Monday, June 29, 2009

మా గోదావరి కధలు




మా మేనత్త గారి వూరు పేరు బూరుగులంక.తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో గోదావరి ప్రవహించినత మేరా బోలెడన్ని లంకలున్నాయి.కనక్కాయల లంక,యలమంచిలి లంక,బూరుగు లంక,పుచ్చల్లంక ఇలా ఎన్నో అందమైన లంకలున్నాయి.నేను పైన చెప్పిన బూరుగు లంక మా మేనత్త అత్తగారి వూరు.ఈ వూరు వెల్లడానికి రెండు దారులున్నాయి. ఒకటి నరసాపురంలో పడవెక్కి గోదావరి దాటి దాటి సఖినేటిపల్లిలో బస్సెక్కి వెళ్ళడం. రెండోది పెనుగొండ మీదుగా సిద్ధాంతం బ్రిడ్జి దాటి వెళ్ళడం.సిద్ధాంతం బ్రిడ్జి మీద నిలబడి చూస్తే కుడి వేపు,బంగారు వర్ణంలో మెరిసిపోయే ఇసుక తిన్నెల మధ్య చిన్న పాయలాగా పారే గోదావరి మలుపు తిరిగే చోట మా మేనత్త గారి బూరుగు లంక కనపడుతుంది.అచ్చమైన, అందమైన లంక.బూరుగు లంక మెడచుట్టూ నెక్లెస్ లా మెరుస్తుంటుంది గోదావరి.ఆ లంకలోకి వెళ్ళలంటే ఎవ్వరైనా సరే గోదావరిలో దిగి నడవాల్సిందే.ఎక్కువ లోతుండదు.ఆ చిన్న పాయలో పాదాలుంచి నడుస్తున్నపుడు చెప్పలేని ఉద్వేగం మనసును కమ్మేస్తుంది.తల్లి గోగారిని కాళ్ళతో తన్నుతూ నడవడం బాధగా అనిపిస్తున్నప్ప్టికి, నీళ్ళలో కాళ్ళు పెట్టగానే ఒళ్ళు జిల్లుమంటుంది.ఆ బుల్లి పాయను ధైర్యంగా దాటేసి, అఖండ గోదావరిని దాటేసినంత ఆనందంతో మా మేనత్త గారి వూరి వేపు నడక సాగిస్తాం.ఎంతో సారవంతమైన భూములు.కొబ్బరి తోటలు,అరటి,మొక్కజొన్న,తమలపాకు తోటలు.లంకంతా పరుచుకున్న పచ్చదనం గుండెను ఉప్పొంగిస్తుంది.గోదారమ్మ ఒడిలో కూర్చున్నట్ట్లుగా వుండే ఆ లంక అంటే నాకు ప్రాణం. వరద గోదారమ్మ ఉగ్రరూపంతో ఒరుసుకుంటూ ఆ లంకను తాకినపుడు లంకలో జనం విలవిల్లడిపోతారు.ప్రతి సంవత్సరం కొంత భూమిని తనలో కలిపేసుకున్నా మరో చోట సారవంతమైన భూమిని కూడ పసాదిన్స్తుంది.భద్రాచలం దగ్గర పెర్గే వరద సూచి పయింట్లు, ఈ లంక ప్రజల గెండె వేగాన్ని విపరీతంగా పెంచుతాయి.ఎతైన ప్రదేశాలు చూసుకుకి ఆ సురఖ్సిత ప్రాంతాలకు తరలిపోతారు.వరద తాకిడి, విధ్వంశం స్రుషిటించినా,వరదతో పాటు వచ్చే ఒంద్రు మట్టి ఆ సంవత్స్రం ఇబ్బడి ముబ్బడిగా పంటలిస్తుందని లంక జనానికి తెలుసు కాబట్టి వరద వేళ సుఖ దుఖాలను సమానంగానే అనుభవిస్తారు.ప్రతి సంవత్సరం వరద ఎంత ఎత్తు వచ్చింది,అని కొలుచుకోవడానికి ఇంటి గోడల మీద గుర్తులు పెడతారు.ఈ సంవత్సరం ఇంత ఎత్తు,క్రితం సంవత్సరం ఇంత ఎత్తు.అలాంటి గుర్తులు ప్రతి ఇంటి గోడ మీద వుంటాయి.వరద కధల్ని మా మేనత్త రసరమ్యంగా మా మేనత్త మాకు చెప్పేది. మేము ముగ్ధులమై వినేవాళ్ళం.

Friday, June 19, 2009

నువ్వు నేను- ఆ ఫోటో




సంతోషాన్ని నిర్వచించగలమా
ఆనందానికి అర్ధం చెప్పగలమా
అదొక మానసిక స్థితి
ఈ మానసిక స్థితి శరీరంలో ప్రతిఫలించడం
ఎవరైనా ఎపుడైనా చూసారా
పరవశంలో పొంగి పొర్లుతున్న మనసు
ముఖంలోనే కాదు
మొత్తం శరీరంలో ప్రతిఫలించడం
ఎవరైనా ఎపుడైనా చూసారా
పాపికొండల పారవశ్యం ఒకవేపు
గోదారమ్మ గలగలలు మరోవైపు
నీ స్నేహ మాధుర్యం మరోవైపు
ముప్పేటలా నన్ను ముంచెత్తిన వేళ
నా ముఖంలో వెయ్యి మతాబుల కాంతి
వెలుతురు విరజిమ్మతున్న పరిసరాల్లో
నిన్ను చుట్టుకున్న చేతుల్లో
పూసిన కాంతి పుంజరాలు
సంతోషాన్ని మనస్సే కాదు
శరీరం కూడా వ్యక్తం చేస్తుందని
ప్రక్రుతి పచ్చదనమే కాదు
ప్రియ నెచ్చలి వెచ్చని స్పర్శ కూడా
ఒళ్ళంతా విద్యుత్తరంగాలు పుట్టిస్తుందని
మన చాయాచిత్రం చూసాకే అర్ధమైంది.

Monday, June 15, 2009

తొలి తెలుగు కథా రచయిత్రి భండారు అచ్చమాంబ

స్త్రీల సాహిత్య చరిత్రను తవ్వుకుంటూ పోతే ఎన్నెన్నో మణులు, మాణిక్యాలు దొరుకుతాయి. ఇంత కాలం మట్టిలో కూరుకు పోయి ఉన్న వజ్రాల్ని సాన పెడితే వాటి ధగ ధగలముందు మిగిలినవన్నీ వెల వెలా పోవాల్సిందే. భండారు అచ్చమాంబలాంటి ప్రతిభావంతులెందరో చరిత్ర చీకటిలో మినుకు మినుకు మంటున్నారు. స్త్రీవాద చైతన్యంతో, స్త్రీల దృష్టికోణంతో మనం ఈ రోజు స్త్రీలను అంచులకు నెట్టేసిన సాహిత్య చరిత్రను తిరిగిరాయాల్సి వుంది. ఇక్కడ గమ్మతైన విషయం ఏమిటంటే ''ఆధునిక మహిళ స్త్రీల చరిత్రను తిరగ రాస్తుంది.'' అని చెప్పిన గురజాడే తొలి కథకురాలు అచ్చమాంబకి పోటీగా నిలవడం. గురజాడ మీద అత్యంత గౌరంవంతోనే నేను తొలి తెలుగు కథా రచయిత్రి అచ్చమాంబే అని సగర్వంగా, సాధికారంగా ప్రకటిస్తున్నాను.

అచ్చమాంబ రాసిన మొదటి కథ 'ధన త్రయోదశి'. దీనిని 1902 నవంబరు నెలలో 'హిందూ సుందరి' లో ప్రచురించారు. ఈ కథలో ఇతి వృత్తం ఆధునికమైనదే. కథా నాయకి విజయలక్ష్మమ్మ. కథా స్థలం బొంబాయి. దీపావళి రోజు సాయంత్రం ఒక్కర్తీ కూర్చుని ఆలోచనల్లో మునిగిన విజయలక్ష్మమ్మ పేదరికంవల్ల కనీసం దీపాలు కూడా వెలిగించలేక పోయానే, పిల్లలకి టపాసులు కొనియ్య లేకపోయానే అని తలుస్తూ బాధపడుతూ వుంటుంది. ఆమె భర్త ఒక బట్టల కొట్టులో పని చేస్తూ వుంటాడు. నెలకు పది రూపాయల జీతంతో ఆ కుటుంబం చాలా కష్టాలు పడుతుంటుంది. ఆ బట్టల కొట్టులోని పెద్ద గుమాస్తా విజయలక్ష్మమ్మ భర్త వెంకటరత్నాన్ని ప్రలోభ పెట్టి షాపు ఇనప్పెట్టేలోంచి సొమ్ము సంగ్రహిద్దామని చెబుతాడు. వెంకటరత్నం మొదట ఒప్పుకోడు. ఆలోచించి చెబుతానంటాడు. ఈ విషయం కనిపెట్టిన విజయలక్ష్మి భర్తను మందలిస్తుంది. దొంగతనం చేసిన సొమ్ము నాకు వద్దంటుంది. పెద్ద గుమాస్తా ఇచ్చిన వంద నోటును తిరిగి ఇప్పించేస్తుంది. కథ చివరలో సేటు వెంకటరత్నాన్ని మెచ్చుకుని నిన్ను పరీక్షించడానికే ఈ నాటకం ఆడామని చెప్పి అతని జీతం పెంచుతాడు. ఇది 'ధన త్రయోదశి' లోని కథ. 'దిద్దుబాటు' కథలో కథాంశం కూడా భర్తను సంస్కరించడమే. ధనత్రయోదశిలో కూడా అదే కథాంశం. అంతేకాకుండా దిద్దుబాటు కథ ఆదర్శపూరితంగాను, హాస్యంగాను వుంటే అచ్చమాంబ కథ గంభీరంగా, వాస్తవికంగా వుంటుంది. గురజాడ కన్నా పదేళ్ళ ముందే ఇలాంటి కథ రాసిన అచ్చమాంబను సాహిత్య కారులు ఉద్దేశ్యపూర్వకంగానే తెర వెనక్కి నెట్టేసారు.
ఈ తెరల్ని చీల్చి నిజాల్ని బయటపెట్టి భండారు అచ్చమాంబను రంగం మీదికి తీసుకు వచ్చినది కె. లలిత. వుమెన్‌ రైటింగు ఇన్‌ ఇండియా పుస్తకాన్ని ఎడిట్‌ చేస్తున్న సందర్భంలో మొట్ట మొదటగా లలిత ఈ అంశాన్ని పేర్కొన్నది. అచ్చమాంబను తొలి తెలుగు కథకురాలుగానే కాక 'ప్రధమ స్త్రీవాద చరిత్ర కారణిగా ప్రకటించినది కూడా ఆమెనే. ఫిబ్రవరి 27 - మార్చి 1 వరకు 1998 లో ' భూమిక, అన్వేషి ఆధ్యర్యంలో ''తెలుగు కథ, నిర్మాణం, పరిధి, వైవిధ్యం'' పేరుతో నడిచిన మూడు రోజుల కథా వర్క్‌ షాప్‌లో లలిత తన ప్రసంగంలో ఈ అంశాన్ని ప్రస్తావించారు. ''సంఘ సంస్కరణోద్యమం - స్త్రీల కథలు'' అంశం మీద ప్రసంగిస్తూ లలిత, 1910లో వచ్చిన గురజాడ కథ మొదటి ఆధునిక కథ అంటున్నారు విమర్శకులు. కానీ 1902లో అచ్చమాంబ రాసిన ''ధనత్రయోదశి'' ఎందుకు మొదటి కథగా పరిగణించడం లేదు అని ప్రశ్నించారు. ఆ తర్వాత డా. భార్గవీరావు సంకలనం చేసిన నూరేళ్ళ పంట '' కథల సంకలనంలో ప్రచురించిన స్త్రీవిద్య మొదటి కథ కాదు. ''ధనత్రయోదశి నే మొదటి కథగా చెప్పుకోవాలి''
అయితే ఈ కథని తొలి కథగా ఒప్పుకోకపోవడానికి విమర్శకులు చెబుతున్న కారణాలు రెండు. ఒకటి కథ గ్రాంధిక భాషలో వుంది. రెండు ఆధునిక కథకుండాల్సిన లక్షణాలు లేవు. గురజాడ దిద్దుబాటును మొదట గ్రాంధిక భాషలోనే రాసి తర్వాత సరళ గ్రాంధిక భాషలోకి మార్చినట్టుగా తెలియ చెప్పే ఆధారాలు మన ముందున్నాయి. గురజాడ 'కమిలిని' పేరుతో రాసిన ఈ కథని అవసరాల సూర్యారావుగారు 'అణిముత్యాలు' కథా సంకలనంలో ముద్రించారు. ఇది గ్రాంధిక భాషలోనే వుంది.

రెండోది కథకుండాల్సిన లక్షణాలు లేవనేది. ఈ కథ రాసిన నాటి చారిత్రిక నేపథ్యాన్ని అర్థం చేసుకుంటే ఈ మాట రాదు. సాహిత్య ప్రక్రియగా ప్రపంచ సాహిత్య చరిత్రలో కథ పుట్టిందే 19 శతాబ్దంలో. కథకు ఉండవలసిన లక్షణాలు స్థిర పడుతున్న సందర్భం. ఈ నేపథ్యంలోంచి చూడాల్సిన అవసరం వుంది. అయితే ఒక స్త్రీని ఒకానొక నూతన సాహిత్య ప్రక్రియకి ఆద్యురాలుగా ఆంగీకరించలేకపోయిన తెలుగు సాహిత్య విమర్శకులు చాలా తెలివిగా పై రెండు అంశాలను చూపించి అచ్చమాంబ తొలి కథకురాలు కాదు పొమ్మన్నారు. లేదా పట్టించుకోకుండా వదిలేసారు.

