Tuesday, August 31, 2010

తుళ్ళిపడె సెలయేరుతో కలిసి అడుగులేసినట్టు.......

తెలుగు బాట లో నేనూ నడిచాను
ఈ నడక నాకు నూతనోత్తేజాన్ని ఇచ్చింది.
యువతరం తో కలిసి నడవడంలో మజాయే వేరు.
తుళ్ళిపడే సెలయేరుతో కలిసి అడుగులేస్తే ఎంత అద్భుతంగా ఉంటుంది.
ఎగిసిపడే కెరటంతో కరచాలనం చేస్తే ఎంత ఉత్తేజంగా ఉంటుంది
తెలుగుబాట పేరుతో తెలుగు కోసం నడిచిన యువతతో నేనూ భుజం భుజం కలిపి
నడవడం ఓ అపూర్వమైన అనుభవం.
నల్లటి మేఘాలు ఆకాశమంతా కమ్ముకున్న వేళ
చల్లటి చిరుజల్లులు ప్రియ నేస్తం స్పర్శలా తాకుతున్నవేళ
తెలుగు ప్రేమికులతో తెలుగు కోసం నడిచిన నడక
అద్భుతం,అనిర్వచనీయం, అపురూపం.

Sunday, August 29, 2010

ఇరవై నాలుగు గంటలు--ఇరవై వ్యాపకాలు

నిన్న రాత్రి తొమ్మిది గంటల నుండి ఈ రోజు తొమ్మిది వరకు అంటే ఇరవై నాలుగు గంటల్లో నేను చేసిన పనులు ఒక సారి గుర్తు తెచ్చుకుందామని కూర్చున్నాను.
ఇంట్లో ఒక్కదాన్నే ఉన్నాను.జొన్న రొట్టె తినేసి ఏదైనా మంచి పుస్తకం చదువుకుంటూ గడిపేద్దామనుకుంటున్న వేళ ఫ్రెండ్ కూతురు ఫోన్ చేసి అమ్మ మీ కోసం చూస్తోంది.ఇంటికొస్తానన్నారట కదా.తను ఆఫీస్ నుండి ఇప్పుడే వచ్చి స్నానం చేస్తోంది అంది.
టైం చూసాను.8.30.బేగంపేట నుండి అంబర్ పేట కి ట్రాఫిక్ లో కారు నడుపుకుంటూ వెళ్ళడం కష్టమే.
గీతతో తీరుబడిగా కూర్చుని కబుర్లు చెప్పుకుని చాలా కాలమైంది.అంతే. వెంటనే తయారై అంబర్ పేటకి పయనమై పొయాను.అర్ధ రాత్రి వరకు అంతులేని కబుర్లు సాగాయి.
హెల్ప్ లైన్ కి వస్తున్న కేసుల గురించి,ఏ చిన్న విషయాన్ని పరిష్కరిచుకోలేక సతమత మౌతున్న వైనాన్ని గురించి చాలా సేపు మాట్లడుకున్నాం.ఒంటిగంటకేమో పడుకున్నాం.
ఉదయమే ఏడింటికి లేచి ఇంటికొచ్చాను.
ఎనిమిదిన్నరకి ఈటివి 2 కి వెళ్ళాలి.లీగల సర్వీసెస్ అధారిటి వారు నివహిస్తున్న
"అందరికి అందుబాటులో న్యాయం"లైవ్ ప్రోగ్రాం లో ఇద్దరు న్యాయమూర్తులతో కలిసి పాల్గొన్నాను.వరకట్న హత్యలు,వేధింపులు అనే అంశం మీద ఫోన్ ఇన్ లతో సహా చర్చ నడిచింది.పదిన్నరకి ఇది ముగిసింది.
స్తూడియో నుండే బంజారాహిల్ల్స్ వెళ్ళాను.బెంగుళూరు నండి కవల పిల్లలతో మరో ఫ్రెండ్ వచ్చింది.ఓ రెండు గంటలు పిల్లలతో ఆడడం గొప్ప అనుభవానంచ్చింది.ఇద్దరూ నా ముక్కుపట్టి లగుతూ చెవుల్ని గుంగుతూ ఒకటే ఆటలు.అక్కడే తిడి తినేసి,వుమన్ ప్రొటక్షన్ చెల్ లో ఉన్న సపోర్ట్ సెంటర్కి వెళ్ళాను.సెంటర్లో జరుగుతున్న కౌన్సిలింగ్ ప్రక్రియని పర్యవేక్షించి ఆఫీసుకి వెళ్ళాను.
హెల్ప్ లైన్ కి వచ్చిన కాల్స్ గురించి,క్రిటికల్ కేసుల గురించి కౌంచిలర్ ని అడిగి తెలుసుకున్నాను. ఈ లోగా లోక్ సత్తా కార్యాలయం నుండి కల్ల్ వచ్చింది.ఒక సీరియనుంచి ఫోన్ వచ్చింది.ఒక సీరియస్ కేసు ఉందని, వాళ్ళు నాతోనే మాట్లాడాలనుకుంటున్నారని చెప్పారు.హెల్ప్లైన్ కి కాల్ చెయ్యమన్న చెయ్యకుండా నేరుగా ఆఫీసుకి వచ్చారు.రెడు గంటలకు పైగానీ వాళ్లతో మాట్లాడాల్సి వచింది.ఒంఘోలులో ఒకమ్మాయిని రక్షించాల్సి ఉంది.అవన్నీ ప్లాన్ చేసి వాళ్ళని పంపించేసినాను.
నాలుగింటికి భూమిక సెప్టంబర్ సంచిక పని చూసుకుటూ కూర్చున్నాను.
ఇఎదున్నరకి బషీర్బఘ్ లోని ప్రెస్ చ్లబ్ కి బయలుదేరా.
ఆరు గంటలకి గొర్రెపాటి నరేంద్రనాధ్ మెమోరీల్ లెక్చర్ సమావేశం ఉంది.ప్రొఫెసర్ శివ విశ్వనాధన్ చాలా అద్భుతమైన లెక్చర్ ఇచ్చారు.ఆయన ఉపన్యాసం మెదడులో ఏవో కొత్త కోణాలని తెరిచింది.తొమ్మిదిగంటలకి మీటింగ్ ముగిసింది.ఈ మీటింగ్లో పడి తిండి సంగతి ఇంట్లో చెప్పడం మర్చిపోయాను,.వస్తూ వన్స్తూ.ఓహిరిస్ కి వెళ్ళి చికెన్ కబాబ్స్,తండూరి రోటి పాక్ చేయించుకుని ఇంటికొచ్చాను.
అలిసిపోయి మంచానికి అడ్డం పడితే కళ్ళు మూతలు పడిపోతుంటే గత ఇరవై నాలుగ్గంటలు కళ్ళ ముందు కనబడ్డాయ్.చేసిన పనులు చేపట్టిన కార్యక్రమాలు గుర్తొచ్చి తృప్తిగా,హాయిగా నిద్రపోయా.

