Saturday, August 29, 2009

రావు బాలసరస్వతి గారి 81 వ జన్మదిన వేడుక



నిన్న అంటే 28 న ప్రముఖ లలిత,సినీ సంగీత గాయకురాలు రావు బాలసరస్వతి గారి 81 వ జన్మదిన వేడుకలు సికింద్రాబాద్ లోని తాజ్ త్రీ స్టార్ హోటల్ ల్లో ఉత్సాహంగా,సరదగా జరిగాయి. ఆమెకు ఆత్మీయులైన అతికొద్ది మందినే ఆవిడ ఆహ్వానించారు."నువ్వు రాకపోతే చూడు దొంగా" అంటూ నన్ను ప్రేమగా పిలిచారు.ఆవిడ పాటలంటే ప్రాణం కాబట్టి నేను సంతోషంగానే వెళ్ళేను.నా ఫ్రెండ్ గీత నాతో వచ్చింది. మూర్తి,విజయలక్ష్మి,చైత్ర వంటి గాయకులు వచ్చారు. సురేఖా మూర్తి బాలసరస్వతిగారు గానం చేసిన,అత్యంత ఆదరణ పొందిన "ఆ తొటలోనొకటి ఆరాధానాలయము ఆ ఆలయములోని అందగాడెవరే" పాటని అద్భుతంగా పాడారు.విజయలక్ష్మి దేవదాసు లోని పాటను పాడి వినిపించారు.చైత్ర "ఈ చల్లని రేయి తిరిగి రానేరాదు నీ చక్కని మోము చూడ తనివి తీరదు" పాటని చక్కగా పాడింది. ఆ తర్వాత బాలసరస్వతి గారు కేక్ కట్ చేసి మా అందరి బలవంతం మీద "రెల్లు పూల పానుపుపై జల్లు జల్లు గా ఎవరో చల్లినారమ్మా వెన్నెల చల్లినారమ్మా"పాటని ఆ హోటల్ హాల్లో వెన్నెల్ని కురిపిస్తూ,అత్యంత మాధుర్యంగా పాడారు. ఆ తర్వాత అందరం భోజనాలు చేసాం. 81 సంవత్సరాల వయస్సులో కూడా ఎంతో ఉత్సాహంగా,జోకులు పేలుస్తూ గల నవ్వే ఆమెని చూస్తే ఎంత సంతోషం వేస్తుందో. భూమిక కోసం ఆమెని ఇంటర్వ్యూ చేసినపుడు ఆమె చెప్పిన జోకులకి మా కడుపు చెక్కలయ్యింది.ఆమె ప్రత్యేకత ఏమిటంటే జోకు పేల్చినపుడు ఆమె నవ్వదు మనల్ని తెగ నవ్విస్తుంది. ఇటీవల నేను నందలూరు కధానిలయం వారి ఉత్తమ సంపాదక అవార్డును తిరుపతిలో తీ సుకున్నపుడు ఆ మీటింగ్ లో ప్రత్యక్షమై నాకు గొప్ప సంతోషాన్ని కలిగించారు. తన గానం ద్వారా అనిర్వచనీయమైన,అద్భుతమైన ఆనందాన్ని పంచే బాలసరస్వతిగారు నిండు నూరేళ్ళు హాయిగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ....కొన్ని పోటోలు,వీడియో మీకోసం.

Thursday, August 20, 2009

గర్భసంచుల్ని కోల్పోయిన 100 మంది ఆడవాళ్ళు


నేను ఈ మధ్య ఒక సంస్థ వారు ఏర్పాటు చేసిన ఒక సమావేశానికి హాజరవ్వడం కోసం మెదక్ జిల్లా సదాశివపేట దగ్గర ఒక గ్రామానికి వెళ్ళాను. నేను చెప్పైన సంస్తకు చెందిన ఒక డాక్టర్ ఆ గ్రామంలో హిస్ట్రెక్టమి (గర్భ సంచుల తీసివేత)చేయించుకున్న స్త్రీలతో పని చేస్తున్నారు. ఆ సమావేశానికి దాదాపు 100 మంది మహిళలు హాజరయ్యారు. అందరూ హిస్ట్రెక్టమి చేయించుకున్న వాళ్ళే. తప్పు తప్పు చేయించుకున్న వాళ్ళు కాదు.భయానో నయానో ఒప్పించి ఒక విధంగా బలవంతపు ఆపరేషన్లకి గురిచేయబడినవాళ్ళు. కాన్సర్ వస్తుందని,పిల్లలు పుట్టాక దాని అవరంలేదు అని చెప్పి,ఇంకా రకరకాల కారణాలు చెప్పి వాళ్ళ గర్భసంచుల్ని కోసేసారట. ఒక్కొక్కళ్ళు తమ కధల్ని మాకు వినిపించారు. ఒకామెకి మరీ ఘోరంగా 19 ఏళ్ళకే తీసేసారు. ప్రస్తుతం వాళ్ళందరూ రకరకాల అనారోగ్య సమస్యలతో ఉన్నారు. నేను చెప్పిన డాక్టర్ అవిశ గింజలతో వాళ్ళకి వైద్యం చేస్తున్నారు. నేను వాళ్ళకి పోషకాహారం గురించి చెప్పాను.

Monday, August 10, 2009

తాపీ రాజమ్మ గారి తొలి వర్ధంతి సభ



మొన్న ఆదివారం నేను ఓ అద్భుతమైన సమావేశానికి వెళ్ళేను.ఎక్కడనుకున్నారు?చండ్ర రాజేశ్వరరావ్ ఫౌండేషన్ కి.అక్కడ తాపీ ధర్మారావు గారి కోడలు తాపీ రాజమ్మ గారి తొలి వర్ధంతి జరిగింది.రాజమ్మ గారి కొడుకు,కూతురు ఈ సమావేశం ఏర్పాటు చేసారు. అక్కడ కొండపల్లి కోటేస్వరమ్మ గారిని,వి.హనుమంతరావు గారిని,వేములపల్లి సత్యవతి గారిని,లీలావతి గారిని,సరళా దేవిగారిని,మల్లు స్వరాజ్యం గారినీ కలవడమే కాదు వారితో కలిసి భోజనం చేసాను.ఉద్యమాల కోసం జీవితాలను త్యాగం చేసిన ఎందరో మహానుభావులను ఆ రోజు కలిసాను. తాపీ రాజమ్మ గారి గురించి, వారి జీవితం గురించి ఎన్నో అపురూపమైన విషయాలు విన్నాను. నిజంగా ఆ ఆదివారం నాకు ఎప్పుడూ గుర్తుండిపోయే అనుభవాన్నిచ్చింది.

Friday, August 7, 2009

చేనేతకి చేయూత నిద్దాం






ప్రపంచ చేనేత దినోత్సవం సందర్భంగా ఈ రోజు పీపుల్స్ ప్లాజా నుండి లుంబినీ పార్క్ వరకు చేనేత కోసం నడక కార్యక్రమం జరిగింది. నేను ఈ కార్యక్రమంలో పాల్గొన్నాను."ఈభూమి" లో నేను ఒరవడి పేరుతో కాలం రాస్తున్నను.ఆగస్ట్ నెల సంచిక లో వచ్చిన ఆ వ్యాసం మీ కోసం.

నేను ఇటీవల మా ఊరు సీతారామపురం వెళ్ళాను. నర్సాపురానికి దగ్గరగా ఒక పక్క గోదావరి, మరో పక్క సముద్రం చుట్టి వుండే మా ఊరు వెళ్ళడమంటే నాకెప్పుడూ సంబరమే. సంతోషంగా వెళ్ళిన నేను ఒక విషాద వార్తని వినాల్సివచ్చింది. ఆ వార్త నన్ను నా బాల్యంలోకి తీసుకెళ్ళిపోయింది. అది సూర్యనారాయణ మరణ వార్త. ఆయన వయసు మీద పడే చనిపోయాడు కానీ ఆయనతో వున్న ఒకానొక అనుబంధం గుర్తొచ్చి కళ్ళల్లో నీళ్ళొచ్చాయి. చివరిదశలో దీనాతిదీనంగా, దుర్భర దారిద్య్రంతో వాళ్ళ కుటుంబం చితికిపోయిందని విన్నపుడు నాకు ఈ దేశంలోని కోట్లాది చేనేత కళాకారులు, చేనేత కార్మికులు గుర్తొచ్చారు.
సూర్యనారాయణ చేనేత కళాకారుడు. వాళ్ళ కుటుంబమంతా మగ్గం మీద పనిచేసేవాళ్ళు. మా కుటుంబం మహా పెద్దది. దాదాపు వందమంది సభ్యులున్న ఉమ్మడి కుటుంబం. మా తాత, మామ్మలకి తొమ్మిది మంది సంతానం. వాళ్ళ పిల్లలు, వాళ్ళ పిల్లలు కలిసి మా ఇల్లొక సత్రంలాగా వుండేది. మా కుటుంబానికి కావలసిన బట్టల్లో అధిక భాగం సూర్యనారాయణ కుటుంబం చేతుల్లోంచే వచ్చేవి. చీరలు, లుంగీలు, తువ్వాళ్ళు చేతి రుమాళ్ళులాంటి రోజువారీ దుస్తుల్ని నేసి సూర్యనారాయణ తీసుకొచ్చేవాడు. మా నాన్న, పెదనాన్న, చిన్నాన్నలు ఆ రోజుల్లో పాంట్‌లు వేసుకోవడం నేను చూళ్ళేదు. సూర్యనారాయణ నేసుకొచ్చిన పంచెలు, లుంగీలు మాత్రమే కట్టుకునేవాళ్ళు. చొక్కాలు వేసుకోవడం చాలా తక్కువ. మానాన్న రైతు కాబట్టి పొలానికెళ్ళేపుడు ఏ రోజు చొక్కా వేసుకునేవాడు కాదు. మా అమ్మకి చేనేత చీరలంటే చాలా ఇష్టం. ఆవిడ రకరకాల ఊళ్ళ నుంచి చీరలు తెప్పించేది. బొబ్బిలి, మాధవరం, ఉప్పాడ, వెంకటగిరి - ఈ ఊళ్ళ పేర్లన్ని నేను చేనేత ద్వారానే చిన్నప్పుడే విన్నాను.
బహుశ మా అమ్మ నుంచే నాకు చేనేత చీరల వారసత్వం వచ్చి వుంటుంది. నేను చేనేత తప్ప వేరేదీ కట్టను. నాకు మంగళగిరి, పేటేరు, గుంటూరు, కొయ్యలగూడెం, నారాయణపేట, వెంకటగిరి చీరలంటే చాలా ఇష్టం. ఈ చీరలు కట్టుకుంటే వుంటే హాయిని వర్ణించాలంటే ఇక్కడ సాధ్యం కాదు సరే! మళ్ళీ సూర్యనారాయణ గురించి మాట్లాడాలి. ఆయన ముఖం ఎంతో అమాయకంగా, కోమలంగా వుండేది. బట్టల మూట సైకిల్‌కి కట్టుకుని తెచ్చి మా వీధి అరుగు మీద రంగు రంగుల చీరల్ని, తెల్లటి పంచెల్ని వెదజల్లేవాడు. మేము పిల్లల మూకంతా వాటి చుట్టూ చేరేవాళ్ళం. ఆడపిల్లల కోసం దళసరి, తక్కువ కౌంట్‌లో రంగు రంగుల బట్టముక్కల్ని తెచ్చేవాడు. మాకు వాటితో గౌన్లు కుట్టించేవాళ్ళు. మా కుటుంబానికి కావలసిన బట్టలన్నీ తీసుకుని అతనికావ్వాల్సిన డబ్బులు ఇచ్చేసేవాడు మా తాత. కొన్ని సార్లు అంతా ఇచ్చేవాడు కాదు. సూర్యనారాయణ మళ్ళీ వచ్చినపుడు మిగతాది ఇచ్చేసేవాడు. అలా సూర్యనారాయణతో మాకు ఒక అనుబంధం ఏర్పడిపోయింది. అతని దగ్గర చాలా మంది బట్టలు కొనేవాళ్ళు, నేసినవన్నీ అమ్ముడుపోవడంతో, మళ్ళీ నేయడం, అమ్మడం, ఇలా ఆ కుటుంబానికి కావలసిన పని పుష్కలంగా వుండేది. ఆదాయం కూడా అదే స్థాయిలో వుండేది.
క్రమంగా ఈ చేనేత సంబంధం తెగిపోవడం మొదలై చాలా కాలమే అయ్యింది. సిల్క్‌ బట్టలు వెల్లువెత్తి చేనేతను పక్కకు తోసేసాయి. సిల్క్‌ బట్ట మెయింటెనెన్స్‌ తేలిక కాబట్టి జనం వాటి వేపు మొగ్గడం మొదలైంది. స్వయం పోషకులుగా, తమ హస్తాల్లోంచి వస్త్రాలను రూపొందించే చేనేత కళాకారులు, కార్మికులు క్రమంగా పని కోల్పోవడం, నేసిన వాటిని అమ్ముకోలేక పోవడం, ఆదాయం తగ్గిపోవడం, ఆఖరికి ఆకలి చావులకు, ఆత్మహత్యలకు గురవ్వడం ఈనాటి నగ్నసత్యం. పరమ విషాదం. ప్రభుత్వం ఏదో చేస్తున్నానంటోంది. చేనేత సహకార సంఘాలకి రాజకీయ చీడపట్టి మొదలంటా కుళ్ళిపోయాయి. చేనేత పనివారు పీకలదాకా అప్పుల్లో కూరుకుపోయారు. వారికి ఆ పని తప్ప వేరేది రాదు. పని కల్పిస్తే కుటుంబం మొత్తం కష్టపడి పనిచేసుకుంటారు. అద్భుతమైన వస్త్రాలని అందిస్తారు. వారికి కావలసింది పని. వారు నేసింది అమ్ముడై ఆదాయం రావడం. అంతే పని చెయ్యకుండా పింఛన్‌లిమ్మని, విరాళాలు ఇమ్మని వారు కోరడం లేదు. మేం కష్టించి సృష్టిించే బట్టల్ని కొనండి. మాకు ఆదాయం వస్తుంది. మేం గౌరవ ప్రదంగా బతుకుతాం అనేదే వారి కోరిక.
సూర్యనారాయణ మరణవార్త నాలో రేసిన ఆలోచనలు ఇవి. ఆయనెంత ధైర్యంగా, నిబ్బరంగా వుండేవాడో గుర్తొచ్చి ఆ ధైర్యం వెనుక వున్న బలం ఏమిటో అర్ధమై నేను ఈ కాలమ్‌ ద్వారా ఒక విషయం చెప్పదలిచాను. మనం కూడా చేనేతని ప్రేమిద్దాం. చేనేత వస్త్రాలని కొందాం అనే నిర్ణయం చేసుకోవడంతో పాటు నాది మరో కోరిక వుంది.
మన రాష్ట్రంలో వేలాది ఆలయాలున్నాయి. ప్రతి రోజు లక్షలాది భక్తులు ఈ ఆలయాలను దర్శిస్తుంటారు. ఒక్క తిరుపతికి వచ్చే భక్తులే లక్షలలో వుంటారు. హుండీలో కోట్లాది రూపాయలు సమర్పించుకుంటూ వుంటారు. భక్తజనకోటికి నాదో విన్నపం. గుళ్ళకొచ్చే వాళ్ళంతా చేనేత వస్త్రాలను ధరించి వస్తే... ఊహించుకోవడానికే నాకు పరమానందంగా వుంది.మీ భక్తి రసానికి మానవీయ కోణాన్ని అద్ది చూడండి. కోట్లాది చేనేత పనివారలకి చేతినిండా పని. పనికి తగిన ఆదాయం, కేవలం తిరుపతికి వచ్చే భక్తులు ఒక్క రోజు చేనేత వస్త్రం కట్టి గుళ్ళో కెళ్ళండి. మీకు మానసిక తృప్తితో పాటు, మానవత్వం కూడా పరిమళిస్తుంది. చేనేత పరిశ్రమ మూడు పువ్వులు ఆరుకాయలుగా విరాజిల్లకపోతే నన్నడగండి. మా సూర్యనారాయణకి నేనిచ్చే నివాళి ఇదే. చేనేత జిందాబాద్‌.

