Friday, September 3, 2010

”అమ్మ ఇంట్లో వంట చేయును. నాన్న సంపాదించి తెచ్చును”. ఇక్కడే ఆగిపోయిన పాఠ్యాంశాలు

ఇటీవల ఒక డిగ్రీ కాలేజీలో ఒక సమావేశం ఏర్పాటు చెయ్యడం జరిగింది. ఆ కాలేజీ ప్రిన్సిపాల్‌ నాకు మిత్రురాలు. విద్యార్థులెదుర్కొంటున్న సమస్యల గురించి, ‘ప్రేమ’ దాడుల గురించి ఇంకా వారు ప్రస్తావించే అంశాల మీద ఈ మీటింగులో మాట్లాడాలని, వారిని చర్చల్లో చురుకుగా పాల్గొనేెలా ప్రోత్సహించాలని తను చెప్పింది. ‘జండర్‌ సెన్సిటివిటీ ‘ గురించి కూడా మాట్లాడాలని నేను సూచించాను. నాతో పాటు ఇంకో ఫ్రెండ్‌ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.

పదకొండు గంటలకి మీటింగు మొదలైంది. మూడొంతులు మగపిల్లలు, ఒక వంతు ఆడపిల్లలు వున్నారు. మగపిల్లలు అల్లరిగా కామెంట్స్‌ చేస్తున్నారు. అమ్మాయిలు ముసి ముసి నవ్వులు ఒలకబోస్తూ, ముడుచుకుని కూర్చున్నారు. నేను కొంత ఆశ్చర్యపోయాను. అమ్మాయిలు ఇంకా ఇంత ఒద్దికగా కూర్చునే వుంటున్నారా? వాళ్ళుకూడా బాగా అల్లరి చేస్తారేమోనని నేను అనుకున్నాను. కానీ అలా జరగలేదు. యుగాలు గడిచినా ఈ బిడియం, ఒద్దిక వీళ్ళను వొదలవా అన్పించింది.

మేము పిల్లల్ని చర్చల్లోకి దింపడానికి ప్రయత్నిస్తూ మీకు మళ్ళీ పుట్టడానికి అవకాశమొస్తే, ఆ జన్మలో అమ్మాయిగా పుట్టాలను కుంటారా?” అబ్బాయిగా పుట్టాలనుకుంటారా?” అని అడిగాం. అబ్బాయిలంతా మగవాళ్ళగానే అని అరిచారు. అమ్మాయిల వేపు నుంచి పెద్దగా రెస్పాన్స్‌ రాలేదు. సరే అయితే మీరు అబ్బాయి గానే ఎందుకు పుట్టాలని కోరు కుంటున్నారో ఒక్కొక్కరూ వచ్చి చెప్పండి. అంటే వరుసగా కుర్రాళ్ళు లైన్‌ కట్టారు. వాళ్ళు చెప్పిన పాయింట్లు ‘స్వేచ్ఛ వుంటుంది. బలముం టుంది. ఏమి చెయ్యాలన్పిస్తే అది చెయ్యొచ్చు. ఎక్కడికి పోవాలంటే అక్కడికి పోవచ్చు. అమ్మాయిలని ఏడిపించ వచ్చు. ఇంకా చాలా చాలా చెయ్యొచ్చు.” అంటూ చెప్పుకుపోయారు. అమ్మాయిలు కొంతమంది ముందుకొచ్చి మాట్లాడారు కానీ స్పష్టంగా వ్యక్తీికరించలేకపోయారు. ”ఆడవాళ్ళకి సహనముంటుంది. ఆడవాళ్ళు లేకపోతే ఇల్లు నడవదు. పిల్లల్పి ఎంతో ప్రేమగా చూస్తారు” లాంటి సమాధానంతో వాళ్లు మాట్లాడారు. ఆ తర్వాత ఆడవాళ్లు ఏ పనులు చేస్తారు? మగవాళ్ళు ఏ పనులు చేస్తారు. అన్ని పనుల్ని అందరూ చెయ్యగలరా? అని అడిగాం.