Saturday, August 28, 2010

తెలుగు కోసం నడక

తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా తెలుగు కోసం మేం హైదరాబాద్‌లో నడుస్తున్నాం. మీరు కూడా రండి!
ఆదివారం, ఆగస్టు 29 - ఉదయం 8:00 గంటల నుండి 9:00 గంటల వరకు ★
తెలుగు తల్లి విగ్రహం నుండి - పీవీ జ్ఞానభూమి వరకు నడక

Sunday, August 22, 2010

పిట్టల తో చెట్టపట్టాల్--ఓ ఆదివారం నా అనుభవం


ఆదివారం రోజు అందరూ ఏం చేస్తారో నాకు తెలియదు.
బహుశా ఆలస్యంగా నిద్రలేవడం,ఆలస్యంగా తిండి తినడం
అన్నీ ఆరాంగా చేసుకుంటారనుకుంటాను.వారాంతపు ప్రయాణాలూ,
సినిమాలూ,బయటి ఫుడ్. మిగిలిన రోజుల కన్నా భిన్నంగా గడపాలని అందరూ అనుకుంటారు.
ఆదివారం నా వ్యవహారం కూడా భిన్నంగానే ఉంటుంది.
పొద్దున్నే లేచేసి,ప్రాణాయామం చేసేసి, ఓ పది పేపర్లు ముందేసుకుని మా మామిడి చెట్టు కింద కూర్చుంటా.ఆదివారం కనీసం పది పేపర్లు చూడ్డం నాకు ఇష్టం.
కళ్ళు అక్షరాల మీద కదులుతూనే ఉంటాయి కానీ ద్రుష్టి మాత్రం నా చుట్టూ చక్కర్లు కొడుతున్న పిట్టల మీదే ఉంటుంది.
నేను విజిల్ వెయ్యగానే ఓ వంద పావురాలు నా చుట్టూ వాలిపోతాయి.
వాటి కోసం మా ఇంట్లో జొన్నలు స్టాక్ ఉంటాయి.హాయిగా జొన్నలు తినేసి,నీళ్ళ టబ్లో మునిగి జలకాలాడతాయ్.ఆడినంతసేపు ఆడి చక్కగా రెక్క లార్చి మట్టిలో పడకేస్తాయ్.
మేము పెంచుతున్న బుల్లి కోడిపిల్లలు గున గునా నడుస్తూ తోటంతా తవ్వి పోస్తుంటాయ్.
ఈలోగా దానిమ్మ చెట్టు మీదో,జామ చెట్టు మీదొ రామ చిలకలు వాలి రొద రొద చేస్తుంటాయ్.
నేను కూర్చున్న మామిడి చెట్టు బెరడుని టక టకా పొడుస్తూంటుంది వయ్యారి వడ్రంగి పిట్ట.
లోటస్ పాండ్ దగ్గర చేప పిల్లల కోసం ఒంటి కాలి మీద దొంగ జపం చేస్తూ ఓ కొంగ బావ,
ఇంత పొడుగు ముక్కేసుకుని పాలపిట్టలాగా ఉండే మరో పిట్ట కూడా కొంగ బావతో పోటీ పడ్తుంటుంది.
ఎక్కడినుండి వస్తుందో కానీ తోక ఊపుకుంటూ,టీ,టీ అంటు చాయ్ కోసం అరుస్తున్నాట్టు అరుస్తుంది ఓ బుల్లి పిట్ట.
ఈ లోగా వెదురు బియ్యం మొక్క ఆకును అవ్లీలగా మోసుకుపోతూ తేనెపిట్ట.కన్ను మూసి తెరిచేలోగా సగం మొక్కని మోసుకుపోతుంది.గుప్పెడంత ఉండే ఈ తేనె పిట్ట ఇంత బారుండే వెదురు బియ్యాం మొక్క ఆకులో,నిమ్మ గడ్డి ఆకుల్నో మోసుకుపోయే దృశ్యాన్ని చూసి తీరవలసిందే.
ఇంకో నలుపు తెలుపు కలబోత తొ,నిమిషానికి వంద సార్లు తోక ఊపుకుటూ తిరిగే బ్లాక్ అండ్ వైట్ పిట్ట ఒగలు చూడాల్సిందే.
ఇంతలో వస్తయండీ గువ్వల జంటలు. ఆడ గువ్వ ముందు మోకాళ్ళ మీద మోకరిల్లుతూ ప్రేమ సంకేతాలు పంపే మగ గువ్వ ఒద్దిక నవ్వు పుట్టిస్తుంది.ఆడ గువ్వ బెట్టు,దాని చుట్టూ చక్కర్లు కొట్టే మగ గువ్వ .
ఈలోగా జలకాలాడి,రెక్కలార్చిన పావురాలు జంట జంటలుగా జతకట్టి తిరుగుతుంటాయ్.మగ పావురాలు కూడా గువ్వ లాగానే ఆడ పావురం ముందు నానా విన్యాసాలూ చేస్తుంది.
అంత ఎత్తు ఆకాశంలో తిరుగుతూ కింద కనబడిన కోడిపిల్లాల కోసం గద్ద రివ్వున నేల మీదకి రాబోతుంటే తల్లి కోడి కీ అంటూ హెహ్హరిక చెయ్యగానే ఝామ్మంటూ తల్లి రెక్కల్లోకి దూరిపోయే పిల్లలు.
ఈలోగా గొంతు మూగబోయిన కోకిలమ్మలు మామిడి చెట్టు మీద చేరి గుర్రుగుర్రుమంటూ యుగళ గీతం అందుకుంటాయి.ఒక్కోసారి నాలుదైదు కలిసి సామూహిక గాన కచేరి మొదలు పెట్టాయంటే చెవులు చిల్లులు పడాల్సిందే.
గోరింకలు మహా ఠీవిగా నడుస్తూ పురుగుల్ని తిటుంటాయి.
పక్కనున్న వేప చెట్టు మీద చేరి ఓ ఉడుత కొంపలంటుకున్నట్టు అరవడం మొదలు పెడుతుంది.కొన్ని మొక్క జొన్న గింజలెయ్యగానే తోక ఊపుకుంటూ దిగొచి యమ ఫాస్ట్ గా ముందు కాళ్ళతో గింజల్ని తీసుకుని నోట్లో కుక్కుకుంటుంది.
తోక కింద ఎర్రగా ఉండి టొపీ పెట్టుకుని ఉండే పిట్ట బలే హడావుడి చేస్తూంటుంది.ఈ మధ్య ఏక్తార మీటినట్టు గట్టిగా కూసే పిట్టొకటి రావడం మొదలు పెట్టింది.ఇంకో పిట్టుంది అదేమో ఎవరో పట్టుకుని దాని గొంతు పిసికేస్తున్నారా అన్నత గోలగా అరుస్తుది.
ఇంకా ఎన్నో రకాల పిట్టలు వస్తాయి.కొన్నింటి పేర్లు నాకు తెయదు.
ఇన్ని రకాల పిట్టలొస్తాయి కానీ నా కళ్ళు మాత్రం పిచ్చికల కోసం వెదుకుతుంటాయి.వాటి కోసం మా సీతారామపురం నుండి తెచ్చి కట్టిన ధాన్యపు కంకులు నన్ను వెక్కిరిస్తూ ఉంటాయి.
పిచ్చికల కోసం నేను ప్రతి రోజూ ఎదురు చూస్తాను. ఒక్కటీ రాదు.అవి బతికుంటేగా రావడానికి.
రాని పిచ్చికల కోసం నా కళ్ళల్లోంచి ఓ కన్నీటి చుక్క నా ముందున్న పేపర్ మీద పడుతుంది.నా కాళ్ళ దగ్గర పడుకున్న హాయ్(కుక్క పిల్ల) నా వేపు చూస్తుది.
దానికీ నాకూ ఆకలి మొదలై అదో రెండు బిస్కట్లూ,నేను ఓ బ్రెడ్డు ముక్కో,గుర్రం దానానో (ఓట్సండి) తినేస్తా.
మళ్ళీ బుద్ధిగా పేపర్లో తలదూరుస్తా.

