Friday, June 25, 2021

ఎక్కిన సైకిల్ దిగాలంటే మైలురాయే దిక్కు


సైకిల్ కి ఓ అంతర్జాతీయ దినోత్సవం ఉందని నాకు తెలియదు.
రఘు మందాటి వాల్ మీద సైకిల్ గురించిన పోస్ట్ చదివాకా నాకు సైకిల్ తో ఉన్న అనుభవం గుర్తొచ్చింది.తప్పక రాయాల్సిన అనుభవం కూడా.
నా చిన్నప్పుడు బహుశా పన్నెండు పదమూడేళ్ళుంటాయేమో నాకు.
మాది చాలా పెద్ద ఉమ్మడి కుటుంబం.మా నాయనమ్మ,తాత లకి తొమ్మండుగులు సంతానం.ఏడుగురు కొడుకులు,ఇద్దరు కూతుళ్ళు.
అందరికీ ఆరు లేక ఏడుగురేసి పిల్లలు.మేము ఐదుగురం.ఇద్దరక్కలు,ఒక తమ్ముడు ఒక అన్న.
అలా అందరింట్లోను పుష్కలంగా పిల్లలుండేవాళ్ళు.
చుట్టాలు,మా కుటుంబం లోనే ఉండే కొంతమంది ఆడవాళ్ళు కలిసి డెబ్భై మంది వరకు ఉండేవాళ్ళు.అంత పెద్ద కుటుంబమన్నమాట.
మా వీధరుగు మీదే బడి ఉండేది.సూర్య ప్రభ అనే టీచర్ వచ్చి చదువుచెప్పేవారు.
తర్వాత రామాలయం దగ్గర బడి బిల్డింగ్ కట్టారు.రామన్న పంతులు,బాపిరాజు అనే టీచర్లు వచ్చి చదువుచెప్పేవారు.అక్కడ ఐదువరకే ఉండేది.ఆరు చదవాలంటే పెద్ద సీతారామపురం వెళ్ళాలి.అన్నట్టు మాది చిన్న సీతారామపురామన్నమాట.
మా వీధిబయట బోలెడన్ని సెకిళ్ళుండేవి.మా నాన్న సెకిల్ మీదే పొలమెళ్ళేవాడు.మా చిన్నాన్న,పెదనాన్నలు కూడా సైకిళ్ళే వాడేవారు.
సైకిళ్ళు ఖాళీగా ఉన్నప్పుడు మగపిల్లలు ధనాధనా కిందా మీదా పడుతూ నేర్చేసుకునేవాళ్ళు.
స్కూళ్ళకి వేసుకెళ్ళేవాళ్ళు.
ఆడపిల్లలం సైకిళ్ళు నేర్చుకోవడానికి చాలా కష్టపడేవాళ్ళం.
ఒకటి చాలా ఎత్తుగా ఉండడం రెండు గౌనుల మీద ఎక్కలేకపోవడం.
ఎన్నోసార్లు ఫెడల్ మీద నుంచి తొక్కి గౌనులు చింపుకోవడం.మాకు ఎక్కువ గౌనులు కూడా ఉండేవి కావు.
చాలా తక్కువగా లంగా జాకెట్ లు ఉండేవి.లంగా కట్టినప్పుడు కచ్చాపోసి సైకిల్ తొక్కేసే వాళ్ళం.
ఒకటో రెండో లంగాలు చిరిగాయంటే వీపులు విమానం మోతలే.
మా అమ్మ నాన్న నన్నెప్పుడూ కొట్టినట్టు నాకు జ్ఞాపకం లేదు.సైకిల్ తొక్కద్దని కూడా ఎవరూ రూల్స్ పెట్టలేదు.మీ పాట్లు మీరు పడండి అని వదిలేసారు అంతే.ఆడపిల్లల కోసం ముందు రాడ్ లేకుండా కొంచం ఎత్తుతక్కువ సైకిళ్ళున్నాయని మాకు తెలిసే అవకాశమే లేదు.మా నాన్నకి కూడా తెలిసుండదు.తెలిసుంటే తప్పకుండా నా కోసం ఆడపిల్లల సైకిల్ కొనేవాడు.
అలా అష్టకష్ఠాలు పడి సైకిల్ నేర్చేసుకున్నాను.
మాది చాలా ఎత్తైన అరుగులున్న మండువా లోగిలి.సైకిల్ ని చీడీలవరకు తెచ్చి హాయిగా ఎక్కేసేదాన్ని కానీ దిగేటప్పుడు కాళ్ళు నేలకి అందేవి కాదు.మళ్ళీ చీడిలదాకా వచ్చి దిగాల్సిందే.
ఊర్లో వరకే ఈ సాహసాలు.
మా ఊరి నుండి మెయిన్ రోడ్డు దాదాపు ఒక కిలోమీటర్ దూరముంటుంది.
ఈ దూరమంతా నడిచి కాలవ గట్టుకి వస్తే ఎర్రబస్సులు,రిక్షాలు,గుర్రం బండీ లు దొరుకుతాయి.కానీ డబ్బులివ్వాలి కదా.
మా నాన్న నన్ను నోరు తిరగని ఓ స్కూల్లో చేర్పించాడు.
దాని పేరు "హిందూ స్త్రీ పునర్వివాహ సహాయక సంఘం స్కూల్."
షార్ట్ గా "విడో హోం" అనేవాళ్ళు.అది ఓరియంటల్ స్కూల్,అక్కడ సంస్కృతం తప్ప వేరే సబ్జెక్ట్ ఉండదు.
మా సీతారామపురం నుండి నాలుగు కిలోమీటర్ల దూరం లో ఉన్న నరసాపురం లోని స్కూల్ కి వచ్చేదాన్ని.
చాలా సార్లు నడకే,కొన్ని సార్లు మా కజిన్స్ దింపడం.చాలా సార్లు సైకిళ్ళ మీద స్కూల్ కి వెళ్ళే మగపిల్లల్ని లిఫ్ట్ అడిగి వెళ్ళేదాన్ని.
సరే..సైకిల్ కధకొస్తే నరసాపురం వరకు సైకిల్ మీద వెళ్ళడానికి ప్రయత్నం చేసి దిగడం రాక కింద పడి చాలా దెబ్బలు తగిలించుకున్నాను.
ఓ రోజు సైకిల్ మీద వెళుతున్నాను.పుస్తకాలు జారిపోయాయి.ఎలా దిగాలి.
నా దృష్టి పక్కనే ఉన్న మైలు రాయి మీద పడింది.
సైకిల్ బ్రేక్ వేసి మైలు రాయి మీద కాలేసి సునాయాసంగా దిగిపోయాను.సైకిల్ స్టాండ్ వేసి పుస్తకాలు తెచ్చుకుని స్కూల్ కి వెళ్ళిపోయాను.
ఆ తర్వాత సైకిల్ దిగేటప్పుడు మళ్ళీ కిందపడలేదు.దెబ్బలు తగిలించుకోలేదు.
నాకేదో సొంతంగా సైకిలుండేదని,రోజూ ఝామ్మంటూ వెళ్ళేదాన్నని అనుకునేరు.
అలా ఏమీ లేదు.ఎప్పుడైనా సైకిల్ ఖాళీగా ఉంటే నేను ఎవ్వరికీ చెప్పాపెట్టకుండా సైకిల్ తీసుకుని ఉడాయించేదాన్ని.
చాలా సార్లు మధ్యలో స్కూల్ కి వచ్చి ఎవరో ఒకరు తీసుకెళ్ళిపోయేవారు.
మా నడక,లిఫ్ట్ లు షరా మామూలే.
ఎత్తైన సైకిల్ మీద నుంచి మహా పొట్టిగా ఉండే నేను దిగాలంటే నేను కనిపెట్టిన సాధనం మైలురాయి.
ఆడపిల్లలకి అనుకూలమైన సైకిళ్ళొచ్చేసాయి గానీ నేను కనిపెట్టిన మైలురాయి ప్రయోగం తక్కువదేమీ కాదని నా ఉద్ధేశ్యం.
నాకు ఇప్పటికీ సైకిల్ తొక్కడం చాలా ఇష్టం.స్కూటర్లు,కార్లు వచ్చాకా కూడా మనసు సైకిల్ మీదే ఉంటుంది.
ఆ మధ్య ప్రశాంతి తో కలిసి వర్ని వెళ్ళినప్పుడు ఉండబట్టలేక పిల్లల సైకిల్ తొక్కాను.భలే మజా వచ్చింది.
May be an image of Jayalakshmi Akula, bicycle and road
Uma Nuthakki, Chaithanya Pingali and 61 others
5 Comments
Like
Comment
Share

”అభివృద్ధి" చీకటికోణం


----కొండవీటి సత్యవతి
......................
”సతీష్‌!”
పరధ్యానంగా నడుస్తున్న నేను ఠక్కున ఆగిపోయాను.
ఆమె వేపు పరిశీలనగా చూసాను. చెట్టు నీడలో నిలుచుని వుంది. స్పష్టంగా కనబడడం లేదు.
”ఎవరు మీరు?”
” మళ్ళీ ఒకసారి చూడు” అంటూ వెలుతురులోకి వచ్చింది.
”చంద్రకళా! నువ్వా?
”హమ్మయ్య! గుర్తు పట్ట్టావా? నువ్వ లాగే వున్నావ్‌.”
”నువ్వు చాలా మారిపోయావ్‌? ఏమైంది?”
”ఏం చెప్పమంటావ్‌?”
”శంషాబాద్‌ నుంచి ఇక్కడికెందు కొచ్చావ్‌?”
”ఇప్పుడక్కడేమీ లేదు.”
”మీ ఇల్లుందిగా.కొండలదగ్గర”
”ఇపుడు ఆ ఇల్లు లేదు”
”ఏమైంది అమ్మేసారా?”
””కూల్చేసారు”
”కూల్చేసారా? ఎవరు?”
”అక్కడ ఎయిర్‌పోర్ట్‌ వచ్చిందిగా”
”అయితే! కాంపన్‌సేషన్‌ వచ్చుంటుం దిగా. ఎయిర్‌పోర్ట్‌ మీ ఇంటిదాకా వచ్చిందా?”
”ఆ..వచ్చింది.కోట్లోచ్చాయి ఇంటికి, పొలానికి”
”మరి??”
”ఆ డబ్బు తీసుకుని మా ఆయన పారిపోయాడు.”
”పద ఇంటికెళదాం. ఇంటికెళ్ళి మాట్లా డుకుందాం”. చంద్రకళ ఏం మాట్లాడకుండా కార్లో కూర్చుంది.
*****
సరిగ్గా పదేళ్ళయింది చంద్రకళని చూసి. నేను నా చదువు పూర్తవ్వగానే యు.ఎస్‌ వెళ్ళిపోయాను. మంచి ఉద్యోగం చేస్తూ చాలా సంపాదించాను. ఇండియాకి తిరిగొచ్చి ఆరు నెలలవుతోంది. అక్కడ సంపాదించిన సొమ్ముని ఏ బిజినెస్‌లో పెట్టాలా, ఎలా దాన్ని రెట్టింపు చెయ్యాలనే ఆలోచనల్లో మునిగి తేలుతున్నాను. అమెరికా వెళ్ళక ముందు హైటెక్‌ సిటీలో ఉద్యోగం చేసేటపుడు చంద్రకళతో పరిచయమైంది. నాకొలీగుకి అక్క వరుసయ్యే ఆమెను మొదటిసారి వాళ్ళింట్లోనే చూసాను. ఆమె భర్త ఆ ప్రాంతంలో ఛోటా రాజకీయనాయకుడు. ఎప్పుడూ రాజకీయాల్లో మునిగి తేలుతుండే వాడు.
చంద్రకళ పేరుకు తగ్గట్టే వుండేది. చాలా అందంగా, హుందాగా వుండేది. నా కొలీగు శంకర్‌ మొదటిసారి వాళ్ళింటికి తీసుకెళ్ళినా ఆ తర్వాత నేను చాలా సార్లు ఒక్కణ్ణి వెళ్ళేవాణ్ణి. ఎందుకో తెలియని ఆత్మీయత ఏర్పడింది ఆమెతో. ఆమె భర్త అసలు ఇంటి పట్టున వుండేవాడు కాదు. నాకన్న అయిదారేళ్ళ పెద్దదే అయినా చంద్రకళ చూడ్డానికి అలా వుండేది కాదు. నాకు ముందూ వెనకా ఎవరూ లేరు. ఆమె చూపించే ప్రేమకు కరిగిపోయేవాడిని. ఆ ప్రేమకి ఏం పేరు పెట్టాలో కూడా నాకూ తెలియదు. నా ఏకాకి జీవితంలో ఆమె పరిచయం ఓ నిండుతనం చేకూర్చి నట్టయ్యేది. అలాంటి చంద్రకళ ఇపుడిలా…
******
చంద్రకళ వెక్కి వెక్కి ఏడుస్తోంది. నా ఫ్లాట్‌ లోని హాల్లో సోఫా మీద కూర్చుని చేతుల్లో ముఖం దాచుకుని ఏడుస్తోంది. నేను ప్యాక్‌ చేయించి తెచ్చిన బిర్యానీ అలాగే పడి వుంది.ఎంత అడిగినా తినలేదు. ”ప్లీజ్‌ ! వూరుకో..చంద్రకళా!”.
వెంటనే లేచివెళ్ళి సింక్‌ దగ్గర ముఖం కడుక్కుంది. అద్దంలో ముఖం చూసుకుంటూ నిలబడింది. నేను డైనింగు టేబుల్‌ మీద ప్లేట్‌ పెట్టి, బిర్యానీ ప్యాకెట్‌ విప్పి హాట్‌ప్యాక్‌లో వేసాను. నిశ్శబ్దంగా వచ్చి కూర్చుంది.