మగపిల్లలు ఏక కంఠంతో మగవాళ్ళే ఎక్కువ కష్టపడతారు. ఆడవాళ్ళు అన్ని పనులూ చెయ్యలేరు. మగవాళ్ళు సంపాదించి తెస్తే ఆడవాళ్ళు ఇంట్లో కూర్చుని తింటారు. అని ఒక కుర్రాడు అంటే, ఇపుడు ఆడవాళ్ళు కూడా ఉద్యోగాలు చేసి సంపాదిస్తున్నారు కదా. ఇక్కడ మీ లెక్చరర్స్‌ వున్నారు కదా! అంటే ఆ కుర్రాడు నాలుక్కరుచుకుని తలవంచుకున్నాడు. హఠాత్తుగా ఓ కుర్రాడు ” ఔరత్‌ లోగు కుచ్‌ నహీ కర్తే ఘర్‌మే ఆగు లగాతే” అన్నాడు. అక్కడున్న అందరం అదిరిపడ్డాం. ఆడవాళ్ళు ఇంట్లో ఏ పనీ చెయ్యరు. మంటలు రేపుతుంటారు’ అని ఆ కుర్రాడు అన్న మాట మాకు శూలంలా తగిలింది. అమ్మాయిలు అతడికి ధీటుగా సమాధానమిస్తారేమోనని చూసాం. కానీ ఒక్క అమ్మాయి నోరు విప్పలేదు.

ఆ తర్వాత మేము ప్రపంచ వ్యాప్తంగా ప్రతి దినం స్త్రీలుచేసే పనుల మీద ‘యూనిసెఫ్‌’ రూపొందించిన ఒక పోస్టర్‌ని ప్రదర్శించి దీన్ని మీరు ఎలా అర్ధం చేసుకుంటారు. అని అడిగాం. ఆ పోస్టర్‌లో ఎన్నో  చేతుల్ని కలిగి, ఒక్కో చేత్తో ఒకో పని-ఇంటిపని, పిల్లల పని, వంట పని, పొలం పని, పశువుల పని,  నీళ్ళు తేవడం, వంట చెరుకు తేవడం, పెద్దల సంరక్షణ, బట్టలుతకడం, వాహనాలు నడపడం,ఉద్యోగం, బయట పని-నర్సులుగా, డాక్టర్లుగా, టీచర్లుగా, అధికారులుగా, పోలీసులుగా, సైనికులుగా ఇలా ఎన్నో అవతారాల్లో అనుక్షణం పనిచేసే స్త్రీమూర్తి చిత్రమది. ఆ తర్వాత ” ప్రపంచం మొత్తంలో మూడొంతుల పనిని స్త్రీలే చేస్తారని, కాని వారికి వనరుల్లో ఒక్క శాతం వాటా కూడా లేదని” యునైటైడ్‌ నేషన్స్‌” రూపొందించిన కోటేషన్‌ని వాళ్ళ ముందు పెట్టాం. ఇపుడు మళ్ళీ చెప్పండి. స్త్రీలు ఏ పనీ చెయ్యకుండా ఊరికే ఇంట్లోనే వుంటారా? మీ ఇంట్లో మీ అమ్మ ఏమేం పని చేస్తుందో, మీ కంచంలోకి అన్నం ఎలా వస్తుందో ఎప్పుడైనా ఆలోచించారా?

