Wednesday, June 1, 2011

అమెరికాలోను మన ఆడపిల్లకి ప్రాణగండమే!



భారత దేశం సరే వెనుకబడిన దేశం, అభివృద్ధి చెందుతున్న దేశం. ఇక్కడ ఆడపిల్లల్ని తల్లిదండ్రులే చంపి పాతేస్తున్నారు. పిండాల్నయితే కడుపులోనే కరిగించేస్తున్నారు. ఒక్కళ్ళా? ఇద్దరా? 2005 నుండి 2011 వరకు ఒక్క ఆంధ్ర రాష్ట్రంలోనే 78,847 మంది ఆడపిండాల్ని గుట్టుచప్పుడు కాకుండా గర్భంలోనే చంపేసారు. 2001లో 1000 మందికి 927 వుంటే, 2011లో దారుణంగా 914కి పడిపోయింది. ఆడపిల్లల్ని చంపుకోవడంలో చాలా అభివృద్ధిని సాధించాం. మహిళల మీద పెరిగిపోతున్న హింసల్లో అత్యంత అభివృద్ధిని సాధించాం.

భారతదేశం మొత్తం మీద 2005-11 మధ్య కాలంలో 1,078,378 మంది ఆడపిల్లలు పుట్టకుండా హతమైపోయారు. అందులో 78,847 మంది పిల్లలు మన రాష్ట్రంలోనే చంపేయబడ్డారంటే పరిస్థితి ఎంత దారుణంగా వుందో అర్ధమవుతోంది. వీధి వీధికీ అల్ట్రాసౌండ్‌ మిషన్‌లు పెట్టి పుట్టబోయేది ఆడో, మగో తెలుసుకుని ఆడపిండాల్ని అంతం చేసేస్తున్నారు.

అన్ని రకాలుగాను వెనుకబడిన మహబూబ్‌నగర్‌ జిల్లాలో 2004-08 మధ్యకాలంలో స్కానింగ్‌ సెంటర్లు 146% పెరిగాయని, అదే విధంగా నల్గొండ, అనంతపూర్‌,కడప జిల్లాల్లో కూడా విపరీతంగా స్కానింగ్‌ మెషీన్లు వెలిసాయి.మహబూబ్‌నగర్‌లో ఇన్ని స్కానింగ్‌ మిషన్లు ఎలా చేరాయి? ఎందుకు చేరాయి? ఆ సెంటర్లలో ఏం జరుగుతోంది అనే ఆరా గానీ, సవ్యమైన పర్యవేక్షణగానీ లేవు. గర్భం దాల్చిన ప్రతి మహిళకి అల్ట్రా సౌండ్‌ టెస్ట్‌ చేసి ఆడో, మగో చెబుతున్న డాక్టర్లు అసలు నేరస్థులు. వేలల్లో ఆడపిల్లల్ని ప్రతి రోజు హత్య చేస్తున్న ఈ డాక్టర్లు- నిజానికి ఒక మహోన్నతమైన వృత్తికోసం మలచబడిన వాళ్ళు. వీళ్ళు హంతక ముఠాల్లా మారి ఆడపిల్లల్ని మాయం చేస్తున్నారంటే డబ్బు కోసం ఎంతటి నీచానికి దిగజారుతున్నారో అర్థమవుతోంది. వీళ్ళ డబ్బు లాలస, తల్లిదండ్రుల కొడుకు ప్రేమ కలగలసి సమాజంలో ఎంతటి అసమతుల్యానికి కారకులవుతున్నారో వీళ్ళకర్ధమవుత్నుట్టు లేదు. ఆడపిల్లల ఉసురు పోసుకుంటున్న వీళ్ళు కిరాయి హంతక ముఠాలకేమీ తీసిపోరు. వాళ్ళు డబ్బు కోసం హత్యలు చేస్తారు. వీళ్ళూ డబ్బుకోసమే హత్యలు చేస్తున్నారు.

నిన్నటికి నిన్న ”లాన్సెట్‌ మ్యాగజైన్‌” భారతదేశంలో తగ్గిపోతున్న సెక్స్‌ రేషియో గురించి గగుర్పొడిచే అంశాలు బయట పెట్టింది. బాగా డబ్బున్న, బాగా చదువుకున్న కుటుంబాల వాళ్ళే ఎక్కువగా లింగ నిర్ధారణ పరీక్షలు జరిపించి ఆడపిండాలను చంపుతున్నారట. ముఖ్యంగా మొదటి బిడ్డ ఆడపిల్ల అయితే రెండో బిడ్డ ఖచ్చితంగా మగపిల్లాడే వుండాలట. ఒక వేళ కడుపులో ఆడపిండం వుంటే అంతే సంగతులు. ఆడపిండాన్ని అబార్షన్‌ చేసేసి, మళ్ళీ గర్భం ధరించడం మళ్ళీ ఆడపిల్లయితే మళ్ళీ అబార్షన్‌. ఇలా మగ పిల్లాడు పుట్టేవరకు ఈ హత్యల పరంపర కొనసాగుతుంది. ఇంట్లో ఖచ్చితంగా మగపిల్లాడుండాలి. ఆడపిల్ల లేకపోయినా ఫర్లేదు. ఇదీ వీళ్ళ కుతంత్రం.

