Thursday, May 2, 2013

మీడియా దృష్టిలో మహిళా సాధికారత అంటే….

ప్రతిరోజూ ఏదో ఒక చానెల్‌ నుండి పిలుపొస్తుంది. వస్తామని చెప్పగానే ఎక్కించుకు పోవడానికి వాహనమొస్తుంది. అతి మర్యాదగా తోడ్కొని తీసుకెళ్ళి స్టూడియోలో కూర్చోబెడతారు. లైట్లు వెలుగుతాయ్.
కెమెరాలు మర్యాదగా అటూ, ఇటూ కదులుతాయి. ఏంకర్‌ పక్కన కూర్చున్న వొక్కరమో, ఇద్దరమో మాట్లాడటం మొదలు పెడతాం. ఆంధ్రప్రదేశ్‌లో మహిళల మీద పేట్రేగిపోతున్న హింస గురించి యాంకర్‌ ప్రశ్నలు సంధించడం, దీనికి అతిధులు సమాధానాలు చెప్పడం, చర్చ ముగియడం. కొన్నిసార్లు ఉద్వేగంతో, కోపంతో మాట్లాడటం, నోరు నొప్పెట్టే వరకు సమస్యలు, నేరాలు, పరిష్కారాలు గురించి చర్చించడం మీడియాతో చాలా తరుచుగా జరిగే కార్యక్రమమిది.

దాదాపు అన్ని చానెళ్ళు స్త్రీల అంశాల మీద టాక్‌షోలు, చర్చా కార్యక్రమాలు నిర్వహిస్తూనే వున్నాయి. మాలాంటి వాళ్ళం వీటిల్లో పాల్గొంటూనే వున్నాం. ఒకానొక చానల్‌ వారి మహిళా కార్యక్రమంలో ఎన్నో అద్భుతమైన అంశాలు గురించి, ముఖ్యంగా రాత్రివేళల్లో హైదరాబాదు స్త్రీలకు రక్షణ ప్రదేశమేనా, రాత్రిళ్ళు డ్యూటీలు ముగించుకుని, క్యాబ్‌లలో ఇళ్ళకు చేరే మహిళా సాప్ట్‌వేర్‌ ఉద్యోగులకు ఎంత భద్రత వుంది, లాంటి అంశాల మీద జండర్‌ సెన్సిటివిటీతో ఎన్నో కార్యక్రమాలు నిర్వహించిన ఈ చానెల్‌ సైతం ఎంత జండర్‌ బండతనంతో వ్యవహరించగలదో ఏప్రిల్‌ 11న జరిగిన సంఘటన రుజువు చేసింది. ఏప్రిల్‌ 11, రాత్రి 11 గంటల సమయంలో అసలు ఏం జరిగింది? నల్సార్‌ లా యూనివర్సిటీ విద్యార్ధులకి, తెలుగు ఎలక్ట్రానిక్‌ మీడియాకు మధ్య యుద్ధ వాతావరణం ఎందుకు ఏర్పడింది? ఆ రాత్రి ఏం జరిగిందో మీడియా ఇప్పటికే ప్రపంచానికి తనదైన శైలిలో చూపించింది.

నల్సార్‌ విద్యార్ధులు కొందరు వీడ్కోలు విందు చేసుకోవడానికి బంజారాహిల్స్‌లోని రైన్‌ క్లబ్‌కి వెళ్ళారు. పార్టీ అయిపోయిన పదిన్నర, పదకొండు గంటల మధ్య క్లబ్‌ బయటకొచ్చారు. పార్టీ జరుపుకుంటున్నారు కాబట్టి వాళ్ళ కిష్టమైన దుస్తులు వేసుకున్నారు. అది క్లబ్‌ కాబట్టి డ్రింక్స్‌ తీసుకుని వుండొచ్చు కొంతమంది. క్లబ్‌ బయటకొచ్చిన అమ్మాయిల్ని ఫోకస్‌ చేస్తూ ఎవరో వీడియో తీయడంతో అసలు గొడవ మొదలైంది. తమని వీడియో తీయొద్దని అమ్మాయిలు వ్యతిరేకించారు. కానీ…. మీడియా వాళ్ళు హఠాత్తుగా ఎక్కడి నుంచి వచ్చారో, క్లబ్‌ దగ్గర ఎందుకు మాటేసి వున్నారో, తెలియదు కానీ అమ్మాయిల్ని టార్గెట్‌ చేస్తూ వీడియో తియ్యడమే కాదు, వాళ్ళు వ్యతిరేకిస్తున్నా వినకుండా కారు వరకు వేధిస్తూ వెళ్ళారు. ఆ విజువల్స్‌ అన్నీ టీవీల్లో ప్రసారమయ్యాయి.

