Friday, June 25, 2021

కరోనా పెట్టిస్తున్న కన్నీళ్ళు


-------కొండవీటి సత్యవతి
.....................................
ఈ రోజో,రేపో,ఎల్లుండో,వారం తర్వాతో పోనీ నెల తర్వాతో చనిపోయే అవకాశం పుష్కలంగా ఉంది అని తెలిస్తే మనిషన్నవాడు ఏమి చేస్తాడు.
ఆ మనిషి ఆలోచనలేలా ఉంటాయి.
ఒక్క నెల రోజుల బతుకు కోసం ఇంత హైరానా అవసరమా?
వైరస్ చేతిలో కీలు బొమ్మలెమైనామే.
అది మనల్ని బతకనిస్తుందనే గ్యారంటీ లేని దేశం.
130 కోట్ల భారీ జనాభా ఉన్న దేశం.
కోవిడ్ అంటువ్యాధి.ఎక్కడుందో,ఏ వైపునుండి వచ్చి దాడిచేస్తుందో.
మన వీధిలో ఎవరో దాన్ని మోసుకుంటూ తిరుగుతుండొచ్చు.
రేపు మన వీధి మొత్తం నిర్భంధం లోకి వెళ్ళిపోవచ్చు.
మనం కూరగాయలు కొనేచోట కాచుకుని ఉండొచ్చు.
ఇంత అనిశ్చిత పరిస్థితిలో మానవాళి మగ్గుతున్నప్పుడు సైతం మనిషి తాను సృష్టించుకున్న మతం గుప్పిట్లోనే ఉండడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
నేను హిందువుగా పుట్టినందుకు గర్వపడుతున్నాను.నేను ముస్లిమ్నైనందుకు గర్వపడుతున్నాను.నేను ఫలానా మతం లో పుట్టినందుకు గర్వపడుతున్నాను అంటూ చెప్పుకోవడం వేరు ఎదుటి మతస్థుని ద్వేషించడం వేరు.
ఆ ద్వేషం ఏ స్థాయికి చేరిందంటే ఫలానా మతస్థులకు మా హాస్పిటల్ లో వైద్యం చేయం,వాళ్ళ దగ్గర కూరగాయలు,పండ్లు ఏమీ కొనం.వాళ్ళవల్లనే మొత్తం కరోనా వైరస్ వచ్చిందని పెద్ద ఎత్తున ప్రచారం చెయ్యడం చూస్తుంటే మతం పేరుతో ఎంత విషం చల్లబడిందో అర్ధమౌతుంది.
మతమంటేనే మూఢత్వం,మూర్ఖత్వం.
మూర్ఖులతో నిండిన అన్ని మతాలూ లెక్కకు మించి తప్పులు చేస్తూనే ఉన్నాయి.
దాని ఫలితాలను సామాన్య ప్రజలు అనుభవిస్తూనే ఉన్నారు.
కొంతమంది చేసిన పొరపాట్లకు ,తప్పులకు మొత్తం ఆ మతస్థులను వెలివెయ్యాలా.ఇదేం న్యాయం??
జనవరి 30 న కరోనా మొదటి కేసు బయటపడినప్పుడు ట్రంప్ తో వచ్చిన విదేశీయులు గుజరాత్ లో ఎంతమందికి వైరస్ అంటించారో ఇప్పుడు గుజరాత్ ని చూస్తే అర్ధమౌతోంది.అలాగే జనవరి 30 తర్వాత ఇండియాలోని అన్ని ముఖ్య ఆలయాలూ జనంతో కిక్కిరిసాయి.
శివరాత్రి నాడు జగ్గీవాసుదేవ్ ఆశ్రమం వందలాది విదేశీయులతో,లక్షలాది భారతీయులతో నిండి ఉంది.వాళ్ళల్లో చాలామని ఇంఫెక్ట్ అయ్యుండొచ్చు. పరీక్షలు జరిగితే కదా తెలుస్తుంది.
