Monday, May 28, 2007


చిక్కటి అడవిలో రెక్కవిప్పుతున్న చైతన్యం
కొండవీటి సత్యవతిలయోలా ఇంటిగ్రేటెడ్‌ ట్రైబల్‌ డెవలప్‌మెంట్‌ సొసైటీ చింతూరు మండలం కాటుక పల్లి వారి తరఫున వారు జరుపబోయే అంతర్జాతీయ మహిళాదినం సమావేశంలో పాల్గొన వలసిందిగా ఆహ్వానించ డానికి మోహన చంద్రగారు నా దగ్గరికి వచ్చినపుడు నేను కొంత తటపటాయించాను. అయితే ఈ సమావేశం దట్టమైన అడవిలో రెండు వేలమంది పైగా గిరిజన స్త్రీలతో జరుగుతుందని ఆయన చెప్పగానే నేను వెంటనే ఒప్పేసుకున్నాను. నాతో పాటు డాక్టర్‌ సమత రోష్ని, పంతం సుజాత, భూమికలో పనిచేసే లక్ష్మి కూడా బయలు దేరారు.

పన్నెండున మేం నలుగురం మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్‌లో బయలుదేరి ఉదయం ఐదింటికి భద్రాచలం రోడ్‌లో దిగాం. మోహనచంద్ర కూడ మాతో వున్నారు. స్టేషన్‌లో మా కోసం క్వాలిస్‌ సిద్ధంగా వుంది. మేం అయిదుగురం ఎక్కగానే మా వాహనం భద్రాచలం వేపు బయలు దేరింది. కొత్త గూడెం నుండి భద్రాచలం దాదాపు నలభై కిలోమీటర్లుంది. అపుడపుడే తెల తెల వారుతోంది. చెట్లన్నీ మంచు ముసుగే సుకుని వున్నాయి. చల్లటి గాలి హాయిగా ఒళ్ళంతా నిమురుతోంది. పాల్వంచ, వెంటనే కిన్నెరసాని వాగు దాటాం. భద్రాచలంలో పెట్రోలు బంకు దగ్గర ఆయిల్‌ కోసం ఆగినపుడు ఆ బంకు యజమాని మమ్మల్ని వాళ్ళింటిలోకి ఆహ్వానించారు. మేం బ్రష్‌్‌ చేసేసుకుని, కాలకృత్యాల కార్యక్రమం పూర్తి చేసేసాం. పెట్రోలు బంకు చుట్టూ రాశులు పోసిన, ఎర్రటి తివాసీలా ఆరబెట్టిన ఎండుమిర్చి మా కళ్ళను కట్టి పడేసింది. గొంతులో గరగర మంటుంటే కొంచెం తులసి ఆకు కోసుకోవచ్చా అని ఇంటావిడను అడిగినపుడు స్నానాలు కాలేదుగా తెంపొద్దు అని మర్యాదగా చెప్పింది. ఆవిడ మాటల్ని మన్నించి, చెట్టు మీద చెయ్యి వేయకుండా బుద్ధిగా వచ్చి మా బండిలో కూర్చున్నాం. మళ్ళీ మా ప్రయాణం మొదలైంది. తూరుపు దిక్కు ఎర్రబారుతోంది. మేం తిన్నగా తూర్పువేపే వెళుతున్నాం. మహాద్భుతమైన దృశ్యం మా కంటబడింది. ఎర్రటి సూర్యబింబం రోడ్డుకు ఆ చివర మమ్మల్ని రా రామ్మని పిలుస్తూ మాకు దారి చూపిస్తూ మా ముందు పరుగులు తీస్తోంది. తిన్నటి ఆ రోడ్డు మీద మేం కన్నార్పకుండా బింబం వెంట పడి వెర్రి పరుగులు తీసాం. మాకు దిశానిర్దేశం చేస్తూ, దారి చూపిస్తున్న ఆ ఎర్రదనానికి ముగ్ధులమౌతుండగానే దారికిటూ, అటూ విస్తరించిన అడవి, ఆ అడవిలో సూర్యుడి ఎర్రదనంతో పోటీ పడుతూ, ఆకు కూడా కన్పించని మోదుగు పూల రాశులు. అడవి తగలబడుతున్నదా అన్నంత భ్రాంతికి లోను చేసిన మోదుగ చెట్ల నిండా, నిలువల్లా విచ్చుకున్న ఎర్రటి, కాషాయపు రంగు పూలు. మేం ఈ తన్మయత్వంలో మునిగి ఉండగానే మా వాహనం కాటుకపల్లిలో లిడ్స్‌ ఆఫీసు ముందు ఆగింది. ఫాదర్‌, నర్సులు, సిబ్బంది మమ్మల్ని ఆహ్వానించారు. విరగబూసిన వేప చెట్లు, చిరు చేదు వాసనలు వెదజల్లుతున్నాయి. ఆ చెట్ల కింద కూర్చుని చాలా మంది పిల్లలు అల్పాహారం ఆరగిస్తున్నారు. నర్సులుండే గదులకెళ్ళి మేం స్నానాదులు పూర్తి చేసి టిఫిన్‌ తిన్నాం.

మా కోసం పిల్లలు ఎదురు చూస్తున్నారని, మీటింగ్‌ మొదలవ్వడానికి ఇంకో రెండు గంటలు పడుతుందని చెప్పారు. బాల కార్మికులుగా వుంటూ మొదటి సారి చదువుకుంటున్న ఆడపిల్లలు, మగపిల్లలు ఒక తరగతి గదిలో కూర్చుని వున్నారు. రెండు గంటల పాటు వాళ్ళతో మా సంభాషణ కొనసాగింది. ఒక్కొక్కరిది ఒక్కో వ్యధాపూరిత గాథ. దట్టమైన అడవి లోపలి వాళ్ళ జీవన చిత్రాల్ని ఒకొరి తర్వాత మరొకరు మా ముందు ఆవిష్కరించారు. ఎంతో స్పష్టంగా, స్వచ్ఛంగా మాట్లాడారు. ఆ పిల్లలు తమ బతుకుల్లోని దుఃఖాన్ని విప్పి చెబుతున్నపుడు మా కళ్ళు తడిసిపోయాయి. అరకపట్టి పోడు వ్యవసాయం చేసిన పదేళ్ళ పిల్లవాడి అనుభవం మా గుండెల్ని పిండేసింది. వాళ్ళ ఆశలు, ఆకాంక్షలు, భవిష్యత్‌ ప్రణాళికలు, జీవితంపట్ల వాళ్ళ ఆశావహదృక్పథం మమ్మల్ని ఉక్కిరి బిక్కిరి చేసాయి. మా సంభాషణలు ముగింపుకొస్తున్నపుడు ఒక పిల్ల చటుక్కున లేచి నిలబడి, ముత్యాల్లాంటి తన పలువరుస మెరిసిపోతుండగా (అన్నట్లు మర్చిపోయాను మాతో మాట్లాడిన పిల్లలందరి పలువరుసలు మల్లెపువ్వంత తెల్లగా వుండి, సెలయేరంత స్వచ్ఛమైన నవ్వుతో మెరిసిపోయాయి. బుగ్గలు సొట్టలు పడి ముసి ముసి నవ్వుల్ని పూయిస్తున్నపుడు నేను ఆ మాట వాళ్ళకి చెబితే ఎంత సంబరంగా నవ్వారో!!) “మా జీవిత కథలు విన్నారుగా మేడం! మీరు మా కోసం ఏం చెయ్యగలరు?” అని సూటిగా వేసిన ప్రశ్న మా గుండెల్ని తాకింది. మీ గురించి పత్రికలో రాసి మీ సమస్యల గురించి అందరికీ తెలిసేలా చేస్తామని మేం పేలవమైన సమాధానం చెప్పాం. అంతకన్నా ఇంకేం చెప్పలేకపోయాం! ఆ తర్వాత డ్వాక్రా సంఘాల స్త్రీలతో మా సంభాషణ మొదలైంది. అయితే ఈ లోపే వేదిక మీద పాటలు మొదలై మా మాటలు ఒకరికొకరికి వినబడలేదు. మీటింగ్‌ అయ్యాక మాట్లాడుకుందాంలే అనుకుని, వాళ్ళతో కొంత సేపు నృత్యం చేసాం.అప్పటికే చాలామంది స్త్రీలు వచ్చారు.ఇంకా చాలామంది బయలుదేరి వస్తున్నారని, కొండలు దిగి, అడవి లోలోపలి నుండి వస్తున్నారని నిర్వహకులు చెప్పారు. ముఖ్యంగా కోయ, కొండరెడ్డి, గొత్తి కోయ, నాయక్‌ వర్గాలకు చెందిన స్త్రీలు వస్తారని చెప్పారు. ఒంటిగంటకి సభాస్థలి మొత్తం నిండి పోయింది. మోకాళ్ళ వరకు చీరకట్టి, పక్కకొప్పుల్లో పూలు పెట్టిన మహిళలతో ఆ ప్రాంతమంతా కళకళ లాడింది.

