Showing posts with label కథ. Show all posts
Showing posts with label కథ. Show all posts

Tuesday, August 3, 2010

మాట్లాడుకోవాలి

ఆకాశం నిండా నల్లటి మబ్బులు కమ్ముకున్నాయి. మే నెలలో హఠాత్తుగా ఎదురైన చల్లటి అనుభవం. నిన్నటిదాకా నలభై నాలుగు డిగ్రీల ఉష్ణాగ్రత. ఈ రోజు ఇరవై ఆరు. నిన్నటికి ఇవాల్టికి ఎంత తేడా. బంగాళాఖాతంలో పెనుతుఫాను. ఆ బీభత్సానికి ఎంత చక్కటి పేరు లైలా! క్రితం సంవత్సరం వచ్చిన తుఫాను పేరు ఐలా! ఈ పేర్లు ఎవరు పెడతారో! ప్రళయ విధ్వంశం సృష్టించే ప్రకృతి వైపరీత్యాలకు ఆడవాళ్ళ పేర్లు ఎందుకు పెడతారో!
మురళి, మాధవి బయట పచ్చటి లాన్‌లో కుర్చీలేసుకుని కూర్చున్నారు.చీకటి పడినట్లయిపోయింది. డాబామీదికి ఎగబాకిన మాలతీలత ఆకు కనబడకుండా విరబూసింది. మధురమైన సువాసనల్ని వెదజల్లుతోంది. ఇంకో పక్క కుండీలో గ్లోబులా పూసిన మే ప్లవర్‌. ఎర్రటి రంగుతో, అద్భుతమైన అల్లికతో చూడముచ్చటగా వుంది. మబ్బుల చాటున ఈద్‌కాచాంద్‌లాగా దర్శనమిచ్చింది నెలవంక.
''బాగా వర్షం వచ్చేట్టుంది మురళీ! లోపలికెళదాం పద'' మాధవి అంది.
''తుఫాను ఎఫెక్ట్‌ బాగానే వున్నట్టుంది. వెళదాంలే బయట చల్లగా, హాయిగా వుంది'' అన్నాడు మురళి
''నిజమే! చాలా హాయిగా వుంది. మనం ఇలా కూర్చుని మాట్లాడుకుని ఎంత కాలమైంది. ఏమిటో బతుకంతా ఉరుకులు, పరుగులతోటే సరిపోతోంది. దేనివెంట పరిగెడుతున్నమో అర్ధం కావడం లేదు'' అంది మాధవి నెలవంకని చూస్తూ.
మురళి కాసేపు మాట్లాడలేదు. మాధవి మనసులోని బాధ అర్ధం అవుతోంది. ఇరవై రెండేళ్ళ కాపురంలో మొదటి మూడు, నాలుగు సంవత్సరాల్లో తప్ప తాము ఇలా ఇంత ఆరామ్‌గా కూర్చున్నది లేదు. కార్పోరేట్‌ కాలేజీలో పిల్లల్ని డాక్టర్లు, ఇంజనీర్లుగా తయారు చేసే యంత్రంలా తను, రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌లో తలమునకలుగా మాధవి. డబ్బుకేం లోటు లేదు. పిల్లలకి మంచి చదువులు, విదేశాల్లో ఉద్యోగాలు. ఖరీదైన ఇల్లు, సౌకర్యాలన్నీ వున్నాయి.
''ఏంటీ అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావ్‌ మురళీ.''
''ఏం లేదు మధూ! ఇలాంటి సాయంత్రాల్ని ఎన్నింటిని కోల్పోయామా అన్పిస్తోంది.''
సన్నగా చినుకులు మొదలయ్యాయి. ఇద్దరూ లాన్‌లోంచి లేచి ఇంట్లో కొచ్చారు. ''కాఫీ తాగుదామా మురళీ''
''ఈ చల్లటి వాతావరణంలో అంతకంటే కావల్సిందేముంది పద కలుపుకుందాం.''
కాఫీ కప్పులతో డైనింగు టేబుల్‌ మీద కూర్చున్నారు. గాలి ఉధృతి పెరిగింది. వాన జోరుగా పడుతోంది. ఎక్కడో పెళ పెళమంటూ పిడిగు పడిన శబ్దం. కరెంటు పోయింది.
''ఎమర్జన్సీ లైట్‌ చెడిపోయింది. కాండిల్‌ ఎక్కడుందో ఏంటో'' అంటూ మాధవి లేవబోయింది.
''ఉండు మధు! కాండిల్‌ వద్దులే.కాసేపు చీకట్లో కూర్చుందాం.''
మాధవి కూర్చుంది. చిమ్మచీకటి. అపుడపుడూ మెరుపులు. దడామని పిడుగులు. వర్షం కురుస్తున్న శబ్దం మాలతీపూల మధుర సువాసనలు. గమ్మత్తుగా హాయిగా ఉంది వాతావరణం. మురళీకి నెల క్రితమే స్ట్రోక్  వచ్చింది  . క్లాసులో పాఠం చెబుతూ పడిపోవడంతో తనని అప్పటికప్పుడు కేర్‌ హాస్పిటల్‌కి తీసుకెళ్ళడం,కాలూ చెయ్యి ఎఫెక్ట్ కావడం   ఒక్కొటొక్కటి గుర్తొచ్చాయి మాధవికి.