''కథా శిల్పం'' పేరుతో కథ మీద సిద్ధాంత గ్రంధం లాంటిది రాసిన వల్లంపాటి వెంకట సుబ్బయ్య అచ్చమాంబ కథని కనీసం స్పృశించకుండా, చాలా తెలివిగా ''తెలుగులో మొట్ట మొదటి కథ ఏది అన్న వివాదాన్ని కథా సాహిత్య చరిత్ర కారులకు వదిలి పెట్టి గురజాడ 'దిద్దుబాటు' మొదటి కథ అన్న పరికల్పనతో తెలుగు కథా పరిణామాన్ని గురించి ఆలోచిద్దాం'' అంటూ దాటవేసారు. ఎవరి కథ మొదటిది అనే అంశాన్ని పక్కకు పెట్టినా 'ధనత్రయోదశి' కథలోని మంచి చెడ్డల్ని గురించి ప్రస్తావించడం కూడా ఆయనకు ఇష్టం లేకపోయింది.
 ''తొంభై ఏళ్ళ తెలుగు కథ'' పుస్తకంలో కూడా పెదిభొట్ల సుబ్బరామయ్య, భమిడిపాటి జగన్నాధరావులు కూడా కథ గురించి విపులంగా చర్చిస్తూ భండారు అచ్చమాంబ గురించి ఒక్క మాట కూడా రాయలేదు. అంతెందుకు. ఇటీవల విశాలాంధ్ర పబ్లిషింగు హౌస్‌ వారు '' తెలుగు కథకులు - కథన రీతులు'' పేరుతో వరుసగా మూడు పుస్తకాలు ప్రచురించారు. సింగమనేని నారాయణ, మధురాంతకం రాజారామ్‌లు ఎడిటర్లుగా వ్యవహరించిన ఈ పుస్తకాలలోని మొదటి సంపుటిలో గురజాడ అప్పారావు గురించి రాచపాళెం చంద్రశేఖర రెడ్డి గారు రాసిన వ్యాసం వుంది. అయితే భండారు అచ్చమాంబను తొలి కథా రచయితగా ఒప్పుకోలేక పోయినా అచ్చమాంబ కథల గురించి, కథన రీతులు గురించిన వ్యాసం రాయించేంత విశాల హృదయం వుండకపోయినా ఆవిడ గురించి ప్రస్తావించాల్సిన అవసరం లేదా? ఆవిడ రాసిన కథల్లో ఆధునిక లక్షణాలు లేవని కొట్టి పారేయడం కాకుండా వాటి మంచి చెడ్డల్ని సమీక్షించాలన్న ఆలోచన లేకపోవడం వెనుక వున్నదంతా పురుషాధిపత్యమే అని అనుకోవాల్సిన పరిస్థితుల్ని వారే కల్పించినట్లు అవ్వలేదా? అయితే ఇటీవల కాత్యాయని విద్మహే సంపాదకత్వంలో వెలవడిన '' తెలుగులో స్త్రీల సాహిత్యం'' 20 వ శతాబ్ది రాజకీయార్ధిక పరిణామాలు'' పుస్తకంలోని ఒక పేరాను ప్రస్తావించి ఈ తొలి కథ ఎవరు రాసారన్న చర్చను ముగిస్తాను. ఈ పుస్తకంలోని అవగాహన పత్రం వ్యాసంలో కాత్యాయని ఇలా పేర్కొన్నారు.
 '' స్త్రీల సాహిత్య అధ్యయనానికి రాజకీయ అర్థశాస్త్ర దృక్పధం స్వీకరించవలసిన సిద్ధాంతం''. నిర్ధిష్ట చారిత్రక రాజకీయార్ధిక పరిణామాల నేపధ్యంలో దానిని పరిశీలించటం పద్ధతి. స్త్రీల సాహిత్య అధ్యయనానికి ప్రాతిపదికలు-
1. స్త్రీలు ఎంత సాహిత్యాన్ని సృష్టించారని కానీ ఎంత బాగా వ్రాసారని కానీ కాక అసలు వాళ్ళేం వ్రాసారో, ఎందుకు వ్రాసారో, ఎందుకు వ్రాయలేకపోయారో చూడాలి.
 2. పితృస్వామిక సామాజిక అధికారిక సంబంధాలలో అణిచివేతకు గురయిన వర్గం సృస్టించిన సాహిత్యంగా స్త్రీల సాహిత్య ప్రత్యేకతను గురించి పరిశీలించి విలువ కట్టాలి.
 3. స్త్రీల సాహిత్యాన్ని విలువ కట్టడంలో ఆ సాహిత్యం వచ్చిన కాలం నాటి మొత్తం సమాజపు స్థితి, అందులో స్త్రీల కున్న అవకాశాల నుండి వాళ్లు పొందిన చైతన్య స్థాయి ప్రాతిపదికలు కావాలి.
 సాహిత్యాన్ని తూకం వేయడానికి ఇంతకాలం పురుషులు వాడిన ప్రాతిపదికలు సాహిత్యాన్ని పురుష దృష్టి కోణం నుంచి అంచనా వేయడానికే పనికి వచ్చాయి. స్త్రీల ప్రత్యేక పరిస్థితుల గురించిన అవగాహన లేకపోవడమో లేక స్త్రీలను ముందుంచడం ఇష్టం లేకనో ఇంతకాలం స్త్రీల సాహిత్య చరిత్ర గురించి ఖచ్చితమైన, సవ్యమైన దిశలో అధ్యయనం లేకుండా పోయింది. పురుషాధిపత్యం, పితృస్వామ్యం అద్దాల్లోంచే స్త్రీల సాహిత్యాన్ని చూడడానికి అలవాటు పడిన విమర్శకులు, సాహిత్య చరిత్ర కారులు ఇకనైనా నిజాల్ని చూడటానికి ప్రయత్నిస్తారని ఆశిస్తూ, అచ్చమాంబను తొలి తెలుగు కథకురాలిగా, ప్రధమ స్త్రీవాద చరిత్ర కారిణిగా బలంగా ప్రతిపాదిస్తూ ఆవిడ రచనల్లో జండర్‌ స్పృహ గురించి వివరిస్తాను.
 అచ్చమాంబ 1874 వ సంవత్సరంలో కృష్ణాజిల్లా నందిగామలో పెనుగంచిప్రోలు గ్రామంలో పుట్టింది. ఈమెకు ఆరేళ్ళ వయసపుడే తండ్రి చనిపోయాడు. 10వ ఏటనే ఈమెకు పెళ్ళయ్యింది. పెళ్ళయ్యే నాటికి అచ్చమాంబ ఏమి చదువుకోలేదు. ఆమె తల్లి, తమ్ముడు కూడా ఆమెతో పాటే ఉండేవారు. ఆమె తమ్ముడికి చదువు చెప్పించారు కానీ ఈమెను ఎవరూ ప్రోత్సహించలేదు. తమ్ముడితో పాటు కూర్చుని తానే చదువుకుంటూ తెలుగు, హిందీ నేర్చుకొన్నది. చదువు విషయంలో చిన్నతనంలోనే కుటుంబంలో వివక్షకు గురయిన అచ్చమాంబకు చదువు విలువ బాగా తెలుసు. తన తమ్ముడు ఎమ్‌. ఏ చదవగలగటం తాను కనీసం ఇంగ్లీషు అక్షరాలను కూడా నేర్చుకోలేక పోవడం వెనుక వున్న లింగవివక్షని అర్థం చేసుకున్నది కాబట్టే ఈ విషయం మీద చాలా సార్లు తన రచనల్లో ప్రస్తావించింది.
అచ్చమాంబ తాను ఎందుకు చదువుకోలేకపోయిందో తన తమ్ముడుపై చదువులు ఎలా చదవగలిగాడో అర్థం చేసుకున్నది కాబట్టే 'అబలా సచ్చరిత్ర రత్నమాల'లో ఇలా రాసింది.
 '' స్త్రీల బుద్ధి పురుష బుద్ధి కన్న మందమనియు, స్త్రీల మెదడు మస్తిష్కము, పురుషుల మస్తిష్కము మెదడు కన్న బలహీనమగుటచే దక్కువ తూగుననియు వ్రాయు వ్రాత బక్షపాతము కలదనుట నిర్వివాదమే- స్త్రీలు నైసర్గిక మూఢురాండ్రనుటకంటె బాల్యము నుండియు వారికి విద్యాగంధమే సోకనియ్యనందున మూఢురాండ్రుగా నున్నారనుట మంచిది- చిన్నతనమున బాలురు బాలికలు సమబుద్ది కలవారుగా నున్నను శాస్త్ర విషయముల బ్రేశ పెట్టనందున బురుషులు జ్ఞానాధికులును ఎట్టి తెలివిగలదైనను కన్న తల్లిదండ్రులే యామెను పైకి రానీయక మూల మూలల నగణదొక్కుటచే బాలిక మూర్ఖురాలును అగుచున్నవారు. స్త్రీ యభివృద్ధి లేకుండుటకిట్లు మగవారి పక్షపాతమే మూలం కాని మరోకటి కాదు. పురుషులా పక్షపాతమును విడిచిరేని స్త్రీలు విద్యావతులయి భర్తలకర్ధాంగులన్న నామును సార్దకము జేతురని నా నమ్మకం''.
 భారత వీర నారీ మణుల జీవిత సంగ్రహములను రాయడానికి ' అబలా సచ్చరిత్ర రత్నమాల' అనే పేరుతో రాసిన గ్రంధం గురించి అందరికీ తెలుసు. ఈ పుస్తకానికి రాసిన ఉపోద్ఘాతం చదివినపుడు అచ్చమాంబలో జండర్‌స్పృహ ఎంత వుందో అర్థమౌతుంది.
 ఆ పుస్తకం రాయడం వెనుక వున్న ముఖ్యోద్దేశ్యం గురించి
1. '' స్త్రీలు అబబలనియు, బుద్ధి హీనులనియు వివేకశూన్యులనియు, సకల దుర్గుణములకు -నివాస స్థలమనియు గొందరు నిందింతురు. స్త్రీలపయిన మోపబడిన ఈ దోషారోపణములన్నియు నబద్ధములనియు స్త్రీలలో నత్యంత శౌర్యధైర్యవతులును, అసామాన్య విద్యావిభూషితులునూ... బూర్యముండిరనియు, నిపుడున్నారనియూ స్థాపించుట నా మొదటి యుద్దేశము''
2.'' స్త్రీలకు విద్య నేర్పిన యెడలను, వారికి స్వాతంత్య్రమోసగిన యెడలను, వారు చెడిపోవుదురనియు, బతుల నవమానించెదరనియు, గుటుంబ సౌఖ్యమును నాశనము చేసేదరనియు గొందరు మహానుభావులు వక్కాణించెదరు. ఈ యారోపణములన్నియు నిరర్థకములనియు, స్త్రీవిద్య దురాచార ప్రతీకారానుకూలమగునే కాని దురాచార ప్రవృత్త్యనుకూలము గానేరదనియు స్త్రీ విద్యా స్వాతంత్య్రముల వలన దేశమునకు లాభమే గాని నష్టముంగలుగనేరదనియు, స్త్రీ విద్య యత్యంతావశ్యకంబనియు సోదాహరణ పూర్వకంగా నిరూపించుట నా ద్వితీయోద్దేశ్యము'' అని రాసుకున్నారు అచ్చమాంబ.
 'అబలా సచ్చరిత్ర రత్నమాల' గ్రంధంలో భారతదేశంలో వివిధ రంగాలలో ప్రసిద్ధులైన 34 మంది స్త్రీల సంగ్రహ చరిత్ర వుంది. ఒక్కొక్క స్త్రీ గురించి వివరిస్తూ అచ్చమాంబ తాను ఉపోద్ఘాతంలో రాసుకున్న తన ఉద్దేశ్యాలను బల పరుచుకుంటూ రాయడం కన్పిస్తుంది.
ఈ గ్రంధంలోని మొట్ట మొదటి కథ వీరమతి గురించి వుంది. ఈ కథా ప్రారంభం ఇలా వుంది.
 ''స్త్రీయ...స్తధా...'' ఈ సంస్కృత శ్లోకానికి అర్థం పురుషుల వలె ధైర్యము నవలంభించి, భీతి చెందక సర్వ కార్యములను నిర్వహంచునటుల స్త్రీలకు విద్య నేర్పవలయును.''
అచ్చమాంబ ఏది రాసినా సమయానుకూలంగా స్త్రీలకు విద్య ఎంత అవసరమో, విద్య లేకపోతే స్త్రీలు ఎలా వెనుకబడిపోతారో సోదాహరణంగా చెబుతుంది.
 మన దేశంలో ఆడపిల్లల్ని హీనంగా, తక్కువ చేసి చూడడం గురించి అచ్చమాంబ ఎపుడూ బాధపడుతుండేది. అబలా సచ్చరిత్ర రత్నమాల గ్రంధంలో ప్రముఖ కవయిత్రి తోరుదత్తు గురించి రాస్తూ, తోరూదత్తు తండ్రి ఆమెను పుత్రునివలె పెంచడం గురించి, చదువు చెప్పించడం గురించి ఇలా అంటుంది.
''పుత్రికలను పుత్రుల వలె జూచుటయే శాస్త్ర ధర్మం. కన్యా వివాహ సమయమందు దండ్రి ''పుత్రవత్పాలితామయా'' ''పుత్రునివలె నాచే పెంచబడిన కన్య'' అని చెప్పుట సర్వసిద్ధమే కదా''!
 ఆడపిల్లలను పుట్టిన దగ్గర నుండి వివక్షతో పెంచడం గురించి అదే వ్యాసంలో
 '' మన దేశమునందు బాలికలను బాలురకంటే నతి నీచముగా జూచుట మిక్కిలి ఖేధకరముగా నుండక మానదు. ఆడపిల్ల పుట్టిన నాటి నుండియు దలిదండ్రులు మిక్కిలి ఖేధముతో నుండెదరు. పెద్ద పెరిగిన కొలది పుత్రికలను పుత్రులవలె జూడక యెటులనైన బెంచవలయునని పెంచుదురు... ఈ దేశములోని యాడు పిల్లలలో నూటికి తొంబది తొమ్మండ్రు బాలికలు నేను చెప్పిన ప్రకార మత్యంతా లక్ష్యముతో బెంచబడుతున్నారనుటకు సందేహం లేదు.'' అంటుంది.
లింగవివక్ష పుట్టుక నుంచే ప్రారంభమౌతుందని ఈ వివక్ష వల్లనే బాలికలకు అత్యంత దురవస్థ ప్రాప్తించిందని వాపోతుంది అచ్చమాంబ.
 జ్యోతిశ్శాస్త్రంలో అద్వితీయ ప్రతిభావంతురాలైన ''ఖనా'' అనే స్త్రీ గురించి రాసిన వ్యాసంలో కూడా తల్లిదండ్రులు పక్షపాతంలో ఆడపిల్లలను ఎలా నిర్లక్ష్యం చేస్తారో రాస్తూ స్త్రీలు స్వతహాగా తెలివి లేనివారుగా పుట్టరని వారి పెంపకమే వారినలా తయారు చేస్తుందని వాదిస్తుంది.
'' బాలుడు చిన్నతనమునందెంత మందబుద్దియైనను వానికైదేండ్లు రాగానే తల్లి దండ్రులు విద్య నేర్పి వానికిగల మాంద్యమును వదిలించి జ్ఞానాభివృద్ధికొరకనేక శాస్త్రములను జదివింతురు...చిన్ననాడు వానికంటే విశేష ప్రజ్ఞ గల వాని యక్క మాత్రము విద్యాగంధమేమియు లేనందున మహా మూర్ఖశిరోమణియై యుండును. ఇట్లు తల్లిదండ్రులు పక్షపాతముచే బురుష సంతతిలోను స్త్రీ సంతతిలోను జ్ఞానమును గురించి మహదంతరము పడినదే గాని స్త్రీల స్వాభావిక మౌర్ఖ్యము వలన కాదు''.
కుటుంబంలో స్త్రీల అణిచివేత స్వరూపం గురించి ఇంత చక్కగా, స్త్రీ చైతన్యంతో మాట్లాడిన అచ్చమాంబ, ఆ అణిచివేతను ఎదుర్కొనాలంటే స్త్రీలకు విద్య అత్యంతావశ్యకమని వీలు చిక్కినపుడల్లా చెబుతుండేది. జండర్‌ వివక్ష కుటుంబంలో ఎలా మొదలవుతుందో, ఈ వివక్ష వల్ల స్త్రీలు ఎలా అణిచివేయబడి, తెలివి తక్కువ వారుగా , శక్తి లేనివారుగా ప్రచారం చేయబడతారో విశ్లేశిస్తూ అచ్చమాంబ ఆ రోజుల్లోనే రాయడం ఆశ్చర్యమన్పిస్తుంది.
 స్త్రీలకు విద్య అందకుండా చేసిన దుర్మార్గాల గురించి ఒక వైపు రాస్తూ, వారి మీద విరుచుకు పడుతూ మరో వైపు భార్యాభర్తల సంబంధం గురించి, భార్యల్ని గదుల్లో మూసిపెట్టే భర్తల గురించి రాయడం కన్పిస్తుంది.
 ఆదిశంకరుని సమకాలికురాలు, న్యాయ, మీమాస, వేదాంత శాస్త్ర పారంగతురాలు, తన వాదనతో ఆదిశంకరుని ఎదుర్కొనిన విదూషీమణి అయిన సరసవాణి గురించి రాసిన వ్యాసంలో పురుషులు స్త్రీలకు చేసిన అన్యాయాల గురించి దుయ్యబడుతుంది అచ్చమాంబ.
''మానవ దేహమున కలంకారమయిన విద్యభూషణము వారికి లేకుండ చేసి లోహపు నగలను మాత్రము పెట్టి తమ వేడుక నిమిత్తమయి వారిని తోలుబొమ్మల వలె జేయుచున్నారు. వారిని గృహ యజమానురాండ్రుగా జూడక తమ యుపచారము నిమిత్తమయి దాసులనుగా జేయుచున్నారు. పురుషులు స్త్రీల విషయమున జేసినయిట్టి యన్యాయము వలన స్త్రీలను మూఢురాండ్రనుగా జేసి చెడగొట్టుటయే కాక తామును వారికి తోడిపాటుగా మూర్ఖ శిరోమణులయి జెడిపోవుచున్నారు. ఈ స్థితి యంతయు పురుషుల లోపమువలనను, స్వప్రయోజనపరత్వం వలనను గలుచు చున్నదే కాని స్త్రీల దోషము వలనను మాత్రము గాదు.''
స్త్రీల స్థితి దిగజారిపోవడానికి పురుషులే కారణమని స్త్రీలను ఇళ్ళలో బంధించి తమ సేవ కోసం వాళ్ళను బానిసలుగా తయారు చేసారని చాలా ఘూటుగా విమర్శించిన అచ్చమాంబను పురుషద్వేషి అని ఆ రోజుల్లో ఎవరూ అనకపోవడం విచిత్రమే.
 అసలు ఈ గ్రంధానికి ప్రారంభంగా ఈమె పేర్కొనిన సంస్కృత శ్లోకం ఒక్కటి చాలు ఈమె ఆలోచనల్ని, దృక్పధాలిన్ని పట్టివ్వడానికి
 '' అరక్షితా గృహే రుద్ధా: పురుషై రాప్తకారిభి:
ఆత్మాన మాత్మనా యాస్తు రక్షేయుస్తాస్సురక్షితా:''
'' ఆప్తులైన పురుషులచే గృమమున నిర్భంధింపబడు స్త్రీలు సురక్షితురాండ్రు కాదు. ఏ స్త్రీలు తమ యాత్మను తామే కాపాడుకొందురో వారే సురక్షితరాండ్రు''.
ఆప్తులైన పురుషులంటే తండ్రి, అన్నదమ్ములు, భర్త మొదలైన వారు. వీళ్లు ఆప్తులే. ఆత్మీయులే. అయితే స్త్రీలని ఇంట్లో నిర్బంధించడానికి అందరూ సిద్ధమే. వాళ్లని అణిచివేస్తూ, ఎదగనీయకుండా అడ్డుకుంటూ, ఇంట్లో బంధిస్తూ వాళ్ళని రక్షిస్తున్నామని భావిస్తారు. అది రక్షణ కాదని, ఆప్తులు రక్షణ పేరుతో చేసేది నిర్భంధమని చెపుతూ, స్త్రీలు తమ ఆత్మని తామే కాపాడుకోవాలని, అపుడు మాత్రమే వారు సురక్షితులని అచ్చమాంబ రాసారు. అచ్చమాంబ ఆలోచనలు చాలా నిశితంగా, సూటిగా వుండేవి. తనేం రాస్తుందో ఆ అంశం పట్ల చాలా స్పష్టత వుంటుంది. స్త్రీలు స్వయం సిద్ధ్దలు కావాలని, తమను తామే రక్షించుకోవాలని ఎవరి మీదా ఆధారపడకూడదని తన అబలా సచ్చరిత్ర రత్నమాలలో రాసిన అచ్చమాంబ ఇతర రచనలను కూడా పరిశీలిద్దాం.
అచ్చమాంబ రాసిన వ్యాసాలు, పద్యాలు ఇతర రచనలు ఎక్కువగా 'హిందూసుందరి', 'సరస్వతి' అనే పత్రికలో ప్రచురించబడ్డాయి.
 హిందూసుందరిలో 1903 జూన్‌ నెల సంచికలో అచ్చమాంబ గారి రచన '' ఊనీలి తీరిజీరీశి ఖిరిరీచీతిశిలి ళితీ గీరితీలి '', 'దంపతుల ప్రధమ కలహము'పేరుతో ఒక రచన ప్రచురితమైంది. ఇందులో ఒక చిన్న విషయమై భార్యా భర్తలకు గొడవ జరుగుతుంది. భార్య కోపంతో పుట్టింటికి వెళ్ళిపోతుంది. భార్యకు, ఆమె అమ్మమ్మకు జరిగిన సంభాషణలో అచ్చమాంబ భార్య చేత ఈ వాక్యాలు పల్కిస్తుంది.
 ''నేను పెండ్లాడిన భార్యను గాని దాసిని గాను. వివాహమాడుట వలనను భర్తకు దాసినగుదునా ఏమి? గృమయజమానురాలిగా నెంచి, మన్నించి ప్రేమించవలయును గదా! అట్లు చేయక యిచ్చవచ్చిన పనులన్నియు నన్ను సేయమనిన నేను జేయుదునా ఏమి''.
 ''వివాహము కాగానే మేము గృహిణీ పదమున కర్హురాండ్రమగుదుమే కాని ధనమిచ్చి కొన్న బానిసలము కాము. మా వంటి పత్నులు పురుషుల యహంభావమునెంత మాత్రమును సహింపజాలరు.''
భార్యాభర్తల సంబంధంలోని అసమానత్వాన్ని పురుషుల అహంకారాన్ని స్పష్టంగా అర్థం చేసుకుంటే గాని ఇలాంటి వాక్యాలు రాయడం సాధ్యం కాదు. అచ్చమాంబ జీవించిన నాటి పరిస్థితుల్ని గణనలోకి తీసుకుని ఆలోచిస్తే తప్ప ఆమెకు గల చైతన్యపు స్థాయి అర్థం కాదు.
 అలాగే ''విద్యావతులగు యువతుల కొక విన్నపము'' వ్యాసంలో ఆడపిల్లలకు విద్య నేర్పించడం ఎంత అవసరమో, ఆడపిల్లల్ని చదివించడానికి తల్లి దండ్రులు ఏం చేయాలో చాలా వివరంగా చర్చిస్తుంది. స్త్రీలు తమ గురించి తాము ఊపేక్ష చూపరాదని, పాఠశాలల్లో మగ టీచర్లే వుండడం వల్ల బాలికా విద్య కుంటుపడుతుందని, మహిళా టీచర్ల అవసరం గురించి చెబుతూ దీనికి పరిష్కారంగా
''స్త్రీ లందఱొక జట్టుగా గూడి తమలో వొకరి యింట పాఠకాలను స్థాపించి, అచటకే యందఱును పోయి నేర్పునట్టును, మనలో నొకరికి యిబ్బంది కలిగినపుడు వారి పనిని గడమ వారందఱు నిర్వహించునట్టును తమలో తాము నియమించుకొని తప్పక పనిచేయుచుండ, స్త్రీ విద్య నభివృద్ది గావింపగలిగి తమ కాలమును, జన్మమును సార్థకములగునటుల జేసెదరు'' అంటూ రాసింది. (హిందూసుందరి,1903 జూన్‌)
 అంతేకాదు చదువుకున్న స్త్రీలు గ్రామ గ్రామాన పాఠశాలలు ప్రారంభించి బాలికలందరికి చదువు చెప్పాలని, విద్యా సంపన్నులగు వారు ఆ విద్యా ధనమును తామే అనుభవించక తమ జాతి వారందరికి పంచి పెట్టడానికి పాటు పడాలని పిలుపు నిస్తూ అచ్చమాంబ ఎంతో ఉత్తేజకరంగా స్ఫూర్తిదాయకంగా ఈ వ్యాసాన్ని రచించింది. తన తోటి స్త్రీల విద్య లేమి పట్ల ఆర్తి, ఆవేదన ఈ వ్యాసం నిండా పరుచుకుని వుంది.
 'స్త్రీల విద్య యొక్క ప్రభావం' అనే వ్యాసంలో అచ్చమాంబ రాసిన విషయాలు మిక్కిలి ఆశ్చర్యకరముగా వున్నవి. ఇలాంటి ప్రాంతం భూ ప్రపంచం మీద వున్నదా లేక అచ్చమాంబ ఊహశక్తితో ఈ విషయాలు రాసిందా అన్పిస్తుంది.
 '' అయిస్‌ లండన్‌ ద్వీపమున స్త్రీ పురుషులందఱు సమానంగా విద్యను గాంతురు. అచట రాజకీయ హక్కులన్నియు స్త్రీ పురుషులకు సమానముగా నియ్యబడును... అచట విద్యాశాఖవారందరు స్త్రీలే...జనరక్షణమంతయు నచట నాడువారే చేయుచుండినందున..నిచట కారాగౄహముగాని, పోలీసుగాని లేరు. సైన్యము లేదు. న్యాయస్థానములు లేవు. ఇది యంతయు స్త్రీ విద్యా ప్రభావమే కదా? యితర దేశములందిట్టి దృష్టాంతములగుపడుచుండగా మన దేశమునందింకను కొందఱు స్త్రీలకు విద్య నేర్పవచ్చునా? లేదా? యని వాదించుచునే యున్నారు''. (హిందూ సుందరి 1902 ఆగష్టు నెల)
స్త్రీలు విద్యావంతులైతే దేశానికి ఎంత లాభం కలుగుతుందో నొక్కి చెప్పడానికి అచ్చమాంబ ఇంత అద్భుతమైన ఊహాప్రదేశాన్ని ఆవిష్కరించిందని నేను భావిస్తున్నాను. ఎందుకంటే జైళ్లు, పోలీసులు, సైన్యం లేని దేశం ప్రపంచంలో ఎక్కడా వుండదు. అపూర్వమైన అచ్చమాంబ ఊహశక్తికి నిదర్శనంగా దీనిని అర్థం చేసుకోవాలి.
 భండారు అచ్చమాంబ రచనల గురించి ఇలా రాసుకుంటూ పోతే ఒక గ్రంథమే అవుతుంది. ఆమె రచనలన్నింటిని సేకరించి విశ్లేషణాత్మకత అధ్యయనం చేయాల్సిన అవసరం చాలా వుంది.
 అచ్చమాంబ గురించి ఊటుకూరు లక్ష్మీకాంతమ్మ తన ''ఆంధ్రకవయిత్రులు'' గ్రంథంలో
''బాల్యమునందంత విద్యావతి కాకున్నను స్వయంకృషిచే శాస్త్రములను, సంస్కృత కావ్యములను శ్రుతి స్మృతులను గూడ నర్థం చేసికొను శక్తిని సంపాదించింది. మహా రాష్ట్రాంగ్ల భాషలలో కూడా పండిత యయ్యెను.
చరిత్ర రచనయనిన మగవారికే మిక్కిలి కష్టతరము కదా. అట్టి యెడ స్త్రీలలో ప్రథమంగా చరిత్రను రచించి చక్కగా రచన నిర్వహించినదను ఖ్యాతి పొందినది. స్త్రీలలో చరిత్ర రచించిన ప్రథమ గౌరవమీమెదే'' అని రాశారు. ఊటుకూరు లక్ష్మికాంతమ్మ స్త్రీ కాబట్టి అచ్చమాంబను ప్రప్రధమ చరిత్రకారిణిగా గుర్తించింది.
 1902లో ఓరుగంటి సుందరీ రత్నమాంబతో కలిసి మచిలీ పట్నంలో మొదటి మహిళా సమాజం ''బృందావన స్త్రీల సమాజం''ను స్థాపించిన ఘనత కూడా అచ్చమాంబకే దక్కుతుంది.రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి ఎన్నో స్త్రీల సంఘాలు ఏర్పడటానికి కృషి చేసింది. అనాధ పిల్లల్ని చేరదీసి చదువు చెప్పించేది ఆమె ఇంట్లో ఎపుడు ఐదారుగురు పిల్లలుండి చదువుకుంటూ వుండేవారు.
 1905 జనవరి 18వ తేదీన అతి చిన్న వయస్సులో ముఫ్ఫైఏళ్ళకే అచ్చమాంబ మరణించింది. ''కీర్తిశేషురాలగు శ్రీమతి భండారు అచ్చమాంబగారు'' శీర్షికతో హిందూసుందరి పత్రిక ''అన్యులకు మేలు చేయ నీ యతివ బుట్టె''నని ''సుందరి పత్రికకు మాతృవియోగము కలిగినదని'' పేర్కొంటూ ఐదు పేజీల నివాళిని ప్రచురించింది.
 ఈ విధంగా భండారు అచ్చమాంబ ఆధునిక సాహిత్య చరిత్రలో సుస్థిరంగా నిలిచి పోయింది. చిన్నతనంలో ఏమి చదువుకోకపోయినా, స్వయం కృషిితో వివిధ భాషల్లో పాండిత్యం సంపాదించింది. వ్యక్తిగత జీవితంలో సంభవించిన విషాదకర సంఘటనలకు ఆమె కుంగి పోలేదు. చిన్న వయసులో కుమారుడు, కుమార్తె మరణించడం ఆమెకు తీవ్రమైన దు:ఖాన్ని కల్గించింది. ఇంతటి దు:ఖంలో కూడా కుప్ప కూలి పోకుండా, పట్టుదలతో 'అబలా సచ్చరిత్ర రత్నమాల' గ్రంధాన్ని రచించింది. 1903లో దేశమంతా పర్యటించినపుడు పండితులతో, మేధావులతో చర్చించి పురాణ కాలపు స్త్రీల గురించిన సమాచారాన్ని సేకరించింది. తన రచనలన్నింటి నిండా స్త్రీవిద్య ఆవశ్యకత గురించి ప్రస్తావిస్తూ, స్త్రీ ఉద్యమాన్ని నిర్మించడానికే , ప్రోత్సహించడానికే తన రచనలను ఉపయోగించింది.
 చైతన్య వంతమైన జీవనశైలితో అభ్యుదయకరంగా, స్త్రీల జీవితాల్లో మార్పు కోసం అహరహం శ్రమించిన అచ్చమాంబ జీవితం అతి చిన్న వయసులోనే ముగిసిపోవడం నిజంగా మన దురదృష్టమే. ఆమె కనుక పూర్తి జీవితం జీవించి వుంటే అమూల్యమైన గ్రంధాలనెన్నింటినో రచించి వుండేది. స్త్రీవాద ఉద్యమం ఆమె స్ఫూర్తితో ఆనాడే ప్రారంభమై వుండేదేమో???
 తెలుగు సాహిత్యంలో మొట్ట మొదటి కథకు శ్రీకారం చుట్టిన అచ్చమాంబ, ప్రధమ స్త్రీవాద చరిత్ర కారిణి అచ్చమాంబ నూరేళ్ళ క్రితమే అభ్యుదయకరంగా స్త్రీవాద స్పృహతో రచనలు చేసింది.
నిజంగా కె. లలిత అన్నట్లు ఆధునిక చరిత్రలో మనకు ప్రోత్సాహాన్ని ఇచ్చేటటువంటివి, మనం గర్వించదగినటువంటి నమూనాల కోసం వెతుక్కోవాలంటే మొట్ట మొదట కన్పించేది అచ్చమాంబ.
 1874 సంవత్సరంలో పుట్టిన అచ్చమాంబ శత జయంతి ఉత్సవాన్ని, భారతదేశంలో స్త్రీల ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసి పడిన 1974 ప్రాంతంలో మనం సెలబ్రేట్‌ చేసుకోలేక పోయినా కనీసం అచ్చమాంబ చనిపోయి వందేళ్ళు నిండిన సందర్భంలో ఆమెను ఈ విధంగా గుర్తు చేసుకోవడం నాకు అత్యంత విషాదంగాను అదే సమయంలో సంతోషంగాను, గర్వంగాను వుంది.
( నవంబరు 2003, 29,30 తేదీలలో తెలుగు విభాగం, యూనివర్సిటీ ఆర్ట్స్‌ ఞ సైన్స్‌ కళాశాల, కాకతీయ యూనివర్సిటీ, వరంగల్‌ వారి ఆధ్వర్యంలో జరిగిన యు.జి.సి జాతీయ సదస్సులో (''జండర్‌ స్పృహ '' ఆధునిక తెలుగు సాహిత్యంలో ప్రతిఫలనాలు) సమర్పించిన ప్రసంగ వ్యాసం.)