Friday, August 20, 2010

మై ఫ్రెండ్షిప్ బాక్స్ ( my friendship box)

 
Posted by Picasa

అబ్బ!ఈ ఫోటోలన్నీ చూస్తుంటే ఎంత సంతోషమో.
ఇంతమంది ప్రియ మిత్రులు.ఎంత స్నేహం పంచారో వర్ణించలేను.
జీవితం పట్ల ప్రేమని,జీవించే కళని నాలో ప్రోది చేసింది నేస్తాలే.
అక్షరాల పట్ల ఆరాధనని,ఆశయాల పట్ల నిబద్ధతని రగిలించింది ప్రియ మిత్రులే.
అందరిని ఒక చోట చూస్తుంటే వాళ్ళ మీద ఉప్పొంగే ప్రేమ నన్ను ముంచెత్తుతోంది.
ఎడమ నుంచి మొదలు పెడితే సన్నగా రివటలాగా నేను నాతో తొమ్మిదో తరగతిలో ఫ్రెండ్ బేబి.
ఆ తర్వాత నేనూ జయ,సుభ,భారతి,గిరిజా కుమారి,డా.అనిత,అరుణ,శైలజ,విజయ,సుజాత,మనోరమ
సజయ,చాయా దేవి,ప్రతిమ,గీత,ఉత్పల.
ఇంకా చాలా మంది మిత్రులున్నారు.ఫోటోలన్నీ వెతకాలి.
ఇద్దరం కలిసి ఉన్న ఫోటోలుఇవి మాత్రమే చిక్కాయి.
చాలా కష్టపడి ఫోటో లు కత్తిరంచి ఒక బాక్స్ లో అతికించాను.
ఆ బాక్స్ కి ఫ్రెండ్షిప్ బాక్స్ అని పేరు పెట్టా.

Thursday, August 19, 2010

భూమిక ఆధ్వర్యంలో విజేతలకు బహుమతుల ప్రదానోత్సవం

 
Posted by Picasa
భూమిక 2005 వ సంవత్సరం నుండి కధ,వ్యాసం పోటీలు పెడుతోంది.

2010 సంవత్సరానికి నిర్వహించిన పోటీ లో విజేతలైన వారికి బహుమతుల ప్రదానోత్సవం 14-8-10 నాడు ఎమెస్కో పుస్తక ప్రచురణవారి హాలులో జరిగింది.
మహిళా శిశు అభివృద్ధి శాఖ డైరక్టర్ వి.ఉషారాణి గారు విజేతలకు బహుమతులు ప్రదానం చేసారు.
కధ:
మొదటి బహుమతి :ఏ.పుష్పాంజలి
రెండో బహుమతి :జె.శ్యామల
మూడో బహుమతి స్వర్ణ ప్రభాత లక్ష్మి
వ్యాసం :
మొదటి బహుమతి :డా.రామ లక్ష్మి
రెండో బహుమతి :ఏ.అంజన్ కుమార్
మూడో బహుమతి :శేషారత్నం

Monday, August 16, 2010

మా అత్త గారూ-ఆగష్ట్ పదిహేనూ


ఈ ఫోటో చూసారా?ఈవిడ మా అత్తగారు.వయసు 86 సంవత్సరాలు.ప్రతి సంవత్సరం ఆగష్ట్ 15,జనవరి 26 న మా ఇంట్లో జెండా ఎగరవేసేటప్పుడు ఆవిడ ఖచ్చితంగా ఉండాలి.
నిన్న స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా పతాకావిష్కరణ చేసిన సమయానికి ఆవిడ తయారుగా లేక మిస్ అయ్యారు.పెద్దావిడ కదా మెల్లగా నిద్రలేవడం,స్నానం చెయ్యడం ఏవో కారణాలు.
అయితే తాను లేకుండా జెండా పండగ అయిపోయినందుకు అగ్గి మీద గుగ్గిలం అయ్యారంటే నమ్మండి.
ఒకటే గొడవ.సరే!ఏదో ఒకటి చెయ్యకపోతే ఈవిడ శాంతించరని అర్ధమై ఇదిగో ఇలా ఏర్పాటు చేసా.
ఆవిడ గొడవకి కానిస్టేబుల్ కి నవ్వొచ్చింది కానీ అదే అధికారిక కార్యక్రమం అయ్యుంటే ఆయన సస్పెండ్ అయ్యేవాడు.
చూడండి మా అత్త గారి దేశ భక్తి.
ఎంతైనా ఆ జనరేషన్ నిబద్ధతే వేరు.

Friday, August 13, 2010

ప్రేమంటే.......