పిల్లలు నిశ్శబ్దంగా కూర్చున్నారు. ‘ఆగ్ లగాతే’ అన్న కుర్రాడు ఆశ్చర్యంగా పోస్టర్‌ని చూడ్డం గమనించాను. ”మీకు స్వేచ్ఛ వుందని. ఏమైనా చెయ్యగలమనీ చెప్పారు కదా! మీ అక్క చెల్లెళ్ళకి ఈ స్వేచ్ఛ ఎందుకు లేదో! మీలాగా ఎందుకు బయట ఫ్రీగా తిరగలేకపోతున్నారో ఆలోచించారా? అని అడుగుతూ ‘టీజింగు’ గురించి అమ్మాయిల్ని ఏడిపించడం గురించి అడిగాం. మేము ‘టీజ్‌ చెయ్యడం అమ్మాయిలకి ఇష్టం. అయినా ఈ రోజుల్లో అమ్మాయిలు కూడా టీజ్‌ చేస్తున్నారు. అసలు వీళ్ళు వేసుకునే డ్రెస్సులు మమ్మల్ని రెచ్చగొట్టేలా వుంటాయి. అందుకే వెంటపడి ఏడిపిస్తాం.” అన్నారు కుర్రాళ్ళు. మీరు కూడా షార్ట్‌లు, చెడ్డీలు, గోచీలు పెట్టుకుని తిరుగుతారు కదా! అమ్మాయిలు మీ వెంట పడతారా? చీరలు కట్టుకున్న వాళ్ళ మీద కూడా అత్యాచారాలు జరుగుతున్నాయి కదా! ఈవ్‌ టీజింగుకి, రేప్స్‌కి, వస్త్రధారణకి సంబంధంలేదని తేలిపోయింది కదా! అంటే నిశ్శబ్దం. అలాగే ప్రేమ దాడుల మీద హాట్‌ హాట్‌ చర్చ జరిగింది. ”ప్రేమించడం మా హక్కు. మమ్మల్ని ప్రేమించకపోతే చంపడం కూడా మా హక్కు” లాంటి వాదనల్లోంచి- అమ్మాయిలు మిమ్మల్ని బలవంతంగా ఎందుకు ప్రేమించాలి. ప్రేమ సహజంగా వికసించాలిగానీ, ప్రేమించక పోతే యాసిడ్‌ పోస్తాం. కత్తుల్తో నరుకుతాం అంటే అది ప్రేమ అవుతుందా? ప్రేమకి, యాసిడ్‌కి, కత్తులకి ఎలా పొంతన కుదురుతుంది. అమ్మాయిలకి ‘నో’ అనే హక్కు వుంటుంది కదా! అంటే మగపిల్లల వేపు మహా నిశ్శబ్దం.

రెండు గంటలకి సమావేశం ముగిసింది. హాలు విడిచి వెళుతున్న రేపటి తరాన్ని చూస్తుంటే ఎంత దిగులేసిందో చెప్పలేను. వాళ్ళ మనసుల్లో, బుర్రల్లో నిండిపోయిన బూజు భావాలు, స్టీరియోటిపికల్‌ ఇమేజీలు నన్ను భయభ్రాంతను చేసాయి. రొడ్డ కొట్టుడు పాఠాలు తప్ప జీవితానికి అవసరమయ్యే పాఠాలు, మానవ సంబంధాలు, మానవ హక్కులు, జండర్‌ సమానత్వం, సమాజం గురించిన అవగాహన వాళ్ళకు అందియ్యని విద్యావిధానం మీద రోత పుట్టింది. విజ్ఞానాన్ని, విలువల్ని, సాహిత్యాన్ని, చక్కటి ప్రేమ భావనలని వాళ్ళకి దూరం చేసిన సమస్తం మీద- ముఖ్యంగా మీడియా, రాజకీయ నాయకులు, విద్యావిధానంమీద అలవికాని కోపంతో నా మనసు రగిలిపోయింది. సాధ్యమైన కాలేజీలు తిరిగి ఇలాంటి సమావేశాల ద్వారా యువ తరంతో మాటామంతీ కలపాలని బలమైన నిర్ణయం చేసుకున్నాక మనసు శాంతించింది.

11 comments:

Overwhelmed said...
This comment has been removed by the author.
Overwhelmed said...

Mi alochanalu bagunnayi andi.

కమల్ said...

మీరు మంచి ప్రయత్నమే చేసారు గాని..ఒక విషయం మరిచిపోయారు. అసలు మీరెళ్ళి ఈకాలపు యువతకు మానవసంబందాలు, ఉద్వేగాలు, గురించి అడిగితే వారేమి చెప్పగలరు..? మన విద్యావిదానం, పిల్లల తల్లితండ్రుల మానసిక స్థితి ఎలా ఉన్నదో మీరు గ్రహించే ఉంటారు, గత 25 ఏళ్ళుగా మన విద్యావిదానం కేవలం ఒక జీవనభృతి దిశగా మాత్రమే సాగింది..! చదవంటే ఉద్యోగం కోసం సంఘంలో ఆర్థికంగా నిలబడడం కోసమే అన్నట్లు సాగింది..ఎక్కడ సోషియల్ సైన్స్ గురించి చెప్పారు..? సాంఘీక జీవనవిధానాం గురించి ఎక్కడ చెబుతున్నారు..! కడుపులో ఉండంగానే కంప్యూటర్ ఇంజనీర్‌ అవ్వాలని నిర్ణయించేస్తున్నారు , అదేదో ఒక జటకాబండి గుర్రానికి అటు ఇటు చూడకుండా కంటికి ఒక కటర్ ని కడతారు దాని గమ్యం కేవలం దారి ఎంబడి పరిగెత్తడమే అని..! అలా చాల కాలం నుండి పిల్లలను అలానే పెంచుతున్నారు..! బయట సమాజం మీద కూసింత కూడ వాళ్ళకు అవగాహన లేదు. అటువంటి పిల్లల వద్దకు వెళ్ళి మీరు అంతంత పెద్ద పదాలు వాడితే బిత్తరపోక ఏమి చేస్తారు చెప్పండి...?