ఈ వ్యాసం రాయడానికి నాకు ఉపకరించిన పత్రికలు

1. అబలా సచ్చరిత్ర రత్నమాల -భండారు అచ్చమాంబ
2. ఆంధ్రకవయిత్రులు - ఊటుకూరు లక్ష్మీకాంతమ్మ
3. హిందూ సుందరి పత్రికలు
4. భూమిక స్త్రీవాద పత్రిక
5. తెలుగు కథకులు -కథన రీతులు
సంపాదకులు: సింగమనేని నారాయణ, మధురాంతకం రాజారామ్‌
7.తొంభై ఏళ్ల తెలుగు కథ -పెద్దిభోట్ల సుబ్బరామయ్య, భమిడిపాటి జగన్నాధరావు
8.కథా శిల్పం -వల్లంపాటి వెంకట సుబ్బయ్య
 9.నూరేళ్ళ పంట, రచయిత్రుల కథా సంకలనం -డా. భార్గవీరావు
10. 20 వ శతాబ్ది రాజకీయార్థిక పరిణామాలు తెలుగులో స్త్రీల సాహిత్యం - సంపాదకత్వం కాత్యాయనీ విద్మహూే
11.20 వ శతాబ్దంలో తెలుగు రచయిత్రుల రచనలు
 సంకలనం: అబ్బూరి ఛాయాదేవి

12.WOMEN WRITING IN INDIA 600 BC to the present Volume 1:
 600 BC to the early 20 th Century

Sunday, June 14, 2009

సబర్మతిలో బావురుమంటున్న 'బా' గది!

