Saturday, May 20, 2023

మే 14 మల్లాది సుబ్బమ్మ గారి వర్ధంతి


..................
మల్లాది సుబ్బమ్మగారి మరణం ఎంతో విషాదాన్ని నింపింది.
1975 లో...నేను ఓ చిన్న కుగ్రామం నుంచి మహా నగరానికొచ్చి నా అస్థిత్వాన్ని వెతుక్కుంటున్న రోజులు. కొత్త భావాలు ఎక్కడ,ఏ మీటింగ్ లో వినిపించినా ఆసక్తిగా వినే రోజులు.అలా ఓ మీటింగ్ లో సుబ్బమ్మ గారితో పరిచయం అయ్యింది.
మెహదిపట్నం లో వారింటిలో జరిగే అన్ని మీటింగ్ లకు వెళ్ళేదాన్ని.తర్వాత తర్వాత అన్వేషి,అస్మిత లాంటి సంస్థల తో మమేకమయ్యాను కానీ మొదటి అడుగు సుబ్బమ్మగారి వేపే పడింది.నేను చేసుకున్న కులాంతర,నాస్తిక,రిజిస్టర్ పెళ్ళి విషయం లో ఆవిడ చాలా చొరవ తీసుకుని నాకు అండగా నిలిచారు.సుబ్బమ్మ గారు స్థాపించిన అభ్యుదయ వివాహ వేదిక కింద జరిగిన మొదటి పెళ్ళి కార్యక్రమం మాదే అని గర్వం గా చెప్పగలను.
నా సహచరుడి తల్లితండ్రులు మొదట్లో మా పెళ్ళికి అంగీకరించలేదు.ఆ తర్వాత నేనే వాళ్ళకిష్టమైన కోడలిని లెండి.అప్పుడు సుబ్బమ్మ,రామ్మొర్తి గార్లు మా అత్త,మామలతో మాట్లాడారు.వాళ్ళు ఆ రోజు ఉదయం రిజిస్ట్రార్ ఆఫీసుకి రాలేదు కానీ సాయంత్రం సుబ్బమ్మ గారిచ్చిన సింపుల్ టీ పార్టీకి అత్తగారు మామయ్య వచ్చారు.
ఈ రోజు ఇవన్నీ గుర్తుకొస్తున్నాయి.
1980 లో అంతర్జాతీయ నాస్తిక మహా సభల్లో నా సహచరుడిని నా జీవిత భాగస్వామిగా ఎంచుకోవడం కూడా చాలా డ్రమెటిక్ గా జరిగింది.
1980 డిశంబర్ 28 నుండి 31 వరకు విజయవాడలోని నాస్తిక కేంద్రంలో అంతర్జాతీయ స్థాయి సమావేశం లో ఎన్నో కార్యక్రమాలు జరిగాయి.
అలాంటి ఒక కార్యక్రమం "నిప్పుల మీద నడక".నిప్పుల గుండం లో ఎవరైనా నడవొచ్చని...దానికి మాయలూ మంత్రాలు అక్కరలేదని సైంటిఫిక్ గా నడిస్తే కాళ్ళు కాలవని నిరూపించదలిచారు.అలా నడిచినపుడు అరికాళ్ళల్లో ఆవిరిలాంటి పొర ఏర్పడి కాలకుండా ఆపుతుంది.గబ గబ నడవకపోతే మాత్రం కాలడం ఖాయం.
మహిళల్లో నేనొక్కదాన్నే పేరిచ్చాను.నేను నిప్పుల గుండం తొక్కుతానని.
ఒక ఉత్సాహం ఊపేస్తుంటే...ఎర్రటి నిప్పుల మీద నడుచుకుంటూ వెళ్ళిపోయాను.
నిప్పుల గుండాన్ని ఇక దాటేస్తాననగా చివరి అడుగులో తూలిపడబోయాను.
ఆ టైం లో ఓ చెయ్యి పడిపోకుండా నన్ను పట్టుకుంది.
ఆ రోజు అలా నా చేతిని పట్టుకున్న చెయ్యి...ఎప్పుడూ నన్ను వదలలేదు.
ఆ పరిచయం...పెరిగి ప్రేమై కలిసిబతకాలనే నిర్ణయం చేయించింది.
తొమ్మిది నెల తర్వాత సెప్టెంబర్ 5 1981 లో మా పెళ్ళిని రిజిస్టర్ చేసాం.
నా నిర్ణయాన్ని మా అమ్మ... మా కుటుంబ సభ్యులు స్వాగతించారు...నేనొక నిర్ణయానికొస్తే దానిని ఎవ్వరూ ఆపలేరని మా వాళ్ళకి తెలుసు.నా సహచరుడి వైపు తొలినాళ్ళల్లో కొంత వ్యతిరేకత ఉన్నా వాళ్ళ చిన్నక్క మా తరఫున నిలబడి అంతా చక్కదిద్దింది.కొన్ని రోజులే...అలా ఆ తర్వాత వాళ్ళు నన్ను ఎంతో ప్రేమించారు.
మల్లాది సుబ్బమ్మ గారు,రామ్మూర్తి గారు కూడా ఎంతో నచ్చచెప్పారు.
సుబ్బమ్మ గారి మరణం నా జ్ఞాపకాల తుట్టను ఇలా కదిలించింది.
వారికి నా మనస్పూర్తి నివాళి ఇది...
All reactions:
Sathya Vathi, Mannem Sarada and 30 others

No comments:

తర్పణాలు త్రిశంకు స్వర్గాలు

 తర్పణాలు, త్రిశంకు స్వర్గాలు ............ మా సీతారాంపురం లో మా తాతకి చాలా పొలాలు ఉండేవి. మా తాత, చిన్న తాత ఇద్దరే పొలాలన్నింటిని పంచుకున్నా...