Wednesday, March 23, 2011

భూమిక హెల్ప్ లైన్ ఐదేళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆంధ్ర జ్యోతి లో వచ్చిన ఆర్టికల్

                                             

TV9 naveena exhibition photo

భూమిక హెల్ప్ లైన్ ఐదేళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆంధ్ర జ్యోతి లో వచ్చిన ఆర్టికల్ మీ కోసం.

https://www.andhrajyothy.com/navyaNewsShow.asp?qry=2011/mar/22/navya/22navya1&more=2011/mar/22/navya/navyamain&date=3/22/2011

Tuesday, March 22, 2011

ఈ నవ్వుల వెనక ఏమున్నదో ???- శ్రీవిద్య సెంటర్ వివరాలు

శ్రీవిద్య సెంటర్ నిర్వాహకులు శాంతి గారు.
ఇంటి నెంబరు 10-3
ఈష్ట్ మారేడ్ పల్లి
సికందరాబాద్
ఫోన్ నంబర్
040-2773451 సెల్: 9490439801
shanthi@srividhyaschool.com
www.srividhyascool.com
www.srividhya.org

Saturday, March 19, 2011

వెన్నెల్లొ హాయ్ హాయ్-సూపర్ డూపర్ చాంద్



అబ్బ! చంద్రుడు నిజంగానే సూపర్గున్నాడు.
ఏమి వెన్నెల కురిపిస్తున్నాడు.ఎంత హొయలు పోతున్నాడు.
తిలక్ అమృతం కురిసిన రాత్రి ఇల్లాంటి చంద్రుణ్ణే చూసి ఉంటాడు.
లాహిరి లాహిరి పాటలో కూడా ఇలాంటి చంద్రుడే.
నేను లఢాఖ్ లోని లేహ్ కొండల్లో చూసింది ఇలాంటి చంద్రుణ్ణే.
మా సీతారామపురంలో ఆరుబయట మంచాలేసుకుని పడుకునే రోజుల్లొ ప్రతి పున్నమికి చూసింది ఇల్లాంటి చంద్రుడినే.
టాంక్ బండ్ మీద ఫోటో తియ్యబోతే ఇదిగో ఇలా బంగారు రంగు జీళ్ళపాకంలా వచ్చింది ఓ ఫోటో.
కావాలంటే చూడండి.

Friday, March 18, 2011

ఈ నవ్వుల వెనక ఏమున్నదో ????











నిన్న నేను అడ్డగుట్టలో ఉన్న మానసిక ఎదుగుదల సరిగా లేని పిల్లలు చదువుకుంటున్న స్కూల్ చూడడానికి వెళ్ళాను.
శాంతి గారు నడుపుతున్నారు ఈ సంస్థని.
వాళ్ళ అమ్మ గారు పిల్లలకి వండిపెడతారు.
ఈ ప్రత్యేక పాఠశాల గురించి తర్వాత వివరంగా రాస్తాను.
అక్కడ దాదాపు 140 మంది మానసికంగా ఎదగని పిల్లలున్నారు.3 సంవత్సరాల నుండి 58 ఏళ్ళ వయసున్న వాళ్ళు ఉన్నారు.
ఎవ్వరూ వాళ్ళ పని చేసుకోలేరు.
బాత్ రూం కి కూడా వెళ్ళాలని తెలియదు.
టాయ్ లెట్ వస్తుందని కూడా చెప్పలేరు.
ఇక అమ్మాయిలు పీరియడ్ సమయంలో కూడా మానేజ్ చేసుకోలేరు.
వీళ్ళకి సేవ చేసే ఆయాలు, చదువు చెప్పే టీచర్లు ఉన్నారు.
శాంతి గారు పిల్లల్ని తనతోనే ఉంచుకుంటారు.
వాళ్ళ ఇల్లే స్కూల్,హాష్టల్.
ఏప్రిల్ 9 న ఈ ప్రత్యేక స్కూల్ కోసం ఫండ్ రైసింగ్ ప్రోగ్రాం చేస్తున్నారు రవీంద్రభారతిలో.
దీని వివరాలు మళ్ళీ ఇస్తాను.
ఈ స్కూల్ కి ప్రభుత్వ సహాయం అందడం లేదట.
ఆ పిల్లల నవ్వుల్ని మర్చిపోలేక పోతున్నాను.
ఎంత హాయిగా నవ్వుతారని.
ఈ స్కూల్ కి ఎవరైనా సహాయం చేయ దలిస్తే వివరాలు ఇస్తాను.
మనందరి సహాయం చాలా అవసరం శాంతి గారికి.
మెదడు వికసించని ఈ పిల్లల కోసం పెద్ద మనసుతో స్పందించాల్సిందిగా విజ్ఞప్తి.

Wednesday, March 16, 2011

8 మీద నడక ఎంతొ పవర్ ఫుల్

8
ఈ మద్య్హ ఒక ఫ్రెండ్ ఎనిమిది మీద నడిచి చూడు చాలా బావుంటుంది అంది.
ఫ్రెండ్స్ చెప్పింది వినాలి కదా అని ఓ రోజు మా ఇంటి ఆవరణలో ఓ పెద్ద ఎనిమిది అంకె గీసి దాని మీద నడిచాను.
బావుందనిపించింది.
మర్నాడు ఎఫెం వివిధభారతి లో పాటలు పెట్టుకుని ఎన్మిది మీద అరగంట నడిచాను.
ఒకే రిధంలో వంకరలు తిరుగుతూ నడవడం బావుంది పది నిమిషాల్లో చెమటలు పట్టాయి.
ప్రయత్నిచి చూడండి.
హాయిగా పాత పాటలు వింటూ,బయటకెక్కడికో వెళ్ళకుండా నడవొచ్చు.

ఆల్ ది బెస్ట్.

Monday, March 14, 2011

మళ్ళొకసారి మార్చి 8 ని తలచుకుంటూ....