lalithag said...

మీరు కనీసం వారిని ఆలోచించేలా ఐనా చేస్తున్నారు.
పిల్లల జవాబులు ఇలా ఉంటాయని ఊహించలేదు.
అంతకన్నా ఊహించనిది మీరు వారిని ఆలోచించేలా చెయ్యడానికి చేసిన ప్రయత్నం.
వాళ్ళు ఇలా అన్నారు అనగానే ఏ లెక్చరు ఇచ్చామనో, ఇంకేదో చెప్తారని ఊహించాను.
ఎవరికీ మనం ఏమీ నిర్దేశించలేము, నిర్దేశించినా చేయించలేము కానీ ఆలోచింపచేస్తే కొంచెమైనా ప్రయోజనం కనిపించచ్చు.

భావన said...

బాగుందండి ఐతే, మా జనరేన్ నుంచి ఇప్పటిదాకా ఏమి మారలేదన్నమాట. వేటు అదే వేట అదే నాటి కధే అంతా అంటారా?
కమల్ మరి అంత గా చదువువోరియంటెడ్ గా పెరిగిన పిల్లలకు ఈ బేడ్ హేబిట్స్ ఎలా అలవటు అవుతున్నాయి వాటికి పెద్దల పర్మిషన్స్ తోనే చేస్తున్నారా? గత పాతికేళ్ళు గా పిల్లల ఆలోచనా పటిమ ప్రపంచాన్ని అరచేతిలో చూడగలిగే సౌలభ్యం అందువలన విశ్లేషణా శక్తి పెరగలేదంటారా?

కృష్ణప్రియ said...

మీ టపా చాలా బాగుంది. మీ ఎక్స్ పీరియన్స్ చాలా బాగా వర్ణించారు. ముఖ్యం గా మీరు విద్యార్థులని ఆలోచింపచేసిన విధానం, వాళ్ళని చర్చ లోకి దింపిన పద్ధతీ.. Excellent!


పెద్ద సిటీల్లో ప్రొఫెషనల్ కాలేజిల్లో, విశ్వవిద్యాలయాల్లో.. కూడా ఇంతే నంటారా? మీరెన్నుకున్న కాలేజ్ లోనే ఇలా ఉందేమో? (నా ఉద్దేశ్యాన్ని తప్పు గా అర్థం చేసుకోవద్దు.. ఒకవేళ ఇలాగ ఉన్నారు ఈ తరం వాళ్ళు అంటే.. ఒక దిశా, ఒక టార్గెట్ లేని దనం కనిపిస్తోంది.. అయ్యో అనిపిస్తుంది.. ) 15 యేళ్ళ క్రితం.. నేను చదువుకున్నప్పుడే ఇలా లేదేమో.. అమ్మాయిలు ధైర్యం గా నువ్వంటే నువ్వనేలాగే ఉండేవారు. అఫ్ కోర్స్ కొంతమంది మాత్రం, అందంగా తయారవటం, రెస్టారెంట్ లో అబ్బాయిలతో బిల్లులు కట్టించుకోవటం లాంటివాటికి ప్రాధాన్యత ఇస్తూ, వాళ్ళ లోకం లో వాళ్ళుండేవాళ్ళు.

Anonymous said...

