Saturday, August 17, 2013

ఇది నా ఆచరణ

ఫేస్ బుక్ లో ఈ రోజు పూజలు,వ్రతాలూ,నోముల గురించి నేను రాసినవి చదివి చాలా మంది మెచ్చుకున్నారు,కొంతమంది నొచ్చుకున్నారు.
కొంతమంది మీరు చెయ్యకపోతే మానెయ్యండి కానీ వేరేవాళ్ళని మానమని చెప్పకండి అని కోప్పడ్డారు.
కానీ.... నేను చెయ్యదలుచుకున్నవి..చెప్పదలుచుకున్నవి చేసి తీరతాను.
నేను సైన్స్ చదువుకోలేదు(ఓరియంటల్ టెంత్ క్లాస్) కానీ శాస్త్రీయ దృక్పధం ఏర్పర్చుకున్నాను.
ఇంటర్మీడియెట్ చదువుతున్నప్పటి నుండి నేను నాస్తికత్వం జీవన విధానం గా మార్చుకున్నాను.
మాయలు,మంత్రాలూ లేవంటూ నిప్పుల మీద నడిచాను.
నాకు నాతో పాటు బతికే మనిషి ముఖ్యం.మానవీయ కోణం ముఖ్యం.
ఈ సమాజం లో స్త్రీలు ఎక్కువ సమస్యలతో బతుకుతున్నారు,బాధపడుతున్నారు, కాబట్టి స్త్రీల అంశాల మీద పని చేస్తున్నాను.ఈ పని చెయ్యడం కోసం నా ప్రభుత్వ ఉద్యోగాన్ని(తాహసిల్దార్) 2000 లో వదిలేసాను.
నా జీవితాన్ని నేనే నిర్మించుకున్నాను.నా అస్తిత్వాన్ని నేనే వెతికి పట్టుకున్నాను.
నాకు నా పని పట్ల గొప్ప గౌరవం, ప్రేమ ఉన్నాయి.నేను చేసే పని నాకు గొప్ప తృప్తినిస్తుంది.సంతోషాన్నిస్తుంది.
నేను ప్రకృతి ప్రేమికురాలను.పచ్చదనం నా జీవితమంతా అల్లుకుని ఉంది.
జనాలు,వస్తువుల చుట్టూ,బంగారాల చుట్టూ,డబ్బు సంపాదనల చుట్టూ దేవుళ్ళ చుట్టూ ప్రదక్షిణలు చేస్తే నేను చెట్ల చుట్టూ,కొండల చుట్టూ,అడవుల చుట్టూ,నీళ్ళ చుట్టూ తిరుగుతుంటాను.అందులోనే నాకు గొప్ప ఆనందం దొరుకుతుంది.
నాకు అద్భుతమైన స్నేహితున్నారు.నన్ను గుండెల్లో నిలుపుకున్న నేస్తాలున్నారు.నా చుట్టూ ఎప్పుడూ ఉండేవి ప్రకృతి,ప్రియ నేస్తాలు.
వీళ్ళిచ్చే ఆనందం ముందు అన్నీ బలాదూర్.
నేనెప్పుడూ గతం లోను,భవిష్యత్తులోను బతకను.
నిన్న జరిగినదాని గురించి చింతిస్తూ,రేపు ఏం జరగబోతోందో అన్న భయం లో నేనెప్పుడూ బతకను.నా ముందున్న క్షణాలు మాత్రమే నావి.ప్రస్తుతం లో బతకడం నాకిష్టం.ఆనందం,సంతోషం ఇంకెక్కడో ఉంటాయని,ఎప్పుడో హఠాత్తుగా ఊడిపడతాయని నేను నమ్మను.అవెప్పుడూ మన చుట్టూనే ఉంటాయి.వాటిని గుర్తించడమే మనం చెయ్యాల్సింది.
నాకు చావు పట్ల భయం లేదు.చనిపోతే కాలిస్తే బూడిదౌతాం,పాతిపెడితే మట్టిలో కలిసిపోతాం. అంతే.దాన్ని మించి మరేమీ లేదు.ఆత్మలు,స్వర్గాలు,నరకాలు అన్ని మానవ సృష్టి.మగవాళ్ళ కోసం రంభా ఊర్వశి తదితరులని స్వర్గంలో సిద్ధం చేసి,ఆడవాళ్ళకి మాత్రం ఏడేడు జన్మలకి వీడే భర్త అని చెప్పడం లోనే స్వర్గం భండారం బయటపడుతుంది.కాబట్టి వీటిని నేను నమ్మను.
నాకు జీవితం పట్ల భయం లేదు,అభద్రత అసలే లేదు.
నాకు కోరికలూ ఎక్కువగా లేవు.నాది చాలా సింపుల్ జీవితం.
నాకు అవి కావాలి,ఇవి కావాలి అనే గొంతెమ్మ కోరికలు లేవు కాబట్టి ఎవరి ముందో చేతులెత్తి దణ్ణం పెట్టి దేబిరించాల్సిన పని అస్సలు లేదు.
నాకు కోరికలుంటే నేనే తీర్చుకోవాలి కాని ఎవరో తీర్చాలని ఆశించను.
ఆత్మవిశ్వాసం,ఆత్మగౌరం నాకు పెట్టని ఆభరణాలు.నాకు నగల మీగ మోజు లేదు కానీ ఈ రెండు నాకు ప్రాణ సమానాలు.
ఇవన్ని చదివి ఈమెకి తలపొగరెక్కువ,అహంకారం ఎక్కువ అని మీరు అనుకునే ప్రమాదం ఉంది.
ఆ రెండు నాకు లేవండి.
నాకు జీవితం పట్ల భయం లేదని చెప్పాను కదా!!ఎక్కడైనా నేను హాయిగా బతికెయ్యగలను.
నాకు పెద్దగా సౌకర్యాలూ అక్కరలేదు.
చన్నీళ్ళు స్నానం చెయ్యగలగదం,ఎక్కడ ఏది దొరికితే అది తినగలగడం,నేలమీదైనా హాయిగా పడుకోగలగడం నాకు వెన్నతో అబ్బిన విద్యలు.
అందుకే నాకు జీవితం పట్ల భయం లేనిది.అలాగే నాకు జీవితం పట్ల కంప్లైంట్స్ కూడా లేవు.
చెయ్యగలిగినంత కాలం పనిచెయ్యాలి,సజాజం తో ముడిపడి ఉండాలి,రాయగలిగినంత కాలం రాయాలి ఇవే నా జీవిత లక్ష్యాలు.
వస్తు ప్రేమల్లోంచి,వ్యక్తి ప్రేమల్లోంచి విముక్తమై విశ్వ ప్రేమవైపు,ప్రకృతి ప్రేమ వైపు మళ్ళాలన్నదే నా అంతిమ లక్ష్యం.