Thursday, August 6, 2009

భారతీయ శిక్షాస్మృతి లోని ఆర్టికల్‌ 377- డిల్లీ హైకోర్ట్ జడ్జిమెంట్

భారతీయ శిక్షాస్మృతిలోని ఆర్టికల్‌ 377 కి 149 సంవత్సరాల చరిత్ర వుంది. లార్డ్‌  మెకాలే 1860లో ఈ ఆర్టికల్‌ని ఇండియన్‌ పీనల్‌ కోడ్‌లో చేర్చారు.  ఈ ఆర్టికల్‌ ప్రకారం అసహజ లైంగిక కార్యకలాపాలకు పాల్పడే స్త్రీ పురుషులు పది సంవత్సరాల జైలు శిక్షకి, పెనాల్టీకి గురవుతారు. వారిని శిక్షించడానికి ఈ ఆర్టికల్‌ రూపొందించబడింది.  నూట నలభై సంవత్సరాలుగా  ఈ ఆర్టికల్‌ను ఉపయోగించి హోమోసెక్సువల్స్‌ని నేరస్తులుగా ముద్రవేసి హింసించడం, బ్లాక్‌మెయిల్‌ చెయ్యడం జరుగుతూ వస్తోంది. కేసులు పెట్టడం కాక ఆయా వ్యక్తులను, కుటుంబ సభ్యులను బెదిరించే పనికి పోలీసులు పూనుకోవడంతో హోమోలు భయం భయంగా బతకడం, తీవ్ర మానసిక ఆందోళనకి లోనవ్వడం జరుగుతోంది.
377కి వ్యతిరేకంగాను, ఈ ఆర్టికల్‌కి మొత్తంగా  భారతీయ శిక్షాస్మృతిలోనుంచి తీసెయ్యాలని చాలా కాలంగా నిశ్శబ్ద ఉద్యమం జరుగుతోంది. చివరికి జూలై రెండు 2009 లో ఈ ఉద్యమం బహిరంగంగా రోడ్డెక్కింది. ఆర్టికల్‌ 377 భారత రాజ్యాంగంలోని సమానత్వ భావనకి విరుద్ధమని, చట్టం దృష్టిిలో అందరూ సమానమేనని ఢిల్లీ హైకోర్టు ప్రకటించడంతో వందల సంఖ్యలో హోమోసెక్సువల్స్‌, లెస్బియన్స్‌ ఢిల్లీలోని జంతర్‌ మంతర్‌ వద్ద ఆత్మగౌరవ ర్యాలీ నిర్వహించారు. బెంగుళూరు, ముంబయ్‌, కలకత్తాలో కూడా ఇలాంటి ర్యాలీలు జరిగాయి. మొట్ట మొదటి సారి పెద్ద సంఖ్యలో వీరు ప్రదర్శనల్లో పాల్గొని నినాదాలతో కదం తొక్కారు.
ఢిల్లీ హైకోర్టు వెలువరించిన తీర్పు మీద దేశవ్యాప్తంగా చర్చోపచర్చలు జరుగుతున్నాయి. 377 రద్దుచేయాలని, రద్దు చేయకూడదనే వాదనలు జరుగుతున్నాయి. ఇందులో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే భారతీయ మీడియా (ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌) మొత్తం ఈ తీర్పుకు అనుకూలంగా స్పందించడంతో పాటు మొదటి పేజీల్లో పతాక శీర్షిక కథనాలను ప్రచురించాయి. పాజిటివ్‌ దృష్టిికోణంతో ఆర్టికల్స్‌ ప్రచురిస్తున్నాయి. దీనివల్ల జరిగిన మేలు ఏమిటంటే -ఇంతకాలం-మొదటి దశలో వున్న హెచ్‌ఐవి/ ఎయిడ్స్‌ పట్ల ప్రజల్లో వున్న 'స్టిగ్మా' లాంటిది ఈ అంశంలోనూ మెల్లగా కరగడం మొదలైంది. ఒక ఆరోగ్య కరమైన చర్చకు ఇది తెరతీసింది.
 అయితే మత నాయకులు, సంప్రదాయవాదులు పెద్ద ఎత్తున వ్యతిరేకతను ప్రదర్శిస్తూ ఇది భారతీయ సంస్కృతి కాదని, దీనివల్లరభారతీయ వివాహ, కుటుంబ వ్యవస్థలు నాశనమైపోతాయని గగ్గోలు పెడుతున్నారు. సుప్రీమ్‌ కోర్టులో ఈ తీర్పును నిలిపివేయాలంటూ అప్పీల్‌ కూడా చేసారు. అయితే సుప్రీమ్‌ కోర్టు స్టే ఇవ్వలేదు. ఒక వ్యక్తి హోమోగానో, లెస్బియన్‌గానో వుంటే కుటుంబ వ్యవస్థ ఎందుకు నాశనమౌతుంది? వారి వారి పుట్టుకతో భిన్న లైంగిక ధోరణులను కలిగి వుండే వ్యక్తులు నేరస్థులు ఎలా అవుతారు? వారి భిన్నమైన లైంగికత వల్ల వారు మొత్తంగా నేరం చేసినట్లు 377 కింద కేసులు బుక్‌ చేయడం లేదా చేస్తామని బెదిరించడం ఎంతవరకు న్యాయం అంటూ ఈ రోజున ప్రశ్నలు చెలరేగుతున్నాయి. అంతే కాకుండా భారతీయ కుటుంబాల నాశనం అంటూ జరిగితే అది పురుషుల హింసాయుత ప్రవృత్తులవల్లే జరుగుతుంది. ఇటీవల కాలంలో స్త్రీల పట్ల పెరిగిపోతున్న హింసా ధోరణులు, తాగుడు, కుటుంబ హింస, కట్నం హత్యలు, పిల్లలపై దాడులు వీటిని గురించి మాట్లాడని వారంతా ఇపుడు సంస్కృతి పేరుతో 'గే'ల గురించి మాట్లాడ్డం విడ్డూరంగా వుంది. స్త్రీలపై అమలవుతున్న భయానక హింస భారతీయ సంస్కృతిలో భాగమా? దీన్ని మన  సంస్కృతికి వ్యతిరేకమని వీళ్ళు ఎందుకు  మాట్లాడరు?  భారతీయ సంస్కృతికి, కుటుంబానికి, వివాహ వ్యవస్థకి ముప్పు వాటిల్లబోయేది పురుషుల  ఆధిపత్య, అహంకార, హింసాయుత ధోరణుల వల్లనే  తప్ప తమ మానాన తాము బతికే ''ఎల్‌జిబిటి''ల వల్ల కాదు అనేది స్పష్టం.
ఇటీవల ఒక సర్వే ప్రకారం 10% మంది భిన్న లైంగిక ధోరణులను కలిగివున్నారని, వీరినెవ్వరూ తయారు చెయ్యలేదని, వీరంతా పుట్టుకతోనే, బయలాజికల్‌గా ఈ ధోరణులను కల్గి వున్నారని తెలుస్తోంది. అమ్మాయిలు, అబ్బాయిలు హాస్టల్స్‌లో వుండేటపుడు 'గే' లుగా తయారవుతారని, కౌన్సిలింగుద్వారాను, సైకియాట్రిక్‌ చికిత్స ద్వారాను వీరిని నయం చేయవచ్చుననే వాదన కూడా విన్పిస్తోంది. అయితే గేలుగా బతికే పురుషులు స్త్రీలతో లైంగిక సంబంధాలని ఇష్టపడరని, అలాగే లెస్బియన్‌లుగా బతికే స్త్రీలు పురుష సంపర్కాన్ని  ఒప్పుకోరనేది కూడా విదితమే. సైకియాట్రిక్‌ కౌన్సిలింగుద్వారా  వీరిని నయం చేయవచ్చనే వాదం పై విధంగా వీగిపోతుంది.
ఢిల్లీ హైకోర్టు 377 మీ ఇచ్చిన తీర్పు 'గే' హక్కులపై ఒక విస్పష్టమైన, విస్తృతమైన చర్చకి దారితీయడం సంతోషించాల్సిన  అంశం. ఎందుకంటే ఒక అంశాన్ని కార్పెట్‌ కింద దాచేసినట్లు దాచేస్తే ఆ అంశం ఉనికి లేకుండా పోదు. దాని పట్ల  నిగూఢతను, స్టిగ్మాను కొనసాగించడం కాక బహిరంగంగా ఒక చర్చను లేవనెత్తడం అవసరం. మంచి, చెడ్డలను చర్చించడం అవసరం.
రాజ్యాంగ విరుద్ధమైన ఒక ఐపిసి ఆర్టికల్‌ (377) 149 సంవత్సరాలుగా కొనసాగడం చాలా అన్యాయమైన విషయం.. వ్యక్తి స్వేచ్ఛకు, ఛాయిస్‌కు సంబంధించిన భిన్నమైన లైంగిక జీవన విధానం నేరమని చెబుతూ వారిని హింసించడం అమానుషమే అవుతుంది. ప్రజలు తమ కిష్టమైన, నచ్చిన విధానంలో (ఎదుటి వారికి కష్టం, నష్టం కల్గించకుండా) బతికే తీరును, బతుకుతున్న విధానాన్ని అర్ధం చేసుకోలేకపోతే ఆ సమాజం అభివృద్ధి చెందిందే కాదు.
దీనిమీద చెలరేగుతున్న వాదోపవాదాలను గమనిస్తే. ఢిల్లీ హైకోర్టు జడ్జిమెంట్‌ ఎల్‌జిబిటి (లెస్బియన్‌ , గే, బైసెక్సువల్‌ మరియు ట్రాన్స్‌ జెండర్‌)లుగా జీవనం సాగిస్తున్న వారికి లీగల్‌ సపోర్ట్‌ నిచ్చింది గానీ సామాజిక సమ్మతి చాలా దూరంలో వుందనిపిస్తోంది.