''మధు! ఇలా చీకట్లో కూర్చోవడం బావుంది కదూ! మన మనస్సులోకి చూసుకునే ఇలాంటి అవకాశం చాలా అరుదుగా దొరుకుతుంది''.
''నిజమే మురళి! నిదానంగా నిలబడి నీళ్ళుకూడా తాగలేని వేగం, ఒత్తిళ్ళు మన ఆరోగ్యాలను ఎంత ధ్వంసం చేస్తున్నాయో మనకి అర్ధమవ్వడం లేదు. నాకెందుకో ఇరవై సంవత్సరాల క్రితం నాటి విషయాలు ఇపుడు గుర్తొస్తున్నాయి.''
''ఏ విషయాలు మనం కలిసి బతకడం మొదలు పెట్టిన నాటి కష్టాలా? అవన్నీ ఇపుడెందుకులే మధూ''
''ఆ విషయాలు కాదు మురళీ!  నాకు ఇరవై ఏళ్ళ క్రితమే ఓపెన్‌ హార్ట్‌ సర్జరీ అయ్యింది. ఆ రోజుల్లో, మన దగ్గర డబ్బులేని రోజుల్లో నువ్వు ఎంత కష్టపడి నాకు ఆపరేషన్‌ చేయించావో నాకు గుర్తుకొస్తోంది."
''వద్దు మధూ! వాటిని గుర్తు చెయ్యకు. అయినా నువ్వు నెలరోజులుగా నా కోసం చేసిన సేవ ముందు అదెంతలే. ఏదో డబ్బుల్లేక గాంధీ హాస్పిటల్‌లో...
'మురళీ! ప్లీజ్‌ అలా అనకు! నన్ను మాట్లాడనీ..నీ కోసం నేను చేసిందేమీ లేదు. ఖరీదైన హాస్పిటల్‌, స్పెషల్‌రూమ్‌, నిరంతరం నర్సు సేవ చేసారు. నేను హాయిగా ఎ.సి రూంలో వున్నాను. కానీ గాంధీలో నేను ధోరాసిక్‌ వార్డులో వుంటే నువ్వెక్కడ వుండేవాడివో నాకు తెలుసు. భయంకర దుర్వాసనలు వెదజల్లే బాత్‌రూమ్‌ల పక్కన, జనరల్‌ వార్డుల పక్కన, రోడ్డు మీద గంటల తరబడి కూర్చోవడం, రాత్రిళ్ళు అక్కడే పడుకోవడం. నాకు తెలుసు మురళీ. గవర్నమెంట్‌ ఆసుపత్రిలో నా గుండె ఆపరేషన్‌ విజయవంతమౌతుందా లేదా అనే టెన్షన్‌, పెద్దలకి ఇష్టంలేని పెళ్ళి చేసుకున్నాం కాబట్టి అటునుంచి సహాయ నిరాకరణ. ఆ రోజుల్లో నువ్వెంత మానసిక క్షోభని అనుభవించి వుంటావో నాకు తెలుసు.నన్ను ఆపరేషన్‌ ధియేటర్‌కి పంపుతూ నువ్వు కార్చిన కన్నీటి చుక్క నా బుగ్గ మీద పడి, అప్పటికే సగం మత్తులో వున్న నాకు వెచ్చగా తాకి, నేను కళ్ళు విప్పి నవ్వుతూ చెయ్యి ఊపుతుంటే నువ్వు కన్నీళ్ళ మధ్య నవ్వావ్‌. అంతే. రెండో రోజు దాకా నాకు స్పృహ రాలేదు. ఆ పగలు, ఆ రాత్రి నువ్వెంత ఏడ్చి వుంటావో నాకు తెలుసు. ఆ తర్వాత నన్నెంత అపురూపంగా చూసుకున్నావో, ఎన్ని సేవలు చేసావో నా మనసుకు తెలుసు. ఈ విషయాలన్నీ నీకు చెప్పాలని ఎన్నో సార్లు అనుకునేదాన్ని. చెప్పలేదు. వెలుతురులో ఇగోలు, అహాలు అడ్డొస్తాయి కాబోలు. చీకట్లో మనలోకి మనం చూసుకోగలగుతాం.'' మాధవి మాట్లాడడం ఆపింది.
''మధూ! ఇరవై సంవత్సరాలైనా నువ్వింకా ఆ విషయాలు మర్చిపోలేదా? నిజమే! నా జీవితంలో కష్టమైన కాలమది. నా స్థానంలో ఎవరున్నా అంతే చేస్తారు. నీకు గుండెలో పెద్ద రంధ్రముందని మొదటిసారి డాక్టరు చెప్పినపుడు నేను బిత్తర పోయాను. ఆ తత్తరపాటును ఎలా కప్పిపుచ్చుకోవాలో అర్ధం కాలేదు. మనమున్న స్థితిలో ఖరీదైన వైద్యం చేయించలేను. అయినా అప్పటికి అపొలోలు, కేర్‌లు ఎక్కడున్నాయ్‌? గాంధీ యే దిక్కు. అయితేనేం డాక్టర్లందరూ ఎంతో మంచివాళ్ళు. ఇప్పటిలా కమర్షియల్‌ ఆలోచనలు వున్న వాళ్ళు కాదు.''
