Tuesday, April 1, 2014

నన్ను ఆవహించిన ఆదిలాబాద్‌ అడవి

ఆదిలాబాదు అడవుల మీద మోహం ఈనాటిదా? కాదు కాదు…. చాలా సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నాను. సమతా రోషిణి ఆ జిల్లాలో పనిచేసినపుడు… మనోరమ ఆదిలాబాదు కలెక్టారాఫీసులో ఉద్యోగం చేసినపుడు…. చాలా చాలా అనుకున్నాను. ఎన్నోసార్లు వాళ్ళను అడిగాను. 

20140114_040029
ఆదిలాబాదు ట్రిప్‌ వేద్దాం… వివరాలు సేకరించండి అంటే…. ఎవ్వరూ వినలేదు. నా కోరిక అలాగే దాక్కుని వుండిపోయింది. ఆ అడవి మీద మోహం మరింతగా పెరిగిపోయింది. కుంతల జలపాతం కవ్విస్తూనే వుంది.
అమృతలత పరిచయం… అది స్నేహరూపం దాల్చాక… ఇటువేపు రైటర్స్‌ ట్రిప్‌ వెయ్యండి… అన్నీ నేను చూసుకుంటాను అన్నపుడు మనసు మూలల్లో ముడుచుకుని కూర్చున్న కోరిక ఆఘమేఘాల మీద బయటకు ఉరికొచ్చింది. ఆయా ప్రాంతాల గురించి తెలిసిన అమృత ఆర్గనైజ్‌ చేస్తానంటే ఇంకేం కావాలి? అక్కడ పనిచేస్తున్న ప్రశాంతి సపోర్ట్‌ వుండనే వుంది. ఏ ప్రాంతం నుంచి… ఏ ప్రాంతానికి వెళ్ళాలి? రూట్‌ ఏమిటి? ఏ గ్రామం విజిట్‌ చెయ్యాలి? లాంటి విషయాలన్నీ మొత్తంగా వాళ్ళిద్దరికీ అప్పగించేసి ఆదిలాబాదు అడవి గురించి కలలు కనడం మొదలు పెట్టాను.
భూమిక టీమ్‌ చకచకా పనులన్నీ పూర్తి చేసారు. బస్సు మాట్లాడారు. ట్రిప్‌కి వస్తామన్న వాళ్ళతో అసంఖ్యాకంగా మెసేజ్‌ల రూపంలో, మాటల రూపంలో మాట్లాడారు. వస్తామన్న వాళ్ళ లిస్ట్‌ ప్రతిరోజూ మారుతూ… చివరికి 25 మంది మిగిలారు. 28 సీటర్‌ బస్సు మాట్లాడుకుని 21 సాయంత్రం నాలుగింటికి ఆదిలాబాదు ప్రయాణం మొదలైంది. గీత కండక్టర్‌ సీటులో కూర్చుని ప్రయాణపు కథని సజావుగా నడిపించింది. నేను, ప్రశాంతి అటు ఇటూ తిరుగుతూ… డ్రైవర్‌కి సూచనలిస్తూ చాలా హడావుడిగా వున్నట్టు కనబడ్డాం.
మూడు రోజుల ట్రిప్‌లో చూడాల్సిన ప్రదేశాలు, చెయ్యాల్సిన పనులూ నా మనసులో మెదులుతూనే వున్నాయి కానీ… నిజానికి ఈ ట్రిప్‌ని ఆర్గనైజ్‌ చెయ్యడం మినహా నేను చేసిందేమీ లేదు. ఆదిలాబాదు ట్రిప్‌లో అసలు కథానాయికలు… అమృత, గీత, ప్రశాంతి. ఈ ముగ్గురూ కలిసి ఈ ప్రయాణాన్ని నల్లేరు మీద నడకలా తీర్చిదిద్దారు. మేమంతా నిజామాబాద్‌లో దిగిన దగ్గర నుండి అమృత & బృందం వారి ఆత్మీయ ఆదరణలోకి వెళ్ళిపోయాం. ఎక్కడా ఎవ్వరికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా… అమృత చేసిన ఏర్పాట్లు అనితరసాధ్యం. ఆమె మనసులాగే ఆమె ఇల్లు అతి విశాలం. మేం 25 మందిమి.. ఆమె ఫ్రెండ్స్‌… అందరం ఆ ఇంట్లో యిమిడిపోయాం. ఇల్లంతా ఆగమాగం చేసాం. కబుర్లు… నవ్వులు… కేరింతలు…. తుళ్ళింతలు ఆ ఇంటి గోడల్లో యింకిపోయి వుంటాయి.