Monday, August 5, 2013

ఈ ఆదివారం జ్యేష్టపౌర మితృలతో......

ఈ రోజు ఫ్రెండ్ షిప్ డే
నేను నా నేస్తాలెవ్వరినీ కలవలేదు
కానీ...నాకెంతో ఇష్టమైన జ్యేష్టపౌర మితృల్ని మాత్రం కలిసాను.
రోజంతా వాళ్ళతోనే గడిచింది.
సి ఆర్ ఫౌండేషన్ లో అబ్బూరి చాయాదేవిగారు,వారి మితృలతో ఉదయం గడిచింది.
మధ్యాహ్నం దాదాపు నాలుగు గంటలు కొడవటిగంటి కుటుంబరావు గారి సహచరి వరూధిని గారితోను,వారి కూతురు శాంత సుందరి గారితోను
గడిచింది.
వరూధిని గారు నేను ఎన్నో విషయాలు మాట్లాడుకున్నాం.కడుపుబ్బ నవ్వుకున్నాం.
ఆవిడ మాటలు చాలా పదునుగా ఉంటాయి.సూటిగా ఉంటాయ్.
వరూధిని గారు ఎలా ఉన్నారు అంటే మెగా సీరియల్ లాగా ఉన్నాను అన్నారు ఠక్కున.
అలాంటి చెణుకులు ఎన్నో ఉంటాయి వారి మాటల్లో.
తన వయస్సు 86. అయినా ఎంతో చురుకుగా,ఉత్సాహంగా ఉంటారు.
ఆవిడ మాట్లాడుతుంటే సర్వం మర్చిపోయి,చీకటి పడింది ఇంటికెళ్ళాలన్న ధ్యాస లేకుండా
ఆవిడ ఎదురుగా కూర్చుని మంత్రముగ్ధనై విన్నాను.
రోజంతా జ్యేష్టులతో గడవడం నాకో అద్బుతమైన అనుభవం.
 (11 photos)

Friday, August 2, 2013

కర్నూల్,కర్నూల్ చుట్టుపక్కల ఉన్న మితృలకు ఓ విన్నపం.