  గుజరాత్‌లో అడుగుపెట్టగానే మానుతున్న గాయాన్ని ఎవరో కెలికినట్టయింది. మాకారు వడోదర మీదుగా వంద కిలోమీటర్ల వేగంతో ( ఎక్స్‌ప్రెస్‌ వేలో) పరుగెడుతున్నా ఏవో ఆర్తనాదాలు, అరుపులు, కేకలు చెవులపడుతున్నట్లే వుంది. గుజరాత్‌ గాయం అంత త్వరగా మానేది కాదు. ఈ బాధ గుండెల్ని పిండుతుండగానే మేం అహమ్మదాబాద్‌ చేరాం. అహమ్మదాబాద్‌లో అవీ ఇవీ చూశాక, కస్తూర్భా, గాంధీజీ చాలాకాలం నివసించిన సబర్మతీ ఆశ్రమం చూడ్డానికి వెళ్ళాం. గాంధీ జీవిత విశేషాలన్నీ వివరంగా రాసివున్న ఎగ్జిబిషన్‌ చూశాం. ఆయన జీవితంలో చోటు చేసుకున్న ప్రముఖ ఘట్టాలన్నింటినీ ఈ ప్రదర్శనలో చూపించారు. గాంధీజీ గదిలో ఆయన వడికిన రాట్నం చెక్కుచెదరకుండా వుంది. ఆయన కళ్ళజోడు, చేతికర్ర, చెప్పులు లాంటి వస్తు వులన్నింటినీ అద్భుతంగా అమర్చి ప్రదర్శనలో వుంచారు. అత్యంత నిరాడంబరుడైన వ్యక్తి వాడిన వస్తువులన్నీ అంతే సాదాసీదాగా వున్నాయి.
  ఒక్కొక్క గది చూసుకుంటూ వెళుతుంటే ' కస్తూర్భా గాంధీ గది' అని బోర్డు పెట్టి వున్న గది కనబడింది. ఆవిడకు చెందిన వస్తువులేమున్నాయో చూద్దామని ఆతృతగా గదిలోకి అడుగుపెట్టిన నేను అవాక్కై అలాగే నిలబడిపోయాను. 'కస్తూర్భా గాంధీ గది' అని తలుపుమీద రాయడం మినహా, ఆ ఒక్క చెక్కముక్క తప్ప ఆ గదిలో చిన్న పుల్ల ముక్క కూడా లేదు. కనీసం ఆ త్యాగమూర్తి ఫోటో కూడా ' ఆమె గది' లో లేదు. ఆవిడ వాడిన వస్తువులు , ఆమె ఇష్టపడిన సరంజామా కానీ ఆ గదిలో లేవు. ఖాళీ గది. బోసిపోయి బావురుమంటున్న గది. ' బా' రాట్నం వడికారు. అదేమైందో మరి? గాంధీజీ వస్తువుల్లాగా ఆమె ఉపయోగించిన వస్తువులు ఎన్నో వుండి వుంటాయి. అవన్నీ ఎక్కడ పారేసారో మరి?
  ఆ గదిని చూడగానే నాకు పట్టరాని కోపం వచ్చింది. బాధ కలిగింది. దుఃఖం తన్నుకొచ్చింది. ఒక పెద్ద ఉద్యమానికి సారథ్యం వహించిన వ్యక్తితో కలిసి బతికి, ఎన్నో కష్టాలు పడి, అతను ఏడిస్తే ఏడ్చి, నవ్వితే నవ్విన ఓ వ్యక్తికి ఇచ్చిన గౌరవం ఎంత గొప్పగా వుందో చూస్తే గుండె చెరువవకుండా ఎలా వుంటుంది? జాతి మొత్తానికి పితృసమానుడుగా భావిస్తూ ' జాతిపిత'గా గాంధీజీని గౌరవిస్తామే! మరి, ఆ 'జాతిపిత' సహచరి ' జాతి మాత' కాదా? బారతీయులందరికీ గాంధీజీ పితృ సమానుడైతే కస్తూర్బా మాతృసమానురాలు కాదా? అయితేనేం, పితృస్వామ్య వ్యవస్థలో బతుకుతున్నాం కదా! అక్కడ తండ్రులకే గౌరవం. తల్లులకి ప్రత్యేక గౌరవాలక్కరలేదు అంటారు కాబోలు.
  నేను 'బా'కి జరిగిన అన్యాయం మీద ఎమోషనల్‌గా మాట్లాడుతుంటే ' ప్రతి చిన్న విషయానికి ఎందుకు వంకలు పెట్టడం? ప్రతిదాంట్లోకీ మీ ఫెమినిజం రావాల్సిందేనా? అనే కామెంట్‌ పుండుమీద కారం జల్లినట్లయింది. చరిత్ర పొడుగునా స్త్రీలకి ఎంత అన్యాయమైనా జరగనీ... మనం ప్రశ్నించకూడదన్నమాట. దుఃఖాన్ని వ్యక్తం యెయ్యడం అరవడం కిందకు వస్తుందన్నమాట. ఇంకో గమ్మత్తయిన విషయం ఏమిటంటే, కస్తూర్భాకి జరిగిన అన్యాయం గురించి ప్రశ్నించడం గాంధీజీ పట్ల అపచారంగా ప్రచారమైనా ఆశ్చర్యపడనక్కరలేదు.ఎందుకంటే, తెలుగులో తొలికథ రాసింది భండారు అచ్చమాంబ అని సప్రమాణకంగా నిరూపించడం, గురజాడకి జరిగిన అవమానంగా కొందరు వ్యాఖ్యానించడం నాకు తెలుసు. గాంధీజీతో సమానంగా కస్తూర్బాకి గౌరవం ఇవ్వకపోవడాన్నీ, ఆమెకు సంబంధించిన చరిత్రని అందుబాటులో లేకుండా చేయడాన్నీ ఎవ్వరూ ప్రశ్నించకూడదు. గాంధీతో ఆవిడ కలిసివున్న ఫోటోలు బోలెడు వున్నాయిగా. ఇంకా ఈ ఏడుపెందుకు? అని ఒకాయన అన్నాడు కూడా.
 మాతో వచ్చిన ఇంకొకాయన ' మీరు కస్తూర్భాని గాంధీజీ నుంచి విడదీసి ఎందుకు చూస్తున్నారు? షీ ఈజ్‌ పార్ట్‌ ఆఫ్‌ గాంధీ కదా! అసలు ఆవిడకు ప్రత్యేకంగా ఓ గది ఎందుకు, మీలాంటి వాళ్ళు పోట్లాడ్డానికి తప్ప' అని కూడా అన్నాడు. అంటే ఆయన దృష్టిలో కస్తూర్బా ఒక వ్యక్తి కాదు. ఆమెకు తనకంటూ వ్యక్తిత్వం లేదు. ఆలోచనల్లేవు. అభిరుచుల్లేవు. గాంధీగారిలో ఒక పార్ట్‌ కనుక ఆయన ఆలోచనలే ఆమెవన్నమాట. ఓహోహో... ఎంత దూరం ఆలోచించి ఆమె గదిని ఒక శూన్యమంటపంలా వుంచారు! నా మట్టి బుర్రకు ఈ ఆలోచన తట్టనేలేదు. వ్యక్తిత్వమే లేనివాళ్ళకి, అసలు ఒక ఉనికే లేనివాళ్ళకి ఆమె గది అనీ, ఆమె జ్ఞాపకచిహ్నాలు అనీ వెతకడం నాలాటి ఆజ్ఞానులే చేస్తారని ఆ మిత్రుడు తేల్చిచెప్పాడు.
 నాకు హఠాత్తుగా 'అనూరాధ' అనే అద్బుతమైన సినిమాలోని ఒక డైలాగు గుర్తుకొచ్చింది. లీలానాయుడు ( హీరోయిన్‌) బలరాజ్‌ సహానీ ( హీరో) ని ఓ సందర్బంలో - ' నువ్వు నీ డాక్టర్‌ గిరీ తప్ప నన్ను గురించి పట్టించుకుని ఎంతకాలమైంది? నా పాటవిని ఎన్ని రోజులైంది? నా ఆశలూ, అభిరుచులూ ఏమైపోయాయో ఆలోచించావా? ' అని అడుగుతుంది. బలరాజ్‌ సహానీ ఆశ్చర్యపోయి, చాలా అమాయకంగా ' నీ ఆశలూ, అభిరుచులూనా? నీకు వేరే ఆశయాలూ, ఆశలూ వున్నాయని నాకు తెలియదే! నేను నిన్నెప్పుడూ నానుంచి విడదీసి చూడలేదు.నువ్వు నాలో ఐక్యమైపోయావనుకున్నాను' అంటాడు - నిజాయితీగానే.
 పైన పేర్కొన్న మితృడి వ్యాఖ్యానం కూడా దీనికిందకే వస్తుంది. చరిత్రకారులది కూడా ఇదే ధోరణి. చరిత్ర పుటల్నిండా పురుషులు, వారి వీరత్వాలు, శూరత్వాలు, ఎంతమంది భార్యలు, ఎంతమంది సంతానాలు... ఇవే వుంటాయి ఈ పురుష చరిత్రల్లో జనాభాలో సగం వుండే స్త్రీలుండరు. వారి జ్ఞాపక చిహ్నాలూ వుండవు. దీనికి 'జాతిమాత' కూడా మినహాయింపు కాదని సబర్మతీ ఆశ్రమం చూసాక అర్థమైంది.
 గాంధీజీని పెళ్ళి చేసుకుని, ఓ మహోద్యమంలో తనవంతు కృషి చేసి, ఎన్నో బాధలు పడి, ఆయన చేసిన ప్రయోగాల నేపథ్యంలో ఎంతో మానసిక సంఠర్షణను అనుభవించిన కస్తూర్భాకి మనమిచ్చిన గౌరవం ఒక ఖాళీ గది. కనీసం ఆమె ఫోటోకైనా నోచుకోని ఓ శూన్యగది. గాంధీజీతో పాటు ఆమెకూడా కళ్ళజోడు పెట్టుకుంది.చెప్పులు వేసుకుంది. రాట్నం వొడికింది. కర్ర కూడా వుండే వుంటుంది. కానీ అవేవీ అంత విలువైనవి కావు. గౌరవవార్హమైనవి కావు. ప్రదర్శించాల్సినంత 'పవిత్రమైనవి' కావు. వేల సంవత్సరాలుగా స్త్రీలకు జరిగిన అన్యాయమే 'బా'కు కూడా జరిగింది. ప్రపంచం ' మహాత్మునిగా' కొనియాడే వ్యక్తికి భార్య అవుగాక, వ్యక్తిత్వం తొణికిసలాడే సంపూర్ణ మానవి అవుగాక, అయితేనేం, ఆమె స్త్రీ మాత్రమే. గాంధీగారి నీడ మాత్రమే. దీనినే అక్షరాలా ఆచరించి చూపించారు సబర్మతీ ఆశ్రమ నిర్వాహకులు.