అర్థరాత్రి దాకా ఆడి, పాడి… నిద్రకు బై బై చెప్పినా… కోడి కుయ్యక ముందే పోలోమని లేచిపోయారందరూ. అంతకు ముందే అమృతతో కలిసి చూసాను కదా… కధలు కధలుగా పొచ్చరను వర్ణించడంతో అందరిలోను ఉత్సాహం ఉరకలు వేసింది. ఆ జలపాతాన్ని ఎప్పుడెప్పుడు వాటేసుకోవాలా… ఉవ్విళ్ళూరుతూ బిలబిల మంటూ బస్సెక్కేసారు. అప్పటికే రెండేసి కప్పులు నురగలు కక్కే కాఫీ తాగి వున్నారేమో… హుషారు… హుషారుగా కబుర్లలో పడ్డారందరూ.
శ్రీరామ్‌ సాగర్‌ ప్రాజెక్టు… ఎత్తైన ఆ గట్టెక్కలేక… అటువైపు వెళుతున్న ఓ మోటార్‌ బైకిస్ట్‌ని ఆపి… లిఫ్ట్‌ అడిగి వెళ్ళిపోతుంటే వెనక నుంచి నవ్వుల పువ్వులు నా మీద రాలుతూనే వున్నాయి. కళ్ళెదురుగా గోదావరి… గుండె ఉప్పొంగింది. ఆ ప్రత్యూషవేళ…. ఉదయిస్తున్న భానుడి బంగారు కిరణాలు ప్రతిఫలించి గోదారి మిల మిలా మెరిసిపోయింది. అందరి కెమేరాలు క్లిక్‌ క్లిక్‌ మంటూనే వున్నాయి. అక్కడ పార్క్‌ చేసి వున్న పోలీసోళ్ళ బైకు మీద కూర్చుని నేను ఫోటోకి పోజిచ్చాను. బ్యారేజ్‌ మీదికి కడదాకా వెళ్ళొచ్చిన గీత బృందం… రిజర్వాయర్‌ గోడ మీదెక్కి నడుస్తూ వచ్చిన ప్రశాంతి గ్యాంగ్‌ మాతో వచ్చి చేరారు. ఈ లోపు సెక్యూరిటీ వాళ్ళని రిక్వెస్ట్‌ చేసి బస్సును పైకి తెచ్చాం. మాతో రమ్మని పిలవనందుకు అలిగి, ముఖం కందగడ్డలా చేసుకున్న సూర్యుడు నిక్కి నిక్కి పైకొచ్చి మావేపు ఎర్రెర్రగా చూస్తుండగా మేము బస్సెక్కి పొచ్చర వేపు సాగిపోయాం.