Thursday, July 30, 2009

నిన్న అర్ధరాత్రి మళ్ళీ మా ఇంట్లో బ్రహ్మ కమలం పూసిందోచ్.







నిన్న అర్ధరాత్రి మళ్ళీ మా ఇంట్లో బ్రహ్మ కమలం పూసిందోచ్.
ఇంకో మూడు మొగ్గలున్నాయి.శనివారం రాత్రి గాని ఆదివారం రాత్రి గానీ విచ్చుకోబుతున్నయ్.
ఇంతకు ముందు ఒక రోజు ఐదు ఇంకో రోజు తొమ్మిది బ్రహ్మ కమలాలు పూసాస్ మీ కోసం కొన్ని పాత ఫోటోలు.



Thursday, July 23, 2009

కేవలం ముద్ద సంపెంగపువ్వులు మీ కోసం

ముద్ద సంపెంగ పూలని మీరెవరైనా చూసారా



ముద్ద సంపెంగ పూలని మీరెవరైనా చూసారా?
చూసి ఉండకపోతే ఇవిగో మీ కోసం.
నా ప్రియ నేస్తం గీత
చేతుల్లో ఉంచి నేను తీసిన ఫోటో.
ఎక్కడున్నయి అంటారా.
తిరుపతి కొండ మీద సంపెంగ వనాలున్నాయి కదా!
అక్కడ వెతకండి దొరుకుతాయి.
ఈ పువ్వుల్ని నా నేస్తానికి చూపించడానికే  కొండ మీదికెళ్ళేను కాని నాకేమీ భక్తి వగైరా లేమీ లేవు సుమండి.

Tuesday, July 21, 2009

ఓ సంతోష సందర్భం






మీతో ఒక సంతోషాన్ని పంచుకుందామని ఇది రాస్తున్నాను.
నేను మార్చి నెలలో ఒకటి జూలై నెలలో ఒకటి 2009 లో రెండు అవార్డులు తీసుకున్నను.
ఒకటి ప్రముఖ సామాజిక సేవకురాలు బాదం సరోజా దేవి గారి పేరు మీద వారి భర్త ఏర్పాటు చేసిన "మహిళారత్న"
అవార్డు,రెండోది జూలై 13 న నందలూరు కధా నిలయం వారు
కేతు విశ్వనాధ రెడ్డి గారి పేరు మీద ఏర్పాటు చేసిన"ఉత్తమ సాహిత్య సంపాదకురాలు" అవార్డ్.ఈ అవార్డును తిరుపతిలో ప్రదానం చేసారు.
మీకోసం ఆ రెండు ఫోటోలు అప్ లోడ్ చేసాను.