మార్చి ఎనిమిది సమీపిస్తుందంటే ఒక ఉత్సాహం, ఒక సంతోషం మనసంతా కమ్ముకుంటుంది. అంతర్జాతీయ మహిళా దినాన్ని పురస్కరించుకుని రాష్ట్రమంతా ఎన్నో సమావేశాలు. రాష్ట్రం నలుమూలల నుండి అసంఖ్యాకంగా ఆహ్వానాలు. ఆదోని రమ్మని ఉషారాణి, కాకినాడ రమ్మని అబ్బాయి, చేనేత మహిళల మీటింగ్‌లో పాల్గొనమని నిర్మల, పాడేరులోని అరణ్యక మీటింగ్‌కి రమ్మని మాలిని, ఆఖరికి నేను అనంతపూర్‌ వెళ్ళడానికి నిర్ణయించుకున్నాను. మీరు ఈ సంపాదకీయం చదివేసరికి మార్చి ఎనిమిది సంబరాలు ముగిసిపోతాయి కూడా.
నగరంలో కూడ లెక్కలేనన్ని మీటింగులు జరుగుతాయి. మొత్తానికి దేశవ్యాప్తంగా మార్చి ఎనిమిదిన మహిళల అంశాలపై, మహిళల సమస్యలపై చర్చోపచర్చలు జరుగుతాయి. కొందరు పోరాట దినంగా జరిపితే, కొందరు ఉత్సవంలా, ఉల్లాసంగా జరుపుతారు. వందేళ్ళ చరిత్ర కలిగిన మార్చి ఎనిమిది ఎన్నో పోరాటాల్ని, మహిళల ఆరాటాల్ని, ఆర్తనాదాల్ని తనలో ఇముడ్చుకుంది. వాటన్నింటినీ గుర్తు చేసుకోవడానికి, గురి తప్పిన గమ్యాలను పునర్మినించుకోడానికి, మహిళా ఉద్యమానికి పునరంకితమవ్వడానికి మార్చి ఎనిమిదిని మించిన రోజు మరోటి లేదు.
అయితే కొన్ని ముఖ్యమైన అంశాలు ఈ సందర్భంగా ముందుకొస్తున్నాయి. బీజింగ్‌ సదస్సు స్ఫూర్తితో మహిళలపై అన్ని రకాల వివక్షతను వ్యతిరేకంగా జరిగిన ఒప్పందం (సీడా) నేపధ్యంలో భారతదేశం మహిళల రక్షణ కోసం చాలా చర్యలను తీసుకుంది. కొత్త చట్టాలను చేసింది. స్థానిక సంస్థల్లో 33శాతం రిజర్వేషన్లు (73,74 రాజ్యాంగ సవరణ) గృహహింస నిరోధక చట్టం 2005, లైంగిక వేధింపుల నిరోధక బిల్లు 2010 లాంటివి వచ్చాయి. అయితే అసెంబ్లీ, పార్లమెంటుల్లో రిజర్వేషన్‌ కల్పించే బిల్లు మొద్దు నిద్రలోనే జోగుతోంది. పనిస్థలాల్లో లైంగిక వేధింపుల నిరోధక బిల్లును చట్టరూపంలో తేవడానికి అనవసర జాప్యం జరుగుతోంది. గృహహింస నిరోధక చట్టం కూడా దేశమంతా పూర్తిస్థాయిలో అమలు కావడం లేదు. కొన్ని రాష్ట్రాల్లో అసలు రక్షణాధికారులు వ్యవస్థ ఏర్పడనేలేదు. చట్టంవొచ్చి 5 సంవత్సరాలు గడిచిపోయినా అమలులో ఎంతో నిర్లిప్తత, నిర్లక్ష్యం కనబడుతోంది. ఇంత నిర్లక్ష్యం క్షమించలేం. అలాగే ఈ చట్టం గురించిన ప్రచారం ప్రభుత్వం చేపట్టలేదు. ఒక పనికి ఆహారపథకం, ఒక పల్ప్‌పోలియో, ఒక ఆర్‌టిఐ చట్టం ప్రచారం కోసం నిధులు కేటాయించి పెద్ద ఎత్తున ప్రచారం చేసే ప్రభుత్వం గృహహింస నిరోధక చట్టం విషయంలో మాత్రం స్ట్రాటజిక్‌గా మౌనం వహిస్తోంది.
కొత్త చట్టాలొస్తున్నాయి. కొత్త కొత్త సపోర్ట్‌ సిస్టమ్స్‌ వెలుస్తున్నాయి. అయినాగానీ స్త్రీల మీద హింస ఏ మాత్రం తగ్గడం లేదు. స్త్రీలపై నేరాలు పెరుగుతున్నాయని సాక్షాత్తు జాతీయ నేర నిరోధక సంస్థ గణాంకాలు చెబుతున్నాయి. నేరాలు పెరుగుతున్నాయని లెక్కలేసి చెబుతున్నారుగానీ వాటి తగ్గుదల కోసం ఏమి చర్యలు తీసుకుంటున్నారో చెప్పడం లేదు. చట్టాలు చేసాం కదా అని చేతులు దులిపేసుకునే బండవైఖరి కన్పిస్తోంది కానీ చట్టాల సక్రమ అమలుకోసం జండర్‌ స్పృహతో ఆలోచిస్తున్న దాఖలాలు లేవు.
ఈ మార్చి ఎనిమిది సందర్భంలో ఖచ్చితంగా గుర్తు చేసుకోవాల్సిన అంశమొకటుంది. దేశ రక్షణకోసం సైన్యంలో చేరిన మహిళలకు జరుగుతున్న అన్యాయం. ఆర్మీలో కొనసాగుతున్న జండర్‌ వివక్ష. ఆర్మీలో పనిచేసే మహిళలకి పర్మినెంట్‌ ఉద్యోగాలివ్వకుండా 14 సంవత్సరాల దాకా టెంపరరీగా పనిచేయించుకుని ఎలాంటి పదవీవిరమణ సౌకర్యాలు కల్పించకుండా ఇంటికి సాగనంపుతారని ఇటీవల సుప్రీంకోర్టుకొచ్చిన ఒక కేసు గురించి చదివినపుడు తీవ్ర దిగ్భ్రమను కల్గింది. అత్యంత గోప్యతను పాటించే ఆర్మీలో విషయాలు బయటకు రావడం చాలా కష్టం. కొంతమంది మహిళా అధికారులు ఈ అన్యాయాన్ని ప్రశ్నించడంతో ఈ అంశం బయటకొచ్చింది. వీరిపట్ల కొనసాగుతున్న వివక్ష అంతర్జాతీయ ఒప్పందాలకు విరుధ్ధం. భారత రాజ్యాంగానికి విరుద్ధం. సుప్రీంకోర్టు ఏం తీర్పు చెబుతుందో వేచి చూడాల్సి వుంది.
మార్చి ఎనిమిదికి జేజేలు పలుకుతూ, మహిళా అంశాలను సమీక్షించుకోవడానికి మార్చి ఎనిమిది సమావేశ వేదికలు ఉపయోగపడాలని ఆకాంక్షిస్తూ…
అందరికీ అభినందనలు తెలుపుతూ…

http://bhumika.org/archives/1710



Sunday, March 13, 2011

చాపరాయ్ దగ్గర చెయ్యందించిన గిరిజన కుర్రాడు

ఓ పదేళ్ళ క్రితం మాట.

కొత్థగా డిప్యూటి తాహసిల్దార్ గా ఎంపికైన రోజులు.
కొత్త మితృలతో కలిసి వైజాగ్ ట్రిప్ వెళ్ళిన సందర్భం.
మా అమ్మ జీవించి ఉన్న రోజులు.అమ్మని కూడా నాతో తిప్పిన ట్రిప్ అది.
వైజాగ్,సిమ్హాచలం,అన్నవరం,పాడేరు,తలుపులమ్మ లోవ,ఏటికొప్పాక అన్నీ తిరిగేసి అరకుకు వెళ్ళేం.
అరకు నుంచి చాపరాయ్. భలే ఉంటుంది నీటి ప్రవాహం.
అందరం ఓ చోట ఆగి నీళ్ళల్లో పాదాలాడిస్తూ ఆడుకుంటున్నాం.
మా అమ్మ కారులోనే ఉండిపోయింది నేను దిగలేనని.
నాకు హఠాత్తుగా అటువేపు వెళ్ళాలనే వెర్రి ఆలోచన కలిగింది.
అంతే గబగబా నడుస్తూ నీళ్ళను దాటేసి అటువేపు వెళ్ళిపోయాను.
తీరా అటువేపు వెళ్ళాకా చూస్తే నీటి ప్రవాహం పెరిగిపోయింది.
తిరిగి రావడం చాలా కష్టమనిపించింది.
ఇటుపక్క నున్న వాళ్ళు గట్టిగా అరుస్తున్నారు రమ్మని.
ఏం చెయ్యాలో అర్ధం కాక అటు ఇటు చూస్తుంటే అడవి కరివేపాకు కోస్తూ ఇద్దరు గిరిజన కుర్రాళ్ళు కనబడ్డారు
హమ్మయ్య ప్రవాహం దాటిస్తారు
లే అని ఓ  అబ్బాయి దగ్గరకెళ్ళీ
అడిగాను.మొదట నా మాట అర్ధం కాలేదు. చాలా సిగ్గుపడిపోయాడు మాట్లాడుతుంటే.
ఇటుపక్క మితృల గొడవ ఎక్కువైంది.ప్రవాహం పెరిగిపోతోంది రమ్మంటూ కేకలుపెడుతున్నారు.
ఈ కుర్రాడేమో రానంటున్నాడు తల అడ్డంగా తిప్పుతూ.
ఇంక చేసేదేమి లేక ఆ కుర్రాడి చెయ్యిపట్టుకున్నాను.
గబుక్కున లాగేసుకున్నాడు.నన్ను అటువేపు తీసుకెళ్ళమని సైగలు చేస్తూ మళ్ళి చెయ్యి పట్టుకుని బలవతంగా ప్రవహం వేపు లాక్కొచ్చాను.సిగ్గుపడుతూ,చెయ్యి విడిపించుకుంటూ మొత్తానికి నాతో వచ్చాడు.
నేనే లాక్కొచ్చాను.
ఇటువైపు వచ్చాకా అతనికి ఏ భాషలో కృతజ్ఞతలు చెప్పాలో అర్ధం కాలేదు.
తెలుగు రాదు.నమస్కారం పెడదామా అంటే చాలా చిన్నవాడు.
మొత్తానికి ఆరోజు నన్ను ప్రవాహం దాటించిన ఆ గిరిజ కుర్రాడు ఇప్పటికీ నా మనసులో మెదులుతున్నాడు.
డబ్బులిచ్చాం కానీ అతని సహాయం డబ్బులతో కొలిచేది కాదు.
ఇవతలి గట్టుకి రాగానే నా మితృలంతా తిట్టినతిట్ట్లు హమ్మో ఇప్పుడు గుర్తు చేసుకోకూడదు.
మా అమ్మ మాత్రం ఇదెప్పుడూ ఇంతే నీళ్ళు చూస్తే దీనికి వొళ్ళు తెలియదు అంటూ మురెపెంగా అంటుంటే మా వాళ్ళ ముఖాలు చూడాల్సిందే.