''అవును. నేను కళ్ళు తెరిచేటప్పటికీ నా ఎదురుగా కూర్చుని వున్నారు. డా. సత్యనారాయణగారు. రికవరీ రూమ్‌లో ఆయన్ని చూసి ఆశ్చర్యపోయాను. అంత ప్రత్యేక శ్రద్ధతో చూడడంవల్లే నేను బతికి పోయాననుకుంటాను.''

''మధూ! ఆ విషయం సరే! నేను కూడా నీకు చాలా దు:ఖం కల్గించాను. బతుకు బండి వంద మైళ్ళ వేగంతో పరుగెతున్నపుడు ఏమీ అర్ధం కాలేదు. నేను నా ఆరోగ్యాన్ని చేజేతులా పాడు చేసుకున్నాను. శరీరాన్ని మిస్‌ యూజ్‌ చేసాను. నా జ్ఞానాన్ని లక్షలకి అమ్మి, యంత్రాల్ని, యంత్రాల్లాంటి విద్యార్ధుల్ని తయారు చేసాను. ఎక్కడ ఎక్కువిస్తే అక్కడికి జంప్‌ చేసి డబ్బు సంపాదనే ముఖ్యమైన ప్రాధాన్యత అనుకున్నాను. సంపాదించిన డబ్బుని ఆస్తులుగానో, వస్తువులుగానో మార్చాను. బ్లాక్‌ లేబుల్‌, రెడ్‌లేబుల్‌ అంటూ బాటిళ్ళకి బాటళ్ళు గొంతులో పోసి గుండెను ఛిద్రం చేసుకున్నాను. నీ మాట ఏనాడైనా విన్నానా? నీకసలు దొరికేవాడినా? నిన్ను చాలా హింస పెట్టాను కదా! డబ్బుతో పాటు బోలెడన్ని రోగాలూ సంపాదించాను. ఆ రోజు  క్లాసులో కుప్పకూలేవరకూ నేను ఏంచేస్తున్నానో ఎలా బతుకుతున్నాననే స్పృహే లేదు. ఆయాంసారీ! మధూ!'' మురళి గొంతు పూడుకుపోయింది.
మాధవి కుర్చీలోంచి లేచి వచ్చి మురళి వెనుక నిలబడింది. అతన్ని గుండెకి పొదుపుకుంటూ...
''మన మధ్య సారీలేంటి మురళీ! నాకు నీ ఆరోగ్యం గురించి చాలా బెంగగా వుండేది. నీ లైఫ్‌స్టయిల్‌ దిగులు పుట్టించేది. డబ్బు వెంట ఎందుకంత వెర్రిగా పరుగెడుతున్నావో అర్ధమయ్యేది కాదు. ఒక కాలేజీ నుంచి ఇంకో కాలేజీకి వెళ్ళినపుడల్లా నాకు చాలా బాధగా అన్పించేది.''
''నిజమే! బహుశ మన మొదటి రోజుల్లోని కష్టాలే నన్ను అలా పరుగెత్తించాయేమో!ఏమో!''
పెద్దగా ఉరిమింది. కళ్ళు మిరుమిట్లుగొల్పే మెరుపులు. ఫెళ ఫెళమంటూ ఎక్కడో పడిన పిడుగులు.
''ఇంక కరెంటు రాదేమో! కొవ్వొత్తి ఎక్కడుందో'' ''ఉండనీయ్‌లే మధూ! ఇపుడు కరెంట్‌తో మనకి పనేం లేదుగా. డిన్నర్‌ టైమ్‌కి చూద్దాంలే.''
''అంతేనంటావా. ఇలా చీకట్లో కూర్చుని మాట్లాడుకోవడం బావుంది. పండువెన్నెల పరవశాన్ని కల్గిస్తుంది. చీకటి చిక్కదనం కూడా ఇంత బావుంటుందనుకోలేదు.''
''బహుశా మనం చీకటిని వెలుతురును ఒకేలా చూసే దశకి చేరామేమో!''
''అంతే కాదు మురళి! ఇంతకాలం మనం దేనికో దానికి పోట్లాడుకుంటూనే గడిపాం. అది నీ ఉద్యోగమా! పిల్లల విషయమా! నేను చేసే పొరపాట్లా. సాధింపులా? ఏదైనా కానీ ఇలా కూర్చుని సావకాశంగా మాట్లాడుకున్నది లేదు. చర్చించుకున్నది లేదు. ఆవేశాలు, కావేశాలు అంతే. ఇపుడు మనమిద్దరమే మిగిలాం. పిల్లలు అమెరికా నుంచి తిరిగి వస్తారని నాకయితే నమ్మకం లేదు. నాకు నువ్వు నీకు నేను అంతే.'' మురళి జట్టులోకి వేళ్ళు పోనిస్తూ అంది.
''అవును మధూ! ఇంతకాలం ఎవరికోసమో బతికినట్టుంది. ఉద్యోగం కోసం, సంపాదన కోసం, పిల్లలకోసం పరుగులు పెడుతూ బతికాం. అదీ అవసరమే కానీ నేను మరీ విపరీతంగా ప్రవర్తించి ప్రాణం మీదకు తెచ్చుకున్నాను. అలా చేసి ఉండకూడు కదా!''