”నువ్వు నన్ను గుర్తు పట్టడం నాకు చాలా ఆశ్చర్యంగా వుంది.”
”ఎందుకు గుర్తు పట్టను? పదేళ్ళలో ఏమంత మార్పు వస్తుంది.”
”ఏమంత మార్పు వస్తుందా? నా జీవితంలో ఎన్ని మార్పులొచ్చాయో చూస్తున్నావుగా. పది సంవత్సరాలలో నా బతుకు తలకిందులై పోయింది.
”అదే నాకూ ఆశ్చర్యంగా వుంది. శంకరేమయ్యాడు.”
”చనిపోయాడు యాక్సిడెంట్‌లో”
”నిజమా!నాకు తెలియదే’!
”బైక్‌ యాక్సిడెంట్‌లో స్పాట్‌లో పొయ్యాడు. పెళ్ళయిన రెండేళ్ళకి జరిగింది.”
”సో. సాడ్‌”
కడుపు నిండా బిర్యానీ తిన్నది చంద్రకళ. నేను ఆమెనే చూస్తు వున్నాను.
”నీ గురించి చెప్పు. పెళ్ళి చేసు కోలేదా?”
”చేసుకున్నాను. డైవోర్స్‌కూడా అయిపోయింది. అమెరికాలోనే”.
”అవునా? ఎందుకు? నీకు డైవోర్స్‌ ఇచ్చిన మనిషిని ఏమనాలి?
”ఏం ఎందుకలా అన్నావ్‌”
”నువ్వు చాలా బుద్ధిమంతుడివి. మంచివాడివి”
”ఈ పదేళ్ళలో మారిపోవచ్చుగా.”
”నేను నమ్మను”
”అది సరేగాని చంద్రకళా! మీ ఆయన మీద పోలీస్‌ రిపోర్ట్‌ ఇవ్వలేదా?
”ఏమని ఇవ్వను? ఇవ్వలేదు. నీకు తెలియదు. నాలాగా ఎందరో ఇల్లూ, వాకిలి పోయి రోడ్డున పడ్డారు. నడమంత్రంగా వచ్చిన డబ్బుల్తో మగాళ్ళు జల్సాలు చేసారు. బండ్లు, కార్లు కొన్నారు. భార్యా పిల్లల్ని వదిలేసి రెండో పెళ్ళి చేసుకున్నవాళ్ళున్నారు. మా ఆయన కూడా రెండోపెళ్ళి చేసుకుని హైదరాబాద్‌లోనే ఫ్లాట్‌ కొని వుంటున్నాడని తర్వాత తెలిసింది.”
”ఇది చాలా అన్యాయం! మీ ఊరెంత బావుండేది. ఆ కొండలు, గులాబీ, కనకంబారాల తోటలు. అసలు ఆ చుట్టు పక్కలన్నీ పూలు, పండ్ల తోటలే కదా!”
”నీకు బాగానే గుర్తుంది. ఎయిర్‌పోర్ట్‌ భూతంలా ఆ తోటల్ని మింగేసింది. మా బతుకుల్ని కుక్కలు చింపిన విస్తర్లు చేసింది.” చంద్రకళ కళ్ళల్లో నీళ్ళొచ్చాయి.
ఎయిర్‌ఫోర్ట్‌ అనగానే నాకు ఠక్కున గుర్తొచ్చింది. పన్నెండింటికి ఎయిర్‌పోర్ట్‌ కెళ్ళాలి. లండన్‌ నుంచి కజిన్‌ వస్తున్నాడు. వాడిని రిసీవ్‌ చేసుకోవాలి.
”చంద్రకళా! మీ ఇల్లెక్కడ చెప్పు. నిన్ను డ్రాప్‌ చేసుకుంటూ నేను ఎయిర్‌పోర్ట్‌ కెళతాను. ఒంటిగంటకి తమ్ముడొస్తున్నాడు.”
”మా ఇల్లా? మెహదీపట్నంలో దింపెయ్‌. నేను వెళ్ళి పోతాను…”
”ఇంకా టైముందిలే. నిన్ను మీ ఇంటి దగ్గర వదిలేస్తాను.”
”నేను నీతో ఎయిర్‌పోర్ట్‌కు రావొచ్చా. ఎపుడూ చూళ్ళేదు.”
”ఎయిర్‌పోర్ట్‌కా? ఒ.కె. రావొచ్చు. కానీ…”
”వద్దులే సతీష్‌. ఊరికే అన్నాను.”
”ఒక్క నిమిషముండు.” అని చెప్పి అనిల్‌ అనే మరో కజిన్‌కి ఫోన్‌ చేసి నాకు అర్జంటు పని వుందని, తనని ఎయిర్‌పోర్ట్‌ కెళ్ళమని చెప్పాను. ”అదేంటి? నా గురించి నువ్వు ఎందుకు మానేస్తావ్‌.?”
”నేనే వెళ్ళక్కరలేదులే వాడికోసం. టాక్సీ తీసుకునయినా వెళ్ళి పోతాడు. యుఎస్‌ వెళ్ళాక పదేళ్ళ వరకు నేను ఇండియా రాలేదు. నువ్వెపుడూ జ్ఞాపకమొస్తూనే వుండేదానివి. ఎయిర్‌ పోర్ట్‌లో మీ భూములు పోయినా నష్టపరిహారమొచ్చి వుంటుంది హాయిగా వున్నావనుకున్నాను. నిన్నిలా చూడ్డం నాకు చాలా బాధగా వుంది.”
”అవన్నీ గుర్తు పెట్టుకోవడం నీ మంచి తనం. నీ కోసం ఏమి చేసానని అంత అభిమానం? కట్టుకున్నవాడికే ఏమీ లేకుండా పోయింది.”
”నాకోసం నువ్వేం చేసావో నాకే తెలుసు చంద్రకళా! వెళ్ళదామా”
”పద వెళదాం”.
”ఫ్లాట్‌కి తాళం వేసి లిఫ్ట్‌లో కిందికి దిగాం. వాచ్‌మెన్‌ చంద్రకళని ఎగాదిగా చూస్తున్నాడు. అదేం పట్టించుకోకుండా కారు బయటకు తీసాను. కారు పి.వి. నర్సింహారావ్‌ ఎక్స్‌ప్రెస్‌ ప్ల్తె ఓవర్‌ మీద రయ్‌మంటూ వెళు తోంది. చంద్రకళ కునికిపాట్లు పడుతోంది.
”నిద్రపోతున్నావా?”
”ఉదయం నించీ ఏమీ తినలేదు. కడుపునిండా బిర్యానీ పెట్టావుగా నిద్ర వస్తోంది.”
”ఏమి తినలేదా? ఎందుకని?”
”డబ్బుల్లేవు. ఇంట్లో ఏం లేవు.”
నాకు తెలియకుండానే నా కాలు బ్రేకు మీద పడింది. సడన్‌గా కారు ఆపేసరికి వెనక కారు కిర్రుమంటూ ఆగింది.
సారీ చెప్పి కారు ముందుకి పోనిచ్చాను. ”అదేంటి? ఇంత పెద్ద నగరంలో నీకు అన్నం పెట్టే ఫ్రెెండ్స్‌ లేరా?
”ఫ్రెండ్స్‌? నాలాంటి వాళ్ళకి ఫ్రెండ్సెవరుంటారు.”
”డోంట్‌ సే లైక్‌ దట్‌ ప్లీజ్‌!”
”నేను నిజం చెబుతున్నాను సతీష్‌! నీ దగ్గర అబద్ధం చెప్పాల్సిన అవసరం మేంటి చెప్పు! మా ఆయన వదిలేసి పోయాక సిటీలో కొచ్చి ఇండ్లల్లో బాసాన్ల పనిచేసాను. ఒకరింట్లో వంట చేసాను. వాళ్ళే ఇంట్లో గది ఇచ్చారు. ఓ అర్ధరాత్రి ఇంటాయన నా గదిలో కొచ్చి నా మీద అత్యాచారం చేసాడు. డబ్బిచ్చి లొంగదీసుకునేవాడు. నేను మొదట్లో ప్రతిఘటించినా తర్వాత లొంగిపోయాను. ఆ తర్వాత అతని భార్యకి తెలియడంతో పెద్ద గొడవైంది. నన్ను వెళ్ళగొట్టేసారు. నేను మళ్ళీ రోడ్డున పడ్డాను.”
కారు ఫ్లై ఓవర్‌ దిగి హైవే మీది కొచ్చింది. ”నీకు ఎక్కడా ఉద్యోగం దొరక లేదా?”
”ఉద్యోగమా? నా చదువుకి ఉద్యోగమెవరిస్తారు? అయినా అదీ అయ్యింది. ఓ డిపార్ట్‌మెంటల్‌ స్టోర్స్‌లో సేల్స్‌గరల్‌గా చేరాను. ఉదయం నుంచి సాయంత్రం దాకా చాకిరీ. ఓ చిన్న గదిలో అద్దెకుండేదాన్ని. నాతోపాటు పనిచేసే మనిషిి ఓ రాత్రి ఫుల్‌గా తాగొచ్చి నా రూమ్‌లో చొరబడ్డాడు. అతన్ని బయటకు గెంటి, మర్నాడు కంప్లయింట్‌ ఇస్తే నా ఉద్యోగం పీకేసారు.”
కారు శంషాబాద్‌ దగ్గర ఎడంవేపు తిరిగింది. దూరంగా ధగద్ధగాయమానంగా వెలిగి పోతున్న ఎయిర్‌ఫోర్ట్‌. రోడ్డుకి అటూ ఇటూ పచ్చటి తివాచీ పరిచినట్టు గడ్డి. రకరకాల పూల మొక్కలు వాటి మధ్య అమర్చిన లైట్లలో వెలిగిపోతున్న పరిసరాలు.
”మా ఊరు ఎక్కడుందో ఎలా తెలుస్తుంది?” అంది హఠాత్తుగా చంద్రకళ.
”మీ ఊరా? ఇపుడిక్కడ ఊర్లేమీ లేవనుకుంటాను.”
”మా ఊరు నీకు గుర్తుందా? సతీష్‌?”
”ఎందుకు గుర్తుండదు? మీ పొలాలు, పూలతోటలు అన్నీ గుర్తున్నాయి. నువ్వు జొన్న రొట్టె, నాటుకోడి పులుసు భలే చేసేదానివి.”
”మా పూలతోటలు పీకేసి ఇవేంటో పూలు పెట్టారు. ఎకరాలకి ఎకరాల గులాబీ తోటలు ఏమైపోయాయో!”
”ఇవన్నీ ఆర్టిఫీషియల్‌గా డెవలప్‌ చేసారు. ఆ ఖర్జూరం చెట్లు చూసావా? ఎడారుల్లో పెరుగుతాయి.”
”మా ఊరిని ఎడారే చేసారు. ఇక్కడ బోలెడన్ని తాటి చెట్లుండేవి. అవన్నీ పెకిలించేసారన్నమాట.” ”నాకు మా ఊరు, ఇల్లు గుర్తొస్తున్నాయ్‌. ఈ ఎయిర్‌పోర్ట్‌ వల్లనే కదా నా బతుకిలా అయ్యిందనిపిస్తోంది. ఇది రాకపోతే మా భూములుపొయ్యేవి కాదు. అంత ధర వచ్చేది కాదు. ఆ డబ్బుతో నా మొగుడు పరారయ్యేవాడే కాదు. దీని కింద నాలాగా ఎంతమంది నాశనమయ్యారో చంద్రకళ గొంతు దు:ఖంతో పూడుకు పోయింది.
కారు యూ టర్న్‌ తీసుకుని వెనక్కి తిరిగింది. చంద్రకళ లైట్ల వెలుతురో వెలిగిపోతున్న ఎయిర్‌పోర్ట్‌వేపు దీర్ఘంగా చూస్తూ కూర్చుంది.
నేనూ ఏమీ మాట్లాడకుండా కారు నడుపుతున్నాను. తనని ఎక్కడ దింపాలా అని ఆలోచిస్తున్నాను. నా మనసులో మాట కనిపెట్టినట్టు
”నన్ను మెహదీపట్నంలో దింపెయ్‌.”
”సరే. మళ్ళీ ఎప్పుడు కలుస్తావ్‌”.
”ఏమో!”
”మీ ఇల్లు చూపించు నేనే వస్తాను.”
”వద్దులే. నేను ఫోన్‌ చేస్తాను.
చంద్రకళని మెహదీపట్నంలో దింపేసి, తప్పకుండా ఫోన్‌ చెయ్యమని చెప్పి నా నంబర్‌ రాసిచ్చి నేను నా కజిన్‌ ఇంటికి బయలుదేరాను.
*******
అమెరికా నించి తిరిగొచ్చాక ఏదైనా బిజినెస్‌ మొదలు పెట్టాలనే ఆలోచనలో రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాను. నా ఫ్రెండ్‌ అన్వర్‌ కూడా నా తో కలవాలని అనుకుంటున్నాడు. ఇద్దరం కలిసి ఏదైనా సాఫ్ట్‌వేర్‌ కంపెనీని ప్రారంభిస్తే ఎలా వుంటుందని తర్జనభర్జనలు చేసున్నాం.
నేను అన్వర్‌తో మీటింగులో వున్న సమయంలో చంద్రకళ ఫోన్‌ చేసింది. ఆమెని ఆ రోజు మెహదీపట్నంలో దింపేసాక ఒకటి రెండుసార్లు మాట్లాడింది.
”సతీష్‌! ఒకసారి సికింద్రాబాద్‌ స్టేషన్‌ దగ్గరకొస్తావా?”