పొచ్చర…. ఆ జలపాత సంగీతం వింటూ…. కంటపడగానే అందరూ బిల బిల మంటూ అటు జారిపోబోయారు… మా కంటే ముందు వేడి వేడి టిఫిన్ల క్యారియర్లతో అక్కడ మాటేసిన అమృత వలేసి అందరినీ వెనక్కిలాగి… బుద్ధిగా టిఫిన్‌ తినండి…. ఆ తర్వాత మీ ఇష్టం… అనడంతో అందరం బుద్ధిగా కూర్చుని ఆవురావురుమంటూ తిన్నాం. అది టిఫిన్‌ కాదు. భోజనమే… అన్ని అయిటమ్స్‌ వున్నాయి. కడుపు నిండింది కదా! జలపాతం మీదికి ఉరికేసారందరూ. ఏమి నవ్వులు… ఏమి కేరింతలు… ఎవ్వరికీ వయస్సు గుర్తు రాలేదు… బాల్యంలోకి వెళ్ళిపోయారు. జలపాతాన్ని వాటేసుకుని… తొలి ప్రేమనాటి తియ్యదనాల్లోకి…. గాఢస్నేహపు గాఢానుభూతుల్లోకి ఇంకేవో తెలియని ఉద్వేగాలు ఊపేస్తుంటే…. జలపాత కౌగిలి నుంచి విడివడలేక… గడియారం ముల్లు గుచ్చుతుంటే పొచ్చరకు ప్రేమగా వీడ్కోలు పలికి పోలోమంటూ బస్సెక్కి మొండిగుట్టకి సాగిపోయాం.
మొండిగుట్ట… పేరు మహా మొరటుగా వుంది కానీ అదో తపోవనం. కోళ్ళు, లేళ్ళు… చుట్టూ కొండలు… అడవి…. ఆ అడవి అంచులో అందమైన లోయ. అడవి మధ్యలో అందంగా వెలసిన ఆ ఇంట్లో వుండే అక్క చెల్లెళ్ళు..కల్పన, కరుణ డొక్కా సీతమ్మకి సొంత చెల్లెళ్ళ లాగా మాకు విందు భోజనాలేర్పాటు చేసారు. మేమెవరమని… అంతకు ముందు మమ్మల్ని చూసింది లేదు… అయినా ఎన్నో సంవత్సరాల బాంధవ్యం పెనవేసిన చందాన మాకు సకల సౌకర్యాలు ఏర్పాటు చేసారు. విందు భోజనాలు మాత్రమేనా… గానాబజానా… ఎంటర్‌టైన్‌మెంట్‌… నాటకాల ప్రదర్శన… ఆ నాటకాలేసిన వాళ్ళు సామాన్యులనుకునేరు… మహామేధావులు… అమృతగారి విద్యాసంస్థల్లో పనిచేసే ప్రిన్సిపాళ్ళు, హెడ్‌మిస్ట్రెస్‌లు, లెక్చరర్లు…. వాళ్ళంతా ముఖాలకు రంగులేసుకుని తమ నటనలతో మమ్మల్ని ఆలరించారు. వీటన్నింటి సూత్రధారి అమృత… మమ్మల్ని అడవి గర్భంలో వున్న గోండు గ్రామానికి తీసుకెళ్ళడానికి రెండు ట్రాక్టర్లను ఏర్పాటు చేసారు. భోజనాలయ్యాక… దూరంగా కనిపిస్తున్న అడవి నన్ను రా రమ్మని పిలవసాగింది. నా కాళ్ళు అసంకల్పితంగా అటువేపు నడవసాగాయి. వెనక ఎవరో పిలుస్తున్నా పట్టించుకోకుండా నడుస్తున్నాను. అడవిలోకి వచ్చేసాను. వెనక ”అమ్మూ! ఆగు… ఎక్కడికి వెళుతున్నావ్‌?” అంటూ ప్రశాంతి వస్తోంది. ”వొక్కదానివి ఎక్కడికెళ్ళి పోతున్నావ్‌” అంటూ చెయ్యి పట్టుకుంది. ”ఈ అడివి, ఆ లోయ చూద్దామని వచ్చా” అన్నాను. ఇద్దరం కాసేపు లోతైన ఆ లోయని చూసి వెనక్కి వచ్చేసాం.