''జరిగిపోయినవి తలుచుకుని బాధపడ్డం ఎందుకులే మురళీ! ఇపుడేం మించిపోలేదు. మనం కలిసి బతకడం మొదలుపెట్టినపుడు ఎంత స్నేహంగా, సంతోషంగా వున్నామో మనిద్దరికీ తెలుసు. మధ్యలో వచ్చిన వేవీ మనకి సంతోషాన్నివ్వలేదు. మన మధ్య కనబడని అగాధాన్ని సృస్టించాయి. ఈ రోజు ఎంతో మనస్ఫూర్తిగా మనసు విప్పి మాట్లాడుకోగలిగాం. ఇది ఇలాగే కొనసాగితే ఇంతకు మించింది ఏముంటుంది?''
''రోజూ లైట్లాపేసి చీకట్లో ఓ గంట గడిపితే బావుండేట్టుంది.'' అన్నాడు మురళి నవ్వుతూ
''నువ్వు ట్లాబ్లెట్లు వేసుకోవాలి. కొవ్వొత్తి కోసం వెతకాల్సిందే.'' అంటూ మధు లేవబోయింది.
అదే క్షణంలో కరెంటు వచ్చింది.
వెంటనే ఫోన్‌ కూడా మోగింది. మాధవి లేచి ఫోనందుకుంది. కూతురు శ్రావ్య. ఫోన్‌ మురళికిచ్చి టాబ్లెట్‌ కోసం వెళ్ళింది మాధవి.
''బావున్నానురా! ఏంచేస్తున్నామా? జోరుగా వాన పడుతోంది. అమ్మ నేను కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నాం. నిజం రా. నమ్మకం కలగడం లేదా? అయితే అమ్మనడుగు'' మాధవికిచ్చాడు ఫోన్‌.
'తల్లీ! నాన్న చెప్పింది నిజమేనే. చాలా సంవత్సరాల తర్వాత మేం బోలెడు కబుర్లు చెప్పుకున్నాం. నాన్న బాగానే వున్నాడు. మా గురించి మీరేం కంగారుపడకండి. సరేనా'' ఫోన్‌ పెట్టేసింది.
మళ్ళీ ఇద్దరూ కబుర్లలో పడ్డారు. గడ్డ కట్టిన మాటల మూటలేవో కరిగి వర్షం నీరులా ప్రవహించసాగాయి. ఆ ప్రవాహంలో తడిసి ముద్దవుతూ మరిన్ని మాటల్ని వెదజల్లుకుంటూ అలాగే కూర్చుండి పోయారు మురళి, మాధవి.

Tuesday, July 29, 2008

పాలపుంత


“నందూ! మనం చూద్దామనుకున్న జాగర్స్‌ పార్క్‌ జీటీవిలో వస్తోంది చూడు.”
“అవునా? నువ్వేం చేస్తున్నావిపుడు?”
“నీతో మాట్లాడుతున్నా”
“అబ్బో! జోకా?”
“పో… పోవోయ్‌ ఇంటి కెళ్లి సినిమా చూడు.”
“ఏ ఇంటికి?”
“ఏదో నీ ఇంట్లో చూడు ఫోన్‌ పెట్టేస్తున్నా”
“నీ ఇంటికే వస్తున్నా… కాచుకో”
“నిజంగా”
“అబద్దంగా”
“చచ్చేపనుందని నిన్న ఊదరగొట్టావ్‌”
“నీ దగ్గరకొచ్చా బతుకుదామని”
“రా మరి”
“తలుపు తియ్యిమరి” కాలింగ్‌ బెల్‌ మోగింది.
డోర్‌ తీస్తుంటే అతనికంటే ముందర పొగడపూల పరిమళం లోపలకొచ్చి గదినీ, ఆమెనీ కూడా చుట్టేసింది.
“దోసిలి పట్టు”
దోసిలి నిండా పొగడపూలు పోశాడు.
“ఇన్ని పూలు ఎక్కడివి నందూ”
“చెట్లవి”
“పొగడపూలు చెట్లకి పూస్తాయా? హృదయానికి అనుకున్నా”
“లుంబినీలో దొంగతనం చేశా”
దోసిలి అలాగే వుంచి చేతులు చాపింది.
ఆరడుగుల మనిషి అందంగా వొంగి ఆమె దోసిట్లో ముఖాన్నాన్చాడు. ఆ ఆనందాన్ని తట్టుకోలేనట్టేగా కొన్ని పూలు కిందకి జారిపోయాయి.
మెల్లగా ఆమె చుట్టూ చేతులేసి
“ఐలవ్‌ యూ మధూ”
“నా కోసం ఈ పూలన్నీ ఏరుకొచ్చావా?”
“నీ కోసం కాదు”
“మరి?”
“నా కోసమే”
“అదేంటి?”
“నీ దోసిట్లో పోసినప్పుడు నీ ముఖంలోని సంతోషాన్ని చూడ్డం కోసం.”
“అంత ప్రేమా?”
“ఇంత ప్రేమ” అంటూ గట్టిగా ఆమెను హత్తుకున్నాడు.
ఆ ఊపులో పూలన్నీ నేలమీద రాలి పోయాయి.