”స్టేషన్‌కా? ఎందుకు ఊరెళు తున్నావా?”
”లేదు ఊరెళ్ళడం లేదు. నీతో మాట్లాడాలి.” ”స్టేషన్‌ దగ్గర ఎక్కడుంటావ్‌”?
”మహంకాళి పోలీస్‌స్టేషన్‌ కాడికి రా”
”పోలీస్‌ స్టేషన్‌లో ఎందుకున్నావ్‌? ఏమైంది?”
”పోలీసులు పట్టుకొచ్చారు. మామూ లుగా అయితే కొంచెం సేపుంచి ఒదిలేస్తారు. ఎస్‌.ఐ ఒదలనంటున్నాడు. నాతో పాటు మరో పదిమందున్నారు.”
”సరే నేను ఎస్‌.ఐతో మాట్లాడతానులే. డబ్బు కోసం అయ్యుంటుంది. నేను వస్తానులే.”
అన్వర్‌ నా వేపు వింతగా చూడ్డం గమనించి
”అన్వర్‌! రేపు మాట్లాడుకుందాం. నేను అర్జంటుగా వెళ్ళాలి.”
బిబిబి
చంద్రకళతో సహ మరో పదిమందిని విడిపించి బయటకొస్తుంటే
”సతీష్‌! చాలా థాంక్స్‌. మా ఆఫీసు చూస్తావా?”
”మీ ఆఫీసా? ఉద్యోగం దొరికిందా? చెప్పలేదేం.”
”మా సంఘం ఆఫీసు ఇక్కడికి దగ్గరే.”
”సంఘమా! ఏం సంఘం?” నా ఆశ్చర్యానికి అంతులేకుండా పోయింది.
”సెక్స్‌ వర్కర్ల సంఘం.”
”మీకు ఒక సంఘం కూడా వుందా? నాకంతా అమోమయంగా వుంది.”
సీతాఫల్‌మండివేపు వెళుతున్నాం. స్రవంతి మహిళామండలి అని బోర్డు పెట్టిన ఇంటిముందు ఆగాం.
చంద్రకళ ముందు నడుస్తుంటే నేను ఆమెను అనుసరించాను.
ఇంటిలోపలికెళ్ళాం. చాలామంది ఆడవాళ్ళున్నారు. ఏదో మీటింగు జరుగుతోంది. అక్కడ వున్న ఆడవాళ్ళంతా సెక్స్‌వర్కర్లంటే నాకు నమ్మకం కలగలేదు. నాకు తెలియని ఏదో కొత్త లోకంలోకి వచ్చినట్లనిపించింది.
సంఘం ప్రెసిడెంట్‌ని పరిచయం చేసింది. ఆవిడపేరు కనకదుర్గ. తన రూమ్‌లో కూర్చుందామని తీసుకెళ్ళింది. గోడల నిండా పోస్టర్లు అతికించివున్నాయి. సెక్స్‌వర్కర్లు ఎదుర్కొంటున్న సమస్యలమీద ఎక్కువ పోస్టర్లు కనబడుతున్నాయి. ”మా వాళ్ళని విడిపించి నందుకు చాలా ధాంక్సండి. నేను వెళ్ళి అడిగితే ఒదలనన్నాడు. రేపు కోర్టులో అందరికీ ఫైన్‌ కట్టాలంటే కష్టం.” అంది.
”ఈయన పేరు సతీష్‌. నేను శంషా బాద్‌లో మా ఇంట్లో వుండేటపుడు పరిచయం. చాలా మంచివాడు” అని నన్ను పరిచయం చేసింది.
”అవునా? నిజంగానే మీరు చాలా గొప్ప వారులా వున్నారు. లేకుంటే ఈ ఆఫీసు చుట్టు పక్కలకి ఎవరూ రారు.”
”అబ్బే! అలాంటిదేమీ లేదు. చంద్రకళ కష్టంలో వుంటే వచ్చాను. ఇలాంటి సంఘం ఒకటుందని నాకు తెలియదు.”
”మా సంఘంలో ఐదువేలమంది సభ్యులున్నారు.”
”ఐదువేలమందా?” ఆశ్చర్యపోయాను.
”మీకో విషయం తెలుసా? సికింద్రా బాద్‌ చుట్టూ పదివేలమంది ప్రతిరోజూ బిజినెస్‌ చేస్తూ బతుకుతారు.”
”నిజంగానే”
”అబద్ధం ఎందుకు చెబుతాను. ఎంతో మంది వేరేదారి లేక ఈ వృత్తిలోకి వస్తుంటారు. నిత్యం పోలీసులు, గుండాల దాడుల్లో నలుగుతుంటారు. అరెస్టులు, కేసులు, మాకు సమస్యలకేం కొదువలేదు.”
”మరెందుకు ఈ వృత్తిలోకి వస్తుంటారు. వేరే పనేదైనా చేసుకోవచ్చుగా.”
”ఆ మాట అందరూ చాలా తేలిగ్గా అనేస్తారు. చంద్ర మీకేమీ చెప్పలేదా? తను అన్ని చేసే కదా చివరికి ఇక్కడి కొచ్చింది. కొందరి జీవితాలు ఎంత నికృష్టంగా వుంటాయో మీకు తెలియదు. వాళ్ళకి ఈ వృత్తే తిండి పెడుతుంది. లేకపోతే ఆకలికి మాడి చావాల్సిందే!”
”అసలు ఇన్ని వేలమంది ఎందుకొస్తున్నారు ఇందులోకి”
”మీ మగవాళ్ళ వల్లే. క్షమించు సతీష్‌. ఇలా అంటున్నందుకు . మా ఆయన నన్ను రోడ్డు మీద ఒదిలేసిపోయాడు. ప్రేమ పేరుతో వంచించి తెచ్చి ఇక్కడ అమ్మేస్తారు. చాలా మంది పల్లెల్నుంచి పనివెతుక్కుంటూ వచ్చి పనులు దొరక్క ఇందులో తేలు తుంటారు. ఎవ్వరు ఇష్టంతోనైతే రారు. బతకడానికి, చాలాసార్లు పిల్లలికి తిండి పెట్టడానికి కూడా ఇక్కడికొస్తుంటారు. నేను బతికిన బతుకేంటి? ఇపుడు నా స్థితేంటి? సతీష్‌! ఈ బురదలోకి ఒకసారి వస్తే ఇంక అంతే!”చంద్రకళ అంది.
నా తల తిరుగతున్నట్టుగా వుంది.
”మగవాళ్ళు మాకెంత ద్రోహం చేసి తెచ్చి ఈ మురికిలో పడేసినా మేం వాళ్ళ బాగుకోసం, వాళ్ళకి హెచ్‌.ఐ.వి. రాకుండా కండోమ్‌లు పంచుతాం తెలుసా! ఇదిగో ఈ ఫోటోలు చూడండి. ఎయిడ్స్‌ కంట్రోల్‌ సొసైటీ వాళ్ళతో కలిసి హెచ్‌ఐవి అవగాహనా కార్యక్రమంలో పాల్గొన్నాం.”
ఆ ఫోటో చూసి మరింత ఆశ్చర్య పోయాను. అందులో చంద్రకళ కూడా వుంది.
”మీకు తెలియదు. మా దగ్గర కొచ్చే వాళ్ళని కండోమ్‌ వాడమని చెప్పినందుకు మేమెన్ని దెబ్బలు తింటామో! వాళ్ళకి, మాకూ సురక్షితమని చెప్పినా విన్పించుకోరు. డబ్బిస్తున్నాం కాబట్టి వాళ్ళ కిష్టమైనట్టు ఉండాలంటారు.భయంకరంగా కొడతారు.”కనకదుర్గ అంది. మళ్ళీ తనే ”ఎలాగూ ఇంతమంది ఆడవాళ్ళు ఈ వృత్తి మీద బతుకుతున్నారు. సంఘం పెట్టుకుంటే బావుంటుందని నేనే దీన్ని మొదలుపెట్టాను. ఇది పెట్టాక మా స్థితి కొంత నయం. పదండి. మీటింగులో కూర్చుందాం” అంటూ కుర్చీలోంచి లేచింది.
”సతీష్‌! వుంటావా? పనేమైనా వుందా?”
”ఫర్వాలేదులే” అంటూ వాళ్ళ వేపు నడిచాను.
మీటింగు హాల్లో సీరియస్‌గా చర్చ సాగుతోంది. రౌడీల ఆగడాల గురించి, పోలీసుల వేధింపుల గురించి, పిల్లల చదువుల గురించి ఒకామె మాట్లాడుతోంది.
”నేను ఈ వృత్తిలో వున్నట్లు మా పిల్లలకి తెలియదు. నా మొగుడు నన్ను ఇద్దరు పిల్లల్ని వదిలేసి రెండో పెళ్ళి చేసుకుని వెళ్ళిపోయాడు. పిల్లల్ని హాస్టల్‌ పెట్టాను. నా శరీరమే పెట్టుబడిగా సంపాదించి వాళ్ళని చదివిస్తున్నాను. ఇలా ఎంత కాలం జరుగు తుంది? పిల్లలకి తెలిస్తే ఏమావుతుందోనని నాకు చాలా భయంగా వుంటుంది. నాకేమైనా అయితే… ” ఆవిడ కళ్ళల్లోంచి నీళ్ళు కారుతున్నాయి.
”నా మొగుడు మేస్త్రీ పనిచేస్తూ కిందపడి నడుములిరక్కొట్టుకుని మంచంలో పడ్డాడు. కొన్నాళ్ళు ఇళ్ళల్లో పనిచేసాను. ఒకామె పరిచయం ఇందులోకి తెచ్చింది. నేను ఉద్యోగం చేసి డబ్బు తెస్తున్నానని మా ఇంట్లో చెప్పాను. మా అత్తకి నా మీద అనుమానమే. పోలీసులు అరెస్ట్‌ చేస్తే ఎలా అని నాకెపుడూ బెంగగా వుంటుంది.”
అక్కడ విన్పిస్తున్న ఆడవాళ్ళ కథలన్నీ అలాగే వున్నాయి. హృదయం ద్రవించి పొయేలా చెప్పుకుంటున్నారు. అక్కడున్న వాళ్ళల్లో ఎక్కువ శాతం ట్రాఫికింగుకి గురయిన వాళ్ళని నాకు అర్ధమైంది. కొంతమంది వలస వచ్చినవాళ్ళు, ప్రేమ వంచితులు కూడా వున్నారు.
ఇంక నేను వెళతానని సైగ చేసాను. చంద్రకళ లేచి వచ్చింది. కనకదుర్గకు చెప్పి ఇద్దరం బయటకు నడిచాం.
********
నాకు తెలియని ఈ భయంకర ప్రపంచం గురించి వింటుంటే నా వొళ్ళు గగుర్పొడుస్తోంది.
హైదరాబాద్‌ చాలా మారిపోయిందని, ఈ పదేళ్ళలో ఎంతో అభివృద్ధి సాధించిందని నేను భ్రమ పడ్డాను. ఈ బిల్డింగులు ప్లె¦ౖఓవర్లు, పెద్ద పెద్ద మాల్స్‌ ఇవన్నీ అభివృద్ధి సూచికలనుకున్నాను. కళ్ళు మిరిమిట్లు కొల్పుతున్న ఈ సోకాల్డ్‌ అభివృద్ధి తెర చీల్చి చూస్తే కనిపించే చీకటి ప్రపంచం ఓ!మైౖగాడ్‌! ఐకాంట్‌ బిలీవ్‌దిస్‌, నోబడీ బిలీవ్స్‌. సికింద్రాబాద్‌ స్టేషన్‌ చుట్టు పక్కల పదివేల మంది సెక్స్‌వర్కర్లు బతుకుతున్నా రంటే ఏ స్థాయిలో ప్రాస్టిట్యూషన్‌ జరుగుతోంది. ఎంత మందికి హెచ్‌ఐవి సోకుతోంది. సంసారాలు సాగిస్తూనే ఇంతమంది మగాళ్ళు రోజూ వీళ్ళ దగ్గర కొస్తారన్నమాట. ఎంత హిపోక్రసీ!
నా మనసులో సుడులు తిరుగుతున్న ఆలోచనలు. చంద్రకళని మెహదీపట్నంలో దింపేసి వస్తుంటే తనో మాటంది.
”సతీష్‌! నా నికృష్టమైన బతుకు చూసాక కూడా నీకు నా మీద అసహ్యం వెయ్యడంలేదా? నేనంటే అప్పటిలాగానే అంత ఇష్టంగా ఎలా వుండగలుగుతున్నావ్‌? నా మీద జాలా?”అంది.
జాలేనా? సెక్స్‌ వర్కర్ల సంఘం ఆఫీసు దాకా నన్ను లాక్కెళ్ళింది ఆమె మీద జాలేనా? ఎందుకు తను ఫోన్‌ చెయ్యగానే ఉరుకులు, పరుగుల మీద వెళ్ళి ఆమె ముందు ప్రత్యక్షమౌతున్నాను. ఆమె బతుకును, ఆమెలాంటి ఎంతోమంది బతుకుల్ని చూసాక కూడా ఆమెపట్ల విముఖత ఎందుకు కలగడం లేదు.నాలో రకరకాల ఆలోచనలు.