Saturday, March 5, 2011

టైడాలో జంగల్ బెల్స్ -తనువూ మనసూ తన్మయమైన వేళ




నేనో మూడు రోజులపాటు అన్ని శబ్దాలకూ దూరంగా కేవలం పక్షుల శబ్దాలను మాత్రమే వింటూ గడిపాననంటే మీరు నమ్ముతారా?

నమ్మాలి మరి.విశాఖ నుంచి అరకు అరకు నుంచి టైడా.
టైడా గురించి మీరు విన్నారా?
జంగల్ బెల్స్ గురించి విన్నారాపోనీ.
విశాఖ నుంచి డెబ్భై కిలోమీటర్ల దూరంలో దట్టమైన అడవిలో అందమైన కొండలు లోయల మధ్య టైడా ఉంది.
ఏపి టూరిజంవాళ్ళు గొప్ప టేస్ట్ తో కట్టిన అథిధి గృహాల సముదాయం ఉంది.
దూరదర్శన్లు, దూరవాణులు పనిచెయ్యని ఏకైక ప్రదేశం.
గొప్ప నిశ్శబ్దం,చిక్కటి అడవి లో ఆ నిరామయ స్థితిని అనుభవించాల్సిందే.
నిండు అమావాస్య రోజున ఆ అడివి అందాన్ని నక్షత్రాల వెలుగులో చూడాల్సిందే.
చెవులు పగిలిపోయే నగర శబ్దకాలుష్యాన్ని భరిస్తున్న మనం
జంగల్ బెల్స్ లో కేవలం పక్షుల పాటలనే వినడం అబ్బో ఆ ఆనందాన్ని వర్ణించడం సాధ్యం కాదు.
ఫోన్ తోనే పుట్టినట్టు,టివీని మెళ్ళో వేసుకుని బతుకుతున్నట్టు
భ్రమ పడుతున్న జనాలకి అంతటి నిశ్శబ్దం భరిచడం కష్టమే.
ఉదయాన్నే ఎన్ని రకాల పక్షులు సామూహిక గాన కచేరి పెట్టాయని.
కళ్ళు మూసుకుని కూర్చుంటే చాలు చెవులు తన్మయమైపోతాయి.
జంగల్ బెల్స్ నా గుండెల్లో గణగణ మోగుతున్నాయ్.
ఇంతకన్నా రాయలేని,తనివితీరని స్థితిలో తరించిపోతూ....

Sunday, February 27, 2011

''బెల్‌ బజావో''-గంటకొట్టండి


కేంద్ర ప్రభుత్వం ఇటీవల 'జాతీయ కుటుంబ, ఆరోగ్య సర్వే-3' నివేదిక ప్రకటించింది. ఈ రిపోర్టు వెల్లడించిన కొన్ని అంశాలు -ముఖ్యంగా దేశంలో గృహహింస బాధిత స్త్రీల సంఖ్యను చూస్తే చాలా బాధాకరంగా, ప్రమాదకరంగా వుంది. నిరక్షరాస్యత, అభివృద్ధి లేమికి మారుపేరైన బీహార్‌లో పరిస్థితి మరీ దారుణంగా వుంది. బీహార్‌లో 50 శాతం మందికి పైగా నిత్యం భర్తల చేతుల్లో భౌతిక హింసకు గురవుతున్నారు. జాతీయ కుటుంబ, ఆరోగ్య సర్వే -3 నివేదికలోని ముఖ్యాంశాలు ఇవి. బీహార్‌లో 59 శాతం మంది కుటుంబ హింసకు గురవుతున్నారు. 19 శాతం మంది లైంగిక హింసకు బలవుతున్నారు.
ఆంధ్రప్రదేశ్‌ను తీసుకుంటే రెండో స్థానం లో ఉంది. గృహహింసలో అగ్రస్థానం బీహార్‌ అయితే అట్టడుగు స్థానంలో హిమాచల్‌ప్రదేశ్‌ (6%)వుంది. నిరక్షరాస్యతకు, హింసకు దగ్గర సంబంధముందని ఈ నివేదిక పేర్కొంటూ మహిళలపై దాడులకు పాల్పడుతున్న పురుషులలో 60శాతం మంది అక్షర జ్ఞానం లేనివారేనని తెలిపింది.

దేశ వ్యాప్తంగా ఇంత ఎక్కువ సంఖ్యలో నిత్యం గృహహింసను ఎదుర్కొంటూ స్త్రీలు బతుకులు వెళ్ళదీయడం అనేది ఏ దేశానికైనా సిగ్గుచేటైన విషయం. కోట్ల సంఖ్యలో స్త్రీలు, గృహహింసనుండి రక్షణ చట్టం వచ్చిన తరువాత కూడా హింసకు గురవ్వడం గమనించినపుడు చట్టాలు ఎంత సొంపుగా అమలవుతాయె అర్ధం చేసుకోవచ్చు. ఈ విషయంలో అగ్రస్థానం సంపాదించిన బీహార్‌లో ఈ రోజుకీ రక్షణాధికారుల నియామకం జరగలేదు. గృహహింస చట్టం అమలు చేయమని, రక్షణాధికారులను నియమించమని ఒక న్యాయవాది శృతిసింగు పాట్నా హైకోర్ట్‌లో ప్రజా ప్రయెజనాల వ్యాజ్యం దాఖలు చెయ్యల్సి వచ్చింది. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్‌ ముందంజలో వుంది. వివిధ ఎన్‌.జి.వోలు ఈ చట్టం అమలు విషయమై పట్టుదలతో పనిచేయడంవల్ల పూర్తిస్థాయి రక్షణాధికారుల నియమకం జరిగింది. బాధిత స్త్రీలు వీరి ద్వారా కోర్టులో కేసులు వేయగలుగుతున్నారు. హింసాయుత జీవితాల నుండి విముక్తి పొందగలుగుతున్నారు. అయినప్పటికీ ఈ చట్టం గురించిన అవగాహన, చైతన్యం ఇంకా చాలా మందికి లేదు. ప్రభుత్వం గృహహింస నిరోధక చట్టాన్నయితే తెచ్చింది కానీ ఎలాటి ప్రచార కార్యక్రమాన్ని చేపట్టలేదు. ప్రభుత్వం సరైన రీతిలో ప్రచారం చేపట్టి వుంటే కొంతమంది మహిళలైనా చట్ట సహాయంతో హింసాయుత బతుకుల్లోంచి బయటపడగలిగేవారు.