“అన్నీ కిందపడిపోయాయి ఫో…”
“మనం కూడా కింద పడితే సరిపోతుంది కదా?”
ఫక్కున నవ్వింది మధుర. ఆమె నవ్వులోని కాంతి అతని ముఖం మీద ప్రతిఫలించింది. బుద్ది మంతుడిలా పూలన్నీ ఏరి టేబుల్‌ మీద పోసాడు.
“మన పరిచయమై ఆరు నెలలా? అరవై సంవత్సరాలా మధూ”
“ఓయ్‌! నాకు నిండా మూడు పదుల్లేవు”
“అయినా టీనేజ్‌ అమ్మాయిలా ఇంత అందంగా ఎలా వున్నావ్‌?”
“వయసుకి, అందానికి సంబంధమేమిటి?” నవ్వింది.
“ఇంత అందంగా హాయిగా ఎలా నవ్వగలవ్‌ నువ్వు?”
“నవ్వడానికి హద్దులున్నాయా నందూ?”
“హద్దుల్లేవుగానీ ఆంక్షలున్నాయిగా”
“ఇక ఏ ఆంక్షలకీ లొంగేదాన్ని కాదు.”
“నాకు తెలుసుగానీ నీకింత లైవ్లీనెస్‌ ఎలా అబ్బింది?”
“జీవితం నేర్పింది”
“ఈ జీవితమా? గత జీవితమా?”
“గత జీవితంలో నుండి నేర్చుకున్న గుణపాఠమే ఈ కొత్త జీవితం”.
“నిన్నెప్పుడూ దిగులుగా, దు:ఖంగా చూడలేదు నేను.”
“నేను దు:ఖసాగరాల్ని, చీకటి అమావాస్యల్ని దాటి వచ్చేసాను. ఇప్పుడంతా పున్నములే, వెన్నెల స్నానాలే”
“నువ్వు మాట్లాడుతుంటే హాయిగా, రిలాక్సింగ్‌గా వుంటుంది.”
“నన్ను పొగడ్డమే పనిగా పెట్టుకున్నావా? ఈ రోజు? సినిమా చూడ్డానికి వచ్చి ఈ పనిలో పడ్డావేంటి నందూ”
“ఇది పొగడ్త కాదు నీ సామీప్యత నాకు కలిగిస్తున్న పారవశ్యం. నువ్వు అడుగుపెట్టినంత మేరా నా జీవితం సంతరించుకున్న పచ్చదనం. సినిమా చూసే మూడ్‌పోయింది గానీ నీ నవల ఎంత వరకు వచ్చింది?”
“ఇవాళ ఏమి రాయలేదు. నువ్వు కవిత్వం చెప్తున్నావే?”
“కవిత్వమా? నేనే…నా ముఖం లే. నువ్వెందుకు రాయలేదు?”
“ఆఫీసులో కొంచెం బిజీ. ఇంటికొచ్చేసరికి బాగా అలిసిపోతున్నా.”
“వంట్లో బాగానే వుంది కదా!”
“బాగానే వుంది. డోన్ట్‌ వర్రీ అలసట. అంతే”
“ఇలా అయితే ఎప్పటికి పూర్తవుతుంది?”
“ఏమో! తెలియదు.”
“అదేంటి?టార్గెట్‌ లేదా?”
“సృజనాత్మకతకి టార్గెట్లుండవు బాబూ! ఇదేమైనా ఆఫీసు ప్రాజక్టునుకున్నావా? ఏదో ఒకటి రాసేయడం నాకిష్టం లేదు.”
“నాకేం తెలుసు చెప్పు”.నేనేమైనా రైటర్‌నా?”
“టైమ్‌ చాలడం లేదు. టైమ్‌ దొరికినప్పుడు మూడ్‌ వుండడం లేదు.”
“సరే తల్లీ! నీ నవల , నీ ఇష్టం. తిండానికైమేనా వుందా?”
“ఆకలిగా వుందా? ఇంకా ఏమీ వండలేదు”.
“వండుకుందాం పద”.
“ఫ్రిజ్‌లో కూరలున్నాయి. అన్నం పెడితే చాలు.”
“అయితే నేను కుక్కర్‌ పెడతాను. నువ్వు కూరలు తీసి ఓవెన్‌లో వేడి చేసేయ్‌”.
“సరే! అన్నం అయ్యే లోపల స్నానం చేద్దామా?”
“సరిగంగ స్నానాలా?”
“లేదు జలపాత స్నానాలు”
“జీవితంలో ఇంత సంతోషముంటుందని నిన్ను కలిసాకే నాకు తెలిసింది మధూ.”
“సంతోషం ఎప్పుడూ మన చుట్టూనే వుంటుంది. దాన్ని గుర్తించడంలోనే వుంది మన తెలివంతా.”
“నిజమే! జలపాత స్నానాలకి జలపాతాల దగ్గరికే వెళ్లనక్కర్లేదు. ఫోర్స్‌గా వస్తున్న ఈ షవర్‌ చాలదా?”
“ఆ ధ్రిల్‌ వేరులే.”
“థ్రిల్‌ వేరేగానీ ఈ దగ్గర తనం అక్కడ కుదరదుగా! తలకోన జలపాతాలు అద్బుతంగా వుంటాయట. వీకెండ్‌కి వెళదామా? మధూ.”