Saturday, June 13, 2009

తుపాకీ మొనపై వెన్నెల

  క్రితం సంవత్సరం జమ్మువెళ్ళి వచ్చిన దగ్గరి నుంచి శ్రీనగర్‌ చూడాలనే కోరిక మరింత బలపడసాగింది. మేం శ్రీనగర్‌ ప్రోగ్రామ్‌ వేసుకోగానే ఎక్కువమంది నిరుత్సాహపరిచారు.ముందే అక్కడ శాంతి భద్రతల సమస్య వుంది దానికి తోడు ఎన్నికలు కూడా జరుగుతున్నాయి. శ్రీనగర్‌కు వెళ్ళడం మంచిది కాదు అని సలహా ఇచ్చారు. అయిన మేం వెళ్ళడానికే నిర్ణయించుకున్నాం.
  మే ఒకటవ తేదీన ఢిల్లీలో దిగగానే పిడుగులాంటి వార్తను మోసుకొచ్చారు ప్రొటోకాల్‌ అదికారులు. ఏప్రిల్‌ 26 నుంచి వరసగా నాలుగు రోజులు శ్రీనగర్‌లో వర్షాలతో పాటు, విపరీతంగా మంచు కురిసిందని, లేకు వెళ్ళే రోడ్లు మంచుతో నిండిపోవడం వల్ల ముసేసారని ఆ వార్త సారాంశం. శ్రీనగర్‌, సిమ్లా, కులు,మనాలి ప్రాంతాల్లో మంచు కురస్తుండడం వల్ల అక్కడికి విమాన సర్వీసులు రద్దయ్యాయని కూడా చెప్పారు. ప్రాణం ఉస్సురంది. మాతోపాటు శ్రీనగర్‌ ప్రోగ్రామ్‌ పెట్టుకున్న మరొకరు వాళ్ళ ప్రయాణం కాన్సిల్‌ చేసుకున్నారు. ఢిల్లీలో రెండు రోజులు గడిపాక మే మూడో తేదీన ఉదయం తొమయ్మిది గంటల ఫ్లయిట్‌కి మేం శ్రీనగర్‌ వెళ్ళాల్సి వుంది.
 రెండో తేదీ సాయంత్రం నా బెంగాలీ మిత్రురాలు ఉత్పల వాళ్ళింటికి వెళ్ళాం. మాటల సందర్భంలో ఉలన్‌ దుస్తులు తీసుకెళుతున్నారా అని అడిగింది ఆమె. నేను ఒక షాల్‌ మాత్రమే తీసుకెళుతున్నానని చెప్పాను. శ్రీనగర్‌, లే వెళుతూ ఒక్క షాల్‌ సరిపోతుందనుకున్నావా అంటూ తన దగ&గరున్న ఉలెన్‌ బట్టలన్నీ ఓ సూట్‌కేస్‌ నిండా సర్ది ఇచ్చింది. రెండు లాంగు కోటులు, మంకీక్యాప్‌లు, షాక్సులు, గ్లౌజులు, స్వెట్టర్‌లు చూసి ఇవన్నీ ఎందుకని నేను నవ్వితే అక్కడికెళ్ళాక అర్థమౌతుందిలే ఎందుకో అని తనూ నవ్వింది. నిజంగానే లే వెళ్ళాక నాకు బాగానే అర్థమైంది. అవన్నీ తీసుకెళ్ళి వుండకపోతే మేం చలికి గడ్డకట్టుకుపోయేవాళ్ళం.
 ఉత్పల ఇచ్చిన అదనపు సూట్‌కేస్‌తో సహా మూడో తేదీన ఉదయం తొమ్మిది గంటలకు ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌కు వెళ్ళాం. మాతోపాటు కాశ్మీరుకు చెందిన మరొక ఆంధ్రప్రదేశ్‌ జడ్జి, ఆయన భార్య వహీదా కూడా సమ్మర్‌ వెకేషన్‌ కోసం శ్రీనగర్‌ వెళుతున్నారు. శ్రీనగర్‌ ఫ్లయిట్‌ కన్‌ఫర్మ్‌ అయ్యేవరకు నాకు ఆందోళనగానే వుంది. వ్రీనగర్‌లో వాతావరణం మెరుగైందని విమానం బయలుదేరబోతున్నదని తెలియగానే నా సంతోషానికి అవధుల్లేకుండా పోయింది. విమానం గాల్లోకి లేవగానే నా మనసు విమానం రెక్కమీదకెక్కి కూర్చొంది. వెన్నముద్దల్లాంటి మబ్బుతునకల్ని చీల్చుకుంటూ విమానం ఎగురుతోంది. ఓ అరగంట గడిచాక వహీదా నన్ను పిల్చి ఇక్కడ కూర్చో అంటూ కుడివైపు విండో సీట్‌ ఆఫర్‌ చేసింది. ఆ సీట్లో కూర్చుని కిటికీ నుంచి బయటకు చూడగానే అద్భుతమైన దృశ్యం కంటబడింది. మంచుతో కనప్పబడి, సూర్యకాంతికి మెరుసు&తన్న హిమాలయ ఉత్తుంగ పర్వత పంక్తులు. లోతైన లోయలు, సన్నటి నీటి పాయలు ధవళ కాంతులీనుతున్న పర్వత సముదాయాలు మనస్సును పులకరింపచేసాయి. కన్నార్పితే ఏ సౌందర్యం కనుమరుగైపోతుందో అని చేపలాగా అనిమేషనై అలాగే చూస్తుండిపోయాను. కాశ్మీరు లోయలోకి ప్రవేశిస్తున్నాం అంది వహీదా. కళ్ళను కట్టిపడేసే ఆ ఆకుపచ్చలోయ సొగసును అనుభవించాలి తప్ప మాటల్లో వర్ణించలేం. పచ్చనిలోయ చుట్టూ మే నెల ఎండలో మెరుస్తున్న మంచు పర్వతాలు. మరో పావు గంటలో విమానం శ్రీనగర్‌ ఎయిర్‌పోర్ట్‌లో దిగింది.
  ఎయిర్‌పోర్ట్‌ నించి బయటకు వచ్చి కారులో కూర్చుని తలుపు వేయబోయాను. ఒక్క అంగుళం కదలలేదు. ఆ తర్వాత తెలిసింది అది బుల్లెట్‌ ఫ్రూఫ్‌ కారని. ఎందుకు బుల్లెట్‌ ఫ్రూఫ్‌ కారని అడిగితే ఇక్కడ మిలెటెన్సీ ప్రోబ్లమ్‌ వుంది. సెక్యూరిటీ కోసం తప్పదు అన్నరు. నా వరకు ఆ కారులో కూర్చోవడం ఇష్టంలేకపోయింది. కాని తప్పలేదు. ఎకె 47 పట్టుకున్న పట్టుకున్న పర్సనల్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌ ముందు సీట్లో సెటిల్‌ అయిపోవడం కూడా నాకు ఎంత మాత్రమూ నచ్చలేదు.
  మాకు టూరిస్ట్‌ గెస్ట్‌ హౌస్‌లో బస ఏర్పాటు చేసారు. శ్రీనగర్‌ రోడ్లమీద జనం కంటే పోలీసులు, మిలటరీ వాళ్ళు, బోర్డర్‌ సెక్యూరిటీ వాళ్ళు అడుగడుగునా ఆవరించి కని&పంచారు. మేం గెస్ట్‌ హౌస్‌కి వెళ్ళేలోపు నాలుగైదు చెక్‌పోస్ట్‌లను దాటాం. గెస్ట్‌ హౌస్‌ ఆవరణలో కారు ఆగగానే తలుపుతీయబోయి ఆ ప్రయత్నం విరమించుకున్నాను. ఆవరణలో ఆకాశాన్నంటిన చినార్‌ చెట్లు కారు కలి&పంచిన విసుగును దూరం చేసాయి. చినార& చెట్లు మహావృక్షాల్లా, నిండా ఆకుల్తో చూడ్డానికి ఎంత బావున్నాయో! మాకిచ్చిన రూమ్‌లో అడుగుపెట్టి కిటికీ తలుపు తెరవగానే ఉరవడిగా పారుతున్న నదిమీంచి వచ్చిన గాలి ఉక్కిరిబిక్కిరి చేసింది. అది జీలం నది అని తర్వాత తెలిసింది. చినార్‌ చెట్ల సౌందర్యం, జీలం నది దర్శనం నాలో గొప్ప సంతోషాన్ని నింపినా అడుగడుగునా కప్పించిన పోలీస్‌ మిలటరీ, బి ఎస్‌ ఎఫ్‌ జవాన్లు నాలో మాత్రం చాలా ఆందోళనను కల్గించారు.
  ఆరోజు సాయంత్రం దాల్‌లేక్‌ చూడ్డానికి వెళ్ళాం. హిందీ సినిమా పాటల్లో చూసి ఈ సరస్సు పట్ల అభిమానం పెంచుకున్న వాళ్ళలో నేనూ వున్నాను. షికారీలు, హౌస్‌ బోటులు విస్తారంగా పరుచుకున్న జలరాసి చూడడానికి ఎంతో బావున్నా జీవం లేనట్టుగా, చైతన్యరహితంగా వున్న ఆ పరిసరాలు మాత్రం మనసును మెలిపెట్టాయి. వందల సంఖ్యలో వరసగా కొలువు తీరిన లగ్జరీ హౌస్‌ బోటులు, సరస్సు నలువైపులా బారులు తీరిన షికారీలు మనుష్యులు లేక వెల వెల బోతున్నాయి. దాల్‌లేక్‌లో పన్నెండు వందల హౌస్‌ బోటు లున్నాయని, టూరిస్టులు లేక అన్నీ ఖాళీగా పడివున్నాయని మా షికారీని నడిపిన హమీద్‌ చెప్పాడు. హౌస్‌ బోటుల్లోపల గదులు ఫైవ్‌స్టార్‌ హోటళ్ళలో గదుల్లా అన్ని హంగులతో వున్నాయి. ప్రతి బోటు ముందు దిగులు ముఖాలతో యజమానులు కూర్చునివున్నారు. హమీద్‌ ఫ్లోటింగు గార్డెన్‌ గురించి చెబుతూ గబుక్కున షికారీలోంచి నీళ్ళల్లో ఏపుగా ఎదిగిన గడ్డిమీదికి దూకాడు. గమ్మత్తుగా ఆ గడి&డ లోపలికి కుంగి వెంటనే పైకి లేచింది,. మేం ఆశ్చర్యంగా నోరు వెళ్ళబెట్టాం. ' ఏ పానీకా ఊపర్‌ జమీన్‌' అంటూ నవ్వాడు. దానిమీద టమాటాలు, కీరకాయలు, తరుబూజాలు పండుతాయని చెప్పి మరింత ఆశ్చర్యపరిచాడు. దాల్‌లేక్‌ మధ్య చిన్న ద్వీపం. దాని మీద నాలుగు చినార్‌ చెట్లు వుండే ప్రాంతాన్ని చూపించి దీన్నీ ' చార్‌ చినార్‌' అంటారని చెప్పి అటు తీసుకెళ్ళాడు. చుట్టు పరుచుకుని వున్న మంచు కొండలు దాల్‌లేక్‌ అందాన్ని ద్విగుణీకృతం చేస్తుంటాయి.
 శ్రీనగర్‌లో చక్కటి ఉద్యానవనాలు చాలా వున్నాయి. వీటన్నింటినీ మొఠల్‌ గార్డెన్స్‌ అనే పిలుస్తారు. చష్మీషాహి, పరీమహల్‌, నిషాద్‌, హనూర్‌, షాలిమార్‌. వీటిలో చష్మీషాహి ఉద్యానవనంలో ఓ ప్రత్యేకత వుంది. అక్కడ భూమి నుంచి ఉబికి వచ్చే సహజసిద్ధమైన వాటర్‌ ఫౌంటెన్‌ నుంచి చల్లటి, స్వచ్ఛమైన నీళ్ళు సంవత్సరం పొడుగునా వస్తుంటాయి. ఆ నీళ్ళనే నెహ్రూ తాగేవాడని చెప్పి మాచేత కూడా తాగించారు. ఫ్రిజ్‌లోంచి తీసినట్టు చల్లగా వున్నాయి. మిగతా మొఘల్‌ గార్డెన్స్‌ కూడా చూసాక శ్రీనగర్‌లో ప్రసిద్ధమైన సిల్క్‌ చీరల ఫ్యాక్టరీని చూద్దామని మాతో వచ్చిన వాళ్ళని అడిగాం. మా డ్రైవర్‌ చీకటి పడబోతోందని, ఇంక బయట తిరగడం మంచిది కాదని అడ్డుపడ్డాడు. ఇంకా ఆరున్నర కూడా కాలేదు. అక్కడ ఏడున్నర దాకా వెలుగుంటుంది. ఇప్పుడే రూమ్‌కెళ్ళి ఏం చేస్తాం పోనీ షాపింగుకి వెళదాం అంటే మార్కెట్‌కెళ్ళడం అస్సలు శ్రేయస్కరం కాదని తెగేసి చెప్పాడు. ఏడు కూడా కాకుండానే మమ్మల్ని గెస్ట్‌హౌస్‌లోకి తోసేసి వెళ్ళిపోయాడు.
 మర్నాడు గుల్‌మార్గ్‌ వెళ్ళాలని చాలా తొందరగా తయారైపోయాం. గుల్‌మార్గ్‌ శ్రీనగర్‌కి 57 కిలోమీటర్ల దూరంలో 2730 మీటర్ల ఎత్తులో వుంది. గుల్‌మార్గ్‌ అంటేనే పూల రహదారి. శీతాకాలంలో కురిసిన మంచు జూన్‌, జూలై నెలల్లో కరిగిపోయి పర్వతాలు మొత్తం రంగు రంగుల పూలతో నిండిపోతుంటాయట. మేం వెళ్ళింది మే నెలలో కాబట్టి ధవళ కాంతుల్తో మెరిసే కొండల్ని మాత్రమే మేం చూడగలిగాం. తొమ్మిదింటికి మా డ్రైవర్‌ అన్వర్‌ వచ్చాడు. వచ్చీ రాగానే ' మీరు నిన్న మార్కెట్‌కి వెళదామన్నారు చూడండి, అక్కడే గ్రేనెడ్‌ పేలింది రాత్రి. ఒక మిలటరీ జవాను ఇద్దరు పౌరులు గాయపడ్డారు!'అన్నాడు. 'నిజంగానా' అన్నాను నేను. ' ఇది మాకు అలవాటైపోయింది. మేం గ్రేనేడ్స్‌ మద్య బతకడం నేర్చుకున్నాం' అన్నాడు మనసంతా వికలం అయిపోయింది.
  మా మూడ్స్‌ మళ్ళీ మామూలు అయ్యింది గుల్‌మార్గ్‌ దారిలో పడ్డాకే. దట్టమైన అడవిలోంచి ప్రయాణం అద్భుతంగా వుంటుంది. ఆకాశాన్నంటే ఫైన్‌, దేవదార్‌, పోప్లార్‌ వృక్షాలు. కొండపైకి వెళ్ళే కొద్దీ దగ్గరయ్యే మంచుకొండలు. కొండలమీద అక్కడక&కడ రాత్రి కురిసిన మంచు ముక్కలు. పెద&ద మంచు దిబ్బ మా కారుకు అడ్డు వచి&చంది. అన్వర్‌ దానిమీద నుంచే కారు పోనిచ్చాడు. మెత్తగా జారిపోయింది కారు. అక్కడి నుంచి మంచు మీదే ప్రయాణం. పన్నెండులోపే గుల్‌మార్గ్‌ చేరిపోయాం. ఎక్కడ చూసినా మంచే. కారుదిగి మంచు మీద నడుస్తుంటే ఇది కలా నిజమా అన్నంత అబ్బురమన్పించింది. మంచుతో నిండిపోయిన కొండలమీద కూడా సూర్యుడు దేదీప్యమానంగా వెలుగుతున్నాడు. వేడి మాత్రం తగలటం లేదు. కాసేపు మంచులో కేరింతలు కొట్టాక గండోలా( కేబుల్‌ కార్‌) లో టాప్‌ ప్లేస్‌ ఐన సెవెన్‌ స్ప్రింగ్సు చేరాక సూర్య కిరణాలతో ధగధగ మెరిసిపోతున్న ఆ హిమసమూహ దర్శనం మమ్మల్ని సమ్మోహితులను చేసింది. కన్నార్పడం మర్చిపోయాం. ఐస్‌మీద ఎగిరాం. గుప్పెళ్ళనిండా తీసుకుని గుండెలకద్దుకున్నాం. మోకాళ్ళలోతు మంచులో నడవడం గురించి నేను కల కూడా కని వుండను. ఆ స్వచ్ఛమైన మంచు స్పర్శని అనుభవించడం కోసం నేను వేసుకున్న ఊలు దుస్తుల్ని తీసిపారేసి, చీరతోనే తిరిగాను. మైనస్‌ డిగ్రీ చలిలో, ఆ మంచులో స్వెట్టర్లాంటిదేదీ వేసుకోకుండా, మంచు మత్తులో తిరిగినదాన్ని అక్కడ నేను ఒక్కదాన్నే. ఆ అందమైన అనుభవాన్ని గుండెల్లో దాచుకుని గుల్‌మార్గ్‌ నించి తిరుగు ప్రయాణమైనాం. వెళ్ళేటప్పుడు మామూలుగానే వున్న మా రావ్‌ ముఖం తిరిగివచ్చేటప్పుడు ఆపిల్‌ పండు రంగులో కొచ్చింది. 'స్నోబైట్‌' ' సన్‌బర్న్‌' అని తర్వాత తెలిసింది. ముఖమంతా కమిలిపోయినట్లయింది. 'నిన్ను మంచు కరిచింది. నన్నేమో ముద్దుపెట్టుకుంది ' అంటూ ఏడిపించాను.
 మర్నాడు పెహల్‌గావ్‌ వెళ్ళొచ్చని, అనంతనాగులో ఎన్నికలు అయిపోయాయి కాబట్టి ఏమి ప్రమాదం లేదని అన్వర్‌ ప్రకటించాడు. అమర్‌నాథ్‌ యాత్ర పెహల్‌గావ్‌ మీదుగానే జరుగుతుంది. అమర్‌నాథ్‌ గుహ పెహల్‌గావ్‌కి 16 కి.మీ దూరంలో వుంది. ప్రపంచంలోనే ప్రసిద్దమైన కుంకుమపువ్వుల పొలాలు కూడా ఈ దారిలోనే వున్నాయి. అయితే మా పెహల్‌గావ్‌ ప్రయాణం అంత సాఫీగా జరగలేదు. శ్రీనగర్‌ నుంచి మేం ముఫ్ఫై కిలోమీటర్లు ప్రయాణం చేసాక ఓ పెద్ద ట్రాఫిక్‌ జామ్‌లో ఇరుక్కుపోయాం. అనంతనాగులో ఆ క్రితంరోజే ఎన్నికలు ముగిసాయని, భద్రతా దళాలు, ఎన్నికల సామాగ్రి, సిబ్బంది ఓ పెద్ద కాన్వాయ్‌గా జమ్ము బయలుదేరిందని అన్వర్‌ చల్లగా చెప్పాడు. మూడు గంటల పాటు ఆగిపోయాం. ఎలాగో దాన్నుండి బయటపడి పెహల్‌గావ్‌ చేరేటప&పటికి రెండయిపోయింది. శేష్‌నాగు సరస్సుకు వెళ్ళలేకపోయాం. అయితే మా ప్రయాణం పొడవునా ట్రెడ్పీనది పరవళ్ళను చూడగలిగాం. రాళ్ళమీద గల గల పారే ట్రెడ్సీనది నీల్లు ఫ్రీజర్‌లోంచి తీసినట్టున్నాయి. తిరుగు ప్రయాణంలో నేషనల్‌ పార్క్‌లో వున్న ట్రాట్‌ ఫిష్‌ ఫామ్‌కెళ్ళి వేడి వేడి ఫిష్‌ తిన్నాం. అతి చల్లటి ఫ్రెష్‌ వాటర్‌లోనే ట్రాట్‌ఫిష్‌ బతుకుతుంది. దేశంలో మరెక్కడా ఈ చేప దొరకదట. శేష్‌నాగు సరస్సును చూడలేకపోయామన్న నిరాశతో తిరిగి వచ్చేం.
 మే 7 న ఉదయం తొమ్మిదింటికి మా ' లే' ప్రయాణం మొదలైంది. లే గురించి మమ్మల్ని చాలా మంది బయపెట్టారు. సముద్రమట్టానికి 14,500 అడుగుల ఎత్తులో వుంది లే పట్టణం. అది లదాఖ్‌ రాజధాని. ఒక్కసారిగా ఆ ఎత్తైన ప్రదేశంలో కాలు పెట్టగానే చాలా ఆరోగ్య సమస్యలు అంటే తీవ్ర తలనొప్పి, కళ్ళు తిరగడం, ఒళ్ళంతా బరువెక్కిపోవడం, ఊపిరాడకపోవటం లాంటి సమస్యలతో పాటు గడ్డకట్టించే చలి వుంటుందని నేను ఇంటర్‌నెట్‌ ద్వారా తెలుసుకున్నాను. మిత్రులు కూడా చెప్పారు. శ్రీనగర్‌ నుంచి లే కు విమానంలో అయితే అరగంటే పడుతుంది. అదే కారులో అయితే 20 గంటలు పడుతుందట. కార్గిల్‌లో రాత్రి ఆగి వెళ్ళాల్సి వుంటుంది. అయితే ఏప్రిల్‌ 26 న కురిసిన మంచు వల్ల శ్రీనగర్‌ - లే రహదారి మూసేసారు. మేం విమానంలోనే వెళ్ళాం. లే లో విమానం రెండు కొండల మధ్య నుంచి దిగుతుంది. ఆ దృశ్యం తప్పకుండా చూడు అని వహిదా చెపి&పంది. తొమ్మిదిన్నరకి లే లో దిగాం. నిజంగానే విమానం ల్యాండింగు అద్భుతంగా వుంది. గమ్మత్తుగా ఒక వేపు మంచు కొండలు, ఒక వేపు ఎడారి లాంటి ఇసుకకొండలు. వాటి మధ్యనించి విమానం దిగింది. ఎందుకైనా మంచిదని భుజానికి వేలాడుతున్న స్వెట్టర్‌ని ఒంటికి తగిలించాను. మెట్లు దిగుతుంటే వంద కేజీల బియ్యం బస్తా తలమీద వున్న ఫీలింగు కలిగింది. ఒళ్ళంగా బరువుగా అయిపోయి ఆచితూచి అడుగేయాల్సి వచ్చింది. ఎయిర్‌పోర్ట్‌కి దగ్గరలోనే వున్న ఫుల్‌మూన్‌ గెస్ట్‌హౌస్‌కి తీసుకెళ్ళారు. వేగంగా నడవొద్దని, వొంగకూడదని, ఎక్కువ మాట్లాడవద్దని, సాయంత్రం దాకా రెస్ట్‌ తీసుకోమని సలహా ఇచ్చారు ప్రోటోకాల్‌వాళ్ళు. డాక్టర్‌ వచ్చి మా ఇద్దరి బ్లెడ్‌ ప్రెషర్‌ చెక్‌ చేసాడు. నార్మల్‌గానే వుంది. చలి గడ గడ లాడించేస్తోంది. హై ఆల్టిట్యూడ్‌ వాతావరణంలో ఎదురయ్యే ఇబ్బందులేవీ మమ్మల్ని తాకలేదు. మేం సాయంత్రం ఫ్రెష్‌గా తయారై బయటకు వస్తుంటే మా డ్రైవర్‌ తాషి ' ఆప్‌ లోగు హమ్‌ సె బీ ఫిట్‌ హై, ఏక్‌ దమ్‌ ఫిట్‌' అంటూ నవ్వాడు. అతడా మాట అనగానే మాలోని ఆందోళనంతా పటాపంచలై వొళ్ళంతా తేలికగా అయిపోయింది. ఆ తర్వాత 'హోల్‌ ఆఫ్‌ ఫేమ్‌' పేరుతో మిలటరీ వాళ్ళు ఏర్పాటు చేసిన మ్యూజియం చూడ్డానికి వెళ్ళాం. లే చరిత్రతో పాటు, లదాఖ్‌ ఫెస్టివల్స్‌, నృత్యాల గురించిన సమాచారం ఎంతో వుందక్కడ. కార్గిల్‌ యుద్ధం, యుద్ధంలో మరణించిన వారి వివరాలు, సియాచిన్‌ గ్లేసియర్‌ ఫోటోలు, అక&కడి భద్రతా దళాలు ధరించే దుస్తుల వివరాలు, పాకిస్తాన్‌ ఖైదీల ఫోటోలు, వాళ్ళ నించి సంపాదించిన ఆయుధాలు అన్నింటినీ ప్రదర్శించారక్కడ.
 అక్కడినుంచి మార్కెట్‌కు వెళ్ళాం. చిన్న బజారది. అక్కడే వున్న చహంగా విహార్‌కు వెళ్ళాం. లే చుట్టూ ఎన్నో బౌద్ధ ఆరామాలు వున్నాయి. వాటిని గొంపాలంటారు. హెమీస్‌, ఆల్చి, ఫైయాండ్‌, షె మొదలైన ఎన్నో గొంపాలు వున్నాయి. వీటిలో లే కు 40 కిలోమీటర్ల దూరంలో వున్న హెమీస్‌ గొంపా చాలా పెద్దది. ధనికమైనది. ఈ గొంపాల్లో వందల సంఖ్యలో లామాలుంటారు. ప్రతీ గొంపా విలక్షనమైన పూజా పద్దతుల్ని కలిగి వుంటుంది. కొన్నింటికి దలైలామా అధిపతిగా వున్నాడు.మేం ఏడున్నరదాకా బయట తిరుగుతూనే వున్నాం. పావు తక్కువ ఎనిమిది వరకు సూర్యాస్తమయం కాలేదు. మమ్మల్ని గెస్ట్‌ హౌస్‌లో వదిలేస్తూ తాషి ' ఇక్కడ వెన్నెల చాలా బాగుంటుంది . చూడండి' అన్నాడు. రావ్‌ ' ఇంత చలిలోనా చస్తాం' అన్నాడు. నేను మాత్రం ఎలాగైనా చూడాలి అనుకున్నాను. ఆరాత్రి తను నిద్రపోయాక లాంగు కోట్‌, గ్లౌస్‌ వేసుకుని, మంకీకేప్‌ తగిలించుకుని ఒక్కదాన్ని బాల్కనీలోకి వెళ్ళాను. వావ్‌! అద్భుతం! మంచుకొండలతో పోటీపడి కురుస్తున్న వెన్నెల, పండువెన్నెల ! తిలక్‌ ' అమృతం కురిసిన రాత్రి' కవిత అలవోకగా నా నాలుకమీదకొచి&చంది. చలికి కాలివేళ్ళు కొంకర్లు పోతున్నా అలాగే మైమరచి చూస్తూండిపోయాను. తాషికి థాంక్స్‌ చెప్పుకుని పిల్లిలాగా లోపలికొచ్చి రజాయిలో దూరిపోయాను. మంచుకొండలమీద వెన్నెలతో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నట్టు కలలు కంటూ వెచ్చగా నిద్రపోయాను.
 మే ఎనిమిదో తేదీన మా అసలు అడ్వంచర్‌ మొదలైంది. 17,350 అడుగుల ఎత్తులో వున్న చాంగ్లా పాస్‌ దాటి 14,000 అడుగుల ఎత్తున వున్న పాన్‌గాంగు సరస్సును చూడడానికి మనస్సు తహతహలాడసాగింది. అంత ఎత్తుకెళ్ళడం చాలా కష్టమని,గాలిలో ఆక్సిజన్‌ చాలా తక్కువగా వుంటుందని మమ్మల్ని నిరుత్సాహపరచబోయారు. కాని మేం వినలేదు. తాషి మాత్రం మమ్మల్ని ఉత్సాహపరిచాడు. అవసరమొస్తుందేమోనని హాస్పిటల్‌ నుంచి ఆక్సిజన్‌ సిలిండర్‌ తెచ్చి పెట్టాడు. మేం ఎనిమిది గంటలకు బయలుదేరాం. మనాలి - లే రోడ్డు మీదుగానే చాంగ్లా పాస్‌కి వెళ్ళాలి. అతి పురాతనమైన సింధునది దర్శనం ఇక్కడే అయ్యింది. ' కారు' గ్రామం నుంచి కుడివేపు మనాలి రోడ్డు, ఎడంవేపు పాన్‌గాంగు సరస్సుకెళ్ళే రోడ్డు విడిపోతాయి. మా కారు ఎడంవేపు తిరిగింది. మాలో చెప్పలేని ఉత్కంఠ, ఉద్వేగం. చాంగ్లాపాస్‌ దాటగలమా లేదా అనే ఆందోళన. ఆ బృహత్తర పర్వత సముదాయాల మధ్య సన్నటి రోడ్డుమీద కారు మెలికలు తిరుగుతోంది. ఒక్క రోడ్డు తప్ప సమస్తం స్నోతో నిండివుంది. చిన్న చిన్న సెలయేళ్ళు, రాసులు రాసులుగా హిమపాతం. కారు దిగి కేరింతలు కొట్లాని, ఈల లేసి గోల చెయ్యాలనే బలమైన ఆకాంక్షని చలి చిదిమేసింది. అయినా ధైర్యం చేసి ఒక చోట దిగి మంచుని ముద్దాడుతూ ఫోటోలు తీసుకున్నాం. గడగడలాడిపోయాం. అక్కడ మైనస్‌ 4 టెంపరేచర్‌ వుంటుందని తాషి చెప్పాడు.చిన్న చలికే తట్టుకోలేని రావ్‌ మైనస్‌ డిగ్రీలో నిలబడటం నాకు స్థలమహత్యమన్పించింది. చాంగ్లాపాస్‌ దగ్గర పడుతుంటే తాషి ఆక్సిజన్‌ పెట్టాలా అని అడిగాడు. మేం వద్దన్నాం. నేను యోగాలో నేర్చుకున్న 'శీతలి ప్రాణాయామం' ద్వారా ధారాళంగా ఆక్సిజన్‌ లోపలకు పంపించగలిగాను. రావ్‌కు కూడా నేర్పాను. దీనివల్ల మాకు ఆక్సిజన్‌ లేమి సమస్య ఎక్కువగా ఎదురుకాలేదు. చాంగ్లా చేరగానే ప్రతి ఒక్కరికి ఏదో ఆరోగ్య సమస్య వస్తుంది కాబట్టి అక&కడ ఒక మిలటరీ కేంప్‌ పెట్టారు. ఫస్ట్‌ ఎయిడ్‌, టాయిలెట్‌ లాంటి సౌకర్యాలున్నాయి. మేం గడగడలాడుతూ కేంప్‌లోకి వెళ్ళగానే అక్కడున్న నాయక్‌ సుబేదార్‌ విష్ణు బహదూర్‌ గురండ్‌ మాకు మిరియాలతో కాచిన వేడి వేడి టీ ఇచ్చారు. ఆ చలిలో కారం కారంగా, వేడిగా గొంతులోంచి జారుతున్న టీ ఎంత తృప్తి నిచి&చందో మాటల్లో చెప్పలేను. వాళ్ళకి కృతజ్ఞతలు చెప్పి మేం ముందుకు సాగాం. ఆ కొండల్లో చిన్న చిన్న గ్రామాలు చూసాం. గుర్రాలతో పొలం దున్నుతున్న రైతుల్ని చూసాం. పసిమినా గొఱ్రెల్ని మేపుతున్న కాపరుల్ని చూసాం. చకాచకా పరుగులు తీసే మర్మాడ్‌ ( కొండ ఉడతలు) లు, యాక్స్‌, కొండ మేకలు, రకరకాల పక్షులు కన్పించాయి.మరో అరగంటలో మేం పాన్‌గాంగు సరస్సు తీరాన వున్నాం. అద్భుతం. అపురూపం. విభిన్నరంగుల్లో మిల మిల మెరిసే 130 కిలోమీటర్ల పొడవైన ఉప్పునీటి సహజ సరస్సు దర్శనం ఇచ్చింది. ఇండియాలో నలబై, చైనాలో 90 కిలోమీటర్ల పొడవునా పాన్‌ గాంగు సరస్సు విస్తరించి వుంది. నాలుగు కిలోమీటర్ల అడ్డం వుంటుంది. అన్నింటినీ మించి 14,000 అడుగుల ఎత్తుమీద ఆవిర్భవించిన అద్భుత ప్రకృతి దృశ్య కావ్యం ఈ సరస్సు. క్షణం క్షణం రంగులు మారుతోంది. నీలం, ఆకుపచ్చ సరస్సు తీరాన చిత్తరువులమై వినమ్రంగా అలా నిలబడిపోయాం. మనస సరోవరం చూడాలన్న గాఢమైన కోరికను ఈ సరస్సు ఛిద్రం చేసేసింది. పాన్‌గాంగు సరస్సు కెరటాలు మా గుండెల్లోనే ఉప్పొంగుతుండగా మేం తిరుగు ప్రయాణానికి అయిష్టంగానే సిద్ధమయ్యాం. ఆ ... అన్నట్టు ఇక్కడ మిలటరీ కేంప్‌లో మాకు చక్కటి ఆతిథ్యమిచ్చిన వాళ్ళు మన తెలుగువాళ్ళేనండి. మేం ఇద్దరం తప&ప మూడో మనిషి నోటివెంట ఈ పదిరోజులుగా తెలుగుమాట వినని మేం ముగ్గురు తెలుగువాళ్ళని చూసి బోలెడు సంతోషపడ్డాం. వాళ్ళూ చాలా సంతోషించారు. నాయక్‌ షేక్‌ మహబూబ్‌ పాషా గిద్దలూరుకు, లాన్స్‌ నాయక్‌ రామానుజం చిత్తూరుకు, సిపాయి నాగేశ్వరరావు శ్రీకాకుళానికి చెందినవాళ్ళట. సంవత్సరం నుంచి ఇక్కడే వున్నారట. మా దగ్గరున్న చాక్‌లెట్‌లు, బిస్కట్‌లు, మెడిసిన్స్‌ అన్నీ వాళ్ళకిచ్చేసాం. వాళ్ళిచ్చిన వేడి వేడి టీ తాగి తిరుగు ప్రయాణమయ్యాం.
 అప్పటికి మంచుకొండల మీద ఎండకాస్తోంది. అయితే మేం చాంగ్లా పాస్‌ దగ్గరికి వచ్చేటప్పటికి హఠాత్తుగా వాతావరణం మారిపోయింది. ఈదురు గాలుల్తో మంచు కురవడం మొదలైంది. మేం అదిరిపోయాం. ఆ అదురులోనూ మంచుకురవడాన్ని చూస్తున్నందుకు ఆనందంతో ఉక్కిరిబిక్కిరయిపోయాం. కొన్ని క్షణాల్లో మా కారు ముందు అద్దం మంచుతో నిండిపోయింది. వైపర్స్‌ కదలనని మొండికేసాయి. తాషి కిందికి దిగి అతి కష్టం మీద కొంత మంచును తొలగించి వైపర్స్‌ ఆన్‌ చేసాడు. మెల్లగా కారును నడపడం మొదలెట్టాడు. ఏకధాటిగా కురుస్తున్న మంచును చూస్తూ సర్వం మర్చిపోయాం. ఆక్సిజన్‌ విషయం అసలు గుర్తే రాలేదు. లోపలంతా ఓ ఉద్విగ్నత నిండిపోయింది. చాంగ్లాపాస్‌ ఎక్కి దిగిపోగానే వాతావరణం మళ్ళీ ఎండతో నిండిపోయింది. లే పట్టణంలోకి అడుగుపెట్టేముందు సిధు నదిని చూసాం. నీళ్ళల్లో దిగి ఆ చల్లటి నీటి స్పర్శని అనుభవించాం. ఇటీవలే అక్కడ సింధు దర్శనం పేరుతో ఓ ఉత్సవాన్ని ఎల్‌.కె. అద్వానీ ప్రారంభించినట్లు శిలాఫలకం మీద చదివినప్పుడు బౌద్ధమతస్తులు అదికంగా వున్న లే , లదాఖ్‌ లకు ' హిందూత్వ'ను దిగుమతి చేయడానికి అద్వాని ప్రయత్నాలు మొదలుపెట్టాడు కాబోలు అనుకున్నాను.
 అపూర్వ అద్భుత అనుభవాలను మూటగట్టుకుని మర్నాడు ఉదయం మేం తిరుగు ప్రయాణమయా&యం. క్షణక్షణం మారే లే వాతావరణం మా విమానాన్ని ఆరుగంటలు ఆలస్యం చేసింది. ఇసుకతో కూడిన ఈదురుగాలులు, మబ్బులతో నిండిపోయే పర్వత సానువులు, దూరాన కొండల మీద వర్షం, ఎయిర్‌ పోర్ట్‌లో ఎండ ఇలా ఎన్నో వాతావరణ విన్యాసాల మధ్య మా విమానం గాల్లోకి ఎగిరి మమ్మల్ని ఢిల్లీ చేర్చింది.
 పది రోజులపాటు కాశ్మీర్‌ అందాల్ని గుండెల్లో వొంపుకుంటూ పరవశించిపోయినా నాలోపలెక్కడో ఓ ముల్లు గుచ్చుకుంటూనే వుంది. ప్రతి కాశ్మీరీ ముఖంలో ' ఏదో పోగొట్టుకొన్నామన్న భావన' గుండెల్ని మెలిపెడుతూనే వుంది. శ్రీనగర్‌ సందుగొందుల్లో పేలుతున్న గ్రెనేడ్‌లు, భద్రతా దాళాల మోహరింపులు, పనుల్లేక ఉద్యోగాల్లేక గుంపులు గుంపులుగా రోడ్ల మీద తారసపడే కాశ్మీరీ ముస్లిమ్‌ యువకుల నిరాశామయమైన చూపులు ఇంకా నన్ను వెంటాడుతూనే వున్నాయి. అందమైన కాశ్మీర్‌లోయలో అందవిహీనం చేయబడిన కాశ్మీరీ జీవితం, అభద్రత, అన్యాయం మధ్య కొట్టుమిట్టాడుతున్న దృశ్యాలను మర్చిపోవడం చాలాకష్టం. గత పదిహేను సంవత్సరాలుగా బారత భద్రతా దళాల తుపాకులకు, పాకిస్తాన్‌ ప్రేరేపిత ఆగ్రవాదుల బాంబు దాడులకు బలైపోయిన 80,000 వేల మంది మరణాలకు ఎవరి జవాబుదారీ లేదు. మూడు వేలమంది యువకులు లోయనుండి అదృశ్యమైపోయారని వాళ్ళేమయ్యారో ఎవరికీ తెలియదని మా పి.ఎస్‌.వో అన్నాడు. 8000 మంది స్త్రీలు బర్తలను పోగొట్టుకున్నారని, మరెందరో స్త్రీలు బతికి వున్నారో లేదో తెలియని బయంకర స్థితిలో సంగం విధవలుగా మారారని ఒక చోట చదివాను. 20 వేల మంది పిల్లలు అనాధాశ్రమంలో మగ్గుతున్నారని విన్పపుడు కడుపులో చెయ్యిపెట్టి కెలికినట్లయింది. ఒక పోలీసు ఉన్నతాధికారి పొరపాటుగా ఒక కుటుంబాన్ని టెర్రరిస్టులుగా భ్రమించి కాల్చి చంపి చావకుండా మిగిలిపోయిన అల్‌తాఫ్‌ అనే కుర్రాడిని, భార్య ప్రోద్భలం మీద దత్తత చేసుకుని పెంచుతున్నాడని విన్నప్పుడు నా వొళ్ళంతా కంపించిపోయింది. తల్లిదండ్రుల్ని చంపినవాడే తన ప్రస్తుత తండ్రి అని ఆల్‌తాఫ్‌కి బహుశా తెలిసి వుండదు. కాశ్మీరులో జరుగుతున్నదేమిటో అర్థం చేసుకోవడానికి ఇలాంటి ఉదంతాలు సరిపోతాయనుకుంటాను. ఉత్తుంగ పర్వతాలు, మహావృక్షాలు, సరస్సులు, లోయల సోయగాలు ఒకవైపు, కర్కశ భద్రతా దళాల ఇనపబూట్ల చప్పుళ్ళు, పొగలు కక్కే ఎ.కె. 47లు, ఉగ్రవాదుల గ్రేనేడ్‌ పేలుళ్ళు, నెత్తురోడుతున్న శరీరబాగాలు ఇదీ నేటి కాశ్మీర్‌ వెన్నెల్ని, కటిక చీకటి అమావాస్యని ఒకేసారి అనుభవిస్తూ మేం హైదరాబాదులో అడుగుపెట్టాం.