సభా కార్యక్రమం మొదలైంది. ఉపన్యాసాల వెల్లువ తక్కువగా వుండి సాంస్కృతిక కార్యక్రమాలు ఎక్కువగా వుండడం ఈ కార్యక్రమంలో విశేషం. సంప్రదాయ గిరిజన నృత్యాలు, లంబాడా నృత్యాలు, గుత్తి కోయ మహిళల నృత్యం ముఖ్య ఆకర్షణలుగా నిలిచాయి. వివిధ సామాజిక సమస్యల మీద పిల్లలు వేసిన నాటికలు ఎంతో స్ఫూర్తి దాయకంగా వున్నాయి. బాల కార్మిక వ్యవస్థ మీద, పిల్లల హక్కుల మీద, ఆడపిల్లలు, స్త్రీల అక్రమ రవాణా మీద, హెచ్‌ఐవి/ ఎయిడ్స్‌ మీద పిల్లలు అద్బుతమైన, నాటికలు ప్రదర్శించారు. వీటన్నింటిని వాళ్ళ స్వంత భాషలో ప్రదర్శించడంతో సభాస్థలి ముందు భాగంలో కూర్చున్న పిల్లలు, వెనుక కూర్చున్న మహిళలు ఎంతో బాగా స్పందించారు. మేము పిల్లల్ని అడిగి అనువాదం చేయించుకున్నాం. సమత, నేను చాలా క్లుప్తంగా ఆ మీటింగ్‌లో మాట్లాడాం.

వివిధ అంశాల మీద పిల్లలు ప్రదర్శించిన నాటికలు ఆయా సమస్యల పట్ల చాలా స్పష్టమైన వైఖరితో, సూటీగా వున్నాయి. అల్లగూడెం నుంచి వచ్చిన జానకి, మాధిగూడెం నుంచి వచ్చిన సావిత్రిలు తమ జీవిత కథనాలు విన్పించారు. నాలుగవు తుండగా సభ ముగింపుకొచ్చింది కాని గిరిజన స్త్రీలు ప్రధానంగా ఎదుర్కొంటున్న ఒక ముఖ్యమైన సమస్య గురించి ఎలాంటి ప్రస్తావనా లేకపోవడం మమ్మల్ని ఆశ్చర్య పరిచింది. మైదాన ప్రాంతాల నుంచి వచ్చే పురుషులు ప్రేమ పేరుతో గిరిజన స్త్రీలను వివాహాలు చేసుకుని పిల్లలు పుట్టగానే వదిలేసి వెళ్ళిపోవడం, అలా పుట్టిన పిల్లలు తమ తల్లి కులాన్ని కోల్పోవడం, తండ్రి అగ్రకులానికి చెందితే, వదిలేసి పోయినా సరే ఆ కులమే సంక్రమించడం, దీనివల్ల వారికెదురౌతున్న సమస్యల గురించి ఎలాంటి ప్రస్తావన లేకుండానే అంతర్జాతీయ మహిళా దినోత్సవ సభ ముగిసింది.

ఆ తర్వాత మేం అక్కడ గిరిజన స్త్రీలు ప్రదర్శించిన వివిధ వస్తువుల్ని చూసాం. గిరిజనుల జీవితంలో భాగమైన ఎన్నో వస్తువుల్ని అక్కడ ప్రదర్శించారు. వాటన్నింటిలోకి మమ్మల్ని ముఖ్యంగా నన్ను ఓ వస్తువు విప రీతంగా ఆకర్షించింది. మొసలి కోరలంత పదునుగా వున్న ముళ్ళతో చేసిన ఓ లావుపాటి గాజు. అది చేతికి ధరించి, ఎవరైనా మన మీద దాడి చేస్తే ఒక్క దెబ్బ వేస్తే చాలు అంగుళం మేర శరీరంలోకి దిగిపోతాయి ముళ్ళు. రక్తాలు కారాల్సిందే. దానిని సంపాదించాలని నేను ఎన్నో ప్రయత్నాలు చేసాను. దానిని అమ్మడానికి గాని, ఇవ్వడానికిగానీ వారు అంగీకరించలేదు. దాని ఫోటో తీసుకుని తృప్తి పడి మా తిరుగు ప్రయాణానికి సిద్ధమయ్యాం. అందరికీ వీడ్కొలు చెప్పి, అద్భుతమైన అనుభవాలను గుండెల్లో దాచుకుని ఐదుగంటలకి మేం భద్రాచలం వేపు బయలు దేరాం. మా రైలు రాత్రి పదిన్నరకి కాబట్టి మధ్యలో భద్రాచలం గుడి, పంచవటి, కిన్నెరసాని ప్రాజెక్టు చూడాలనుకున్నాం. పంచవటికి వెళ్ళి రావడం కష్టమని మా డ్రెవర్‌ భాస్కర్‌ చెప్పడంతో మేం కిన్నెరసాని ప్రాజెక్టు చూద్దామనుకున్నాం. భద్రాచలంలో గుడికి వెళ్ళాలనుకున్న వాళ్ళు గుడికెళ్ళారు. నేనూ, సమత గోదావరిని చూస్తూ నర్సాపురంలోని మా వశిష్ట గోదావరిని తలుచుకున్నాం. కిన్నెరసాని ప్రాజెక్టుకి వెళ్ళే ముందే అడవి మధ్యలో ఆగి బోలెడు మోదుగపూలు కోసుకున్నాం.

కిన్నెరసాని చేరేసరికి బాగా చీకటిపడి పోయింది. అదంతా దట్టమైన అడవి ప్రాంతం. గేటు మూసేసారు. వెళ్ళడానికి కుదరదన్నారు గేటు దగ్గర. మేం కాస్త బతిమాలి టికెట్టు పేరుతో యాభై సమర్పించాక మమ్మల్ని లోపలికి వదిలాడు. లోపలంతా నిర్మానుష్యం. కీచురాళ్ళ రొదలోంచి “ఎవరదీ ఈ టైమ్‌లో లోపలికెలా వచ్చారు. వెనక్కి వెళ్ళిపొండి “ అని అరిచారు. దూరంగా లైట్ల వెలుగులో డామ్‌ కన్పిస్తోంది. మేం మళ్ళీ లోపలి వాళ్ళని బతిమాలి డామ్‌ మీది కెళ్ళాం. ‘ఇది చాలా ప్రమాదకరమైన ప్రాంతం. ఇలాంటి అడ్వంచర్లు ఇంకెపుడూ చెయ్యకండి’ అని మమ్మల్ని హెచ్చరించి ఫోటోలు తీసుకోవడానికి ఒప్పుకున్నారు. ఆ చీకట్లో డామ్‌ మీద ఫోటోలు తీసుకుని బిక్కు బిక్కు మంటూ అక్కడ్నుంచి బయటపడ్డాం. వెలుతురులో చూడాల్సిన అద్భుత ప్రాంతమిది. సుదీర్ఘంగా విస్తరించిన రిజర్వాయర్‌, అందులో మునిగిన కొండ అస్పష్టంగా కన్పడ్డాయి. అంతకు కొద్ది రోజుల ముందు తగలబెట్టిన గెస్ట్‌హౌస్‌ కళావిహీనంగా, నల్లగా నిలిచి వుంది.