“నీతో రావడానికి ఎక్కడికైనా, ఎప్పుడైనా నేను రెడీ నందూ”.
“ఎక్కడికైనా వస్తావా?”
“ఆహా! ఎక్కడికైనా సరే. ఆకాశం అంచుల దాకా రమ్మన్నా వస్తాను”.
“నా మీద అంత నమ్మకమా?”
“నా మీద నాకు నమ్మకం.”
“నా మీద ప్రేమేనా?”
“మన బంధం మీద నమ్మకం. ప్రేమ.”
“ఈ బంధాన్ని ఏమంటారు?”
“నాకూ తెలియదు. లివింగ్‌ టు గెదర్‌ హేపీలీ.”
“నీకు భవిష్యత్తు గురించి భయం లేదా?”
“ఎవరి భవిష్యత్తు?”
“మనదే”
“ఇప్పుడేమైంది మన భవిష్యత్తుకి?”
“ముందు ముందు ఏం జరుగుతుందో…”
“నాకలాంటి భయాలేం లేవు నందూ. దేన్నయినా ఎదుర్కొవడానకి నేనెప్పుడూ సిద్దమే.”
“ఈ చిన్ని గుండెలో అంత నిబ్బరం ఎక్కడ వుంది? ఎలా వచ్చింది నీకు? గుండె మీద ముద్దు పెట్టాడు.
“జీవితమే నేర్పింది..” తడిగా వున్న అతని పెదాల మీద మధురంగా తన పెదాలాన్చింది. స్నానాలు ముగించి బయటకొచ్చారు.
“అన్నం అయ్యింది తిందామా?”
“నీకు బాగా ఆకలవుతున్నట్లుంది. సారీ. ఆలస్యమైంది.”
“ఏం ఫర్వాలేదులే మధూ. బయట వాతావరణం మారినట్లుందే.”
“అవును. వాన వచ్చేట్టుగా వుంది.”
ఆకాశం నిండా నల్లమబ్బులు . ఉరుములు, మెరుపులు. బాల్కానీలో నిలబడ్డారు. వర్షం మొదలైంది. ఎండాకాలపు వానకి తడిసి మట్టి కమ్మటి వాసనేస్తోంది.
“వానలో తడుద్దామా?” మధుర.
“జలుబు, జ్వరం లాంటి ఏమీ రావుగా”.
“వస్తే రానీ. నాలుగు రోజులు తుమ్మితే నష్టమేమీ లేదు లేవోయ్‌! వానలో తడుస్తూ ఐస్‌క్రీమ్‌ తినడం భలే బావుంటుంది.”
“యూ ఆర్‌ సో డిఫరెంట్‌.”
“ఎలా?”
“వర్షంలో తడవడమే భయం. మళ్లీ చల్లగా ఐస్‌క్రీమ్‌ తినడం.”
“నీకు ఇన్ని భయాలున్నాయా నందూ” అల్లరిగా నవ్వింది. “నాకేం భయాలు లేవు. పద వెళదాం.”
“నీకు రోషమొచ్చినప్పుడు భలే ముద్దొస్తావ్‌ నందూ” అంటూ ముద్దు పెట్టింది. నవ్వేసాడు.” పద వెళదాం మరి.”
ఫ్లాట్‌కి తాళం వేసి లిఫ్ట్‌లో కిందికి దిగారు.
“వాన బాగానే పడుతోంది మధూ.”
“అందుకేగా బయటకి వచ్చాం.”
“బైక్‌ మీద వెళదామా? కారులోనా?
“కారులోనే వెళదాం. మధ్యలో ఆపి నడుద్దాం.”
“ఒకే డన్‌. నువ్వు నడుపుతావా? నేను నడపనా.
“నువ్వే నడుపు. నేను వానని ఎంజాయ్‌ చేస్తాను.
టేప్‌ రికార్డర్‌ ఆన్‌ చేసింది. జగ్‌జీత్‌సింగ్‌ గజల్స్‌. జోరున కురుస్త్తున్న వర్షం మంద్రంగా, మధురంగా విన్పిస్తున్న జగ్‌జీత్‌సింగ్‌ గళం. కొంత దూరం వెళ్లాక…
“ఇక్కడ ఆపు నందూ! కొంచెం సేపు నడుద్దాం…”
ఆ వానలో మధుర చేతిలో చెయ్యేసి నడవడం చాలా థ్రిల్లింగ్‌గా అన్పించింది నందూకి.
“తడిసిపోయేవేవీ జేబులో లేవుగా నందూ! నేనయితే ఏమి తేలేదు.”
“ఏమి లేవులే. పర్స్‌ కారులోనే పడేసాగా.”
ధారలుగా కురుస్తున్న వాన. ఇద్దరు మొత్తం తడిసి పోయారు.
“మనం పెళ్లి చేసుకుందాం మధూ”
“ఇప్పుడు బాలేదా? మీ వాళ్లు మన పెళ్లికి ఒప్పుకుంటారా?”
“ఒప్పుకోరు”
“మన మధ్య వయసు తేడా! అండ్‌ యూ ఆల్‌ సో లాష్ట్‌ యువర్‌ హజ్బెండ్‌”
“సో వాట్‌? మగవాళ్లే ఎందుకు పెద్ద వాళ్ళయ్యుండాలి? చిమ్మ చీకటిలాంటి నా మొదటి పెళ్లి..నా భర్త మరణం.. ఇందులో నా తప్పేముంది?”