ఈ న్యూస్‌ని ప్రజంట్‌ చేసిన న్యూస్‌ రీడర్లు, స్పాట్‌లో వుండి రిపోర్ట్‌ చేసిన రిపోర్టర్లు వాడిన భాష, భావజాలం తీవ్ర అభ్యంతరకరంగా వుంది. అమ్మాయిలు తాగి అర్ధరాత్రి రోడ్లమీద తందనాలాడుతున్నారని, మీడియా మీద దాడి చేసారని, భారతీయ సంస్కృతిని నాశనం చేస్తున్నారని, మహిళా సంఘాలు ఈ విషయం మీద మండి పడుతున్నాయని తమ నోటికొచ్చినట్లు వ్యాఖ్యానించారు. నిజానికి అమ్మాయిలు తాగి రోడ్లమీద గొడవ చెయ్యలేదు. తమ ప్రైవసీకి భంగం కలిగిస్తూ వీడియో తీసిన వ్యక్తిపై తమ ఆగ్రహం చూపించారు. ఆ విజవల్స్‌ను తొలగించమని గొడవ పడ్డారు. అక్కడ జరిగింది అంతే. అయితే ఆ మర్నాడు తెలుగు ఛానళ్ళు ఆ వార్తని సెన్సేషనలైజ్‌ చేస్తూ చూపిన దృశ్యాలు, వాడిన భాష, ఆ సంఘటనకు మహిళల వస్త్రధారణ, నైతికత లాంటి అంశాలను జోడించిన తీరు పరమ అమాననీయంగా వుంది. మీడియా రెండు నాల్కల ధోరణికి అద్దం పడుతోంది.