Thursday, July 9, 2009

హం చలేంగే సాత్ సాత్


చుట్టూ అనంత జలరాశి. నౌక నడుస్తున్న శబ్దంతప్ప మహా నిశ్శబ్దం అలుముకుని వుంది. పున్నమి రేయి. వెండి వెన్నెల బంగాళాఖాతం మీద తెల్లటి కాంతుల్ని పరుస్తోంది. అంత వెన్నెల్లోను ఆకాశం నిండా చుక్కలు.
అవని తదేకంగా మెరుస్తున్న నీళ్ళకేసి చూస్తోంది.
''ఏంటి అంత దీక్షగా చూస్తున్నావ్‌?''
''ఈ రాత్రి ఎంత అందంగా వుంది. మెరుస్తున్న నీళ్ళలోకి దూకాలన్పిస్తోందోయ్‌.''
''అదేం పిచ్చి కోరిక''
''ఇవాళెందుకో పిచ్చి కోరికలు కలుగుతున్నాయ్‌''
''అవనీ''
''ఊ... చెప్పు''
''ఇంకేం కోరికలు కలుగుతున్నాయేం'' అన్నాడు ఆమెని ఆనుకుంటూ.
'' ఈ నిశ్శబ్దపు రేయి, ఈ పండు వెన్నెల, చుట్టూ అపార జలాలు, ఎగిసిపడుతున్న కెరటాలు...''
''అబ్బ! ఏంటోయ్‌ కవిత్వం చెబుతున్నావ్‌?''
''కవిత్వం కాదోయ్‌ గురూ! ప్రకృతి ప్రేమ''
''నామీద ప్రేమ కలగడం లేదా?''
''అదేం పిచ్చి ప్రశ్న. నీ మీద ప్రేమ ఇపుడు కొత్తగా కలగడమేమిటి? ప్రేమ లేకుండానే నీతో ఇలా వచ్చానా? నిన్ను పెళ్ళిచేసుకున్నానా?''
''మరి నా మీద ప్రేమ వ్యక్తం చెయ్యవేం''
''నా మనస్సంతా నీ ప్రేమతో పొంగిపొర్లుతుండడం వల్లనే కదా! ప్రకృతి అంత రమణీయంగా వుంది.''
''ప్రేమలేని వాళ్ళకి ప్రకృతి అందంగా కనబడదా?''
''ఆ విషయం నాకు తెలియదు గానీ నీ దృష్టిలో ప్రేమంటే ఏమిటి?''
''ప్రేమంటే... ఐ లవ్‌ యూ అని చెప్పడమే కదా''.
''అంతేనా''
''నువ్వు అందంగా వుంటావ్‌. అందుకేగా నిన్ను ప్రేమించాను''
''అందంగా వున్నందుకే నన్ను ప్రేమించావా?''
''అంతే కదా! అది వేరే చెప్పాలా? ఈ కళ్ళిష్టం ఈ పెదవులిష్టం. ఈ ముక్కు ఇష్టం. తెల్లగా మెరుస్తున్న ఈ శరీరమంతా ఇష్టం నాకు.''
''ఇంకా... ఇంకేమిష్టం''
''నీలో వున్నవన్నీ నా కిష్టమే''
''నాలో వున్నవన్నీ అంటే...''
''చెప్పాను కదోయ్‌. ఎన్ని సార్లు చెప్పించుకుంటావ్‌?''
''ఇంకా ఏదో మిగిలి పోయిందని పిస్తోంది. నా శరీరంలోని అవయవాలన్నీ ఇష్టమని చెప్పావ్‌ గానీ, నా మనసు, ఆలోచనలు, ఆశ యాలు వీటి గురించి ఏమీ మాట్లాడలేదే!
''నీ మనస్సు నాదేగా! నా మీద కాక నీకు వేరే ఆలో చనలు, ఆశలు ఏముంటాయ్‌?''
''నా మనస్సు నీదెలా అవుతంది గురూ''
''అదేంటి?''
''ఎందుకలా ఆశ్చర్యపోతావ్‌. నా మనస్సు నాదే. నీ మనస్సు నీదే. నా ఆలోచనలు, ఆశయాలు నావే. నీవెలా అవుతాయోయ్‌.''
''ఒకరి హృదయాన్ని ఇంకొకరం ఇచ్చిపుచ్చుకోవడమేగా ప్రేమంటే''
''నా ఉద్దేశ్యంలో ప్రేమంటే అది కాదు. మనస్సును ఇచ్చిపుచ్చుకోవడం అంటే ఒకరికి ఇంకొకరం ఫోటో స్టాట్‌ కాపీలంగా మారడం కాదు''.
''మరి''
''అరె. చూడు చూడు ఆకాశం నుంచి తెగిపడిన చుక్క మనవేపే వస్తోంది''. దోసిళ్ళు పట్టింది.
''ఏదీ చూడనీయ్‌'' అంటూ అవని దోసిల్లోకి వంగాడు. తన దోసిట్లో ముఖాన్నుంచిన గురూని గుండెకి హత్తుకుంది అవని.
''లెటజ్‌ ఎంజాయ్‌ దిస్‌ వండర్‌ఫుల్‌ నైట్‌''.
''ఎంజాయ్‌ చేస్తున్నాంగా. ఇంతకంటే ఏం కావాలి?''
''చాలా చాలా కావాలన్పిస్తోంది. నువ్వేమో కబుర్లు మాత్రమే చెబుతున్నావ్‌''.
''కబుర్లు చెప్పొద్దంటే మానేస్తా. ఇంతటి హాయైనవేళ మనిద్దరికి సంబంధించిన విషయాలు మాట్లాడుకోక పోతే ఎలాగోయ్‌''
''ఇన్ని విషయాలు మాట్లాడుతున్నావ్‌. అసలు సంగతిలోకి రావేంటి?''
''అసలు సంగతా ఏంటది?''
''నీకు తెలియదా? ఆకాశపందిరి కింద, చుక్కల తోరణాల మధ్య, లక్ష నియోన్‌ లైట్లకి సమానంగా వెల్గుతున్న చంద్రుడి సాక్షిగా....''
''వాహ్‌! క్యాగజల్‌ హై.... చెప్పు.... చెప్పు''.
''నిన్నిపుడు ముద్దుపెట్టుకోవాల నుంది''.
''పెట్టుకో. నాకూ నిన్ను ముద్దు పెట్టుకోవాలన్పిస్తోంది.''
గురూని దగ్గరికి లాక్కుని గాఢంగా ముద్దుపెట్టింది. కెరటాల సంగీతంలో వాళ్ళిద్దరి ఉచ్ఛ్వాస నిశ్వాసాలు కలగలిసి పోయాయి. చంద్రుడు ఓ క్షణం సేపు మబ్బుల్లో దాక్కున్నాడు.
'గురూ'
''ఊ... ఇపుడేమీ మాట్లాడకు''
''నాకు చాలా చాలా మాట్లాడాల న్పిస్తోంది''
గురు వెల్లికిలా పడుకుని ఆకాశంకేసి చూస్తున్నాడు.
అవని అతని గుండెమీద తలానించి తనూ వెల్లికిలా పడుకుంది.
''మనం తొందరలోనే మన సహజీవ నం మొదలెట్టబోతున్నాం. దాని గురించి ప్లాన్‌ చేద్దామా గురూ!''
''దాంట్లో అంత ప్లానింగు అవసరమేముంది, అందరూ చేస్తున్నదేగా?''
''మనం భిన్నంగా ప్లాన్‌ చేద్దామోయ్‌. ఇంతకు ముందుకూడా మాట్లాడుకున్నాం కదా!''
''అవనీ! ప్లీజ్‌ ఇంత చక్కనివేళ సంసారం గోలా''
''సంసారం గోలా? అదేంటి గురూ! అంత మాటన్నావ్‌?''
''నా ఉద్దేశ్యం అది కాదు అవనీ''
''మా నాన్న సంసారం సాగరం అనేవాడు. మా అన్న మా వదినతో నీతో సంసారం నరకం అనేవాడు. ఈ సాగరాలు, నరకాలు చూసి భయపడే నేను పెళ్ళి చేసుకోకూడదనుకున్నాను. నువ్వు కూడా.....''
''ఛ.... ఛ.... అదికాదు, ఇంత రమ్యమైన చోట ఎంజాయ్‌ చెయ్యకుండా అవన్నీ ఇపుడే మాట్లాడుకోవాలా? అనే నా ఉద్దేశ్యం, అంతేనోయ్‌.''
''మన సహజీవనానికి సంబంధించిన విషయాలేగా ఇవి కూడా.మనం తల్చుకుంటే ప్రతిరోజు రమ్యంగానే ఉంచుకోవచ్చు''.
''నిజమే. అవనీ! అవన్నీ మాట్లాడు కుంటేనే బావుంటుంది. అయామ్‌ సారీ''
''సారీలెందుకు లేవోయ్‌. అది సరే గాని. మన పురోహితులు చదివే మంత్రాలు నీకేమైనా అర్థమయ్యాయా?''
''వాటె జోక్‌ యార్‌. అవన్నీ సంస్కృతం. మనకు తెలుగే సరిగ్గా రాదు.'' గట్టిగా నవ్వాడు.
''కదా! మరెందుకవన్నీ చదువుతారో నాకూ అర్థంకాదు. ఆ మంత్రాల సంగతి వదిలేద్దాం గానీ నీ లైఫ్‌ పార్టనర్‌గా నానుంచి ఏమాశిస్తున్నావ్‌?''
''నాకిష్టమైనట్టు నువ్వుండడం''
''నీకేమిష్టమసలు?''
''నన్ను ప్రేమించాలి. నాకేది నచ్చుతుందో నీకూ అదేనచ్చితే బావుంటుంది నాకు''.
''అదెలా. నీకు బంగాళాదుంపంటే బోలెడిష్టం. నాకు అది పడదు. నాకు కాకరకాయ ఇష్టం. నీకు ఎక్కదు''.
''అబ్బ! అదో పెద్ద సమస్యా ఏంటి?''
''ఉదాహరణ చెప్పాను లేవోయ్‌''
''నువ్వెప్పుడూ నాతోనే వుండాలన్పిస్తుంది''
''ఇరవై నాలుగ్గంటలూ నీతోనే వుంటే నా ఉద్యోగం, నాఫ్రెండ్స్‌, నా స్పేస్‌ ఏమవ్వాలి?''
''అంటే నీకు నాతో వుండడం బావుండదా?''
''దివ్యంగా వుంటుంది. అలాగని నాకు వేరే ప్రపంచం లేకుండా పోదుగా''.
''ఎందుకుండదు? ఎవరి ప్రపంచం వాళ్ళకుండాల్సిందే. సరే నానుంచి నువ్వేం ఆశిస్తున్నావో చెప్పవా మరి''
''చెబితే కోపమొస్తుందేమో నీకు''
''కోపమెందుకు చెప్పు. నువ్వేం చెప్పినా వినడానికి రెడీ''
''మీ అమ్మలాగా, మా అమ్మలాగా వుండాలని నాకు లేదు''.
''అంటే...''
''నాకు కొన్ని ఆశలు, అభిరుచులు వున్నాయి. నీకు నచ్చకపోతే వాటిని నేనెందుకు వదిలేసుకోవాలి? పెళ్ళయితే ఆడవాళ్లు అన్ని అభిరుచులూ వదలిలేసు కోవాలని మనవాళ్లు బోధిస్తారు కదా!''
''నేను నిన్ను ఏమీ మానేయమనలేదే. నీ ఇష్టం నీది. నేనెందుకు అడ్డుకుంటాను''.
''నువ్వడ్డుకున్నా నేను లెక్కచేయను అని ఈరోజు నీతో చెప్పాలనుకుంటున్నాను. నన్ను కేవలం ఓ ఆడదానిగా కాక మనిషిగా. నీలాగే రక్తమాంసాలు, ఆత్మగౌరవం వున్న తోటి మనిషిగా అంగీకరించి, అర్థం చేసు కోవాలని నేను కోరుకుంటున్నాను. ఎందు కంటే నేను చూసిన సంసారాల్లో మగవాళ్ళు ఎంతెంత అహంకారంతో ప్రవర్తిస్తారో చాలా మందిని చూసాను. నువ్వలా ప్రవర్తించిన మరుక్షణం నీకూ నాకూ ఏమీ మిగలదు''.
''అలా మాట్లాడకు అవనీ. పెద్దవాళ్ళు మన సంప్రదాయం ప్రకారమే కదా మనకు చెబుతారు''
''అంటే అవన్నీ నీకు ఆమోదమేనా?''
''నా ఇష్టాయిష్టాలతో ఏమవుతుంది? మనం వీటికి వ్యతిరేకంగా వెళితే మన అమ్మలూరుకోరు కదా!''
 ''నాకు నీ సంగతి కావాలి?''
''వాళ్ళు చెప్పింది కూడా వినాలి కదా!''
''తప్పకుండా వినాలి. కానీ మన వ్యక్తిత్వానికి, జీవన విధానానికి సంబంధించిన నిర్ణయాలు మనమేగా చేసుకోవాలి. మన అమ్మల జీవన విధానానికి, మన జీవన విధానానికి చాలా తేడా వుంది. ఒప్పుకుంటావ్‌ కదా!''
''ఎందుకు ఒప్పుకోను? నువ్వు నాలాగే ఇంజనీరింగు చదివావ్‌. నా స్థాయి ఉద్యోగం చేస్తున్నావ్‌. అందుకే కదా ఇంత లెక్చరిస్తున్నావ్‌. పండు వెన్నెల్ని బంగాళా ఖాతం పాలు చేస్తున్నావ్‌''.
''లెక్చరిస్తున్నానంటావా? వెన్నెల మనమీదేగా కురుస్తోంది. ఇపుడు మనకొచ్చిన లోటేమిటోయ్‌''
''లోటు కాదా మరి. పిల్లలొద్దంటూ కండిషన్లు పెట్టడం''
''ఇపుడే పిల్లలొద్దని ముందే అనుకున్నాం కదా!''
''ఏమో! పిల్లలొద్దనుకున్నాం గానీ ఇలాగా.... మా అమ్మకి ఇంకా చెప్పలేదు''.
''ఏ విషయం...''
''పిల్లల విషయం''
''ఇది మన స్వంత విషయం. మనిద్దరి వెసులుబాటుకి సంబంధించింది. వాళ్ళకు చెబుతాం గానీ వాళ్ళ ఆమోదం కోసం మాత్రం కాదు కదా!''
''మా అమ్మ చాలా బాధపడు తుంది''
''అయితే నా కెరీర్‌ విషయం నీకు బాధకల్గించదా?''
''అదేం మాట. పెద్దవాళ్ళ బాధపడతా రంటున్నాను అంతే''
''మనకు ఖచ్చితమైన అభిప్రాయం వుంటే వాళ్ళకి సర్దిచెప్పడం కష్టం కాదు.
''నువ్వన్నది నిజమే. సాధారణంగా మగవాళ్ళ, నాతో సహ ఏదీ మీదేసుకోకుండా పెద్దవాళ్ళ మీద తోసేస్తారు. కొత్తగా ఆలోచించడానికి బద్ధకం. అమ్మల వెనక దాక్కుంటే సరిపోతుందనుకుంటాం''.
''గురూ! మనం కొత్తదారిలో నడుద్దాం. అలాగని పెద్దవాళ్ళని అస్సలు పట్టించుకోవద్దని కాదు. చూడు చూడు మళ్ళీ తెగిన నక్షత్రం మనవేపే వస్తోంది. దోసిళ్లు పట్టు''.
''నక్షత్ర శకలాలు మెరుస్తూ... నీకోసమే చూడు ''దోసిలి అవని ముఖానికి దగ్గరగా తెచ్చాడు''. నీ కోసం ఓ పాట పాడతా వింటావా?''
''వింటావా? ఏంటోయ్‌. నీపాట వినేకదా నీ ప్రేమలో పడ్డాను''.
