Sunday, April 22, 2007


మా గోదావరి కధలు

మా రెండో అక్క వాళ్ళ వూరు కేసనపల్లి వెళ్ళాలంటే మేము మా సీతారామపురంలో బస్సు ఎక్కి నర్సాపురం వచ్చి,వలందర రేవులో పడవలో గోదావరి దాటి సఖినేటిపల్లి వెళ్ళాలి. అక్కడ ఇంకో బస్సు ఎక్కి వాళ్ళ వూరు వెళ్ళాలి.అప్పట్లో చిన్న చిన్న పడవలు మాత్రమే వుండేవి.నేను ఆ పడవల్లో ఎక్కి మహా ఆనందంగా మా చిన్నక్క వాళ్ళింటికి వెళ్ళే దాన్ని.అయితె పడవెక్కినప్పుడల్లా పడవ మనిషితో గొడవే.నాకు పడవ అంచు మీద కూర్చుని గోదావరి నీళ్ళల్లో చేతులు పెట్టి నీళ్ళతో ఆడుకుంటూ ప్రయాణం చేయాలని ఉండేది. కానీ పడవ మనిషి ఆడవాళ్ళని అంచు మీద కుర్చోనిచ్చేవాడు కాదు.ఎంత తగువుపడ్డా ఒప్పుకునేవాడుకాదు.నేను పోట్లాడి అంచు మీదే కూర్చునేదాన్ని.ఆడవాళ్ళు చెడిపోతున్నారు అంటూ తిట్టేవాడు.ఆడవాళ్ళు ఎందుక్కూర్చోకూడదు అంటూ నేను పోట్లాడేదాన్ని. నాతో మా నాన్న వున్నా కూడ మా నాన్న చెప్పినా పడవ మనిషి వినిపించుకునేవాడు కాదు. పడవ అంచు మీద కూర్చోడానికి, గోదావరిని ముట్టుకోవడానికి నేను చిన్నప్పుడే బోలెడన్ని యుద్ధాలు పడవవాళ్ళతో చేసాను.అంత చిన్న వయస్సులో వివక్షల గురించి అర్ధం కాకపోయినా ఆడవాళ్ళని కింద కూర్చోబెట్టి మగవాళ్ళని ఆనందంగా అంచుల మీద కూర్చోమని శాసించడం నాకు చాలా కోపాన్ని కలిగించేది. ఇన్ని గొడవలు పడి గోదావరి దాటేసి, సఖినేటిపల్లిలో రేవులో పడవలోంచి దూకేసి గోదావరిలో చిందులేసుకుంటూ పరుగులెట్టిన ద్రుశ్యాలు ఇంకా నా కళ్ళల్లో మెదులుతున్నాయి.

No comments:

తర్పణాలు త్రిశంకు స్వర్గాలు

 తర్పణాలు, త్రిశంకు స్వర్గాలు ............ మా సీతారాంపురం లో మా తాతకి చాలా పొలాలు ఉండేవి. మా తాత, చిన్న తాత ఇద్దరే పొలాలన్నింటిని పంచుకున్నా...