మేం కొత్త గూడెం చేరుకుని రైలెక్కడంతో మా అడవి ప్రయాణం ముగింపు కొచ్చింది. నగరంలో జరిగిన అనేక అంతర్జాతీయ మహిళాదినం సమావేశాలకు, ఈ దట్టమైన అడవిలో జరిగిన గిరిజన స్త్రీల సమావేశానికి ఎంతో వ్యత్యాసముంది. స్త్రీల నుండి, పిల్లల నుండి మేం ఎంతో నేర్చుకున్నాం. వారి సమస్యలను అవగాహన చేసుకునే వీలును ఈ సమావేశం కల్పించింది. ఈ అవకాశం మాకు కల్పించిన, గిరిజన స్త్రీల కోసం, పిల్లల కోసం ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్న లిడ్స్‌ వారికి కృతజ్ఞతలు. ఈ కార్యక్రమంలో పాల్గొనమని ప్రోత్సహించిన ఆక్స్‌ఫామ్‌ గిరిజకి, మమ్మల్ని వెంటబెట్టుకు తీసుకెళ్ళిన మోహనచంద్ర గారికి మా కృతజ్ఞతలు. అడవి తల్లికీ దండాలో అంటూ అడవికి ప్రణమిల్లి, అడవి పుత్రికల చైతన్యాన్ని, పిల్లల స్ఫూర్తిదాయకమైన సంభాషణని మా గుండెల్లో భద్రపరుచుకుని మేం మహానగరంలో మళ్ళీ కాలుపెట్టాం.
మా వేసవి శిబిరం ముగించాలంటే నాకు చాలా బాధగా ఉంది.పిల్లలు బాగా అలవాటయ్యారు.చక్కగా పాడతారు.నేను ఈ మధ్య భద్రాచలం అడవుల్లోకి వెళ్ళాను.అక్కడ గిరిజన మహిళలు మార్చ్ 8 అంతర్జాతీయ మహిళా దినం సమావేశానికి నన్ను పిలిచారు.భద్రాచలానికి షుమారు 50 కిలోమీటర్ల దూరంలో అడవి లోలోపలికి వెళ్ళాము. అదో అద్భుతమైన అనుభవం.ఈ ప్రయాణపు రిపోర్ట్ చదవాలనుకుంటే భూమిక ఏప్రిల్ సంచిక చూడగలరు.ఆ సమావేశంలో మేము చాలా మంది గిరిజన బాల బాలికలతో సంభాషించాము. వారి ఆశలు, ఆశయాలు, కలలు,కోరికలు మాతో మనసు విప్పి చెప్పుకున్నారు.ఆ వివరాలన్ని ఆ రిపోర్టులో ఉన్నాయి. పిల్లలతో గడపడం, వారితో ముచ్చటించడం చక్కటి అనుభవాన్ని ఇస్తాయి.మనం కొంచం ఓపికతో వాళ్ళు చెప్పేది వింటే ఎన్నో సంగతులు చెబుతారు.ఆ గిరిజన పిల్లలతో గడపడం ఎంత ఉత్తేజాన్ని ఇచ్చిందో మళ్ళి సమ్మర్ కాంపులో ఈ పిల్లలు అంతే ఉత్సాహాన్ని పంచారు.వాళ్ళతో కలిసి ఆడడం, పాడడం, వాళ్ళకి మనకి తెలిసినవన్ని నేర్పడం చాలా చాలా బావుంది.వాళ్ళకి రోజుకో వెరైటి పండ్లు,స్వీట్లు,చాకలెట్లు,బిస్కెట్టులు పంచుతున్నాం. అందులో కూడ ఎంతో త్రుప్తి దాగి ఉంటుంది.
మా సమ్మర్ కాంపులో ముగ్గురి పుట్టిన రోజులు సెలబ్రేట్ చేసాం.
ఈ కాంపు ను నిర్వహించడంలో చాలా మంది మిత్రులు సహకరించారు.యద్దనపూడి సులోచనా రాణీ గారు,డా.సునంద, డా. వహీదా,విష్ణు ప్రియ గారు,కే బి లక్ష్మి, భార్గవి ఇలా ఎందరో మిత్రులు తమ సమయాన్నిచ్చికొందరు,ఆర్ధిక సహకారాన్ని అందించి కొందరు తోడ్పడ్డారు.వారందరికి క్రుతజ్ఞతలు.
నిజంగా మనం మనసుపెట్టి,నిబద్ధతతో ఏమైనా చెయ్యదలుచుకుంటే, మనం ఒక అడుగు ముందుకేస్తే ఎన్నో చేతులు మనకు సహకరిస్తాయి.ఇది నా అనుభవం.ఇరవై రోజులకి ముందు ఈ పిల్లలెవరో కూడా నాకు తెలియదు.కాని ఇప్పుడు వీళ్ళంతా నాకు ఆత్మీయులు.ఆందుకే క్యాంపు ముగించాలంటే దుఖమొస్తోంది నాకు.

Sunday, May 27, 2007


వేసవి శిబిరం ఫోటోలు మరికొన్ని
వేసవి శిబిరం ఫోటోలు
నేను మరి కొంత మంది మిత్రులు కలిసి మే10 నుండి బేగుంపేట్ లోని మక్తా అనే ప్రాంతంలో పిల్లలకోసం ఒక వేసవి సిబిరం నడుపుతున్నామని ఇంతకు ముందు మీకు తెలియచేసాను.జూన్ 2న ఆ శిబిరాన్ని ముగించాలనుకుంటున్నాం. ఎందుకంటే జూన్ మొదటి వారంలోనే కొన్ని పాఠశాలలు రీఓపన్ కాబోతున్నాయి. ఈ వేసవి సిబిరం నడపడం నాకో అద్భుతమైన అనుభవం.30 మంది పిల్లల్ల్ని పోగేసి ఆటలు,పాటలు న్రుత్యాలు,డ్రాయింగ్ నేర్పించడం, వాళ్ళతో కలిసి ఆడడం, ఎగరడం అన్నీ చక్కని అనుభవాలే. మామూలుగా అయితే ఈ పిల్లలు సమ్మర్ కాంపులకు వెళ్ళగలిగిన వారు కాదు. మేము అనుకోకుండా ఈ కాంపు పెట్టడం పిల్లలకెంతో సంతోషాన్ని కలిగించింది.వాళ్ళ సంతోషం మాకు ఎంతో త్రుప్తినిచ్చింది.ఈ కాంపు లో పాల్గొన్న పిల్లలంతా ఎంతో ఉత్సాహంతో మేము చెప్పినవన్నీ నేర్చుకున్నారు.అద్భుతమైన బొమ్మలేసారు.రధాలు తయారు చేసారు.వాటిని చక్కగా అలంకరించారు.మీకోసం కొన్ని ఫోటోలు ఇవిగో.

ఇంకా ఉంది.....

Tuesday, May 22, 2007

తల్లుల దినం పెట్టమని ఇక్కడి తల్లులెవరూ అడగలేదు.ఎవడో పెట్టిన ఆ దినాన్ని అడ్డం పెట్టుకుని ఈ దేశంలోని తల్లులందరి మీద అవాకులు చెవాకులు రాసిన కుసంస్కారులకు ఓ దణ్ణం.ఈ దాడి లో పాత్ర వహించిన సోదరీమణులకు మరిన్ని దణ్ణాలు.నిజమే నవమాసాలూ మోసి మిమ్మల్ని కన్నారు,పెంచారు, మీరు ఏడిస్తే వాళ్ళూ ఏడ్చారు,మీరు నవ్వితే వాళ్ళూ నవ్వారు.మీ ఉచ్చ గుడ్డల్ని ఉతికి, మీ ఎంగిలి మూతుల్ని తుడిచి,మీకు రోగమొస్తే రాత్రంతా మేలుకుని కంటికి రెప్పలా కాచుకున్నదుకు అహహ !ఏమి గొప్ప బహుమానం ఇచ్చారండీ. శహభాష్.
తల్లుల్ని ఉతికి ఆరెయ్యడానిని,మీ కచ్చ తీర్చుకోవడానికి స్త్రీవాదుల మీద మీ నోటికొచ్చినట్టు మాట్లడారే? మీకసలు స్త్రీవాదమంటే ఏమిటో తెలుసా? స్త్రీవాదం ఏమిచెప్పిందో మీలో ఎవరైనా చదివారా?
చదవకుండా ఎలా మాట్లాడతారు?
తల్లి తండ్రుల్ని తిండి పెట్టకుండా తన్ని తగలేస్తున్న ఈనాటి పిల్లల ఏలాంటి భావజాలాన్ని ఒంట పట్టించుకుంటున్నారో ఇప్పుడు స్పష్టంగా అర్ధమైంది. జన్మ నిచ్చిన తల్లిని సైతం షరతులకు లోబడే గౌరవించే ఇలాంటి పుత్ర రత్నాన్ని కన్న ఆ తల్లికి చేతులెత్తి మొక్కాల్సిందే

