Sunday, April 29, 2012

శారదా శ్రీనివాసన్ గారితో ఓ సాయంత్రం





శారదా శ్రీనివాసన్ గారితో సాయంత్రం

నిన్న ఎందుకో అలా డ్రైవ్ చేసుకుంటూ పోతుంటే హిమాయత్ నగర్ దగ్గరకొస్తూనే 
శారద గారు గుర్తొచ్చారు. చాలా రోజులుగా అనుకుంటున్నాను కానీ కుదరడం లేదు.
ప్లాన్ చేస్తే పనులవ్వడం లేదు కాని చెప్పకుండా వెళ్ళి ఆశ్చర్యపరుద్దామనుకున్నాను.
లేడికి లేచిందే పరుగు లాగా శారద గారింటికెళ్ళడం డొర్ బెల్ కొట్టడం 
.. సత్యా అంటూ ఆవిడ నన్ను ఆత్మీయంగా హత్తుకోవడం 
పది నిముషాల్లో జరిగిందంటే నమ్మండి.
తర్వాత కబుర్ల జలపాతం,నవ్వుల జల్లులు.
ఇంతకీ శారద గారు ఎవరో చెప్పలేదు సుమండి.
ఎవరి గొంతు వినాలని ఆనాటి తరం రేడియోల ముందు నిశ్శబ్దంగా కూర్చునే వారో,
ఆవిడ నాటకాలని వినడానికి ఆదివారం 3 గంటలకి రేడియోకి అతుక్కుపోయేవారమో 
శారదా శ్రీనివాసనే నండి.
నాకు మంచి మితృరాలు.మా స్నేహానికి 20 ఏళ్ళు.
ఆవిడ నటించి జీవించిన పురూరవ నాటకం విన్నారా మీరు.
"
నా రేడియో అనుభవాలు" అంటూ ఇటీవల అద్బుతమైన పుస్తకం రాసారు.
చదివారా మీరు.
పుస్తకాన్ని దాదాపు 6 గంటపాటు స్టూడియోలో చదివి సీడి కూడా తెచ్చారు.
నిన్న నాకు సీడి ఇచ్చారు.
దానిని వినడం గొప్ప అనుభవం.
మీకు కావాలంటే చెప్పండి.
ఆవిడకి మార్కెటింగ్ చేసుకోవడం అస్సలు రాదు.
అందరం కలిసి కొన్ని సీడి లు కొంటే బావుంటుంది కదా.
నేనీ మాట అంగానే వద్దులే సత్యా అన్నారు కానీ నేనే చొరవ తీసుకుంటున్నాను.

Saturday, April 28, 2012

''భూమి చెబితే ఆకాశం నమ్మదా??''



''భూమి చెబితే ఆకాశం నమ్మదా?'' అంటూ నలభై మంది రచయిత్రుల ముందు కన్నీటి సంద్రాలైన వాకపల్లి అత్యాచార బాధిత మహిళల గుండె ఘోషను విని, విశ్వసించిన మహిళా న్యాయమూర్తికి జేజేలు పలకాల్సిన తరుణమిది. ఎలాంటి గాయాలు, వీర్యఅవశేషాలు లేవంటూ అబద్ధపు రిపోర్టులిచ్చిన పోలీసుల్ని నమ్మకుండా, ఎలాంటి గాయాలు లేకుండా అత్యాచారం జరగొచ్చు అంటూ కాగ్నిజబుల్‌గా యువ మేజిస్ట్రేట్‌ కేసును తీసుకోగానే నిందిత పోలీసులు 2008లో ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో స్టే పొందారు. అప్పటినుండి కేసు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందాన నిలిచిపోయింది.
నాలుగు సంవత్సరాల తర్వాత ఈ కేసు హైకోర్టులో ఫైనల్‌ హియరింగ్‌కి వచ్చింది.పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌, నిందిత పోలీసుల తరఫు న్యాయవాది తమ పాత వాదనలే విన్పించినప్పటికీ, గిరిజన మహిళ తరఫున వాదిస్తున్న బొజ్జా తారకంగారు తమ వాదనని బలంగా విన్పిస్తూ బాధిత మహిళల మీద గాయాలే లేవని, వీర్యాల అవశేషాలు లేవని కారణం చూపిస్తూ ప్రాసిక్యూషన్‌ అవసరం లేదనడం భావ్యం కాదని, నిందితుల్ని ప్రాసిక్యూట్‌ చెయ్యడానికి ఈ కారణం అడ్డంకి కాదని వాదించారు. కోర్టు బాధిత స్త్రీల స్టేట్‌మెంట్‌ని నిర్ద్వంద్వంగా నమ్మి తీరాలని కూడా వాదించారు.
ఈ వాదనని అంగీకరించిన జస్టిస్‌ శేషశయనారెడ్డి బాధితులకు అనుకూలంగా స్పందించి తీర్పు వెలువరించారు. ఈ కేసులో నిందితులైన 21 మంది పోలీసుల్లో 13 మంది మీద కేసు నమోదు చేసి ప్రాసిక్యూషన్‌ చేపట్టాల్సిందిగా ఆదేశాలు యిచ్చారు న్యాయమూర్తి.
వాకపల్లి గిరిజన మహిళలపట్ల అమానుషంగా వ్యవహరించిన 13 మంది పోలీసులు సామూహిక అత్యాచారం, ఎస్‌సి, ఎస్‌టి ఎట్రాసిటీ చట్టం కింద నేరారోపణలతో విచారణని ఎదుర్కొబోతున్నారు.
గిరిజన మహిళలు చేసిన దీర్ఘకాలిక న్యాయపోరాటం, మహిళా, పౌరహక్కుల సంఘాల సంఘీభావం, ''మీ పక్షాన మా అక్షరాలను మోహరిస్తామంటూ'' వాకపల్లి మహిళల పక్షాన నిలిచిన నలభైమంది రచయిత్రుల స్పందన వల్ల ఈ రోజు హైకోర్టులో ఈ ఆశావహక నిర్ణయం వెలువడింది. కొద్దిపాటి సాక్ష్యముంటే చాలు ''న్యాయనిర్ణయాలు'' (judicial decisions ) చెయ్యొచ్చని రుజువు చేసిన పాడేరు మేజిస్ట్రేట్‌కి, హైకోర్టు న్యాయమూర్తికి బాధితుల తరఫున వందనాలు. అభివందనాలు.