*******
అన్వర్‌తో నా బిజినెస్‌ డీల్‌ దాదాపు ఒక కొలిక్కి వచ్చేసింది. ఇద్దరం ఈ రోజు కలిసి ఫైనలైజ్‌ చెయ్యాలనుకున్నాం. సాప్ట్‌వేర్‌ కంపెనీకి సంబంధించిన పేపర్‌ ప్రకటన కూడా తయారైంది. మధ్యలో ఒకసారి చంద్రకళని కలిసి నపుడు తనకో మొబైల్‌ ఫోన్‌ కొనిచ్చాను. రెగ్యులర్‌గా మాట్లాడు తోంది. ఎన్నిసార్లు అడిగినా తన ఇంటికి మాత్రం తీసుకెళ్ళలేదు. నేను నా ఫ్లాట్‌లో అన్వర్‌ కోసం ఎదురుచూస్తూ టివీ ఆన్‌ చేసాను. ఛానల్స్‌ బ్రౌజ్‌ చేస్తుంటే ఓ న్యూస్‌ ఛానల్‌లో చంద్రకళ కనబడింది. అరే! అనుకుంటూ న్యూస్‌ పెట్టగానే పోలీస్‌ స్టేషన్‌ ముందు గుమిగూడిన చాలామంది స్త్రీలు పెద్ద పెట్టున నినాదాలు చేస్తూ కనబడ్డారు. పోలీస్‌ స్టేషన్‌ ముందు ధర్నా. అందులో చంద్రకళ. మహిళా సంఘాల వాళ్ళు కూడా వున్నారు. ఒకామె మాట్లాడుతోంది. ”ఇది చాలా అన్యాయం. సెక్స్‌వర్కర్లందరికీ బలవంతంగా హెచ్‌ఐవి పరీక్ష చేస్తున్నారట. ఇష్టమైన వాళ్ళు చేయించుకుంటారు. బలవంతంగా చెయ్యడం అన్యాయం. బీహార్‌లో మెంటల్‌ హాస్పిటల్‌లోె వున్న స్త్రీలకి బలవంతంగా గర్భసంచుల్ని తొలగించడం లాంటిదే ఇది కూడా.” చాలా ఆవేశంగా ప్రసంగిస్తోంది. హాఠాత్తుగా పోలీసులు విరుచుకు పడి లాఠీలతో కొట్టసాగారు. చంద్రకళకి తలమీద దెబ్బపడి కిందపడిపోయింది. వెంటనే టివీ ఆపేసి మహాంకాళీ పోలీస్‌స్టేషన్‌కి బయలుదేరాను.
బిబిబి
పోలీస్‌స్టేషన్‌ ముందు పరిస్థితి ఉద్రిక్తంగా వుంది. పోలీసులు కొడుతుంటే అక్కడ గుమిగూడిన ఆడవాళ్ళు కకావికలంగా అటూ ఇటూ పరుగెడుతున్నారు. టివీలవాళ్ళు లైవ్‌ కవరేజీ ఇస్తున్నారు. నేను దగ్గరగా వెళ్ళడానికి ప్రయత్నించాను కానీ వెళ్ళలేకపోయాను. ఎంత వెదికినా చంద్రకళ కనబడలేదు. ఫోన్‌ చేసినా ఎత్తడం లేదు. పోలీసులు అందరినీ చెదరగొట్టేశారు. నేను దూరంగా చెట్టు కింద నిలబడిపోయాను. అన్వర్‌ పదే పదే ఫోన్‌ చేసినా మాట్లాడకుండా చంద్రకళ కోసం వెతకసాగాను.
ఎప్పుడూ టివీలో మాట్లాడుతూ కన్పించే మహిళాసంఘం నాయకురాలు టివీ మైక్‌లో మాట్లాడుతోంది. దగ్గరగా వెళ్ళి నిలబడ్డాను.
”పోలీసుల లాఠీఛార్జిలో చాలామంది స్త్రీలు గాయపడ్డారు. వాళ్ళని గాంధీ హాస్పి టల్‌కి పంపించాం. వాళ్ళు ప్రజా స్వామికం గానే కదా ధర్నా చేస్తున్నారు. వాళ్ళకి ఇష్టం లేకుండా ఏ పరీక్షా బలవంతం గా చెయ్యకూడదు కదా! చాలా కాలంగా వాళ్ళు ఇళ్ళ పట్టాలివ్వమని, రేషన్‌ కార్డు లివ్వమని అడుగుతున్నారు. మాకు పునరా వాసం కల్పించండి. మేమీపని మానేస్తాం. మా పిల్లల్ని చదివించుకుంటాం అంటు న్నారు. తెలిసో, తెలియకో, వంచనకు, మోసాలకు గురై ఈ వృత్తిలోకి వచ్చాం. అంటున్నారు. ఇవేమీ పట్టించుకోకుండా ఈ పరీక్షలు చేయించడానికి సిద్ధమవ్వడం అన్యాయం కదా!” పెద్ద గొంతుతో మాట్లాడుతోందావిడ.
ఆవిడ మాటల్ని నేను ఆశ్చర్యంగా వింటున్నాను.
చంద్రకళ ఫోన్‌ చేసింది.
”నువ్వు కనబడలేదు. ఎక్కడున్నావ్‌?”
”నేను గాంధీ హాస్పిటల్‌లో వున్నాను. నువ్వెక్కడున్నావ్‌ సతీష్‌. నేను కనబడక పోవడమేంటి?”
”మహంకాళి పోలీస్‌స్టేషన్‌ దగ్గరు న్నాను. టివీలో నిన్ను చూసి పరుగెత్తి వచ్చాను. ఇదంతా ఏంటి?”
”పోలీస్‌స్టేష్‌కి వచ్చావా. తలకి గాయ మైంది. బాగా రక్తం పోయింది. కట్టుకట్టారు. గాంధీకి వస్తావా? చాలా మందికి దెబ్బలు తగిలాయి”.
”వస్తున్నాను.”గాంధీకి బయలు దేరాను.
********
చంద్రకళ నాతోపాటు ఇంటికి వచ్చింది. తలమీద పెద్ద కట్టు. చీరంతా రక్తంతో తడిసిపోయింది. తనని ఇంట్లో దింపేసి, బయటకెళ్ళి ఓ నాలుగు చీరలు కొనుక్కొచ్చాను. స్నానం చేసి చీర మార్చు కుంది. ఆ తర్వాత పడుకుని నిద్రపోయింది. నేను టివీ ముందు కూర్చున్నాను. కానీ నా మనసులో రకరకాల ఆలోచనలు. నా దగ్గర చాలా డబ్బుంది. దానితో చంద్రకళకి ఏమీ చెయ్యలేనా? నేను కంపెనీ పెట్టి సంపాదించి ఎవరికివ్వాలి? ఈ డబ్బుతో ఆమెకి పాత జీవితం ఇవ్వగలిగితే? పోనీ నా కంపెనీలో భాగస్వామిని చేస్తే… ఆమె పనిచేస్తున్న సంఘానికి కొంత విరాళమిస్తే… ఎటూ తేలని ఆలోచనలు. ఒక్కటి మాత్రం నిజం. ఆమెని అలా గాలికి మాత్రం వొదిలెయ్యలేను. ఆమె సుఖంగా, సంతోషంగా వుంటేనే నాకు సుఖం. ఆమె భర్త సంగతి కూడా చూడాలి. ఆమెకి న్యాయంగా రావాల్సినవన్నీ ఇప్పించాలి.
ఆలోచిస్తూ నేను కూడా నిద్రలోకి జారాను.
********
మా కంపెనీ ప్రారంభోత్సవం. చంద్రకళ హాడావుడిగా అటుఇటు తిరుగుతోంది. అన్వర్‌ మాటి మాటికీ ఆమెని ఏదో అడుగుతున్నాడు. నవ్వుతూ సమాధానం చెబుతోంది.
”సతీష్‌! రంగారావుగారు ఇంకా రాలేదేంటి?టైమ్‌ అవుతోంది?
”బయలు దేరారట. ఇప్పుడే ఫోన్‌ చేసారు. మీ వాళ్ళు రాలేదేం?”
”ఎవరూ కనకదుర్గా? తనూ అంతే. దారిలో వుంది”.
నిరాడంబరంగా ప్రారంభోత్సవం జరిగిపోయింది. చంద్రకళని కంపెనీ డైరెక్టరుగా సతీష్‌ పరిచయం చేసాడు. చంద్రకళ కళ్ళల్లోకి నీళ్లొచ్చాయి. సతీష్‌ కంటబడకుండా తుడుచుకుంది.
”కంగ్రాట్యులేషన్స్‌ చంద్రకళా” అభినందించింది కనకదుర్గ.
”ధాంక్స్‌ దుర్గా! నాకీ రోజు చాలా సంతోషంగా వుంది. ఈ కంపెనీకి డైరెక్టరుగా అయినందుకు కాదు. నాకంటూ సమాజంలో ఓ గౌరవం దొరికినందుకు. మనలాంటి ఆడవాళ్ళకోసం ఎప్పటికైనా నేనే ఇలాంటి పెద్ద కంపెనీ పెడతాను. న్యాయంగా నాకు రావాలసిన ఆస్తుల కోసం మా ఆయనతో కొట్లాడతాను. నన్ను రోడ్డు మీద పడేసి తాను ఎలా వెలిగిపోతున్నాడో చూసాను. వాడిని వొదలనుగాక వొదలను.”
”ఎవరిని వొదలనంటున్నావ్‌?” సతీష్‌
”నా మొగుడ్ని”
”ఏం చేస్తావేంటి”నవ్వాడు.
”కోర్టు కీడుస్తా. నా బతుకును నాశనం చేసిన వాడిని ఊరికే వదలను.”
”ఒకె. ఒకె. పద మీడియా వాళ్ళు పిలుస్తున్నారు.”
”నేనేం మాట్లాడతాను సతీష్‌”
”ఇపుడేదో చెబుతున్నావ్‌గా అదే చెప్పు.”
చుట్టూ కెమెరాలు. ఫ్లాష్‌లైట్ల ఫోకస్‌. నదరక బెదరక మాట్లాడసాగింది చంద్రకళ.
శంషాబాద్‌లో తమ గులాబీతోటల గురించి, తమ దానిమ్మతోటల గురించి మైమరచిపోతూ చెప్పింది. ఎయిర్‌పోర్ట్‌ కింద తమ ఇల్లు, భూములు ఎలా పొయ్యాయో, తన భర్త తనని ఒదిలేసి రెండో పెళ్ళి ఎలా చేసుకున్నాడో. తను దిక్కులేక రోడ్డున పడ్డం, చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ సెక్స్‌వర్క్‌లోకి లాగబడడం, కనకదుర్గ సంస్థ కార్యకలాపాల్లో పాల్గొనడం అన్నీ పూసగుచ్చినట్లు చెప్పుకొచ్చింది.
వెంటనే ఓ ప్రశ్న దూసుకొచ్చింది.
”ఇంకా మీరు సెక్స్‌వర్క్‌లో వున్నారా? కొనసాగిస్తారా?”
”నేను నా జీవితం మొత్తం మీ ముందుంచితే నాకు జరిగిన అన్యాయం మీకు కనబడలేదు. అభివృద్ధి పేరుతో ధ్వంసమౌతున్న స్త్రీల జీవితాలు మీకు కనబడలేదు. నా భర్త దుర్మార్గం మీకు కనబడలేదు. సెక్క్‌వర్క్‌ మాత్రమే మీకు అర్ధమైంది. నేనింకా దాంట్లో వున్నానా లేదా? అనేదే ప్రముఖంగా అడగాల్సిన అంశంగా మీరు అనుకోవడం నిజంగా చాలా విషాదకరం. నేను సెక్స్‌వర్క్‌లో వున్నానో లేదో చెప్పాల్సిన అవసరం లేదు కానీ, సెక్స్‌వర్కర్ల సమస్యల కోసం పనిచేస్తానని మాత్రం చెప్పదలిచాను”.
”ఒకే సతీష్‌! నేను కనకదుర్గతో వెళుతున్నాను రేపు ఫోన్‌ చేస్తాను.” అంటూ కెమెరాల ముందు నుండి వచ్చేసింది.
”ఒక్క ప్రశ్న మేడం. ఈ సతీష్‌ మీకు ఏమవుతారో చెబుతారా!”.
నడుస్తున్నదల్లా ఆగి నా చెయ్యి పట్టుకుని ”ఇతనా? నాకేమీ కాడు. రక్తసంబంధం లేదు కానీ అంతకు మించిన ఆత్మీయబంధం వుంది.” అంటూ నా నుదిటి మీద ముద్దు పెట్టి కనకదుర్గతో కలిసి వెళ్ళిపోయింది చంద్రకళ..
Shilalolitha Kavi, Kapila Ramkumar and 5 others
2 Comments
1 Share
Like
Comment
Share

Tuesday, February 11, 2020

నా మీద వాలిన ఛాయాదేవి ఛాయ


ఎప్పటిమాట. పచ్చగా, చల్లగా, కుటీరం లాగా ఉండే ఆ ఇంటికి తొలిసారి ఎప్పుడెళ్ళాను. తొలిచూపులోనే ఆవిడతో ప్రేమలో పడిన సంఘటనలో నిజానికి, ఆరోజు చాలాసేపు మాట్లాడింది అబ్బూరి వరదరాజేశ్వరరావుగారితో. ‘లోహిత’నుప్రారంభించినప్పుడు జయ ప్రభతో కలిసి బాగ్‌లింగంపల్లిలోని ఛాయాదేవిగారింటికి వెళ్ళినపుడు ఆయన గలగలా మాట్లాడుతుంటే ఆవిడ లోపల్నించి తినడానికి ప్లేటులో అమర్చిన జంతికలో, మురుకులో తెచ్చారు. అంతకుముందు ఫోటోలో చూసానేమోగానీ ప్రత్యక్షంగా చూడలేదు. ఆవిడ ముఖంలో ఆవరించి ఉన్న ప్రశాంతత, మెత్తటి మాట.. నా మనసులో ముద్రపడిపోయింది. ఆరోజు ఆవిడ ఎక్కువగా మాట్లాడలేదు. ఆయన మాట్లాడారు. పచ్చటి కుటీరంలో ప్రశాంత మూర్తిని చూసాను.