Wednesday, May 16, 2007

ప్రేమ భాష్యం

ఒకరినొకరు ప్రేమించండి
అయితే మీ ప్రేమను ఆంక్షాగ్రస్తం కానీకండి
మీ ఇరువురి ఆత్మల తీరాల మధ్య
కదిలే సంద్రం కావాలి మీ ప్రేమ
ఒకే ప్రేమ చషకాన్ని ఒంపుకునేకన్నా
ఒకరికొరకై ఒకరు
వేర్వేరు మధుపాత్రలు
నింపుకోవడంలోనే ప్రేమ ఉన్నది
మీకున్నది చెరిసగం పంచుకు తినడంలో సౌఖ్యమున్నది
అలాగని ఒకే కంచంలో భుజించనక్కర లేదు
కలిసి సాగించే గాన న్రుత్యాలు స్రుజించే మేలిరకం హాయిలో
ఏకాంత విరహ సౌఖ్యాన్ని విస్మరిచరాదు సుమా!
ఒకే శబ్ద సౌందర్యాన్ని నిర్మించే వీణ తీగలు సైతం
విడి విడిగానే స్పందిస్తాయి కదా!
మనసు విప్పి మాటలు చల్లుకోవడం మహత్తరంగా ఉంటుంది
కానీ మనసు నిచ్చి పుచ్చుకోవడం అన్నది అర్ధం లేని మాట.
మనందరి ఉద్వేగాలకు,ఉల్లాసాలకు మూలాధారమైన
గుండె మనుగడ మన చేతిలో లేదన్నది నిజం కదా!
ఒకరికొకరు తోడయి సమస్యల సహారాను
సరదా సమీరాలను కలిసి స్వీకరించండి
అయితే
నిలిపి ఉంచే మూల స్పంభాలు సైతం
విడి విడిగానే ఉంటాయి చూసారు కదా!
ఆకుపచ్చని ఆరోగ్యాన్ని వెదజల్లే మర్రి చెట్టు
వేప వ్రుక్షం పరస్పర చాయలో పరిమళాలు ఒలికించవు కదా!

- ఖలీల్ జీబ్రాన్ (తెలుగుసేత ఎవరో)

Monday, May 14, 2007

ప్రక్రుతి నా తల్లి వేరు వేరు కాదు నాకు
కొనసాగింపు....
అమ్మ ఎన్నో ఆలోచనలు చేస్తూ ఉండేది.
తనకి మంచి మంచి రంగుల చీరలన్నా, నగలన్నా ఎంతో ఇష్టం.మాచింగ్ జాకెట్టు లేకుండా చీర కట్టేది కాదు.శరీరం పట్ల ఎంతో స్రద్ధ.అన్నీ శుభ్రంగా, శుచిగా ఉండాలి.ఆవిడ తినే పళ్ళెం,తాగే గ్లాసు ఎవరూ ముట్టుకోకూడదు.తను ఉండే చొటునల్లా అవన్ని ప్రత్యేకంగా పెట్టే వాళ్ళం.అమ్మ తనని తాను ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా భావించుకొనేది.తన జీవిత విధానమంతా చాలా డిఫరెంట్ అనుకునేది.శరీరం మీద చిన్న ముడత కనబడినా "చూడవే ఈముడత అసహ్యంగా" అని బాధపడిపోయేది.అమ్మా!నీ వయస్సుకి వస్తాయమ్మా అంటే,ఏమోనే చిరాగ్గా ఉంది చూడ్డానికి అనేది.ఎనభై సంవత్సరాల వయస్సులో కూడా జుట్టు పట్ల ఎంతో శ్రద్ధ.తానే ఓ హెర్బల్ ఆయిల్ తయారు చేసుకుని తలకి పట్టించేది.ఆశ్చర్యంగా నిగనిగలాడుతూ జుట్టు మొలుచుకొచ్చింది.ఆ ఆయిల్ నన్ను పెట్టుకోమని సతాయించేది.నీకు దేనిపట్ల స్రద్ధ లేదని తిట్టేది నన్ను.చివరి దశలో ఆరోగ్యం బగోకుండా మంచం మీద ఉన్నపుడ్ కూడా తని చూడడానికి వచ్చే వాళ్ళకి ఆ హెర్బల్ ఆయిల్ ఎలా తయారు చేసుకోవాలో చెబుతుండేది.
అమ్మకి చివరి స్నానం చేయించిన రోజున వీపంతా పరుచుకున్న నల్లని జుట్టు అందరినీ ఆస్చర్యంలో ముంచేసింది.జీవితం పట్ట్ల తన ప్రేమకి నిదర్శనంలా
నిగనిగలాడుతూ పరుచుకున్న తన ఉంగరాల జుట్టు కన్నీళ్ళ మధ్య నాకీనాటికీ కనిపిస్తూనే ఉంటుంది.
తనకి అరవై సంవత్సరాలపుడె బిపి, షుగర్ మొదలైనాయి.ఎంతో శ్రద్ధగా మందులు వేసుకునేది.2000 లో అమ్మ ఒకసారి చాలా సీరియస్ గా జుబ్బు పడింది.అడుగు తీసి అడుగు వెయ్యలేకపోయింది.మేమిద్దరం చెరో రెక్క పట్టుకుని బాత్రూముకి తీసుకెళ్ళేవాళ్ళం.తనని ఆసుపత్రికి తీసుకెళ్ళడానికి కుర్చీలో కూర్చోబెట్టి మేడ మెట్ట్లు దింపుతుంటే నా సహచరుదు ఒక్కసారిగా భోరుమని ఏడ్వడం నాకింకా గుర్తు. ఈమె ఇంక ఇంటికి తిరిగొస్తుందా అంటూ ఏడ్చాడు.లక్కీగా అమ్మ ఆ గండం నుంచి బయటపడి మామూలు మనిషైంది.అమ్మ మా ఇద్దరి జీవితాల్లోను ఒక భాగమైపోయింది.అమ్మ సీరియసుగా జబ్బుపడినపుడే అన్నయ్యను ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేయించాము.కాని తను ఎప్పుడు మా దగ్గర ఉండడానికే ఇష్టపడేది.ఎపుడైనా ఎక్కడికైనా వెళ్ళినా తిరిగి మా దగ్గరికే వచ్చేసేది.
