Saturday, April 3, 2010

భల్లుగూడ బాధిత మహిళల మౌన ఘోష

జనవరి 22న విశాఖ జిల్లా భల్లుగూడలో వాకపల్లి పునరావృతమైంది. మావోయిష్టులకు ఆశ్రయమిస్తున్నారనే నెపాన్ని చూపించి గ్రౌహౌండ్స్‌ పోలీసులు గిరిజన గ్రామాలమీద దాడి చేసి, పురుషుల్ని హింసలకి గురి చేయడం, అరెస్టులు చెయ్యడం, స్త్రీల మీద లైంగిక అత్యాచారాలకి పాల్పడడం సాధారణమైపోయింది. వాకపల్లిలో 11 మంది గిరిజన స్త్రీల మీద అత్యాచారం చేసిన పోలీసులు ఎలాంటి శిక్ష లేకుండా తప్పించుకుని తిరుగుతున్నారు. వాకపల్లి స్త్రీల గుండెఘోష ఆ కొండల్లో ఇంకా ప్రతిధ్వనిస్తూనే వుంది. తమపై అత్యాచారం చేసిన పోలీసుల్ని శిక్షించమని గొంతెత్తుతూనే వున్న వారి న్యాయమైన డిమాండ్‌ పట్టించుకునే వ్యవస్థే కరువైంది. వాకపల్లి ఉదంతం మరవక ముందే అదే బీభత్స సంఘటన భల్లుగూడాలో జరిగింది. నలుగరు ఆదివాసీ స్త్రీల మీద పోలీసులు అత్యాచారం చేసారనే వార్త నిర్ఘాంతపరిచింది.

ఫిబ్రవరి ఇరవై ఆరున కొంతమంది రచయిత్రులం కలిసి విశాఖ బయలు దేరాం. భల్లుగూడలో అత్యాచార బాధిత స్త్రీలను కలవాలని, వారి దు:ఖాన్ని పంచుకోవాలన్నదే మా ప్రయాణ కారణం. పాడేరుకి 80 కిలోమీటర్ల దూరంలో భల్లుగూడ వుంది. ఆ ఊరికి చేరాలంటే పది కిలోమీటర్లు కొండలు ఎక్కి, అడవి దాటి కాలినడకన వెళ్ళాలని ముందే హెచ్చరిక అందింది. మేము వెళ్ళడం కష్టం అవుతుందని, బాధిత స్త్రీలు పాడేరుకి వస్తారని, అక్కడ వారిని కలవొచ్చని అడ్వకేట్‌ లక్ష్మి చెప్పింది.

మేము విశాఖ నుంచి రెండు టాటా సుమోల్లో పాడేరు బయలు దేరాం. అప్పటికీ సమయం 9.30 అయ్యింది. లంచ్‌ టైమ్‌కి పాడేరుచేరాం. అయిదే మేము భల్లుగూడ వెళ్ళాల్సి వుందని, తొందరగా బయలు దేరితే మంచిదని చెప్పారు. చిన్న హోటల్‌ మీద పడి, వేడి వేడి అన్నం తిని, పాడేరు నుంచి భల్లుగూడా బయలు దేరాం. నాలుగ్గంటలకి ఒక ఊరి దగ్గర వాహనాలు ఆగి పోయాయి. అక్కడి నుండి భల్లుగూడ దాదాపు పది కిలోమీటర్లు వుంటుందని, వాహనాలు వెళ్ళవని, రెండు కొండలెక్కి ఓ అడవి దాటి వెళ్ళాలని మాతో వచ్చిన లక్ష్మి చెప్పింది. సగం దూరం నడిస్తే మధ్యలో భల్లుగూడ బాధిత స్త్రీలు కలిసే అవ కాశం వుందని కూడా తను చెప్పడంతో అందరం నడక మొదలు పెట్టాం. మొదటి కొండ ఎక్కి దిగేసరికి మాలో సగం మంది వెనక్కి వెళ్ళిపోయారు. కేవలం ఏడుగురం మాత్రం పట్టువదలకుండా నడక సాగించాం. దారంతా రాళ్ళు, రప్పలు. దట్టంగా అల్లుకున్న చెట్లు తీగెలు. వాకపల్లి ప్రయాణాన్ని మించిన ప్రయాస పడ్డాం. చుట్టూ కొండలు, లోయలు ఎంతో అందమైన ప్రాంతం. నిర్మానుష్యమైన ప్రదేశం. ఇలాంటి నిశ్శబ్ద ప్రాంతంలో తమ బతుకు తాము బతుకుతున్న ఆదివాసీలను ఇటు మావోయిస్టులు, అటు పోలీసులు కల్లోల పరచడం, పోలీసులు అత్యాచారాలకు తెగబడ్డం చాలా అన్యాయం.