నిజానికి భారతదేశంలో హెచ్‌ఐవి/ఎయిడ్స్‌ కన్నా గృహహింస వల్ల ఎక్కువ మంది మహిళలు చనిపోతున్నారు. అయినప్పటికీ హెచ్‌ఐవి నిరోధక ప్రచారం కోసం ప్రభుత్వాలు కోట్లాది రపాయలు ఖర్చు చేస్తున్నాయి. గృహహింస అంశాన్ని ప్రభుత్వం హెచ్‌ఐవి కన్నా ఎక్కువ ప్రాధాన్యత నిచ్చి ప్రచారం చేయల్సి వుంది. ఇప్పుడిప్పుడే ఆ ప్రచారం ప్రారంభమౌతున్న సూచనలు కన్పించడం సంతోషదాయకం. అలాంటి ఒక ప్రచారానికి సంబంధించినదే ''బెల్‌ బజావో'' కార్యక్రమం. నాకు తెలిసి మొట్ట మొదటి సారిగా కేంద్ర శిశు సంక్షేమశాఖ, బ్రేక్‌ త్రూ అనే అంతర్జాతీయంగా పనిచేసే మానవ హక్కుల సంస్థ కలిసి బెల్‌ బజావో ప్రోగ్రామ్‌కి శ్రీకారం చుట్టాయి.

ఈ ప్రోగ్రామ్‌ కింద రెండు వీడియెలను వీరు రూపొందించారు. వీటి ద్వారా గృహహింస మీద మౌనంగా వుండొద్దు అని చెప్పదలిచారు. ముఖ్యంగా ఈ రెండు వీడియెలు బాలురను, పురుషులను టార్గెట్‌గా పెట్టుకున్నాయి. ఒక దానిలో ఒక మొహల్లాలో క్రికెట్‌ ఆడుకుంటున్న మగపిల్లలు, ఒక ఇంట్లో భర్త తలుపులు మూసి భార్యను కొట్టడం, ఆమె గట్టిగా కేకలు పెడుతూ ఏడ్వడం వింటారు. వెంటనే వారు ఆట ఆపేసి, ఆ ఇంటికెళ్ళి, కాలింగు బెల్‌ కొడతారు. హింసిస్తున్న భర్త బయటకొచ్చి ఏంటి అని అడుగుతారు. బాల్‌ పడింది మీ ఇంట్లో అంటారు పిల్లలు. నిజానికి బాల్‌ వాళ్ళ చేతుల్లోనే వుంటుంది. అప్పటికి ఆ ఇంట్లో హింస ఆగుతుంది. ఇంకో వీడియెలో పక్కింట్లో, భార్యను కొడుతున్న భర్త, బిగ్గరగా ఏడుస్తున్న భార్య. పక్కింటాయన లేచి వెళ్ళి బెల్‌ కొట్టి కొన్ని పాలు ఇస్తారా అని అడుగుతాడు. భర్త లోపలికి వెళ్ళిపోతాడు. ఆ ఇంట్లో కూడా అప్పటికి తాత్కాలికంగా హింస ఆగుతుంది.

ఈ చిన్న వీడియెలు అందిస్తున్న సందేశం అద్భుతంగా వుంది. ఇంతకాలం గృహహింస అనేది వ్యక్తిగత వ్యవహారమని, బయటవాళ్ళు కల్గించుకూడదనే అపోహని ఇవి బద్దలు కొట్టాయి. ముఖ్యంగా పురుషుల్ని, మగపిల్లల్ని చైతన్యవంతం చేయడం ద్వారా గృహహంసను ఆపొచ్చు అనేది వీరి ఉద్దేశ్యం. గృహ హింస సామాజికమైందని, ఇది వ్యక్తిగతంకాదని చెప్పడం ద్వారా సమాజం మొత్తం దీన్ని ఆపడానికి ఉద్యమించాలని చెప్పక చెప్పారు ఇందులో. ఈ సందేశాన్ని అంటే 'బెల్‌ బజావో' గంట కొట్టండి, లేదా ''మూసిన తలుపుల్ని కొట్టండి'' అంతూ   ఒక వాహనం రూపొందించి దేశవ్యాప్త ప్రచారానికి సన్నాహాలు చేస్తున్నారు. చాలా మంచి ప్రయత్నమని చెప్పాలి. అందుకే నేను మీ అందర్ని కోరుతున్నాను.
 మిత్రులారా! గృహహింసను ఆపడానికి మూసిన తలుపుల్ని తెరిపించండి. గంటకొట్టండి హింసను ఆపడంలో మీరూ భాగస్వాములు కండి.

Monday, February 14, 2011

ప్రొటెక్షన్ ఆఫీసర్ కార్యాలయంలో పనిచేసే లీగల్‌, సోషల్‌ కౌన్సిలర్‌లతో రెండు రోజుల వర్క్ షాప్


"భూమిక” ఆధ్వర్యంలో కౌన్సెలింగ్‌ స్కిల్స్‌ మరియు గృహహింస నిరోధక చట్టం మీద, సికింద్రాబాద్‌లోని యూత్‌ హాస్టల్‌లో జనవరి 21, 22 తేదీల్లో రెండు రోజుల వర్క్ షాప్ జరిగింది. ఈ వర్క్ షాప్ కు గృహహింస చట్టం అమలుకోసం స్త్రీశిశు అభివృద్ధి శాఖ వారు నియమించిన రక్షణాధికారుల కార్యాలయంలో పనిచేస్తున్న లీగల్‌, సోషల్‌ కౌన్సిలర్స్‌ హాజరయ్యారు. ఒక నిజామాబాద్‌ మినహా మిగిలిన అన్ని జిల్లాల నుండి ప్రతినిధులు ఈ వర్క్‌షాప్‌కు హాజరయ్యారు. రక్షణాధికారుల కార్యాలయంలో పనిచేస్తున్న ఈ కౌన్సెలర్‌లు, నేరుగా బాధిత స్త్రీలకు కౌన్సెలింగ్‌ నిర్వహించడం, కోర్టులో డి.ఐ.ఆర్‌.
ను మెజిస్ట్రేట్‌కు సమర్పించడం, బాధితుల కోరిన పరిహారం అంటే, హింసనుండి రక్షణ ఉత్తర్వులు, మనోవర్తి ఇప్పించడం, నష్టపరిహారం, స్వంత ఇంటిలో వుండే హక్కును కల్పించడం లాంటి ముఖ్యమైన కర్తవ్యాల నిర్వహణలో ఉండటం వల్ల, చాలాకాలంగా ‘భూమిక’ వీరితో కలిసి పనిచేయాలని భావించింది.

పై అంశం గురించి వివరిస్తూ స్త్రీ శిశు సంక్షేమ అభివృద్ధి శాఖ సంచాలకులకు ఈ కౌన్సెలర్లకు ఒక వర్క్‌షాప్‌ నిర్వహించే విషయమై చర్చించడం ఆవిడ వెంటనే ఒప్పుకుని వారందరినీ హాజరయ్యేలా ఉత్తర్వులు జారీ చేశారు.

మొదటిరోజు ప్రతినిధులను ఆహ్వానిస్తూ, ఈ వర్క్‌షాప్‌ను ఎందుకు డిజైన్‌ చెయ్యాల్సి వచ్చిందో కొండవీటి సత్యవతి వివరించారు. ముఖ్యంగా భూమిక హెల్ప్‌లైన్‌కు వస్తున్న అసంఖ్యాకమైన కాల్స్‌ను గురించి చెబుతూ, బాధిత స్త్రీలను వివిధ జిల్లాల రక్షణాధికారుల కార్యాలయాలకు పంపుతున్న క్రమంలో అక్కడ ఏం జరుగుతుందన్న విషయాన్ని గురించిన ఫీడ్‌ బ్యాక్‌ రావడం లేదని, అసలు రక్షణాధికారుల కార్యాలయాల్లో కౌన్సెలర్‌ల బాధ్యతలేమిటో అవగాహన లేకపోవడం వల్ల కూడా ఒక్కొక్కసారి గందరగోళం జరిగిన సంఘటనలు కూడా వున్నాయి. రక్షణాధికారుల కార్యాలయాలన్నింటిలోనూ ఒకేవిధమైన పద్ధతులు అమలవుతున్నాయో లేదో తెలుసుకోవడం కోసం, అలాగే కౌన్సిలర్స్‌ ఎదుర్కొంటున్న సాధకబాధకాలు, సమస్యల గురించి అర్థం చేసుకోవడానిక్కూడా ఈ వర్క్‌షాప్‌ను ఏర్పాటు చేశామని అన్నారు.