Friday, April 27, 2012

వానప్రస్థాశ్రమం అంటే ఇలా ఉండాలి



ఓ చక్కటి ఊరు.
పేరు పెన్నాడ అగ్రహారం.
పచ్చటి ఊరు.
ఊరినిండా కూరగాయల పాదులు.
పచ్చటి ఊరులో ఆకుపచ్చటి కూరగాయల మళ్ళు.
ఈ ఊరుకు ఇంకో ప్రత్యేకత ఉంది.
అక్కడ నెలకొని ఉంది ఓ ప్రసాంతమైన సీనియర్ సిటిజన్ ఆశ్రమం.
నేను మా ఊరు వెళ్ళినపుడల్లా ఈ జ్నానానంద ఆశ్రమానికి వెళుతుంటాను.
ఈ జ్నానానంద  గారి గురించి మరోసారి వివరంగా రాస్తాను.






ఈ ఆశ్రమం చూడండి ఎంత హాయిగా ఉందో.

Saturday, April 21, 2012

తమిళ రచయిత్రి ,ఏక్టివిష్ట్ మీనా కందసామి మీద ట్విట్టర్ లో జరిగిన దాడిని ఖండిద్దాం

Right-wing Men Bash Woman Writer on Twitter

Poet, writer and activist Meena Kandasamy was the target of brutal, violent and sexist hate campaign on Twitter objecting to her comments on a beef-eating festival at Osmania University, Hyderabad

Here is the statement issued by NWMI in support of Meena Kandasamy.
The Network of Women in Media, India (NWMI), strongly condemns the violent and sexist abuse unleashed on poet, writer, activist and translator Meena Kandasamy, presumably in response to her posts on Twitter about the beef-eating festival at Osmania University, Hyderabad, on 15 April 2012 and the ensuing clashes between groups of students.
After her comments on Twitter, she was threatened with various forms of violence, including gang rape and acid attacks. Some placed a price on her head. Others threatened her freedom of speech, saying that she would not be allowed to speak anywhere, and called for her prosecution for allegedly outraging religious feelings under Section 295-A of the Indian Penal Code. In over a hundred tweets, she was called a whore, characterless, a terrorist and a bitch. One of the most objectionable comments was that she should be raped on live television, this barbaric idea was put out by one Siddharth Shankar who followed it up with more vicious filth.
Meena Kandasamy has become the target of a vicious abuse campaign on twitter and other sites for her support to the festival during which she and other students had to be escorted to a safe place under police escort. Protestors even stoned the van they were traveling in. It is highly condemnable that her support of a food festival should lead to demands for her prosecution and a bounty on her head.
As a professional network of women journalists, the NWMI is firmly committed to freedom of expression and, indeed, supports ongoing efforts to ensure that the Internet remains a free space and is not subjected to censorship. However, freedom comes with responsibility and all those who value free speech must, at the very least, censure hate speech.
Everyone in a democracy has a right to hold and express their opinions on current events and issues. Similarly, everyone has a right to disagree with and argue against the opinions of others. Debate – not abuse and threats – is the democratic means to deal with conflicting views on contentious topics: in this case, the right to choose what to eat and not eat.
It appears that Meena Kandasamy has been singled out for abuse at least partly because she is a bold and outspoken woman who expresses her opinions freely in the public sphere. The fact that she is a dalit, especially one whose work focuses on caste annihilation, linguistic identity and feminism, clearly makes her even more of a target.
We call upon all those who value freedom of expression to join us in condemning the online attack on Meena Kandasamy and to explore ways to ensure that everyone has a right to express their opinion – on the Internet as well as elsewhere – without being subjected to hateful abuse.

Sunday, April 8, 2012

బూరుగు గూడెం భలే బావుంది.


నేనూ నా సహచరుడూ కలిసి రెండు రోజుల కోసం మాకు చాలా ఆత్మీయులైన రామనుజం గారు,మణి గార్ల ఊరు బూరుగుగూడెం వెళ్ళాం.
ఊరి నిండా మామిడితోటలే.
నూజివీడుకి దగ్గరగా ఉంది బూరుగు గూడెం.చాలా అందంగా పచ్చగా ఉంది ఈ ఊరు.
సాయంత్రం సరదగా వారి పొలాలవేపు వెళ్ళినప్పుడు ఓ అద్భుతమైనదృశ్యం ఆవిష్కారమైంది. ...
 ఓ వైపు నిండు పున్నమి జాబిల్లి ఆగమనం 
మరో వైపు సూర్యాస్తమయం.ఎంత హృద్యంగా ఉందో ఆ దృశ్యం.
రెండు కళ్ళు చాలలేదు చూడ్డానికి.
మామిడి తోటలో రెల్లుగడ్డి పాక.
పాకచుట్టూ పచ్చదనం,
కొబ్బరాకుల మధ్యలోంచి తొంగి చూస్తున్న పున్నమి చంద్రుడు
,
విరగ కాసిన మామిడి చెట్లు,
విస్తారంగా పండిన వరిచేలు,
అబ్బో బూరుగు గూడెం అందాలు చూడాల్సిందే.
మీరూ చూడండి.












Sunday, April 1, 2012

నిన్న ఏమయ్యిందంటే.....