మిడ్‌నైట్‌ మసాలాలు, క్రైమ్‌ స్టోరీలంటూ సినిమాల్లోని అసభ్య దృశ్యాలను నిరంతరం… ఆఖరికి వార్తల్లో సైతం విచ్చలవిడిగా చూపించే ఎలక్ట్రానిక్‌ మీడియా, పార్టీ చేసుకుంటున్న అమ్మాయిలు ధరించిన దుస్తులపైనే ఎందుకు తమ కెమారాలను కేంద్రీకరించాల్సి వచ్చింది? అమ్మాయిలు ఇలా వుండాలి? అలా వుండాలి. అమ్మో! అమ్మాయిలు కూడా ఇలా చేస్తే ఎలా అని గుండెలు బాదుకోవడం ఎందుకు? తమకిష్టమైన దుస్తులు ధరించడం, తమ అభిరుచులకనుగుణంగా జీవించడం ప్రతి ఒక్కరి ప్రాధమిక హక్కు. పోట్టి నిక్కర్లేసుకుని, ఒక్కోసారి వొంటి మీద వస్త్రాలు లేకుండా రోడ్లమీద తాగి పోర్లుతూ పబ్లిక్‌ న్యూసెన్స్‌కి పాల్పడే మగవాళ్ళని మీరు వీడియో తియ్యరెందుకు? 11వ తేదీన జరిగింది పబ్లిక్‌ న్యూసెన్స్‌ కాబట్టి మేము బాధ్యతగా రిపోర్ట్‌ చేసామని ఎలక్ట్రానిక్‌ మీడియా జర్నలిస్ట్‌ల అసోసియేషన్‌ చెబుతోంది. అదే నిజమైతే మగవాళ్ళ పబ్లిక్‌ న్యూసెన్స్‌ని కూడా చూపించాలిగా. ఈ మొత్తం ఎపిసోడ్‌ని విశ్లేషించినపుడు అర్ధమయ్యే విషయం ఒక్కటే. మహిళల పబ్లిక్‌ స్పేస్‌ని కుదించేయాలనుకోవడం, బార్లు, పబ్‌లు, క్లబ్‌లు మగవాళ్ళ సామ్రాజ్యాలు, అక్కడ వాళ్ళ ఏమైనా చెయ్యెచ్చు. అమ్మాయిలు మాత్రం ఆ రాజ్యాల్లో అడుగు పెట్టరాదు. పెట్టారా…. ఇదిగో ఇలాగే యాగీ చేస్తాం. మేం ఏం చేసినా మీరు ప్రశ్నించరాదు. ప్రశ్నిస్తే.. దాన్ని ఎలాంటి మలుపులు తిప్పాలో మాకు తెలుసు. ‘నైతికత’ చట్రంలో ఇరికించి మిమ్మల్ని ఎలా బదనామ్‌ చెయ్యాలో మాకు తెలుసు… అన్నట్లుగా వుంది మీడియా ధోరణి. ఇది చాలా విషాదకరమైన, విధ్వంశకరమైన ధోరణి. మహిళల అభివృద్ధి కోసం, సాధికారత కోసమంటూ మీరు చేస్తున్న కార్యక్రమాల డొల్లతనాన్ని ఏప్రిల్‌ 11 ఉదంతం బట్టబయలు చేసింది. మీ దృష్టిలో మహిళా సాధికారత అంటే ఏమిటో శెలవిస్తే.. తెలుసుకుని తరిస్తాం. మహిళల వస్త్రధారణ గురించి చెబుతున్న సుద్దులు, నీతి సూక్తిముక్త్తావళులు ఎంత తొందరగా విరమించుకుంటే అంత మంచిది. సినిమాల్లోని మహిళల అరకొర వస్త్రధారణని హైలైట్‌ చేస్తూ టీఆర్‌పిని పెంచుకునే ఎలక్ట్రానిక్‌ మీడియాకి ‘నైతికత’ మీద మాట్లాడి, వ్యాఖ్యానించే హక్కుందో లేదో ఒకసారి పునరాలోచించుకుంటే అందరికీ మంచిది. అలాగే స్త్రీల అంశాల పట్ల తమ పాలసీ ఏమిటో కూడా మీడియా చెప్పాల్సివుంది.