రెండు హృదయాల కలయిక మాత్రమే ప్రేమా?
హృదయాల కలయిక అంటే ఏమిటి?
ప్రేమ ఇంత సంకుచితమా?
పసిమొగ్గల పాలబుగ్గల మీద మన పెదవిముద్ర ప్రేమ కాదా?
చెంగున ఎగిరే లేగ దూడని అమాంతంగా పట్టుకుని గుండెకి హత్తుకోవడం ప్రేమ కాదా?
విత్తును చల్లి,మొలక తొలిరేక విప్పుకుంటున్నప్పుడు
ఉప్పొంగే ఉద్వేగం ప్రేమ కాదా?
చెట్టు మీద,పుట్ట మీద,చెలమ మీద
మబ్బు మీద, మంచు మీద, మహా సాగరం మీద
కెరటం మీద,కాంతి పుంజం మీద
మనసులో విరజిమ్మే మధురోహలు ప్రేమ కాదా?
ప్రేమతో పెంచిన చెట్టు కొమ్మల్ని తుంచడానికి జంకుతామే
గుండె నిండా ప్రేమించానని గుండె విప్పి చూపించావే
ఆమె గొంతు కొయ్యడానికి నీకు చేతులెలా వచ్చాయిరా?
దీనికి ప్రేమ అని పేరు పెడతావా సంకుచిత పిశాచీ
ప్రేమ నిండిన హృదయంలోకి
ఈ కత్తులు,కఠార్లు,ఆసిడ్ బాటిళ్ళూ
అనుమాన పెను భూతాలు ఎలా వచ్చాయిరా అక్కుపక్షీ
అమ్మని ప్రేమించేవాడు మరో అమ్మ కన్న ఆడపిల్ల మీద
 హింసల్ని అమలుచేస్తూ ,అదీ తాను ప్రేమించానని
ప్రగల్బాలు పలికే "ప్రేమికుడా"
ప్రేమంటే విశాలం,ఉన్నతం
ప్రేమంటే హృదయాలు ఇచ్చి పుచ్చుకోవడమే కాదురా
ప్రేమంటే పంచడం,ప్రపంచమంతా చల్లడం
పంచే కొద్దీ ఊరుతుందిరా ప్రేమ
లోతు బావిలో తేటనీరు ఊరినట్టు
ప్రేమకు హద్దులు గియ్యకురా ప్రేమోన్మాదీ
హద్దుల్లొ ఉంచినదేదైనా హరించిపోతుంది.

Tuesday, August 10, 2010

చంచల్ గూడ మహిళా జైలు సందర్శనం (మూడోసారి)

ఈ రోజు మళ్ళీ మహిళా జైలు చూడ్డానికి వెళ్ళాను.
నాతో పాటు హైదరాబాద్ లీగల్ సర్వీసెస్ అధారిటి సెక్రటరీ కూడా ఉన్నారు.ఇద్దరం కలిసి మొత్తం జైలు పరీక్షించాము.బారక్స్,వంట గది,కార్హానా,ఆసుపత్రి(జైల్లో పుట్టిన ముగ్గురు పసివాళ్ళున్నరు)అన్నీ చూసాము.ఖైదీలందరితోను మాట్లాడాం.వాళ్ళ కేసుల గురించి చర్చించాం.
చిన్న చిన్న నేరాలు చేసిన వాళ్ళ కేసుల పరిష్కారం కోసం జైల్ అదాలత్ పెట్టాలని నిర్ణయమైంది.
ఖార్ఖానాలో చక్కటి డిజైన్లతో,మంచి రంగులతో చీరల మీద వర్క్ చేస్తున్నారు.
నేను చేనేత తప్ప వేరే చీరలు కట్టుకోను కాబట్టి కొనలేకపోయాను.ఎవరికైనా కావాలంటే చెప్పండి.

ఈ రోజు నాకు బాగా తౄప్తినిచ్చిన పనిని మీతో తప్పక పంచుకోవాలి.
ఒకామె ఆరునెలల గర్భంతో ఉంది.చిన్న దొంగతనం చేసిన నేరం మీద భార్యాభర్తలిద్దరూ జైలు పాలయ్యారు.ప్రేమ వివాహం చేసుకోవడం వల్ల పెద్దలకి దూరమయ్యారు.మా అమ్మకు చెప్పండి అని ఆ అమ్మయి చాలా ఏడ్చింది.వీళ్ళు జైల్లో ఉన్నారని బయట ఎవ్వరికీ తెలియదు.ఆ అమ్మాయి ఇచ్చి న అడ్డ్రెస్
పుచ్చుకుని జైలు నుంచి అటే వాళ్ళ అమ్మని వెతుక్కుంటూ పోయాను.
చాలా కష్టం మీద ఆమెని కాచీ గూడా రైల్వే ష్టేషన్ వెనక పట్టుకున్నాను.వాళ్ళ కూతురి పరిస్థి చెప్పి "ములాఖత్"కి వెళ్ళమని చెప్పాను.చాలా ముసలామె.ఒకటే ఏడుపు. ఎన్ని దన్ణ్ణాలు పెట్టిందో.
నాకు మాత్రం ఈ రోజు చాలా చాలా సంతోషమంపించింది.చాలా తృప్తిగా కూడా ఉంది.

Saturday, August 7, 2010

నిన్న రాత్రి నేనో కల కన్నాను

ఆహా ఏమి ఆ కల,ఎంత అద్భుతమైన కల
నువ్వూ నేనూ పక్క పక్కనే నడుస్తున్నాం
చేతిలొ చెయ్యేసి భుజం భుజం కలిపి
ఆకుపచ్చటి పచ్చిక బయిళ్ళ మీద
నేనొక అడుగు ముందుకెయ్య లేదు
నువ్వొక అడుగు ముందుకెయ్యలేదు
సమానంగా అడుగుల లయలో
ఏకబిగిన నడుస్తున్నాం
ఏవేవో అడ్డంకులులు
ఎవరెవరివో ఆర్తనాదాలు
సూట్కేసుల్లోంచి బట్టల్ని కుమ్మరించినట్టు
ఆడపిల్లల శవాల దృశ్యాలు
హాయిగా ఆడుకునే పసిపిల్లల మీద
మగమౄగాల దాడులు
చదువుకునే చోట చీడపురుగుల చీదరం
ఇంటిబయట ఎంతటి అభద్రతో
ఇంటి నాలుగ్గోడల మధ్య అంతే అభద్రత
నువ్వూ నేనూ చేతిలో చెయ్యేసి
నడుస్తున్నాం కదా
మన మధ్య ఇటీవలి కాలంలో
ఇంత సయోధ్య ఎలా కుదిరిందో ఇంత ప్రజాస్వామిక వాతావరణం
ఎలా సంభవించిందో
మన మాటల్లోనే దొర్లుతోంది
హింస లేని జీవితమంటే
ఇంటా బయటా ప్రజాస్వామిక సంబంధాలుండాలంటే
అన్నింటా సమాత్వం నెలకొల్పాలంటే
అది నువ్వూ నేనూ కలిసి సాధించాల్సిందే
నన్నొదిలేసి నువ్వెళ్ళిపోయినా
నిన్నొదిలేసి నేనెళ్ళిపోయినా
మనం ఒంటరి దీవులమే అవుతాం
ఎవరికి వారౌ స్వార్ధపరులమే అవుతాం
మనం పక్క పక్కనే నడుస్తూ
ఎన్ని కలలు కంటున్నాం
ఎన్ని కొత్త ఆలోచనలు చెస్తున్నాం
అన్నింటా సమానత్వం అని నేనంటుంటే
నువ్వు సై అనడం
అబ్బో నీ మీద నా కెంత ప్రేమని
నువ్వింత మారాక నాతో సై అన్నాక
అంతా జాంతా నై అనేచోట
నువ్వింత ప్రజాస్వామికంగా మారి
పురుషస్వామ్యం పడగ మీద కొట్టాకా
నిన్ను ప్రాణప్రదంగా ప్రేమించడమే నా పని
ఇంటిలో, పొలంలో,ఫ్యాక్టరీలో
ఒక్కటేమిటి స్థిర చర వనరుల్లో
సగభాగమివ్వడడమే
అన్ని రకాల హింసలకు చెల్లు చీటి
అని నువ్వంటుంటే నా చెవుల్ని
నేనే నమ్మలేకపోయాను
నిన్ను వాటేసుకుని ముద్దుపెట్టుకోకుండా ఉండగననా
నీ మాటే నా మాటా
పద పోదం దండోరా వెయ్యడానికి
నువ్వు నేను కలిసి సంపాదించిన అన్నింటిలోను