భూమిక ప్రతేక సంచిక పని పూర్తయ్యింది.
ఓ  రోజు హాయిగా తిరగాలనిపించింది.
స్టేషన్ ఘనపూర్ లో నా నేస్తం తాసిల్దార్ గా పని చేస్తోంది.
ఉదయం నేనే డ్రైవ్ చేసుకుంటూ ఒక్కదాన్ని బయలుదేరాను.
ఘంటశాల సుశీల పాతపాటలు పెన్ డ్రై నిండా ఉన్నాయి.
పాటలు వింటూ హైవే డ్రైవ్ ఎంజాయ్ చేస్తూ 12 గంటలకి ఘనపూర్ చేరాను.
రఘునాధపల్లి నుండి ఘనపూర్ వరకు పెద్దపెద్ద వేపచెట్లు కొత్త చిగుర్లతో విరగబూసిన పూతతో ఎంత పచ్చగా ఉన్నయో.
దారంతా వేపపూల చేదు వాసన.
సాయంత్రం దాకా గీతతో ఉన్నాను.
తన ఆఫీసుకుకి ఖాజీపేటకి మధ్యలో ఉంటున్న గట్టు ప్రసాద్ అనే ఆయన ఇంటికి తీసుకెళ్ళింది.
ఆయన మంచి లైబ్రరి నడుపుతున్నారు నీకిష్టం కదా వెళదామని తీసుకెళ్ళింది.
నిజంగానే ఆయన అద్భుతమైన వ్యక్తి.
25 సంవత్సరాలుగా భిన్నమైన అంశాల మీద ఎంతో సమాచారాన్ని సేకరించారాయన.
ప్రభుత్వ పధకాలు,మహిళలు,పిల్లలు,నీటిపారుదల, మెగా ప్రాజెక్టులు,సంక్షేమ పధకాలు ఇలా ఎన్నో అంశాల మీద ప్రసాద్ గారు ఎంతో విలువైన సమాచారాన్ని సేకరించి భద్రపరిచారు.
ప్రసాద్ గారితోను,వారి భార్య స్వప్న గారితోను కొంత సేపు గడిపి
వారు సేకరిచిన విలువైన సమాచారాన్ని ఎలా భద్ర పరచాలో వారితో చర్చించి
మేమిద్దరం హైదరాబాద్ బయలు దేరాం.
ఇష్టమైన పాటలు వింటూ,బోలెడన్ని కబుర్లు చెప్పుకుంటూ 8.30 హైదరాబాద్ చేరాం.
విపరీతంగా పని చేసి అలసిపోయినపుడు ఇదిగో ఇలాంటి బ్రేకులు బుర్రకి ఇవ్వాలి.
భూమిక ప్రత్యేక సంచిక పని నా మెదడుని విపరీతంగా వేడెక్కించింది.
ఒక్క రోజు పని గినీ జాంతా నహి అనుకుంటూ ఇలా వెళ్ళిపోయా రీచార్జ్ కావడానికి.
ఆరు నెలలకి సరిపడా ఎనర్జి వచ్చిందంటే నమ్మండి.
 ఫుల్ స్వింగ్ తో రేపే  నా పని మొదలౌతుంది చాలా సంతోషంగా.

my friend

గట్టు ప్రసాద్ గారు



prada gari collection.