సూర్యాస్తమయమై, చిరు చీకట్లు కమ్ముకుంటున్న వేళ మేము భల్లుగూడ చేరాం. ఊరంతా మా కోసం ఎదురు చూస్తోందా అన్నట్టు గ్రామస్తులంతా ఒక చోట గుమి గూడారు. దారిద్య్రం తాండవిస్తున్న చిన్న గూడెం అది. మేము ఒక ఇంటి ముందు కూర్చున్నాం. మా చుట్టూ ఊరంతా చేరారు. చంకల్లో పిల్లలతో అత్యాచారానికి గురైన ముగ్గురు స్త్రీలు వచ్చి కూర్చున్నారు. వాళ్ళ ముఖాల్లోని అమాయకత్వం, ఏ భావమూ లేని ముఖ కవళికలు నన్ను చాలా కలవరపెట్టాయి. ఏడ్చి ఏడ్చి అలసిపోయినట్టు, మా దు:ఖాన్ని మీరెవ్వరూ తీర్చలేరు అన్నట్టు నిరామయంగా కూర్చున్నారు. వాళ్ళతో మాట్లాడటానికి ప్రయత్నించాం. వాళ్ళకి తెలుగు రాదు. తమ దు:ఖగాధని మాతో పంచుకునే భాష కరువైంది. రాంబాబు అనే ఆయన మాకు దుబాసీగా వ్యవహరించాడు. ఒకరి తర్వాత ఒకరు పోలీసులు తమ పట్ల ఎంత దారుణంగా వ్యవహరించింది వివరించారు. వంతల డోమిని, వంతల రామి, వంతల ముక్తలు తోడికోడళ్ళట. అందులో ఒకరి చేతుల్లోని పసిగుడ్డుని తుప్పల్లోకి విసిరేసారని, ఇద్దరి భర్తల్ని బాగా కొట్టి, అరెస్ట్‌ చేసారని, ప్రస్తుతం విశాఖ జైలులో వున్నారని రాంబాబు చెప్పాడు.

జనవరి 22న తెల్లవారు ఝూమున దాదాపు 80 మంది గ్రేహౌండ్స్‌ పోలీసులు, స్థానిక ఎస్‌.ఐతో సహా భల్లుగూడ గ్రామం మీద దాడి చేసి మగవాళ్ళని, మగపిల్లల్ని దగ్గరలోని స్కూల్‌లో పెట్టి తాళం వేసారు. ఆ తర్వాత ఆదివాసీల ఇళ్ళల్లోకి జొరబడి నలుగురు స్త్రీల మీద అత్యాచారానికి పాల్పడ్డారు. ఏడుగురు మగవాళ్ళని అరెస్ట్‌ చేసి తీసుకెళ్ళుతూ ఇక్కడ జరిగిన విషయాలను బయట పెడితే పరిణామాలు దారుణంగా వుంటాయని బెదిరించారని చాలా భయపడుతూ గ్రామస్తులు వివరించారు. తమకి పోలీసులంటే చాలా భయమని, పదేళ్ళ క్రితం ఇలాగే తమ గ్రామం మీద పడి ఊళ్ళోని పెద్ద వాళ్ళని దారుణంగా కొట్టారని, ఆ సంఘటనని తాము ఎప్పటికీ మర్చిపోలేమని, తమకు మావోయిష్టుల గురించి ఏమీ తెలియదని గద్గద స్వరాలతో వివరించారు.

