వచ్చే వాళ్ళకి ఆ హెర్బల్ ఆయిల్ ఎలా తయారు చేసుకోవాలో చెబుతుండేది.

అమ్మకి చివరి స్నానం చేయించిన రోజున వీపంతా పరుచుకున్న నల్లని జుట్టు అందరినీ ఆస్చర్యంలో ముంచేసింది.జీవితం పట్ట్ల తన ప్రేమకి నిదర్శనంలా

నిగనిగలాడుతూ పరుచుకున్న తన ఉంగరాల జుట్టు కన్నీళ్ళ మధ్య నాకీనాటికీ కనిపిస్తూనే ఉంటుంది.

తనకి అరవై సంవత్సరాలపుడె బిపి, షుగర్ మొదలైనాయి.ఎంతో శ్రద్ధగా మందులు వేసుకునేది.2000 లో అమ్మ ఒకసారి చాలా సీరియస్ గా జుబ్బు పడింది.అడుగు తీసి అడుగు వెయ్యలేకపోయింది.మేమిద్దరం చెరో రెక్క పట్టుకుని బాత్రూముకి తీసుకెళ్ళేవాళ్ళం.తనని ఆసుపత్రికి తీసుకెళ్ళడానికి కుర్చీలో కూర్చోబెట్టి మేడ మెట్ట్లు దింపుతుంటే నా సహచరుదు ఒక్కసారిగా భోరుమని ఏడ్వడం నాకింకా గుర్తు. ఈమె ఇంక ఇంటికి తిరిగొస్తుందా అంటూ ఏడ్చాడు.లక్కీగా అమ్మ ఆ గండం నుంచి బయటపడి మామూలు మనిషైంది.అమ్మ మా ఇద్దరి జీవితాల్లోను ఒక భాగమైపోయింది.అమ్మ సీరియసుగా జబ్బుపడినపుడే అన్నయ్యను ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేయించాము.కాని తను ఎప్పుడు మా దగ్గర ఉండడానికే ఇష్టపడేది.ఎపుడైనా ఎక్కడికైనా వెళ్ళినా తిరిగి మా దగ్గరికే వచ్చేసేది.

2005 లో నర్సాపురంలో నేను చదువుకున్న కాలేజి వాళ్ళు ఏదో ఫంక్షంకి నన్ను పిలిచారు.నేనూ వస్తానంటూ అమ్మ నాతో బయలుదేరింది.ప్రోగ్రాం అయిపోయాక నేను వచ్చేసాను.తను తమ్ముడి దగ్గర కొన్ని రోజులు ఉండి వస్తానని చెప్పింది.ఆ తర్వాత రెందు రోజులకి బాత్రూంలో పడిపోయిందని తమ్ముడు ఫోన్ చేసి చెబితే నా గుండె గుభేలుమంది. ఈ వయస్సులో పడితే తిరిగి లేస్తారా? లేవనే లేదు.

కొంచం కోలుకున్నాక హైదరాబాదు తీసుకొచ్చేసాము.మా ఇంట్లోకి

రాగానే ఇపుడు నాకేం ఫర్వాలేదు అంది. కానీ బాగాలేదు.

ఒక రాత్రి ఆయాసంతో ఉక్కిరిబిక్కిరి అయిపోతుంటే నింస్కి తీసుకిళ్ళిపోయాం. చాలా సీరియస్ కండిషన్లో పదిహేను రోజులు నింస్లో ఉంది.రోజుకొకలాగా ఉండేది.ఒకరోజు నవ్వుతూ కబుర్లు చెప్పేది.మరో రోజు కోమాలో ఉండేది.మెలుకువ వస్తే కాఫీ కాఫీ అంటూ కలవరించేది.కాఫీ అంటే మహ ప్రాణం అమ్మకి.మే 14 రాత్రి అమ్మ నన్ను విడిచి శాశ్వతంగా వెళ్ళిపోయింది.ఆ పదిహేను రోజులూ నాకు బయట ప్రపంచంతో సంబంధం తెగిపోయింది.ఇల్లు,ఆసుపత్రి. అంతే.

అమ్మ కళ్ళను దానం చేసితన పార్ధివ శరీరానీ అంబులెన్సులో ఎక్కించుకుని,తనకెతో ఇష్టమైన మాఇంటికి తెచ్చి,తర్వాత మాఊరు సీతారామపురం బయలుదేరి వెళ్ళాం.అదే రోజు మా పొలాల్లో అమ్మ అంత్యక్రియలు జరిగాయి.