అప్పటికి ట్రాక్టర్లు రెడీ అయ్యాయి. దాదాపు నలభై మందిమి రెండు ట్రాక్టర్లలో సర్దుకున్నాం. నేను డ్రైవర్‌ పక్కన కూర్చుందామని ప్రయత్నిస్తే ”వద్దు. కుదుపులకి పడిపోతారని” నిరుత్సాహపరిచారు. కాళ్ళు జాపుకొను జాగా లేకుండా ఒకరిని ఒకరం రాసుకుంటూ కూర్చున్నాం. దట్టమైన అడవి మధ్య నుంచి, రాళ్ళమీద, గుట్టల మీద, వాగుల్లోంచి మా ట్రాక్టర్‌ ప్రయాణించింది. అందరం గోలగోలగా మాటలు, పాటలు, నిట్టూర్పులు, కాళ్ళ కదుములు కట్టేసిన వాళ్ళ బాధలు…. ఆ సమయంలో నేను మాట్లాడుతున్నా… పాటలు పాడుతున్నా… నా లోపల నాకే అర్థం కాని ఏదో అలజడి మొదలైంది. ‘వనవాసి’ నవలలలోని అడివి లాగా… క్రమక్రమంగా అడవి నన్ను ఆవహించసాగింది. ”అమ్మూ! అలా పైకి చూడు…. పైన ఎంత పచ్చగా వుందో” ప్రశాంతి అన్నపుడు తల పైకెత్తి చూసినపుడు నీలం ఆకాశం లోంచి… వొత్తుగా అల్లుకున్న పచ్చదనం నా మీదికి జారిపడింది. నా శరీరమంతా జలదరించినట్లయింది. ఆ పచ్చదనం నా కళ్ళల్లోంచి నా గుండెల్లోకి ఇంకిపోయింది.
వయ్యారాలు పోతూ… ఊగిసలాడుతూ మా ట్రాక్టర్‌ బుర్కరేగడి చేరింది. ఆ గోండుగూడెం… ఆ ఆదివాసుల అమిత ప్రేమ… అమాయకత్వం… నగరాల నుంచి వచ్చిన మాయ మనుషుల కోసం గూడెమంతా అలంకరించి… నృత్యాలు చేసి… ఆలరించిన విధం మమ్మల్ని అపరాధ భావానికి గురి చేసింది. అందరి సంగతి నాకు తెలియదు కానీ… నాకు వాకపల్లి వెళ్ళినప్పటి వేదన పునరావృతమైంది. అడవి గర్భాల్లో ఏ సౌకర్యాలకు నోచుకోకుండా బతుకుతున్నా… సకల సౌకర్యాలు, సౌభాగ్యాలతో ఓలలాడే నాగరీకులు వెళ్ళినపుడు వాళ్ళు వ్యక్తీకరించే ఆనంద తాండవం, అమాయకపు ఆత్మీయత అబ్బురమన్పించడంతో పాటు… వాళ్ళ ముందు మరుగుజ్జుల్లా మారిపోతాం. ఆ స్వచ్ఛతకి నా లోపల కాలుష్యాలేమైనా వుంటే… మాడి మసై పోవాల్సిందే. ఓ గోండు అమ్మాయి చేతిలోని బీడీని లాక్కుని గుప్పు గుప్పున రింగులొదులుతుంటే అందరూ నోరెళ్ళబెట్టి చూసారు. బీడీ రుచి తొలిసారి అనుభవించిన నేను ”భలే వుంది… బీడి…” అంటే కొంతమంది మిత్రులు ”ఛీ… ఛీ…’ అనడం విని ”రుచి చూస్తే కదా తెలుస్తుంది. చూడకుండా ఎట్లా అంటారు” అని నేను పొట్లాటకి దిగాను.
సంధ్యవేళ గూడెం గూడెమంతా మమ్మల్ని సాగనంపుతుంటే చిరుచీకట్లలో… అక్కడి ఇళ్ళు ఉనికిని కోల్పోయి చీకటిలో కలిసిపోయాయి. సూర్యుడు కూడా నాకక్కడేం పని లేదని పడమటి కొండల్లోకి పారిపోయాడు. ఆ చీకటిలో అడవిలోకి మా తిరుగు ప్రయాణం. అడవి ఎంత ఉద్విగ్నంగా వుందో! వాగులు దాటేటప్పుడు ఓ… అంటూ కేకలు… చీకట్లో ఆ అడవి అందం… ఓ మోహావేశం నాలోపలంతా కమ్మేసింది.