''అవును కదా! మన కల్చరల్‌ ప్రోగ్రామ్‌ జిందాబాద్‌''
''ఈ నిశ్శబ్దంలో, పండు వెన్నెల్లో నీ పాట వినడం గొప్ప అనుభూతోయ్‌'' అంది అవని గురుని చుట్టేస్తూ.
''అవనీ! మర్చిపోయాను. మా అమ్మ ఏమందో తెలుసా?''
''ఏ విషయం''.
''నేను నా ఫ్లాట్‌ అద్దె కిచ్చే విషయం. నువ్వేంటిరా ఆవనింటికి వెళ్ళడం. అవనియే మనింటికి రావాలి అంది. నేను అమ్మకి అంత వివరించి చెప్పానులే. మనిద్దరం ఎందుకలా నిర్ణయించుకున్నామో కూడా చెప్పాను, ఒ.కే అంది''
''యు ఆర్‌ ఏ గుడ్‌ గై. మనం స్పష్టంగా, దృఢంగా చెపితే తప్పక అర్థం చేసుకుంటారు. మా అమ్మకూడా ముందు గొడవ చేసింది కదా! మన పెళ్ళి విషయంలో''.
''ఆ విషయం ఎలా మర్చిపోతాను. కులాలు వేరని, ప్రాంతాలు వేరని అమ్మో! ఎన్ని గొడవలు చేసారు''.
''అన్నీ దాటేసాంలే. వెన్నెలవేళ సంసారం ముచ్చట్లు విసుగొచ్చాయి కదూ''
''అలా ఏంలేదు. నిజానికి మన జనరేషన్‌ కపుల్స్‌ ఇవన్నీ తప్పని సరిగా మాట్లాడుకోవాలి. మనం అమ్మ నాన్నల్లాగా ఉండలేం కదా! మన సమస్యలు, సవాళ్ళు వేరు. మనకు టైమ్‌ దొరకడమే కష్టం. ఇప్పుడు మాట్లాడుకోవడం, మనస్సులు విప్పుకోవడం అవసరం''
''గురూ! మనం కొత్తతరం ప్రతినిధులం. మన జీవనశైలి మరింత కొత్తగా, మనకు అనుగుణంగా మనమే మలుచుకోవాలి. పోర్ట్‌బ్లెయిర్‌ కనిపిస్తోంది''.
''అవును. మనం మరో అరగంటలో పోర్ట్‌బ్లెయిర్‌ వెళ్ళిపోతాం''
ఇద్దరూ డెక్‌ మీంచి కిందికి దిగు తుండగానే నౌక పోర్ట్‌బ్లెయిర్‌లో ఆగింది.
 ??????
రెండేళ్ళ తర్వాత
???
''గురూ! మనం రెండేళ్ళ క్రితం అండమాన్‌ అఖండ జలరాశి మీద, పండు వెన్నెల్లో ఎన్నో బాసలు చేసుకున్నాం. ఇప్పుడు ఈ కాశ్మీర మంచు శిఖరాల మీద మళ్ళీ వాటిని మననం చేసుకుంటున్నాం''.
కాశ్మీర్‌లోని గుల్‌మార్గ్‌లో విపరీతంగా మంచు కురుస్తున్న వేళ ఓ హోటల్‌ రూమ్‌లోంచి కురుస్తున్న మంచును చూస్తూ నిలబడి వున్నారు. రూమ్‌లో హీటర్‌ వున్నా విపరీతంగా చలిగా వుంది. ఒకరి వొంటి వెచ్చదనాన్ని మరొకరు ఆస్వాదిస్తూ రెండేళ్ళ నాటి కబుర్లను తవ్విపోసుకుంటున్నారు.
''అవనీ! నిజం చెప్పనా? ఆ రోజు నువ్వు మాట్లాడుతుంటే చాలా విసుగొచ్చింది నాకు. హాయిగా హానీమూన్‌ కొచ్చి ఎంజాయ్‌ చెయ్యకుండా ఈ కబుర్లేమిటిరా అని కూడా అనుకున్నాను.
''విసుగొచ్చిందన్నమాట. బాగా తిట్టుకుని వుంటావ్‌''
''ఒప్పుకుంటున్నాను కదా! కానీ ఆ రోజు మనం అంత వివరంగా చర్చించుకోక పోయివుంటే ఆ తర్వాత చాలా గొడవలయ్యేవి. ముఖ్యంగా మా అమ్మతో. సరేగానీ రెండేళ్ళయ్యాక కదా! పిల్లల్ని కనేద్దామా?''
''ఇంక అడ్డేముంది. నా ప్రాజెక్ట్‌ పూర్తయిందిగా. వి. విల్‌ ప్లానిట్‌''.
''మల్లె మొగ్గలు ఆకాశంలోంచి రాలుతున్నట్లు మంచు ఎలా కురుస్తోందో చూడు. ఇంత చలిలో కూడా నువ్వింత వెచ్చగా వున్నావేంటోయ్‌''
''రగ్గులు పెట్టమంటే, బయలు దేరేటపుడు అదేగా అన్నావ్‌. నువ్వుంటే చలేంటని. మర్చిపోయావా బుద్ధూ!! మీ నాన్నకి నువ్వు వంట చేస్తే ఎందుకంత బాధ. నేను నిన్ను కొంగుకి కట్టేసుకున్నానని మా మావయ్యతో అన్నాడంట''.
''నిజమే కదా! నన్ను కొంగుకు కట్టుకున్నావో కొప్పులో ముడేసుకున్నావో నీకు తెలియదా''.
''అంటే....''
''ఛ.... ఊరికే.... సరదాకి అన్నా. నువ్వు ఎవరికీ లొంగవని. ఎవరిని లొంగదీసుకోవని పాపం! ఆయనకు తెలియదు కదా! సంసారమంటే సహజీవన మని, ఇద్దరూ అన్నింటిని సమంగా పంచుకోవడమని ఆయన అర్థం చేసుకోవ డానికి చాలా సమయం పడుతుందిలే''
''నిన్ను నా ఫ్లాట్‌కి రమ్మన్నానని మా అమ్మ నన్నెంత తిట్టిందో తెలుసుగా. అదేంటే. అల్లుడు గారింటికి నువ్వెళ్ళాలి. ఎంత సంపాదిస్తే మాత్రం ఇలాగా ప్రవర్తించేది అంటూ చివాట్లేసింది''.
''మనం వాళ్ళని తప్పు పట్టలేం. వాళ్ళు బతికిన పరిస్థితుల్లోంచి వాళ్ళు మాట్లాడతారు. మారాల్సింది మనమే. మన పరిస్థితులు వేరు. వాళ్లు బతికిన తీరు లేరు''.
''గురూ! నీ ఆలోచనల్లోని స్పష్టత చూస్తుంటే ముచ్చటేస్తోందోయ్‌. మనం మన ఫ్రెండ్సందరినీ చూస్తున్నాం. వాళ్ళ సంసా రాలు ఎలా వున్నాయో చూస్తున్నాం. చిన్న చిన్న విషయాల్లో సైతం సర్దుకోలేక ఎలా గొడవలు పడుతున్నారో మనకు తెలుసు. నీ ఫ్రెండ్‌ రమణ ఏంటి అలా తయారయ్యాడు''.
''రమణొక్కడే కాదు. మా చుట్టాల్లో చాలా మందిని చూస్తున్నాను. మా మేనత్తని మా మావయ్య ఎంత ఘోరంగా హింసిస్తాడో నాకు తెలుసు. అయితే ఓ కాలేజీకి ప్రిన్సిపాల్‌గా వుంటూ, సంపాదిస్తూ కూడా ఆవిడ ఎందుకు భరిస్తుందో నాకు అర్థం కాదు''.
''అదే నాకూ అర్థం కాదు. అంత ఆత్మగౌరవం లేకుండా ఎలా బతుకుతారా అన్పిస్తుంది. నా ఫ్రెండ్‌ అనిత తెలుసు కదా! ఒక హెల్ప్‌లైన్‌లో కౌన్సిలర్‌గా పనిచేస్తోంది. వాళ్ళ హెల్ప్‌లైన్‌కి ఎలాంటి కేసులు వస్తాయో, ఈ జనరేషన్‌ వాళ్ళు ఎంత అసహనంతో ప్రవర్తిస్తారో కథలు కథలుగా చెబుతుంటుంది''
''అవునా. మా రమణగాడి వైఫ్‌కి ఆ హెల్ప్‌లైన్‌ నెంబరు ఇస్తే సరిపోతుందిగా. వాడి తిక్కకుదర్చాల్సిందే''
''ఇచ్చానోయ్‌! అనితతో మాట్లాడింది కూడా. అనిత ఎపుడూ ఓ మాటంటుంది. ఈ కాలం మగవాళ్ళకి పెళ్ళాం అందంగా వుండాలి, బాగా చదువుకోవాలి, మంచి ఉద్యోగం చెయ్యాలి మోడరన్‌గా కనబడాలి అదే సమయంలో వాళ్ళ అమ్మలాగా, అమ్మమ్మలాగా ఒదిగి, అణిగి చాకిరీ చేస్తూండాలి. అబ్బాయిలు సర్వసాధార ణంగా ఇలాగే ఆలోచిస్తారు అంటుంది''.
''అనిత అన్న దాంట్లో అతిశయోక్తి ఏంలేదు. నాకు తెలుసుగా నా ఫ్రెెండ్స్‌ సర్కిల్‌ ఆలోచనలెలా వుంటాయో! రిడిక్యు లస్‌. బహుశ నీ పరిచయం లేకపోతే నేనూ అంతే సంకుచితంగా ఆలోచించే వాడినేమో! నిజానికి నీ సాహచర్యంలో నేను చాలా సంస్కారాన్ని సంపాదించుకున్నాను. ఈ దేశంలోని మగవాళ్ళకు వాళ్ళ తండ్రుల ఆస్తితో పాటు అహంకారం కూడా వారసత్వంగా సంక్రమిస్తుంది. నాకలాంటి వారసత్వం వొద్దు అవనీ!''
''అందుకే గురూ! నీ మీద నాకు ఎనలేని ప్రేమ. నీ సంస్కారం, నీ ఆలోచన ల్లోని విశాలత్వం నాకెంతో ఇష్టం''
''అవనీ! నువ్వెపుడూ అంటూంటావే ఓ వాక్యం. అదంటే నాకు చాలా ఇష్టం. ప్రేమలో స్నేహం వుండాలి అంటే నాకు అర్థం కాలేదు మొదట్లో. అవును. ప్రేమలో ఇరుకు వుండకూడదు. స్నేహం వుండి తీరాలి. నేను అహంకారంతో ప్రవర్తించి, నిన్ను కట్టడి చేసి, హింసిస్తే నీ దృష్టిలో నేను అథఃపాతాళానికి జారిపోతాను. అపుడు మన మధ్య ప్రేమేంటి నా ముఖం''
''ఈ విషయాన్ని మగవాళ్ళు ఎందుకు అర్థం చేసుకోలేరో కదా! పెళ్ళయిన క్షణం నుండి పెళ్ళాన్ని అదుపు ఆజ్ఞల్లో పెట్టాలనే ఆలోచన స్థానంలో ఇద్దరం ప్రేమగా, స్నేహంగా అన్నీ పంచుకుందాం, పెళ్ళినాడు చేసిన ప్రమాణాలు అవేకదా అని ఎందుకనుకోరు?''
''వాళ్ళకు నీలాంటి పెళ్ళాం లేదుగా'' నవ్వాడు గురు.
''అది సరేగాని నాకో ఐడియా వుంది చెప్పమంటావా''
''చెప్పవోయ్‌''
''మన ఫ్రెండ్స్‌లో చాలా మంది పెళ్ళిళ్ళాయ్యాక చాలా ప్రాబ్లమ్స్‌ ఎదుర్కొంటు న్నారు కదా. అందరూ బాగా చదువుకుని సంపాదిస్తున్న వాళ్ళే. డబ్బుకి కొదవలేదు. కొరవడింది మనశ్శాంతి''.
''నిజమే కానీ మనమేం చెయ్యగలం?''
''చాలా చెయ్యొచ్చు. మనింటి తలుపులు అందరికోసం బార్లా తెరిచేద్దాం. పూనాలో ఓ జంట గురించి చదివినపుడు నాకు చాలా ముచ్చటేసింది. వాళ్ళు మనలాగే ఓ ఆదర్శవంతమైన జీవితాన్ని సాధించు కున్నారు. సమస్యల్లో వున్న వాళ్ళెవరైనా వాళ్ళింటికెళ్ళిపోవచ్చు. వాళ్ళతో కలిసి వుండొచ్చు. తమ కష్టాలను, సమస్యల్ని పంచుకోవచ్చు. ఇంకో అద్భుతమైన విషయమేమిటంటే వాళ్ళు వాళ్ళింటి తాళం బయట గూట్లోనే వదిలేసి వెళ్ళిపోతారట.
ఎవరైనా ఫోన్‌ చేసి మీ యింట ికొస్తున్నామంటే, తాళం ఫలానా చోట వుంది తీసుకుని లోపలికెళ్ళండి. మేం సాయంత్రమో, రేపో వస్తామని చెబుతారట. గురూ! నాకు కూడా అలాంటిది ప్లాన్‌ చెయ్యాలని వుంది. మనం ఎంత హాయిగా వున్నామో, దాన్ని ఎలా సాధించుకున్నామో ప్రత్యక్షంగా చూపిద్దామోయ్‌''
అవని వేపు అలాగే చూస్తుండి పోయాడు గురు. స్వచ్ఛంగా మెరుస్తున్న కళ్ళమీద ముద్దు పెట్టి
''వండర్‌ఫుల్‌ ఐడియా! యు ఆర్‌ సో డిఫరెంట్‌. ఐ లవ్‌ యూ'' అంటూ అవనిని ఉక్కిరి బిక్కిరి చేసాడు.
''మనం ఒకసారి పూనా వెళ్ళొచ్చి వాళ్ళతో మాట్లాడాక వచ్చే న్యూ యియర్‌ నుంచే మన ప్రాజెక్ట్‌ మొదలు పెట్టేద్దాం''.
''మన సంతోషాన్ని అందరికీ పంచుతానంటే నేనొద్దంటానా''
''దీనికి ఓ మంచి పేరు పెట్టాలి ఏమని పెడదాం''
''పేరా? ఉండు. నాకేదో గొప్ప ఆలోచన వచ్చేస్తోంది. నీ ఫేవరేట్‌ వాక్యం. ప్రేమంటే స్నేహం. స్నేహముంటేనే ప్రేమ వికసిస్తుంది. ఎలా వుంది?''
''బావుంది. ఇంకొంచం ఆలోచించ వోయ్‌ గురుదేవా?''
''ఉండు శిష్యా. కాస్త ఆలోచించు కోనీ''
''సరే ఆ విషయం ఆలోచిద్దాం లే గురూ! నాకు నిజంగా ఈ రోజు ఎంతో సంతోషంగా వుంది''.
''అవనీ. నాకు సంతోషంగా... చాలా సంతోషంగా వుంది. మొగుడూ పెళ్ళాలు స్నేహంగా వుంటే, అన్నీ పంచుకుంటే ఎంత బావుంటుందో అర్థమౌతోంది. సహజీవనం అంటే ఇలాగే వుండాలి అని చాలా బలంగా అందరికీ చెప్పాలన్పిస్తోంది''.
''మనం ఆ పనేగా చెయ్యబోతున్నాం. మంచులోకి వెళదామా గురూ''
''సరంజామా అంతా వుందిగా. పద పోదాం''
కోట్లూ, బూట్లూ తగిలించుకుని జోరుగా కురుస్తున్న మంచులోకి నడిచారిద్దరూ. మంచుపూల వానలో తడుస్తూ, స్వచ్ఛమైన ఆలోచనల్ని, సంస్కార వంతమైన ఆచరణని స్వప్నిస్తూ వాళ్ళిద్దరూ ఒకరి చేతిలో ఇంకొకరు చెయ్యేసి అలా మంచుమీద నడుస్తూ ముందుకెళ్ళసాగారు. ప్రేమలో స్నేహాన్ని సాధించిన వాళ్ళిద్దరూ రేపటితరం ఆకాంక్షల్లా అన్పిస్తున్నా