Saturday, April 6, 2013

ఏప్రిల్ భూమిక కవర్ పేజి


చట్టరూపం దాల్చిన లైంగిక వేధింపుల నిరోధక బిల్లు


 దశాబ్దంన్నర ఎదురు చూసాక ఎట్టకేలకు ఫిబ్రవరి 26న పనిచేసే చోట లైంగిక వేధింపుల నిరోధక బిల్లు 2012, రాజ్యసభలో కూడా ఆమోదం పొంది చట్టరూపం దాల్చింది. ఈ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెడుతూ కేంద్ర స్త్రీ, శిశు అభివృద్ధిశాఖ మంత్రి కృష్ణతీర్థ్‌ ”పనిచేసేచోట సురక్షిత వాతావరణం కల్పించడం, మహిళలు ఆర్ధికంగా స్వతంత్రత సాధించాలంటే, వారు సురక్షితంగా పనిచేసుకునేలా చర్యలు తీసుకోవడం అవసరం. మొదటిసారి దేశంలో సంఘటిత, అసంఘటిత రంగాల్లో పనిచేస్తున్న స్త్రీలందరిని ఈ చట్టపరిధిలోకి తీసుకువచ్చాం. ప్రతి పని ప్రదేశంలోను ఫిర్యాదుల కమిటీలను ఏర్పాటు చెయ్యాల్సి వుంటుంది. స్త్రీల ఆధ్వర్యంలో, సగం మందిపైగా మహిళా సభ్యులతో ఎస్‌.సి., ఎస్‌.టి., మైనారిటీ మహిళలకు ప్రాధాన్యం కల్పిస్తూ ఈ కమిటీలను రూపొందించాల్సి వుంటుంది. ఈ చట్టం గురించన అవగాహనా కార్యక్రమాలను యాజమాన్యాలు చేపట్టవలసి వుంటుంది” అని చెబుతూ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టడం సభ్యుల ఆమోదంతో అది చట్టరూపం దాల్చడం జరిగింది.
1997లో సుప్రీమ్‌ కోర్టు విశాఖ జడ్జిమెంట్‌లో మొట్టమొదటిసారి పనిచేసే చోట లైంగిక వేధింపులంటే ఏమిటి? నిత్యం మహిళలు ఎలాంటి వేధింపుల్ని ఎదుర్కొంటారు? అవి ఎలా వుంటాయి అంటూ ప్రస్తావిస్తూ వేధింపుల్ని చాలా విపులార్ధంలో నిర్వహించింది. ఈ సందర్భంలో విశాఖ కేసు పూర్వాపరాలను ఒకసారి పరికించాల్సి వుంటుంది. రాజస్థాన్‌లో ప్రభుత్వ శాఖలో ఉద్యోగం చేస్తూ, తన ఉద్యోగ ధర్మంగా బాల్య వివాహాలను ఆపే ప్రయత్నం చేసినందుకుగాను భన్వరీ దేవి అనే దళిత సేవిక సామూహిక లైంగిక దాడికి గురైంది. ఆమె కేసులో పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ కూడా నమోదు చెయ్యనపుడు దేశవ్యాప్తంగా తీవ్రస్థాయిలో నిరసనలు చెలరేగాయి. మహిళోద్యమకారులు పెద్ద ఎత్తున ఉద్యమం చేసారు. అయితే అగ్రవర్ణాల పురుషులు దళిత మహిళలను ముట్టుకోరని, ముట్టుకోనప్పుడు అత్యాచారం ఎలా చేస్తారని రాజస్థాన్‌ హైకోర్టు దారుణమైన తీర్పునిచ్చింది. జైపూర్‌లో స్త్రీలతో పనిచేసే ‘విశాఖ’ అనే సంస్థ ఈ తీర్పుపై సుప్రీమ్‌కోర్టు కెళ్ళినపుడు సుప్రీమ్‌ కోర్టు 1997లో తన తీర్పును ప్రకటిస్తూ ”విశాఖ గైడ్‌లైన్స్‌” పేరుతో పనిచేసే చోట మహిళలెదుర్కొనే హింసను చాలా విపులంగా, వివరంగా నిర్వచించింది. భారతప్రభుత్వం ఈ అంశమై సమగ్రమైన చట్టం చేయాలని, చట్టం వచ్చే వరకు ఈ గైడ్‌లైన్స్‌ చట్టంగా చలామణి అవుతాయని కూడా పేర్కొన్నది. అన్ని కార్యాలయాల్లోను ఫిర్యాదుల కమిటీలను ఏర్పాటు చేసి, విశాఖ గైడ్‌లైన్స్‌ గురించి ప్రచారం చెయ్యాలని కూడా ఆదేశించింది. విశాఖ గైడ్‌లైన్స్‌ వెలువడిన తొలిరోజుల్లో ఈ అంశమై సమావేశాలు, సెమినార్లు జరిగాయి. స్త్రీల సంఘాలు ఉద్యమస్థాయిలో ప్రచారం నిర్వహిస్తూ, సమగ్ర చట్టం తేవాలని డిమాండ్‌ చేస్తూనే వున్నాయి. మహిళలు నిత్యం పనిచేసే చోట ఎదుర్కొనే హింసలకు సంబంధించిన ఈ చట్టం తేవడానికి అన్ని ప్రధాన పదవుల్లోను స్త్రీలే వున్న ఈ దేశంలో ఇంత కాలం పట్టింది. ఇప్పటికైనా చట్టరూపం దాల్చినందుకు సంతోషించాలో…. ఇంత ఆలస్యం జరిగినందుకు విచారపడాలో తెలియని సందర్భం.
