Friday, June 25, 2021

నా ఓపెన్ హార్ట్ సర్జరీ కధా కమామిషూ...


ఇప్పుడైతే ఇలా నవ్వులాటగా రాస్తున్నాను కానీ...1984 నవంబర్ నెల నా జీవితంలో ఓ ట్రోమాటిక్ పీరియడ్.
అప్పటి వరకు నా గుండెకి రూపాయి బిళ్ళంత కన్నం ఉందని నాకు...మా అమ్మ వాళ్ళకి ఎవ్వరికీ తెలియదు.
విపరీతంగా దగ్గొచ్చి తిన్నదంతా వాంతి చేసుకునే దాన్ని.
నా ఫ్రెండ్ డా అనిత చూసింది కానీ తను కనిపెట్టలేక పోయింది.
తనకు తెలిసిన ఫిజీషియన్ డా:అరవింద్ అనే ఆయన దగ్గరకు తీసుకెళ్ళింది.
ఆయన్ చెక్ అప్ చేస్తూ స్టెత్ ని చాలా సేపు నా గుండె మీదే ఉంచారు.
ఆ తర్వాత అనితతోను,నా సహచరుడి తో చెప్పారాయన.
బై బర్త్ నాకు గుండెలో హోల్ ఉంది.చాలా పెద్దగా ఉంది.. మంచి రక్తం చెడు రక్తం కలిసిపోయి లోపల ఇన్ ఫెక్ట్ అవుతోంది అందుకే లోపల ఏమీ ఇమడకుండా వాంతులవుతున్నాయి.
అర్జంటుగా ఓపెన్ హార్ట్ సర్జరీ చెయ్యాలి...లేకపోతే చాలా ప్రమాదం.
ఇది ఆయన చెప్పిన విషయం.నా సహచరుడు కుప్పకూలిపోయాడు.
నా కైతే ఏమీ అర్ధం కాలేదు.ఇన్ని సంవత్సరాలు ఏ డాక్టరూ కనిపెట్టలేదే...ఇంత పెద్ద సమస్య ఉందా నా లోపల.
మేమిద్దరం ఒక ఆశయానికి కట్టుబడి వాళ్ళ పెద్దలకి ఇష్టం లేకపోయినా రిజిస్టర్ పెళ్ళి చేసుకుని కల్సి బతకడం మొదలు పెట్టి మూడేళ్ళు...సెప్టెంబర్ 5, 1981. (నా పెళ్ళి కధ కూడా చాలా ఇంటెస్టింగ్ గా ఉంటుంది మరోసారి.)
నేను పబ్లిక్ సర్వీస్ కమీషన్ లో జూనియర్ అసెస్టెంట్ గా పనిచేస్తున్నాను...నా జీతం అప్పుడు 425/రూపాయలు..తను ఒక సీనియర్ లాయర్ గగ్గర జూనియర్.చాలా కష్టం మీద మూడు నాలుగొందలు ఇచ్చేవాడు వాళ్ళ సీనియర్.
ఆ రోజుల్లో ఓపెన్ హార్ట్ సర్జరి అంటే మాటలు కాదు.అపోలోలు,కేర్ లు లేవు.రాయవెల్లూర్ వెళ్ళాలి.మేము వెళ్ళలేం.
ఇక మిగిలింది గాంధి ఆసుపత్రి.
గాంధీ చుట్టూ తిరగడం మొదలు పెట్టాం.గవర్నమెంట్ ఆసుపత్రి డబ్బేమీ ఖర్చు కాదు కానీ అవి ఎలా ఉంటాయో అందరికీ తెలుసు కదా..
బోలెడన్ని పరీక్షలు.రెండో అభిప్రాయాలు...అర్జంటుగా ఆపరేషన్ చెయ్యాలన్నదే సారాంశం. ఇకో పరీక్ష చేస్తున్నప్పుడు నా గుండెను నేను చూసుకున్నాను.హోల్ సైజును గురించి మాట్లాడుకుంటూ ఈ అమ్మాయి కి ప్రెగ్నెన్సీ వచ్చుంటే చాలా ప్రమాదం జరిగి ఉండేది.ఎవ్వరూ ఎలా కనిపెట్టలేకపోయారా అని చాలా ఆందోళనగా మాట్లాడుకుంటుంటే
బహుశా నేను చనిపోతాను కాబోలు అనుకున్నాను.