2005 లో నర్సాపురంలో నేను చదువుకున్న కాలేజి వాళ్ళు ఏదో ఫంక్షంకి నన్ను పిలిచారు.నేనూ వస్తానంటూ అమ్మ నాతో బయలుదేరింది.ప్రోగ్రాం అయిపోయాక నేను వచ్చేసాను.తను తమ్ముడి దగ్గర కొన్ని రోజులు ఉండి వస్తానని చెప్పింది.ఆ తర్వాత రెందు రోజులకి బాత్రూంలో పడిపోయిందని తమ్ముడు ఫోన్ చేసి చెబితే నా గుండె గుభేలుమంది. ఈ వయస్సులో పడితే తిరిగి లేస్తారా? లేవనే లేదు.
కొంచం కోలుకున్నాక హైదరాబాదు తీసుకొచ్చేసాము.మా ఇంట్లోకి
రాగానే ఇపుడు నాకేం ఫర్వాలేదు అంది. కానీ బాగాలేదు.
ఒక రాత్రి ఆయాసంతో ఉక్కిరిబిక్కిరి అయిపోతుంటే నింస్కి తీసుకిళ్ళిపోయాం. చాలా సీరియస్ కండిషన్లో పదిహేను రోజులు నింస్లో ఉంది.రోజుకొకలాగా ఉండేది.ఒకరోజు నవ్వుతూ కబుర్లు చెప్పేది.మరో రోజు కోమాలో ఉండేది.మెలుకువ వస్తే కాఫీ కాఫీ అంటూ కలవరించేది.కాఫీ అంటే మహ ప్రాణం అమ్మకి.మే 14 రాత్రి అమ్మ నన్ను విడిచి శాశ్వతంగా వెళ్ళిపోయింది.ఆ పదిహేను రోజులూ నాకు బయట ప్రపంచంతో సంబంధం తెగిపోయింది.ఇల్లు,ఆసుపత్రి. అంతే.
అమ్మ కళ్ళను దానం చేసితన పార్ధివ శరీరానీ అంబులెన్సులో ఎక్కించుకుని,తనకెతో ఇష్టమైన మాఇంటికి తెచ్చి,తర్వాత మాఊరు సీతారామపురం బయలుదేరి వెళ్ళాం.అదే రోజు మా పొలాల్లో అమ్మ అంత్యక్రియలు జరిగాయి.
అమ్మతో నా అనుబంధం గురించి నేను అక్షరాల్లో రాయలేను.అది ఆత్మిక బంధం.నాకు తన తల్లి పేరు పెట్టుకుంది కాబట్టి నన్ను అమ్మాజీ అని పిలిచేది.తన నోట్లో నా పేరే నానుతుండేది.ముప్ఫై ఏళ్ళు నాతో ఉంది.నువ్వు నా కూతురి కాదు నా తల్లివి అనేది.తనని కంటికి రెప్పలా చూసుకున్నాను.తనకి ఏ లోటూ రానివ్వలేదు.తనకి ఏ కష్టం కలగనివ్వలేదు అనే త్రుప్తి చాలు నాకు.
నా మీద అమ్మ నాన్నల ప్రభావం అపారం.వాళ్ళు నన్ను పెంచిన తీరు అపూర్వం.అందుకే నా కధల సంపుటిని వాళ్ళకే అంకితమిస్తూ"చెట్టు మీద పిట్టల్లే నన్ను పెంచిన అమ్మా నాన్నలకి" అని రాసాను.నాలాగే అమ్మకి బోలెడుమంది స్నేహితులు.
అమ్మతో అలరారిన బాల్యస్మ్రుతులేవీ నాకు లేకపోయినా,నా ఎదుగుదలలోని ప్రతి మలుపులోనూ అమ్మ అభయ హస్తం నాతోనే ఉంది.నేను రచయిత్రిగా,జర్నలిష్టుగా, కార్యకర్తగా అనూహ్యమైన ఎత్తుకి ఎదగడం వెనక నా తల్లి శ్రమ స్పష్టంగా కనపడుతుంది.నా ఇంటిని, నా వంటిటి శ్రమని తనమీదేసుకుని నన్ను ఓ స్వేచ్చా విహగంలా ఆకాశంలోకి ఎగరేసింది.నేను ఆకాశంలో ఎగురుతున్నా నేల మీదున్న నా తల్లిని ఏ రోజూ నిర్లక్ష్యం చెయ్యలేదు.తనని అరచేతుల్లో పెట్టుకుని అపురూపంగా చూసుకున్నను.తనకి కొడుకులున్నా అమ్మ కి నాతో ఉండడమే ఇష్టం.నేనూ అమ్మ బాధ్యతని ఆనందంగా నా మీద వేసుకున్నాను.తనకి ఏ కష్టం కల్గకుండా ఓ గౌరవప్రదమైన జీవితాన్ని ఇవ్వగలిగాను.ఒక ప్రత్యేక వ్యక్తిలా ఎలా బతికిందో అంతే హుందాగా,గౌరవంగా వెళ్ళిపోయింది.తన సేవాభావాన్ని పుణికి పుచ్చుకున్న నేను అమ్మ పేరు మీద మా ఊళ్ళో స్త్రీల కోసం ఒక సంస్థను స్థాపించాను.మా అమ్మను ఎంత ప్రేమిస్తానో మా ఊరిని అంతే ప్రేమిస్తాను.నా ద్రుష్టిలో రెండూ వేరు వేరు కాదు.కన్న తల్లి లాంటిదే పుట్టినూరు కూడా.
అమ్మ భౌతికంగా మా నుంచి దూరమైంది ఈరోజే.అయితే అమ్మ మా హ్రుదయాల్లోంచి ఎక్కడకూ వెళ్ళలేదు.అమ్మజీ అంటూ నన్ను పిలుస్తూ నా చుట్టూ గాలిలో,నేను పెంచే చెట్లలో,నేను ప్రేమించే వెన్నెలలో,సూర్యోదయ సూర్యాస్తమయాల్లో ఒక్టేమిటి నన్ను అలరించే,నన్ను పులకింపచేసే సమస్త ప్రక్రుతి మాతలో నా తల్లి ప్రతిరూపమే కనిపిస్తుంది నాకు.ప్రక్రుతి, నా తల్లి వేరు వేరు కాదు నాకు. ప్రక్రుతి ఉన్నంతకాలం,నేను ప్రక్రుతికి సమీపంగా ఉన్నంత కాలం నా తల్లి స్మ్రుతి సజీవంగా నాలో దీపంలాగా వెలుగుతూంటుంది. నాకు దిశానిర్దేశం చేస్తూనే ఉంటుంది.