Wednesday, July 8, 2009

నిరంతరాన్వేషి, నిత్య చలనశీలి - కమలాదాస్

నేను డిగ్రీ పూర్తి చేసి నాకొక ఉనికిని, అస్తిత్వాన్ని వెతుక్కుంటూ
హైదరాబాద్ చేరిన తొలిరోజులు. చదువుకున్నది తెలుగు మాధ్యమంలోనే అయినా మా
హిస్టరీ లెక్చరర్ నాకు ఆంగ్ల సాహిత్యం పట్ల ఎంతో ఇష్టాన్ని, ఆసక్తిని
రేకెత్తించారు. ఆవిడ ప్రేరణతోనే డిగ్రీలో స్పెషల్ ఇంగ్లీష్ సబ్జక్టుగా
తీసుకున్నాను. టెంత్ క్లాసులో సంస్కృతం, ఇంటర్ లో స్పెషల్ తెలుగు,
డిగ్రీలో స్పెషల్ ఇంగ్లీషు చదవడం వల్ల సాహిత్యం పట్ల ఎనలేని ప్రేమ
ఏర్పడింది. నా కుటుంబ నేపధ్యం సాహిత్యాను రక్తిని కల్గించేది కాదు. నాకు
నేనుగా సాహిత్యంలో మునగడం, తేలడం నేర్చుకున్నాను. కంటబడిన ప్రతి
పుస్తకాన్ని చదవడం, ఆ పుస్తకం కల్గించే ప్రభావానికి లోనవ్వడం, జీవితానికి
అన్వయించుకోవడం ఓ క్రమపద్ధతిలో జరిగాయి. రాహుల్ సాంకృత్యాయన్ ఓల్గా
నుండి గంగా వరకు చదివి నేను తీవ్రమైన ప్రభావానికి గురయ్యాను. అలాగే
సి.వి.రాసిన “సత్యకామ జాబాలి”. ప్రేమ్ చంద్ “గోదాన్” మహాశ్వేతాదేవి
పుస్తకాలు. ఇలా ఎన్నో వేల పుస్తకాలు జీవితాన్ని సుసంపన్నం చేసాయి.

నేను 1976 లో హైదరాబాదు వచ్చాను. అదే సంవత్సరం కమలాదాస్ ఆత్మకథ “మై
స్టోరి” రిలీజ్ అయ్యింది. ఆ రోజుల్లో నేను కొని చదివిన “మై స్టోరీ”
పుస్తకం ఖరీదు ఆరు రూపాయలు. చిన్న ఫాంట్ లో వుంటుంది. కమలాదాస్ మరణ వార్త
విన్నాక దాన్ని తీసి చదవబోతే ఎర్రగా మారిపోయిన పేజీలు, ఈ వయస్సులో అంత
చిన్న ఫాంట్ చదవడం చాలా కష్టమైంది. పేజీలో పేరుకుపోయిన “డష్ట్ మైట్స్”
విజృంభించి నా మీద దాడి చేసి తుమ్మల మీద తుమ్మలొచ్చి కళ్ళలోంచి బొటాబొటా కమలా దాస్ మరణం కల్గించిన దుఖం వల్ల
నీళ్ళొచ్చాయో, పాతపుస్తకం ముట్టుకోవడం వల్ల వచ్చాయో నేను నిర్ణయించుకోలేక
పోయాను. ఎందుకంటే కమలాదాస్ భౌతికంగా వేల మైళ్ళ దూరంలో వున్న తన రచనల
ద్వారా, జీవన విధానం ద్వారా నా మీద విపరీతమైన ప్రభావం వేసిన రచయిత్రి.
సంచలనాలకు పెట్టింది పేరైన కమలాదాస్ పనిగట్టుకొని సంచలనాలను
సృష్టించలేదు. తను నమ్మిన దాన్ని ఆచరించడాన్ని జనం సంచలనాలుగా పిలవడం
జరిగింది. ఆమె ఏం మాట్లాడినా, రాసినా, ఆచరించినా తను నూటికి నూరు శాతం
నమ్ముతూ చేసిందే. ఎవరైనా కొత్త సంచలనం ఏం సృష్టించబోతున్నారని అడిగితే,
“నేను నమ్మిన దాన్ని మాట్లాడుతున్నాను. వివాదాస్పదంగా బతకడం నా కేమీ సరదా
కాదే. జనం ఎందుకలా అనుకుంటారు?” అంటూ ప్రశ్నించేది కమలాదాస్.

కమలాదాస్, నిజానికి మరణ శయ్య మీద హాస్పిటల్ లో ఉండి, హాస్పిటల్ బిల్లులు
చెల్లించడానికి “మై స్టోరీ” రాసింది. నేను ఈ లోకంలోంచి నిష్క్రమించే
ముందు, ఆ సమయం ఆసన్నమయ్యేసరికి నాలో ఉన్న అన్ని రహస్యాలను నాలోంచి బయటకు
పంపెయ్యాలనుకున్నాను. అందుకే ఈ పుస్తకం రాయడం మొదలుపెట్టాను. అయితే
అనూహ్యంగా నేనుకోలుకున్నాను. నా కుటుంబం గురించి బంధువుల గురించి నేను
రాసిన అంశాలు వాళ్ళల్లో తీవ్రమైన కోపాన్ని కల్గించాయి. చట్టబద్ధంగా ఒక
వ్యక్తిని వివాహమాడి అతనితో వుంటూనే నేను వివాహం బయట వ్యక్తులతో ప్రేమలో
పడ్డానని రాయడం పెను వివాదానికి దారి తీసింది. నేను నా స్వంత ఊరు
వెళ్ళినపుడు ఆ కోపాల మంట నన్ను తాకింది. నేను బొంబాయి పారిపోవలసి
వచ్చింది.” అంటుంది “మైస్టోరీ” కి రాసిన ముందు మాటలో.

1932 లో మలబార్ తీరంలో సంప్రదాయ నాయర్ల కుటుంబంలో పుట్టింది. తండ్రి
వి.యం.నాయక్ “మాతృభూమి” అనే మళయాల పత్రికకు మానేజింగ్ ఎడిటర్ గా
పనిచేసేవాడు. తల్లి బాలామణి అమ్మ కవయిత్రి. తల్లి తండ్రులిద్దరూ తమ
వ్యాపకాల్లో మునిగి తేలుతుండడం వల్ల కమలాదాస్ బాల్యం ఒంటరితనంలోనే
గడిచింది. అయితే తల్లి, మేన మామ నారాయణ మీనన్ లు రచయితలుగా
ప్రసిద్ధులవ్వడం వల్ల ఇంటి నిండా సాహిత్య వాతావరణం వుండేది. చిన్నప్పటి
నుండే కవిత్వం చదవడం అలవాటైంది కమలకు. తనూ కవితలల్లడం అలవరుచుకోవడంతో
పాటు తన దైన ఊహల్లో విహరిస్తూండేది. బాల్యంలో ఎదుర్కొన్న ఒంటరితనానికి
తోడు స్కూల్ వాతావరణం, అక్కడి యాంత్రికత ఆమెను తీవ్రమైన నిరాశను
మిగిల్చాయి. అందుకే ఆమెకు ఆరేళ్ళ వయసప్పుడు రాసిన కవిత్వంలో ఎంతో
విషాదముండేది.

“నేను ఆరేళ్ల వయసప్పుడే చాలా సెంటిమెంటల్ గా ఉండేదాన్ని. విషాదభరితమైన
కవితలు రాసేదాన్ని. తలలు తెగిపోయి, ఎప్పటికీ తలలేకుండా వుండే బొమ్మల
గురించి కవితలు రాసేదాన్ని. అలాంటి ప్రతి కవిత నన్ను ఏడిపించేది” అంటుంది
తన ఆత్మకథలో.

అలాంటి ఒంటరితనపు, విషాదపు బాల్యం గడవక ముందే 15 సంవత్సరాలకే తన కంటే
చాలా పెద్దవాడయిన మాధవ దాస్ తో పెళ్ళి జరగడం ఆమెను మరింత నైరాశ్యంలోకి
తోసేసింది. మాధవ్ తో ఎంగేజ్ మెంట్ అయ్యాక తొలిసారి ఆమెని కలవడానికి
కలకత్తా వొచ్చినప్పుడు అతని ప్రవర్తన ఆమెను తీవ్రంగా గాయపరచడతో పాటు అతని
పట్ల విముఖతను ప్రోదచేసింది. అతని మొరటుతనం ఆమెను భయపెట్టింది. తన
ఒంటరితనాన్ని దూరం చేస్తాడని భావించిన ఆమె అతన్ని వెకిలి చేష్టలని
అసహ్యించుకుంది.”

“అతను నన్ను సున్నితంగా తన చేతుల్లోకి తీసుకోవాలని, నా చెవుల్లో ప్రేమ
భాష్యాలు చెప్పాలని ఆశించాను. నాతో ప్రేమగా సంభాషించాలని, స్నేహం
కురిపించాలని, వెచ్చటి స్పర్శని పంచాలని కోరుకున్నాను. తన చేతులతో నా
ఒంటరితనాన్ని దూరం చేస్తాడని నేను గాఢంగా ఆశించాను.”

అలా జరగక పోగా ఆమె ఒంటరిగా వున్నప్పుడు అతని మొరటు శృంగార చేష్టలు ఆమె
సున్నితమైన శరీరం మీద నల్లటి, ఎర్రటి మచ్చల్ని మిగిల్చాయి. వివాహం జరిగాక
తన తొలి రాత్రి అనుభవాన్ని ఇలా వర్ణిస్తుంది.

“తొలి రాత్రి ఎలాంటి హెచ్చరికా లేకుండా అతను నా మీద పడ్డాడు. అతన్నుంచి
తప్పించుకోవడానికి నేను ఎంతో ప్రయత్నించాను. నా గుండె వేగంగా
కొట్టుకోవడంతో నన్ను వదలమని ఎంతో బతిమాలాను. వినలేదు. ఆ రాత్రి అతని
అత్యాచార పర్వం అసంపూర్తిగానే మిగిలింది. ఆ రాత్రి పదే పదే అతను నన్ను
గాయపరుస్తూనే వున్నాడు.”

కమలాదాస్ “మారిటల్ రేప్” గురించి, తన తొలిరాత్రి అనుభవం గురించి వివరంగా
తన ఆత్మకథలో “wedding night:” అనే చాప్టర్ లో ఎంతో ధైర్యంగా రాసింది.