 పెద్దపెద్ద వేపచెట్లు కొత్త చిగుర్లతో విరగబూసిన పూతతో


Friday, March 30, 2012

భూమిక ద్విదశాబ్ది ప్రయాణం




1992 భూమిక పత్రికకు అంకురార్పణ జరిగిన సంవత్సరం. భూమిక తొలి సమావేశం డా. సూజితారు ఇంట్లో జరిగింది. ఆ రోజు భూమికకు సంబంధించి ఎంతో చర్చ జరిగింది.కె. లలిత, రమా మెల్కొటే, డా. వీణా శతృఘ్న. డా. భారతి, డా. డి. వసంత, సజయ, నేను ఇంకా చాలామందిమి  ఈ సమావేశంలో పాల్గొన్నాం. అప్పట్లో అన్వేషిలో పనిచేసిన టిఎస్‌ఎస్‌ లక్ష్మి, సి.ఉషారాణి, దారా మనోరమ, ఉమామహేశ్వరి, వసుధ ఇంకా చాలామంది భూమికలో వుండేవాళ్ళు. భూమిక ఆఫీసు కూడా అన్వేషిలో ఒక చిన్న గదిలో వుండేది. ఒక్క మనిషి కూర్చునే చోటు మాత్రమే వుండేది. పేరుకి భూమిక ఆఫీసు కానీ మేమంతా అన్వేషి ఆఫీసులోనే వుండేవాళ్ళం. నల్లకుంటలోని  భారత డిగ్రీ కాలేజీలో కూడా అపుడపుడూ భూమిక సమావేశాలు జరుగుతుండేవి.
1993లో తొలి సంచిక విడుదలైన కొంత కాలం తర్వాత తొలి రోజుల్లో వున్న చాలామంది వెళ్ళిపోయారు. అప్పట్లో భూమికలో ప్రచురించే ఆర్టికల్స్‌ గురించి, సంపాదకీయాల గురించి అందరం చర్చించేవాళ్ళం. సజయ, నేను  సోమాజిగూడలో వుండే నవ్య ప్రింటర్స్‌లో గంటల తరబడి వుండేవాళ్ళం. డిటిపి సెంటర్లో రోజుల తరబడి వుండి పనిచేయించాల్సి వచ్చేది. అన్ని పనులూ పూర్తయ్యి, సంచిక బయటకొచ్చాక దానిమీద, జరిగిన పనిమీద ఎవరు ఎంత చేసారు? ఎవరు చెయ్యలేదు అనే అంశం మీద వాడి, వేడి చర్చలు జరిగేవి. చాలాసార్లు రసాభాసగా ఈ సమీక్షా సమావేశాలు ముగిసేవి. సామూహికంగా పనిచేయడంలోని వొత్తిళ్ళను ఇవి ప్రతిబింబించేవి.
త్రైమాసిక పత్రికగా మొదలై, ద్విమాసంగా కొన్నాళ్ళు కొనసాగి ప్రస్తుతం భూమిక మాసపత్రికగా నిలదొక్కుకుంది. అన్వేషి ఆఫీసులో వున్నంతకాలం అన్నింటికీి – ఫోన్‌, జిరాక్స్‌లాంటి వాటికి కూడా అన్వేషి మీదే ఆధారపడేవాళ్ళం. ఇలా కొన్ని రోజులు జరిగాక భూమిక ఆఫీసు తార్నాకకి మారింది. డా. జి. భారతి, భూమిక విమెన్స్‌ కలెక్టివ్‌ అధ్యక్షురాలు, తన ఇంట్లో ఒక రూమ్‌ భూమికకు ఇచ్చారు. నిజానికి భారతికి భూమికపట్ల  అవ్యాజమైన ప్రేమ ఉండేది. చనిపోయే వరకు భూమికలో కొనసాగారు. భూమిక కోసం విరాళాల సేకరణలో భాగంగా ‘అలర్‌మేల్‌ వల్లి’ నృత్యప్రదర్శన ఏర్పాటు చేసినపుడు భారతి మిత్రులు చాలామంది ఆర్థికంగా సహకరించారు. భూమిక నిలదొక్కుకోవడానికి భారతి చేసిన కృషి మర్చిపోలేనిది.
1998లో  భూమిక ఆఫీసు బాగ్‌లింగంపల్లికి మారింది. అప్పటి నుండి భూమిక అడ్రస్‌ బాగ్‌లింగంపల్లి వాటర్‌ ట్యాంకు పక్కనే. ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యాయి. ప్రతి సంచిక వెలువడటానికి ఎంతో శ్రమ పడాల్సి వచ్చేది.  తెలంగాణా ప్రత్యేక సంచిక  తేవడం వెనుక ఎంతో మంది అకుంఠిత కృషి వుంది. అనిశెట్టి రజిత వరంగల్‌ నుండి హైదరాబాదుకు వచ్చి వుంది కొంతకాలం ఇక్కడే వుంది. ఆ తర్వాత కాలంలో పి. శైలజ కూడా భూమికలో చేరింది.
అప్పటివరకు ఒక సామూహిక ప్రయత్నంగానే భూమిక వెలువడింది. 2000లో హఠాత్తుగా అందరూ భూమికను వదిలేసారు. ఎందుకు వదిలేసారనే దానికి సమాధానం నా దగ్గర లేదు. దానికి నేను బాధ్యురాలను కూడా కాదు. ఆర్ధికంగా కూడా ఏ మాత్రం బాగా లేని ఆ రోజుల్లో భూమిక బాధ్యతని ఒక్కదాన్ని తలకెత్తుకున్నాను. భూమిక పట్ల నాకున్న నిబద్ధత, ప్రేమ వల్ల ఈ బాధ్యత నన్నేమీ భయపెట్టలేదు. ఎలాగైనా సరే పత్రికను ముందు తీసుకెళ్ళాలి. ఎవరున్నా ఎవరు వెళ్ళిపోయినా నేను మాత్రం భూమికను వదిలే ప్రశ్నేలేదనిపించింది. 2000లో నా ప్రభుత్వ ఉద్యోగానికి స్వచ్ఛందంగా రాజీనామా చేసాను. మనస్ఫూర్తిగా నా మొత్తం సమయాన్ని భూమికకే కేటాయించాను. అప్పుడు నాకు వచ్చిన పెన్షన్‌ రూ. 2400. ఇరవై సంవత్సరాలలో భూమిక నుంచి నేను ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. ఈ విషయాన్ని సగర్వంగా పాఠకులకు చెప్పదలుచుకున్నాను.