అమ్మతో నా అనుబంధం గురించి నేను అక్షరాల్లో రాయలేను.అది ఆత్మిక బంధం.నాకు తన తల్లి పేరు పెట్టుకుంది కాబట్టి నన్ను అమ్మాజీ అని పిలిచేది.తన నోట్లో నా పేరే నానుతుండేది.ముప్ఫై ఏళ్ళు నాతో ఉంది.నువ్వు నా కూతురి కాదు నా తల్లివి అనేది.తనని కంటికి రెప్పలా చూసుకున్నాను.తనకి ఏ లోటూ రానివ్వలేదు.తనకి ఏ కష్టం కలగనివ్వలేదు అనే త్రుప్తి చాలు నాకు.

నా మీద అమ్మ నాన్నల ప్రభావం అపారం.వాళ్ళు నన్ను పెంచిన తీరు అపూర్వం.అందుకే నా కధల సంపుటిని వాళ్ళకే అంకితమిస్తూ"చెట్టు మీద పిట్టల్లే నన్ను పెంచిన అమ్మా నాన్నలకి" అని రాసాను.నాలాగే అమ్మకి బోలెడుమంది స్నేహితులు.

అమ్మతో అలరారిన బాల్యస్మ్రుతులేవీ నాకు లేకపోయినా,నా ఎదుగుదలలోని ప్రతి మలుపులోనూ అమ్మ అభయ హస్తం నాతోనే ఉంది.నేను రచయిత్రిగా,జర్నలిష్టుగా, కార్యకర్తగా అనూహ్యమైన ఎత్తుకి ఎదగడం వెనక నా తల్లి శ్రమ స్పష్టంగా కనపడుతుంది.నా ఇంటిని, నా వంటిటి శ్రమని తనమీదేసుకుని నన్ను ఓ స్వేచ్చా విహగంలా ఆకాశంలోకి ఎగరేసింది.నేను ఆకాశంలో ఎగురుతున్నా నేల మీదున్న నా తల్లిని ఏ రోజూ నిర్లక్ష్యం చెయ్యలేదు.తనని అరచేతుల్లో పెట్టుకుని అపురూపంగా చూసుకున్నను.తనకి కొడుకులున్నా అమ్మ కి నాతో ఉండడమే ఇష్టం.నేనూ అమ్మ బాధ్యతని ఆనందంగా నా మీద వేసుకున్నాను.తనకి ఏ కష్టం కల్గకుండా ఓ గౌరవప్రదమైన జీవితాన్ని ఇవ్వగలిగాను.ఒక ప్రత్యేక వ్యక్తిలా ఎలా బతికిందో అంతే హుందాగా,గౌరవంగా వెళ్ళిపోయింది.తన సేవాభావాన్ని పుణికి పుచ్చుకున్న నేను అమ్మ పేరు మీద మా ఊళ్ళో స్త్రీల కోసం ఒక సంస్థను స్థాపించాను.మా అమ్మను ఎంత ప్రేమిస్తానో మా ఊరిని అంతే ప్రేమిస్తాను.నా ద్రుష్టిలో రెండూ వేరు వేరు కాదు.కన్న తల్లి లాంటిదే పుట్టినూరు కూడా.

అమ్మ భౌతికంగా మా నుంచి దూరమైంది ఈరోజే.అయితే అమ్మ మా హ్రుదయాల్లోంచి ఎక్కడకూ వెళ్ళలేదు.అమ్మజీ అంటూ నన్ను పిలుస్తూ నా చుట్టూ గాలిలో,నేను పెంచే చెట్లలో,నేను ప్రేమించే వెన్నెలలో,సూర్యోదయ సూర్యాస్తమయాల్లో ఒక్టేమిటి నన్ను అలరించే,నన్ను పులకింపచేసే సమస్త ప్రకృతి మాతలో నా తల్లి ప్రతిరూపమే కనిపిస్తుంది నాకు.ప్రక్రుతి, నా తల్లి వేరు వేరు కాదు నాకు. ప్రకృతి ఉన్నంతకాలం,నేను ప్రకృతికి సమీపంగా ఉన్నంత కాలం నా తల్లి స్మ్రుతి సజీవంగా నాలో దీపంలాగా వెలుగుతూంటుంది. నాకు దిశానిర్దేశం చేస్తూనే ఉంటుంది.