Sunday, May 13, 2007

నేను కడుపు లో ఉన్నపుడు అమ్మ ధాన్యం కొట్లో పనిచేస్తొందంట.అక్కడే నేను పుట్టానట.అప్పట్లో ఆడవాళ్ళు పురుడొచ్చేవరకు పని చేస్తూనే ఉండేవాళ్ళు.నేను పుట్టిన పద్నాలుగో రోజు మా అమ్మమ్మ చనిపోయిందట.తల్లి చనిపోయిన దుఖంలో అమ్మ నా అలనా పాలనా పెద్దక్కకి వదిలేసింది.నేను అలా గాలికి, ధూళికి పెరిగాను.
నా చిన్నతనం, నా బాల్యం ఏడు రంగుల ఇంధ్రధనుస్సంత అందమైంది.ఏభై మందున్న ఉమ్మడి కుటుంబంలో మా గురించి ఎవ్వరూ పట్టించుకునేవారు కాదు.చెట్లెంబడి కోతుల్లా తిరుగుతూ, దొరికిన కాయా, కమ్మా తిని పక్షుల్లా బతికేవాళ్ళం.రాత్రి మిగిలిన చద్దన్నంలో గంజి పోసుకుని ,ఆవకాయ ముక్క నంజుకు తినేవాళ్ళం.నూకలతో అన్నం చేసి గిన్నెల్లో పోసేవాళ్ళు.అది తాగేవాళ్ళం.నా బాల్యంలో ఏమున్నా ఏమి లేకపోయినా ఆంక్షలు లేని స్వేచ్చ ఉండేది.మమ్మల్ని ఎవరూ ఏమీ అనేవారు కాదు.మా అమ్మ నన్ను తిట్టినట్టు, కొట్టినట్టు ఒక్క ఞ పకం కూడా లేదు.అలాగని విపరీతంగా పట్టించుకుని ప్రేమించిన ఞాపకం కూడా లేదు.
నేను చదువుకోవడం కొరకు చాలా పోరాటమే చేసాను.ఈ విషయంలో అమ్మ కన్నా నాన్నే నాకు అండగా నిలిచాడు.ఉమ్మడి కుటుంబంలో స్వేచ్చ లేని అమ్మ ఏం చేయగలుగుతుంది?అష్ట కష్టాలు పడి ఎన్నో అడ్డంకుల్ని దాటి,డిగ్రీ వరకు చదువుకోగలిగాను.
అమ్మ చాలా చొరవగా,ఎక్కడికైనా వెళ్ళగలిగేలా ఉండేది.కుటుంబంలో ఎవరికి ఏ రోగాలొచ్చినా పూర్ణని పిలవాల్సిందే.వాళ్ళతో ఆసుపత్రులకు వెళ్ళి ఉండిపోయేదట.ఆ రోజుల్లో గుండె ఆపరేషన్లంటే పెద్ద గండాల్లంటివి.ఈ ఆపరేసన్లను తమిళనాడులోని రాయవెల్లూరు లో చేసేవాళ్ళు.అమ్మ నాలుగు సార్లు గుండె రోగుల్ని తీసుకుని రాయవెల్లూరు వెళ్ళీంది.
అక్కడి క్రిస్టియన్ మిషనరీ ఆసుపత్రిలో పేదలకి ఉచితంగా వైద్యం, ఆపరేషన్లు చేసావారు. పాత చీరలు కట్టుకుని,వంటి మీదుండే నగల్ని తీసేసి, పక్కా బీదల్లా వీళ్ళు వేళ్ళేవాళ్ళత.భాషరానిచోట, అమ్మ దాక్టర్లతో మట్లాడేదట.వండుకుని తింటూ ఆసుపత్రిలో రోగులను చూసుకుంటూ ఉండేదట.ఈ చొరవ, సహాయం చేసే మనస్సు అమ్మకు ఉండడం వల్లనే
అందరూ "పూర్ణమ్మ దేవత" అనేవారట.
ఉమ్మడి కుటుంబంలో అమ్మ ఎన్నో కష్టాలు పడింది.నాన్న వ్యాపార నిర్వాకాల వల్ల కష్టాలు పడింది. నాన్నకి శ్ర చేయడం తప్ప కల్లా కపటం తెలియదు.అలాంటి వాడు వ్యాపారం ఛెస్తే తుకారాం వ్యాపారమే అవుతుంది.
175 ముగుస్తుండగా నాన్న నన్ను హైదరాబాదు తీసుకొచ్చి మా ఆరో చిన్నాన్న ఇంట్లో వదిలాడు.నేను మంచి ఉద్యోగంలో స్థిరపడాలని నాన్నకి చాలా కోరికగా ఉండేది.ఆయన బ్రతికి ఉండగా నాకు ఉద్యోగం రాలేదు.నాన్న పోయాక మా కుటుంబం చాలా కష్టాలు పడింది.ఆర్ధిక ఇబ్బందులకి అంతే లేదు.అల్లంటి సమయంలో నేను హైదరాబాదులో ఉండి, ఏదో కోర్సు చెయ్యడం కోసం రు350/ పంపమని అమ్మనడిగితేతనకున్న ఒకే ఒక గొలుదు తాకట్టు పెట్టి డబ్బు పంపింది.
1977 లో నాన్న చనిఫొయాడు.1979 లో నాకు పబ్లిక్ సర్వీస్ కమీష్న్లో ఉద్యోగం వచ్చింది.ఒక గది రు60 కి అద్దెకు తీసుకుని అమ్మని,తమ్ముడిని తీసుకొచ్చేసాను.అలా వచ్చిన అమ్మ 2005 మే నెలలో చనిపోయేవరకు నాతోనే ఉండిపోయింది.
నా జీవితంలోని ఎగుడుదిగుడులకి, ఎదుగుదలకి అమ్మ ప్రత్యక్ష సాక్షి.నా స్వేచ్చకి తను ఏనాడు తను అడ్డుపడలేదు.ఇలా చెయ్యి అలా చెయ్యి అని ఎపుడూ నాకు చెప్పలేదు.నేను ఏం చేసినా కరెక్టుగా, ఖచ్చితంగా చేస్తానని అమ్మకి గొప్ప నా నమ్మకం.నేను నాస్తికత్వానీ నా జీవితాచరణగా ఎంచుకుని,ఒక నాస్తికుణ్ణి ఇష్ట పడి అతనొతో కలసి ఉంటానని చెప్పినప్పుడు తను న్న్నేమి అనలేదు.
1980 లో విజయవాడలో అంత్ర్జాతీయ నాస్తిక మహా సభలు జరిగినపుడు,విజయవాడ గురించి ఏమి తెలియకుండా నేను ఒక్క దానే బయలుదేరినపుడు అమ్మ అస్సలు భయపడలేదు.వెళ్ళమనే చెప్పింది.ఆ సభల్లో నేను నా జీవిత సచరుణ్ణి ఎంచుకున్నానను.ఆ ఎంపిక చాలా గమ్మత్తుగా జరిగింది.నాస్తిక సభలు జరిగినపుడు మూధ నమ్మకాలకు వ్యతిరేకంగా ఎన్నో కార్యక్రమ్మాలు చేసారు.అందులో ఒకటి నిప్పుల మీద నడవడం.నేను నిప్పులమీది నుంచి నడిచి వచ్చినపుడు పడిపోకుండా ఓ చెయ్యి నన్ను పట్టుకుంది.అతనే నా జీవిత సహచరుడ్య్యాడు.అలా మా పరిచయం జరగడం,అది స్నేహంగా పరిణామం చెందడం జరిగింది,అతను ఉండేది హైదరాబాదే కాగ్
బట్టి మా ఇంటికి వస్తూ ఉండేవాడు.అతని రాక పోకల్ని అమ్మ ఏనాడూ ప్రశ్నించలేదు.అతన్ని రిజిష్టర్ పెళ్ళి చేసుకుంటానని చెప్పినపుడు మాత్రం అమ్మ అడిగింది.సంప్రదాయ పద్ధతిలొ చేసుకోమని.నేను సంప్రదాయ పద్ధతిలో పెళ్ళి ఛేసుకోనని,తాళి, మట్టెలు, నల్లపూసలు లాంటివి వేసుకోనని ఖచ్చితంగా చెప్పాను.నేనలా ధ్రుఢంగా చెప్పేసరికి తను ఇంకేమి అనలెదు..నీ ఇష్టం అంది. 1981 లో మేమిద్దరం అమ్మ సాక్షిగానే రిజిస్టర్ పెళ్ళి చేసుకున్నాం. అమ్మ ఎప్పటికి నాతోనే ఉంటుందని అతనికి ముందే చెప్పాను.మామూలుగా ఆడపిల్లలు అత్తారింటికి వెళతారు.నేను అత్తారింటికి వెళ్ళలేదు. నా సహచరుడే ఒక చిన్న పెట్టెతో నా గదికి వచ్చేసాడూ.అల మా సహజీవనం మొదలైంది.నేను ఆఫీసుకి,తను కోర్టుకి వెళ్ళిపోతే అమ్మే ఇంటిని చక్కబెట్టేది.
నా జీవితంలో నేను ఎప్పుడూ వంట చెయ్యలేదు.నాకు వంట చెయ్యడం ఇష్టం లేదు.అమ్మ మాకు వండి పెట్టేది.నా కర్యక్రమాల్లో మునిగితేలుతూ అసలు ఇంటి గురించి పట్టించుకునేదాన్ని కాదు.
అమ్మ ఎక్కడున్నా తనకి బోలెడు మంది స్నేహితులుండేవారు.మా ఇంట్లో మాగి అని ఓ కుక్క ఉండేది.అమ్మని మాగి అమ్మమ్మ అని పిల్లలు పిలిచే వాళ్ళు.మా ఇల్లు మాగి అమ్మమ్మ ఇల్లుగానే ప్రసిద్ధం.చుట్టుపక్కల వాళ్ళకి ఎంతో సాయంగా ఉండడం వల్ల అందరూ తనని చాలా ఇష్టపడేవాళ్ళు.అమ్మని నాతో పాటు మీటింగ్లకే కాకుండా పిక్నిక్లకు,విహారయాత్రలకు నాతో తీసుకెళ్ళేదాన్ని.నా స్నేహితులతో బాగా కలిసిపోయేది.
నా సహచరుడు అమ్మని అత్త అని ఏరోజు పిలవలేదు.నాతో పాటు అమ్మా అనే పిలిచేవాడు.అమ్మంటే అతనికి చాలా ప్రేమ.నేను ఇల్లు, సంసారం మొత్తం అమ్మకే అప్పగించేసాను.ఈ బాధ్యతలేవీ లేకపోవడం వల్ల వ్యక్తిగా, రచయిత్రిగా,జర్నలిష్టు గా నేను ఎదగగలిగాను.అందరిలా నేను సంసారం బధ్యతల్లో కూరుకునిపోయి ఉంటే ఏమై ఉందునో నేను ఊహించను కూడాలేను. వంట పని ఈంటి పని ఆడవాళ్ళ సమయాన్ని ఎలా మింగేస్తాయో నాకు తెలుసు.అమ్మ వల్ల నేను ఈజంఝాటం నుండి తప్పించుకోగలిగాను.
సంసార బంధనాల్లో నేనెపుడూ తామరాకు మీద నీటిబొట్టు లాగానే ఉంటాను.
అయితే అమ్మని ఇంటికే అంకితం చేసానని అనుకోవద్దు.నాతో పాటు అన్ని మీటింగ్లకి తీసుకెల్లేదాన్ని.సాహిత్య కర్యక్రమాలకి తీసుకెల్లేదాన్ని.నేను తీసుకెల్లేననడం కంటె తనే వచ్చేదంటే బావుంటుంది. నాతో పాటు బయటకి రావడం తనకి ఇష్టం. తనకి తెలియని రచయిత్రిలేదు.అందరితో ఎంతో కలివిడిగా మాట్లాడేది.నా ఫ్రెండ్స్ అందరూ తనకి ఫ్రెండ్స్.నా ఆత్మీయ నేస్తాలంతా తనకి చాలా దగ్గరి వాళ్ళు.నా కోసం ఇంటికొచ్చే వాళ్ళంతా నేను ఇంట్లో లేకపోయినా అమ్మతో హాయిగా మాట్లాడేసి వెళ్ళిపోయేవారు.
అమ్మకి జీవితం పట్ల ఎంతో ప్రేమ.


ఇంకా ఉంది....

