Thursday, July 29, 2010

చల్లగా కల్లు లాగించేసి .........

కొంతమంది సాహితీ మిత్రులం కలిసి మార్చి నెలలో విశాఖ పట్టణం వెళ్ళేం.ఆ ముందు రోజు భల్లుగూడా వెళ్ళేం.చాలా కష్టపడి కొండలెక్కి గుట్టలెక్కి,అడవిదారిన పడి నడుస్తూ భల్లుగూడా వెళ్ళొచ్చాం.పోలీసుల అత్యాచారాలకు గురైన గిరిజన మహిళలతో మాట్లాడాం.తిండి తిప్పలు లేకుండా అర్ధ రాత్రి వైజాగ్ చేరాం.
నిద్రలేని రాత్రి గడిపి ఉదయాన్నే ఊరి మీద పడ్డాం.
శ్యామల గారు "మీ స్ఫూర్తితో కారు కొని నేనే నడుపుతున్నా మీరు చూడాల్సిందే " అంటూ కారేసుకుని వచ్చేసారు.
మరింకేం పదండి భీమునిపట్ట్ణం చూసొద్దాం అంటూ పొలోమని నేను, కవయిత్రి శిలాలోలిత,నా నేస్తం గీత బయల్దేరాం.డ్రైవింగ్ నేనే.
బుద్ధిగా భీమిలి వెళ్ళి సముద్రంతో కాసేపు ఆటలాడి రావొచ్చు కదా.
అబ్బే అంత బుద్ధి ఎక్కడిది?
నూకరాజు ఆయన భార్యామణి నూకాలమ్మ కల్లు కుండల్ని సైకిల్ మీద మోసుకొస్తూ మా కంట పడ్డారు.
వాళ్ళని ఆపి ముచ్చట్లు మొదలు పెట్టాం.
"ఏటి హైదరాబాదు నుంచొచ్చారా.కల్లు గానీ రుచి సూత్తారేటి."అన్నాడు నూకరాజు.
"అందులో నువ్వేమి కలపలేదుగా?"
"అబ్బే! అమ్మోరి తోడు మావు అలాంటి పనులు సేయం."అన్నాడు.
సరే మేము కారు దిగాం.నూకరాజు తాడిచెట్టు ఎక్కాడు.
తాటి ఆకు కోసి చక్కగా కడిగి దొన్ని తయారు చేసాడు.
మేం గడ్డి మేటు దగ్గర కూర్చుని ఇలా కల్లు ఆరగిచాం.
అందులో ముగ్గురు మొదటి సారి ముట్టుకున్నారు.
చల్లగా కల్లు లాగించేసి సముద్రంలో చాలాసేపే ఆడాం.
ఇందులో కొసమెరుపు ఏమిటంటంటే ఆ రోజు తొమ్మిదిన్నరకి నేను ఒక సాహితీ కార్యక్రమానికి అధ్యక్షత వహించాల్సి ఉండడం.
కల్లు తాగితేనేం నేనే కారు డ్రైవ్ చేస్తూ తొట్లకొండ మీదికెళ్ళి,
కొంతసేపు కింది సముద్రాన్ని వీక్షించాం.
ఇన్నీ చేసి తొమ్మిదిన్నరకి ఠంచనుగా నా అధ్యక్ష పీఠం మీద కూర్చున్నానోచ్

2 comments:

మన ఊరు - నీలపల్లి (తాళ్ళరేవు మండలం, తూ.గో.జిల్లా) said...

మీ బ్లాగు బాగుంది. కల్లు త్రాగడము నచ్చలేదు

maa godavari said...

ఖండవిల్లి గారూ నా బ్లాగ్ సందర్శించినందుకు ధన్యవాదాలు.
బ్లాగ్ బావుంది కానీ కల్లు తాగడం బాగాలేదు అన్నారు.
ఎందుకు బాగోలేదో చెపితే నేను సమాధానం చెప్పేదాన్ని.
అప్పుడే చెట్టు మీద నుంచి తీసిన తాటి,ఈత కల్లు మన ఆరోగ్యానికి చాలా మంచిదని మా నాన్నమ్మ చెప్పేది.ఆమెతో పాటు మేము రుచి చూసే వాళ్ళం.నిజానికి ఈ పానీయాన్ని నీరా అనాలి.కల్లును భయంకరంగా కల్తీ చేసి,నానా కంగాళీ చేయడం వల్ల కల్లు పేరు చెబితేనే ముఖం చిట్లించడం మనకు అలవాటైంది.కొబ్బరి నీరు కన్నా శ్రేష్టమైంది నీరా.మన టాంక్ బండ్ మీద షాపు పెట్టి చాలా కాలం అమ్మారని మీకు తెలుసా?అయితే కల్లు అనే పదం పట్ల ఉన్న వ్యతిరేకత,తాగుబోతుతనానికి లింక్ పెట్టడం వల్ల ఆ షాప్ ఎంతో కాలం నడవలేదు.చాలా మందికి దాని వాసన,రుచి నచ్చవు.అంతే.నాకు ఇష్టం.ఐ లైక్ ఇట్.
అమ్మో ఆడవాళ్ళు ఇలా చేస్తే ఎలా అనుకునే వాళ్ళకు నేనేం చెప్పలేను.

తర్పణాలు త్రిశంకు స్వర్గాలు

 తర్పణాలు, త్రిశంకు స్వర్గాలు ............ మా సీతారాంపురం లో మా తాతకి చాలా పొలాలు ఉండేవి. మా తాత, చిన్న తాత ఇద్దరే పొలాలన్నింటిని పంచుకున్నా...