ఫ్రెండ్స్

అందరికీ ముఖ్యంగా 
కర్నూల్,కర్నూల్ చుట్టుపక్కల ఉన్న మితృలకు ఓ విన్నపం.
కర్నూల్ లో మాకు ఓ ఇల్లుంది.
ఆ ఇల్లు కేంద్రంగా ఏవైనా సేవా కార్యక్రమాలు చేపట్టాలని చాలా కాలంగా అనుకుంటున్నాం నేను నా సహచరుడు.
ఒక ట్రస్ట్ కూడా మొదలు పెట్టి కొన్ని గ్రామాల్లో జ్యేష్ట పౌరులకు భోజనం పెట్టే కార్యక్రమం మొదలు పెట్టాం.
అది ఇంకా సమగ్రమైన రూపం తీసుకోలేదు.
కర్నూల్ లో మా ఇల్లు పెద్దగానే ఉంటుంది,ఖాళీగా ఉంది.
నేను వారం లో రెండు రోజులు కర్నూల్ లో గడపాలని నిర్ణయించుకున్నాను.
ఇక్కడ హైదరాబాద్ లో భూమిక పత్రిక,హెల్ప్ లైన్ కార్యక్రమాలు యధావిధిగానే నడుస్తాయి.
ముందు గా మా ఇల్లున్న కాలనీలో ఒక గ్రంధాలయం మా ఇంట్లోనే మొదలుపెట్టి క్రమంగా కార్యక్రమాలు విస్తరించాలని ప్రయత్నం.
ప్రస్తుతం మా డబ్బుతోనే మొదలు పెడుతున్నాం.
ఇంకా ఎలాంటి కార్యక్రమాలు చేస్తే బావుంటుందో మితృలు సలహాలు,సూచనలు ఇవ్వాలని కోరుతున్నాను.
మా ఇల్లు కర్నూల్,తిరుపతి హైవే మీద,మారుతి మెగా సిటి లో ఉంది.
ఎదురుగా అందమైన జగన్నాధ కట్ట/గుట్ట ఉంటుంది.
సెప్టెంబర్ 5 నేను నా సహచరుడు కలిసి బతకడం మొదలుపెట్టిన రోజు.
ఆ రోజు నుండే మా సేవా కార్యక్రమం మొదలు పెట్టాలని నా కోరిక.
సో.... ప్లీజ్ ...రెస్పాండ్...

‘ఆమ్లం’ ఆయుధమైన వేళ…. ‘సుప్రీమ్‌ కోర్టు తీర్పు’

జూలై 16న యాసిడ్‌ అమ్మకాలకు సంబంధించి సుప్రీమ్‌ కోర్టు వెలువరించిన తీర్పు చదివాక నా మనసులో ఒక దుఃఖ కెరటం ఎగిసిపడి, కళ్ళల్లోకి ప్రవహించింది. స్వప్నిక, ప్రణీత, అనురాధ, పేర్లు తెలియని ఇంకెందరో యాసిడ్‌ బాధిత స్త్రీలు గుర్తొచ్చారు. మన మధ్య లేకుండాపోయిన స్వప్నిక, మన మధ్య వుంటూనే యాసిడ్‌ గాయాలను మోసుకుంటూ తిరుగుతున్న ప్రణీత లాంటి వాళ్ళు నీళ్ళు నిండిన కళ్ళకి అస్పష్టంగా కనబడుతున్నారు. ఉదాత్తమైన, కడురమణీయమైన ‘ప్రేమ’ భావన ఇంతటి వికృత రూపాన్ని తీసుకోవడం భరింపశక్యం కాకుండా వుంది. యాసిడ్‌ లాంటి ప్రమాదకర రసాయనంతో దాడిచేసే కొంతమంది పురుషుల కౄరత్వం – అదీ తాము ప్రేమించామని చెప్పుకునే వారిపట్ల, ఎంత అమానుషమైందో వేరే చెప్పనవసరం లేదు.

