Friday, June 25, 2021

ప్రేమ వలయాలు : 3


హాయ్ అపర్ణా!!
ఎలా ఉన్నావ్?
నా ప్రేమలేఖల సీరిస్ లో నీకు మూడో ప్రేమలేఖ రాస్తున్నా.
ఎంతో ఒత్తిడి పనుల మధ్య తీరిక చేసుకుని ఇలా ప్రేమలేఖలు రాయడం భలే రిలాక్సింగ్ గా ఉంది.
ఒక్కో సంఘటన గుర్తు తెచ్చుకుంటూ,హాయిగా నవ్వుకుంటూ రాయడం భలే మజాగా ఉంది.
నీకు నాకు పరిచయమెలా,ఎప్పుడు అంటే అలాంటిదేమీ లేదనే చెప్పాలి.
ఒకనాటి సాయంత్రం నేను ఎఫ్ బి లో ఏదో రాస్తున్నాను.మెసెంజెర్లో ఒక మెసేజ్ వచ్చింది.
సాధారణంగా మెసేజెస్ పట్టించుకోను.అపర్ణ తోట పేరు కనిపించి ఎవరీమె అనుకుంటూ మెసేజ్ ఓపెన్ చేసాను.
ఓ గమ్మత్తు,జబర్దస్త్ మెసేజ్ ఉంది."రాత్రి మీరు నా కల్లోకి వచ్చారు.నేను మీ బుగ్గ మీద ముద్దు పెట్టాను.మిమ్మల్ని కలుస్తాను.నిజంగానే ముద్దు పెట్టేస్తా"
ఓరి నాయనో ఎవరీమె.ఆమె కల్లోకి నేను వెళ్ళడమేంటి?నాకు ముద్దు పెట్టడమేంటి? పైగా తప్పక కలుస్తాను ,ముద్దు పెట్టేస్తాను అని బెదిరిస్తుందేమిటి?
ఆ రోజు తనతో చాట్ చేసినట్టు గుర్తు.నీకు నేను దొరకనుగా.మనం కలిస్తేగా ముద్దు పెట్టేది అని చాలంజ్ చేసాను.
ఆ తర్వాత మా మధ్య మాటలేమీ లేవు.
ఆ తర్వాత చాలా కాలానికి లామకాన్ లో అనిల్ బత్తుల సోవియెట్ పుస్తకాల ప్రదర్శన ఉందని అపర్ణ ఎఫ్ బి లో ఇన్విటేషన్ పెట్టింది.
నేను,ప్రశాంతి వెళ్ళేం లామకాన్ కి.
నేను లామకాన్ లోకి ఎంటర్ అవుతున్నాను.హటాత్తుగా ఎవరో వచ్చి నన్ను గట్టిగా పట్టుకుని బుగ్గ మీద ముద్దుపెట్టేసారు.
హమ్మో...అపర్ణ... దొరికిపోయా అనుకున్నాను...దొరికి పోయాను. ధ్రువ్ ఇంటికెళదామని అంటున్నాడని
వాళ్ళబ్బాయితో ఇంటికి వెళ్ళిపోయింది.
ఆ రోజు కూడా ఎక్కువ మాట్లాడుకోలేదు కానీ ఇద్దరి మధ్య అలా స్నేహం మొదలైంది.
నా వయస్సులో సగం వయస్సున్న అపర్ణ నాకు చాలా క్లోజ్ అయ్యింది.
చాలా సందర్భాల్లో కలిసాం.
అయితే ఓ అద్భుతానుభవం ఇక్కడ తప్పక రాయాలి.
చాలా సార్లు పౌర్ణమి రోజు కలవాలనుకునేవాళ్ళం.
2014 అక్టోబర్ నెలలో నిండు పున్నమి రాత్రి కలవాలని ప్లాన్ చేసుకున్నాం.
నేను మొదటి సారి అపర్ణ వాళ్ళింటికి డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాను.
నెక్లెస్ రోడ్డంతా పరుచుకున్న వెన్నెల్ని ఆస్వాధిస్తూ అపర్ణ వాళ్ళింటికి వెళ్ళాను.
వాళ్ళింటి ఎదురుగా చిన్న పార్కుంది.ఆ పార్క్ నిండా పున్నాగ పూల చెట్లున్నాయి.
ఆశ్వయుజ మాసపు నిండు పున్నమి.పార్క్ లో జలాజలా రాలుతుతున్న పున్నాగ పూలు.పార్క్లో మేమిద్దరమే కూర్చుని,ఆ వెన్నెల్లో నిండా తడుస్తూ ఎన్నెన్ని కబుర్లు చెప్పుకున్నామో.
అంతకు ముందు ఇలా కలిసింది లేదు.కలిసి గడిపింది లేదు.అన్ని కబుర్లు ఎక్కడి నుండి వచ్చాయో మరి.
మధ్యలో ఇంట్లోకి వెళ్ళి పెద్ద కప్పుల్నిండా కాఫీ తెచ్చుకుని మరీ కబుర్లు కొనసాగించాం.రాత్రి మూడు గంటలకి నిద్రపోయినట్టు గుర్తు.
(అక్టోబర్ 2014 పౌర్ణమి రాత్రి
ఆశ్వయుజ పౌర్ణమి రాత్రి
గ్రహణం విడిచిన పూర్ణ చంద్రుడు
చిన్న ఉద్యానవనం