మార్చి 21 తేదీ వరకు తిరుపతిలో లక్షలాది భక్తులున్నారు.మార్చి 22 న జనతా కర్ఫ్యూ పెట్టేవరకూ కరోనా వైరస్ విధ్వంశపు రేంజీ ఎవరికీ తెలియదు కదా.
విదేశాల నుండి వచ్చినవారికి పరీక్షలు చేస్తున్నామని చెపుతూ వచ్చారు కానీ సామాన్య ప్రజానికానికి ఏమి జరగబోతుందో ఎవరూ చెప్పనే లేదు కదా.
22 కర్ఫ్యూ తర్వాత ఇప్పటివరకు అందరం గృహ నిర్బంధలోనే ఉన్నాం.
అప్పటివరకు కరోనా వైరస్ను విదేశాల నుంచి విమానాల్లో వచ్చినవారు మోసుకొచ్చారని నిందించారు.అది కొంతవరకు నిజమే ఐనా వాళ్ళు కావాలని మోసుకురారు కదా.
వాళ్ళను సరైన సమయంలో అంటే ఎయిర్పోర్టులోనే పరీక్ష చేసి వారిని సురక్షితమైన చోట ఉంచి ఉంటే ఇంత భయానక పరిష్తితి వచ్చి ఉండేది కాదు.
ఇది ఖచ్చితంగా ప్రభుత్వాల వైఫల్యమే.
కొన్ని రోజులయ్యాకా ఎన్ ఆర్ ఐలను మొత్తం వదిలేసి మర్కజ్ మంత్ర పఠనం మొదలైంది.
మొత్తం కరోనాకి వారిని బాధ్యులను చేసే దుర్మార్గం, నిన్నటి ప్రభుత్వ లెక్కల తర్వాత కొంత తగ్గింది.
కేవలం 30% మాత్రమే వారివల్ల వ్యాపించిందని, నిజానికి వారికి పరీక్షలు చేసినప్పుడు చాలామందికి నెగిటివ్ వచ్చిందని ప్రకటనలొచ్చాయి.
70% వేరే కారణాలవల్ల విస్తరించిందని ప్రభుయ్వమే చెప్పినప్పుడు ఇంకా ఆ దుశ్ప్రచారాన్ని కొనసాగిస్తున్న వాళ్ళని ఏమనాలి?
గుజరాత్ లో ముస్లిం పేషెంట్స్ ని, ఒక చోట,హిందు పేషెంట్స్ ని ఒక చోట ఉంచి వైద్యం చేస్తున్నారనే రిపోర్టు అల్జజీరా చానల్ లో చూసాక ఇది రాస్తున్నాను.
మనిషి రక్తం లో మత మౌడ్యం ఏ స్థాయిలో ఇంకిపోయిందో చూస్తుంటే మరణం కూడా వీళ్ళను మార్చలేదేమో ...
తాను సృష్టించుకున్న మతంలో తానే ఎలా బందీ అయ్యాడో,మానవత్వం అనే మాటను ఎలా మరిచిపోతున్నాడో...
ప్రేమని వెదజల్లాల్సిన సందర్భంలో విషాన్ని ఎందుకు వెదజల్లుతున్నాడో అర్ధం కాక రాసిన రాతలివి.
మనిషి మత ముసుగుల్ని తొలగించుకుని మానవత్వాన్ని విస్తరించాలని కోరుకుంటూ ...
Prasanthi Polavarapu, Rompicharla Bhargavi and 10 others
2 Comments
1 Share
Like
Comment
Share

No comments:

తర్పణాలు త్రిశంకు స్వర్గాలు

 తర్పణాలు, త్రిశంకు స్వర్గాలు ............ మా సీతారాంపురం లో మా తాతకి చాలా పొలాలు ఉండేవి. మా తాత, చిన్న తాత ఇద్దరే పొలాలన్నింటిని పంచుకున్నా...