ఛాయాదేవి గారితో నా పరిచయం అలా మొదలైంది. రెండున్నర దశాబ్దాల అనుబంధం. ఎన్ని సార్లు ఆ ఇంటికెళ్ళానో, ఏమేమి కబుర్లు చెప్పుకున్నామో! కాలింగ్‌బెల్‌తో సహా ఎంత కళాత్మకంగా ఆ ఇంటిని అలంకరించుకున్నారో… ఆ ఇంటికి వెళ్ళగానే కాళ్ళకు చుట్టుకునే ఆమె పెంపుడు పిల్లలు. తనకి ఇష్టమని ఎక్కడి వెళ్ళినా ఏదో ఒక పిల్లి బొమ్మని తెచ్చి ఇస్తే ఎంత సంబరపడిపోయేవారో! పిల్లులంటే ఎంత ప్రేమో!
భూజానికి ఒక బ్యాగ్‌ తగిలించుకుని బాగ్‌లింగంపల్లి రోడ్లమీద నడయాడిన ఛాయదేవిగారు ఎవ్వరికీ ఏ పనీ చెప్పేవారు కాదు. పోస్టాఫీసుకి, బ్యాంకుకి, షాప్‌లకి అలా అలవోకగా నడుచుకుంటూ వెళ్ళిపోయేవారు. వాటర్‌ బిల్లు కరెంటుబిల్లు కట్టడానికి కూడా తనే వెళుతుంటే నాకివ్వండి నేను కట్టిస్తాను అంటే ‘అబ్బే! ఎందుకమ్మా. మీకు శ్రమ నడిస్తే ఆరోగ్యంకదా!’ అని ఏదో ఒక జోక్‌ వేసేవారు. చాలా తరచుగా భూమిక ఆఫీసుకు వచ్చేవారు. ఏదో పుస్తకం కావాలని తీసుకునే వారు. ఫోన్‌ చేసి ఈ పుస్తకం తెచ్చిపెట్టు అని ఏనాడూ అడగలేదు. తన పనులన్నీ తనే చేసుకోవాలి. మూర్తీభవించిన ఆత్మగౌరవరూపం.
భూమికతో అలరారిన రెండున్నర దశాబ్దాల ఆత్మీయ అనుబంధం. భూమిక సంపాదక సభ్యులుగా కొనసాగుతూ ఎప్పటికప్పుడు నేనేమీ చేయడం లేదంటూ, నా పేరు తీసేయమంటూ అడిగేవారు. మీరేమీ చెయ్యక్కరలేదు మీరు భూమికకు ఎంతో చేసారు. భూమిక ఎప్పుడు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా మీరే కదా ఆదుకున్నారు. మీ పేరు తియ్యం అని నేను పోట్లాడేదాన్ని. కానీ మొన్న మే నెలలో నా పేరు సంపాదవర్గంలో తీసేయండి. ఇంకెవరినైనా పనిచేసేవాళ్ళని పెట్టుకోండి. ఇది నా రిక్వెస్ట్‌ ప్లీజ్‌ నా మాట వినండి అంటూ బలవంతంగా తన పేరు తీసేయించారు. ఆవిడ అంత గట్టిగా కోరుతుంటే కాదనలేకపోయాను. పేరు తీసేసినంత మాత్రాన భూమికతో తన అనుబంధం తగ్గిపోతుందా ఏమిటి? తన లైబ్రరీ అంతా భూమికకే ఇచ్చారు. లైబ్రేరియన్‌గా తన అనుభవాన్ని రంగరించి కాటలాగ్‌ ఎలా తయారుచేసుకోవాలో, పుస్తకాలు ఎలా అమర్చుకోవాలో ఎన్నోసార్లు నేర్పారు. ఆవిడ క్రమశిక్షణలో ఆరోవంతు కూడా నాకు అలవడకపోవడానికి కారణం నా స్వభవం వల్లనే.
ఛాయాదేవిగారితో నా అనుబంధం, నా అనుభవాలు ఈ సంపాదకీయంలో ఎక్కడ ఇముడుతాయి. జ్ఞాపకాలు ఒక దానికి ఇంకొకటి ఒరుసుకుంటూ కళ్ళ ముందుకొస్తున్నాయి. మనసంతా కిక్కిరిసి పోతోంది. అక్షరాలుగా అమరాలంటే… ఇక్కడ చాలదు. ఓ పుస్తకంమే రాయల్సి ఉంటుంది. ఆవిడతో నా జ్ఞాపకాలు 2012కి ముందు ఆ తర్వాతగా విడిపోయాయి. బాగ్‌లింగంపల్లి ఇంట్లోను, అన్ని సాహిత్య సమావేశాల్లోను రోడ్ల మీద నడుస్తూ, తన పనులు చేసుకుంటూ తిరిగిన ఛాయదేవిగారు, అన్నీ వదిలేసి, ఆఖరికి తన జ్ఞాపకాలతో నిండిన పచ్చటి పొదరిల్లులాంటి ఇంటిని హఠాత్తుగా అమ్మేసి, సి.ఆర్‌. ఫౌండేషన్‌లో ఓ గదికి పరిమితమైపోయిన ఛాయదేవి గారుగా నా జ్ఞాపకాలు విడిపోయాయి. కానీ అది నా భ్రమ మాత్రమే. ఎంతో ప్రేమగా, కళాత్మకంగా అమర్చుకున్న ఇంటితో బంధాన్ని పుటుక్కున్న తెంపేసుకుని, ఎలాంటి వేదనని, మానసిక క్షోభని మచ్చుకైనా కనబడనివ్వకుండా తన ఒకే ఒక గదిని మరింత కళాత్మకంగా అమర్చుకున్న ఛాయదేవి ఎప్పుడూ ఒకేలా ఉన్నారు. తనెక్కడున్నా ఆ పరిసరాల్ని సృజానాత్మకంగా తయారుచేసుకోగల అద్భుతమైన కళాహృదయం ఆమెకే పరిమితం. జిడ్డు కృష్ణమూర్తి జీవన తాత్వికతని పుణికిపుచ్చుకుని, తన జీవితంలోకి, తన మార్గంలోకి అనువదింపచేసుకున్న అపురూప వ్యక్తిత్వం ఆమెకే సొంతం.
ఆవిడ కథల గురించి, ఆవిడ సాహిత్యం గురించి, ఆవిడకొచ్చిన అవార్డుల గురించి నేను రాయబోవడం లేదు. ఆమె సాహిత్యాన్ని తూకం వేసే పని నేను చెయ్యదలుచుకోలేదు. వ్యక్తిగా, స్ఫూర్తి ప్రదాతగా మాత్రమే నేను రాయాలనుకుంటున్నాను. చరిత్ర చీకటిలో మరుగున పడిపోయిన భండారు అచ్చమాంబను వెలుగులోకి తెచ్చింది, నా చేత అచ్చమాంబ జీవిత చరిత్రను రాయించిందీ ఛాయాదేవిగారే అని మాత్రం సగర్వంగా చెప్పదలచుకున్నాను. ఒకానొక కథా వర్క్‌ షాప్‌ రిపోర్ట్‌ని యధాతధంగా యాభైపేజీలు రాసిన ఛాయాదేవి గారు కె. లలిత ప్రస్తావించిన అచ్చమాంబ కథ గురించి రాయడం, అది చదివి నేను చాలా ఉత్సాహంగా అచ్చమాంబ గురించి శోధించి ఓ పెద్దవ్యాసం రాయడం, బ్రౌన్‌ అకాడమీ కోసం పుస్తకం రాయమని ఛాయాదేవి గారు అడగడం ఫలితం, అచ్చమాంబ ‘సచ్ఛరిత్ర పుస్తకర’ నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని సందర్భం. ఆవిడకు శిరస్సువొంచి నమస్కరించడం మినహా ఏమి చెయ్యగలను.
2012లో బాగ్‌లింగంపల్లి నుంచి కొండాపూర్‌ వెళ్ళిపోయినప్పుడు తనని చూడడానికి వెళ్ళినప్పుడు ‘మీ పేరుమీద రెండు
ఉత్తరాలు పోస్ట్‌ చేసాను నిన్ననే. మీరొస్తారని తెలియదు. తెలిస్తే మీకే ఇచ్చేదాన్ని’ అన్నారు. భూమికకు ఏదైనా కథో, వ్యాసమో రాసి పంపారేమో అనుకున్నాను. కానీ అది కథకాదు. ‘ఈహోమ్‌కి వచ్చాక వాళ్ళు ఒక ఫారమ్‌ ఇచ్చి పూర్తి చేయమన్నారు. అందులో ఒక ప్రశ్న ఏమిటంటే ”మీకు అనారోగ్యం కలిగినా, ఇంకేమైనా ప్రమాదం జరిగినా వెంటనే మేము తెలియచేయాల్సిన వ్యక్తి పేరు, ఫోన్‌, అడ్రస్‌ రాయమన్నారు. నేను మీ పేరు రాయాలని అనుకున్నాను. ఆ విషయమే మీకు ఉత్తరం రాసాను” అన్నారు. ”తప్పకుండా మీరు నా పేరు రాయండి. మీకు ఎప్పుడు అవసరమైతే అప్పుడు నేనొచ్చేస్తాను.” అని చెప్పాను.
చాలా సార్లు ఆ ఉత్తరం చదవాలనుకునేదాన్ని ఇప్పుడెందుకులే అని విరమించుకునేదాన్ని, ఆవిడ కన్నుమూసాకే ఆవిడిచ్చిన కవర్‌ తెరిచాను. ఇప్పుడు నాతోపాటు అందరూ చదివారు. నా మీద ఆవిడకున్న నమ్మకం, విశ్వాసం, నన్ను తన కూతురుగా భావించిన ఆ విశాలత్వం నన్ను వివశురాలిని చేసాయి. అందరి సహకారంతో ఆవిడ కోరుకున్న విధంగా ఎలాంటి కర్మకాండలూ లేకుండా, తన కళ్ళని ఎల్‌వి ప్రసాద్‌ ఐ ఆసుప్రతికి, తన పార్థివ శరీరాన్ని వైద్యవిద్యార్థుల పరిశీలనార్థం ఇఎస్‌ఐ మెడికల్‌ కాలేజీకి డొనేట్‌ చేసాం. ఇంక ఆవిడ నా మీద పెట్టిన పెద్ద బాధ్యత తను రాసిన విధంగా ఫిక్స్‌డ్‌ డిపాజిట్లను ఆయా వ్యక్తులకు అందించడం. వీలు వెంబడి ఆ పని పూర్తి చేస్తాను.
అబ్బూరి ఛాయాదేవి గారితో నాకున్న మానసిన సాన్నిహిత్యం, అనుబంధం గురించి రాయడానికి ఈ సంపాదకీయం సరిపోదు. భూమిక సంపాదక సభ్యులుగా తన స్మ ృతికి నివాళిగా మాత్రమే ఇది సరిపోతుంది.
మనందరికీ అత్యంత ఆత్మీయురాలు, గొప్ప మానవీయతతో అలరారే అద్భుత చైతన్యమూర్తి
అబ్బూరి ఛాయాదేవి గారికి నా అశ్రునివాళి.

కొత్త చరిత్రను లిఖించిన షాహీన్‌బాగ్‌ మహిళలు


-------కొండవీటి సత్యవతి
..................
లామకాన్‌లో రాజ్యాంగ ప్రవేశికను అందరి చేత చదివించి, చివరి వాక్యం చదువుతున్నప్పుడు నా గుండె పులకించి, నా శరీరమంతా పాకింది ఆ పులకింత. ఆ మాట బహిరంగంగా అందరి ముందు ప్రకటించాను కూడా. అదే పులకింత ఇంకొంత ఉద్వేగంతో మిళితమై షాహీన్‌బాగ్‌లో అడుగుపెట్టినప్పుడు కలిగింది. డిశంబరు 15 నుండి నా లోపలొక స్వప్నంగా తిరుగాడుతున్న షాహీన్‌బాగ్‌లో అడుగు పెట్టడం గొప్ప అనుభవం. ఢిల్లీలో జరుగుతున్న ఉమన్‌ స్టడీస్‌ కాన్‌ఫరెన్స్‌ మీద కన్నా నా మనసు ఢిల్లోలో ఎన్నో ప్రాంతాల్లో జరుగుతున్న మహిళల మౌన నిరసన ప్రాంతాల మీద లగ్నమైంది.
నేను ప్రశాంతి కాన్‌ఫరెన్స్‌ మధ్యలోనే షాహీన్‌బాగ్‌ వైపు వెళుతున్న ఫ్రెండ్‌ కారులో బయలుదేరి, మెట్రో ఎక్కి షాహీన్‌బాగ్‌ ప్రయాణమయ్యాం. మెట్రో దిగి ఈరిక్షాలో మహిళల మౌన నిరశన జరుగుతున్న టెంట్‌ దగ్గరికెళ్ళాం. టెంట్‌ నిండా కూర్చున్న మహిళలు, స్టేజి దగ్గరున్న వాలంటీర్స్‌ మమ్మల్ని సాదరంగా ఆహ్వానించారు. కుర్చీలేసి కూర్చోబెట్టారు. మంచినీళ్ళు, ఆ వెంటనే టీ తెచ్చి ముందు పెట్టారు. టీ తాగమని చెబితే చాలా బాధపడిపోయి సమోసాలు తెచ్చి ఇవి తప్పకుండా తినాలి అంటూ బలవంత పెట్టారు.