అన్ని వనరుల్లో సమాన వాటా
అన్ని రిజిస్ట్రేషన్లల్లో అన్ని లావాదేవీల్లోనూ
మనిద్దరి పేర్లూ ఉండాల్సిందే
ఇదే మన కొత్త నినాదం
ఇదే మన సరికొత్త ఎజండా

Tuesday, August 3, 2010

మాట్లాడుకోవాలి

ఆకాశం నిండా నల్లటి మబ్బులు కమ్ముకున్నాయి. మే నెలలో హఠాత్తుగా ఎదురైన చల్లటి అనుభవం. నిన్నటిదాకా నలభై నాలుగు డిగ్రీల ఉష్ణాగ్రత. ఈ రోజు ఇరవై ఆరు. నిన్నటికి ఇవాల్టికి ఎంత తేడా. బంగాళాఖాతంలో పెనుతుఫాను. ఆ బీభత్సానికి ఎంత చక్కటి పేరు లైలా! క్రితం సంవత్సరం వచ్చిన తుఫాను పేరు ఐలా! ఈ పేర్లు ఎవరు పెడతారో! ప్రళయ విధ్వంశం సృష్టించే ప్రకృతి వైపరీత్యాలకు ఆడవాళ్ళ పేర్లు ఎందుకు పెడతారో!
మురళి, మాధవి బయట పచ్చటి లాన్‌లో కుర్చీలేసుకుని కూర్చున్నారు.చీకటి పడినట్లయిపోయింది. డాబామీదికి ఎగబాకిన మాలతీలత ఆకు కనబడకుండా విరబూసింది. మధురమైన సువాసనల్ని వెదజల్లుతోంది. ఇంకో పక్క కుండీలో గ్లోబులా పూసిన మే ప్లవర్‌. ఎర్రటి రంగుతో, అద్భుతమైన అల్లికతో చూడముచ్చటగా వుంది. మబ్బుల చాటున ఈద్‌కాచాంద్‌లాగా దర్శనమిచ్చింది నెలవంక.
''బాగా వర్షం వచ్చేట్టుంది మురళీ! లోపలికెళదాం పద'' మాధవి అంది.
''తుఫాను ఎఫెక్ట్‌ బాగానే వున్నట్టుంది. వెళదాంలే బయట చల్లగా, హాయిగా వుంది'' అన్నాడు మురళి
''నిజమే! చాలా హాయిగా వుంది. మనం ఇలా కూర్చుని మాట్లాడుకుని ఎంత కాలమైంది. ఏమిటో బతుకంతా ఉరుకులు, పరుగులతోటే సరిపోతోంది. దేనివెంట పరిగెడుతున్నమో అర్ధం కావడం లేదు'' అంది మాధవి నెలవంకని చూస్తూ.
మురళి కాసేపు మాట్లాడలేదు. మాధవి మనసులోని బాధ అర్ధం అవుతోంది. ఇరవై రెండేళ్ళ కాపురంలో మొదటి మూడు, నాలుగు సంవత్సరాల్లో తప్ప తాము ఇలా ఇంత ఆరామ్‌గా కూర్చున్నది లేదు. కార్పోరేట్‌ కాలేజీలో పిల్లల్ని డాక్టర్లు, ఇంజనీర్లుగా తయారు చేసే యంత్రంలా తను, రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌లో తలమునకలుగా మాధవి. డబ్బుకేం లోటు లేదు. పిల్లలకి మంచి చదువులు, విదేశాల్లో ఉద్యోగాలు. ఖరీదైన ఇల్లు, సౌకర్యాలన్నీ వున్నాయి.
''ఏంటీ అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావ్‌ మురళీ.''
''ఏం లేదు మధూ! ఇలాంటి సాయంత్రాల్ని ఎన్నింటిని కోల్పోయామా అన్పిస్తోంది.''
సన్నగా చినుకులు మొదలయ్యాయి. ఇద్దరూ లాన్‌లోంచి లేచి ఇంట్లో కొచ్చారు. ''కాఫీ తాగుదామా మురళీ''
''ఈ చల్లటి వాతావరణంలో అంతకంటే కావల్సిందేముంది పద కలుపుకుందాం.''
కాఫీ కప్పులతో డైనింగు టేబుల్‌ మీద కూర్చున్నారు. గాలి ఉధృతి పెరిగింది. వాన జోరుగా పడుతోంది. ఎక్కడో పెళ పెళమంటూ పిడిగు పడిన శబ్దం. కరెంటు పోయింది.
''ఎమర్జన్సీ లైట్‌ చెడిపోయింది. కాండిల్‌ ఎక్కడుందో ఏంటో'' అంటూ మాధవి లేవబోయింది.
''ఉండు మధు! కాండిల్‌ వద్దులే.కాసేపు చీకట్లో కూర్చుందాం.''
మాధవి కూర్చుంది. చిమ్మచీకటి. అపుడపుడూ మెరుపులు. దడామని పిడుగులు. వర్షం కురుస్తున్న శబ్దం మాలతీపూల మధుర సువాసనలు. గమ్మత్తుగా హాయిగా ఉంది వాతావరణం. మురళీకి నెల క్రితమే స్ట్రోక్  వచ్చింది  . క్లాసులో పాఠం చెబుతూ పడిపోవడంతో తనని అప్పటికప్పుడు కేర్‌ హాస్పిటల్‌కి తీసుకెళ్ళడం,కాలూ చెయ్యి ఎఫెక్ట్ కావడం   ఒక్కొటొక్కటి గుర్తొచ్చాయి మాధవికి.