Wednesday, June 3, 2009

ఉత్తరం ఉత్త కాయితం ముక్క కాదు


ఆకాశం నిండా నల్లటి మబ్బులు కమ్ముకుని,సన్నటి చిరుజల్లులు కురుస్తున్న వేళపుడు,నీటి తుంపర్లతో నిండిన చిరుగాలి శరీరాన్ని తడిపేస్తున్న వేళ,మా పోస్ట్ మాన్ ఓ నీలిరంగు కవర్ తెచ్చిచ్చాడు.ఏమిటేమిటొ చెత్తంతా మోసుకొచ్చే పొస్ట్ మాన్ ఈ రోజు నాకో ఉత్తరం తెచ్చిచ్చాడు.....ఉత్తరం....నిజంగా ఉత్తరమే.

ఏంత సంతోషమో.ఫ్రం అడ్రస్ చూసి మరీ సంతోషం.సుగుణ.చదువుకునే రోజుల్లో నా ఆత్మీయ నేస్తం.ఇంటర్నెట్ లో అడ్రస్ పట్టుకుని,నన్ను ఆశ్చర్యంలో ముంచేస్తూ,
అందమైన దస్తూరితో,ఆత్మీయతను కుమ్మరించిన అక్షరాల వరసలు.ఆ రోజుల్లో మేము ఎన్నెన్ని ఉత్తరాలు రాసుకునే వాళ్ళం.ఎన్ని కబుర్లు వాటిల్లో కలబోసుకునే వాళ్ళం.

ఉభయ కుశలోపరి అంటూ మొదలయ్యే ఉత్తరాన్ని విప్పి...అందులోని కష్టాలూ,కన్నీళ్ళూ,నవ్వులు, నమ్మకాలూ,ఆప్యాయతలూ,ఆరాధనలూఅన్నింటిని కలగలిపి ఆస్వాదించడం ఎంత బావుండేదో!ప్రియ నేస్తాలకు,ప్రాణ సమానమైన మిత్రులకురాసే ఉత్తరాల్లోకి ఉద్వేగం,భావుకత,ఆత్మీయత,ఎంత సునాయాసంగా అక్షరాల్లోకి జాలువారేదో!ఎంత ఆనందాన్ని,హాయిని పంచేవి ఆనాటి ఉత్తరాలు.

సశేషం.......

Tuesday, June 2, 2009

వెర్రి పరుగు

దేని వెంటో పరుగు
ఎండమావిని అందుకోవాలని ఆరాటం
ఈ పరుగు పందెంలో
మనిషి ఎంత అలసిపోతున్నాడు
ఎంత కోల్పోతున్నాడు
సుఖాన్ని,శాంతిని
సంతోషాన్ని,సంబరాన్ని
గుండె నిండా అనుభవించలేని
అసంకల్పిత పరుగు
ఆగి ఆయాసం తీర్చుకునే
తీరికలేని పరుగు
చుట్టూ పరుచుకున్న అద్భుతాల్ని
చిన్న ఆనందాల్ని
తోసిరాజని పరుగే పరుగు
ఇంధ్ర ధనుస్సు ఎదురొచ్చినా
తలెత్తి చూడకుండానే
వాన చినుకులు కురుస్తున్నా పట్టించుకోకుండానే
ఉరుము ఉరిమినా
మెరుపు మెరిసినా
ఆకాశంలో విద్యుల్లతలు విరగ పూసినా
నా కోసం కాదులే
నాకవసరం లేదులే
అంతా నిర్లిప్తత,నిరాసక్తత
ప్రక్రుతిలో మమేకం కాలేకఫొవడం
మనిషి చేస్తున్న మహా తప్పు

Thursday, May 28, 2009

రామంతాపూర్ రోడ్లో ఓ అద్భుతమైన సంపెంగ వనం

హిమాయత్ నగర్ రోడ్లో నాగమల్లి చెట్టు ఉంది చూసారా అంటే ఎవ్వరూ స్పందించలేదు.మరీ అంత బిజీనాండి తమరంతా?ఎడారిలా మారిన బిల్డింగులున్నయ్ లెండి.చెట్లు లేకుండాపోయాయని నా బాధ. పచ్చదనం కోల్పోయిన అలాంటి కాంక్రీట్ జంగల్ రోడ్లో ఓ అద్భుతంలా నాగమల్లి విరగబూసి ఉంది అంటే అందరూ పరుగెత్తికెళ్ళి చూస్తారనుకున్నా. అబ్బే ఎవ్వరూ స్పందించలేదు. ఎంత విషాదం.

పోనీ రామంతాపూర్ రోడ్లో ఓ అద్భుతమైన సంపెంగ వనం ఉంది .ఎవరైనా చూసారా?సంపెంగ చెట్టు కాదండోయ్.సంపెంగ వనం. పోనీ దీన్నైనా చూస్తారా?
మడిసన్నాకా కాసింత కలాపోసన పచ్చని చెట్టు మీదా ప్రేమ లేకపోతే ఎలాగండీ.