మొండిగుట్టలో ఆనందాశ్రువుల మధ్య అమృత బృందానికి వీడ్కోలు… ఆట… పాట… విందు… చిందులతో అలరించిన మొండిగుట్టకి… అమృత బృందానికి హృదయాలింగనాలతో… మళ్ళీ కలుద్దాం అనే ఆశావహ సందేశాలతో బై బై చెప్పి… మేము ఉట్నూరు అడవుల వేపు సాగిపోయాం. గీత… ప్రశాంతి కలిసి ఉట్నూరు అటవీ అతిధి గృహాన్ని మేముండడానికి ఖాయం చేసారు. గీతకి తెలిసిన ఆర్‌.డి.వో. గెస్ట్‌హౌస్‌లో మమ్మల్ని రిసీవ్‌ చేసుకున్నారు. గీత, నేను ఇక్కడ బుల్లి గిల్లి కజ్జా పెట్టుకున్న సంగతి ఎవ్వరికీ తెలియదు. అదో సరదా! మా స్నేహంలో వున్న సొగసు అదే మరి.
ఉట్నూరు దాటి కెరిమెరి ఘాట్‌ రోడ్‌లోకి ప్రవేశించిన వెంటనే నా లోపల అలజడి తిరిగి మొదలైంది. ఈ ఘాట్‌ రోడ్డు సౌందర్యం గురించి, అక్కడి అడవి అందం గురించి దాన్ని విధ్వంసం చేసిన అంశాల గురించి ప్రశాంతి నాతో ఎన్నో సార్లు ఎంతో ఆవేదనతో చెప్పిన విషయాలు గుర్తొచ్చాయి. ఆ విధ్వంసాన్ని, బోసిపోయిన ఆ రోడ్డుని కళ్ళారా చూసినపుడు నాకు కడుపులో తిప్పినట్టయ్యంది. అడవిని అడ్డంగా నరికేసిన దుర్మార్గం… నా లోపలంతా మంటలాగా మారిపోయింది. దారి మధ్యలో బస్సెక్కిన సాకృబాయిని చూసిన తర్వాత, తన మాటలు విన్న తర్వాత చల్లని నీటి కొలనులో స్నానించినట్టయింది. సాకృ, సరిత ఆదిలాబాద్‌లో పనిచేసే ప్రశాంతి బృందంలోని వాళ్ళే. వాళ్ళ మాటల్ని, పాటల్ని మా బృందమంతా మైమరపుతో వినడం గమనించి… ఈ ట్రిప్‌ విజయవంతమైంది అన్పించింది నాకు.
ఇక్కడి నుండి అందరం ప్రశాంతి సమ్మోహన సామ్రాజ్యంలోకి వెళ్ళిపోయాం. మెత్తటి స్వరంతో తను మనసు విప్పి మాట్లాడిన మాటలు అందరినీ మంత్ర ముగ్ధులను చేసాయి. తను చూపించిన ఆదివాసీ ప్రపంచం, ఆ మనుష్యుల ఆదరణ, ప్రేమ, ఆత్మీయత, ఆతిథ్యం అందరి గుండెలను తాకాయి. కలలో కూడా దర్శించవీలుకానీ ఊళ్ళనీ, మనుష్యులని వారి ఆదరణని కళ్ళ ముందు ఆవిష్కరించిన ప్రశాంతి అందరి మనసులను గెలుచుకోవడమే కాక… ట్రిప్‌ మొత్తాన్ని ఒక సామాజిక బాధ్యతగా మలిచింది. ఆదివాసీల బతుకు చిత్రాలు, వారి జీవన పోరాటాలు, వారి ఆవాసాలు అతి దగ్గరగా చూసిన మా బృందంలోని రచయిత్రులు తమ కలాలకు పదును పెట్టి అత్యుత్తమ సాహిత్య సృజనకి పూనుకోవాలనే నా ఆశను, నా కోరికను ప్రశాంతి ఇలా సాకారం చేయగలిగింది.