2003లో దశాబ్ది ప్రత్యేక సంచిక వెలువరించాం. అంతర్జాతీయ మహిళాదినం సందర్భంగా నిజాం కాలేజీ గ్రౌండ్స్‌లో జరిగిన  అతి పెద్ద సమావేశంలో ఈ ప్రత్యేక సంచికని ఆవిష్కరించాం. ఆ తరువాత పిల్లల ప్రత్యేక సంచిక, ప్రపంచీకరణ, చేనేత, వ్యవసాయ సంక్షోభం, దళిత మహిళ, హెచ్‌ఐవి/ఎయిడ్స్‌, రచయిత్రుల ప్రత్యేక సంచిక ఇలా ఎన్నో సమకాలీన సామాజిక అంశాల మీద స్త్రీల దృష్టిికోణంతో ప్రత్యేక సంచికలు వెలువరించాం. వీటన్నింటిని పాఠకులు ఆదరించారు. మమ్మల్ని ముందుకు నడిపారు. ఒక్క సంచిక కూడా మిస్‌ అవ్వకుండా భూమిక వస్తూనే వుంది.
అన్వేషి తర్వాత భూమికకు అండగా నిలిచింది ‘నిర్ణయ’ సంస్థ వ్యవస్థాపకులు ఇందిర జెన. మూడు సంవత్సరాల పాటు నిర్ణయ భూమికను ఆర్థికంగా ఆదుకున్నది. తనకి మన:పూర్వక కృతజ్ఞతలు తెలుపుకోవాలి.
2006లో ఆక్స్‌ఫాం ఆర్థిక సహకారంతో భూమిక హెల్ప్‌లైన్‌ను ప్రారంభించాం. ఈ హెల్ప్‌లైన్‌ను మొదలుపెట్టడానికి  ముఖ్య కారకురాలు గిరిజ. తెలుగు సాహిత్యంలోను, సమాజంలోను భూమిక పత్రిక ఆవిర్భావం ఎంత చారిత్రాత్మకమైన సంఘటనో, సమస్యలనెదుర్కొంటున్న స్త్రీల సహాయార్థం ఒక హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చెయ్యడం అంతే చారిత్రాత్మకమైనది. భూమికను నడుపుతున్న క్రమంలో, ఆ అనుభవంతో స్త్రీలకు ప్రత్యక్షంగా సహకారమందించడం చాలా అవసరమనిపించింది. ప్రభుత్వం నడిపే అరకొర  హెల్ప్‌లైన్‌లు తప్ప అప్పటివరకు స్త్రీలకోసం ఏ సంస్థకూడా హెల్ప్‌లైన్‌ ప్రారంభించలేదు. దీనిద్వారా ఈ అయిదేళ్ళ కాలంలో దాదాపు 12000 మంది మహిళల సమస్యల్ని విన్నాం. వారికి ధైర్యమిచ్చాం. తమ సమస్యలను తామే పరిష్కరించుకునేలా వారికి దిశానిర్దేశం చెయ్యగలిగాం. ముగ్గురు నిపుణులైన కౌన్సిలర్లు ఉదయం నించి రాత్రి వరకు వారి సమస్యలను వింటారు. వారికి సలహా, సమాచారం అందిస్తారు. ఎంతో మంది బాధిత మహిళల్ని హింసాయుత పరిస్థితుల్లోంచి రక్షించిన అనుభవాలు ఎప్పటికీ మర్చిపోలేనివి. ప్రస్తుతం భూమిక హెల్ప్‌లైన్‌ గురించి రాష్ట్రంలోను, దేశంలోనే కాదు అంతర్జాతీయంగా తెలుసు. ఎందరో ఎన్‌ఆర్‌ఐ బాధితులు హెల్ప్‌లైన్‌కు కాల్‌ చేస్తున్నారు. భూమిక హెల్ప్‌లైన్‌ ఈ రోజు బాధిత స్త్రీలకు  స్నేహహస్తంలాగా మారింది. సమస్యల్లో వున్నవారికి ఠక్కున గుర్తొచ్చేది భూమిక హెల్ప్‌లైన్‌ మాత్రమే అని ఈ రోజు సగర్వంగా చెప్పగలను.
హెల్ప్‌లైన్‌ నడుపుతున్న అనుభవంతో మహిళలకు అందుబాటులో వున్న సహాయ సంస్థల వివరాలు, అవి పనిచేస్తున్న తీరుతెన్నులు గురించి తెలుసుకోవాల్సిన అవసరం కన్పించింది. స్త్రీల సహాయార్థం ప్రభుత్వం నడుపుతున్న వసతిగృహాలు, స్వాధార్‌ హోమ్స్‌, హెల్ప్‌లైన్‌ల గురించి ఒక అధ్యయనం చేసి, ఆ రిపోర్ట్‌ని ప్రభుత్వానికి ఇచ్చాం. బాధిత మహిళలకోసం నడుస్తున్న ఈ వసతి గృహాలు ఎంత అధ్వాన్న స్థితిలో వున్నాయో ఈ అధ్యయనం అర్థం చేయించింది.  అలాగే పోలీసువ్యవస్థతో పనిచేయాల్సిన అవసరం, వారికి జండర్‌ స్పృహ కల్గించాల్సిన ఆవశ్యకత ఎంతో వుంది. ఆక్స్‌ఫామ్‌ ఇండియా సహకారంతో నాలుగు మహిళా పోలీస్‌స్టేషన్లలోను, ఉమెన్‌ ప్రొటక్షన్‌ సెల్‌లోను నిపుణులైన కౌన్సిలర్‌లతో సపోర్ట్‌ సెంటర్‌లు ఏర్పాటు అయ్యాయి. అనంతపురం, వరంగల్‌, కరీంనగర్‌లోను, బహీర్‌బాగ్‌లోని మహిళా పోలీస్‌స్టేషనులోను, సిఐడి ఆఫీసులోని వుమెన్‌ ప్రొటెక్షన్‌సెల్‌లోను పూర్తిస్థాయి సపోర్ట్‌ సెంటర్‌లు నడుస్తూ స్త్రీలకు ఎంతో సహాయంగా వున్నాయి. వీటి పర్యవేక్షణ, అక్కడ పనిచేసే కౌన్సిలర్లకి శిక్షణా తరగతులు నిర్వహించడం లాంటి బాధ్యతలను భూమిక నిర్వహిస్తోంది.
అన్నింటికన్నా ముఖ్యమైన కార్యక్రమం న్యాయవ్యవస్థలోకి ప్రవేశించగలగడం. సాధారణంగా కోర్టులన్నా, న్యాయమూర్తులన్నా మనకి ఒకలాంటి భయం, బెదురు వుంటుంది. అందరికీ దూరంగా వుండే న్యాయవ్యవస్థలోకి మేము ప్రవేశించడమేకాక శిక్షణలో వున్న న్యాయమూర్తులకు జండర్‌ అవగాహనపై  శిక్షణనిచ్చాం. హింసలో మగ్గుతున్న  మహిళలకి సత్వర న్యాయం ఎంత అవసరమో ఈ శిక్షణలో చెప్పగలిగాం. అలాగే రక్షక్‌ పోలీసులకి కూడా జండర్‌ ట్రయినింగ్‌ ఇచ్చాం. ఈ కార్యక్రమాలను చేపట్టడం వెనుక ముఖ్య ఉద్దేశ్యం బాధిత మహిళలకి సహాయాన్ని, న్యాయాన్ని అందించాల్సిన సంస్థల్ని, వ్యవస్థల్ని జండర్‌ స్పృహతో పనిచేసేలా, స్పందించేలా చెయ్యడమే.