Saturday, May 12, 2007


ప్రక్రుతి, నా తల్లి వేరు వేరు కాదు నాకు


మా అమ్మ పేరు కాశీ అన్నపూర్ణ.అమ్మ పుట్టినపుడు వాళ్ళ తాత గారు కాబోలు కాశీ వెళ్ళేరట.అందుకని అలా పేరు పెట్టేరు.అమ్మకి ఒక అక్క..ఇద్దరు చెల్లెళ్ళు.వాళ్ళ నాన్నని (మా తాతయ్యని)బాబాయి అని పిలిచేది. వాళ్ళ బాబాయి గురించి చాలా చెప్పేది. గ్రామాల్లో భూస్వాములు ఎలా ప్రవర్తిస్తారో అలాగే ప్రవర్తించేవాడాయన.గుర్రం మీద తిరుగుతూ,కనిపించిన ఆడపిల్లనల్లా చెరబడుతూ ,తింటూ, తాగుతూ వుండేవాడట.మేము చూళ్ళేదు కాని అమ్మ చెప్పేది.
అమ్మకి తన పుట్టిల్లంటే ఎంతో ప్రేమ.మా అమ్మమ్మ, తాతయ్య అరాచకాలలకి,అక్రుత్యాలకి నిలువెత్తు నిదర్శనంలా ఉండేదట. చెప్పుకోలేని వ్యాధేదో ఆమెని పట్టి పీడించేదని,దానితోనే ఆమె చనిపోయిందని అమ్మ బాధ పడేది. అమ్మమ్మ చనిపోవడంతో ఇద్దరి చెల్లెళ్ళ బాధ్యత అమ్మ మీదే పడింది.వాళ్ళ పెళ్ళిళ్ళు, పురుళ్ళు తనే చూసింది.దాయాదుల పంచన ఉంటూ,తల్లిని, తండ్రిని కోల్పోయి,ఆస్తులు చేజారిపోయి అమ్మ అష్ట కష్టాలు పడిందని,అయినా తనకు పుట్టిల్లంటే,దాయాదుల పిల్లలంటే చాలా ఇష్టమని అక్క అంటుంది.
నేను పుట్టిన పది రోజులకి మా అమ్మమ్మ చనిపోయిందట.అమ్మ నన్ను మా పెద్దక్కకి వదిలేసి వెళ్ళిపోయింది.నెను ఎలక పిల్లలాగా ఇవాళొ రేపో పోతానన్నట్టు ఉండేదాన్నట.ఓ చింపిరి చాప మీద దొర్లుతూ ఉండేదాన్నట.అక్కకి తీరికైనపుడు కొన్ని పాలు తాగించేదట.
మా అమ్మ ఓ పెద్ద ఉమ్మడి కుటుంబంలో చాకిరీ యంత్రంలా పనిచేసిది.మా తాత(మా నన్న నాన్న)కి ఏడుగురు కొడుకులు,ఇద్దరు కూతుళ్ళు.నాకు ఊహ తెలిసేటప్పటివరకు అందరూ కలిసే ఉండేవార్ళ్ళు.ఈంట్లోని ఆడవాళ్ళు పూటకి ఏభై మందికి వండి పోసేవాళ్ళట.ముందు మగవాళ్ళు,తర్వాత పిల్లలు తిన్నాక ఏమైనా మిగిలి ఉంటేనే ఆడవాళ్ళకి.చాలా సార్లు గంజి నీళ్ళే ఉండేవని అమ్మ అంటూ ఉండేది.అమ్మ కన్నా ఉమ్మడి కుటుంబంలోని బాధలు,కష్టాలు పెద్దక్క ఎక్కువ అనుభవించింది.చెళ్ళెళ్ళ బధ్యతల వల్ల అమ్మ ఎక్కువగా పుట్టింట్లో ఉండేదట.
మా పెద్దాక్క అమ్మని చాలా జాగ్రత్తగా చూసుకునేది.మా తాత వంట వస్తువుల్ని తూకం ప్రకారం ఇవ్వడం వల్ల చివరగా తినే ఆడవాళ్ళకి చాలా సార్లు ఏమీ ఉండేది కాదు.ఆడవాల్లు తిన్నరా లేదా అని ఎవరికి పట్టేది కాదట.మా అక్క వళ్ళని వీళ్ళని అడిగి ఏవేవో తెచ్చి అమ్మకి పెట్టేదట.అమ్మ తోడికోడళ్ళు ఆరుగురు.అందులో కొందరు అమ్మతో తగవులు పడేవారట.అమ్మకి తగవులంటే భయం.గొడవలంటే భయం.తగవులు మొదలైతే భయపడి ఇంట్లోకి వెళ్ళిపోయి తలుపు గడియ పెట్టుకునేదట.

ఇంకా ఉంది......

Friday, May 11, 2007

Newindpress on Sunday
HYDERABAD May 11, 2007
A helping hand for women in distress
Wednesday March 15 2006 09:01 IST


United we help: The five-member team, which has embarked upon the mission to save harassed women

HYDERABAD: It’s an all-women team. They are crusading against violence on women. Their weapon is a magazine.

The five-member team, headed by K Satyavathi, Editor of Streevada Patrika Bhumika, a Telugu monthly, has come up with a toll-free helpline (No 18004252908) service to aid women in distress in the State.

Though the 12-hour free service (8 AM to 8 PM) is meant for its readers, other women can also utilise it. There is already good response to the helpline, which will be formally launched on March 16.

The team has already received more than 2 dozen calls from various parts of the State. Most of the calls are pertaining to harassment for dowry and abuse.

Talking to this , Satyavathi said the gender bias had not declined despite the rise in educational levels among women.

“This forced us to start a helpline. We have an extended network with the Legal Service Authority and other organisations to help women in distress,” she said.

Several Non-Governmental Organisations like Roshni, a city-based counselling centre, and OXFAM have come forward to help them in their endeavour. The other members of the team are Prasanna Kumari (administration in-charge,) M Manjula (does data processing for the magazine), Sudha Rani (assistant) and S Laxmi (circulation in-charge).


Print Email
Post your comment View all comment(s)
WebNewindpress

Thursday, May 10, 2007

ఈ రోజు నేను ఇంకో నలుగురు మిత్రులు కలిసి( యద్దనపూడి సులోచనా రాణీ,డా.సునంద డా.వహీదా,నేను)మా కుందంబాగ్ ప్రాంతంలో పిల్లల కోసం ఒక సమ్మర్ కాంప్ మొదలు పెట్టేం.ఒక స్కూల్ వాళ్ళ స్థలం లో నెల రోజులపాటు ఈ కాంప్ నడపాలని అనుకున్నాం.ఓ పాతిక మంది పిల్లలు వచ్చారు.అది స్లం ఏరియా కాబట్టి పిల్లల తల్లులు కూడా వచ్చారు.వాల్లతో పాటలు, పద్యాలు పాడించాము.పిల్లలంతా చక్కగా పాడారు.మేము కూడా వాళ్ళతో కలిసి పాడాము.
రేపటి నుండి పిల్లలకు ఓ గంట స్పోకెన్ ఇంగ్లీషు,డ్రాయింగు,పాటలు ,ఆటలు వుంటాయి.ఎండ వేళ పిల్లలు నీడపట్టునుండి సరదాగా గడపడం తల్లులకి నచ్చింది.మాకు కూడ ఏమైనా చెప్పండి అని అడిగారు.తల్లులకు ఆరోగ్యం గురించి డాక్టర్ల ద్వారా ఉపన్యాసాలిప్పించాలని అనుకున్నాం. పిల్లలకి ఈ రోజు చాక్లెట్లు, అరటి పండు,పుచ్చకాయ ముక్కలు ఇచ్చాము.రోజుకొకరం తినుబండారాలను తేవాలని అనుకున్నాం.భాగ్యనగరంలో ఉన్నవారు ఎవరైనా ఈ కాంప్ లో పాల్గోవచ్చు.మీ దగ్గరుండె కొత్త కళలను పిల్లలకి నేర్పొచ్చు.కాంప్ టైం ఉదయం 9 నుండి 11 లేక 12 వరకు.