‘లాన్సెట్‌’ ఇంకా ఏం చెప్పిందంటే, వాళ్ళు నిర్వహించిన అధ్యయనం ప్రకారం 1980 నుంచి 2110′ వరకు ఇలాంటి అబార్షన్ల సంఖ్య కనీసం 40 లక్షలు అత్యధికం ఒక కోటి ఇరవై లక్షలు ఉండొచ్చని చెబుతున్నారు. అంతేకాక గత ముఫ్పై ఏళ్ళల్లో ఇలాంటి అబార్షన్లు పెరగడంతో పాటు ఉత్తర భారతం నుంచి ఈ జాడ్యం దక్షిణ భారతదేశానికి కూడా పాకిందట. ఇటీవలి సెన్సెస్‌ సమాచారంతో పాటు 2.5. లక్షల పుట్టుకలను వారు విశ్లేషించినపుడు దిగ్భ్రాంతికర విషయాలు వెలుగు చూసాయి. కుటుంబంలో రెండో సంతానం ఉన్నపుడు బాలిక-బాలురకు నిష్పత్తిని గమనించారు. 1990 లో ప్రతి 1000 బాలురకు 906 మంది బాలికలుండగా 2005 నాటికి బాలికల సంఖ్య 836కి పడిపోయింది.

మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే అమెరికాలో తిష్ట వేసిన భారతీయుల్లో కూడా ఆడపిల్లల పట్ల ఇవే ధోరణులుండడం. అక్కడ కూడా గర్భస్థ ఆడపిండాలని యధేచ్ఛగా గర్భంలో చంపేస్తున్నారు. భారతదేశంలో కనీసం పిసిపిఎన్‌డిటి చట్టం అమలులో వుంది. (దీని అమలు ఎంత ఘోరమో అది వేరే విషయం) అమెరికాలో ఇలాంటి చట్టాలేమీ లేవు. తమకి పుట్టబోయేది ఆడపిల్ల అని తెలిసి 40% మంది అబార్షన్‌లు చేయించుకున్నారట. మొదటి సంతానం ఆడపిల్లవుంటే గర్భవతులు రెండోసారీ కూడా గర్భంలో ఆడపిల్లే వుంటే కనుక 89% గర్భస్రావం చేయించుకుంటున్నారు.
ఆడపిల్లకి (ఆడపిండానికి) ఆంధ్ర అయినా అమెరికా అయినా ప్రాణరక్షణ లేదనేది ఈ అధ్యయనం రుజువు చేసింది.
ఆడపిల్లలకి ఆస్థి హక్కు ఇవ్వరు. ఇచ్చినా అమలు చేయరు. చదువు చెప్పించరు. చెప్పించినా సంపాదించుకోనివ్వరు . సంపాదించుకున్నా నిర్ణయాధికారమివ్వరు. పెళ్ళి పేరుతో నిప్పుల కొలిమిలోకి కట్నమిచ్చి మరీ తోస్తారు. అదనపు కట్నం తెమ్మని వాడు చిత్రహింసలు పెడుతుంటే అత్తింట్లోనే చావమని శాసిస్తారు. పుట్టింటి గౌరవాన్ని పాడు చెయ్యొద్దంటారు. గొంతు కోసేవాడొకడు, గొంతు నులిమే వాడొకడు. దెబ్బ కనబడకుండా ఎముకలు విరగ్గొట్టే వాడొకడు. ముక్కలుగా నరికి సూట్‌ కేసుల్లో పెట్టేవాడొకడు. ఇన్ని చావులు చచ్చే ఆడపిల్లలని అన్ని దశల్లోను పరమ కిరాతకంగా హత్యలు చేస్తున్న ఈ సమాజం, భారతీయ సమాజం పురోగమించిందని, అభివృద్ధి పధంలోకి దూసుకెళుతోందని ఎవరురా కూసింది. జనాభాలో సగ భాగం చావుబతుకుల్లో కొట్టుమిట్ట్లాడుతుంటే, పుట్టకుండానే ఆడపిల్లల్ని చంపేసే దరిద్రగొట్టు కాదు కాదు మదమెక్కిన ధనిక ప్రపంచం దృష్టిలో ”అభివృద్ధి” జరుగుతోందేమో కాని ఆడవాళ్ళ పరంగా మనమింకా అథ:పాతాళంలోనే వున్నాం.






5 comments:

Anonymous said...

Agree (50%) with your assessment on women status in India. Each coin has two faces. Similarly good and evil co-exists in a given society. So far no pure society exists on any where in the world.

Also write about good things happening in Indian society about empowering women.

Don't copy the western model for Indian society as is. There are many traps in the western model. Need refinement.

Indian society progressed in many respects in empowering women. Need more progress.

If possible write a blog post on "role of women (e.g. mother-in-law) in exploitation of other women (e.g. daughter-in-law)".

Please write a article on the plight of women in Islamic countries also. They lack minimum human rights in those countries for women. Living like worse than slaves.

Do you support uniform civil code in India?