పెళ్ళి, భర్త లాంటి ఆలోచనలు కలగని వయస్సులోనే పెళ్ళవడం, వివాహ జీవితంలో
కుదురుకోక ముందే 16 ఏళ్ళకే తల్లవడం జరిగిపోయాయి. కమలాదాస్ పెద్దకొడుకు
నల్లప్పన్ ఆమెకు పదహారేళ్ళకే పుట్టాడు. వెంట వెంటనే ఇద్దరు కొడుకులు
పుట్టడంతో చిన్నారి కమల చిన్నపిల్లలాగే తన కొడుకులతో కలిసి ఆడేది,
పాడేది. పెద్దకొడుకు పుట్టాక, ఆమె భర్త కనపరిచిన విసుగు, నిర్లక్ష్యం
ఆమెను ఎంతో బాధపెట్టేవి. అతనికి సెక్స్ తప్ప ఇంకేది పట్టేది కాదు. ఫక్తు
వ్యాపారి లాగా ప్రవర్తించేవాడని రాస్తుంది ఒకచోట. తను ఊహించుకున్న
జీవితానికి, వాస్తవంతో తను బతుకుతున్న జీవితానికి ఎక్కడా పొంతన కుదరక
తీవ్రమనస్తాపం పొందేది. ఈ సంఘర్షణంతో ఆమె కవిత్వంలో పొంగిపొర్లేది.
సమ్మర్ ఇన్ కలకత్తా, ది దిసెండెంట్స్ కవితా సంపుటిల్లో తన మానసిక
కల్లోలాన్ని, కలవరాన్ని వ్యక్తం చేస్తుంది. అలాగే భర్త నిర్లక్షాన్ని,
తిరుగుబోతు తనాన్ని ధిక్కరిస్తూ, తాను కూడా అతని లాగానే విశ్వాస
రాహిత్యాన్ని ప్రదర్శించాలని నిర్ణయించుకుంటుంది.

I made up my mind to be unfaithful to him, at least physically.” ఒక
భవన నిర్మాణ కార్మికుడితో ప్రేమకలాపాలు సాగించడానికి ఎలా ప్రయత్నించింది
ఎంతో వివరంగా, ధైర్యంగా “మైస్టోరీ”లో రాస్తుంది.

ఈ సాహసం, తిరుగుబాటు తత్వం బతుకు పొడుగునా కలుపుకోవడం కమలాదాస్
ప్రత్యేకత. సంసార జీవితం లోని మొనాటనీని అత్త, భర్తల సాధింపులను
తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవడానికి సైతం సిద్ధపడుతుంది. అక్కడ కూడా
విఫలమై రాజీ పడుతుంది. భర్తకు చాకిరీ చెయ్యడం అతని చొక్కాలకు బటన్లు
కుట్టడం, వొళ్ళు నలిగేదాకే చాకిరీ చేయడం అలవాటు చేసుకున్నా ఆమెలోపలి ఆత్మ
అనుక్షణం ఆమెను ధిక్కరించేవి. తను కలలు కన్న జీవితానికి, తాను బతుకుతున్న
జీవితానికి ఎక్కడా పొంతన కుదరక మానసిక సంఘర్షణని అనుభవిస్తూ, ఆ సంఘర్షణని
కవితలుగా మలచడం అలవాటు చేసుకుంది.

ఒక రోజు కమలాదాస్ భర్త మాధవ్, తన పురుష ప్రేమికుడుతో కలిసి తమ పడకగది
తలుపులు బిగించుకున్నపుడు, (అదీ తన పుట్టిన రోజు నాడు) కమల భరించలేక
భోరున ఏడ్చింది. తన భర్త ప్రేమ తనది కాదని అర్ధమై అర్ధరాత్రిళ్ళు ఒంటరిగా
దుఃఖంతో సతమతమయ్యేది. అలాంటి ఓ రాత్రి, కొత్త జీవితాన్ని, కొత్త
భవిష్యత్తునూ ఆశిస్తూ
“wipeout the paints, unmould the clay,
Let nothing remain of that yesterday”

అంటూ రాసిన కవితని అప్పటికప్పుడు పత్రికకు పంపించింది. ఇంట్లో పనంతా
అయ్యాక, అందరూ తిని నిద్రపొయ్యాక, అర్ధరాత్రి వేళ డైనింగ్ టేబుల్ ని
శుభ్రం చేసుకొని అక్కడే రాయడానికి కూర్చునేది. గంటలు అలా గడిచిపోతుండేవి.
ఒక్కోసారి తెల్లారి పోయేది. రాత్రంతామేలుకొని రాస్తూ వుండడం, పగలు మళ్ళీ
కుటుంబ బాధ్యతలు వీటన్నింటితో ఆమే ఆరోగ్యం పాడవడం మొదలైంది.రచయిత్రి
కావాలనుకునే స్త్రీకి ఈనాటికీ తనకంటూ ఓగది, ఓ టేబుల్, కుర్చీ, సరిపడిన
సమయం లేకపోవడాన్ని ప్రస్తావిస్తూ కమలాదాస్ ఇలా అంటుంది.

“నేను మామూలు మధ్యతరగతి స్త్రీ గురించి ముఖ్యంగా ఎవరైతే రచయిత
కావాలనుకుంటున్నారో వాళ్ళ గురించి ఆలోచిస్తున్నాను. నా విషయానికొస్తే
వంటింట్లో కూరగాయలు తరుక్కునే బల్ల, భోజనాలు తినే బల్ల ఇవే నా రచనా
స్థలాలు. అదంతా శుభ్రం చేసుకుని రాసుకోవడానికి కూర్చోవాలి. అదే నేను
పనిచేసుకునే స్థలం. అందరూ నిద్రపోయాక నేనూ, నా టైప్ రైటర్ మాత్రమే
మేలుకొని వుంటాం. అలాంటి సమయంలోనే నేను నా కుటుంబాన్ని పూర్తిగా
మర్చిపోయి స్వతంత్ర వ్యక్తిగా మిగులుతాను. ఆ నిశ్శబ్ద నిశిరాత్రి నన్ను
నేను కనుగొంటాను.” అంటుంది. 1921 లో వర్జీనియా వుల్ఫ్ “ఏ రూమ్ ఆఫ్ ఒన్స్
ఒన్” లో “ప్రతి స్త్రీ తనకంటూ ఓ గది, తనదంటూ కొంత సొమ్ము తప్పకుండా
కలిగి ఉండాలి. రచయిత్రి కావాలనుకునే స్త్రీలకి ఇవి ఖచ్చితంగా వుండాలి”
అంటుంది. కమలాదాస్ లాంటి ప్రసిద్ధ రచయిత్రులు కూడా డైనింగ్ టేబుల్ మీదే
తన రచనా వ్యాసంగాన్ని కొనసాగించడం నిజంగా విషాదమే కదా!

కమలాదాస్ కథలు, నవలలు రాసినప్పటికీ ఆమె రాసిన కవిత్వం బహుళ ప్రజాదరణ
పొందింది. తనలో చెలరేగే సంఘర్షణలను, భావోద్వేగాలను, కల్లోలాలను
వ్యక్తీకరించడానికి కథ, నవల కన్న కవిత్వానికే ఎక్కువగా ఎంచుకున్నది. ఆమె
భావాల తీవ్రత, స్వేచ్చా కాంక్ష కవిత్వంలో ప్రస్ఫుటంగా వ్యక్తమౌతుంది.
“పునీల్” అనే కవితలో

నిజం,
ఒకటి రెండు కట్టుబాట్లని నేను మీరాను
అయినప్పటికీ దైవాన్ని కాని, సమాజాన్ని కాని క్షమాభిక్ష కోసం అర్ధించను.
అతిక్రమణలోనే ఆనందాన్ని అనుభవించాను
నిజంగా, నన్ను నేను పునీతురాలిగానే భావిస్తాను.
పుణ్యం కోసం కాదు, పేరు ప్రతిష్టల కోసం కాదు
పరిత్యాగంలోని నిజమైన స్వేచ్ఛా సమయాల కోసం మాత్రమే!”

( - అనువాదం పసుపులేటి గీత)

“నాలో సుడులు తిరిగే బాధే కవితలుగ రూపెత్తాయ్. ప్రతి కవిత బాధలోంచే
పుట్టింది.” అంటుంది ఒకచోట. ఒంటరితనం, భార్యాభర్తల సంబంధంలోని బోలుతనం,
యాంత్రికత,ప్రేమ రాహిత్యం కమలాదాస్ ని నిరంతర అన్వేషణలోకి నడిపాయి.
సంతోషం కోసం, నిజమైన ప్రేమ కోసం ఈ అన్వేషణ కొనసాగింది. సూటి బాణాల్లాంటి
కవితల్లో తన భావోద్వేగాలను వ్యక్తీకరించడం, జనాలను షాక్ చెయ్యడం ఆమెకు
వెన్నతో పెట్టిన విద్య.

“స్టాక్ వెరిఫికేషన్” అనే కవితలో ………….

మునుల తాళపత్ర గ్రంధాలు, సాధువుల ప్రవచనాలు నన్ను శాంత పరిచే వేదాంతాలు,
ఏవీ నా మీద రుద్దకండి కాళ్ళ మధ్య ఓ మనిషిని బిగబట్టి ముగ్గురు
కొడుకుల్ని బయటకు తెచ్చాను” అని రాయగలిగిన సత్తా కమలాదాస్ లో మాత్రమే
చూడగలం.

కమలాదాస్ కవిత్వం అంతర్జాతీయ స్థాయికి చేరుకున్న వేళ, ఆమె భర్తకి కవిత్వ
రచన లాభసాటి వ్యాపారంగా కనబడలేదు. రిజర్వ్ బ్యాంకులో ఉద్యోగం చేసే మాధవ్
దాస్ ఇంటా బయటా ఎప్పుడూ డబ్బులెక్కల్లోనే మునిగి తేలుతుండడం, ఆమె ఏం
రాస్తే డబ్బులు రాలతాయో ఆలోచించడం, ఆమెను కవిత్వం రాయడం మానేసి కథలు
రాయమని నిర్దేశించడంతో కమల నవలలూ, కాలమ్స్ రాయడం మొదలుపెట్టింది.” అతను
చెప్పిన దాన్ని నేను ఏనాడూ వ్యతిరేకించలేదు. దీనివల్ల నాలో కవిత్వం ఎండి
పోయింది కానీ మా దాంపత్యం మాత్రం విజయవంతంగా నడిచింది.” అంటుంది.
అందులోని వ్యంగ్యాన్ని, పదునును అర్ధం చేసుకుంటే తప్ప కమలాదాస్ వేదనని
అర్ధం చేసుకోలేం.

కమలాదాస్ మళయాళ సాహిత్యాన్ని “మాధవకుట్టి “,ఆంగ్ల సాహిత్యాన్ని” కమలాదాస్
“పేరుతోను రాసేది. ఆమె రాసిన ఆంగ్ల రచనలు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో
ప్రాచుర్యం పొందాయి. నోబుల్ సాహిత్య పురస్కారానికి కూడా! కమలాదాస్
ఆంగ్లంలో అయిదు కవితాసంపుటులు ఒక నవల ” అల్ఫాబెట్ ఆఫ్ లష్ట్” “పద్మావతి
ది హర్లెట్ అండ్ అదర్ స్టోరీస్” పేరుతో కథల సంపుటి, “మైస్టొరీ” ఆత్మకథ
ప్రచురించింది.