Tuesday, May 8, 2007

ఈ రోజు మధ్యాహ్నం ఎండవేళ విసుగ్గా,చిరాగ్గా ఇంట్లో వున్నవేళ
ఓ నీలిరంగు ఉత్తరం పిట్ట అలా అలా ఎగురుకుంటూ వచ్చి నా ముంజేతి మీద వాలింది.అద్భుతం.
విసుగంతా మాయమైపోయింది.ఎన్నాళ్ళకెన్నాళ్ళకి.చాలా రోజులుగా కంటాక్టులో లేని శుభ రాసిన ఉత్తరమది.ఇటీవల మా ఊ రెళ్ళినప్పుడు నా అడ్రస్సు సంపాదించి ఈ ఉత్తరం రాసిందట.
శుభ రాసే ఉత్తరాలు, ఆ చేతి వ్రాత నాకు చాలా ఇష్టం.
మేమిద్దరం ఇంటర్ వరకు కలిసి చదువుకున్నాం.బోలెడన్ని ఉత్తరాలు రాసుకునేవాళ్ళం.
నాకు ఉత్తరం రాయడమంటే ఎంతో ఇష్టం.నా ప్రియ నేస్తాలకి నేను రాసిన ఉత్తరాలు ఫైళ్ళల్లో నిండి ఉన్నాయి.వళ్ళు వాటిని భ ద్రంగా దాచుకున్నారు.ఎన్నో సార్లు హాయిగా కూర్చుని వాటిని చదువుకోవడమూ ఉంది.
జయ అని నాకు 30 సంవత్సరాలుగా ఆత్మీయురాలైన ఓ నేస్తముంది.మా స్నేహం నిత్యనూతనంగా అలరారుతూనే ఉంది.ఈ 30 ఏళ్ళలో తనకు నాకు మధ్య నడిచిన ఉత్తరాలు ఇంకా భద్రంగా ఉన్నాయి.నాకు సంబంధించి నా 30 ఏళ్ళ జీవితం వాటిల్లో దాగి ఉంది. ఇప్పుడు వాటిని చదువుతుంటే ఎంత ఆనందంగా ఉంటుందో వర్ణించలేను.బతుకుపోరాటం,అప్పటి ఆశయాలు, ఆరాటాలు,ఆవేశాలు,ఉద్యమాలు,ఉద్యోగాలు ఒకటా రెండా ...ఎన్నో ఎన్నెన్నో...చదువుకున్న పుస్తకాలు,చూసిన ప్రదేశాల వివరాలూ.అన్నీ అక్షరబద్దమై ఉన్నాయి.
నా వరకు నేను మా ఊరికి దూరమవ్వనట్టుగానే ఉత్తరాలకి దూరమవ్వలేదని చాలా గర్వంగా చెప్పగలను.ఇప్పటికి నేను ఉత్తరాలను ప్రేమగా,ఆత్మీయంగా నా ప్రియ నేస్తాలకి రాస్తూనే ఉన్నాను.
నా ద్రుష్టిలో ఉత్తరమనేది ఉత్త కాయితం ముక్క కాదు.ఉద్వేగాల గని.ప్రవహించే జీవ నది.గుండెలోని ఊసుల్ని వేళ్ళ కొసల ద్వారా వ్యక్తీకరించేదే ఉత్తరం.
ఆదివారం నాటి నా పాత పుస్తకాల షాపుల దర్శనానుభవం వ్యాసానికి స్పందించిన మిత్రులకు ధన్యవాదాలు.నిజమే పుస్తకం ఓ ప్రియ నేస్తం స్థానం నుంచి జారి పోయిన మాట వాస్తవమే.ఆత్మీయతని పంచే,అనుభవాల విపంచిని కళ్ళముందు పరిచే పుస్తకం ఎక్కడ?గోపిచంద్ "మెరుపుల మరకలు" పి. శ్రీ దేవి 'కాలాతీత వ్యక్తులు" రాహుల్ సాంఖ్రుత్యాయన్ "వోల్గా నుండి గంగా వరకు" ప్రేంచంద్ "గోదాన్" సరత్చంద్రుని "శ్రీకాంత్" లాంటి జీవితాన్ని మలుపు తిప్పిన అద్భుతమైన పుస్తకాలు పాత పుస్తకాల షాపుల్లోనే కొనుక్కోగలిగిన ఆ నాటి ఆర్ధిక వొత్తిళ్ళలో కూడా ఎంత సంతోషమో పుస్తకాలు కొనుక్కోగలిగినందుకు. ఆ జ్ఞాపకాలను నెమరేసుకుంటే మరెంతో ఆనందం.భాగ్యనగరంలో వెలుస్తున్న మహా మల్స్ సందర్శనం నాలాంటి వాళ్ళకు అదనంగా ఒరగబెట్టేది ఏమి ఉండదు కూడా.ఈ మెగా షాపుల్లో ప్రదర్శించే వస్తు సముదాయం వస్తు వ్యామోహాన్ని పెంచుతుందేమో గానీ నా వరకు ఎలాంటి ఆనందాన్నీ ఇవ్వలేవు.నా ఆనందం స్నేహితుల్లో, వాళ్ళకు రాసే ఉత్తరాల్లో,పుస్తకాల్లో,ప్రక్రుతిలో,నా పనిలో,నా చుట్టూ అల్లుకున్న నా కిష్టమైన పరిసరాల్లో ఉంది.మా ఊరు, మాగోదావరి,మా సముద్రం,మా ఊరి పచ్చదనం ఇచ్చినంత కిక్కు నాకు మరేది ఇవ్వలేదు.మా గోదావరి ప్రవాహం,మా సముద్ర కెరటం చాలవా నా గుండెల్లో ఆనందాన్ని నింపడానికి?

Monday, May 7, 2007

చాలా రోజుల తర్వాత నిన్న అంటే ఆదివారం ఆబిడ్స్ లోని పాతపుస్తకాలు దుకాణాలకి వెళ్ళాను.
పది గంటల నుండి 12.30 దాకా ఎర్రటి ఎండలో పాత పుస్తకాల చుట్టూ ప్రదక్షిణలు చేసి కొన్ని పుస్తకాలు కొన్నాను. ఇరవై ఏళ్ళ క్రితమైతే ప్రతి ఆదివారం దాదాపుగా వెళ్ళేదాన్ని. అక్కడే ఎన్నో అద్భుతమైన పుస్తకాలు కొనుక్కున్నాను. ఎంతో మంది నాలాంటి వాళ్ళు అక్కడ కనపడి ఎంతో ప్రేమగా పలకరించే వాళ్ళు.ప్రతి దుకాణం ముందూ గంటల తరబడి నిలబడి ప్రతి పుస్తకాన్ని క్షుణ్ణంగా పరిశీలించి కావలసినవి దొరికితే సంతోషంగా స్వంతం చేసుకునేదాన్ని.ఒక్కో సారి అద్భుతమైన పుస్తకం చాలా తక్కువ ధరకే దొరికేది.ఎంత ఆనందమో.
నిన్న అలాంటి ఆనందం మచ్చుక్కూడా కలగలేదు.అసలు తెలుగు పుస్తకాలే ఎక్కువ కనబడలేదు. బుచ్చిబాబు గారి సాహిత్య వ్యాసాలు పుస్తకం దొరికింది.క్రిష్ణశాస్త్రి గారి క్రుష్ణపక్షం కూడా అక్కడ దొరికింది. పుస్తకాలు సరే దుకాణాల ముందు మనుష్యులూ లేరు. చాలా బాధగా అనిపించింది. అవును మరి నేను కూడా చాలా సంవత్సరాలకి కి కదా వెళ్ళాను. నాలాగే అందరూ మానేసి ఉంటారు.టాయిలెట్ అవసరం పడి పక్కనే ఉన్న బిగ్ బాజార్ కి వెళ్ళాను.కడుపు నిండా నీళ్ళు, కొబ్బరి నీళ్ళు తాగడంతో ఆ అవసరం పడింది.అంతవరకు నేనెప్పుడూ బిగ్ బాజార్ చూళ్ళేదు.ఏమి జనం.కిటకిట లాడుతూ జనం.ఆ జన ప్రవాహాన్ని దాటుకుని మళ్ళీఈ పాతపుస్తకాల షాపులవేపు,వెలవెలబోతున్న షాపులవైపు నడిచాను.

నా మీద వాలిన ఛాయాదేవి ఛాయ

ఎప్పటిమాట. పచ్చగా, చల్లగా, కుటీరం లాగా ఉండే ఆ ఇంటికి తొలిసారి ఎప్పుడెళ్ళాను. తొలిచూపులోనే ఆవిడతో ప్రేమలో పడిన సంఘటనలో నిజానికి, ఆరోజు ...