మొదటగా కౌన్సెలింగ్‌ నైపుణ్యాలమీద డా:కిరణ్మయి చాలా విపులమైన, ఇంటరాక్టివ్‌ సెషన్‌ను నిర్వహించారు. బాధిత స్త్రీలకు కౌన్సెలింగ్‌ చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ముఖ్యంగా శరీరభాష, కంటి కదలికలు, బాధితులను ఆహ్వానించే తీరు, కుర్చీలో కూర్చునే పద్ధతి, వారు తమ బాధను వివరిస్తున్నప్పుడు చూపించవలసిన ఏకాగ్రత మొదలైన అంశాల గురించి చాలా వివరంగా చెప్పారు. ప్రతినిధులచేత రోల్‌ ప్లే కూడా చేయించి వారిలో ఒకరిని కౌన్సిలర్‌గా, ఒకరిని బాధిత స్త్రీగా అభినయం చేయించి వారు చేసినదానిలో లోటుపాట్లను వారిచేతనే విశ్లేషింపచేసే పద్ధతి వల్ల, వారు కనబరిచే లోపాలను సులభంగా అర్థం చేసుకొనే తీరులో వివరించారు.

కిరణ్మయి సెషన్‌ జరుగుతున్నప్పుడే స్త్రీ శిశుసంక్షేమ అభివృద్ధి శాఖ సంచాలకులు ఉషారాణి ఐ.ఎ.ఎస్‌.సమావేశంలోకి వచ్చారు. ఆవిడకు వేరే సమావేశం వుండటం వల్ల త్వరగా వెళ్ళాల్సిన తొందర ఉన్నందున కిరణ్మయిగారి సెషన్‌ను కొంతసేపు ఆపి ఉషారాణిగారు ప్రసంగించారు. కౌన్సిలర్‌లుగా పనిచేస్తున్నవారి కష్టసుఖాలు తనకు తెలుసునని, దాదాపుగా ఎనిమిది నెలలుగా వారు జీతం లేకుండా పనిచేస్తున్నారనే విషయం తనకు చాలా బాధ కల్గించిందనీ, వివిధ సాంకేతిక కారణాలవల్ల జీతాలుచెల్లించలేక పోయామని, అందువల్లనే వారితో సమావేశం నిర్వహించాలన్నా ఇబ్బందిగా అన్పించి పెట్టలేకపోయామని అన్నారు. ఇప్పుడు ఈ సమావేశానికి వస్తూ ఒక శుభవార్తను తీసుకువచ్చానని, ఆర్థికశాఖకు వెళ్ళి వారి జీతాల విషయమై చర్చించి, విడుదల చేయించామని, త్వరలో వారికి జీతాలు చెల్లిస్తామని, ప్రతినిధుల హర్షధ్వానాల మధ్య ప్రకటించారు. ఇలాంటి సమావేశం తమ శాఖ నిర్వహించాల్సి వుండగా, భూమిక లాంటి సంస్థ ముందుకు వచ్చి ఇంత పెద్ద బాధ్యతను మీదేసుకుని రెండు రోజులు వర్క్‌షాప్‌ను నిర్వహించడం అభినందనీయ మని ప్రశంసించారు.

ఉషారాణిగారి ప్రసంగానంతరం ప్రతినిధులు తమకున్న అన్నిరకాల సందేహాలను ఆమె ముందుంచారు. రెస్పాండెంట్లకు సమన్లు చేరవేయడంలో తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులను, ప్రయాణ ఖర్చులు లేకుండా జిల్లా అంతా తిరగాల్సి రావడం గురించి, వివిధ కోర్టులకు కేసుల కోసమై హాజరవడం గురించి ఆమెకు నివేదించారు. తాము కూర్చోవడానికి కొన్ని చోట్ల కనీస వసతి లేదని, స్టేషనరీ లాంటివి కూడా అందుబాటులో లేవని వివరించారు. వీటన్నింటికీ ఉషారాణిగారు ఓపిగ్గా సమాధానాలు చెబుతూ, ఈ అంశాలన్నింటినీ క్రోడీకరించి నివేదికను తమకు అందచేయమని తప్పనిసరిగా వాటిని పరిష్కరించే విధంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు..

ఉషారాణిగారు వెళ్ళినతర్వాత డా:కిరణ్మయిగారు తమ ప్రసంగాన్ని కొనసాగించారు. భోజనవిరామ సమయం తర్వాత రెండవ సెషన్‌ ప్రారంభమైంది., జుడీషియల్‌ ఎకాడమీలో సీనియర్‌ ఫ్యాకల్టీగా వున్న సీతారామ అవధానిగారు గృహహింస నిరోధక చట్టం - 2005′ గురించి వివరించారు. ఈ సెషన్‌లో చట్టంలోని వివిధ అంశాల గురించి మిగతా చట్టాలకన్నా ఈ చట్టం ఎంత ఉన్నతమైందో ఉదాహరణ పూర్వకంగా వివరించారు. భారతీయ చట్టాలలో ఇంతవరకూ లేని, ఉన్న ఇంటిలోనే వుండే హక్కును ఈ చట్టం ప్రసాదించిందని, అలాగే పోలీసుల, న్యాయవాదుల జోక్యాన్ని చాలా వరకు తగ్గించిన సివిల్‌ చట్టంగా ఇది రూపొందించారని తెలిపారు. ఇంతమంచి చట్టం అమలులో వున్న విషయం చాలామందికి తెలియదని, ప్రభుత్వం దీనికి సరైన ప్రాచుర్యం కల్పించాల్సిన అవసరం వుందని, తెలియచేసారు. సీతారామావధానిగారు మాట్లాడు తున్నంతసేపు చాలా సావధానంగా విన్న ప్రతినిధులు, అసంఖ్యాకమైన ప్రశ్నలను ఆయనపై సంధించారు. గృహహింస చట్టం అమలుకోసం పని చేస్తున్న తమకి ఈ చట్టం పట్ల చాలా సందేహాలు, అనుమానాలు ఉన్నాయని తమకు ఇలాంటి వర్క్‌షాప్‌ ఇంతవరకూ జరగలేదని చెబుతూ, ఒక్కొక్క కేసు విషయంలో ఒక్కొక్క సందేహం తమకు వస్తుంటుందని, ఎవరిని అడగాలో ఇంతకాలం తమకు తెలియలేదని పేర్కొన్నారు. దాదాపు ఒక గంటసేపు ఈ చర్చలు, ప్రశ్నలు సమాధానాల సెషన్‌ నడిచింది. ఒకదశలో సీతారామావధాని గారు ఆశ్చర్యపోతూ క్షేత్రస్థాయిలో ఈ చట్టం అమలులో ఇన్ని లొసుగులు, సందేహాలు వుండడం ఆశ్చర్యం కల్గిస్తుందనీ ఈ ప్రశ్నలన్నింటినీ గుదిగుచ్చి భూమిక వారి సహకారంతో జుడీషియల్‌ ఎకాడమీ సౌజన్యంతో ఒక పుస్తకాన్ని ప్రచురించాల్సిన అవసరం వుందని, దీని కోసం తను తప్పకుండా ప్రయత్నిస్తాననీ, ప్రతినిధుల చప్పట్ల మధ్య ప్రకటించారు.