డోమిని, రామి, ముక్తలతో మాట్లాడాలని ఎంతగా అన్పించినా భాష అడ్డం వచ్చింది. వారి ముఖాల్లో, కళ్ళల్లో 22 నాటి భయానక సంఘటన తాలుకూ భయం స్పష్టంగా కనబడుతోంది. నిశ్శబ్దంగా దు:ఖాన్ని అనుభవిస్తున్న ఆ ముగ్గురు స్త్రీలను చూస్తుంటే మా కళ్ళల్లో నీళ్ళొచ్చాయి.

రెండేళ్ళ క్రితం ఇదే విధమైన దారుణ సంఘటన వాకపల్లిలో జరిగినపుడు ఆ మహిళలు కన్నీరు మున్నీరుగా విలపిస్తూ ''భూమి చెప్పితే ఆకాశం నమ్మదా'' అంటూ సభ్య సమాజాన్ని నిలదీసారు. భల్లుగూడ డోమిని, రామి, ముక్తలు కన్నీళ్ళను సైతం కోల్పోయారా అన్నట్లు అన్పించారు. మేము కూడా మౌనంగానే వారి దు:ఖాన్ని పంచుకుని, వారికి న్యాయం జరిగేలా కృషిి చేస్తామని, ఈ మారు మూల ఆదివాసీ గ్రామంలో పోలీసులు జరిపిన భీభత్స కాండ గురించి ప్రపంచానికి తెలియచెబుతామని వారికి చెప్పి తిరుగు ప్రయాణమయ్యాం. చిక్కటి చీకటిలో చుక్కలే తోడుగా ఆ కొండలెక్కి, అడవిదాటి నడక సాగించాం. నేను భల్లుగూడ నుంచి తెచ్చుకున్న కర్రసాయంతో నడుస్తూ, రెండుసార్లు పడబోయి నిలదొక్కుకున్నాను. పాములు తిరుగుతాయని ఎలుగుబంట్లు దాడి చేస్తాయని చెబుతుంటే భయమన్పించలేదు. కౄరమృగాలకు  భయపడని ఆదివాసీలు పోలీసు మృగాల ముందు భయకంపితులవ్వడం, వారి అత్యాచారాలకు గురవ్వడం ఆశ్చర్యమే. మృగాలు వారి నేస్తాలే. పోలీసు మృగాలు మాత్రం వారి పట్ల పరమ శతృవులై ప్రవర్తించడం శోచనీయం.

అలిసిపోయి, అన్నాలు తినకుండానే అర్ధరాత్రి వైజాగు చేరాం. భల్లుగూడ మహిళలపై అత్యాచారాలకు పాల్పడిన గ్రేహౌండ్స్‌ పోలీసులను అరెస్ట్‌ చేసి శిక్షించాలని డిమాండ్‌ చేస్తున్నాం. వైజాగు జైలో వున్న వారికి బెయిల్‌ దొరికిందని, షూరిటీల కోసం చూస్తున్నామని ఆ తర్వాత రాంబాబు ఫోన్‌ చేసి చెప్పాడు. భల్లుగూడ బాధిత స్త్రీలకు న్యాయం జరిగేలా కృషి చేయమని పౌరసమాజాన్ని, రచయితల్ని, మేధావుల్ని కోరుతున్నాం.

No comments:

తర్పణాలు త్రిశంకు స్వర్గాలు

 తర్పణాలు, త్రిశంకు స్వర్గాలు ............ మా సీతారాంపురం లో మా తాతకి చాలా పొలాలు ఉండేవి. మా తాత, చిన్న తాత ఇద్దరే పొలాలన్నింటిని పంచుకున్నా...