Sunday, May 17, 2009

మా ఊరు సీతారామపురం-నా లైఫ్ లైన్

  ఆయ్‌! మాది నర్సాపురమండి. కాదండి... కాదండి నర్సాపురానికి నాలుగు మైళ్ళ దూరంలో వుందండి మావూరు. సీతారామపురం. మా గొప్పూరు లెండి. నిజానికి అదసలు ఊరులాగుండదండి. 'అప్పిచ్చువాడు వైద్యుడు, ఎప్పుడు ఎడతెగక పారు ఏరు' అని ఏమనగారు చెప్పినలాంటియ్యేమీ మా వూర్లో లేవండి. ఇప్పటిగ్గూడ మా ఊరికి బస్సు లేదంటే మరి మీరు నమ్మాలండి. నమ్మకపోతే మీ ఇష్టమండి. మా వూర్లోనండి ఏమున్నా ఏం లేకపోయినా బోలెడన్ని తోటలున్నాయండి. మామిడి, జీడిమామిడి, సపోటా, సీతాఫలం తోటలేనండి ఊర్నిండా. ఇక సరుగుడు తోటలగురించి, వాటి ఈలపాట గురించి ఏం చెప్పమంటారు. నే సెపితే కాదండి మీరు ఇనాలండి. తాడితోపులు, కొబ్బరిచెట్లు కూడా ఊరంతా వున్నాయండి.
  మా యింట్లో మేం సుమారు 50 మంది పిల్లలుండేవాళ్ళం.ఏసంగి శెలవులొస్తే ఇంకా పెరిగిపోయేవారు. మా తాతకి ఏడుగురు కొడుకులు. ఇద్దరు కూతుళ్ళు. మా చిన్నప్పుడు మేమందరం కలిసే వుండేవాళ్ళం. మా అమ్మ వాళ్ళ్ళ్ళు రోజూ వందమందికి వండి పెట్టేవాళ్ళంటండి. చివరాకర్న ఆడోళ్ళకి ఏముండేది కాదంట. అది వేరే సంగతిలెండి. మరొకసారి చెబుతాను ఆ సంగతులు.
  మీరందర జీడిపప్పు బోలెడ్డబ్బెట్టి కొనుక్కుంటారుకదా. మాకైతే ఊర్నిండా జీడితోటలే. మేం పిల్లలందరం కలిసి వేసంగి శెలవులొస్తే కోతుల్లాగా చెట్లమీదే ఎగురుతుండేవోళ్ళం. జీడిపళ్ళు చీక్కుంట, గింజల్ని చెట్లకిందే కాల్చుకుంట, జీడిపప్పు తెగ తినేవోళ్ళం. ఇప్పుడేమో కొలస్ట్రాలని భయపెడుతున్నారుగాని మేం తిన్నంత జీడిపప్పు ఎవ్వరూ తినుండరంటే నమ్మండి. మా కూరల్నిండా పచ్చిజీడిపప్పే. చింతచిగురు, మామిడి కాయ, వంకాయ కోడిగుడ్లు అన్నింట్లోను కలిపేసుకుని వండేసుకునేవాళ్ళం. చింతాకు జీడిపప్పు కూర రుచి నే చెబితే ఏం తెలుస్తుంది. తిని చూడాలంతే.
  వేసంగి శెలవుల్లో మా పిల్లమూకంతా ఆడపిల్లలైతే లంగాలకి కచ్చాలుపోసి, మొగపిల్లలైతే జేబుల్లోకి గంపెడేసి చింతచిగురు కోసి కుప్పలు పోసేవోళ్ళం. చిటారుకొమ్మల్లోకి పాక్కున్టూ వెళ్ళిపోవడం బలే మజాగా వుంటుంది. చింతాకు ఉడకబెట్టి బిళ్ళలు చేసేవోళ్ళు. ఆకు ఎండబెట్టి డబ్బాల్లో పోసేవోరు. మాకు సంవత్సరమంతా చింతాకు, చిన్తపరిగెలు, మెత్తళ్ళు,చిత్తడాయిలు, చెంగుడుపట్టు- ఇయ్యన్ని ఏంటీ అనుకుంటున్నారా? చేపలండీ బాబు చేపలు. ఈ చేపలన్నీ చింతాకుతో కలిపి ఒండుకుతింటే ఇంకేమీ ఒద్దనిపిస్తదండి. మీరు కూడా పశ్చింగోదావరి వాళ్ళయితే ఇయ్యన్నీ ఈజీగా తెలిసిపోతాయండి.
  ఏసంకాలంలో మామిడి పళ్ళతోపాటు మాన్చి రుచైన పండు మరోటుందండి. మీరెప్పుడైనా తాట్టెంక తిన్నారా? చెట్టుమీద ముగ్గిన తాటి పండు నిప్పులమీద కాల్చుకుని తిన్నారంటే..... ఎందుకులెండి వర్ణిఅమ్చడం. మీరెరూ తినుండరు. పోనీ కుంపటేసిన తేగలన్నా తిన్నారా లేదా? కనీసం బుర్ర గుంజయినా తిన్నారా? తినుంటే మాత్రం వందేళ్ళొచ్చినా ఆ రుచుల్ని మర్చిపోవడం వుండదండి. సరే. మా ఊరినిండా పళ్ళతోటలే కాదండి కూరగాయల పాదుల ఎక్కువేనండి. వంకాయలు, దొండకాయలు, బీర, సొర, పొట్ల, గోరుచిక్కుళ్ళు, టమెటాలు, పచ్చిరగాయలు, గోన్గూర, తోటకూర ఒకటేమిటి అన్నీ పండిస్తాం. వీటన్నింటికి నీళ్ళెక్కడినించొస్తాయా అని ఆలోచిత్తన్నారా ఏంటి? నుయ్యిలు తవ్వుతారు. పదడుగులు తవ్వితే చాలు బుడబుడమని నీళ్ళూరిపోతాయి. రెండు కుండల్లాంటివుంటాయి. వాటిని బుడ్లజోడంటారండి. ఈ బుడ్లజోడుని నూతుల్లోని నీళ్ళతో నింపి కూరపాదులకి నీళ్ళుపోస్తారు. బుడ్లజోడుతో నీళ్ళపోత అంటారు సిపుల్‌గా.
  మా నాన్న చాలా కష్టజీవి. గోచిపెట్టుకుని బుడ్ల జోడుతో పాదులకి నీళ్ళపోతపోసి, పచ్చిగడ్డి కోసుకుని ఇంటికొచ్చి అలిసిపోయి అలానే వీధరుగుమీద పడి నిద్రపోయేవాడు. నేను నాన్నతో కలిసి పాదుల్లో పనిచేసేదాన్ని. గొడ్డలితో కట్టెలు కొట్టేదాన్ని. పాలు పితికేదాన్ని.నూతుల్లో దిగి బోలెడన్ని చేపలు పట్టేదాన్ని. ఎపుడూ ఊరిమీద బలాదూర్‌ తిరిగేదాన్ని. నువ్వాడపిల్లవి. ఇలాంటి పనులు చెయ్యకూడదు అని ఏనాడూ మా నాన్న నాకు చెప్పలేదు. నేనేం చేసినా అడిగేవోడు ఎవ్వడూ లేడనుకోండి.
  ఓసారి నూతిలో దిగి చేపలు పడుతుంటే సీసాపెంకు గుచ్చుకుని ఒకటే రక్తం. నేనేం భయపడలేదు. ఆ నూతుల్లోనే వున్న మెట్టతామరాకు ముద్దగా చేసి తెగిన చోట పూసేసానంతే. తెగిందని ఆరోజు ఎవ్వరికీ చెప్పలేదు. కానీ ఈ రోజుకి నా ఎడం చేయి మణికట్టు దగ్గర ఆ మచ్చ అలాగే వుండిపోయి, ఆ అల్లరి రోజుల్ని గుర్తుచేస్తంటుంది. తేగబుర్రల్ని కత్తితో కొడుతుంటే తెగిన మచ్చ కూడా ఎడం చేతి చూపుడు వేలు మీద వుందండోయ్‌. మరేంటనుకున్నారు. ఆ మచ్చల వెనక ఇంత మహా చరిత్ర వుందిమరి.
  తోటలెంబడి తూనీగలాగా తిరుగుతుండేదాన్ని కదా! నాకు బయమంటే ఏంటో తెలియదండి. కాని ఒక్క బావురుపిల్లికి మాత్రం తెగ భయపడేదాన్ని. మా యిల్లు రైలుబండంత పొడుగుండి చాలా పెద్దమండువా ఇల్లండి. బోలెడంత పెరడు వుండేది. గుమ్పులుగా కోళ్ళు తిరుగుతుండేవి. ఈ కోళ్ళ కోసం రాత్రిళ్ళు బావురు బావురంటూ బావురుపిల్లి వచ్చేదండి. కోళ్ళు గూళ్ళో దూరి కోడినెత్తికెళ్ళి తినేసేది. పిల్లొచ్చినపుడు కోళ్ళు గోల గోలగా అరిచేవండి. నా గుండెల్లో రైళ్ళు పరుగెట్టేవి. గుడ్లు మిటకరించి అటకమీదికి చూస్తుండేదాన్ని. అటకమీంచి బావురుపిల్లి నా మీదికి దూకేస్తుందని తెగ భయపడేదాన్ని. నేనెంత మొద్దునంటే పిల్లిక్కావలిసింది కోడిగాని నేను కాదుగా. అది ఈ మొద్దుబుర్రకు అర్తం కాడానికి చాలా కాలమే పట్టింది. అదండి సంగతి.
  మా వూర్లో నాకు ఎక్కువ యిష్టమైంది, ప్రాణప్రదమైంది అమ్మోరి తీర్తం. మా వూరి దేవత పేరు మారమ్మ. సంవత్సరానికి ఒకసారి జాతర చేస్తారు. తీర్తం పదిరోజులుందనగానే పిల్లల హడావుడి మొదలయ్యేది. తాటాకులు కోసుకొచ్చి బుల్లి బుల్లి బుట్టలల్లేవాళ్ళం. వీటిని జాజారి బుట్టలు అనేవాళ్ళు. ఒక్కొక్కళ్ళకి రెండేసి బుట్టలన్నమాట. బుట్టల్లో మట్టి నింపి నవధాన్యాలు వేసి నీళ్ళు పోసేవాళ్లం. పొద్దున లేవడం బుట్టలన్నీ వీధరుగుమీద పెట్టుకుని మొలకలొచ్చినయ్య లేదా అని చూసుకునేవాళ్ళం. అన్నింటి కన్నా ముందు పెసల మొక్కలొచ్చేవి. తీర్తం నాటికి జాజారి బుట్టల్నిండా పచ్చటి మొక్కలు గుబురుగా వచ్చేసేవి. తీర్తం నాటిముందు రోజు రాత్రి ఆసాదులు మోళీ కట్టేవాళ్ళు. ఆసాదులంటే ఎవరో చెప్పలేదు కదా! మారమ్మ తీర్తంలో ఘటాలనే గరగలంటారు. ఈ ఆసాదుల గరగల నృత్యం చూసి తీరాల్సిందే. మాదిగడప్పుకు అనుగుణంగా వారు వేసే స్టెప్‌లు, ఏ మెగాస్టార్‌ కూడా వెయ్యలేదండోయ్‌. ఆ... అన్నట్టు మెగాస్టార్‌ మా వూరివాడేనండి. మా బస్సులోనే వచ్చి మాకు బీటేసినవోడేనండోయ్‌. ఆ ముచ్చట మరోసారి చెబుతాలెండి. ఈ ఆసాదుల మోళీ అబ్ధుతంగా వుంటుంది. మోళీ అంటే మరేం కాదండి మేజిక్‌ అన్న మాట. మనిషి నెత్తిమీద నల్ల దుప్పటి కప్పి, పొయ్యేట్టి పకోడీలువొన్డేసేవోరు. జేబుల్లోంచి రూపాయల కట్టలు లాగి దండల్లాగా మెళ్ళో వేసుకునేవోళ్ళు. పేకముక్కల్ని ఫెవికాలెట్టి అంటించినట్టు సర్రున ఎగరేసేవోళ్ళు. మేం పిల్లలం నోళ్ళు ముయ్యడం మర్చిపోయి మొద్దురాచ్చిప్పల్లా చూస్తుండిపోయేవాళ్ళం. పి.సి. సర్కార్‌ మేజిక్‌ షో వాళ్ళముందు పనికిరాదంటే నమ్మండి.
  ఇంక తీర్తం రోజు సంగచ్చెబుతాను. తలంటుస్తానం చేసేసి, వుంటే కొత్తబట్టలేసేసుకుని ఆసాదుల రాకకోసం ఎదురుచూత్తా కూచొనేవాళ్ళం. డప్పుల హోరుతో ఆసాదులెళ్ళి ఊరి పొలిమేరల్ని కట్టేసి వచ్చేవోళ్ళు. ఆసాదుల వెంటపడి రెండు చేతుల్లో పచ్చటి జాజారి బుట్టలతో మిడతల దండులాగా పిల్లల గుంపు. బుట్టలో జానేడేసంత పచ్చటి మొక్కలు. ఆసాదులు గరగల నృత్యంతో ముందుకెళుతుంటే వాళ్ళ వెనకాల మేము. గుడి వరకూ అలా వెళ్ళి బుట్టల్ని గుడిచుట్టూ తిప్పి గుడి గోపురం కింద అంచుల మీద పెట్టేసేవోళ్ళం. గుడంతా పచ్చగా కళకళల్లాడిపోయేది. అసలు పిల్లలు బుట్టల్తో నడుస్తుంటే పచ్చటి తివాసీని మోసుకెళుతున్నారా అన్నంత ఆకుపచ్చగా వుండేది. ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా నా కళ్ళకి ఆ పచ్చదనం అగుపిస్తుందంటే మీరు నమ్మితీరాలి మరి.
  దీపాళి పండగ గురించి ఏం చెప్పమంటారు. ఎప్పుడూ డబ్బుల్తో దీపావళి టపాసులు కొనలేదు మేం. అన్నీ మేమే తయరు చేసుకునేవాళ్ళం. పేటేప్‌ కాయలు ( తాటాకులతో చేసేవి), మతాబులు, సిసింద్రీలు, చిచ్చుబుడ్లు అన్నీ చేసేవోళ్ళం. ముడిసరుకులు కొనుక్కొచ్చి తయారు చేసేవోళ్ళం. మతాబులు చేయడానికి ముందు కాగితం గొట్టాలు చెయ్యలిగా. అలాగే సిసింద్రీ గొట్టాలు. కాయితం, అన్నం మెతుకులు వుంటే గొట్టాలు రెడీ. వాటిల్లో మందుకూరి ఎండకి పెట్టేవోళ్ళం. తాటాకుల్ని మెలికతిప్పి, మందుకూరి, వొత్తిపెడితే పెటేప్‌కాయ రెడి. మేం చేసినవి ఫట్‌ ఫట్‌ మని పేలేవి. మతాబులు జలతారు పువ్వుల్ని రాల్చేవి. సిసింద్రీలయితే సుయ్‌మని ఎగిరిపోయేవి. ఇవన్నీ కాకుండా దీపావళికి మేం ఓ ప్రత్యేక వస్తువు తయారు చేసేవోళ్ళం. ఉప్పు, ధాన్యపువూక, పేడ కలిపి ఓ మూటలాగా చేసి తాడు కట్టేవోళ్ళం. మూట మధ్య నిప్పురవ్వేస్తే, ఉప్పు టపటప పేలేది. తాడుతో ఆ మూటని గుండ్రంగా తిప్పితే మనచుట్ట నిప్పుల వలయం ఏర్పడుతుంది. పేడ, వూక కాలుతుంటే ఉప్పురవ్వలు ఎగిసేవి. ఈ ఉప్పు మూట దీపావళికి స్పెషల్‌ ఎట్రాక్షన్‌ తెలుసాండి.
  వినాయక చవితికి కూడా మేం ఎండుపల్లేరుకాయల్ని మూటగట్టి ఇంటికొచ్చే కొత్తల్లుళ్ళని తెగ బెదిరించేవాళ్ళం. మా అల్లరికి బావలు పరుగో పరుగు. అల్లుళ్ళని చాలా రకాలుగా ఏడిపించే వాళ్ళం. ఆకునిండా భోజనం పెట్టి, ఆకు కింద ఆవాలు పోసి, సన్నటి తాడుకట్టి ఆయన భోజనానికి కూర్చుని తినడం మొదలెట్టగానే ఆకుని లాగేసేవాళ్ళం. కింద ఆవాలుంటాయిగా ఆకు ఈజీగా కదిలిపోయేది. ఇంటల్లుడి ముఖం చూడాలి. అందరం గొల్లున నవ్వేవాళ్ళం. అలాగే గారెల్లో బండారు గాజులెట్టి అల్లుడికి పెట్టేవాళ్ళు. ఆయన ఆనందంగా గారెలు లాగించబోయేసరికి గాజు గట్టిగా పళ్ళకి తగిలి బెంబేలెత్తిపోయేవాడు. మేం నవ్వుకుంటూ గాజుకు సరిపడా డబ్బులివ్వాలని ఆటపట్టించేవాళ్ళం. ఇవన్నీ పండగ సరదాల్లో భాగమేనండోయ్. పండగ సంబరాలు ఎంత రాసినా తనివి తీరదు . ఉగాదికి అరకలు కట్టి దున్నడాలు, సంగ్రాంతికి దుంలెత్తుకొచ్చి భోగిమంటలేయడాలు, కార్తీక వమాసం చలిరోజుల్లో తెల్లవారు ఝామునే గోదావరిలో మునగడాలు, అట్లతద్దికి ఉయ్యల లూగడాలు ఒకటా రెండా ఎన్నో ఎన్నెన్నో సంబరాలు.
  మావూరి గొప్పదనం గురించి ఇంకేం చెప్పమంటారండి బాబు! మాకు ఒక వేపు గోదారి. మరోవైపు సముద్రం. గోదావరి నాలుగు కిలోమీటర్ల దూరంలో వుంటే పది కిలోమీటార్ల దూరంలో సముద్రం. నా బతుకు మా వూరి పచ్చదనంతోటి, మా వూరి చుట్టు వున్న నీళ్ళతోటి ముడిపడిపోయింది. వెన్నెల్లో గోదారి మీద లాంటి ప్రయణం, అంతర్వేది రేవు, అన్నాచెల్లెలగట్టు, కొనసీమ కొబ్బరి చెట్లు ఇవన్నీ నా జీవితంలో అంతర్భాగాలు. నా బాల్యం ధగధగ మా గోదారి గట్టుమీద సూర్యబింబం మెరిసినట్టు మిరుమిట్టు గొలుపుతుంటుంది.
  నేనేం టాటాలు, బిర్లాల్లాగా నా నోట్లో బంగారపు చెంచా పెట్టుకునేం పుట్టలేదు సుమండి. నేను పుట్టింది ధాన్యపు కొట్లోనంట. మా అమ్మ నిండు నెలల్తో ధాన్యపు కొట్లోంచి ధాన్యం తీస్తోందట. అమాన్తం నేను పుట్టేసానంట. కొవ్వాసు పీసు ( ఒక రకం చేప) లాగా వుండి ఈరోజో రేపో అన్నట్టుండేదాన్నంట. నా కర్మకాలి నే పుట్టిన పద్నాలుగో రోజే మా అమ్మమ్మ చచ్చిపోయిందంట. నా చదువుకూడా అంతే. మా వీధరుగు మీదే బడి వుండేది. బుద్ధిపుడితే కూర్చునేదాన్ని. లేకపోతే చెట్లెక్కేదాన్ని. టీకాల వాళ్ళు వస్తే మాత్రం నేను చిక్కడు, దొరకడు. చిటారు కొమ్మల్లోకి ఎక్కి కూర్చుని వాళ్ళు వెళ్ళిపోయాక దిగేదాన్ని. నా కెవరన్నా భయముండేది కాదు కాని టీకాల వాళ్ళంటే ఆ సూదులు చూసి భయమేసేది.
  నా కెందుకు, ఎలా, ఎపుడు పుట్టిందోగాని చదువుకోవాలనే కోరిక మాత్రం పుట్టేసింది. మా కుటుంబంలో అటు ఇటు చదువుకున్న వోళ్ళే లేరుమరి. నాకెలా పుట్టిందో తెలియదు. చదువుకోసం ఎంతో పోరాటం చేయాల్సివచ్చింది. మా నాన్నకి నన్ను చదివించాలనే వుండేది కాని డబ్బుల్లేవు. ఉమ్మడి కుటుంబానికి ఆయన చాకిరీ చేసేడు గాని చిల్లి కాని కూడా వుండేది కాదు. నా చదువు సమాచారం క్లుప్తంగా చెబుతాను. అయిదు వరకు ఊర్లోనే చదివాను. ఆరునించి పదివరకు ఓరియంటల్‌ స్కల్‌. అంతా సంస్కృతం మయం. మా సంస్కృతం మేష్టారు శ్లోకం తప్పు చదివితే స్కల్‌ చుట్టూ తిప్పి కొట్టేవోరు. ఒకసారి నేను ఆయనకి దొరక్కుండా బాదం చెట్టెక్కి కూర్చున్నా. ఆయన కోపం ఆపుకోలేక గోడకేసి తలబాదుకున్నాడు. నేను కిందికి వచ్చేసాను గాని ఆయన నన్ను కొట్టలేదు. నేను టెంత్‌ వరకు సంస్కృతం, ఇంటర్‌లో తెలుగు లిటరేచర్‌, డిగ్రీలో ఇంగ్లీషులిటరేచర్‌ చదవడమ్ వల్ల సాహిత్యం మీద వల్లవలిన ప్రేమనాకు.
  మళ్ళీ ఓసారి మా ఊరి కెళదావ! మా ఊరికి బస్సులేదని ముందే చెప్పానుకదండి. నడవాల్సిందే! పదండి నడుద్దాం. కాలవ దగ్గర ఎర్ర బస్సుదిగి నడవడం మొదలెడితే మీకు ఇళ్ళేం కనబడవు. ఒక వేపు జీడితోటలు, మరోవేపు సరుగుడు తోటలు. ఆ తోటల్లో పడి ఓ మైలున్నర నడిస్తే మా ఇల్లొస్తుంది. ఆ.... అన్నట్టు మీకు ఇంకో రహస్యం చెప్పడం మర్చిపోయా. ఎవరికి చెప్పకండేం. ఎండు సరుగుడాకులు చూసారా ఎపుడైనా? ఎండిపోయిన సరుగుడాకుల్ని తెల్ల కాగితాల్లో చుట్టుకుని గుప్‌ గుప్‌ మని పీల్చి పొగవొదిలేవాళ్ళం. హమ్మ! ఎంత రౌడీ పిల్లలు అని ముక్కుమీద వేలేసుకుంటున్నారా? 'నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు' అని మహాకవే అన్నాడు నాదోలెక్కా. మాకు సిగరెట్లు తయరు చేయడం ఎంత సులువో తెలిసిపోయింది. మాకు నోబుల్‌ ప్రైజ్‌ ఇవ్వాలికూడా.
  మీకు మరోరహస్యం కూడా చెబుతానండి. ఎవరితోనుచెప్పకండి. మా నాయనమ్మ రోజూ పొద్దున్నే మాన్చి్ పోత్తాడి కల్లు ముంతలు ముంతలు లాగించేదంటండి. మీకు ఇంకో సీక్రెట్టు చెప్పేస్తున్నాను. కాచుకోండి. మేం కూడా తాటాకు దొన్నుల్లో నింపుకుని పోత్తాడి కల్లు తాగేసేవోళ్ళమండి. మా ఇంటెనక ఓ పోత్తాడి వుందండి. దాని కల్లు భలే తియ్యగా వుండేదండి. కల్లు అనగానే చాలా మంది మొకాలెందుకో తుమ్మల్లో పొద్దుగకినట్టయిపోతాయి. ఎందుకో నా కర్థమే కాదు. ముంజలు మాత్రం జుర్రుకుంట తినేస్తారు కాని కల్లంటే ఆముదం తాగిన మొకాలు పెడతారు. కల్లంటే కల్తీ కల్లనుకుంటున్నారా ఏంటి కొపదీసి. కాదండి బాబూ! మా వూరి ఈడిగ ఎంకట్రావుడు కల్లు తీస్తాడు. తెల్లారగట్లే అతను చెట్టెక్కడం మనం చెట్లకింద చేరడం. ఫ్రెష్‌. తాగితే అపుడే దింపిన కల్లే తాగాలండి. లేకపోతే యమ డేంజర్‌. కొబ్బరి నీళ్ళలాగానే వుంటదండి. ఒట్టండి. ఆరోగ్యానికి అపుడే తీసిన కల్లు చాలా మంచిదని మా ఎంకట్రావుడు చెపుతాడండి. ఇదండి మావూరి కల్లు బాగోతం.
  మీరందరూ గోలీకాయల్తో గోలీలాడితే మేమ్ జీడిపిక్కల్తో గోలీలాట ఆడి బోలెడు జీడిగింజల్ని సంపాదించేవాళ్ళం. ఆ తర్వాత వాటిని అమ్మి డబ్బులు సంపాదించేవాళ్ళం. పుస్తకాలు కొనుక్కోవాలికదా! డబ్బులంటే గుర్తొచ్చింది. మేం డబ్బులు కూడా తయరు చేసేం. ఫెయిలయామనుకోండి. చిల్ల పెంకుల్ని గుండ్రంగా అరగదీసి సిగరెట్‌ పెట్టెల్లో వుండే ముచ్చిబంగారం అంటించి కొట్టుకు తీసుకెళ్ళి ( రాత్రిపూట) నిమ్మతొనలిమ్మంటే, చిల్లపెంకుల్ని తీసుకుని మా వీపుల్ని విమానంమోత మోగించిన విషయం గుర్తొస్తే చచ్చేంత నవ్వొస్తుంది నాకు. ఇంకా బలుసుచెట్ల కొమ్మలకుండే ముళ్ళకి నేరేడు పండ్లు గుచ్చి ద్రాక్ష గుత్తుల్లా చేసినా, పుంతలోని ఇసకలో ఉసిరి కాయల్ని కప్పెట్టి మర్నాడు తొనలు తొనలుగా వొలుచుకుతిన్నా, బ్రహ్మజెముడు కాయల్ని కాళ్ళంతా పూసుకుని అమ్మోరక్తం అని గగ్గొలు పెట్టినా, పిచ్చికాయలు, తాటాకు కలిపి నమిలి కళ్ళీ కన్నా ఎర్రగా నోరు పండించుకున్నా ఇదంతా మా అల్లరిలో భాగమైనా మా సృజనాత్మకతకి పునాదులని నేననుకుంటాను.
  అందుకే మా ఊరంటే ప్రాణం నాకు. నాకు బంగారు బాల్యాన్నిచ్చిన మా సీతారామపురం నా లైఫ్‌ లైన్‌. ఊరుకుండాల్సిన లక్షణాలు లేని ఊరు కాబట్టి నేనాడింది ఆట పాడింది పాటగా సాగింది. దళితులు, రాజులు, కాపులు తప్ప వేరే ఏ కులం వాళ్ళూ మా వూళ్ళో లేరు. దళితుల అణిచివేత విషయంలోమా ఊరేమీ మినహాయింపు కాదు. మా తాత ఓ భయంకరమైన, కరడుకట్టిన భూస్వామి. పావలా, అర్థణా అప్పిచ్చి ఎకరాలకెకరాలు భూమి రాయించుకున్న దుర్మార్గ భూస్వామి. ఈయన దుర్మార్గానికి బలై కుటుంబాలకు కుటుంబాలే ఊరొదిలి పోయారని, అందులో నా చిన్ననాటి నేస్తం నాగులు కూడ వుందని నేను పెద్దయ్యాకే నాకు అర్థమైంది. దొంగతనాలంటగట్టి దళితుల్ని గుంజలక్కట్టేసి కొట్టిన ఉదంతాలు చూచాయగా గుర్తున్నాయి. పాలేర్ల పెళ్లాల మీద అత్యాచారాలు చేసి, గర్భవతుల్ని చేసిన వాళ్ళూ వున్నారు. వాళ్ళకు పుట్టిన వాళ్ళ పిల్లల్లో తమ పోలికలు చూసుకుని ముఖాలు మాడ్చుకున్న వాళ్ళూ వున్నారు. ఇవన్నీ నాకు పెద్దయ్యాక తెలిసిన నగ్న సత్యాలు. వీటికి, మా వూరిలో నాకున్న అనుబంధానికి ఏం సంబంధం లేదు. పైరు పచ్చల్తో కళ కళలాడే మా ఊరు, ఎత్తైన అరుగుల్తో గంభీరంగా వుండే మా యిల్లు ఎప్పటికీ నా జ్ఞాపకాల్లో సజీవంగా వుంటాయి.
  ఇవండి మా ఊరి సంగతులు. ఇవన్నీ చదివేక మీరు నా బాల్యానుభవాలని ఆడపిల్ల మగపిల్లాడు సున్నితపు తాసులో కొలుత్తారని నాకు తెలుసండి. కల్లు తాగడాలు, సరుగుడు సిగరెట్లు పీల్చడాలు, గొడ్డళ్ళతో కట్టెలు కొట్టడాలు, చిటారుకొమ్మల్లోకి ఎగబాకడాలు, చేపల్ని పట్టుకోవడాలు ఇయ్యన్నీ జనం దృష్టిలో మగానుభవాలు. మగపిల్లలు మాత్రమే చేయల్సిన పనులు. ఆడపిల్లలక్కూడా ఇలాంటి బాల్యం వుంటుందంటే నమ్మరేమో! మనోళ్ళ దృష్టిలో ఆడపిల్లలు ఎచ్చనగాయలూ, వోమన గుంట్లూ ఆడాలి. లక్కపిడతలాటలూ, బొమ్మల పెళ్ళిళ్ళాటలు ఆడాలి. అమ్మలెనక వొంటింట్లో తిరిగి వొంటల్నేర్చుకోవాలి. తమ్ముళ్ళని చెల్లెళ్ళని ఎత్తుకు మోయలి. అడ్డగాడిదలు అన్నలు, తమ్ముళ్ళు తిని తేన్చిన కంచాలు ఎత్తాలి. వినయ విధేయతల్తో నడుములు, మెడలు వొమ్చేసి పెళ్ళికి సిద్ధంగా వుండాలి. అంతేకాని నాలాగా స్వేచ్ఛగా, పక్షిలాగా బయటే తిరగడం, నా కిష్టమైన అన్ని పనుల్ని అడ్డూ, అదుపూ లేకుండా చేసేయడం అబ్బో! చాలా మందికి కంట్లో నలకపడ్డట్లే.
  చివరగా మా దొంగతనాల సంగతుల్జెప్పేసి ముగించేత్తానండి. మా వూర్లో బోలెడన్నిమామిడి తోటలున్నాయని చెప్పేనుకదండి. పచ్చిమామిడికాయలు మాకు బాగానే దొరికేవి కాని పండ్లు చిక్కేవి కాదు. మామిడి కాయల్ని ఎడ్లబండి మీద తీసుకొచ్చి మా తాతకు అప్పచెప్పేవోరు. మా తాత వాటన్నింటిని ఓ పెద్ద గదినిండా పోయించి పండింతర్వాత, కొంచం కొంచం డాగుపడ్డ పళ్ళనే బయటకు తెచ్చి ఇచ్చేవోడు. మాకు చాలా కోపమొచ్చేది. ఒక్క మంచి పండు ఇయ్యొచ్చు కదా అనుకునేవోళ్ళం. చచ్చినా ఇచ్చేవోడు కాదు. మరి మేం తక్కువోళ్ళమా? సరుగుడు కర్రల చివర్న సూదివాటంగా చెక్కి కిటికీల్లోంచి పళ్ళు లాగేసేవోళ్ళం. ఆ గది కిటికీకి రెండు చువ్వల్లేకపోవడం మా పనెంతో సులువుగా అయిపోయేది. బోలెడన్ని మామిడి పండ్లు దొంగతనంగా లాగేసి తినేసేవోళ్ళం. మామిడిపండ్లు ఏమైపోతున్నాయో అర్తం కాక మా తాత జుట్టు పీక్కునేవోడు. ఇక మారెండో దొంగతనం భోగిమంటల కోసం దుంగలు ఎత్తుకురావటం. పొయ్యికిందికి దాచుకున్న కట్టెల్ని ఎత్తుకొచ్చి భోగిమంటల్లో పడేసేవోళ్ళం. ఓసారి పెద్ద గొడవైపోయింది. రామాయమ్మని ఒకామె వుండేది. ఆమె పోట్లాట మొదలెట్టిందంటే ఓ పగల ఓ రాత్రీ నడిచేది. చెంబునిండా నీళ్ళు పెట్టుకుని అవి తాగుతూ మరీ తిట్టేది. దుంగలెత్తుకొచ్చామని మమ్మల్ని దుంపనాశనం తిట్లెన్నో తిట్టి మా చిన్నానతో కొట్టించింది.
  ఇలా రాసుకుంటపోతే ఈ వ్యాసం కొండపల్లి చెంతాడంత పొడుగైపోతాది. అవకాశం దొరికితే తరువాయి భాగం మళ్ళెప్పుడన్నా వినిపిస్తాలెండి. ఇంకా చానా సంగతులున్నాయి మరి.
  నేను ఇప్పటికే హాఫ్‌ సెంచరీ పూర్తి చేసేసాను. ఏభై ఏళ్ళు వచ్చేసినా నా బాల్యం నా కళ్ళకి నవనవోన్మేషంగా కన్పిస్తూనే వుంటుంది. నా పెదాల మీద తురాయి పువ్వుల్ని పూయిస్తూనే వుంటుంది. మ ఊరు జున్నుముక్కలా నన్ను ఊరిస్తనే వుంటుంది. మా సపోటతోట నూతిలోని తెల్లని కలువపూలు నన్ను రా రమ్మని పిలుస్తనే వుంటాయి.
  మరింక శెలవుచ్చుకుంటానండి. మా ఊరంటే మీకూ ప్రేమ పుట్టే వుంటుంది. మీరందరూ కూడా మా ఊరిని, నాకు ప్రాణప్రదమైన మా సీతారామపురాన్ని ప్రేమించాలని కోరుకుంటూ....