అక్కడంతా అలుముకుని ఉన్న ఆ చలివేళ వాళ్ళ నులివెచ్చని ప్రేమ మమ్మల్ని వెచ్చ0గా తాకింది. మేము హైదరాబాదు నుండి వచ్చాం, మేమంతా మీ వెనక, మీతోనే ఉన్నామని చెప్పినప్పుడు పెద్ద పెట్టున హర్షధ్వానాలు చేసారు.ప్రేమతో హత్తుకున్నారు. మేము స్టేజ్‌ దగ్గర కూర్చున్న వారితో మాట్లాడాము. పెద్దలతో,పిల్లలతో మాట్లాడుతుంటే వారిలో ఉప్పొంగుతున్న ఉద్వేగాలు, భయాలు మమ్మల్ని కూడా ముంచెత్తాయి. టెంట్‌ నిండా కూర్చున్న మహిళలు కొందరు లేచి వెళుతుంటే మరి కొందరు వస్తున్నారు. ఇళ్ళకెళ్ళి పనులు పూర్తిచేసుకుని వచ్చేవారు, పిల్లలకి వంటచేసి పెట్టి వచ్చే వారితో అక్కడ మహిళా ప్రవాహం అటూ ఇటూ కదులుతున్నట్టుగా ఉంది. ఇళ్లలో పనిచేసేవారు, కూరగాయలమ్ముకునేవారు ఆ పనులన్నీ పూర్తిచేసుకని వచ్చి రాత్రంతా టెంట్‌లో కూర్చుంటున్నారు.
ఎముకలు కొరికే చలిలో పైన టార్పాలిన్‌ తప్ప ఏమీ లేని ఆ టెంట్‌లో పిల్లలు, పెద్దలు, వృద్ధులు రాత్రి పగలు కూర్చుని కొనసాగిస్తున్న నిరసన దీక్షలకు దీటైన దీక్షలు చరిత్ర పొడుగునా దివిటీ వేసి వెదికినా కనబడవు. స్వచ్ఛందంగా, తమకు తాముగా తరలివచ్చి నిరసన దీక్షలో కూర్చుంటున్న ఈ మహిళలు నిజానికి షాహీంబాగ్‌లో ఓ కొత్త చరిత్రను సృష్టించారు. నాయకత్వమంటూ లేని ఈ ఉద్యమం గొప్ప గొప్ప నాయకుల్ని తయారుచేస్తోంది. ఎన్నడూ రోడ్డు మీదికొచ్చి గొంతెత్తని ఈ మహిళలు మొత్తం గొంతు విప్పి దిక్కులు పిక్కటిల్లేలా నినాదాలిస్తున్నారు.
తమలో అణిగిమణిగి ఉన్న అన్ని సృజనాత్మక ప్రక్రియల్ని వెలికి తీస్తున్నారు. పాటలు పాడుతూ, నినాదాలకి గొంతు కలుపుతూ తమ కొత్త పాత్రని చూసి తామే అబ్బురపడుతూ రోజులతరబడి శిబిరంలో గడుపుతున్నారు. షాహీన్‌బాగ్‌ మహిళల్ని పెద్ద ఎత్తున కదిలించి కదం తొక్కించిన సంఘటన, 82 సంవత్సరాల బిల్కిస్‌ బేగం, 80 సంవత్సరాల నూరున్నీసాలను డిశంబర్‌ చలిలో శిబిరంలోకి రప్పించిన సంఘటన… ప్రభుత్వం ఆదరాబాదరాగా ఆమోదించిన పౌరసత్వ సవరణ చట్టానికి, ఎన్‌ఆర్‌సికి వ్యతిరేకంగా జామియా యూనివర్సిటీలో జరుగుతున్న నిరసనల ప్రభావంతో డిశంబరు 14 న 14 మంది స్థానిక మహిళలు 24/7 మౌన ఉద్యమం మొదలు పెట్టారు.
డిశంబరు 15వ తేదీన వందలాది మంది పోలీసులు, యూనివర్సిటీ నుండి అనుమతిలేవి తీసుకోకుండానే లోపలికి చొరబడి విద్యార్ధుల్ని విచక్షణారహితంగా కొట్టడం, రబ్బర్‌ లాఠీలు, టియర్‌ గ్యాస్‌ ఉపయోగించడంతో ఎంతో మంది విద్యార్థులు గాయపడ్డారు. ఆ రాత్రి 100 మంది విద్యార్థులను నిర్భందించి తెల్లవారుఝామున 3.30 గంటలకి వదిలిపెట్టారు. 200 వందలమంది గాయాలతో ఎయిమ్స్‌లో అడ్మిట్‌ అయ్యారు. ఇద్దరు విద్యార్థులకు బుల్లెట్‌ గాయాలయ్యాయి. జామియా విద్యార్థులకు షాహీన్‌ అబ్దుల్లా, చందా యాదవ్‌, లడడా ఫర్జానా, ఆయేషా రెన్నాల మీద పోలీసులు దాడి చేసారు. షాహీన్‌బాగ్‌కు కూత వేటు దూరంలో ఉన్న జామియా యూనివర్సిటిలో జరిగిన పోలీసుల దౌర్జన్యం, విద్యార్ధులకు గాయాలవ్వడం షాహీన్‌ బాగ్‌ను కదిలించింది. కన్నీరు పెట్టించింది. షాహీన్‌ బాగ్‌ నుండి ఎంతోమంది జామియాలో చదువుకుంటున్నారు.
డిశంబరు 14న వేళ్ళమీద లెక్కించే సంఖ్యలో మహిళలు మొదలుపెట్టిన మౌన నిరసనలో వందల, వేల సంఖ్యలో మహిళలు పాల్గొనడం మొదలైంది. యమునా నది పక్కన, నోయిడా వెళ్ళే రహదారిని మూసేసి నిరసన శిబిరంలో వేలాది మంది మహిళలు రాత్రీ పగలు తేడా లేకుండా కూర్చోవడం మొదలైంది. మామూలు, సాధారణ మహిళలు, చిన్నా చితకా పనులు చేసుకునే వారు, ఇళ్లల్లో పనిచేసేవారు, హోం మేకర్స్‌ తమ పనుల్ని వేగంగా ముగించేసుకుని శిబిరంలో కూర్చోవడానికి వస్తున్నారు. ”నేను కూలి పనికెళతాను. పగలు పనిచేసుకుని రాత్రి శిబిరంలో కూర్చుంటున్నాను. మా బతుకులు, మా పిల్లల భవిష్యత్తు ఏమౌతుందోననే భయం నన్ను ఇక్కడికి రప్పిస్తొంది. నేను ఎప్పుడూ ఇంటి నుండి బయటకొచ్చి ఇలాంటి ధర్నాలో పాల్గోలేదు. అందరితో కలిసి కూర్చోవడం చాలా ధైర్యానిస్తోంది.” అని చెప్పింది షబ్నం.
”మేము ఈ దేశంలో పుట్టాం. ఇక్కడే చస్తాం. రోజుకి ఐదు సార్లు ఈ భూమికి వంగి దండం పెడతాం. ఈ భూమిని ముద్దాడతాం. అలాంటి భూమి మాది కాకుండా ఎలా పోతుంది” నౌహర్‌ బేగం. ”భారత్‌ సంవిధాన్‌లో మతం లేదు. ఎవరి ధర్మాన్ని వారు పాటించుకోవచ్చు కదా. మేము ముస్లింలమని మా మీద ఇంత వివక్ష ఎందుకు. మేము పేదవాళ్ళం. కడుపు నింపుకోవడం కోసం ఎక్కడెక్కడో పోతుంటాం. మా దగ్గర కాగితాలేముంటాయి” నస్రత్‌. ”మతం ఆధారంగా పౌరసత్వం ఇస్తామనడం భారత దేశ లౌకిక స్ఫూర్తికి విరుద్దం. మేము పౌరసత్వ సవరణ చట్టానికి విరుద్ధంగా పోరాడుతున్నాం.” సలీమ్‌. మేము శిబిరంలో మహిళలతో, పిల్లలతో మాట్లాడుతున్నాం. వేదిక మీదకొచ్చి మాట్లాడమని వాలంటీర్లు పిలిచారు. మేము హైదరాబాద్‌ నుండి వచ్చామని, మహిళా ట్రాన్స్జెండర్‌ జేయేసి తరఫున సాలిడారిటి తెలుపుతున్నామని చెప్పగానే పెద్ద ఎత్తున హర్షాన్ని వ్యక్తం చేసారు. మేము మాట్లాడడానికి వేదిక మీదికి వెళుతుండగానే పెద్దగా వర్షం మొదలైంది. విపరీతమైన చలికి తోడు వర్షం.
ప్లాస్టిక్‌ షీట్స్‌తో కప్పిన శిబిరంలో వర్షపు నీరు జారడం మొదలైంది. మేము తడిసిపోతామని ఎంత ఆదుర్దా పడ్డారో. కుర్చీలు అటూ ఇటూ జరుపుతూ మా మీద నీళ్ళు పడకుండా చాలా ప్రయత్నం చేసారు. హఠాత్తుగా కరెంట్‌ పోయింది. చిమ్మ చీకటి. వెంటనే శిబిరం చుట్టూ ఓ అపూర్వమైన దృశ్యం రూపుకట్టింది. శిబిరం చుట్టూ నిలబడి ఉన్న మగవారు సెల్‌ ఫోన్‌ లైట్స్‌ వెలిగించి పైకెత్తి పట్టుకున్నారు. శిబిరం చుట్టూ కాగడాలు వెలిగించినట్టు కనబడింది. శిబిరంలోకి పురుషులకు, మగపిల్లలకు ప్రవేశం లేదు. వారంతా బయటే నిలబడి ఉన్నారు. ఆ చీకట్లో మహిళలు త్రివర్ణ పతాకాలు చేతపట్టి దిక్కులు పిక్కటిల్లేలా నినాదాలివ్వడం మొదలుపెట్టారు. షాహీన్‌ బాగ్‌ వారి నినాదాలకు ప్రతిధ్వనించింది.
మహిళలు ఎలాంటి తారతమ్యాలు లేకుండా ఒక చోట చేరడంలోనే షాహీన్‌ బాగ్‌ సొగసు ఉందనిపించింది నాకు. ”మేము అహంకారంతో మా మహిళల్ని నాలుగు గోడల మధ్య బంధిస్తాం. అది పొరపాటని మాకు అర్థమౌతోంది. మహిళలు ఏకమై ఒక చోట చేరితే దాని ప్రభావం ఎలా ఉంటుందో మాకు అర్థమైంది. మా మీద ఉపద్రవంలా వచ్చిపడిన పౌరసత్వ సవరణ చట్టాన్ని వెనక్కి తీసుకునేవరకు మా మహిళలు పోరాడతారని నాకు గట్టి నమ్మకం. కలిగింది”. పితృస్వామ్యం బీటలు వారుతున్నదా అనిపించింది అతని మాటలు వింటుంటే. వర్షం తగ్గలేదు. కరెంట్‌ రాలేదు. మైక్‌ లేకపోవడం వల్ల మేము స్టేజిమీద మాట్లాడలేకపోయాం. శిబిరంలో కిక్కిరిసిన మహిళలు, పిల్లలు, బయట పురుషులు, నినాదాల హోరు. వర్షం బాగా పెరిగిపోతోంది.
మేము ద్వారకా వరకూ వెళ్ళాలని, చాలా దూరమని చెప్పి బయలుదేరాం. మహిళలు ఒకరి తర్వాత ఒకరు హత్తుకుంటూ ”బహుత్‌ షుక్రియా, మద్దత్‌ దియా ఆప్‌ ధన్యవాద్‌” అంటూ బయటవరకు సాగనంపారు. పిల్లలు పోటీలుపడి షేక్‌ హేండ్స్‌ ఇచ్చారు. బయట నిలబడ్డ మగవాళ్ళు మాకు దారి ఇస్తూ ”షుక్రియా” అంటుంటే మేము సన్నటి రోడ్డులోకి నడిచాం. సన్నటి చినుకులతో దారంతా చిత్తడి చిత్తడిగా ఉంది. జారతానేమో అని భయపడుతూ నడుస్తుంటే ఏమైనా తినేసి పోదామా అంది ప్రశాంతి. ఓ చిన్న హోటల్‌లోకి వెళ్ళాం. అక్కడ టిఫిన్‌ తింటున్న ఒక అబ్బాయితో చాలా సేపు చర్చ నడిచింది. ప్రశాంతి అతనితో మాట్లాడుతుంటే నా మనసు షాహీన్‌బాగ్‌ అనుభవాన్ని లోపలికి ఇంకించుకుంటోంది. గాయపడ్డ జామియా విద్యార్ధుల మీద ప్రేమతో మొదలైన ఉద్యమం అంకురంలా మొదలై మహా వృక్షమైన తీరు అబ్బురపరుస్తోంది. జామియా విద్యార్థులు పౌరసత్వ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ప్రారంభించిన ఉద్యమాన్ని షాహీన్‌ బాగ్‌ మహిళలు అందుకున్న వైనం అపూర్వం, చారిత్రకం.