“నేనెప్పుడూ అలా ఆలోచించలేదు మధూ. నీ బలమైన వ్యక్తిత్వం, నీ ప్రేమ, చైతన్యం ముందు అవన్నీ ఎందుకూ కొరగావు.”
“నేను నా గత జీవితంలోని అంధకారంలోంచి బయటపడి వెన్నెల దారుల వెంట నడవాలనుకుంటున్నాను. నందూ! నీ స్నేహం, నీ ఆత్మీయత చాలా అపురూపం నాకు. ఈ చిన్న జీవితంలో అప్పుడే ముఫ్పై యేళ్లు గడిచిపోయాయి. మిగిలిన జీవితాన్నయినా నా కిష్టమైనట్టు మలుచుకోవాలని ఆశ. నీ స్నేహ సాహచర్యంలో దాన్ని సాధించగలననే నమ్మకముంది నాకు…” అతని చేయిని మృదువుగా నొక్కింది.
“మధూ! నీ సామీప్యత, స్నేహం నాకెప్పుడూ కావాలి. పెళ్లయితే నేను మారిపోతానని, మామూలు మొగుడు అవతారమెత్తుతానని నీ అనుమానం కదూ!”
“అలా అని నేన్నానా? అయినా అలాంటి సందర్భం వస్తే ఏం చేయాలో నాకు బాగా తెలుసు లేవోయ్‌! సహజీవనంలో స్నేహం కరువైతే నా దృష్టిలో అది వేస్ట్‌ట” కళ్లు మిరుమిట్లు గొల్పుతూ ఒక మెరుపు తీగ ఆకాశంలో పరుగులు తీసింది. ఆ వెంటనే ఫెళ ఫెళర్భాటాలతో ఉరుము ఉరిమింది.”
“మధూ నేనెప్పుడూ ఇలాంటి వర్షంలో తడవ లేదు. మా అమ్మ నన్ను వర్షంలో తడవనిచ్చేది కాదు. వానలో తడుస్తూ నడవడం ఇంత అద్భుతంగా వుంటుందని నాకు తెలియదు.”
“జీవితంలోని చిన్న చిన్న ఆనందాలకి, సంతోషాలని మనం ఇలాగా కోల్పోతుంటాం. ఎవరో ఒకరు అడ్డుపడుతుంటారు.”
“నాకు జలుబు చేసి జ్వరమొస్తుందని అమ్మ భయం”.
“ఒక్కోసారి ఏమి కాకపోవచ్చు కూడా. ఏదో అవుతుందనే భయం. మనల్ని పీడిస్తూ ఎన్నింటినో దూరం చేస్తుంది.”
“వెనక్కి వెళదామా? వాన ఇంకా ఎక్కువ అవుతోంది.”
“ఇప్పుడు వాన ఎక్కువైనా తక్కువైనా మనకి నష్టమేమిటి? మొత్తం తడిసిపోయాం కదా?”
“అవుననుకో. అయినా బాగా రాత్రయింది వెళదాం పద.”
“సరే! నాకేమైనా అవుతుందని నీకు భయం మొదలైంది కదూ! ఏమి కాదులే. అయినా ఎలాగూ రేపు డాక్టర్‌ దగ్గరికి వెళ్లాలిలే” వెనక్కి తిరిగి కారు వైపు నడక సాగించారు. ఇద్దరి మధ్య కొంచెం సేపు నిశ్శబ్దం అల్లుకుంది.
“ఏమాలోచిస్తున్నావ్‌ నందూ! సడన్‌గా కామ్‌గా అయిపోయావేమిటి?”
“ఎందుకో మన మొదటి పరిచయం గుర్తొచ్చింది.”
“ఇంత సంతోషకరమైన వేళ అదెందుకు గుర్తు కొచ్చింది? డాక్టర్‌ దగ్గరికి వెళదామన్నాననా?”
“ఈ సంతోషం శాశ్వతమైతే ఎంత బావుంటుంది మధూ?”
“ఏది శాశ్వతం చెప్పు నందూ! ఈ క్షణంలో ఈ పిడుగులు మన మీద పడొచ్చు. ఏమైనా జరగొచ్చు.”
“నువ్వు చాలా ఫిలసాఫికల్‌గా మాట్లాడగలవు. నీకు రేపటి గురించి భయమేమీ లేదు.”
“భయం లేదని ఎలా అనుకుంటావ్‌? కానీ భయపడి ఏం చేయగలం? మిగిలినకాలానైన్నా సంతోషంగా గడపొచ్చు కదా!”


“పాజిటివ్స్‌ నెట్‌ వర్క్‌ మీటింగ్‌లో నీ మాటలు విని నేను చాలా ప్రభావితమయ్యాను. అప్పటి వరకూ నాకు బతుకంతా నిరాశే. ఆత్మహత్య చేసుకోవాలని ఎన్నోసార్లు అనుకున్నాను. బైక్‌ యాక్సిడెంట్‌ అయినప్పుడు నాకు రక్తం ఎక్కించిన డాక్లర్లని రోజూ శపించేవాడిని. పిచ్చిగా ఏడిచేవాడిని. నీ పరిచయం నాలో తిరిగి జీవితేచ్చను రగిలించింది. మధూ!”.