అలాగే 2006లో అమలులోకి వచ్చిన గృహహింస నిరోధక చట్టాన్ని పకడ్బందీగా , పఠిష్టంగా పనిచేయించడానికి స్త్రీ శిశు అభివృద్ధి శాఖతో కలిసి ఎన్నో సమావేశాలు నిర్వహిచాం.  రక్షణాధికారులంటే ఎవరు? వాళ్ళెక్కడవుంటారు? వాళ్ళ దగ్గర పనిచేస్తున్న కౌన్సిలర్ల పనితీరేమిటి? ఎంతవరకు వీరు బాధిత మహిళలకు అందుబాటులో వుంటున్నారులాంటి అంశాల మీద ఇప్పటివరకు చాలా సమావేశాలు పెట్టాం. అలాగే ఆంధ్రప్రదేశ్‌ లీగల్‌ సర్వీసెస్‌ అధారిటీ వారు అందించే ఉచిత న్యాయం మహిళలకు అందుతోందా? దీనిపట్ల మహిళల్లో అవగాహన వుందా? ఉచిత న్యాయమంటే ఏమిటి? ఎవరు ఎవరికి ఇస్తారు? వీటన్నింటిమీద ఒక అధ్యయనం చేసి ఆ నివేదికను లీగల్‌ సర్వీసెస్‌ అధారిటీకి ఇచ్చాం.  భూమిక ఆఫీసులో లీగల్‌ ఎయిడ్‌  క్లినిక్‌ ప్రారంభించాం.
స్త్రీల అభ్యున్నతికోసం స్త్రీలే నడుపుతున్న స్వచ్ఛంద సంస్థలు మన రాష్ట్రంలో చాలా వున్నాయి.  అయితే వీరంతా గ్రామీణ నేపథ్యంతో ఎక్కువశాతం గ్రామాలలోనే అట్టడుగు స్థాయి స్త్రీలతో పనిచేస్తుంటారు. వీరు ఇంట్లోను, పనిచేసేచోట అనేక సమస్యలను, ఒత్తిళ్ళలను ఎదుర్కొంటుంటారు. వారికోసం సిడబ్ల్యుఎస్‌ సహాకారంతో వారి సామర్థ్యాలను పెంపొందించేలా  రెండు రిలాక్సేషన్‌ వర్క్‌షాప్‌లను నిర్వహించాం.
గత సంవత్సరం నవంబర్‌ సంచికను ప్రత్యేక సంచికగా వేసాం. ఇందులో స్త్రీలు-చట్టాలు, స్త్రీల సహాయార్థం ఏర్పడిన సహాయ సంస్థలు, రక్షణాధికారులు, న్యాయాధికారులు, పోలీసు అధికారులు మొదలైన వారి వివరాలతో పాటు వారి ఫోన్‌ నెంబర్లతో సహ  ఈ సంచికలో  ప్రచురించాం. దీనిని అప్పటి మహిళా శిశు అభివృద్ధి శాఖ డైరెక్టర్‌ ఉషారాణిగారి సహకారంతో ప్రచురించి  పన్నెండు వేల కాపీలు ముద్రించి అంగన్‌వాడి స్థాయి నుంచి జిల్లా కలెక్టర్‌ వరకు ఉచితంగా పంపిణీ చేసాం. ప్రతి అధికారి చేతిలోను ఇదొక రిఫరెన్స్‌ బుక్‌ లాగా వుండాలని, తక్షణం బాధిత స్త్రీలకు సహాయమందించేలా వారికి ఉపకరించాలని మేము భావించాం. ఈ ప్రయత్నాన్ని ఎంతోమంది ప్రశంసించారు. కలెక్టర్లతో సహ ఎందరో  ఉత్తరాలు రాసి ఈ పుస్తకం తమకు చాలా ఉపయోగంగా వుందని చెప్పారు. స్త్రీలకు సంబంధించిన అంశాలపట్ల అందరికీ అవగాహన కల్గించాలనే మా సంకల్పం చాలావరకు నెరవేరిందని మేము సగర్వంగా మా పాఠకులకు తెలియచేస్తున్నాం.
ఇరవై సంవత్సరాలుగా భూమిక పత్రికను నడుపుతున్న అనుభవంలోంచి హెల్ప్‌లైన్‌ ఆవిర్భవించింది. హెల్ప్‌లైన్‌ని విజయవంతంగా నడుపుతున్న క్రమంలోంచి మాకు ఫోన్‌ చేసిన బాధిత మహిళలకు న్యాయం అందించడంకోసం వారికి కావలసిన సపోర్ట్‌ సిస్టమ్స్‌ను సక్రమంగా పనిచేయించాల్సిన బాధ్యతతోనే  మేము పైన పేర్కొన్న కార్యక్రమాలను నిర్వహించాం. స్త్రీల జీవితాలను ప్రభావితం చేసే ప్రతి అంశంమీద మేము స్పందించాం. ఆసిడ్‌ దాడుల మీద, పనిచేసేచోట లైంగికవేధింపులు, లింగనిర్ధారణ పరీక్షలు చేసి ఆడపిండాలను చంపేసే దుర్మార్గం మీద, రాష్ట్ర స్థాయి సమావేశాలు పెట్టాం.  ఐ.పి.సి సెక్షన్‌ 498ఎ మీద రంగారెడ్డి, హైద్రాబాద్‌ జిల్లాల్లో ఒక విస్తృతమైన అధ్యయనం చేసి, 498ఎ దుర్వినియోగం కావడం లేదు చాలా తక్కువగా ఉపయోగించుకోబడుతోంది అని డాక్యుమెంటరీ ఎవిడెన్స్‌తో సహ రుజువు చేసాం.
భూమిక ఇరవై సంవత్సరాల పయనంలో నాతోపాటు ఎందరో నడిచారు. ప్రారంభంలో భూమికతో వున్న వాళ్ళందరూ వెళ్ళిపోయినా ఎందరో కొత్తవాళ్ళు వచ్చి చేరారు.  భూమిక నిర్వహించే సాహితీ యాత్రల్లో, సమావేశాల్లో  భాగస్వాములవు తున్నారు.  ఇరవై ఏళ్ళ భూమిక పట్ల మీ అభిప్రాయం చెప్పండి అని కొందరు సాహితీ మిత్రులకు, పాఠకులకు ఉత్తరం రాసాం. సాహిత్యంలో ఉన్నత శిఖరాలు అధిరోహించిన ప్రముఖులు, వివిధ రంగాలలో లబ్థ్ద ప్రతిష్ఠులైన ఆత్మీయులు రాసిన ఉత్తరాలు చదివాక నాకు హిమాలయాలను అధిరోహించినంత  ఆనందం కలిగింది. నా జీవిత లక్ష్యం నెరవేరినంత సంతృప్తి కలిగింది. తెలుగునాట భూమిక వేసిన ముద్ర, తెలుగు సాహిత్యంలో భూమిక స్థానం గురించి ప్రముఖుల అక్షరాలలో చదివాక నేను ఒక వ్యక్తిగా నా సామాజిక బాధ్యతను నిర్వర్తించగలుగుతున్నానని అనుకుంటున్నాను. భూమిక పట్ల, నా పట్ల ఆదరాన్ని, ఆత్మీయతని, ప్రదర్శించిన వారందరికీ నేను శిరస్సు వంచి  నమస్కరిస్తున్నాను.