తొలివిడత తయారైన బిల్లులో అనేక లోపాలుండడం, అసంఘటిత రంగంలో పనిచేసే పనిమనుషుల్ని ఈ చట్టపరిధిలోకి తేకపోవడంతో మహిళా సంఘాలు దీనిమీద దృష్టి సారించాయి. ప్రస్తుతం చట్టరూపం దాల్చిన బిల్లులో వారిని కూడా చేర్చడం జరిగింది. ఈ బిల్లులమీద రాజ్యసభలో జరిగిన చర్చలో చాలా ఆసక్తికరమైన అంశాలు చోటుచేసుకున్నాయి. ఈ చట్టంలో వున్న లోపాలను మహిళా పార్లమెంటు సభ్యులు ఎత్తి చూపారు. డా|| నజమాహెఫ్తుల్లా మాట్లాడుతూ ”పని చేసే చోట మహిళలు లైంగిక వేధింపులే కాక మానసిక, శారీరక వేధింపులకు కూడా గురవుతారని, ప్రయివేట్‌ సెక్టర్‌లో ఈ చట్టాన్ని అమలు చేసే యంత్రాంగ యేమిటని” ప్రశ్నించారు. అలాగే మహిళా సంఘాలు తీవ్రంగా వ్యతిరేకించిన క్లాజ్‌ 14, అంటే తప్పుడు / అబద్దపు ఫిర్యాదు ఇచ్చినట్లు తేలితే ఫిర్యాదుదారుని శిక్షించే అంశాన్ని ఈ చట్టంలో చేర్చడం గురించి ఎం.పి.లు తీవ్రంగా వ్యతిరేకించినా గాని, ఆ క్లాజ్‌ని తీయకుండానే చట్టం చెయ్యడం జరిగిపోయింది.
ఎంతో కాలంగా మహిళా సంఘాలు కోరుతున్న చట్టం అమలులోకి వచ్చింది. పబ్లిక్‌, ప్రయివేట్‌, క్వాజి, సంఘటిత, అసంఘటిత రంగాలన్నింటిలోను ఫిర్యాదుల కమిటీలను ఏర్పాటు చెయ్యాలి. చెయ్యని పక్షంలో యాజమాన్యాలు శిక్షార్హమౌతాయి. అలాగే ఈ చట్టంలోని అంశాలను గురించి విస్తృతంగా ప్రచారం చేయ్యాల్సి వుంటుంది. ప్రభుత్వోద్యోగుల సర్వీస్‌ రూల్స్‌ను మార్చాల్సి వుంటుంది. తప్పులు చేసినపుడు ఎలాంటి శాఖాపరమైన క్రమశిక్షణా చర్యలుంటాయో లైంగిక వేధింపులకు పాల్పడితే అలాంటి శిక్షలు / క్రమశిక్షణాచర్యలు తప్పవనే హెచ్చరికతో యాజమాన్యాలు ఈ చట్టం అమలుకు చిత్తశుద్ధితో పనిచెయ్యాలి. పనిచేసే చోట భద్రమైన పరిస్థితులు కల్పించాల్సిన బాధ్యత యాజమాన్యాలదే కాబట్టి వారు తక్షణమే తగిన చర్యలు చేపట్టాలి. మహిళలు సురక్షితంగా, హాయిగా పనిచేసుకునే పరిస్థితులేర్పడే లాగా స్త్రీల సంఘాలు ఈ అంశం మీద పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలు మొదలు పెట్టాలి.
చివరగా, సిగెరెట్‌ తాగితే ఊపిరితిత్తులు చెడిపోతాయి, మధ్యం తాగితే లివర్‌ పాడైపోతుందని పురుషుల్ని హెచ్చరించే ప్రభుత్వం పనిచేసే చోట మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడితే ఉద్యోగాలూడిపోతాయని, క్రిమినల్‌ చర్యలుంటాయని కూడా మీడియా ద్వారా ప్రచారం చెయ్యాల్సి వుంటుంది. ఈ దిశగా ఈ కొత్త చట్టం గురించి యుద్ధ ప్రాతిపదికన ప్రచారం చేపట్టినపుడు మాత్రమే ఈ చట్టం ఉనికికి ఒక అర్ధం ఏర్పడుతుంది.