ఎప్పుడూ ఇలాంటి ఉద్యమాల్లో పాల్గొనని, తమ పనులకు, ఇళ్ళకు మాత్రమే పరిమితమై ఉండే సాధారణ మహిళలు వేలాదిగా తరలి వచ్చి పగలూ, రాత్రి నిరశన శిబిరాల్లో పాల్గొనడం గొప్ప చారిత్రాత్మక సన్నివేశం. నిజానికి షాహీంబాగ్‌ మహిళలు ఓ కొత్త చరిత్రను తమదైన పద్ధతిలో లిఖించడం ప్రారంభించారు. భారత దేశానికే కాకుండా యావత్‌ ప్రపంచానికి దిశా నిర్దేశంం చేస్తున్నారు. ఇప్పుడు షాషీన్‌ బాగ్‌ మహిళలు గుండె ధైర్యాన్ని, ఐకమత్యాన్ని, స్వేచ్ఛని సెలబ్రేట్‌ చేసుకుంటున్నారు. గుండెల్లో దిగులు, భయం, అభద్రత కమ్ముకుని ఉన్నప్పటికీ ”తాము దేశ రాజ్యాంగం కోసం, ప్రజాస్వామ్యం కోసం, లౌకిక స్ఫూర్తికోసం పోరాడుతున్నామని” ఈ మహిళలు ఢంకా భజాయించి చెపుతున్నారు. ”ఇది రెండో స్వాతంత్య్ర పోరాటం. రాజ్యాంగం దాడికి గురౌతుంటే చూస్తూ ఊరుకోం. మేము ఈ దేశ వాసులం. ఆ స్ఫూర్తిని కాపాడుకోవడానికే మేమిక్కడ కూర్చున్నాం” అని చెబుతున్నారు 82 సంవత్సరాల బిల్కిస్‌ బేగం. ”హం కాగజ్‌ నహీ దిఖాయేంగే” అంటున్న పిల్లల గొంతులు మా వెనక వినిపిస్తూనే ఉన్నాయి. షాహీన్‌బాగ్‌ ను తిరిగి తిరిగి చూస్తూ, గొప్ప ఉద్వేగాన్ని, స్పూర్తిని గుండెల్లో నింపుకొని మేము ఆటో కోసం ముందుకు నడిచాం.
మర్నాడు రెండు మహిళల నిరశన శిబిరాలకు వెళ్ళాలని అనుకున్నాం. ఒకటి హౌస్‌ రాణి, రెండోది హజ్రత్‌ నిజాముద్దీన్‌ శిబిరం దగ్గర జరుగుతున్న ”వసంత పంచమి” కార్యక్రమాన్ని చూడాలని మధ్యాహ్నమే బయలు దేరి హౌస్‌ రాణి శిబిరానికి వెళ్ళాం. ఇది కూడా షాహీన్‌బాగ్‌కి ఏమీ తీసిపోదు. పింజరా థోడ్‌ అనే స్వచ్చంద సంస్థ నుండి దేవకి అక్కడ వాలంటీర్‌గా ఉన్నారు. శిబిరం నిండా మౌనంగా కూర్చున్న మహిళలతో మేము మాట్లాడాము. ఇక్కడ పిల్లలు భలే ఏక్టివ్‌గా ఉన్నారు. సి.ఏ ఏ, ఎన్‌ ఆర్సి గురించి చిన్న పిల్లలు కూడా స్పష్టంగా మాట్లాడటం ఆశ్చర్యం కలిగించింది. వాళ్ళు వేసిన బొమ్మలు అక్కడ తగిలించి ఉన్నాయి. మేము వారికి సంఘీభావం ప్రకటించడానికి వచ్చామని, మహిళా ట్రాన్స్‌జెండర్‌ జేయేసీ నుండి అందరితో కలిసి హైదరాబాద్‌ చాలా కార్యక్రమాలు చేస్తున్నామని మా మద్దతు మీకెప్పుడూ ఉంటుందని చెప్పాము. మా పట్ల అక్కడి మహిళలు వ్యక్తం చేసిన ప్రేమ, అభిమానం మా కళ్ళల్లో నీళ్ళు తెప్పించాయి.
అక్కడ కొంత సమయం గడిపి శిబిరం బయటకొస్తుంటే జి.ఎన్‌ సాయిబాబా గారి సహచరి వసంత కలిసారు. పరస్పరం ఆశ్చర్యపోయి, పల్కరించుకుని మళ్ళీ శిబిరంలోకి తిరిగొచ్చి మరికొంత సేపు గడిపాం. వసంత తన ప్రసంగంలో సాయిబాబాని ఎలా అన్యాయంగా కేసులో ఇరికించి జైల్లో పెట్టారో, వీల్‌ చెయిర్లో జెయిల్లో ఆయన పడుతున్న ఇబ్బందుల గురించి చెప్పినప్పుడు, వింటున్న మహిళల కళ్ళల్లో సన్నటి నీటి పొర చూసాన్నేను. అందరూ ”హం దువా కరేంగే” అంటూ వసంతకు భరోసా ప్రకటించారు. మేము బయలుదేరుతుంటే రేపు కూడా రండి అంటూ పిల్లలు మా వెంట వచ్చారు. తప్పకుండా ప్రయత్నం చేస్తామని చెప్పి ముగ్గురం ఆటోలో నిజాముద్దీన్‌ దర్గాకు బయలుదేరాం. చలి ఈడ్చి కొడుతోంది. గడగడలాడుతూ దర్గా దగ్గర ఆటో దిగాం. మెయిన్‌ రోడ్డు పక్కనే ఉంది ఈ శిబిరం. అడుగు పెట్టలేనంతగా కిటకిటలాడుతోంది. మేము వెళ్ళేసరికి కవ్వాలీ జరుగుతోంది. మహిళలు, పిల్లలు వస్తూనే ఉన్నారు. నిలబడడానికి కూడా జాగా లేకపోవడంతో కొంతమంది మహిళలతో మాట్లాడి బయటకు వచ్చేసాం. చలి విపరీతంగా ఉంది. అక్కడ గుమిగూడిన వారందరికీ చలిని మించిన ఉపద్రవం తమ జీవితాలమీద విరుచుకుపడిందని అర్ధమైంది. వాళ్ళు చలిని జయించారనిపించింది.
30 వ తేదీన గాంధీని హత్య చేసిన రోజున మౌన నిరసన ర్యాలీ చేస్తున్నారని సమాచారం వచ్చింది. అలాగే డిల్లీలోని పలు ప్రాంతాల్లో మానవహారం చేస్తున్నారని కూడా తెలిసింది. కాన్‌ఫరెన్స్‌ హాల్‌కి దగ్గరలోనే ఒక మాల్‌ నుండి కొవ్వుత్తులతో మౌన ప్రదర్శనకి మేము వెళ్ళాం. మేము ప్లే కార్డ్స్‌ పట్టుకుని కొవ్వొత్తులు వెలిగించుకుని మౌనంగా బయలుదేరగానే మా చుట్టూ అక్కడక్కడా నిలబడిన కొంతమంది ఎబివిపి/ బిజెపి కార్యకర్తలు పెద్ద పెట్టున సి ఏ ఏ కి మద్దతుగా నినాదాలిస్తూ మా పక్కనే నడవడం మొదలుపెట్టారు. మేము మౌనంగా నడుస్తున్నాం. వాళ్ళు పెద్దగా మోడీకి , బిజేపీకి అనుకూల నినాదాలతో అరుస్తున్నారు. మా ర్యాలీ నడుస్తూనే ఉంది. మధ్యలో చాలామంది మహిళలు వచ్చి చేరారు. ర్యాలీ చాలా పెద్దగా తయారైంది. మేము నినాదాలు ఇవ్వడంలేదు. వాళ్ళు రెచ్చగొట్టే మాటలంటున్నా మేము పట్టించుకోలేదు. షాహీన్‌బాగ్‌కి వ్యతిరేకంగా నినాదాలిచ్చారు. దేశ ద్రోహులని, అర్బన్‌ నక్సలైట్లని, హిందువులకి వ్యతిరేకులని, పాకిస్తాన్‌ సపోర్టర్స్‌ని నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారు. ఇటు శాంతంగా ఉన్నాం కానీ అటువైపు ఉద్రేకాలు పెరుగుతున్నాయి. పోలీసులు అలర్ట్‌ అయ్యారు. వందల్లో పోలీసులు వచ్చేసారు. మహిళా కానిస్టేబుల్స్‌ వచ్చారు. ఓ పెద్ద తాడును మాకు వాళ్ళకు మధ్యలో పెట్టి మహిళా పోలీసులు మా పక్కనే నడవసాగారు. వాళ్ళు మామీద దాడిచేస్తారేమో అనేంతగా మామీదికి రాబోయారు. కానీ పోలీసులు వాళ్ళని మా వైపు రానియ్యలేదు. దాంతో పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలిచ్చారు. అలాంటి ఉద్రిక్త పరిస్థితుల్లోనే మూడు కిలోమీటర్లు నడిచాం. ఒక స్పోర్ట్‌ కాంప్లెక్స్‌ దగ్గర ఆగాం. అక్కడ చాలామంది గుమిగూడి ఉన్నారు. గాంధీ ఫోటో పెట్టి వైష్ణవజనతో పాటతో మీటింగ్‌ మొదలైంది. అప్పటికే చాలా ఆలస్యమైంది. బాగా అలసిపోయాం.క్యాబ్‌ బుక్‌ చేసుకుని హోటల్‌కి బయలుదేరాం.
ఆనాటి ర్యాలీ లో జరిగిన సంఘటనలు నిరసన ప్రదర్శనలు జరిగే అన్ని చోట్లా మొదలవుతాయోమోనని నాకు అనిపించింది.ఎవరైనా రాళ్ళు లాంటివి విసిరి ర్యాలీని చెదరగొట్టాలనుకుంటే ఏమి జరుగుతుందా అనే భయం కూడా కలిగింది.
31న ప్రశాంతి వేరే పని మీద వెళ్ళిపోయింది. నేను వసంత వాళ్ళింటికి వెళ్లాను. ఇద్దరం కలిసి మరిన్ని నిరసన శిబిరాలకి వెళ్ళాలని ప్లాన్‌ చేసుకున్నాం. వసంత వాళ్ళింటికెళ్ళగానే నాగపూర్‌ జైల్లోఉన్న సాయిబాబా గారు బాగా గుర్తొచ్చారు. వంట చేస్తూనే వసంత సాయిబాబా గారి ఆరోగ్య పరిస్థితి గురించి చెబుతూ ఉన్నారు. ఆయనకి దాదాపు 20 రకాల ఆరోగ్య సమస్యలున్నాయని ఆయన కుడి చేయి సరిగ్గా పనిచేయడం లేదు. రాయలేకపోతున్నారు అని చెబుతూ ప్రపంచవ్యాప్తంగా ఆయనని విడుదల చేయమని ఎంతోమంది ప్రముఖలు రాసిన ఉత్తరాలను చూపించారు. డిల్లీ యూనివర్సిటీలోని క్యార్టర్ని ఖాళీ చేయించారని, అద్దెకు ఇల్లు దొరకడం చాలా కష్టమైందని చెబుతూ, ఇప్పుడుంటున్న ఈ ఇల్లు ఒక రిటైర్డ్‌ ఐఎఎస్‌ ఆఫీసర్‌ ఇచ్చారని, సాయిబాబాగారిని ఆన్యాయంగా జైల్లో పెట్టారని ఆమె నమ్ముతూ తక్కువ అద్దెకు ఈ ఇల్లు ఇచ్చారని చెప్పారు. సాయిబాబా గారికి సగం జీతం వస్తున్నదని, ప్రస్తుతం దానిని కూడా ఆపేయాలనే కుట్ర చేస్తున్నారని బాధపడుతూ చెప్పారు.
సాయిబాబాగారి వీల్‌ చైర్‌ పాడైపోయిందని ఉత్తరం వచ్చింది, కొత్తది కొనాలంటే 25 వేలు అవుతుందని, అది లేకపోతే తనకి చాలా ఇబ్బందని చెప్పినప్పుడు మీరు ఏమీ అనుకోనంటే ఆ వీల్‌ చైర్‌ నేను కొంటానండి. నాకు నెల నెలా పెన్షన్‌ వస్తుంది దాన్ని ఇలాగే ఖర్చు పెడతాను. నిజంగానా అని ఆవిడ ఆశ్చరపోయారు. నిజంగానే మీరు వీల్‌ చైర్‌ కొనేసి బిల్లు నాకు పంపండి నేను ఆన్‌లైన్లో చెల్లించేస్తానని చెప్పాను. లంచ్‌ చేసేసి మేము బయట పడ్డాం. ఆటోలెక్కి, ఈ రిక్షాలెక్కి, మెట్రోలెక్కి మూడు మహిళల నిరసన శిబిరాలకు వెళ్ళాం. శీలంపూర్‌, కేదంపురి, చాంద్‌ బాగ్‌ ప్రాంతాలకు వెళ్ళాం. ఇవన్నీ షాహీన్‌బాగ్‌ స్పూర్తితో అదే పద్దతిలో నడుస్తున్నాయ్‌. మహిళలు,పిల్లలు గొప్ప ఉత్సాహంతో కనబడ్డారు. నినాదాలు, పాటలతో మారుమోగుతున్నాయ్‌. మూడు చోట్ల నేను వసంత వారి పోరాటాలకు మద్దతుగా మాట్లాడాం. వసంత సాయిబాబా గారి గురించి చెప్పగానే అందరూ ఉద్వేగానికి గురయ్యారు. మేము వారి రిలీజ్‌ కోసం ప్రార్ధన చేస్తామని చెప్పారు.