Wednesday, May 4, 2011

హింసించే పురుషులూ జరభద్రం-గులాబీదండు వచ్చేస్తోంది.ఒక జాతీయ స్థాయి సమావేశంలో పాల్గొడానికి నేను ఇటీవల లక్నో వెళ్ళాను. నవాబీ సంస్కృతి అడుగడుగునా కన్పించే లక్నో గురించి నేను విన్నది వేరు. కన్నది వేరు.

ఎయిర్‌పోర్ట్‌ నుంచి సిటీలోకి వస్తూంటే కిలోమీటర్ల మేర నిర్మితమౌతున్న మెగా పార్కుల్ని చూసి టాక్సీ డ్రైవర్‌ని ”బయ్యా! ఏ క్యాహై” అని అడిగితే ‘మాయనగర్‌. మాయావతి నిర్మిస్తున్న కాన్షిరామ్‌పార్క్‌, అంబేద్కర్‌పార్క్‌’ అని ఒక ఛీత్కారపు గొంతుతో అన్నాడు. ”ఆమె జనం కోసం చేసిందేమీ లేదు. విగ్రహాలు పెట్టడం, వాటిని కూల్చడం మళ్ళీ పెట్టడం ఇదే పని” అన్నాడు కోపంగా. దారి పొడుగునా పెద్ద పెద్ద హోర్డింగులు. మాయావతి ఫోటోలు. మాయావతి విగ్రహాలు.

టాక్సీడ్రెవర్‌ చెప్పినట్టు ఇది లక్నోనా? మాయనగరా? అన్పించింది. నాకు ఆసక్తి కల్గించింది ముఖ్యమంత్రి మాయావతి మహా ప్రచార హోరు కాదు. మరెవరు? నేను ఉత్తర్‌ ప్రదేశ్‌ వెళితే తప్పకుండా కలవాలనుకున్న వ్యక్తి సంపత్‌పాల్‌ దేవి. లక్నో నుండి సమావేశంలో పాల్గోన్న మహిళల్ని అడిగాను. సంపత్‌పాల్‌ని కలిసే అవకాశముందా? అని. ఆమెని ఈ రెండు రోజుల్లో కలవడం కష్టమని ఆమె బుందేల్‌ఖండ్‌ జిల్లాలో వుంటుందని చెప్పినపుడు అయ్యో! అన్పించింది.

ఎవరీ సంపత్‌పాల్‌ దేవి? ఏం చేసిందని నాకింత ఆసక్తి ఏర్పడింది ఆమె పట్ల? భారతదేశంలోని అతిపేద జిల్లాల్లో ఒకటైన బుందేల్‌ఖండ్‌ జిల్లాలో పుట్టింది సంపత్‌. పన్నెండేళ్ళ వయస్సుకే ఐస్‌ క్రీమ్‌లమ్ముకునే వ్యక్తితో ఆమె పెళ్ళి జరిగింది. ఐదుగురు పిల్లల తల్లి. ప్రస్తుతం ఆమె వయస్సు నలభై ఒకటి. తిరుగబడే లక్షణాలు ఆమె రక్తంలోనే వున్నాయి. చిన్నపుడు తల్లిదండ్రులు ఆమెను పాఠశాలకు పంపడానికి తిరస్కరించినపుడు ఆమె గ్రామంలోని గోడలమీద, దుమ్మునిండిన రోడ్ల మీద రాస్తూ తన నిరసనని తెలియచెప్పింది. చేసేదేమీ లేక ఆమె గొడవ భరించలేక స్కూల్‌కి పంపారు. అయితే పన్నెండేళ్ళకే పెళ్ళి చేసి, భర్త ఇంటికి పంపేసారు. 13 సంవత్సరాలకే మొదటి బిడ్డకు తల్లయింది సంపత్‌.