డిసెంబర్ మధ్యలో గాంధిలో అడ్మిట్ అయ్యాను.టెస్టులు...పరీక్షలు...అన్నీ పూర్తయ్యి జనవరి 30 న ఆపరేషన్ డేట్ అన్నారు.
నేను గాంధిలో ఉన్నంత కాలం నా సహచరుడు...(జస్టిస్ వి వి ఎస్ రావ్) నాకు చేసిన సేవ ని నేను ఏ విధంగాను అక్షరాల్లోకి అనువదించలేను.అలాగే నా తమ్ముడు...వీల్ళ్ళిద్దరూ గాంధీ హాస్పిటల్ బాత్ రూంల దగ్గర రాంతింబవళ్ళు కూర్చుని ఉండేవాళ్ళు...మా అమ్మ ఇంట్లో మానేజ్ చేసేది.
నాకేం నేను హాయిగా హాస్పిటల్ బెడ్ మీద పడుకుని ఉండేదాన్ని.వాళ్ళ యాతన చెప్పనలివి కాదు.
ఆ టైంలో నేను ఏమి ఆలోచించేదాన్నో నాకు గుర్తు లేదు.చాలా ధైర్యంగా వుండేదాన్ని.నా కన్నీళ్ళని ఎవ్వరూ చూళ్ళేదు.
నా ధైర్యానికి కారణం ఉంది.నేను గవర్నమెంట్ ఆసుపత్రిలో గుండాపరేషన్ చేయించుకుంటున్నాను...చనిపోతానేమో అని అనుకోకపోవడానికి కారణం...గాంధీ లో ఉన్న కార్డియాలజీ యూనిట్.డా: యుధిష్టర నీడు,డా: కే వి సత్యన్నారాయణ... డా హరి ప్రేం..డా: శకుంతల వీళ్ళంతా నాకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చారు.ముఖ్యంగా డా: సత్యనారాయన గారు ,థొరాసిక్ సర్జన్.
నా ఆపరేషన్ రెండురోజులుందనగా టి వి లో సాగర సంగమం సినిమా వేస్తున్నారని ఎవరో చెప్పారు.ఆ మర్నాడు ఆదివారం.ఇంటికెళ్ళి సినిమా చూసి వస్తానని డాక్టర్ ని అడిగితే ముందు వద్దని,ఆదివారం కదా పర్వాలేదు సోమవారం పొద్దున్నే వచ్చెయ్యాలని చెప్పారు.
ఇంటికెళ్ళి సినిమా చూసి సోమవారం పొద్దున్నే వచ్చేసాను.
నేను తిగొచ్చేసరికి నా పక్క బెడ్ మీద ఉండే అమ్మాయి చనిపోయింది.ఆదివారం రాత్రి చనిపోయిందని నర్సు చెప్పింది.
నా కన్నా చాలా చిన్నది ...నా లాగే గుండెలో పెద్ద కన్నం ఉంది.కొంత సేపు భయమేసింది.
ఎల్లుండే నా ఆపరేషన్.నా ఫ్రెండ్ జయ వచ్చింది.తన చెయ్యి పట్టుకుని ఏడ్చినట్టు గుర్తు.
జనవరి 30 న ఉదయాన్నే నన్ను ఆపరేషన్ కి రెడి చేసారు.తనని థియేటర్ కి తీసుకెళ్ళేటప్పుడు నేను చూడలేను అని జయ రాలేదు.
నా తమ్ముడు కళ్ళ నీళ్ళతో కనబడ్డాడు.నేను లోపలికెళుతూ నా సహచరుడి చేతిని గట్టిగా పట్టుకుని వదిలేస్తూ నవ్వుకుంటూ లోపలికెళ్ళిపోయానట..అప్పటికే నా కళ్ళు మూతలు పడుతున్నాయి.