స్పప్నిక, ప్రణీతల మీద యాసిడ్‌ దాడి జరిగిన వెంటనే నిందితుల్ని పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేసి చంపేసినప్పటికీ మన రాష్ట్రంలో వరుసగా యాసిడ్‌ దాడులు జరిగాయి. ఈ దాడులకు వ్యతిరేకంగా 2009లో భూమిక రాష్ట్రస్థాయిలో ఒక సమావేశం నిర్వహించి, అప్పటి హోమ్‌ మినిష్టర్‌ సబితా ఇంద్రారెడ్డిని ఆహ్వానించడం జరిగింది. యాసిడ్‌ లభ్యతల మీద ఆంక్షలు విధించాలని, బాధితులకు తగురీతిన నష్టపరిహారం చెల్లించాలని, నేరాన్ని నాన్‌బెయిలబుల్‌గా పరిగణించాలని, బాధితులకయ్యే వైద్య ఖర్చులు రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని ఆనాటి సదస్సులో తీర్మానించడం జరిగింది. అప్పటి ఐ.జి. సి.ఐడి ఉమాపతి గారి చొరవతో క్రిమినల్‌ ప్రోసీజర్‌ కోడ్‌లోని సెక్షన్‌ 357కి సవరణ సూచించడం, ఒక డ్రాప్ట్‌ బిల్లును కేంద్రానికి పంపించడం జరిగింది. ఆ తర్వాత ఈ విషయంపై ఎలాంటి చర్య జరగలేదు. కనీసం మిగతా రాష్ట్రాలు చేసినట్టుగా యాసిడ్‌ అమ్మకాలకు సంబంధించి నియమనిబంధనలను కూడా మన రాష్ట్రం చెయ్యలేదు. ఎన్నోసార్లు ఈ అంశం మీద హోమ్‌ మినిస్టర్‌కి వినతి పత్రాలివ్వడం జరిగింది. కానీ ఇప్పటి వరకు యాసిడ్‌ అమ్మకాలు, కొనుగొళ్ళు మీద ఎలాంటి నియమనిబంధనలు రూపొందించకపోవడం చూస్తే ఇంతటి సీరియస్‌ అంశంమీద ప్రభుత్వ నిర్లక్ష్యం ఏ స్థాయిలో వుందో అర్థమవుతుంది.

ఈ నేపథ్యంలోంచి చూసినపుడు ఇటీవల సుప్రీమ్‌ కోర్టు వెలువరించిన తీర్పు ఎంతో ఊరటను కలిగించింది. యాసిడ్‌ దాడికి గురై ఎన్నో సంవత్సరాలుగా న్యాయపోరాటం చేస్తున్న లక్ష్మి అనే మహిళ 2006లో సుప్రీమ్‌ కోర్టులో వేసిన పబ్లిక్‌ ఇంట్రస్ట్‌ లిటిగేషన్‌ కేసులో ఈ తీర్పు వెలువడింది. యాసిడ్‌ అమ్మకాల గురించి, బాధితులకు నష్టపరిహారం చెల్లించే అంశం గురించి సుప్రీమ్‌ కోర్టు స్పష్టమైన ఆదేశాలను ఇచ్చింది. యాసిడ్‌ దాడిని బెయిలు లభించని నేరంగా పరిగణించేలా విషప్రయోగ నిరోధక చట్టం 1919కి మార్పులు చేయాలని సూచించింది. యాసిడ్‌ అమ్మకాల మీద స్పష్టమైన ఆదేశాలిచ్చింది.

ఎవరంటే వాళ్ళు షాప్‌ల్లోంచి యాసిడ్‌ను కొనుగోలు చేసే వీలులేదు. షాపు యజమానులు యాసిడ్‌ అమ్మకాల రిజిస్టర్‌ నిర్వహించాలి. అందులో కొనుగోలుదారు వివరాలు, అడ్రస్‌, ఫోన్‌ నెంబరు, యాసిడ్‌ కొన్న కారణాలు స్పష్టంగా నమోదు చెయ్యాలి. అలాగే కొన్న వ్యక్తులు ప్రభుత్వం జారీ చేసిన గుర్తింపు కార్డును షాపు యాజమానికి చూపించాలి. యాసిడ్‌ దేనికి వినియోగిస్తున్నరో స్పష్టంగా పేర్కొనాలి. తన వద్ద వున్న యాసిడ్‌ నిల్వల వివరాలు సబ్‌డివిజనల్‌ మేజిస్ట్రేటు ముందు డిక్లేర్‌ చేయ్యాలి. 18 సంవత్సరాలలోపు వయసున్న వారికి యాసిడ్‌ అమ్మకూడదు. దుకాణదారు తన నిల్వల వివరాలు సక్రమంగా నిర్వహించకపోతే 50,000/- జరిమానా విధించవచ్చు. విద్యా సంస్థలు, పరిశోధనా సంస్థలు ఆసుపత్రులు, ప్రభుత్వ, ప్రభుత్వేతర విభాగాలు తాము యాసిడ్‌ను నిల్వచేస్తే, ఆ వివరాలను ఒక రిజిస్టర్‌లో నమోదుచేసి సబ్‌డివిజనల్‌ మెజిస్ట్రేట్‌కి తెలపాలి. ఇలా యాసిడ్‌ అమ్మకాలు, నిల్వల గురించి సుప్రీమ్‌ కోర్టు స్పష్టమైన నియమనిబంధనలు రూపొందించింది.