కొన్నేళ్ళకి ప్రభుత్వ ఆరోగ్య కార్యకర్తగా ఉద్యోగంలో చేరింది కానీ ఆ ఉద్యోగం ఆమెకు తృఫ్తి నియ్యలేదు. ”నా కోసమే బతకాలని నాకు లేదు. ప్రజల కోసం పని చెయ్యాలని కోరిక” అంటుంది సంపత్‌పాల్‌. గ్రామంలోని స్త్రీలను ఐక్యపరిచి మీటింగ్‌లు పెట్టేది. భర్తల దౌర్జనాలకు గురై ఇళ్ళనుండి వెళ్ళగొట్టబడిన స్త్రీలు, భర్తలు రెండో పెళ్ళిళ్ళు చేసుకుని భార్యల్ని నిర్లక్ష్యం చేసి కేసులు, ఎందరో బాధిత స్త్రీలు ఈమె దగ్గరకు వచ్చేవారు. వీరందరి కోసం ఏమైనా చెయ్యాలని ఆలోచించిన సంపత్‌ ”గులాబీ గ్యాంగ్‌” కు రూపకల్పన చేసింది.

2006లో గులాబీ గ్యాంగ్‌, సంపత్‌పాల్‌దేవి ఆ గ్యాంగ్‌ లీడర్‌గా ప్రారంభమైంది. గృహహింసను ఎదుర్కొంటున్న మహిళల్ని ఆదుకోవడానికి, తప్పుచేసిన భర్తల్ని నయనా భయానా సరిదిద్దడానికి ఈ గ్యాంగ్‌ పనిచేస్తుంది. ప్రస్తుతం గులాబీగ్యాంగ్‌లో 20,000పైగా మంది సభ్యులుగా వున్నారు. ఏ ఇంట్లో నయినా హింస జరుగుతున్నట్టు తెలిసిన వెంటనే గ్యాంగ్‌ సభ్యులు ఆ ఇంటికి వెళతారు. భార్యల్ని కొట్టే భర్తల్ని కలిసి, ఇకపై కొట్టరాదని హెచ్చరిస్తారు. భర్త వీళ్ళ మాట విన్నాడా సరే లేకపోతే పెద్ద పెద్ద వెదురు బొంగుల్ని తీసుకుని ఆ ఇంటికెళ్ళి నాలుగు దెబ్బలు తగిలించైనా దారికి తెస్తారు. ”నేను ఒక కర్రతో గ్రామంలో తిరుగుంటే మగవాళ్ళు భయపడతారు. వాళ్ళను భయపెట్టడానికే మేం కర్రలుపయోగిస్తాం. మేము ఎపుడూ ఇలాగే చేయం కానీ నా చేతిలోని కర్రహింసలకి దిగే పురుషుల మైండ్‌సెట్‌ని ఖచ్చితంగా మారుస్తుంది. నేను బలవంతుణ్ణి అని విర్రవీగే పురుషుడు మా కర్రకి తలవొంచాల్సిందే” అంటుంది సంపత్‌పాల్‌దేవి.

గులాబీ గ్యాంగ్‌ సభ్యుల సంఖ్య అనూహ్యంగా పెరుగుతోంది. సంపత్‌పాల్‌ ఓ డొక్కు సైకిల్‌ మీద గ్రామాల్లో పర్యటిస్తూ, చెట్ల కింద మీటింగ్‌లు పెడుతూ, ఆ గ్రామంలోని సమస్యల గురించి చర్చిస్తూ, కొత్త సభ్యుల్ని ఆకర్షిస్తుంది. కుటుంబ హింసకి పాల్పడే భర్తల్ని సరిదిద్దే క్రమంలో ఆమె లెక్కలేనన్ని కేసుల్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆమె మీదున్న నేరారోపణలు ఏమిటంటే - చట్టవిరుద్ధంగా సమావేశమవ్వడం, ప్రభుత్వ అధికారులపై దాడి చెయ్యడం, అల్లర్లకి పాల్పడడం ఇలా ఎన్నో నేరాలు ఆమె మీద ఆరోపించబడ్డాయి. వీటన్నింటితోను, బాధిత స్త్రీలతోను ఆమె ఉద్యమం ముందుకెళుతోంది. బాధిత స్త్రీలు గులాబీదండు కార్యకర్తలుగా మారి తోటి బాధితులకి అండగా వుండడం ఈ గ్యాంగ్‌ ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు.

గులాబీదండుకి, సంపత్‌పాల్‌కి మీడియా గొప్ప ప్రాధాన్యతనిచ్చి ప్రచారం కల్పించడం విశేషం. గులాబీదండుకి ఈ రోజు ఫ్రాన్స్‌ ఛాప్టర్‌ మొదలైంది. ఫ్రాన్స్‌ గులాబీకి సిసిలీ రొమానే నాయకత్వం వహిస్తూ ”నాకింకా కర్ర పట్టు కోవాల్సిన అవసరం రాలేదు. నా గులాబీ చీరను మాత్రం పారిస్‌ వీధుల్లో చింపి ప్రదర్శించాను” అంటుంది. బి.బి.సి లో సంపత్‌ మీద పెద్ద స్టోరీ వచ్చింది.