అంతా బాగానే ఉంది. కానీ మీరు వాళ్ళని మీలా ఆలోచించమని బహిరంగంగా బలవంతం చేస్తున్నట్లుంది. మీరక్కడ మాట్లాడడానికి వెళ్ళారు. వాళ్ళు వినడానికి వచ్చారు. అందుకే వాళ్ళెవరూ నోరు మెదపలేదు.ఆంతే తప్ప, వాళ్ళకేమీ తెలియదనుకోకూడదు. అదే, మీరు వాళ్ళల్లో వాళ్ళిళ్ళకెళ్ళి ఒక్కక్కరితోను సన్నిహితులై మాట్లాడగలిగితే వాళ్ళు మీకు చాలా చెప్పగలరు, మీ దృష్టికి రాని కోణాల గురించి. ఉదాహరణకి - దాడులకు గురయ్యే ఆడపిల్లలెవరూ పూర్తిగా అమాయకురాళ్ళు కారనే సత్యం గురించి !

నో అనే హక్కు అందరికీ ఉంది. కానీ నో అనాలంటే ముందు ఎవరో ఒకరు ప్రతిపాదించాలి. కదా ! ప్రతిపాదించాలంటే ప్రేమించాలి కదా ! ప్రేమించే హక్కు అందరికీ ఉంటుంది కదా !

maa godavari said...

@జాబిల్లి ఎందుకమ్మా ముందు పెట్టిన కామెంట్ తీసేసావు.మన సమస్యని అర్ధం చేసుకోవడం,అధిగమించే ప్రయత్నం చేయడం చాలా మంచిది కదా.నీకు అభినందనలు.

@కమల్ గారూ మీ ఆవేదన సరై
ందే.సోషల్ సైన్స్ జీవితానికి ఎంత అవసరమో గత పాలకులు మర్చిపోయారు.పిల్లల్లోని సృజనాత్మకతను అర్ధం చేసుకునే వాళ్ళు లేరు. ఎంసెట్ వేట లో ఏమి కోల్పోతున్నారో అర్థమవ్వడం లేదు.జీవితాన్ని మేనేజ్ చేసుకునే కళ,కళలు,సాహిత్యం అన్నీ కోల్పోతున్నారు.తప్పదండి వాళ్ళ దగ్గరికెళ్ళాల్సిందే,అన్నీ మాట్లాడాల్సిందే.

@లలిత గారు ధన్యవాదాలు.పిల్లల సమాధానాలు నాకూ చెంప పెట్టులా తగిలాయి.ఇక్కద ఓ విషయం చెప్పాలి.ఆ మీటింగ్ అయిపోయిన నాలుగు రోజులకి ఆ కాలేజి నుండి ఇద్దరమ్మాయిలు ఫోన్ చేసి మాట్లాడుతూ,హెల్ప్ లైన్ లో వాళ్ళు స్వచ్చందగా పని చెయ్యడానికి ముందుకొచ్హారు.ఇద్దరూ ఆ తర్వాత నా దగ్గరకొచ్చారు.ఆశ్చర్యంగా ఇద్దరూ కూడా బురఖాలేసుకున్న ముస్లిం అమ్మాయిలు.
@బావనా ఈ తరం పిల్లలకి తెలిసిన విషయాల గురించి నేను చర్చించలేదు.శాంకేతికంగా,సాఫ్ట్ వేర్ పరంగా వాళ్ళని మించిన వాళ్ళు లేరు.విష్లేషణా శక్తి అమోఘం.అయితే యంత్రాలకి,వస్తుసముదాయానికి దగ్గరైనంతగా మనుషులకి దగ్గర కాలేకపోతున్నారు.సెల్ఫ్ ఓరియెటేషన్ వల్ల సరైన మానవ సంభంధాలను ఏర్పరచుకోలేకపోతున్నారు.దీన్ని మీరు ఒప్పుకుంటారా?నా ఆలోచలో తప్పుందా?

