Friday, June 25, 2021

ప్రేమలేఖ...5


డియర్ హేమంతా!!
ఎలా ఉన్నావ్? నీకు ప్రేమలేఖ రాస్తానని నువ్వు ఊహించి ఉండవు.
కానీ నీకు రాయకుండా ఎలా ఉంటాను.నువ్వు నాకెంతో ప్రియమైనదానివి.
గత సంవత్సరం నుండీ ఈ ఉత్తరాలు రాసే పని పెట్టుకున్నాను.సరదాగానే మొదలు పెట్టాను.
కానీ రాస్తుంటే భలే మజాగా ఉంది.ఈ సంవత్సరం లో నేను రాసిన ఐదో లెటర్ నీకే.
సరే...నీకు రాయడం మొదలు పెట్టగానే...అసలు నువ్వు నా జీవితం లోకి ఎలా వచ్చావా అని ఆలోచిస్తుంటే...ఒక రోజు నువ్వు హఠాత్తుగా ఆఫీసుకొచ్చిన దృశ్యం గుర్తొచ్చి భలే నవ్వొచ్చింది.మొదట నిన్ను చూసి కంగారు పడ్డాను.ఎందుకొచ్చిందీమె అని గాభరా పడ్డాను.
దానికి కారణం ఉంది.
హెల్ప్ లైన్ ప్రాజెక్ట్ కి ఫండింగ్ ఇస్తున్న ఆక్స్ ఫార్మ్ ఇండియా సంస్థ లో ఇండియా మేనేజర్ గా పనిచేస్తున్న ధర్మ రాజు గారి సహచరివి,నువ్వలా హాఠాత్తుగా ఆఫీసుకొస్తే ఏమనుకోవాలి?
దీనికన్నా మరో కారణం ఉంది.అంతకు ముందు కొన్ని రోజుల ముందు ఆక్స్ ఫార్మ్ పార్ట్నర్స్ మీటింగ్ జరిగింది.
సీరియెస్ గా ఆ మీటింగ్ జరుగుతున్నప్పుడు ఒక సంఘటన జరిగింది.
పసిపిల్లల నవ్వులా ఉన్న ధర్మరాజు గారి నవ్వు మీద ఒక కవిత రాసి లంచ్ లో వినిపించినప్పుడు ఆయన చాలా సిగ్గుపడిపోయారు.ఆయనకి తెలుగు చదవడం రాదని నాకు తెలియదు.గిరిజ చదివి పినిపించాకా ఆయన ఆ పేపర్ మడిచి జేబులో పెట్టుకున్నారు.మళ్ళీ అదే పసిపిల్లాడి నవ్వు....
నువ్వలా హఠాత్తుగా ఆఫీసుకొస్తే ఆ కవిత గురించి అడగడానికి వచ్చావేమో అనుకుని కంగారు పడ్డాను.అది కాసేపే.
భూమిక లో వాలంటీర్ గా పని చేయాలని వచ్చానని చెప్పి ఆశ్చర్యంలో ముంచేసావ్.
ఆ తర్వాత ఇద్దరం ఎన్నో కబుర్లు చెప్పుకున్నాం.మినర్వాకో బ్లూఫాక్స్ కో వెళ్ళి లంచ్ చేసాం
అలా మొదలైంది మన స్నేహం.
అప్పుడు నేను కుందంబాగ్ లో జెడ్జెస్ క్వార్టెర్స్ లో ఉండేదాన్ని.
ఇంట్లో బోలెడన్ని బ్రహ్మ కమలాలు పూసాయి చూడడానికి రమ్మంటే రాజు గారితో కలిసి ఇంటికొచ్చావ్.
విరిసిన పువ్వును కట్ చేసి నీ కిచ్చాను.ఇంటికి తీసుకెళ్ళావ్.
ఆ తర్వాత ఆఫీసుకి రావడం మొదలుపెట్టావ్.నేను కుందంబాగ్ నుంచి వచ్చేదారిలో పేరడైజ్ దగ్గర కారులో
నిన్నెక్కించుకుని వచ్చేదాన్ని.చాలా సార్లు మధ్యలో టాంక్ బండ్ మీద ఆగి ఏ చెట్టు కిందో కూర్చుని
కాసేపు కబుర్లు చెప్పుకుని ఆఫీసుకి వెళ్ళేవాళ్ళం.
భలే రోజులవి.చాలా సార్లు సాయంత్రాలు మీ ఇంటికొచ్చేదాన్ని.కొన్ని సార్లు గీత నేను కలిసి వచ్చేవాళ్ళం.అప్పటికి ప్రశాంతి నాతో లేదు.
ఒక సారి నేను గీత లంచ్ కి నీ దగ్గరకొచ్చాం.
ఆ రోజు నువ్వు చాలా కష్టపడి పీతల ఫ్రై చేసావ్.ఆ రోజే కదా నేను విప్ప సారా తాగి మత్తుగా నిద్రపోతుంటే నువ్వు, గీత,అవని కలిసి నా పొట్ట మీద పెయింట్ వేసారు.ఆ సంఘటన తలచుకుంటే ఎప్పుడూ నాకు భలే నవ్వొస్తుంది.
నీ సున్నితత్వం,ప్రేమ నన్ను కదిలిస్తుంది.
అమ్మ చనిపోయినప్పుడు నేను,గీత మీ ఊరొచ్చాం.
గీతకి నేను అమ్మని,నీకూ నేను అంతే..నువ్వు అమ్మ కోసం బాధపడకు నేనున్నాగా అంటే నా పక్కన పడుకుని నువ్వు నా అమ్మవి కాదు నా బేబీవి అంటూ నన్ను హత్తుకున్నావ్.
