Tuesday, July 27, 2010

నాకు చట్రాలను చూస్తే చచ్చే భయం

నాకు చట్రాలను చూస్తే చచ్చే భయం
అలాగని చావంటే భయమేలేదు
పుట్టిన క్షణమే చావూ సిద్ధమయ్యే ఉంటుంది
అలాగని క్షణక్షణం చావక్కరలేదుగా
బతకడం ఎంత సంబరమో కొందరికి
చెట్టుని చూస్తే సంబరం
పిట్టని చూస్తే రివ్వున ఎగరాలన్నంత ఉత్సాహం
ఆకాశంలోని నీలం రంగు
అవని అంతా కమ్ముకున్న నల్ల రంగు,ఎర్ర రంగు
తొలి వేకువలో తూరుపు సింధూరం
సాయం సంధ్యలో కెంజాయ
ఆషాడమాసంలో ఉరుముతూ వేంచేసే తొలి మేఘం
నిట్టనిలువునా పులకింతలు రేపే తొలకరి జల్లు
ఈ ప్రకృతి పచ్చదనాన్ని
ఈ రంగు రంగుల సీతాకోకచిలుకల్ని
నా కోసమే నట్టనడిరాత్రి పూసిన బ్రహ్మకమలాలు
సంపెంగ చెట్టు చూస్తే చిన్నదే
కళ్ళు విప్పి చూస్తే కణుపు కణుపూ మొగ్గలే
తెల్లారి చూస్తే కమ్మటి సువాసనలతో పువ్వులే పువ్వులు
ఈ అనార్ చెట్టు ఎంత ఉందని
అబ్బో ఎర్రెర్రగా ఎన్ని పూలు పూసిందో
ఈ గోగుపూల తీగకేమొచ్చిందో గోడంతా పాకేసింది
నక్షత్రాలను తెచ్చి పువ్వుల్లా పూయించేసింది
ఈ మాధవీలతను చూస్తే చాలు
గుండెల్లో బాల్యపు జేగంటలు మోగుతాయి
బులిబుల్లి గిన్నెల్నిండా
మధువు నింపుకున్న మధుమాలతులు
వస్తున్నానుండవోయ్ పొగడపూలమ్మా
నా మీద అలకేనా పూలన్నీ అలా ముడుచుకుపోయాయ్
ముందు నీ దగ్గరకే వస్తే తొందరగా పోగలానా
పొగడపూల మీద మోహం పొయ్యేదా చెప్పు
అరే! అరే! అంత కోపమా ఆకాశమల్లెమ్మా
నువ్వు రావడానికి నా మీద రాలడానికి
ఇంకా చాలా టైం ఉందిలేమ్మా
అమ్మో!ఆ ముళ్ళన్నీ నన్ను గుచ్చడానికేనా మొగలిరేకమ్మా
నిన్ను ముట్టుకోకుండా
నీ ముళ్ళు గుచ్చుకోకుండా శ్రావణం గడిచేనా
నాగమల్లివో తీగమల్లివో
నయనానందకరం నవనవోన్మేషణం
ఆగవోయ్ ఎర్రకలువ పిల్లా
ఏమా తొందర వస్తున్నానుండు
అదంతా నా మీద కోపమేనా
మూతి ముడిచినట్టు ముడుచుకుపోయావ్
ఆహా!ఏమి ఈ ప్రకృతి?       
ఏమి ఈ వైవిధ్యం
జనాలు బోరుకోడుతుందని ఎందుకంటారు?
చుట్టూ ఇంత సౌందర్యం
ఇంత వైవిద్య్హం
ఇంత పచ్చదనం
ఇన్ని రంగులు
ఇంకేం కావాలి?
మనుష్యులతో సజీవ సంబంధం
మన చుట్టూ పరిసరాలతో
మమేకమయ్యే ఆత్మీయబంధం
ఇది చాలదా బతకడానికి?
ఎందుకు చట్రాల్లో బంధీ అవ్వడడం?
అన్నిచట్రాలని తెంపుకుందాం రండి
హాయిగా ఎగిరిపోదాం పదండి.
మన చుట్టూ ఉన్న వాళ్ళకి అండ మనమయితే
ఈ సమస్త ప్రకృతి మనకి కొండంత అండ కాదా?

4 comments:

శ్రీలలిత said...

పొగడపూలతో చేసిన అలంకరణలా వుందే ఈ చిత్రం..ఎంత బాగుందో.. అంతకన్నా బాగుంది మీ భావం , కవిత.. నిజమే.
చట్రాలలో ఇమడాలని చిన్నబోయి కుచించుకుపోకుండా
ఆకాశమే హద్దుగా ప్రకృతిలోని అందాల్ని ఆస్వాదించడం లో వున్న ఆనందం మరెక్కడుంది..

lakshmi sravanthi udali said...

ee pulani modatisaari chustunnanu chala bagunnaayandi
mee kavitalaa chala andanga unnai

sunita said...

kavitaa, bommaa renDoo chaalaa baagunnaayi.

మాలా కుమార్ said...

పొగడపూల అలంకరణ చాలా బాగుంది . పూల కవిత మరీ బాగుంది .
స్చప్ మీ పూల కబుర్ల కు బానిసనై పోయాను .

తర్పణాలు త్రిశంకు స్వర్గాలు

 తర్పణాలు, త్రిశంకు స్వర్గాలు ............ మా సీతారాంపురం లో మా తాతకి చాలా పొలాలు ఉండేవి. మా తాత, చిన్న తాత ఇద్దరే పొలాలన్నింటిని పంచుకున్నా...