కెరిమెరి ఖాళీ అడివి దాటి, జోడీ ఘాట్‌… కొమురమ్‌ భీమ్‌ విగ్రహ దర్శనం అందరినీ మహోద్విగ్న పరిచింది. ఆదివాసీ గుండె ఘోషని ప్రాణాలొడ్డి విన్పించిన కొమురం భీమ్‌… రగిలించిన స్ఫూర్తి అందరి గుండెలను తాకింది. అక్కడ ఆకాశాన్నంటి విస్తరించిన విప్పచెట్టు ముందు నిలబడి నేను ఫోటో తీసుకుని, విప్ప పానీయం తాగినంత మత్తును పొందాను. అడవులు పట్టి తిరిగినా, ఆదివాసీల ఇళ్ళల్లో తిన్నా… ఎక్కడా గుక్కెడు విప్ప పానీయం దొరకలేదే అని నాకిప్పటికీ అక్కసుగానే వుంది.
మోడి, ఝరి, ఉషేగావ్‌ గ్రామాల గురించి ఆయా గ్రామాల ప్రజల సంస్కారం, సాదర సత్కారాలు, విందు భోజనాలు, చిందేసి అలరించిన వైనాల గురించి మా బృందంలో అందరూ విశేషంగానే రాసారు. ఊరు ఊరంతా మహా సంతోష సంబరాలతో మాకు తిలకాలు దిద్ది, బంతిపూల దండలేసి మేమేదో ఘనకార్యం చేసి వచ్చినట్టు మాచుట్టూ కూర్చుని మాకు భోజనాలు పెట్టిన వైనాలు… ఆ జ్ఞాపకాలు గుర్తొచ్చినపుడల్లా వాళ్ళల్లా… అంత స్వచ్ఛంగా… అంత తేటగా ఎప్పటికైనా మారగలమా? అది సాధ్యమా? అనిపించి మనసు కలుక్కుమంటుంది. ప్రశాంతి… పూవులో తావిలా, పొగడపూవులో మకరందంలా వాళ్ళతో మమేకమైపోయి, వాళ్ళ బతుకుల్తో కలగలిసిపోయి ప్రశాంత వదనంతో పేరుపేరునా వాళ్ళని పల్కరిస్తూ… గుండెలకు హత్తుకుంటూ కలియతిరిగిన దృశ్యం అందరి మనోఫలకం మీద ముద్రితమైపోయింది. నన్ను అమ్మూ! అని పిలుస్తూ నా జీవితంలో భాగమైపోయిన ప్రశాంతిని చూస్తే నాకు ఎంతో గర్వంగా, గౌరవంగా అన్పించింది! వీడ్కోలు దృశ్యాల విషాదం మా బృందం మొత్తాన్ని కంటతడి పెట్టించింది. ప్రశాంతిని వొదలలేక వాళ్ళు… వాళ్ళని వీడలేక మేము చాలా ఉద్వేగభరితులమయ్యాం. అప్పటికే చీకటి పడిపోయింది. ఎవరి సీట్లలో వాళ్ళు సర్దుకున్నాక… దీర్ఘ నిశ్వాసాల సవ్వడులను మోసుకుంటూ బస్సు వర్నికి బయలుదేరింది.