రాజకీయాల్లోకి రావాలని గానీ, డొనేషన్స్‌ సేకరించాలని గానీ సంపత్‌కు లేదు. ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి మాయవతి ఒక దశలో సంపత్‌ తనకు రాజకీయంగా పోటీ అవుతుందేమోనని భయపడి గులాబీ దండును అంతం చేయాలని చూసి, కుదరక తన పార్టీలో చేరమని పిలిచినపుడు సంపత్‌ నిర్ధ్వంద్వంగా తిరస్కరించింది. మాయవతి అవినీతికి పాల్పడిందనేది సంపత్‌ ఆరోపణ. అవినీతి రాజకీయ పార్టీలతో కలిసి పనిచేసే కన్నా వాటికి దూరంగా వుంటే మేలని ఆమె నమ్మకం.

” నా బలం బొంగు కర్రల్లో లేదు. గులాబీ దండు సభ్యుల్లో వుంది. ఏదో ఒక రోజు మేం ఢిల్లీని వొణికిస్తాం” అనే సంపత్‌ నిజంగానే ఏదో ఒకరోజు గృహహింసకి వ్యతిరేకంగా దేశవ్యాప్త ఉద్యమానికి శ్రీకారం చుట్టొచ్చు.

భర్తలు (భరించేవాళ్ళు) కనుమరుగై కేవలం మొగుళ్ళే (హింసించేవాళ్ళు) మిగులుతున్న ఈ రోజుల్లో ఢిల్లీ సంగతి తర్వాత, గల్లీ గల్లీకో సంపత్‌ పుట్టాలి. వెదురు బొంగులో, ‘గోరంత దీపం’ సినిమాలోలాగా చింతబరికెలో పుచ్చుకుంటే తప్ప పెచ్చు మీరిపోతున్న హింసకి అడ్డుకట్ట వేయలేమోమో! రకరకాల హింసలకి పాల్పడుతున్న ”అత్యాధునిక” పురుషులూ జరభద్రం.గులాబీదండు వచ్చేస్తోంది.

Monday, May 2, 2011

ఉత్తరం ఉత్త కాయితం ముక్క కాదు


మొన్న గాంధి ఉత్తరాలు,ఈ రోజు ఠాగూర్ ఉత్తరాలు.
ఆత్మీయులకు అంతరంగాన్ని ఆవిష్కరించిన వ్యక్తిగత లేఖలు.ఇలా పబ్లిక్ చెయ్యడం చూస్తుంటే చాలా బాధగా ఉంది.
తాము ఎంతో ప్రేమించి ఆరాధించిన వ్యక్తులకు రాసుకున్న ఉత్తరాలను
వారి మరణానంతరం ఇలా బహిర్గతం చెయ్యొచ్చ్హా??
బతుకుపొడుగునా ఎంతో మంది పరిచయమౌతారు.
కొందరు హృదయానికి అతి సమీపంగా వస్తారు.
అలాంటి వాళ్ళతో కలబోసుకున్న కబుర్లని బజార్లో పెట్టొచ్చ్హా??
వారి ఇంటిమేట్ ఫీలింగ్స్ ని బట్టబయలు చేయ్యొచ్చ్హా??
బతికి ఉన్నంత కాలం ఎంతో ప్రేమగా,జాగ్రత్తగా దాచుకునే
ప్రేమ లేఖల్ని,స్నేహ లేఖల్ని నలుగురిలో పెట్టడం ఏమి న్యాయం??
నాకు ఉత్తరాలు రాయడం ఎంతో ఇష్టం.
నా ఉత్తరాలాంటే నా నేస్తాలకి ప్రాణం.
నలభై ఏళ్ళుగా నాకు మితృరాలైన ఒక నేస్తం అంటుంది
నీ ఉత్తరాలే నా ఆస్థి అని.
నేను రాసిన స్నేహలేఖలు నా ఫ్రెండ్స్ అందరి దగ్గరా ఫైల్ చేసి ఉన్నాయి.
నాకు అత్యంత ఆత్మీయురాలి దగ్గరైతే ఓ సూట్ కేస్ నిండా ఉన్నాయి.
వాళ్ళు నా లేఖల్ని ఎంతో ప్రేమగా దాచుకుంటున్నారు.
ఎవరైనా వ్యక్తిగతంగా,ఇష్టంగా రాసుకున్న ఉత్తరాలను పబ్లిక్ ఎందుకు చెయ్యాలి??
గాంధివైనా,నెహ్రూవైనా ఠాగూర్ వైనా?
వాళ్ళు చనిపోయి ఇన్ని సంవత్సరాలు గడిచాకా వారి ఉత్తరాల్లో ప్రతిఫలించిన
ప్రేమో,ఆత్మీయతో,స్నేహమో వాటికి ఈకలు పీకే పని ఎందుకు చెయ్యాలి??
గాంధీ హోమో సెక్ష్సువలా?
విక్టొరియాతో ఠాగూర్ సంబంధమేమిటి?
ఇంకెవరో లెస్బియనా ???