చుట్టూ పున్నాగ పూల పరిమళం
వెన్నెల్లో తడుస్తూ ఆమె నేను
మొదటిసారి కలిసినట్టు లేదు
అంతులేని కబుర్ల ప్రవాహం
అరమరికలు లేని ముచ్చట్లు
కలవాలని ఎన్నో రోజుల ఎదురుచూపు
చంద్రుడు మా వెనక మొదలై
మా కళ్ళముందు నుంచి కిందికి జారుతున్నా
కంటి మీదికి కునుకు రానంటుంది
ముచ్చటగా మూడుగంటలకి
మరో కప్పు కాఫీ తాగి పడకలేక్కాం
వెన్నెల మమ్మల్ని వొదలకుండా
కిటికీ లోంచి మా పక్క మీదికి చొరబడుతుంటే
చల్లగా ,హాయిగా కునుకుపట్టేసింది.)
అంత లెక్కన ఏం మాట్లాడుకున్నారు అని ఎవరైనా అడిగితే ఇప్పుడేమీ చెప్పలేను.
కానీ అలాంటి అనుభవం గురించి చెప్పుకోవడానికేమీ ఉండదు.గుండెల్లో అభుభూతి మాత్రమే గూడు కట్టి ఉంటుంది.
ఆ తర్వాత మా ఇంట్లో చాలా సార్లు కలిసి పార్టీలు చేసుకున్నాం.
చిన్న పిల్ల ఈమెకి నాతో సరదా ఏంటా అని చాలా సార్లు అనుకున్నాను.
కానీ ఇద్దరికీ వయసెప్పుడూ గుర్తు రాలేదు.
నీతో ఒక రోజు గడపాలి,నన్ను నీతో ప్రయాణం చెయ్యనీయ్ అని చాలా సార్లు అడిగింది.
మొన్నీ మధ్య కరీం నగర్ పోదాం రమ్మని తీసుకెళ్ళా..రోజంతా కలిసి తిరిగాం.బోలెడన్ని కబుర్లు.పాటలు.
తను మలావత్ పూర్ణ మీద రాస్తున్న పుస్తకం గురించి చాలా సేపు మాట్లాడుకున్నాం.
ఆనంద్ మీద కూడా పుస్తకం తెద్దామని అనుకున్నాం.
కరీం నగర్ నుండి తిరిగి వచ్చేటప్పుడు ప్రయాణం వల్ల వాచిన నా పాదాలను చూసి ఇటు తిరిగి కూర్చోవచ్చుగా పాదాలు మసాజ్ చేస్తాను అంటే నాకు ఇష్టమవ్వలేదు.ఎప్పుడూ ఎవ్వరితోను కాళ్ళు పట్టించుకోలేదు మరి.
పదే పదే అడిగి నన్ను ఒకవేపు తిప్పి పాదాలను తన వొళ్ళో పెట్టుకుని సున్నితంగా వొత్తుతూ,పాటలు పాడుతూంటే...అబ్బో ఏమి భోగంలెండి.ఎంత హాయిగా అనిపించిందో.కళ్ళు అరమోడ్పులై నిద్ర ముంచుకొచ్చింది.గొప్ప రిలాక్సింగ్ ఫీలింగ్.
బహుశా నా ఫ్రెండ్స్ గాంగ్ లో అందరి కన్నా చిన్నది ఈ చిన్నది.
గలా గలా మాట్లాడుతూ అది కాదు సత్యా...ఆ... నన్ను సత్యా అనే పిలుస్తుంది.
కలవడం తక్కువే...మాట్లాడుకోవడమూ తక్కువే ...అయితేనేం స్నేహ ధార అలా ప్రవహిస్తూనే ఉంటుంది.
ఇద్దరికీ మెయిన్ లాండ్ చైనా రెస్టారెంట్ లో ఫేవరేట్ ఐటెంస్ తినడం, కాక్టెయిల్స్ తాగడం ఇష్టం.
కానీ ఎప్పుడో కానీ కుదరదు.ఓ రోజు మా ఇంట్ళో అర్ధరాత్రిదాకా కూర్చున్నాం.
అపర్ణతో మాట్లాడుతుంటే ఆ జెనరేషన్ ఆలోచనలు,సంఘర్షణలు అర్ధమౌతూంటాయ్.
నా జెనరేషన్ కి అపర్ణ జెనరేషన్ కి బోలెడంత దూరం ఉంది.తన కధల్లో కూడా అది వ్యక్తమౌతూంటుంది.
తనతో మాట్లాడేటప్పుడు ఈ జెనరేషన్ తో కనెక్ట్ అయినట్టనిపిస్తుంది.
తన ఫ్రెండ్స్ కూడా కలుస్తుంటారు.వాళ్ళతో మాట్లాడడం బావుంటుంది.
అపర్ణా...నీ స్నేహం మిసమిస లాడుతూ
బయటకొచ్చే కిసలయం లా ఫ్రెష్ గా ఉంటుంది.
లవ్ యూ...
సత్య

No comments:

తర్పణాలు త్రిశంకు స్వర్గాలు

 తర్పణాలు, త్రిశంకు స్వర్గాలు ............ మా సీతారాంపురం లో మా తాతకి చాలా పొలాలు ఉండేవి. మా తాత, చిన్న తాత ఇద్దరే పొలాలన్నింటిని పంచుకున్నా...