స్వార్డ్‌ సంస్థ నుంచి శివకుమారి మాట్లాడుతూ ఈ సమావేశంలో పాల్గొనడం తనకు చాలా సంతోషంగా వుందని చెబుతూ, గృహహింస చట్టం అమలులో చాలా సమస్యలు ఎదురౌతున్నాయని, ముఖ్యంగా మేజిస్ట్రేట్లు అవగాహన లేకుండా కేసుల్ని కొట్టేస్తున్నారని చెప్పారు. అంతేకాకుండా దీన్నొక తలనొప్పి చట్టంగా చూస్తున్నారని, జిల్లా యంత్రాంగం కూడా సరిగా రివ్యూ మీటింగ్‌లు పెట్టడం లేదని, ఒకవేళ పెట్టి నా సాయంత్రం ఓ అరగంట టైమిచ్చి తూతూమంత్రంగా ముగిస్తున్నారని చెప్పారు. న్యాయమూర్తులకు తప్పనిసరిగా జండర్‌ శిక్షణ ఇవ్వాలని సూచించారు. గృహహింస చట్టం అమలులో ప్రముఖ బాధ్యతను నిర్వహిస్తున్న లీగల్‌, సోషల్‌ కౌన్సిలర్స్‌ అందరిని ఒక చోట చేర్చి, మంచి వర్క్‌షాప్‌ను నిర్వహించిన భూమిక అభినందనీయ మన్నారు.

రెండోరోజు మొదటి సెషన్‌లో ‘సెంటర్‌ ఫర్‌ వరల్డ్‌ సాలిడారిటీ’లో పనిచేస్తున్న సుచరిత, ఆంధ్రప్రదేశ్‌లో గృహహింస చట్టం - 2005 అమలు తీరుతెన్నుల గురించిన నివేదిక సారాంశాన్ని ప్రతినిధులతో పంచుకున్నారు. తమమధ్యవున్న వివరాలకు, ప్రతినిధులు చెపుతున్న వివరాలకు పొంతన లేకపోవడం కొన్ని చోట్ల గమనించి, ఒక్కో జిల్లా వారినుండి వివరాలను అడిగి తెలుసుకున్నారు. అంతకుముందు గృహహింస చట్టం రావడం వెనుక బిల్లు రూపం నుండి దేశవ్యాప్తంగా మహిళా సంఘాలు చేసిన కృషిని చెబుతూ ప్రభుత్వం స్త్రీలమీద ప్రేమతో ఈ చట్టం తీసుకురాలేదని, అంతర్జాతీయ స్థాయిలో జరిగిన ఒప్పందాల వల్ల (సీడా) స్త్రీల కోసం ప్రత్యేక చట్టాలు వచ్చాయని, ఐతే అమలులో చాలా నిర్లక్ష్యవైఖరి వ్యక్తమౌతోందని చట్టం అమలుకు కావల్సిన వనరుల్ని కనీస సౌకర్యాలను కేటాయించడం లేదని అన్నారు. రక్షణాధికారుల కార్యాలయాల్లో పనిచేస్తున్న మీ అందర్నీ కలుసుకోవడం, మాట్లాడటం తనకు చాలా ఆనందాన్నిచ్చిందనీ, చాలా కొత్త విషయాలను తాను తెలుసుకోగలిగానని చెప్పారు.

వర్క్‌షాప్‌ ముగింపు దశకు వస్తున్న సమయంలో ప్రతినిధులందరూ తమతమ వ్యక్తిగత నేపథ్యాల గురించి వివరిస్తూ పరిచయం చేసుకుంటూ, తమ లాగానే వివిధ జిల్లాల్లో పనిచేస్తున్నవారిని తొలిసారిగా ఇలా కలుసుకోవడం చాలా ఆనందాన్నీ, బలాన్ని ఇచ్చిందనిచెప్పారు. ఈ వర్క్‌షాప్‌ వల్ల తమలోపల సుడులు తిరుగుతున్న ఎన్నో సందేహాలు నివృత్తమయ్యాయని, కౌన్సిలింగ్‌ గురించిన ఎన్నో క్రొత్త అంశాల్ని తాము నేర్చుకోగలిగామని, అలాగే ”డీవీ’ యాక్ట్‌కి సంబంధించిన తమ అనుమానాలు కూడా తీరాయని, దీని ప్రభావం తమపనిపై పాజిటివ్‌గా పడుతుందని సంతోషంగా చెప్పారు.తమందరినీ ఇలా ఒకే గొడుగు కింద తీసుకొచ్చిన ‘భూమిక’కు ఎప్పటికీ రుణపడి వుంటామని ప్రకటించారు. మీరంతా ఒక సంఘంగా ఏర్పడితే బాగుంటుందన్న కొండవీటి సత్యవతి సూచనను వెంటనే ఆమోదించి ప్రాంతీయ కన్వీనర్‌లుగా ఈ క్రింది వారిని ఎన్నుకుని
రాష్ట్ర స్థాయి కన్వీనర్‌గా కొండవీటి సత్యవతిని ఎంచుకున్నారు.
జె. విజయభాస్కర్‌ హైద్రాబాద్‌,
పి. రేవతి దేవి వరంగల్‌, కరీంనగర్‌, నల్గొండ, అదిలాబాద్‌
ఎం. ఉమాదేవి కడప, కరీంనగర్‌, అనంతపూర్‌, చిత్తూరు ఎస్‌.సరళ గుంటూరు, ప్రకాశం,
జి. మాధవి విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం
ఎల్‌.సుధ తూర్పు, పశ్చిమ గోదావరి,
డి.ఎ.గౌరి రంగారెడ్డి, మెదక్‌,
చక్కటి ఆశావహమైన వాతావరణంలో మొదలైన రెండురోజుల వర్క్‌షాప్‌,చాలా నిర్మాణాత్మకంగా, ఉత్సాహంగా జరిగింది. షుమారు వందమంది పాల్గొన్న ఈ సమావేశం విజయవంతంగా ముగిసి, భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాల రూపకల్పనకు తెరతీసింది.

Thursday, February 10, 2011

జనగణనలో వాస్తవాలు చెప్పకపోతే ఏం జరుగుతుంది???

ఫిబ్రవరి 9 నుండి 29 వరకు ఆంధ్రప్రదేశ్‌లో జనాభాగణన కార్యక్రమం పెద్ద ఎత్తున మొదలవ్వబోతోంది. ఈ ఇరవై రోజులపాటు ఇంటింటికీ తిరిగి, ఇంటిల్లిపాది వివరాలను సేకరించడానికి దాదాపు లక్షమంది ఎన్యూమరేటర్లు సిద్దమవుతున్నారు. తమకు అప్పగించిన బాధ్యతను జాతీయ ప్రాముఖ్యంగల బాధ్యతగా భావించిన ఎన్యూమరేటర్లు ఇంటింటికీ తిరగి భవిష్యత్‌ ప్రణాళికల రూపకల్పనకు అవసరమయ్యే అత్యంత కీలకమైన సమాచారాన్ని సేకరించడానికి నడుం బిగిస్తున్నారు. భారతీయ సమాజం భిన్న జాతుల సమ్మేళనం. భిన్న వర్గాల కలయిక. జనాభాలో సగభాగం మహిళలేవున్నారు. అలాగే శారీరక, మానసిక వైకల్యం వున్నవారు వుంటారు. స్త్రీలు, పురుషులు కాకుండా ఇతరులు కూడా వుంటారు. సమాజం భిన్న వ్యక్తుల, సంస్కృతుల కలయికగా వుంటుంది. ఈ సమాచారం అంతా కూడా జనభాగణనలోకి తప్పనిసరిగా రావాల్సి వుంటుంది.
భారతదేశానికి సంబంధించి 1872లో తొలిసారి జనభాగణన జరిగింది. దేశంలోని వివిధ ప్రాంతాలలో, వివిధ సమయాలలో గణన జరిగింది. 1881లో దేశం మొత్తం మీద ఏకకాలంలో జనాభాగణన జరిగింది. అప్పటినుండి ప్రతి పది సంవత్సరాలకొకసారి నిరాటంకంగా జనగణన జరుగుతోంది. ఇప్పుడు (2011లో) జరుగుతున్న జనాభాగణన దేశంలో 15వ జనాభా గణనగాను, స్వాతంత్య్రానంతరం 7వదిగాను చెప్పుకోవాలి.