''మధు! ఇలా చీకట్లో కూర్చోవడం బావుంది కదూ! మన మనస్సులోకి చూసుకునే ఇలాంటి అవకాశం చాలా అరుదుగా దొరుకుతుంది''.
''నిజమే మురళి! నిదానంగా నిలబడి నీళ్ళుకూడా తాగలేని వేగం, ఒత్తిళ్ళు మన ఆరోగ్యాలను ఎంత ధ్వంసం చేస్తున్నాయో మనకి అర్ధమవ్వడం లేదు. నాకెందుకో ఇరవై సంవత్సరాల క్రితం నాటి విషయాలు ఇపుడు గుర్తొస్తున్నాయి.''
''ఏ విషయాలు మనం కలిసి బతకడం మొదలు పెట్టిన నాటి కష్టాలా? అవన్నీ ఇపుడెందుకులే మధూ''
''ఆ విషయాలు కాదు మురళీ!  నాకు ఇరవై ఏళ్ళ క్రితమే ఓపెన్‌ హార్ట్‌ సర్జరీ అయ్యింది. ఆ రోజుల్లో, మన దగ్గర డబ్బులేని రోజుల్లో నువ్వు ఎంత కష్టపడి నాకు ఆపరేషన్‌ చేయించావో నాకు గుర్తుకొస్తోంది."
''వద్దు మధూ! వాటిని గుర్తు చెయ్యకు. అయినా నువ్వు నెలరోజులుగా నా కోసం చేసిన సేవ ముందు అదెంతలే. ఏదో డబ్బుల్లేక గాంధీ హాస్పిటల్‌లో...
'మురళీ! ప్లీజ్‌ అలా అనకు! నన్ను మాట్లాడనీ..నీ కోసం నేను చేసిందేమీ లేదు. ఖరీదైన హాస్పిటల్‌, స్పెషల్‌రూమ్‌, నిరంతరం నర్సు సేవ చేసారు. నేను హాయిగా ఎ.సి రూంలో వున్నాను. కానీ గాంధీలో నేను ధోరాసిక్‌ వార్డులో వుంటే నువ్వెక్కడ వుండేవాడివో నాకు తెలుసు. భయంకర దుర్వాసనలు వెదజల్లే బాత్‌రూమ్‌ల పక్కన, జనరల్‌ వార్డుల పక్కన, రోడ్డు మీద గంటల తరబడి కూర్చోవడం, రాత్రిళ్ళు అక్కడే పడుకోవడం. నాకు తెలుసు మురళీ. గవర్నమెంట్‌ ఆసుపత్రిలో నా గుండె ఆపరేషన్‌ విజయవంతమౌతుందా లేదా అనే టెన్షన్‌, పెద్దలకి ఇష్టంలేని పెళ్ళి చేసుకున్నాం కాబట్టి అటునుంచి సహాయ నిరాకరణ. ఆ రోజుల్లో నువ్వెంత మానసిక క్షోభని అనుభవించి వుంటావో నాకు తెలుసు.నన్ను ఆపరేషన్‌ ధియేటర్‌కి పంపుతూ నువ్వు కార్చిన కన్నీటి చుక్క నా బుగ్గ మీద పడి, అప్పటికే సగం మత్తులో వున్న నాకు వెచ్చగా తాకి, నేను కళ్ళు విప్పి నవ్వుతూ చెయ్యి ఊపుతుంటే నువ్వు కన్నీళ్ళ మధ్య నవ్వావ్‌. అంతే. రెండో రోజు దాకా నాకు స్పృహ రాలేదు. ఆ పగలు, ఆ రాత్రి నువ్వెంత ఏడ్చి వుంటావో నాకు తెలుసు. ఆ తర్వాత నన్నెంత అపురూపంగా చూసుకున్నావో, ఎన్ని సేవలు చేసావో నా మనసుకు తెలుసు. ఈ విషయాలన్నీ నీకు చెప్పాలని ఎన్నో సార్లు అనుకునేదాన్ని. చెప్పలేదు. వెలుతురులో ఇగోలు, అహాలు అడ్డొస్తాయి కాబోలు. చీకట్లో మనలోకి మనం చూసుకోగలగుతాం.'' మాధవి మాట్లాడడం ఆపింది.
''మధూ! ఇరవై సంవత్సరాలైనా నువ్వింకా ఆ విషయాలు మర్చిపోలేదా? నిజమే! నా జీవితంలో కష్టమైన కాలమది. నా స్థానంలో ఎవరున్నా అంతే చేస్తారు. నీకు గుండెలో పెద్ద రంధ్రముందని మొదటిసారి డాక్టరు చెప్పినపుడు నేను బిత్తర పోయాను. ఆ తత్తరపాటును ఎలా కప్పిపుచ్చుకోవాలో అర్ధం కాలేదు. మనమున్న స్థితిలో ఖరీదైన వైద్యం చేయించలేను. అయినా అప్పటికి అపొలోలు, కేర్‌లు ఎక్కడున్నాయ్‌? గాంధీ యే దిక్కు. అయితేనేం డాక్టర్లందరూ ఎంతో మంచివాళ్ళు. ఇప్పటిలా కమర్షియల్‌ ఆలోచనలు వున్న వాళ్ళు కాదు.''
''అవును. నేను కళ్ళు తెరిచేటప్పటికీ నా ఎదురుగా కూర్చుని వున్నారు. డా. సత్యనారాయణగారు. రికవరీ రూమ్‌లో ఆయన్ని చూసి ఆశ్చర్యపోయాను. అంత ప్రత్యేక శ్రద్ధతో చూడడంవల్లే నేను బతికి పోయాననుకుంటాను.''