Thursday, March 21, 2013

నిన్న నేను మనీషా వాళ్ళమ్మకి 25000 ఇచ్చాను.

 


 
 
 
 
 
 
 
నిన్న నేను మనీషా వాళ్ళమ్మకి 25000 ఇచ్చాను.ఇప్పటి వరకు వచ్చిన డబ్బు అది.ఇంకా ప్రామిస్లున్నాయి.అవి కూడా బాంక్ లోకి వచ్చాకా ఆమెకిచ్చేస్తాను
ఆ డబ్బుతో ఆమె కొన్ని చెప్పులు కొనుక్కుంటానంది.
నెల నెలా మనీషా పేరు మీద 1000 రూపాయలు బాంక్ లో వెయ్యాలని చెప్పాను.
ఈ మంచి పనిలో పాలుపంచుకున్న అందరికీ ధన్యవాదాలు చిన్నమాట.
నేను డబ్బు ఇస్తున్నప్పుడు ఆమె ముఖం లో కనబడిన సంతోషం, భద్రత
మనందరికీ చెందుతుంది.
నిన్న నేను మీ ద్వారా చాలా తృప్తి పొందాను.
సంధ్య,రాధిక,పిఎం లక్క్మి అందరికీ థాంక్స్.

Wednesday, March 6, 2013

మితృలందరికీ ఒక విన్నపం

మితృలందరికీ ఒక విన్నపం

నేను చెస్తున్న ఈ విన్నపం ఒక అమ్మాయి గురించి.
ఆ అమ్మాయి ఫోటో ను ఇక్కడ పెట్టలేను.
****************
FRIDAY, JUNE 17, 2011

మనీషా ఆత్మ గౌరవం-చదువు కోసం ఆరాటం

ఓ నెల క్రితం ఆంధ్ర జ్యోతి నవ్య పేజీ లో మనీషా అనే అమ్మాయి గురించి భువనేశ్వరి అనే జర్నలిష్ట్ ఓ కధనం రాసింది.మనీషా గురించి చదివి నేను ఆ అమ్మాయిని కలిసాను.చూడ ముచ్చటగా ఉంది మనీషా. ఎంతో చురుకైంది.

భువనేశ్వరి ఏమి రాసిందంటే మనీషా వాళ్ళమ్మతో కలిసి చెప్పులు కుడుతుంది. వాళ్ళ నాన్న తాగుడు కోసం అప్పులు చేసి ఈ మధ్యనే చనిపోయాడు.చెప్పులు కుట్టడమే వాళ్ళ వృత్తి.అదే జీవనాధరం.చిన్న పిల్లవు కదా చదువుకోకుండా చెప్పులు కుడుతున్నావేంటి అని జర్నలిష్ట్ అడిగినపుడు నా స్కూల్ ఫీజు కోసమే చెప్పులు కుడుతున్నాను.నాకు పని ఇవ్వండి నా డబ్బు నేనే సంపాదించుకుంటాను.చదువుకుంటాను.అని చాలా ఆత్మ గౌరవంతో చెప్పింది.
ఆ మాటే నన్ను ఆ పిల్లని కలిసేలా చేసింది..