నా గుండె లబ్‌డబ్‌మంటూ కొట్టుకున్నంతకాలం నేను  బాధితస్త్రీల పక్షాన పనిచేస్తూనే వుంటాను. ఈ ఇరవై సంవత్సరాల కాలంలో నాతో కలిసి వున్నది ప్రసన్న మాత్రమే. ప్రసన్న జీవితం కూడా నాలాగే భూమికతో ముడిపడి పోయింది. తను లేకుండా భూమికగానీ, నేనుగానీ ఒక్క అడుగు ముందుకేయలేం. తను అంతగా భూమికతో పెనవేసుకుపోయింది. భూమిక సర్క్యులేషన్‌ చూసే లక్ష్మి  గురించి కూడా నేను తప్పక రాయాలి. ఎంతో భిడియంగా ఉద్యోగంలో చేరిన లక్ష్మి ఈ రోజు ఎంతో ధైర్యంగా ప్రభుత్వ ప్రకటనల కోసం ఐఎఎస్‌ అధికారుల్ని ఒప్పిస్తుంది. భూమికలాంటి చిన్న పత్రికలకు మీరు అడ్వర్‌టైజ్‌మెంట్‌ ఇచ్చి తీరాలంటూ వాళ్ళతో వాదిస్తుంది. ప్రకటనలు సంపాదిస్తుంది. భూమిక మనుగడకు ఆమె తెచ్చే ప్రకటనలు చాలా అవసరం. నెలకి ఒకటో రెండో ప్రకటనలు రావడం వల్లనే మేము సకాలంలో పత్రికను తేగలుగుతున్నాం.
ఈ  ప్రయాణంలో మేము ఎదుర్కొన్న సమస్యల చిట్టాను ఇక్కడ నేను రాయలేదు. ఆర్థికంగా భూమికను ఆదుకున్న వారు చాలామంది వున్నారు. వారందరికీ పేరు పేరునా కృతజ్ఞతాభివందనాలు తెలియచేస్తున్నాను. అయితే మనస్సు చివుక్కుమనేట్టు, ముల్లు కసుక్కున గుచ్చుకున్నట్లు ప్రవర్తించిన వారు కూడా వున్నారు. భూమిక కేవలం చందాలు, మిత్రుల విరాళాల మీదే నడుస్తున్నది. ఎంతో కాలంగా భూమికను ఉచితంగా పొందుతూ కూడా చందా కట్టండి,  మేము చాలా కష్టాల్లో వున్నామని అడిగినందుకు చాలా మందికి కోపం వచ్చింది. మమ్మల్ని చందా అడుగుతారా అంటూ కొందరు కళ్ళెర్రచేసారు!!! అది వారి వారి సంస్కార స్థాయిని పట్టిస్తుందంతే !మేము అడగకుండానే భూమిక పట్ల వారికున్న ప్రేమను వ్యక్తం చేస్తూ భారీ విరాళాలు ఇచ్చిన వారున్నారు. ముఖ్యంగా ఢిల్లీలో వుండే జెఎల్‌రెడ్డిగారు రూ. 50,000 చెక్కును అబ్బూరి ఛాయాదేవిగారి ద్వారా మాకు పంపించారు. అలాగే  సత్తిరాజు రాజ్యలక్ష్మిగారు రూ.20,000 విరాళమిచ్చారు. ఈ ప్రత్యేక సంచికను ఇన్ని పేజీలతో తీసుకురావడానికి ధైర్యమిచ్చింది ఈ రెండు చెక్కులే అంటే అతిశయోక్తి కాదు. వారిరువురికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. నాకెంతో మనోధైర్యానిచ్చే అబ్బూరి ఛాయాదేవిగారికి నా కృతజ్ఞతలు. అలాగే నా నేస్తం గీత సర్వకాల సర్వావస్థల్లోను నాతో  వుంటుంది. భూమిక సాహితీయాత్రల్లో తనదే ప్రధాన పాత్ర. తను లేకుండా భూమిక యాత్రలు సాధ్యంకావు. భూమికతో నా ప్రయాణంలో గీత పదిహేను సంవత్సరాలుగా నావెన్నంటి వుంది. ఆమెకి మరింత స్నేహాన్ని తప్ప ఇంకేమి ఇవ్వలేను.
చివరగా, భూమిక నిర్వహిస్తున్న ఎన్నో కార్యక్రమాలు, సమావేశాలు, సాహితీయాత్రలు, నెలనెలా రచయిత్రులతో మీటింగులు- వీటన్నింటి వెనుక భూమిక బృందం కృషి వెలకట్టలేనిది. జయ, ప్రసన్న, లక్ష్మి,శిలాలోలిత, నాగమణి, కల్పన, వెన్నెల, ముజీబా తరన్నుమ్‌- వీళ్ళందరూ నా బలం, నా సైన్యం. నేను చేసే యుద్ధాలను గెలిపించేది వాళ్ళే. నా సంకల్పాలను ఆచరణలోపెట్టేది, ఆవిష్కరించేది వాళ్ళే. మేమందరం కలిసి  మరిన్ని కార్యక్రమాలను స్త్రీల పక్షాన నిర్వహిస్తామని భూమికను మరింత పదునుగా, స్త్రీవాద ఉద్యమ స్ఫూర్తితో ముందుకు నడిపిస్తామని మా కత్యంత ఆత్మీయులైన మీకందరికీ హామీ యిస్తున్నాను.
ఇరవై సంవత్సరాల కాలంలో భూమిక ప్రచురించిన అత్యున్నత ప్రమాణాలున్న రచనలను ఈ ప్రత్యేక సంచికలో పునర్ముద్రించాం. కొత్తతరం పాఠకులకు వీటిని అందుబాటులోకి తేవాలన్న మా సంకల్పాన్ని పాఠకులు అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాం.  ఎప్పటిలాగానే మీరు భూమికను ఆదరించాలని, అండగా వుండాలని కోరుతూ….
Share