Sunday, April 26, 2009

కనుక్కున్న వాళ్ళకి కొండంత ఆనందం



అస్తవ్యస్తంగా,మహా రష్ గా ఉండే హిమాయత్ నగర్ మెయిన్ రోడ్డులో ఒక్క చెట్టు లేదు.ఎంత విషాదం?
చెత్త చెత్తగా భవనాలు,రోడ్డంతా ఆక్రమించుకుంటూ
వాహనాలూ.
నిజానికి ఆ రోడ్లో డ్రైవ్ చెయ్యడమంటే మహా మంట నాకు.
కానీ ఇపుడు ఆ రోడ్లో వెళ్ళడమంటే ఎంత ఇష్టమో చెప్పలేను.
ఎందుకలాగా అని ప్రశ్నార్ధకం పోజ్ లో కి వచ్చేసారా?
అదే కదా నా ప్రశ్న.
కనుక్కోండి. చూద్దాం.
ఒక్క చెట్టైనా లేని హిమాయత్ నగర్ మెయిన్ రోడ్లో
అందమైన,సువాసనలు వెదజల్లే నాగమల్లి చెట్టుందంటే మీరు నమ్ముతారా?
పచ్చటి ఆకుల్తో,మొదలంటా పూసిన పరిమళాల పువ్వుల్తో
కాంక్రీట్ మహారణ్యంలో కొలువుతీరిన నాగమల్లిని కనుక్కోండీ .కొండంత ఆనందాన్ని సొంతం చేసుకోండి.

Thursday, April 16, 2009

కులూ లోయలూ మనాలీ మంచు శిఖరాలూ





కులూ లోయల అగాధాలు

మనాలి మంచు కొండల సోయగాలు

పార్వతీ నది పరవళ్ళు

బియాస్ మహా నది ఉరవళ్ళు

వశిష్ట గ్రామం లో ఉల్లాసపు నడకలు

హడింబమ్మకి కట్టిన గుళ్ళు

ఘటొత్కచుడి గోపురాలు

కనుచూపుమేరంతా

కమ్ముకున్న ఏపిల్ పూల పరిమళాలు

మణికరణ్ లో సలసలకాగే

భాస్వరపు నీటి గుండాలు

నేచురల్ నీటీ గుండాల్లో

ఉడికిన అన్నాల ఆరగింపులూ

ఐస్ వాటర్లో బతికే ట్రాట్ ఫిష్

వేడి వేడి వేపుళ్ళూ

హిమాలయాల అంచుల్లో ఉన్న

హిమాచల్ అందాలు చూసి తీరాల్సిందే

హిమవత్పర్వతాల స్వచ్చత్వం లో మునకలేయాల్సిందే

మనశ్శరీరాల మహా వికారాలన్ని

మటుమాయం చేసుకోవాల్సిందే

మంచుకప్పుకున్న మహా పర్వతాల ముందు

మనోవాక్కయకర్మలా మోకరిల్లాల్సిందే

ఉల్లాసం ఉత్సాహం ఉద్వేగం

ముప్పేటలా మనస్సు నిండా ముప్పిరిగొన్న

మనాలీ మంచు కొండల యాత్ర

గుండెల్లో గూడు కట్టుకున్న

గమ్మత్తు జ్ఞాపకాల సమాహరం

మత్తులో సోలిపోయిన మధుర్యాల మణిహారం

మండు వేసవిలో చందనాల లేపనం

తర్పణాలు త్రిశంకు స్వర్గాలు

 తర్పణాలు, త్రిశంకు స్వర్గాలు ............ మా సీతారాంపురం లో మా తాతకి చాలా పొలాలు ఉండేవి. మా తాత, చిన్న తాత ఇద్దరే పొలాలన్నింటిని పంచుకున్నా...