ఈ తీర్పులో మరో ముఖ్యమైన కోణం బాధితులకు నష్టపరిహరం చెల్లించే అంశం. నష్టపరిహారం చెల్లింపుల విషయంలో వివిధ రాష్ట్రాలు వివిధ పద్ధతులను పాటిస్తున్నాయి. అంతేకాకుండా చాలా తక్కువ కూడా చెల్లిస్తున్నాయి. ఈ అంశాన్ని పేర్కొంటూ సుప్రీమ్‌ కోర్టు ‘బాధితురాలు వరుసగా, ఖర్చుతో కూడిన ఎన్నో ప్లాస్టిక్‌ సర్జరీలు చేయించుకోవాల్సి వుంటుంది. వైద్య ఖర్చులు భరించుకోవాల్సి వుంటుంది. ఇప్పుడు రాష్ట్రాలిస్తున్న నష్టపరిహారం ఎటూ చాలదు. కాబట్టి క్రిమినల్‌ ప్రోసీజర్‌ కోడ్‌లోని సెక్షన్‌ 357ని సవరించి 357ఏ ని చేర్చి బాధితురాలికి నష్టపరిహారం మీద ఒక స్కీమ్‌ని రూపొందించి, మూడు లక్షల రూపాయిలు పరిహారంగా ఇవ్వాలని ఆదేశించడం జరిగింది. ఈ నష్టపరిహారాన్ని ప్రభుత్వమే చెల్లించాల్సి వుంటుంది. అది కూడా యాసిడ్‌ దాడి జరిగిన 15 రోజులకి ఒక లక్ష రూపాయిలు చెల్లించాలి. మరో రెండు నెలలలోపు మిగిలిన రెండు లక్షలు చెల్లించాలి. అన్ని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు ఈ విషయమై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించడం జరిగింది. అంతేకాకుండా సుప్రీమ్‌ కోర్టు యిచ్చిన తీర్పును అన్ని స్థానిక భాషల్లోకి అనువదించి, సమాచారాన్ని అందరికీ తెలిసేలా చెయ్యాలని కూడా చెప్పడం జరిగింది.

సుప్రీమ్‌ కోర్టు ఇంతటి స్పష్టమైన తీర్పు ప్రకటించినప్పటికీ ప్రభుత్వపరంగా ఎలాంటి స్పందనా వెలువడలేదు. సుప్రీమ్‌ కోర్టు రూపొందించిన గైడ్‌లైన్స్‌ ఆధారంగా రూల్స్‌ రూపొందించి, ఈ తీర్పు గురించి ప్రజాబాహుళ్యంలో ప్రాచుర్యం కలిగించాలని ‘భూమిక’ నుండి ప్రధాన కార్యదర్శికి ఫ్యాక్స్‌ ద్వారా రిప్రజెంటేషన్‌ పంపించాం. ప్రభుత్వం వెంటనే నియమనిబంధనలు రూపొందించి, యాసిడ్‌దాడి లాంటి కృరమైన దాడులు చేసిన వారిని కఠినంగా శిక్షించేలా, బాధితులను సత్వరమే అదుకునేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నాం. ఈ విషయమై అందరం కలిసికట్టుగా రాష్ట్ర ప్రభుత్వం మీద వొత్తిడి పెట్టాల్సిన అవసరం చాలావుందని నేను భావిస్తున్నాను. రండి… యాసిడ్‌ దాడులకు వ్యతిరేకంగా పనిచేద్దాం.

నా మీద వాలిన ఛాయాదేవి ఛాయ

ఎప్పటిమాట. పచ్చగా, చల్లగా, కుటీరం లాగా ఉండే ఆ ఇంటికి తొలిసారి ఎప్పుడెళ్ళాను. తొలిచూపులోనే ఆవిడతో ప్రేమలో పడిన సంఘటనలో నిజానికి, ఆరోజు ...