జనాభా గణన నిర్వహణ ముఖ్యోద్ధేశ్యం ఏమిటంటే భారతదేశం శ్రేయోరాజ్యం, స్వాతంత్య్రం వచ్చినప్పటినుండి సామాన్య ప్రజల ఉపయోగార్ధం పంచవర్ష ప్రణాళికలు, వార్షిక ప్రణాళికలు మాత్రమే కాక ఇతరేతర సంక్షేమ పధకాలు తయారు చేయడానికి కావలసిన క్రింది స్థాయి సమాచారమంతా జనాభా గణన ద్వారానే సేకరించి యివ్వడం జరుగుతుంది.

2011 సంలలో తలపెట్టిన భారతదేశ జనాభా గణన రెండు దశలలో జరుగుతుంది. ఒకటి ఇళ్ళ జాబితా, ఇళ్ళ గణన,రెండు జనాభా గణన. మొదటి దశ ఏప్రిల్‌ నుండి సెప్టెంబర్‌ నెల వరకు, 2010 మధ్య కాలంలో వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో జరిగింది. ఈ దశలో భవనాల, గణన గృహాలు మరియు కుటుంబాలను గుర్తించి వాటిని ఇళ్ళ జాబితా, ఇళ్ళ గణన షెడ్యూల్‌లో ఒక క్రమ పద్ధతిలో నమోదు చేయడం జరిగింది. ఇళ్ళ జాబితానే కాకుండా మానవ స్థిర నివాసాల స్థితి, ఇళ్ళ కొరత మొదలగు వాటిని అంచనా వేయడం, కుటుంబాలకు లభించే వసతుల సమాచారం కూడా సేకరించబడినది.

ఫిబ్రవరి 9 నుండి 29 వరకు జరగబోయే రెండవ దశ జనాభా గణన చాలా ముఖ్య మైనది. ఒక నిర్ణీత సమయంలో ప్రతి ఒక్క వ్యక్తిని గణన చేసి ఆమె, అతని వ్యక్తిగత వివరాలను సేకరించడమే జనాభా గణన రెండో దశ ముఖ్య ఉద్ధేశం.

రెండవ దశలో మన అందరి వివరాలు సేకరించడానికి ఎండనక, వాననక ఎక్కిన మెట్లు ఎక్కుతూ, దిగిన మెట్లు దిగుతూ, ఎంతో శ్రమకోర్చి ఎన్యుమరేటర్లు మన ఇంటి తలుపు తడతారు. 29 ప్రశ్నలలో మనకు సంబంధించిన సమాచారం వివరంగా, సక్రమంగా, నింపడానికి మనమందరం తప్పనిసరిగ సహకరించాల్సిన అవసరం వుంది. మనం ఏ విషయం చెప్పకుండా దాచినా నష్టం మనకే జరుగుతుంది. ముఖ్యంగా మహిళలు తమకు సంబంధించిన వివరాలను సరిగా చెప్పరు. ఉదా: ఎవరైనా మహిళను నీవు ఏం పని చేస్తావు అని అడిగితే, నేను ఏమీ పనిచేయను, ఇంట్లోనే ఉంటాను అని చెప్తుంది. అలాగే నీకు ఎంత మంది పిల్లలు అని అడిగినపుడు బతికి ఉన్న పిల్లల వివరాలను మాత్రమే చెపుతారు, జరిగిన అబార్షన్స్‌ గురించిగాని గర్భంలోనే చనిపోయిన పిల్లల గురించిగాని, అంగవైకల్యంతో, మానసిక వైకల్యంతో పుట్టిన పిల్లల వివరాలను దాచిపెడతారు. అలాగే తమ వివాహం జరిగిన సంవత్సరాన్ని చెప్పమని అడిగినపుడు, వచ్చిన అధికారులు తమను శిక్షిస్తారనే భయంతో బాల్యవివాహం జరిగినాగాని, ఆ విషయాన్ని వెల్లడించకుండా పెళ్ళినాటికి తమకు 20 సంవత్సరాలు దాటినాయని చెబుతారు, ఆమెకు బాల్యవివాహం జరిగినట్లుగా మన కంటికి కనిపిస్తున్నప్పటికీ, మనం ఆమె చెప్పినవే నమోదు చేసుకోవలసి వస్తుంది. అలాగే మహిళలు ఈ రోజుల్లో చాలా ప్రాంతాలలో తామే కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉంటూ, కుటంబాన్ని నిర్వహిస్తున్నప్పటికీ, ఆ విషయం చెప్పకుండా, ఇంటికి పెద్ద కొడుకు పేరును ప్రస్తావిస్తారు.

పైన ప్రస్తావించిన అంశాలను వివరంగా గమనించినపుడు జనగణన సమయంలో సరి అయిన సమాచారం ఇవ్వకపోతే జరిగే నష్టం ఇప్పుడు చూద్దాం. నిజానికి మన సమాజంలో ఉదయం లేచిన దగ్గర నుండి,రాత్రి పడుకోబోయే వరకు మహిళలు ఎన్నో రకాల పనులను చేస్తూ ఉంటారు. ఇంటి పనితో పాటు, వంటపని, పిల్లల పనిని పనిగా గుర్తించక పోయినప్పటికీ వారు కుటంబ పోషణార్ధం, డబ్బు సంపాదన కోసం రకరకాల పనులు చేస్తూ ఉంటారు. బీడీలు చుట్టడం, విస్తళ్ళు కుట్టడం, పిడకలు చేసి అమ్ముకోవడం, బుట్టలు అల్లడం, పాడి పశువులను పెంచి పాలు అమ్మడం, పళ్ళు కూరగాయలు అమ్మడం, పూలు అమ్మడం, ఇలా రకరకాల పనులు చేసి సంపాదించి కుటుంబం కోసం ఖర్చు పెడుతూ ఉంటారు. అయితే జనగణన ఎమ్యూనరేటర్లు అడిగినపుడు తాము ఏమీ పని చేయడం లేదని చెెబుతూ ఉంటారు. అలాగే వ్యవసాయ పనులతో కూడా పూర్తి కాలం పనులు, పాక్షిక పనులు ఉంటాయి. వీటిని కూడా మహిళలు చెప్పరు. నిజానికి ఇంటి దగ్గర ఉండి చేసే అన్ని పనులను నమోదు చేసుకునే వీలు ఉంది. ఈ విధంగా స్త్రీలు చేసే వంటపని, ఇంటి పనే కాకుండా కుటుంబం కోసం చేసే అనేక అనేక పనులను జనగణనలో నమోదు చేయక పోవడం వలన స్త్రీల ఉత్పాదక శక్తి నమోదు కాకుండా పోవడమేకాక, స్త్రీలు ఏమి పనిచేయని వారుగా ముద్ర వేయబడుతున్నారు. 2001లో జరిగిన జనగణనలో ఆంధ్రప్రదేశ్‌లో పని స్త్రీ, పురుషుల పని నిష్పత్తి 35.1%, 56.2% ఉంది, ఇది నిజం కాదని మనకు అర్ధమవుతూనే వుటుంది. కాని మహిళలు తాము చేసే పనిని గురించి వివరంగా చెప్పకపోతే ఇలాగే నమోదు అవుతుంది మరి. అలాగే తమకు పుట్టిన పిల్లల గురించిన వివరాలను కూడా సరిగ ఇవ్వకపోతే చాలా నష్టం జరుగుతుంది. ఉదా: జరిగిన గర్భస్రావాలను గురించి, పుట్టిన వెంటనే చనిపోయిన బిడ్డ గురించి సరి అయిన సమాచారం ఇచ్చినట్లయితే ఆయా ప్రాంతాలలో కల్పించవలసిన వైద్య సదుపాయాలగురించి సరి అయిన ప్రణాళికలను రచించడానికి వీలు అవుతుంది. అంటే ఆయా ప్రాంతాలలో గర్భిణి స్త్రీలకు వైద్య సదుపాయాలు అందుతున్నాయా లేదా, సరి అయిన ప్రయాణ సౌకర్యాలు అందుతున్నాయా, రహదారులు సక్రమంగా ఉన్నాయా లేదా వీటన్నింటిని పరిశీలించి ప్రణాళికలో పొందు పరచడానికి వీల వుతుంది. చాలామంది మేము ఒక్కరమే చెప్పకపోతే ఏమవుతుందిలే అని ఆలోచిస్తే, అందరం అలాగే అనుకుంటే రాజు గారి పాలకుండ చందాన అవుతుంది. అందుకని జనగణన ఎన్యుమరేటర్లు మన వద్దకు వచ్చినపుడు తప్పన సరిగ పైన పేర్కొన్న వివరాలను అందిద్దాం. అలా చేయకపోతే జరిగే నష్టం కూడా మనకు అర్ధం అయి ఉంటుంది.