మర్నాడు నేను కళ్ళు తెరిచేసరికి రికవరీ రూంలో ఉన్నాను.ఎదురుగా డా: సత్యనారాయణ గారు...నర్సు అరుణ కనబడ్డారు (ఈ అరుణ నాకు చాలా సేవ చేసింది)రావ్,తమ్ముడు వచ్చారు...వెనకే జయ వచ్చింది.నా వొళ్ళంతా రక రకాల ట్యూబ్స్.గుండె మీద పొడుగ్గా కట్టు...రావ్ నా చెయ్యి పట్టుకుని ఎలా ఉంది అని అడిగాడు.దాహంగా ఉంది నీళ్ళు కావాలి అని అడిగాను.నీళ్ళు తాగ కూడదు ఎనస్తీషియా ఎఫెక్ట్ ఇంకా ఉంది వాంతులవుతాయి అన్నారు డాక్టర్.అయితే ఐస్ క్రీం తింటా అని అడిగానట.కొంచం పెట్టండి అందట అరుణ.
ఇవన్ని మత్తులో మాట్లాడినవే...తర్వాత మా వాళ్ళు చెప్పారు.
నన్ను రికవరీ రూంలో సత్యనారాయణ గారు, అరుణ కంటికి రెప్పలా చూసుకున్నారు.ఆ రూలో ఉన్నప్పుడే ఒక ఆక్సిడెంట్ హెడ్ ఇంజురి కేస్ రావడం పక్క బెడ్ మీద ఆ మనిషి భయంకరంగా మూలగడం మూడో రోజు చనిపోవడం కళ్ళారా చూసాను.
ఐదు రోజుల తర్వాత రికవరీ రూం నుండి వార్డుకి మార్చారు.వారం తర్వాత డిస్సార్జి చేసారు.
నేను ఇంటికొచ్చేసరికి మా బెడ్ రూం కి గ్రీన్ పరదాలు కట్టీ అచ్చం ఆసుపత్రి రూం లా శుభ్రంగా తయారు చేసాడు రావ్.
తన వల్ల,తన కేర్ వల్ల తొందరాగానే కోలుకున్నాను.గాంధీ ఆసుపత్రి లో చేయించుకోవద్దని చాలా మంది సలహా లిచ్చారు కానీ మరో చోట చేయించుకునే తాహతు లేదు కదా!!ఏదైతే కానీయమని సిద్ధపడాల్సిన పరిస్థితి కదా...చాయిస్ లేదు.
ఎకడెక్కడో అప్పు చేసి పది వేలు ఖర్చుపెట్టీ రావ్ తాజ్ బంజారాలో డాక్టర్స్ టీం కి డిన్నర్ ఇచ్చాడు.అది మా తహతుకి మించిన పని.కానీ నన్ను బతికించిన బృందానికి అలా తన కృతజ్ఞత చెప్పుకున్నాడు తను.నేను సత్యన్నారాయణ గారికి థాంక్స్ చెప్పబోతే అది మా డ్యూటి...మీరు అంతలా కదిలిపోవద్దు.ఈ నవల చదవండి అని "గాడ్ ప్లేయర్" అనే నవల నా చేతిలో పెట్టారు.ఆ నవలలో కార్డియాలజిస్ట్ విలన్. ఇప్పటికీ ఆయనని కలిసినప్పుడు ఏదో ఒక బుక్ ఇస్తారాయన.
ఆపరేషన్ తర్వాత పొట్ట దగ్గర కొన్ని కుట్లు అతుక్కుపోయి నాకు గూని వచ్చినటైంది. అప్పుడు ఆయనే మళ్ళి నాకు కార్టిజాన్ ఇంజక్షన్లు పొట్ట దగ్గర వేసి సరిచేసారు.
చేతులు వెనక్కి రాక జడ వేసుకోలేక బాధపడుతుంటే హెయిర్ కట్ చేయించాడు రావ్. ..కారణం ఇదైనా గానీ ఫెమినిష్టులు జుట్టు కత్తిరించుకుంటారనే బిరుదొచ్చింది నాకు.
ఇదీ సంగతి..
Uma Nuthakki, Rompicharla Bhargavi and 35 others
6 Comments
1 Share
Like
Comment
Share

No comments:

తర్పణాలు త్రిశంకు స్వర్గాలు

 తర్పణాలు, త్రిశంకు స్వర్గాలు ............ మా సీతారాంపురం లో మా తాతకి చాలా పొలాలు ఉండేవి. మా తాత, చిన్న తాత ఇద్దరే పొలాలన్నింటిని పంచుకున్నా...