Sunday, November 18, 2012

కార్తీక మాసపు నెలవంక


నా మనసును పచ్చిపుండులా చేసిన 
ఒక వీధి పిల్లల సమావేశం నుంచి 
ఇంటికి తిరిగొచ్చే వేళ 
నా కళ్ళల్లోని నీళ్ళను తుడిచిన 
కార్తీక మాసపు నెలవంక

వారమంతా ఒకటే ఉరుకులు పరుగులు
మీటింగులు,ఉపన్యాసాలు,శిక్షణలు
ఆరు రోజులు మనసుకు ఇష్టమైన పనులు
మరి నా సంగతేంటి అంటుంది హృదయం
నా దారంతా చెట్టు చేమా,పువ్వూ,పుట్టా
అలిసి సొలిసి ఇంటికొచ్చే వేళ
అల్లంత దూరాన సూర్యాస్తమయం
వానపడే వేళ సూర్యుడొస్తే
ఆ దారంతా రంగు రంగుల ఇంధ్రధనుస్సు
నీ కోసమేగా నా హృదయమా!
నా దారంతా పరుచుకున్నవి పచ్చని పచ్చని చెట్లేగా
నాకోసమే పూసే నాగమల్లి
నా మీద వర్షంలా కురిసే ఆకాశ మల్లి
ఇందిరా పార్కు రోడ్లో వస్తే గుబాళించే మొగలి పూలు
రామంతపూర్ రోడ్లో వెళితే సువాసనల సంపెంగ వనాలు
నెక్లెస్ రోడ్లో ఎంత సౌందర్యం ఉంది
హైదరాబాద్ లో అంతులేని కాలుష్యం ఉంది
భయంకరమైన బతుకు పోరు ఉంది
నిజమే!!
ఈ బీభత్సం మధ్య నే మనం బతకాల్సి ఉన్నప్పుడు
వొళ్ళొంచి పనిచెయ్యడం తో పాటు
కళ్ళిప్పి మనసు పెట్టి చూస్తే
మన చుట్టూ అల్లుకుకి ఎన్నెన్నో మహాద్భుతాలు
మనసుకు పట్టిన మకిలిని వదిలించే
ఆకుపచ్చని సోయగాలు
ఎటొచ్చీ అనుభవించగలిగిన
పసిప్రాయపు హృదయముండాలి.
అంతే.....
ఇంతలా కమ్ముకున్న చీకటి మధ్య
రోజుకో రేఖను కలుపుకుంటూ
కార్తీక పౌర్ణమి వెన్నెలని విరజిమ్మడం కోసం
ప్రస్థానం మొదలుపెట్టిన
ఈ కార్తీక నెలవంక
నేర్పే జీవితపాఠాలు ఎంత గొప్పవో
నేనొక నిరంతర బాటసారిని
నా ఆనందమంతా నేను నడిచే దారిలోనే దాగి ఉంది.
దాన్ని గుర్తించడం,అనుభవం లోకి తెచ్చుకోవడం
అదే నేను నిత్యం చేసే పని.

No comments:

తర్పణాలు త్రిశంకు స్వర్గాలు

 తర్పణాలు, త్రిశంకు స్వర్గాలు ............ మా సీతారాంపురం లో మా తాతకి చాలా పొలాలు ఉండేవి. మా తాత, చిన్న తాత ఇద్దరే పొలాలన్నింటిని పంచుకున్నా...