****************
MONDAY, JUNE 20, 2011

మనీషా మహానందంగా స్కూల్ కి
మనీషా ని ఈ రోజు 8200/-రూపాయలు ఫీజు కట్టి కీస్ హై స్కూల్ లో 7 వ క్లాస్ లో జాయిన్ చేసాను.
ఆ పిల్ల ముఖంలో కనబడిన సంతోషానికి ఖరీదు కట్టే శక్తి నాకు లేదు.
సంతోషం చిప్పిల్లే ఆ ముఖం లోని వెలుతురు నాకు ఎనలేని తృప్తినిచ్చింది.
నేను పిల్లల్ని కనలేదు.పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేసిన అనుభవం లేదు.ఎంతో మందికి చదువు కోసం సహాయం చేసాను కానీ నేనే ఒక పిల్లని ఈ రోజు జాయిన్ చేస్తుంటే గమ్మత్తుగా అనిపించింది.
నేను మనీషాని జాయిన్ చేసి బయట కొస్తుంటే ఎవరో ఆవిడ మా పాపకి కూడా ఫీజ్ కడతారా అని అడిగినపుడు నా నోట మాట రాలేదు.
ఎంత మంది పిల్లలు చదువుకు దూరమౌతున్నారో తలుచుకుంటే దుఖం వస్తుంది
ప్రభుత్వాలు చేయాల్సిన పనులు వ్యక్తులుగా ఎంత మంది చెయ్యగలుగుతారు??

*********************
మనీషాని నేను చదివిస్తున్నాను.
తనని నేను ఎంతవరకైనా చదివించడానికి సిద్ధం గా ఉన్నాను.
తను స్కూల్ నుంచి వచ్చాకా చెప్పులు కుట్టి వాళ్ళమ్మకి సాయం చేస్తుంది.
అయితే వాళ్ళ నాన్న తాగుడి కోసం చేసిన అప్పులు,అతను చనిపోవడం తో ఆ అప్పుల్ని మనీషా వాళ్ళమ్మ కట్టాల్సి రావడం వాళ్ళ జీవనాధారం చాలా కష్టమైపోయింది.
నేను ఎస్ సి కార్పోరేషన్ నుంచి 20000 వేలు లోన్ ఇప్పించాను.
దాంతో ఒక బడ్డి కొనుక్కుని కొన్ని చెప్పులు కుట్టుకుంటూ బతుకుతున్నారు.
అమ్మా! ఎక్కడైనా లక్ష రూపాయల లోన్ ఇప్పించు నెల నెలా కట్టుకుంటామంటోంది.
రోజూ ఫోన్ చేసి అడుగుతోంది.
ఈ విషయం మీ ముందు పెడితే వాళ్ళకి సాయం చెయ్యడానికి ఎవరైనా ముందుకు రావొచ్చు అనే ఆశతో రాస్తున్నాను.
నా వంతుగా వాళ్ళమ్మకి 10000 ఇద్దామనుకుంటున్నాను.
కానీ వాళ్ళకు కావలసింది లక్ష రూపాయలు.
మీలో ఎవరికైనా మనీషాని వ్యక్తిగతం గా కలవాలని ఉంటే అలాంటి వాళ్ళకు వివరలు ఇస్తాను.
స్పందించండి మితృలారా?


 తనకు అకౌంట్ లేదు.
నేను త్వరలో ఓపెన్ చేయిస్తాను.
ప్రస్తుతం నేను భూమిక అకౌంట్ నెంబర్ ఇస్తున్నాను.
దాన్లో డిపాసిట్ చెయ్యదలుచుకున్న వారు దయచేసి నాకు ముందు చెబితే బావుంటుంది.
మీరు భూమిక హెల్ప్ లైన్ కి కాల్ చేసి చెప్పినా సరే (1800 425 2908)
భూమిక అకౌంట్ నంబర్ :52196463457
ఎస్ బి హెచ్ బాగ్లింగంపల్లి శాఖ.