ఇక జండర్‌ విషయానికి వచ్చినపుడు ఇంతకు ముందు వరకు స్త్రీలు, పురుషులు అనే కాలమ్‌ మాత్రమే ఉండేది. ఈ సారి ”ఇతరులు” అనే కాలమ్‌ను కూడా చేర్చడం జరిగింది. అంటే స్త్రీలు, పురుషులుగా మాత్రమే పుట్టకుండా ఏ లింగానికి చెందకుండా పుట్టిన వ్యక్తులు మన సమాజంలో చాలామందే వున్నారు. ఇంతవరకు వీరికి సంబంధించిన వివరాలు ఎక్కడ నమోదు కాలేదు. ఈ సారి ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని భిడియపడకుండా తమ వాస్తవ వివరాలను నమోదు చేసుకుంటే మంచిది.

వైవాహిక స్థితికి సంబంధించి కూడా ఇంతకు ముందు వివాహితులు, అవివాహితులు, వైధవ్యం పొందినవారు,విడాకులు తీసుకున్న వారు అనే కాలమ్స్‌ మాత్రమే ఉండేవి. మారిన సామాజిక పరిస్థితులకు అనుగుణంగా ‘విడిపోయినవారు’ అనే అంశాన్ని కూడా చేర్చడం జరిగింది. వివాహం చేసుకోకుండా కలిసి జీవిస్తున్నవారు (లివింగ్‌ టు గెదర్‌) అనే కాలమ్‌ కూడా చేర్చి వుంటే బావుండేది.

పైన పేర్కొన్న అంశాలు ఒక ఎత్తు అయితే వికలాంగులకు సంబంధించిన సమాచారాన్ని సరిగ్గా రాబట్టలేకపోవడం పెద్ద విషాదం. అందువల్లనే 2001 జనాభా లెక్కల ప్రకారం భారతేదశంలో వికలాంగులు కేవలం 2.1%గా వుంది. ఇది చాలా దేశాల కన్నా తక్కువ. ఉదా. పాకిస్థాన్‌లో 2.3% బంగ్లాదేశ్‌లో 5.6% శ్రీలంకలో 7%, ఆస్ట్రేలియాలో 20% అమెరికాలో 19.3%, బ్రిటన్‌లో 18% జనాభా వికలాంగులుగా ఉన్నారని వారి గణాంకాలు తెలుపుతున్నాయి. అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాలలో సగటున 6% జనాభా వికలాంగులుగా ఉంటే ప్రపంచ జనాభాలో 2వ స్థానంలో ఉన్న భారతదేశంలో కేవలం 2.1% మాత్రమే వికలాంగులు ఉండటం వెనుక అసలు కారణం జనగణన సమయంలో సరి అయిన సమాచారం ఇవ్వకపోవటమే. భారతదేశం చెబుతున్న 2.1% గురించి ఐక్యరాజ్యసమితి అభ్యంతరం తెలిపి కనీసం 10% మంది అయినా వికలాంగులు ఉంటారని అంచనా వేసింది.

ఈ అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని 2011 జనగణన విభాగం వికలాంగులకు సంబంధించి చాలా జాగ్రత్తలు తీసుకుంది. అందులో భాగంగా వికలాంగులను 8 కేటగిరీలుగా విభజించింది. అవి. చూపులో, వినుటలో, మాటలో, కదలికలో, మానసిక మాంధ్యం, మానసిక వ్యాధి, ఏదైన ఇతరములు బహువైకల్యం.

అంగవైకల్యానికి సంబంధించిన ప్రశ్నలు చాలా సున్నితమైనవి. కావున ఎన్యుమరేటర్లు జాగ్రత్తగా , నైపుణ్యంతో అడగటం చాలా అవసరం. అడుగుతున్న క్రమంలో అంగవైకల్యానికి సంబంధించిన సమాచారాన్ని నమోదు చేయడం ఎందుకు అవసరమో చెబుతూ, అంగవైకల్యంగల వ్యక్తులకు, వారి కుటుంబాల కోసం ప్రభుత్వం రూపొందించే వివిధ పధకాలకు కావలసిన ప్రణాళికలను రూపొందించడం, వాటికి కావలసిన వనరులు కేటాయించడం, తత్సంబంధిత సేవలు సమకూర్చడం అంగవైకల్యంగల వ్యక్తులకు విద్య , ఉపాధి అవకాశాలను అందరితో పాటు సమానంగా కల్పించడానికి తగిన ఏర్పాట్లు చేయడం కోసం అంగ వైకల్యంగల వ్యక్తులకు ప్రభుత్వ రవాణా మరియు ఆరోగ్య సేవలు సమకూర్చడానికి ఈ సమాచారం ఉపయోగపడుతుందని వివరించాలి.

కాబట్టి జనగణన ఎమ్యానరేటర్లు ఫిబ్రవరి 9 నుండి 29 తేదీల మధ్య మీ ఇంటికి వచ్చినపుడు మీ వ్యక్తిగత వివరాలన్నింటిని సూక్ష్మాతి సూక్ష్మమైన అంశాలన్నింటిని వివరంగా చెప్పడం మీ బాధ్యత. వివరాలను దాచుకుంటే జరిగే నష్టం మనకే, సరి అయిన వివరాలను చెప్పినపుడు మాత్రమే ప్రభుత్వ పధకాలలో అవసరమైన అందరికీ మొత్తం భారతదేశ భవిష్యత్తు ప్రణాళికా పధక రచన జరుగుతుంది. ఎవరెవరికి ఏఏ అదనపు సౌకర్యాల అవసరం వుందో, ఆ విషయం ధృవీకరించబడేది జనగణన లెక్కల ద్వారానే అనే విషయాన్ని మనమందరం మనసులో ఉంచుకుంటూ 29 కాలమ్స్‌తో, చేటలాంటి పేపర్‌తో ఎన్యుమరేటర్‌ మీ ముందు నిలబడినపుడు విసుగు చెందకుండా, ఆత్రుత పెట్టకుండా ఒక గ్లాసు మంచినీళ్ళో, మజ్జిగో ఇచ్చి మన ఇంటికి వచ్చిన వారికి సమాచారం అందించడం మన బాధ్యత.







తర్పణాలు త్రిశంకు స్వర్గాలు

 తర్పణాలు, త్రిశంకు స్వర్గాలు ............ మా సీతారాంపురం లో మా తాతకి చాలా పొలాలు ఉండేవి. మా తాత, చిన్న తాత ఇద్దరే పొలాలన్నింటిని పంచుకున్నా...