''మధూ! ఆ విషయం సరే! నేను కూడా నీకు చాలా దు:ఖం కల్గించాను. బతుకు బండి వంద మైళ్ళ వేగంతో పరుగెతున్నపుడు ఏమీ అర్ధం కాలేదు. నేను నా ఆరోగ్యాన్ని చేజేతులా పాడు చేసుకున్నాను. శరీరాన్ని మిస్‌ యూజ్‌ చేసాను. నా జ్ఞానాన్ని లక్షలకి అమ్మి, యంత్రాల్ని, యంత్రాల్లాంటి విద్యార్ధుల్ని తయారు చేసాను. ఎక్కడ ఎక్కువిస్తే అక్కడికి జంప్‌ చేసి డబ్బు సంపాదనే ముఖ్యమైన ప్రాధాన్యత అనుకున్నాను. సంపాదించిన డబ్బుని ఆస్తులుగానో, వస్తువులుగానో మార్చాను. బ్లాక్‌ లేబుల్‌, రెడ్‌లేబుల్‌ అంటూ బాటిళ్ళకి బాటళ్ళు గొంతులో పోసి గుండెను ఛిద్రం చేసుకున్నాను. నీ మాట ఏనాడైనా విన్నానా? నీకసలు దొరికేవాడినా? నిన్ను చాలా హింస పెట్టాను కదా! డబ్బుతో పాటు బోలెడన్ని రోగాలూ సంపాదించాను. ఆ రోజు  క్లాసులో కుప్పకూలేవరకూ నేను ఏంచేస్తున్నానో ఎలా బతుకుతున్నాననే స్పృహే లేదు. ఆయాంసారీ! మధూ!'' మురళి గొంతు పూడుకుపోయింది.
మాధవి కుర్చీలోంచి లేచి వచ్చి మురళి వెనుక నిలబడింది. అతన్ని గుండెకి పొదుపుకుంటూ...
''మన మధ్య సారీలేంటి మురళీ! నాకు నీ ఆరోగ్యం గురించి చాలా బెంగగా వుండేది. నీ లైఫ్‌స్టయిల్‌ దిగులు పుట్టించేది. డబ్బు వెంట ఎందుకంత వెర్రిగా పరుగెడుతున్నావో అర్ధమయ్యేది కాదు. ఒక కాలేజీ నుంచి ఇంకో కాలేజీకి వెళ్ళినపుడల్లా నాకు చాలా బాధగా అన్పించేది.''
''నిజమే! బహుశ మన మొదటి రోజుల్లోని కష్టాలే నన్ను అలా పరుగెత్తించాయేమో!ఏమో!''
పెద్దగా ఉరిమింది. కళ్ళు మిరుమిట్లుగొల్పే మెరుపులు. ఫెళ ఫెళమంటూ ఎక్కడో పడిన పిడుగులు.
''ఇంక కరెంటు రాదేమో! కొవ్వొత్తి ఎక్కడుందో'' ''ఉండనీయ్‌లే మధూ! ఇపుడు కరెంట్‌తో మనకి పనేం లేదుగా. డిన్నర్‌ టైమ్‌కి చూద్దాంలే.''
''అంతేనంటావా. ఇలా చీకట్లో కూర్చుని మాట్లాడుకోవడం బావుంది. పండువెన్నెల పరవశాన్ని కల్గిస్తుంది. చీకటి చిక్కదనం కూడా ఇంత బావుంటుందనుకోలేదు.''
''బహుశా మనం చీకటిని వెలుతురును ఒకేలా చూసే దశకి చేరామేమో!''
''అంతే కాదు మురళి! ఇంతకాలం మనం దేనికో దానికి పోట్లాడుకుంటూనే గడిపాం. అది నీ ఉద్యోగమా! పిల్లల విషయమా! నేను చేసే పొరపాట్లా. సాధింపులా? ఏదైనా కానీ ఇలా కూర్చుని సావకాశంగా మాట్లాడుకున్నది లేదు. చర్చించుకున్నది లేదు. ఆవేశాలు, కావేశాలు అంతే. ఇపుడు మనమిద్దరమే మిగిలాం. పిల్లలు అమెరికా నుంచి తిరిగి వస్తారని నాకయితే నమ్మకం లేదు. నాకు నువ్వు నీకు నేను అంతే.'' మురళి జట్టులోకి వేళ్ళు పోనిస్తూ అంది.
''అవును మధూ! ఇంతకాలం ఎవరికోసమో బతికినట్టుంది. ఉద్యోగం కోసం, సంపాదన కోసం, పిల్లలకోసం పరుగులు పెడుతూ బతికాం. అదీ అవసరమే కానీ నేను మరీ విపరీతంగా ప్రవర్తించి ప్రాణం మీదకు తెచ్చుకున్నాను. అలా చేసి ఉండకూడు కదా!''
''జరిగిపోయినవి తలుచుకుని బాధపడ్డం ఎందుకులే మురళీ! ఇపుడేం మించిపోలేదు. మనం కలిసి బతకడం మొదలుపెట్టినపుడు ఎంత స్నేహంగా, సంతోషంగా వున్నామో మనిద్దరికీ తెలుసు. మధ్యలో వచ్చిన వేవీ మనకి సంతోషాన్నివ్వలేదు. మన మధ్య కనబడని అగాధాన్ని సృస్టించాయి. ఈ రోజు ఎంతో మనస్ఫూర్తిగా మనసు విప్పి మాట్లాడుకోగలిగాం. ఇది ఇలాగే కొనసాగితే ఇంతకు మించింది ఏముంటుంది?''
''రోజూ లైట్లాపేసి చీకట్లో ఓ గంట గడిపితే బావుండేట్టుంది.'' అన్నాడు మురళి నవ్వుతూ
''నువ్వు ట్లాబ్లెట్లు వేసుకోవాలి. కొవ్వొత్తి కోసం వెతకాల్సిందే.'' అంటూ మధు లేవబోయింది.
అదే క్షణంలో కరెంటు వచ్చింది.
వెంటనే ఫోన్‌ కూడా మోగింది. మాధవి లేచి ఫోనందుకుంది. కూతురు శ్రావ్య. ఫోన్‌ మురళికిచ్చి టాబ్లెట్‌ కోసం వెళ్ళింది మాధవి.
''బావున్నానురా! ఏంచేస్తున్నామా? జోరుగా వాన పడుతోంది. అమ్మ నేను కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నాం. నిజం రా. నమ్మకం కలగడం లేదా? అయితే అమ్మనడుగు'' మాధవికిచ్చాడు ఫోన్‌.
'తల్లీ! నాన్న చెప్పింది నిజమేనే. చాలా సంవత్సరాల తర్వాత మేం బోలెడు కబుర్లు చెప్పుకున్నాం. నాన్న బాగానే వున్నాడు. మా గురించి మీరేం కంగారుపడకండి. సరేనా'' ఫోన్‌ పెట్టేసింది.
మళ్ళీ ఇద్దరూ కబుర్లలో పడ్డారు. గడ్డ కట్టిన మాటల మూటలేవో కరిగి వర్షం నీరులా ప్రవహించసాగాయి. ఆ ప్రవాహంలో తడిసి ముద్దవుతూ మరిన్ని మాటల్ని వెదజల్లుకుంటూ అలాగే కూర్చుండి పోయారు మురళి, మాధవి.