ఈ చర్చంతా అవసరమా?ఇవన్నీ లాగడం అవసరమా???
నేను ప్రేమని,స్నేహాన్ని,ఆత్మీయతని పంచుతూ నా ప్రియమైన వాళ్ళకి రాసిన ఉత్తరాలు
వాళ్ళూ,నేనూ తప్ప మూడో వ్యక్తి చదవడానికి వీల్లేదు గాక లేదు.
నాకు ఉత్తరమంటే ప్రాణం రాస్తూనే ఉంటాను.

Sunday, May 1, 2011

ఆస్మాన్ మే కభి కభి అకేలే రెహనేకా మన్ లగ్తా హై

(మేం త్వరలో ప్రారభించబోయే ఓపెన్ స్పేసే ఆస్మాన్)

ఆస్మాన్ మనందరి ఆశల హరివిల్లు
వంట ఇల్లులేని ఆస్మాన్
అంట్లు తోమక్కరలేని ఆస్మాన్
బట్టలుతక్కరలేని ఆస్మాన్
బల్లలు తుడవక్కరలేని ఆస్మాన్
కధ రాసుకోవాలనుందా
కవిత్వం కలబోసుకోవాలనుందా
ప్రియ సఖికి ప్రేమ లేఖ రాయాలనుందా
కళ్ళు మూసుకుని కమ్మటి పాటలు వినాలనుందా
ఏ కాగజ్ కి కష్టీ ఏ బారిష్ కీ పానీ
నల్లని మబ్బులు గుంపులు గుంపులు
తెల్లని కొంగలు బారులు బారులు
ఎందుకే నీకింత తొందరా ఓ చిలుక
నా చిలుకా ఓ రామ చిలుకా
గాలికదుపు లేదు కడలికంతు లేదు
గంగ వెల్లువా కమండలంలో ఇమిడేదేనా
ఉరికే మనసుకు గిరి గీస్తే అది ఆగేదేనా
ఉబికి ఉబికి వెల్లువెత్తే ఈ పాటల్ని వినాలనుందా
ఊరికే అలా కూర్చుని రంగులు మారే
ఆకాశాన్ని చూడాలనుందా
పున్నమి నాటి వెన్నెల్లా,పున్నాగ పూల వర్షంలా
ఒక ఏకాంతం,ఒక నిశ్శబ్దం
నచ్చిన నెచ్చెలి తో ఒక సాన్నిహిత్యం
చట్రాలులేని,సరిహద్దులులేని
అవధుల్లేని అడ్డు అదుపుల్లేని
ఆనందాల గని సంతోషాల పెన్నిధి
మా ఆస్మాన్
ఈ ఆస్మాన్ లో అపుడపుడూ
నన్ను నేను దొరికించుకునే
స్వేచ్చా ప్రపంచం
నాకై నేను సృష్టించుకోబోతున్న
సరికొత్త సంతోష సౌధం
నేనులోంచి మనంలోకి సాగే
మరో మహా ప్రయత్నానికి
మేలిరకమైన బాట మన ఆస్మాన్.

నా మీద వాలిన ఛాయాదేవి ఛాయ

ఎప్పటిమాట. పచ్చగా, చల్లగా, కుటీరం లాగా ఉండే ఆ ఇంటికి తొలిసారి ఎప్పుడెళ్ళాను. తొలిచూపులోనే ఆవిడతో ప్రేమలో పడిన సంఘటనలో నిజానికి, ఆరోజు ...