@క్రిష్ణప్రియ నేను రాసిన కాలేజి హైదరాబాద్ నడిబొడ్డున ఉంది.పిల్లలందరూ అలాగే ఉన్నారని అనలేము కానీవాళ్ళ మనులు వికసించే చదువు మాత్రం మనమివ్వడం లేదు.జీవితంలోని భిన్న పార్శ్వాలను వాళ్ళకు చెప్పకపోవడం వాల్లే చిన్న సమస్యకి ఆత్మ హత్యలకి తెగబడుతున్నారు.వస్తు సముదాయం మీద ప్రేమ మనుషుల్ని దూరం చేస్తుంది.
నగరాల్లో పిల్లలు "బ్రాండ్"లకు బందీలు.కాదంటారా?
@ఓబుల రెడ్డి గారూ మా ఆలోచనలని రుద్దాలని మేము వెళ్ళలేదండీ.వాళ్ళతో మాటామంతీ కోసమే వెళ్ళాము.
దాడులకు గురయ్యే అమ్మాయిలు అమాయకులౌ కాదని మీరు బాగానే కనిపెట్టినట్టున్నారు.అమయకులు కాదు కబట్టి దాడులు జరగాల్సినే అన్నట్టుంది మీ వైఖరి.ప్రేమించే హక్కు అందరికీ ఉంటుంది కానీ ప్రేమ పేరుతో వేధించే హక్కు మాత్రం ఎవ్వరికీ లేదు.నో అన్న తర్వాత ఏం జరిగినా అది వేదింపు కిందే వస్తుంది.

Priya said...

ఒక స్త్రీ ఇరవై నాలుగు చేతుల్ని కలిగి, ఒక్కో చేత్తో ఒకో పని-ఇంటిపని, పిల్లల పని, వంట పని, పొలం పని, పశువుల పని, ఉద్యోగం, నీళ్ళు తేవడం, వంట చెరుకు తేవడం, పెద్దల సంరక్షణ, బట్టలుతకడం, వాహనాలు నడపడం, నర్సులుగా, డాక్టర్లుగా, టీచర్లుగా, అధికారులుగా, పోలీసులుగా, సైనికులుగా ఇలా ఎన్నో అవతారాల్లో అనుక్షణం పనిచేసే స్త్రీమూర్తి చిత్రమది. Memu kuda aa presentation ni chudagaligithe entha bagunnu ani anipinchindhi moreover nenu aa function lo oka attendee ni avvalekapoyane ani anipinchindhi...chala nachindhi mee concept. I am very glad to say it is too good. If u dont mind may i have the picture in this blog to see. Thanq (priya)

కమల్ said...

@భావన, చదువు వేరు వ్యక్తిత్వం వేరు, మీరు రెండిటిని ఒకేగాటన కట్టారు చదువు వలన వ్యక్తిత్వం పెరిగే అవకాశం ఉన్నది అంతే. ఈ విషయం గురించి పుంఖాను పుంఖాలుగా వ్యాసాలు రాయొచ్చు, వాటికి అంతే ఉండదు చాలానే రాయాలని ఉన్నది కాని ఇది సరైన వేదిక కాదని మౌనంగా ఉన్నాను.
ఇక పిల్లల ఆలోచనా పటిమ, విశ్లేషణల గురించి చాలా క్లుప్తంగా సత్యవతిగారు జవాబిచ్చారు, నేనైతే పేరాలు పేరాలు రాసుండేవాడిని, హమ్మాయ్య నాకా బాద పోయింది.
@ సత్యవతి గారు, మీరు వారి వద్దకెళ్లడం గురించి నేను ఎక్కడా ఆక్షేపించలేదండి..! అంతంత పెద్ద పెద్ద భావాలు స్పరించే పదాలు వాడితే బిత్తరపోరా అని మాత్రం అన్నాను.

భావన said...

ఏమో నండి నేను ఇండీయా నుంచి వచ్చేసి మరీ చాలా కాలమయ్యింది ఇక్కడకు వుద్యోగ రీత్యా వచ్చిన అమ్మాయిలు అబ్బాయిలు (ఈ జెనరేషన్ పిల్లలు) బాగానే స్వతంత ప్రతిపత్తి తో వుంటున్నారు. అంటే వీళ్ళే మొత్తం యువత కాదు అనుకోండి. ఏమో కమల్ చదువు విచక్షణ పెంచుతుందని అని అనుకుంటూన్నా, కాక పోవొచ్చులే మరీ కాదని వాదించన ఎందుకంటే నాకు అంత గా అవగాహన లేని టాపిక్ ఇది ఈ తరం వాళ్లతో.

తర్పణాలు త్రిశంకు స్వర్గాలు

 తర్పణాలు, త్రిశంకు స్వర్గాలు ............ మా సీతారాంపురం లో మా తాతకి చాలా పొలాలు ఉండేవి. మా తాత, చిన్న తాత ఇద్దరే పొలాలన్నింటిని పంచుకున్నా...