వర్నిలో బస్సు దిగానో లేదో… అమ్మమ్మా అంటూ నన్ను… ప్రశాంతక్కా! అంటూ తనని చుట్టేసారు పిల్లలు. వాళ్ళ సంతోషం, సంబరాల వెలుగు ఆ రాత్రివేళ… ఆ ఆవరణంతా కాంతుల్ని వెదజల్లింది. వాళ్ళతో ఎక్కువ సమయం గడపలేకపోయామన్న బాధ అందరిలోను వ్యక్తమైంది. నిద్రముఖాలతో పిల్లలు ఉత్సాహంగా ఎన్నో కబుర్లు చెప్పారు. కథలు విన్పించారు. పాటలు పాడారు. స్వయంగా చేసిన చక్కటి గ్రీటింగ్‌ కార్డులు అందరికీ ప్రజంట్‌ చేసారు. ”అమ్మమ్మా! మీకు ప్రశాంతక్కకి గ్రీటింగ్స్‌ ఇవ్వలేదు. మీరు బయటవాళ్ళు కాదు కదా! అందుకని…” అన్నప్పుడు నా కళ్ళల్లో నీళ్ళొచ్చాయి. అయిష్టంగా అసంతృప్తిగా… అందరూ బస్సెక్కేసారు. అర్ధరాత్రి మా బస్సు హైదరాబాదు రోడ్డెక్కింది. ఎవరి ఆలోచనల్లో వాళ్ళు… కాసేపటికి మాగన్ను నిద్రలోకి జారిపోయారందరూ. ప్రశాంతి… గీత డ్రైవర్‌ నిద్రపోకుండా చాలాసేపు అతనితో కబర్లు చెబుతూ కేబిన్‌లో కూర్చున్నారు.
తెల్లారి నాలుగింటికి బస్సుదిగి ఎవరిళ్ళకి వాళ్ళు మళ్ళిపోవడంతో ఆదిలాబాద్‌-నిజామాబాద్‌ ట్రిప్‌ ముగింపుకొచ్చింది. ముందే రాసినట్టుగా ఈ ట్రిప్‌ విజయం వెనక ముగ్గురి కృషి, సమయస్ఫూర్తి, నిర్వహణా సామర్ధ్యం పోటీపడి పనిచేసాయి. అమృత, ప్రశాంతి, గీత… ముగ్గురూ కలిసి ఆదిలాబాదు ట్రిప్‌ని మర్చిపోలేని మధురానుభవంగా మలిచారన్నది ముమ్మాటికీ నిజం!
ఈ ప్రయాణం నామీద వేసిన గాఢమైన ముద్ర గురించి కూడా రాయాలనిపిస్తోంది. ఈ విషయం గీతకి, ప్రశాంతికి తప్ప ఇంకెవ్వరికీ తెలియదు. ఆ మూడురోజులూ నాలో ఆనందం కొంత ఆందోళన కొంత… రకరకాల భావాల సమ్మేళనంలో సతమతమయ్యాను. కెరిమెరి అడవి దగ్గర ఆవేశం, ఉద్రేకం.. బుర్కరేగడి గూడెంలో అపరాధభావం, మోడి, ఝరి, ఉషేగావ్‌ గ్రామస్తుల సంస్కారం ముందు చిన్నబోయిన మనస్సు… అభివృద్ధి నామస్మరణలో మునిగితేలే ప్రభుత్వాల నిర్లక్ష్యాల మీద కసి, క్రోధం, ఆదివాసుల నిస్సహాయస్థితి… వర్ని చిన్నారుల భవిష్యత్‌ చిత్రం – ఆదివాసీల, అణగారిన వర్గాల మారని బతుకు చిత్రాలు… నగరాల్లో మనం గడుపుతున్న అహంభావపూరిత, ఆత్మాశ్రయ జీవితాలు… నా మనసులో భిన్న భావాల సంఘర్షణలు… భయానక కలల మోహరింపులు… వెరసి వొళ్ళంతా సలసలా కాగిపోతూ 104 డిగ్రీల జ్వరం కమ్మేసింది.
ట్రిప్‌ నుంచి తిరిగొచ్చిన మూడోరోజు … వొళ్ళు తెలియని జ్వరంతో వొక్కర్తిని ఇంట్లో పడున్నాను. ఆ ఉదయం నాకో భయంకరమైన కలవచ్చి ఉలిక్కిపడి లేచాను. వెల్లికిలా పడుకున్న నా కళ్ళముందు అనంతంగా విస్తరించిన పచ్చదనం. పచ్చని ఆకుల సందుల్లోంచి నీలాకాశం… ఎంతో హృద్యంగా వుంది. హఠాత్తుగా ఎవరివో చేతులు నా రెండు చేతుల్ని పట్టుకుని పైపైకి ఈడ్చుకెళ్ళిపోతున్నాయి. నేను వేలాడిపోతూ…. ఆ చేతుల్ని విడిపించుకోవాలని విశ్వప్రయత్నం చేస్తూ గట్టిగా అరుస్తున్నాను. నా కళ్ళముందు పరుచుకున్న పచ్చదనం కరిగిపోయి నల్లగా మారిపోయింది. నన్ను ఈడ్చుకెళుతున్న చేతులు నన్ను వొదిలేస్తే నేను దబ్బున కింద పడిపోయాను. గట్టిగా అరుస్తూ నేను మెలుకువలోకి వచ్చాను. ఈ కల నన్ను కుదిపేసింది.