ఆమె గుప్పిట్లో అతని చెయ్యి వణికింది. కళ్లలోకి ఉబికొచ్చిన కన్నీళ్లు వానధారలో కలిసిపోయాయి.
“నేనూ చాలా ఏడ్చాను నందూ! విలువైన కన్నీళ్లని చాలానే ఒలకబోసుకున్నాను. నా మొగుడు ఆస్తిగా నాకు హెచ్‌ఐవిని పంచి చనిపోయాడు. నా బిడ్డ కూడా పాజిటివ్‌గా పుట్టి చనిపోయింది. బతుకు నిండా చీకటి. కానీ నేను కూడదీసుకున్నాను. మిగిలిన జీవితాన్నైనా సంతోషంగా గడపాలనుకున్నాను. మనలాంటి వాళ్ల గురించి ఎన్నో పుస్తకాలు చదివాను. కొండంత ధైర్యమొచ్చింది. నీ పరిచయం, నీ స్నేహం నాలో అన్ని దిగుళ్లని దూరం చేసాయి నందూ!”
వర్షం కొంచెం తగ్గుముఖం పట్టింది. కారులో కూర్చున్నాక-
“ఐస్‌క్రీమ్‌ ఏది?”
“కొందాం. మరీ చిన్నపిల్లలా మారాం చేస్తావే.”
“నీ దగ్గర లేకపోతే ఇంకెవరి దగ్గర గారం చెయ్యగలను చెప్పు?”
ఐస్‌క్రీమ్‌ పార్లర్‌ దగ్గర ఆపి రెండు కోన్స్‌ కొనుక్కొచ్చాడు.
“మధూ! రేపు డాక్టర్‌ దగ్గరికి నేనూ వస్తాను. మనం వచ్చే వారం తలకోన వెళుతున్నాంగా.”
“వెళదాం. నీతో ఎక్కడికైనా వస్తానని చెప్పాగా.”
“అలాగే తిరుపతికి వెళదామా?”
“ఎందుకూ?”
“పెళ్లి చేసుకుందాం?”
ఫక్కున నవ్వింది మధుర.
“ఎందుకు నవ్వుతావ్‌?”
“మనకెవడయ్యా తిరుపతిలో పెళ్ళి చేసేది? ఇద్దరు హెచ్‌ఐవి పాజిటివ్‌లు. చిన్న పెళ్లికొడుకు, పెద్ద పెళ్లికూతురు. పైగా భర్త పోయిన దానికి అక్కడ పెళ్లి చేస్తారని నీకు అంత నమ్మకమా నందూ?”
“ఏం? ఎందుకు చెయ్యరు?” ఉక్రోషం ముంచుకొచ్చింది.
“నా పిచ్చి నందూ! నువ్వెంత అమాయకుడివి. అయినా మనం పెళ్లి చేసుకు తీరాలి అని ఎందుకు పట్టుపడుతున్నావ్‌?”
“కారణాలు నేను చెప్పలేను మధూ! నువ్వు దూరం అయితే నేను భరించలేను.”
“నేనెందుకు దూరమవుతాను? ఇద్దరం ఒకే పడవలో కదా! ప్రయాణిస్తున్నాం. పెళ్లి చేసుకోకపోవడం అనేది నా దృస్టిలో అంత ముఖ్యమైనది కాదు. ఇద్దరి మధ్య స్నేహం, ప్రేమ, ఆత్మీయత బతికి వుంటే చాలు. మనం బతికున్నంత కాలం హాయిగా వుంటాం. మనకి ఆ బలం చాలదూ?”
“నిజమే అనుకో. నీ ప్రేమే కదా నన్ను బతికిస్తోంది. నీ సాన్నిహిత్యం దూరమైతే నాకు ఇంకేం మిగలదు.”
“నందూ! మన సహజీవనాన్ని సంతోషమనే పునాది మీద పునర్మించుకుందాం. నేను నిన్ను దూరం చేసుకోలేను. మనం మనలాంటి వాళ్లకి ఆదర్శమవుదాం. వాళ్లకి ధైర్యాన్నివ్వడం కోసం పని చేద్దాం. సరేనా!” నందూ చేతిని తన చేతిలోకి తీసుకుని సున్నితంగా నొక్కింది. ఇంటికొచ్చేసారు.
“కార్లో వెళ్లి కూడా ముద్దలా తడిసిపోయారేంటమ్మా.”
వాచ్‌మెన్‌ ఆశ్చర్యానికి వారిరువురి నవ్వులే సమాధానం.
“ఏంటో… ఎందుకు తడిశారో. ఎందుకు నవ్వుతున్నారో” ముసుగుతన్నాడతడు.
నందూ, మధుర ప్లాట్‌ తాళం తీసి లోపలికెళ్లి తలుపేసుకున్నార

తర్పణాలు త్రిశంకు స్వర్గాలు

 తర్పణాలు, త్రిశంకు స్వర్గాలు ............ మా సీతారాంపురం లో మా తాతకి చాలా పొలాలు ఉండేవి. మా తాత, చిన్న తాత ఇద్దరే పొలాలన్నింటిని పంచుకున్నా...