Tuesday, January 15, 2013

అప్పికట్ల గ్రామం నన్నిలా సన్మానించింది













































అప్పికట్ల నుండి ఉదయమే వచ్చాను.
కొత్త సంవత్సరం ఆరంభం లో ఢిల్లి దుర్ఘటన కలిగించిన దుఖం నుండి నన్ను సేదతీర్చింది అప్పికట్ల.
చాలా అద్భుతమైన అనుభావాన్నిచ్చింది అప్పికట్ల.
నన్ను ఆ గ్రామం రిసీవ్ చేసుకున్న పద్ధతి,నన్ను సన్మానించిన విధానం  నేను ఎప్పటికి మర్చిపోలేను.
ఊరంతా నా పేరు మీద వెలసిన ఫ్లెక్సీలు చూసినప్పుడు నాకు చాలా సంభ్రమంగా అనిపించింది.
ఊరులో తిరుగుతున్నపుడు అందరూ మీరేనా భూమిక సత్యవతి అని అడుగుతుంటే ఏదో గమ్మత్తుగా అనిపించింది.
చక్కటి గ్రామం.
ఊరంతా వెల్లి విరిసిన సంక్రాంతి సంబరం.
ఆటల పోటీలు,రంగవల్లుల పోటీలు.
ఊరంతా ఉత్సాహం.
కొసరాజు రాఘవయ్య,జస్టిస్ అమరేశ్వరి,తుమ్మల సీతారామమూర్తి
లాంటి ప్రముఖులకు పుట్టిల్లు అప్పికట్ల.
కనుపర్తి వరలక్ష్మమ్మ,ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ లాంటి ప్రముఖులకు పక్కనే ఉన్న బాపట్ల స్వంత ఊరు.
శంకరం వేదిక తరఫున యలమర్తి రాజేంద్ర ప్రసాద్ గారు ఈ కార్యక్రమాల రూపకర్త.
వారి సహచరి ధన లక్ష్మి గారు.
రాజేంద్ర ప్రసాద్ తండ్రిగారే శంకరం గారు,వారి పేరు మీదనే ప్రతి సంవత్సరం ఈ సంక్రాంతి సంబరాలు ,సన్మానాలు జరుగుతున్నాయి.
ప్రముఖ సినీ గేయ రచయిత రాసిన "ఏరువాకా సాగారో" పాటకి చిన్నారుల నృత్యం తో కార్యక్రమం మొదలైంది.
బహుమతి ప్రదానాలు,అపైన నాకు ఎంతో ఆత్మీయంగా చేసిన సన్మానం.
నేను ఓ అరగంట సేపు ఉపన్యాసం ఇచ్చాను.అందరూ శ్రద్ధగా విన్నారు.
మంచి విషయాలు చెప్పావమ్మా అనే ఫీడ్ బాక్ వచ్చింది.ఆ తర్వాత
గుంటూరు నుండి వచ్చిన మ్యూజికల్ పార్టి వారి పాటలు ఫర్వాలేదు కానీ
అతిగా ముస్తాబైన అమ్మాయిల్ని స్టేజి మీద కూర్చోబెట్టడం,వాళ్ళ చేత ఐటం సాంగ్స్ లో చేసేలాంటి డాన్సులు చేయించడం చెప్పొద్దూ నాకు  మరో రూపం దాల్చిన ఈష్ట్ గోదావరి రికార్డింగ్ డాన్సుల్లా అనిపించాయి.
అర్ధరాత్రి దాకా అవి కొనసాగాయి.
నా ట్రైన్  12 గంటలకి.
ఎక్కడో పుట్టిన నేను,మరెక్కడో పని చేస్తున్న నేను ఈ అప్పికట్ల గ్రామ వాసుల గుండెల్లో స్థానం సంపాదించుకుని హైదరాబాద్ కి తిరుగు ప్రయాణమయ్యాను.



 

తర్పణాలు త్రిశంకు స్వర్గాలు

 తర్పణాలు, త్రిశంకు స్వర్గాలు ............ మా సీతారాంపురం లో మా తాతకి చాలా పొలాలు ఉండేవి. మా తాత, చిన్న తాత ఇద్దరే పొలాలన్నింటిని పంచుకున్నా...