నాకు జ్వరమొచ్చి ఎన్నో సంవత్సరాలైంది. ఎప్పుడొచ్చిందో కూడా నాకు గుర్తులేదు. ఆ రాత్రంతా జ్వరమే… మర్నాడు సాయంత్రం దాకా అలాగే అచేతనంగా పడుకున్నాను. అప్పుడు గీతకి ఫోన్‌చేస్తే వెంటనే వచ్చేసింది. తనొచ్చేసరికి నిజానికి నా వొంటి మీద స్పృహలేదు. నుదిటి మీద చెయ్యేసి ”అమ్మో! ఏంటీ జ్వరం…. నాకెందుకు చెప్పలేదు” అంటూ కన్నీళ్ళు పెట్టుకున్న గీత నన్ను తనతో వాళ్ళింటికి తీసుకెళ్ళిపోయింది. ఆ జ్వరం నుంచి, మానసిక కల్లోలం నుంచి కోలుకోవడానికి నాకు వారం రోజులు పట్టింది. నా మనసులో పెద్ద గాయమైందని నాకు అర్థమైంది. అది బయటకు కనబడని గాయం.
2009 లో విశాఖ ట్రిప్‌లో వాకపల్లి వెళ్ళి వచ్చిన నాటి రాత్రి కూడా నేనిలాంటి మానసిక కల్లోలానికి గురయ్యాను. ఆ రాత్రి వెక్కివెక్కిఏడుస్తుంటే ఓ వైపు గీత మరో వైపు హేమంత నన్ను ఓదార్చారు. గుండెకు హత్తుకున్నారు. హేమంత నా మంచం పక్క కింద పడుకుని నా చేతిని తన చేతిలో వుంచుకుని… నా మనస్సును మరల్చడానికి ఎన్నో సరదా సరదా కథలు చెప్పి నన్ను నవ్వించింది. తన వెచ్చటి స్పర్శ, నా మనస్సు తేలిక పరచాలని చేసిన ప్రయత్నం…. నాకిప్పటికీ ఫ్రెష్‌గా అన్పిస్తాయి. ఆరోజు… ఈ రోజు కూడా గీత స్నేహం…. అలాగే వుంది. హేమంత బెంగుళూరులో వుంది. ఎన్ని సార్లు గుర్తొచ్చిందో!! నా బలం నా స్నేహాలే.
ఆదిలాబాదు అడవి నన్ను ఆవహించి…. నా మనసును కల్లోలపరిచి నన్ను…. మరిన్ని అడవుల్లోకి నడిపించింది. పాడేరు, అరకు అడవుల్లో తిరిగి తిరిగి…. ఒక్కర్తిని రంపచోడవరం…. మారేడుమిల్లి అడవుల్లో తిరగడానికి వెళ్ళిపోయాను. అయినా సరే… అడవి నన్ను పిలుస్తూనే వుంటుంది. నేను ఉద్విగ్నమై, కల్లోలమై మళ్ళీ మళ్ళీ వెళ్ళిపోతూనే వుంటాను.

నా మీద వాలిన ఛాయాదేవి ఛాయ

ఎప్పటిమాట. పచ్చగా, చల్లగా, కుటీరం లాగా ఉండే ఆ ఇంటికి తొలిసారి ఎప్పుడెళ్ళాను. తొలిచూపులోనే ఆవిడతో ప్రేమలో పడిన సంఘటనలో నిజానికి, ఆరోజు ...