Saturday, March 24, 2012

ఇదే నా సరికొత్త ఎజండా




నిన్న రాత్రి నేనో కల కన్నాను

ఆహా ఏమి ఆ కల,ఎంత అద్భుతమైన కల
నువ్వూ నేనూ పక్క పక్కనే నడుస్తున్నాం
చేతిలొ చెయ్యేసి భుజం భుజం కలిపి
ఆకుపచ్చటి పచ్చిక బయిళ్ళ మీద
నేనొక అడుగు ముందుకెయ్య లేదు
నువ్వొక అడుగు ముందుకెయ్యలేదు
సమానంగా అడుగుల లయలో
ఏకబిగిన నడుస్తున్నాం
ఏవేవో అడ్డంకులులు ఎవరెవరివో ఆర్తనాదాలు
సూట్కేసుల్లోంచి బట్టల్ని కుమ్మరించినట్టు
ఆడపిల్లల శవాల దృశ్యాలు
హాయిగా ఆడుకునే పసిపిల్లల మీద
మగమౄగాల దాడులు
చదువుకునే చోట చీడపురుగుల చీదర
ఇంటిబయట ఎంతటి అభద్రతో
ఇంటి నాలుగ్గోడల మధ్య అంతే అభద్రత
నువ్వూ నేనూ చేతిలో చెయ్యేసి
నడుస్తున్నాం కదా
మన మధ్య ఇటీవలి కాలంలో
ఇంత సయోధ్య ఎలా కుదిరిందో
ఇంత ప్రజాస్వామిక వాతావరణం
ఎలా సంభవించిందో
మన మాటల్లోనే దొర్లుతోంది
హింస లేని జీవితమంటే
ఇంటా బయటా ప్రజాస్వామిక సంబంధాలుండాలంటే
అన్నింటా సమాత్వం నెలకొల్పాలంటే
అది నువ్వూ నేనూ కలిసి సాధించాల్సిందే
నన్నొదిలేసి నువ్వెళ్ళిపోయినా
నిన్నొదిలేసి నేనెళ్ళిపోయినా
మనం ఒంటరి దీవులమే అవుతాం
ఎవరికి వారౌ స్వార్ధపరులమే అవుతాం
మనం పక్క పక్కనే నడుస్తూ
ఎన్ని కలలు కంటున్నాం
ఎన్ని కొత్త ఆలోచనలు చెస్తున్నాం
అన్నింటా సమానత్వం అని నేనంటుంటే
నువ్వు సై అనడం
అబ్బో నీ మీద నా కెంత ప్రేమని
నువ్వింత మారాక నాతో సై అన్నాక
అంతా జాంతా నై అనేచోట
నువ్వింత ప్రజాస్వామికంగా మారి
పురుషస్వామ్యం పడగ మీద కొట్టాకా
నిన్ను ప్రాణప్రదంగా ప్రేమించడమే నా పని
ఆడపిల్లలక్కూడా అన్నింటిలో
ఇంటిలో, పొలంలో,ఫ్యాక్టరీలో
ఒక్కటేమిటి స్థిర చర వనరుల్లో
సగభాగమివ్వడడమే
అన్ని రకాల హింసలకు చెల్లు చీటి
అని నువ్వంటుంటే నా చెవుల్ని
నేనే నమ్మలేకపోయాను
నీ  మాటే నా మాట కదా
పద పోదం దండోరా వెయ్యడానికి
నువ్వు నేను కలిసి సంపాదించిన అన్నింటిలోను
అన్ని వనరుల్లో సమాన వాటా
అన్ని రిజిస్ట్రేషన్లల్లో అన్ని లావాదేవీల్లోనూ
మనిద్దరి పేర్లూ ఉండాల్సిందే
ఇదే మన కొత్త నినాదం
ఇదే మన సరికొత్త ఎజండా

తర్పణాలు త్రిశంకు స్వర్గాలు

 తర్పణాలు, త్రిశంకు స్వర్గాలు ............ మా సీతారాంపురం లో మా తాతకి చాలా పొలాలు ఉండేవి. మా తాత, చిన్న తాత ఇద్దరే పొలాలన్నింటిని పంచుకున్నా...