What you think about a legislation that restricts age difference between Bridegroom and Bride should be less than 10 (??) years?
(It will prevent wealthy males to buy/acquire much younger female for marriage/living in). Remember Kanyasulkam days. 60+ year Arab male buying 14-15 year Hyderabad girls for marriage.

Do you support banning Polygamy among Muslims?

There are many many factors effect women's status in a given society. e.g.

1) Economic status
2) Religious rules
3) Social customs
4) Educational status
5) Cultural factors
6) Male attitude towards women
7) Political setup
8) Employment status
9) Opportunities for Entrepreneurship and self employment
10) Women's attitude towards women
11) Mode of economy (e.g. Industrial or Agrarian etc)
12)

Praveen Mandangi said...

అబార్షన్ చెయ్యడమే అంత సులభం కాదు. అబార్షన్ చేస్తున్నప్పుడు గర్భ సంచిని కనెక్ట్ చేసే ట్యూబ్ తెగిపోతే తిరిగి గర్భం కాదు.

lalithag said...

నిజంగానా? నా చుట్టు పక్కల తెలిసిన వళ్ళలో ఆడ పిల్ల కావలని మరీ మూడో సంతానం కనే వారిని కూడా చూశానండీ, అమెరికాలో ఉన్న తెలుగు వారిలో. ఆడ పిల్లల తల్లులు సంతోషంగా ఉన్నారు. ఆడ పిల్ల కావాలనుకునే వారున్నారు. ముందు అబ్బాయి పుడితే బాగుండును అని ఎవరైనా అనుకున్నా తీరా పుట్టాక ఎక్కువ బాధ పడిన వారిని దాదాపు చూడలేదనే చెప్పాలి. నాకు తెలిసిన వారు చాలా తక్కువ మంది అనుకోండి. ఐనా నేను గమనించిన విషయం పంచుకోవాలనిపించింది.

rajiv raghav said...

నిజానికి వాస్తవిక అధారాలతో చూస్తే మీరు అన్నది నిజమే కాని..... నాకు తెలిసి మన దగ్గర అటువంటి దురాచారం లేదండి.... నాకు తెలిసిన మరియు మా మొత్తం కుటుంబంలో ఆడపిల్లలకు, మగపిల్లలకు తేడా ఏమి చూపడం లేదు...... ఇంకా చెప్పాలంటే సంతానంలో అబ్బాయి లేకపోయినా పర్వాలేదు.. కాని అమ్మాయి మాత్రం ఉండాలని కోరుకోనే వారిని నేను చాలా మందిని చూసాను........ ఇంకా చెప్పాలంటే నన్ను, నా సోదరిని సమాన చదువులు చదివించారు మా తల్లిదండ్రులు... అంతే కాదు మీరు ఎక్కువగా అంటుంటారే ఆస్తిలో సమాన వాటా ఇవ్వాలని........ ఆ విధముగానే నా సోదరికి, నాకు సమానంగా చెందుతుందని విల్లు కూడా రాసారు....... మీరన్న దురాచరం ఎక్కువగా ఉత్తర భారతదేశంలో ఉందని నేను అనుకుంటున్నాను..... దానికి కారణమేమిటంటే వాళ్ళ అర్దిక పరిస్దితి మెరుగైన స్దాయిలో లేకపోవడం మరియు సరైన చదువులు లేకపోవడం వలనే ఈ దౌర్బాగ్యం..... దీనికి మనము ఎవరిని నిందించలేము.... అక్కడ ఉన్న ఆయా ప్రభుత్వాలు ప్రజల్ని చైతన్యం చేయడాన్ని బట్టి దీన్ని నివారించవచ్చు...... ఇది కేవలం నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే..... ఏ ఒక్కరిని తక్కువ చేయడం లేదా చులకనచేయడం కాదు..........

Rama said...

మీరు రాసింది అక్షరాల నిజం. ఆడ పిల్ల అంటే చులకన, నిర్లక్ష్యం, కింద తరగతుల్లో వుంటే, ఆడ పిల్ల అంటే నే అక్ఖర్లేదు అనుకుంటున్నారు సంపన్న వర్గాల వారు. ఎందుకిలా జరుగుతోంది అని అధ్యయనాలు చేసి చెప్పే లోపల జరగాల్సిన నష్టం జరిగిపోతున్నది. అమెరికా లో కూడా మనవాళ్ళు ఇలాగె వున్నారంటే ఆర్ధికంగా ఎంత ఎత్తు ఎదిగినా మన మనస్తత్వాలు మారటంలేదు అని సిగ్గుపడాల్సి వస్తున్నది. మీ బ్లాగ్ చాలా బాగుంది. కాని ఎంత మంది చదువుతారు, ఎంతమందికి కనువిప్పు కలుగుతుంది అనేది కోటి డాలర్ల ప్రశ్నే?

తర్పణాలు త్రిశంకు స్వర్గాలు

 తర్పణాలు, త్రిశంకు స్వర్గాలు ............ మా సీతారాంపురం లో మా తాతకి చాలా పొలాలు ఉండేవి. మా తాత, చిన్న తాత ఇద్దరే పొలాలన్నింటిని పంచుకున్నా...