అక్కడికి దగ్గరలోనే మరో మూడు శిబిరాలున్నాయి వెళ్ళండని చెప్పారు కానీ ఆరోజే హైదరబాద్‌కి నా తిరుగు ప్రయాణం. టైం సరిపోదని వాళ్ళతో చెప్పి, వసంతని ఇంట్లో దింపేసి నేను ఎయిర్‌పోర్ట్‌కు బయలుదేరాను. ఉమన్‌ స్టడీస్‌ కాన్‌ఫరెన్స్‌ కోసం వెళ్ళినా అక్కడ హజరైంది తక్కువే. షాహీన్‌బాగ్‌ మహిళలతో సహా వందలాది మహిళల్ని వాళ్ల ఉత్సాహాన్ని, ఉద్వేగాలని చాలా దగ్గరగా చూసి, వాళ్ళ పోరాటంలో మమేకమవ్వడం చాలా స్పూర్తినిచ్చింది. షాహీన్‌బాగ్‌ పోరాటస్థలం నుంచి కొంచం మట్టి తీసుకురా అన్న మితృల కోసం నేలమీదకి వొంగి మట్టిని తీసుకుంటుంటే రాజ్యాంగ ప్రవేశిక చదివినప్పటి పులకరింత మళ్ళీ నా వొళ్ళంతా పాకి గొప్ప ధైర్యాన్నిచ్చింది.జిందాబాద్‌ షాహీన్‌బాగ్‌… జిందాబాద్‌ మహిళల మౌన నిరసన ప్రదర్శన శిబిరాలు…

Thursday, July 25, 2019

నా మీద వాలిన ఛాయాదేవి ఛాయ


ఎప్పటిమాట. పచ్చగా, చల్లగా, కుటీరం లాగా ఉండే ఆ ఇంటికి తొలిసారి ఎప్పుడెళ్ళాను. తొలిచూపులోనే ఆవిడతో ప్రేమలో పడిన సంఘటనలో నిజానికి, ఆరోజు చాలాసేపు మాట్లాడింది అబ్బూరి వరదరాజేశ్వరరావుగారితో. ‘లోహిత’నుప్రారంభించినప్పుడు జయ ప్రభతో కలిసి బాగ్‌లింగంపల్లిలోని ఛాయాదేవిగారింటికి వెళ్ళినపుడు ఆయన గలగలా మాట్లాడుతుంటే ఆవిడ లోపల్నించి తినడానికి ప్లేటులో అమర్చిన జంతికలో, మురుకులో తెచ్చారు. అంతకుముందు ఫోటోలో చూసానేమోగానీ ప్రత్యక్షంగా చూడలేదు. ఆవిడ ముఖంలో ఆవరించి ఉన్న ప్రశాంతత, మెత్తటి మాట.. నా మనసులో ముద్రపడిపోయింది. ఆరోజు ఆవిడ ఎక్కువగా మాట్లాడలేదు. ఆయన మాట్లాడారు. పచ్చటి కుటీరంలో ప్రశాంత మూర్తిని చూసాను.
ఛాయాదేవి గారితో నా పరిచయం అలా మొదలైంది. రెండున్నర దశాబ్దాల అనుబంధం. ఎన్ని సార్లు ఆ ఇంటికెళ్ళానో, ఏమేమి కబుర్లు చెప్పుకున్నామో! కాలింగ్‌బెల్‌తో సహా ఎంత కళాత్మకంగా ఆ ఇంటిని అలంకరించుకున్నారో… ఆ ఇంటికి వెళ్ళగానే కాళ్ళకు చుట్టుకునే ఆమె పెంపుడు పిల్లలు. తనకి ఇష్టమని ఎక్కడి వెళ్ళినా ఏదో ఒక పిల్లి బొమ్మని తెచ్చి ఇస్తే ఎంత సంబరపడిపోయేవారో! పిల్లులంటే ఎంత ప్రేమో!
భూజానికి ఒక బ్యాగ్‌ తగిలించుకుని బాగ్‌లింగంపల్లి రోడ్లమీద నడయాడిన ఛాయదేవిగారు ఎవ్వరికీ ఏ పనీ చెప్పేవారు కాదు. పోస్టాఫీసుకి, బ్యాంకుకి, షాప్‌లకి అలా అలవోకగా నడుచుకుంటూ వెళ్ళిపోయేవారు. వాటర్‌ బిల్లు కరెంటుబిల్లు కట్టడానికి కూడా తనే వెళుతుంటే నాకివ్వండి నేను కట్టిస్తాను అంటే ‘అబ్బే! ఎందుకమ్మా. మీకు శ్రమ నడిస్తే ఆరోగ్యంకదా!’ అని ఏదో ఒక జోక్‌ వేసేవారు. చాలా తరచుగా భూమిక ఆఫీసుకు వచ్చేవారు. ఏదో పుస్తకం కావాలని తీసుకునే వారు. ఫోన్‌ చేసి ఈ పుస్తకం తెచ్చిపెట్టు అని ఏనాడూ అడగలేదు. తన పనులన్నీ తనే చేసుకోవాలి. మూర్తీభవించిన ఆత్మగౌరవరూపం.
భూమికతో అలరారిన రెండున్నర దశాబ్దాల ఆత్మీయ అనుబంధం. భూమిక సంపాదక సభ్యులుగా కొనసాగుతూ ఎప్పటికప్పుడు నేనేమీ చేయడం లేదంటూ, నా పేరు తీసేయమంటూ అడిగేవారు. మీరేమీ చెయ్యక్కరలేదు మీరు భూమికకు ఎంతో చేసారు. భూమిక ఎప్పుడు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా మీరే కదా ఆదుకున్నారు. మీ పేరు తియ్యం అని నేను పోట్లాడేదాన్ని. కానీ మొన్న మే నెలలో నా పేరు సంపాదవర్గంలో తీసేయండి. ఇంకెవరినైనా పనిచేసేవాళ్ళని పెట్టుకోండి. ఇది నా రిక్వెస్ట్‌ ప్లీజ్‌ నా మాట వినండి అంటూ బలవంతంగా తన పేరు తీసేయించారు. ఆవిడ అంత గట్టిగా కోరుతుంటే కాదనలేకపోయాను. పేరు తీసేసినంత మాత్రాన భూమికతో తన అనుబంధం తగ్గిపోతుందా ఏమిటి? తన లైబ్రరీ అంతా భూమికకే ఇచ్చారు. లైబ్రేరియన్‌గా తన అనుభవాన్ని రంగరించి కాటలాగ్‌ ఎలా తయారుచేసుకోవాలో, పుస్తకాలు ఎలా అమర్చుకోవాలో ఎన్నోసార్లు నేర్పారు. ఆవిడ క్రమశిక్షణలో ఆరోవంతు కూడా నాకు అలవడకపోవడానికి కారణం నా స్వభవం వల్లనే.
ఛాయాదేవిగారితో నా అనుబంధం, నా అనుభవాలు ఈ సంపాదకీయంలో ఎక్కడ ఇముడుతాయి. జ్ఞాపకాలు ఒక దానికి ఇంకొకటి ఒరుసుకుంటూ కళ్ళ ముందుకొస్తున్నాయి. మనసంతా కిక్కిరిసి పోతోంది. అక్షరాలుగా అమరాలంటే… ఇక్కడ చాలదు. ఓ పుస్తకంమే రాయల్సి ఉంటుంది. ఆవిడతో నా జ్ఞాపకాలు 2012కి ముందు ఆ తర్వాతగా విడిపోయాయి. బాగ్‌లింగంపల్లి ఇంట్లోను, అన్ని సాహిత్య సమావేశాల్లోను రోడ్ల మీద నడుస్తూ, తన పనులు చేసుకుంటూ తిరిగిన ఛాయదేవిగారు, అన్నీ వదిలేసి, ఆఖరికి తన జ్ఞాపకాలతో నిండిన పచ్చటి పొదరిల్లులాంటి ఇంటిని హఠాత్తుగా అమ్మేసి, సి.ఆర్‌. ఫౌండేషన్‌లో ఓ గదికి పరిమితమైపోయిన ఛాయదేవి గారుగా నా జ్ఞాపకాలు విడిపోయాయి. కానీ అది నా భ్రమ మాత్రమే. ఎంతో ప్రేమగా, కళాత్మకంగా అమర్చుకున్న ఇంటితో బంధాన్ని పుటుక్కున్న తెంపేసుకుని, ఎలాంటి వేదనని, మానసిక క్షోభని మచ్చుకైనా కనబడనివ్వకుండా తన ఒకే ఒక గదిని మరింత కళాత్మకంగా అమర్చుకున్న ఛాయదేవి ఎప్పుడూ ఒకేలా ఉన్నారు. తనెక్కడున్నా ఆ పరిసరాల్ని సృజానాత్మకంగా తయారుచేసుకోగల అద్భుతమైన కళాహృదయం ఆమెకే పరిమితం. జిడ్డు కృష్ణమూర్తి జీవన తాత్వికతని పుణికిపుచ్చుకుని, తన జీవితంలోకి, తన మార్గంలోకి అనువదింపచేసుకున్న అపురూప వ్యక్తిత్వం ఆమెకే సొంతం.
ఆవిడ కథల గురించి, ఆవిడ సాహిత్యం గురించి, ఆవిడకొచ్చిన అవార్డుల గురించి నేను రాయబోవడం లేదు. ఆమె సాహిత్యాన్ని తూకం వేసే పని నేను చెయ్యదలుచుకోలేదు. వ్యక్తిగా, స్ఫూర్తి ప్రదాతగా మాత్రమే నేను రాయాలనుకుంటున్నాను. చరిత్ర చీకటిలో మరుగున పడిపోయిన భండారు అచ్చమాంబను వెలుగులోకి తెచ్చింది, నా చేత అచ్చమాంబ జీవిత చరిత్రను రాయించిందీ ఛాయాదేవిగారే అని మాత్రం సగర్వంగా చెప్పదలచుకున్నాను. ఒకానొక కథా వర్క్‌ షాప్‌ రిపోర్ట్‌ని యధాతధంగా యాభైపేజీలు రాసిన ఛాయాదేవి గారు కె. లలిత ప్రస్తావించిన అచ్చమాంబ కథ గురించి రాయడం, అది చదివి నేను చాలా ఉత్సాహంగా అచ్చమాంబ గురించి శోధించి ఓ పెద్దవ్యాసం రాయడం, బ్రౌన్‌ అకాడమీ కోసం పుస్తకం రాయమని ఛాయాదేవి గారు అడగడం ఫలితం, అచ్చమాంబ ‘సచ్ఛరిత్ర పుస్తకర’ నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని సందర్భం. ఆవిడకు శిరస్సువొంచి నమస్కరించడం మినహా ఏమి చెయ్యగలను.
2012లో బాగ్‌లింగంపల్లి నుంచి కొండాపూర్‌ వెళ్ళిపోయినప్పుడు తనని చూడడానికి వెళ్ళినప్పుడు ‘మీ పేరుమీద రెండు
ఉత్తరాలు పోస్ట్‌ చేసాను నిన్ననే. మీరొస్తారని తెలియదు. తెలిస్తే మీకే ఇచ్చేదాన్ని’ అన్నారు. భూమికకు ఏదైనా కథో, వ్యాసమో రాసి పంపారేమో అనుకున్నాను. కానీ అది కథకాదు. ‘ఈహోమ్‌కి వచ్చాక వాళ్ళు ఒక ఫారమ్‌ ఇచ్చి పూర్తి చేయమన్నారు. అందులో ఒక ప్రశ్న ఏమిటంటే ”మీకు అనారోగ్యం కలిగినా, ఇంకేమైనా ప్రమాదం జరిగినా వెంటనే మేము తెలియచేయాల్సిన వ్యక్తి పేరు, ఫోన్‌, అడ్రస్‌ రాయమన్నారు. నేను మీ పేరు రాయాలని అనుకున్నాను. ఆ విషయమే మీకు ఉత్తరం రాసాను” అన్నారు. ”తప్పకుండా మీరు నా పేరు రాయండి. మీకు ఎప్పుడు అవసరమైతే అప్పుడు నేనొచ్చేస్తాను.” అని చెప్పాను.
చాలా సార్లు ఆ ఉత్తరం చదవాలనుకునేదాన్ని ఇప్పుడెందుకులే అని విరమించుకునేదాన్ని, ఆవిడ కన్నుమూసాకే ఆవిడిచ్చిన కవర్‌ తెరిచాను. ఇప్పుడు నాతోపాటు అందరూ చదివారు. నా మీద ఆవిడకున్న నమ్మకం, విశ్వాసం, నన్ను తన కూతురుగా భావించిన ఆ విశాలత్వం నన్ను వివశురాలిని చేసాయి. అందరి సహకారంతో ఆవిడ కోరుకున్న విధంగా ఎలాంటి కర్మకాండలూ లేకుండా, తన కళ్ళని ఎల్‌వి ప్రసాద్‌ ఐ ఆసుప్రతికి, తన పార్థివ శరీరాన్ని వైద్యవిద్యార్థుల పరిశీలనార్థం ఇఎస్‌ఐ మెడికల్‌ కాలేజీకి డొనేట్‌ చేసాం. ఇంక ఆవిడ నా మీద పెట్టిన పెద్ద బాధ్యత తను రాసిన విధంగా ఫిక్స్‌డ్‌ డిపాజిట్లను ఆయా వ్యక్తులకు అందించడం. వీలు వెంబడి ఆ పని పూర్తి చేస్తాను.
అబ్బూరి ఛాయాదేవి గారితో నాకున్న మానసిన సాన్నిహిత్యం, అనుబంధం గురించి రాయడానికి ఈ సంపాదకీయం సరిపోదు. భూమిక సంపాదక సభ్యులుగా తన స్మ ృతికి నివాళిగా మాత్రమే ఇది సరిపోతుంది.
మనందరికీ అత్యంత ఆత్మీయురాలు, గొప్ప మానవీయతతో అలరారే అద్భుత చైతన్యమూర్తి
అబ్బూరి ఛాయాదేవి గారికి నా అశ్రునివాళి.

తర్పణాలు త్రిశంకు స్వర్గాలు

 తర్పణాలు, త్రిశంకు స్వర్గాలు ............ మా సీతారాంపురం లో మా తాతకి చాలా పొలాలు ఉండేవి. మా తాత, చిన్న తాత ఇద్దరే పొలాలన్నింటిని పంచుకున్నా...