నా కన్నా వయసులో బోలెడు చిన్నదానివి ...నేను నీకు బేబీని.హా.. హా...భలే కదా.
నీకు ఉత్తరం రాస్తుంటే ఎన్నో విషయాలు గుర్తొస్తున్నాయ్.
ముఖ్యంగా రచయిత్రుల ఉత్తరాంధ్ర ట్రిప్.నలభై మంది తో కలిసి
చేసిన సాహితీ యాత్రలో వాకపల్లి బాధితులతో మాట్లాడి వచ్చిన రాత్రి,గంగవరం పోర్ట్ నిరవాసితుల దుఖం,కాకి దేవుడమ్మ పోరాటం చూసిన రాత్రి...ఆ దుఖం నన్ను విచలితను చేసింది.మానసికంగా నేను కుంగిపోయి చాలా ఏడ్చాను.ఆ రాత్రి ఒకే రూం లో నువ్వు,నేను గీత పడుకున్నాం.మేమిద్దరం మంచం మీద పడుకుంటే నువ్వు నేను పడుకున్నవేపు కింద పడుకుని ఏడుస్తున్న నా చేతిని పట్టుకుని నన్ను ఆ దుఖం లోంచి బయటపడెయ్యాలని చేసిన ప్రయత్నం తలుచుకుంటే ఇప్పటికీ నా కళ్ళల్లో నీళ్ళొస్తాయి.ఎన్ని కధలు చెప్పావ్.ఏవో అభూత కల్పనలతో సరదాగా,సీరియెస్ గా చెప్పిన కధలు విని నేను ఫక్కున నవ్వితే...గీతకు నీకు ఎంత సంతోషమో.ఆ రాత్రి నీ చేతి వేళ్ళల్లోంచి స్నేహం ధార కట్టి నా చేతివేళ్ళల్లోకి ప్రవహించిన ఫీలింగ్.మనసు ఎంత తేటపడిందో.ఆ తర్వాత నేను చాలా ప్రశాంతంగా నిద్రపోయాను.
నీ ప్రేమ పారిజాత పువ్వంత స్వచ్చంగా ఉంటుంది హేమంతా!
ఆ తర్వాత అవని పుట్టిన చాలా గేప్ తర్వాత కన్సీవ్ అవ్వడం,కవలలు పుట్టడం,బెంగళూరు వెళ్ళిపోవడం చక చకా జరిగిపోయాయి.పిల్లలతో అందులో కవలలతో నువ్వు చాలా బిజీ అయ్యావ్.
ఫోన్ లో మాట్లాడ్డం కూడా కష్టమైంది.
అయితేనేం మన స్నేహాం చెక్కుచెదరలేదు.పిల్లలు కొంచం పెద్దగా అయ్యాకా నేను నేను ప్రశాంతి కలిసి బెంగుళూరు వచ్చాం.ప్రశాంతి ని మొదటి సారి చూసావ్. నీకూ ఎంతో ఇష్టమైంది.రెండు రోజులు హాయిగా కబుర్లతో గడిపాం.
ఒక సారి బెంగుళూరు వచ్చినప్పుడు నాతో కలిసి కాఫీ తాగాలని కాఫీ కలుపుకుని ఒక పచ్చటి ప్లేస్ కి తీసుకెళ్ళావ్.
అక్కడ కూర్చుని కాఫీ తాగి,కబుర్లు తిని ఇంటికొచ్చాం.
ఇలా ఎన్నో ఎన్నెన్నో ఆత్మీయ జ్ఞాపకాలు.
నా చుట్టూ అల్లుకుని ఉన్న ప్రేమ వలయాల్లో నువ్వు బ్రైట్ గా వెలుగుతుంటావ్.
నిన్ను తలచుకుంటే ఎంత హాయిగా ఉంటుందో.
మన స్నేహాన్ని కాలదన్నుకున్న గీత ఏమి కోల్పోతున్నదో ఎప్పటికైనా గ్రహిస్తుందంటావా??ఏమో...
ఆ.. నీకు ఒక మంచి వార్త.జూలై 25,26,27 నేను బెంగుళూరులో ఒక ట్రైనింగ్ ప్రోగ్రాం లో ఉంటాను.23,24 నీతో ఉంటాను.
నువ్వు ఆ రెండు రోజులూ నా కోసం ఫ్రీగా పెట్టుకో.మనం మస్తు ఎంజాయ్ చేద్దాం.
నువ్వు ఈ ఉత్తరాన్ని అస్సలు ఎక్స్పెక్ట్ చేసి ఉండవు.సర్ప్రైజ్ గిఫ్ట్.
త్వరలో కలుద్దాం హేమంతా డియర్...
ప్రేమగా
నీ
బేబి
May be an image of 4 people, including Jayalakshmi Akula, people standing, tree and outdoors
Prasuna Balantrapu, Rompicharla Bhargavi and 26 others
4 Comments
Like
Comment
Share

No comments:

తర్పణాలు త్రిశంకు స్వర్గాలు

 తర్పణాలు, త్రిశంకు స్వర్గాలు ............ మా సీతారాంపురం లో మా తాతకి చాలా పొలాలు ఉండేవి. మా తాత, చిన్న తాత ఇద్దరే పొలాలన్నింటిని పంచుకున్నా...