Monday, August 2, 2010

సి 112 పాటిగడ్డ కాలని

1975 లో నేను మా సీతారామపురం నుంచి బయలుదేరి
హైదరాబాద్ వచ్చాను.మా నాన్న నన్ను తీసుకొచ్చాడు.మేము రైల్లో వచ్చాము.రైల్లో కూర్చున్నప్పుడు నా ఎదుటి సీట్లో ఒకాయన పొరపాటున కాలు తగిలితే గబుక్కున ఒంగి కాళ్ళు పట్టుకుని మరీ సారీ చెప్పినప్పుడు నేను భయపడి కాళ్ళు వెనక్కి లాక్కున్నాను.అంతవరకు అలాంటి అనుభవం ఎప్పుడూ ఎదురుకాలేదు.
మా నాన్న నేను రైలు దిగి ఆటోలో పాటిగడ్డ కాలనీకి,మా చిన్నాన్న గారి ఇంటికి వచ్చాం.అక్కడే ఉండి ఉద్యోగం వెతుక్కోవాలని వచ్చాను.రెండు రోజులుండి మా నాన్న వెళ్ళిపోయాడు.
నాకు ఉద్యోగం రావడానికి చాలా కాలమే పట్టింది కానీ పాటిగడ్డ కాలనీ నాకు ఓ అపూర్వమైన స్నేహాన్నిచ్చింది.మా సీతారంపురాన్ని,మా ఇంటిని అన్నింటిని వదిలేసి మహానగరంలోకి వచ్చిపడ్డాను.ఎవ్వరూ తెలియదు.అలాంటి సమయంలో విజయ పరిచయమైంది.విజయ ద్వారా జయ పరిచయం జరిగింది.
జయతో పరిచయం చాలా గమ్మత్తుగా అయ్యింది.తన కూతురు పప్పు(ఇప్పుడు అమెరికాలో ఉంది ఇద్దరు పాపలు) బొద్దుగా ఉండేది.విజయ పప్పుని ఎత్తుకుని జయ దగ్గరికి వెళుతూ నన్నూ తీసుకెళ్ళింది.
జయ మాకు తింటానికి చపాతీలు ప్లేటులో పెట్టుకొచ్చింది.నేను తీసుకోకుండా అక్కడ పెట్టండి అన్నాను.అబ్బో ఈ అమ్మాయికి చాలా టెక్కే అనుకుందట.ఆ పొగరే నాకు నచ్చిది అంటుంది.ఆ రోజు అలా జరిగిన పరిచయం ఈ రోజుకీ నిరంతంతరాయంగా,నిరాటంకంగా కొనసాగుతోంది.
35 సంవత్సరాలుగా మా స్నేహం సాగుతోంది.జయ వైజాగ్ లో ఉంటుంది.నా కష్టం,సుఖం,నా జీవితంలోని ఆటుపోట్లు అన్నింటిలోను తను తోడైంది.
మా నాన్న చనిపోయి నేను కొండంత దుఖంలో కొట్టుకుపోతున్నపుడు తన స్నేహమే నన్ను కాపాడింది.తన స్నేహమే నన్ను మా ఊరు నుండి మళ్ళీ హైదరాబాదుకు రప్పించ్నిది.
సి 112 క్వార్టర్ లో జయ ఉండేది.ఆ క్వార్టర్ తో పెనవేసుకుని నాకు ఎన్నెన్ని అద్భుతానుభవాలో.ఎంత సంతోషాన్ని ఇద్దరం ఆ ఇంట్లో పంచుకున్నామో.నా ఏకాకి ఎడారి జీవితంలో ఆ ఇల్లొక ఒయాసిస్.ఒక్కమాటలో చెప్పాలంటే నేను ఈ రోజు ఈ స్తితిలో ఉండడానికి తన స్నేహం,తనిచ్చిన చేయూత తక్కువదేమీ కాదు.
తన స్నేహం దొరికి ఉండకపోతే నేను హైదరాబాద్లో నిలదొక్కుకునేదాన్ని కాదు .
ఈ స్నేహ దినోత్సవాన మా అపూర్వ స్నేహాన్ని గుర్తు తెచ్చుకోవాలనిపించింది.
తర్వాతి కాలంలో నా జీవితంలోకి ఎందరో స్నేహితులొచ్చారు.
నా హృదయానికి చాలా దగ్గరైన వాళ్ళూ ఉన్నారు.కానీ జయ నా బతుకు సరైన దారిలో నడవడానికి ప్రేరణ అయ్యింది.
ఈ మాట చెప్పుకోవడానికి నాకు చాలా గర్వంగా ఉంటుంది.

Sunday, August 1, 2010

నీ స్నేహానికి నా అక్షర నీరాజనం


స్నేహం......మూడు అక్షరాల పదం.
ఆ పదాన్ని పలుకుతుంటేనే జుంటితేనే జాలువారుతున్న అనుభూతి
అక్షరాలు ఈ అనుభూతిని వ్యక్తీకరించగలవా?
మానవ హృదయం నిమిషానికి డెబ్భై రెండు సారు కొట్టుకుంటుందట.
లబ్.....డబ్.....లబ్ డబ్ ఒకటే లయ.
ఈ లబ్ డబ్ లయలో ఇమిడిపోయింది నీ పేరు
గుండె గవాక్షం లోకి చొచ్చుకు వచ్చింది నీ స్నేహం
నవ్వుల నదిలో పువ్వున వాన నీతో నెయ్యం
ఎన్ని అనుభూతుల కలనేత మన స్నేహం
 ఈ స్నేహ దినోత్సవాన  ఎన్నింటిని గుర్తుచేసుకోను
కుశలమా అంటూ రాసిన ఓ ఉత్తరం ముక్క
ఇంత గాఢ స్నేహాన్ని తిరుగు టపాలో తెస్తుందని నేను ఊహించానా
ఉత్తరమంటే ఏంటో తెలియని నువ్వు నాకు సమాధానం రాయడమేమిటి
ఆ ఉత్తరమే లేకుంటె మన స్నేహానికి ఇంత చరిత్ర ఉండేదా
ఈ స్నేహమే లేకుంటె జీవితం ఇంత హృద్యంగా,హృదయంగమంగా ఉండేదా
ఊహలో ఊపిరిలో నీ స్నేహం ఎంత ఉత్సాహాన్ని నింపుతుందో
నువ్వూ నేనూ కలిస్తే నవ్వుల పువ్వులు జలజలా రాలవా
మనం కలిసి నడిస్తే మోదుగ పూలుఎర్రెర్రగా ఎదురురావా
మనం కలిసి కూర్చుంటే ఆకాశమల్లెలు కుప్పలుగ కురియవా
మనం అడుగు పెడితే వెదురుపూలే విరగ పూసాయి
నీ ఆలోచన ఆకుపచ్చ లోయల్ని ఆకాశపు అంచుల్ని తలపిస్తుంది
నీ జ్ఞాపకం నా పెదవి అంచు మీద చిరునవ్వౌతుంది
నీ వేలి కొసల్లోంచి జాలువారే చల్లటి స్నేహం
నా కంటి కొలుకుల్లోని కన్నీళ్ళను కరిగించేస్తుంది
మాటలో, మనసులో,బతుకులో, చావులో నన్ను వీడిపోనిది
ఎప్పటికీ వాడిపోనిదీ మన స్నేహం
ఈ స్నేహ దినోత్సవాన
మన స్నేహానికి ఇదే నా అక్షర నీరాజనం

నా మీద వాలిన ఛాయాదేవి ఛాయ

ఎప్పటిమాట. పచ్చగా, చల్లగా, కుటీరం లాగా ఉండే ఆ ఇంటికి తొలిసారి ఎప్పుడెళ్ళాను. తొలిచూపులోనే ఆవిడతో ప్రేమలో పడిన సంఘటనలో నిజానికి, ఆరోజు ...