Monday, August 2, 2010

సి 112 పాటిగడ్డ కాలని

1975 లో నేను మా సీతారామపురం నుంచి బయలుదేరి
హైదరాబాద్ వచ్చాను.మా నాన్న నన్ను తీసుకొచ్చాడు.మేము రైల్లో వచ్చాము.రైల్లో కూర్చున్నప్పుడు నా ఎదుటి సీట్లో ఒకాయన పొరపాటున కాలు తగిలితే గబుక్కున ఒంగి కాళ్ళు పట్టుకుని మరీ సారీ చెప్పినప్పుడు నేను భయపడి కాళ్ళు వెనక్కి లాక్కున్నాను.అంతవరకు అలాంటి అనుభవం ఎప్పుడూ ఎదురుకాలేదు.
మా నాన్న నేను రైలు దిగి ఆటోలో పాటిగడ్డ కాలనీకి,మా చిన్నాన్న గారి ఇంటికి వచ్చాం.అక్కడే ఉండి ఉద్యోగం వెతుక్కోవాలని వచ్చాను.రెండు రోజులుండి మా నాన్న వెళ్ళిపోయాడు.
నాకు ఉద్యోగం రావడానికి చాలా కాలమే పట్టింది కానీ పాటిగడ్డ కాలనీ నాకు ఓ అపూర్వమైన స్నేహాన్నిచ్చింది.మా సీతారంపురాన్ని,మా ఇంటిని అన్నింటిని వదిలేసి మహానగరంలోకి వచ్చిపడ్డాను.ఎవ్వరూ తెలియదు.అలాంటి సమయంలో విజయ పరిచయమైంది.విజయ ద్వారా జయ పరిచయం జరిగింది.
జయతో పరిచయం చాలా గమ్మత్తుగా అయ్యింది.తన కూతురు పప్పు(ఇప్పుడు అమెరికాలో ఉంది ఇద్దరు పాపలు) బొద్దుగా ఉండేది.విజయ పప్పుని ఎత్తుకుని జయ దగ్గరికి వెళుతూ నన్నూ తీసుకెళ్ళింది.
జయ మాకు తింటానికి చపాతీలు ప్లేటులో పెట్టుకొచ్చింది.నేను తీసుకోకుండా అక్కడ పెట్టండి అన్నాను.అబ్బో ఈ అమ్మాయికి చాలా టెక్కే అనుకుందట.ఆ పొగరే నాకు నచ్చిది అంటుంది.ఆ రోజు అలా జరిగిన పరిచయం ఈ రోజుకీ నిరంతంతరాయంగా,నిరాటంకంగా కొనసాగుతోంది.
35 సంవత్సరాలుగా మా స్నేహం సాగుతోంది.జయ వైజాగ్ లో ఉంటుంది.నా కష్టం,సుఖం,నా జీవితంలోని ఆటుపోట్లు అన్నింటిలోను తను తోడైంది.
మా నాన్న చనిపోయి నేను కొండంత దుఖంలో కొట్టుకుపోతున్నపుడు తన స్నేహమే నన్ను కాపాడింది.తన స్నేహమే నన్ను మా ఊరు నుండి మళ్ళీ హైదరాబాదుకు రప్పించ్నిది.
సి 112 క్వార్టర్ లో జయ ఉండేది.ఆ క్వార్టర్ తో పెనవేసుకుని నాకు ఎన్నెన్ని అద్భుతానుభవాలో.ఎంత సంతోషాన్ని ఇద్దరం ఆ ఇంట్లో పంచుకున్నామో.నా ఏకాకి ఎడారి జీవితంలో ఆ ఇల్లొక ఒయాసిస్.ఒక్కమాటలో చెప్పాలంటే నేను ఈ రోజు ఈ స్తితిలో ఉండడానికి తన స్నేహం,తనిచ్చిన చేయూత తక్కువదేమీ కాదు.
తన స్నేహం దొరికి ఉండకపోతే నేను హైదరాబాద్లో నిలదొక్కుకునేదాన్ని కాదు .
ఈ స్నేహ దినోత్సవాన మా అపూర్వ స్నేహాన్ని గుర్తు తెచ్చుకోవాలనిపించింది.
తర్వాతి కాలంలో నా జీవితంలోకి ఎందరో స్నేహితులొచ్చారు.
నా హృదయానికి చాలా దగ్గరైన వాళ్ళూ ఉన్నారు.కానీ జయ నా బతుకు సరైన దారిలో నడవడానికి ప్రేరణ అయ్యింది.
ఈ మాట చెప్పుకోవడానికి నాకు చాలా గర్వంగా ఉంటుంది.

No comments:

తర్పణాలు త్రిశంకు స్వర్గాలు

 తర్పణాలు, త్రిశంకు స్వర్గాలు ............ మా సీతారాంపురం లో మా తాతకి చాలా పొలాలు ఉండేవి. మా తాత, చిన్న తాత ఇద్దరే పొలాలన్నింటిని పంచుకున్నా...