కమలాదాస్ కథల నిండా కలకత్తాలో ఆమె బాల్యం తాలూకు అమాయికత్వం, జ్ఞాపకాలు
నిండి వుంటాయి. ఆమె కవిత్వం ఎలాంటి దాపరికాలు లేకుండా, కుండ బద్దలు
కొట్టినట్టు వుంటుంది. “ఇల్లాలినంటూ నాకో పేరుపెట్టావ్/ నీకు టీ
కాచడానికి పటిక బెల్లం దంచడం/ వేళ తప్పకుండా విటమిన్ గోలీలివ్వడం/ ఇదీ
నేను నేర్చుకున్న చదువంతా” కమలాదాస్ ఇంటి చాకిరీ, భర్తకి సేవలు చేయడం
గురించి ఇంత సూటిగా రాయడం ఇపుడూ పెద్ద గొప్పగా, కొత్తగా అన్పించకపోవచ్చు.
80 దశకంలో తెలుగు సాహిత్యంలోకి స్త్రీవాద ఉద్యమం ఉవ్వెత్తున ఎగసి వొచ్చి
చేరినపుడు తెలుగు కవయిత్రులు ఇంతకంటే సూటిగ, ఘాటుగా కవిత్వం రాసారు. కానీ
కమలాదాస్ రాసిన కాలాన్ని దృష్టిలో పెట్టుకుంటే ఆమె ఎంత విప్లవాత్మకంగా,
స్త్రీవాద దృష్టి కోణంతో రాసిందో అర్ధం చేసుకోవచ్చు. సహజంగానే ఆమె రచనలు
సంప్రదాయ వాదాల్లో గగ్గోలు పుట్టించాయి. 1976 లో ఆమె ప్రచురించిన
“మైస్టోరీ” జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఆమెకు గొప్ప కీర్తిని
సంపాదించిపెట్టినా అంతే స్థాయిలో ఆమె మీద విమర్శల జడివాన కూడా కురిసింది.
అందులో ఆమె వర్ణించిన అనుభవాలు, వివాహేతర సంబంధాల వర్ణనలు, ఆడస్నేహితులతో
ఎదురైన అనుభవాలు భర్త కొనసాగించిన హోమోసెక్సువల్ సంబంధాలు -
వీటిన్నింటిని నదురు బెదురు లేకుండా తన ఆత్మకథలో రాసిన కమలాదాస్
సంప్రదయవాదులతో పాటు బంధువుల ఆగ్రహానికి కూడా గురైంది. లెస్బియన్ రిలేషన్
షిప్ గురించి ఆమె రాసిన అంశాలు చాలా మందిని షాక్ చేసాయి. 18 సంవత్సరాల
అమ్మాయి తన పట్ల వ్యవహరించిన విధాన్ని

“ఆమె నా పెదాల మీద ముద్దు పెట్టింది. నా చెవుల్లొ నువ్వు చాలా స్వీట్ గా
వున్నావ్ అంటూ గుసగుసలాడింది. నా జీవితంలో నేననుభవించిన మొదటి ముద్దు
ఇదే. మా అమ్మ నేను పసిదానిగా వున్నపుడు ముద్దు పెట్టిందేమో గాని ఆ తర్వాత
ఎవ్వరూ నాకు ముద్దివ్వలేదు” అంటుంది.

కమలాదాస్ రాసిన విషయాలు ఆనాటి మళయాళీ సమాజాన్ని ఓ కుదుపు కుదిపాయి.
నిర్భయంగా ఆమె వెల్లడించిన అంశాలను చూసి గగ్గోలు పెట్టే సమాజాన్ని మరింత
ఏడిపించాలనే అల్లరి ఆలోచనలు కూడా ఆమె చేసిందా అన్పించేలా ఆమె ఆత్మకథలో
ఒక్కో చాప్టర్ కి ఆమె పెట్టిన శీర్షికలు వున్నాయి. బహుశా ఆమె ఆత్మకథను
సీరియలైజ్ చేసిన పత్రిక కూడా రెచ్చగొట్టే విధంగ శీర్షికలు పెట్టినట్టు
అన్పిస్తుంది. ఎందుకంటే ఆ తర్వాత కాలంలో అవన్నీ ఉత్తుత్తి సంఘటనలే అని
ప్రకటించింది కూడా!

కమలాదాస్ తన జీవితమంతా ఉన్నతమైన స్త్రీ పురుష సంబంధాల కోసం
అన్వేషించింది. “ప్రేమతోను, నమ్మకంతోను నిండీన సంబంధాలను స్త్రీ పురుషులు
ఇద్దరూ కోరుకుంటారని, అని ఇంట్లో దొరకనప్పుడు బయట వెతుక్కుంటారని” ఒక
ఇంటర్వ్యూలో చెప్పింది ఆమె. వివాహం బయటి ప్రేమ ను వెదుక్కొవడం అనే
ఆలోచననే సహించని సంప్రదాయ సమాజం, ఆమె భావాలను విని వొదిలేస్తుందని
భావించడం వెర్రితనమే అవుతుంది. అందుకే మాట్లాడిన ప్రతి మాట, రాసిన ప్రతి
అక్షరం వివాదాస్పదమైంది. ఆమె మనస్ఫూర్తిగ నమ్మిన దాన్ని చెప్పింది తప్ప
సెన్షేషన్ కోసమో, వివాదం కోసమో చెప్పలేదు. ఆమె దృష్టీలో శారీరక, మానసిక
సౌందర్యాల మధ్యన భేదం లేదు. శరీర సౌందర్యాన్ని వర్గించడంలో ఆమె ఎలాంటి
శషబిషలు పాటీంచలేదు. “డాన్స్ ఆఫ్ యూనక్స్”, “యాన్ ఇంట్రడక్షన్” లాంటి
కవితల్లో దీనిని మనం చూడొచ్చు. “యాన్ ఇంట్రడక్షన్” కవితలో

“I am every/ woman who love” అంటుంది. 70 దశకంలో కొత్తగా రాస్తున్న
రచయిత్రులకు ప్రతినిధిగా కమలాదాస్ “వ్యక్తిగతంగా సమాజం భావించే అన్ని
అంశాల మీద రాస్తూ, ఆయా అంశాలను బహిరంగపరచడానికి ఎలాంటి సంకోచం లేకుండా
రాస్తూ పోయింది. అప్పటికే ఇస్మత్ చుంగ్తాయ్ రాసిన “రిహాయి”కథ సంప్రదాయ
సాహిత్యలోకంలో పెను సంచలనాలను కలిగించింది. కమలాదాస్ తన అనుభవాలుగా
అంగీకరిస్తూ, శరీరం గురించి, కోరికల గురించి, ప్రేమ గురించి, మానవీయ
స్త్రీ పురుష సంబంధాల గురించి ధైర్యంగా రాయడం ద్వారా కొత్తగా రాస్తున్న
రచయిత్రులకు ఎంతో స్ఫూర్తిని, నిబ్బరాన్ని ఇచ్చింది. ఎనభై దశకంలో
వెల్లువెత్తిన స్త్రీవాద సాహిత్యానికి, స్త్రీ వాద కవయిత్రులకు
స్ఫూర్తిగానూ కమలాదాస్ రచనలు నిలిచాయనడంలో ఎలాంటి సందేహమూ లేదు.

కమలాదాస్ ఏది రాసినా సంచలనమే. ఏది ఆచరించినా సంచలనమే. డిశంబరు 16, 1999
సంవత్సరంలో 65 ఏళ్ళ వయస్సులొ ఇస్లామ్ మతాన్ని స్వీకరించింది. ఆమె రచనలు
ఎంత సంచలనం కల్గించాయో ఆమె ఇస్లామ్ మత స్వీకరణ కూడా వేడి వేడి చర్చల్ని
లేవనెత్తింది. అంతే కాదు బురఖా ధరిస్తూ, స్త్రీలను అణిచివేసే హిందూ మతంలో
కన్నా ఇస్లామ్ లోనే స్త్రీలకు రక్షణ వుందనే ప్రకటన కూడా చేసింది.
సహజంగానే ఇలాంటి ప్రకటనలు జనంలో ఆమె పట్ల ఆగ్రహాన్ని వెల్లుబికిస్తాయి.
అయితే కమలాదాస్ తాను నమ్మిన దాన్ని ఆచరించడానికి, రాయడానికి, బహిరంగంగా
ప్రకటించడానికి ఏనాడు జంక లేదు. ఒక సంప్రదాయ హిందూ నాయర్ కుటుంబానికి
చెందిన కమలాదాస్, భర్త మరణానంతరం ఇస్లాం స్వీకరించి, పేరు మార్చుకుని
తుదివరకు అలాగే బతికింది.

కమలాదాస్ రాజకీయాలను కూడా వొంటబట్టించుకుని “లోక్ సేవా పార్టీ” ని
స్థాపించి 1984 పార్లమెంటు అభ్యర్ధిగా పోటి చేసి ఓడిపోయింది.

తనని తాను ఫెమినిష్ట్ గా చెప్పుకోక పోయినా, తన జీవితంలోని అనుభవానలను,
తాను నమ్మిన వాటిని గురించి రాస్తూ స్త్రీల జీవితాల్లోని అణిచి వేత
గురించి రాసింది. తన గురించి రాసుకున్నా, వారెవ్వరి గురించి రాసినా ఆమె
ఎక్కడా ఏ ముసుగులూ వేసుకోలేదు. జీవితమంతా ప్రేమకోసం వెదుకులాటే అయ్యింది
ఆమెకి. “నన్ను ఎవ్వరూ ప్రేమించలేదు. ప్రేమకోసం వెదుకులాటే నా జీవితమంతా”
అంటుంది ఒకచోట.

కమలాదాస్ తన రచనల ద్వారా ఇంగ్లీషు, మళయాళ సాహిత్యాల్లో అజరామరంగా
నిలిచిపోతుంది. నిరంతర అన్వేషిగా జీవితంలో ఎన్నో ప్రయోగాలు చేసింది. ఆ
ప్రయోగాల పర్యవసానంగా ప్రజల ఆగ్రహాలను చవి చూసింది. తన అన్వేషణలో భాగంగా
పెయింటింగ్స్ వేసింది. రాజకీయాల్లోకి నడిచింది. మతం మార్చుకుంది. నిరంతర
అన్వేషణలో భాగమే ఇవన్నీ కూడా. ప్రేమతో నిండిన స్త్రీ పురుష సంబంధాల కోసం
జీవితమంతా అన్వేషించింది. మనుష్యుల మధ్య మానవీయ సంబంధాల కోసం ఆరాటపడింది.

2006 లో కమలాదాస్ చిట్టచివరి సారి కేరళను సందర్శించింది. తన తాతల నాటి
ఇంటిని, స్థలాన్ని కేరళ సాహిత్య అకాడమీకి దానం చేసింది. తను బతికుండగా
మళ్ళీ కేరళకు రాలేననే విషయం ఆమెకు అర్ధమైనట్టే వుంది. అందుకే ఇలా
అంటుంది.

“నేను మళ్ళీ నా మరణం తర్వాత ఇక్కడికి వస్తాను. మానవాకృతిలో మాత్రం కాదు.
ఒక పక్షిగానో, ఒక లేడిగానో మాత్రమే వస్తాను. నేను ఈ భూభాగంలో మమేకమై
వుంటాను.”

కమలాదాస్ తుది శ్వాస విడిచింది పూనాలో తన రెండో కొడుకు ఇంట్లో. 75
సంవత్సరాల తన అన్వేషణకు ఫుల్ స్టాప్ పెడుతూ 31 మే కమలాదాస్ మరణించింది.
చనిపోయేందుకు రెండు సంవత్సరాల ముందు తనను దర్శించవచ్చిన మిత్రుడు విజయ్
నంబీశన్ తో నేను ముసలి దాన్ని అయిపోతున్నాను” అంటుంది. 72 ఏళ్ళ వయస్సులో
తను ముసలితనంలోకి వెళ్ళినట్టు కొత్తగా చెప్పడం, గమనించడం అంటే తనలోని
పసిప్రాయం లేకుండా పోయిందని అంగీకరించడమే. అలాంటి చిన్నపిల్లలతత్వం ఆమెలో
తుదిదాక బతికుండడమే ఆమెలో గొప్పతనం.

నిరంతరాన్వేషి,, సంచలనాల చిరునామా, ప్రేమ పిపాసి, సాహసి కమలాదాస్ కు ఇదే
నా అక్షరాంజలి. తన ఆత్మకథ ద్వారా నా మీద ఎంతో ప్రభావం చూపిన కమలకు నా
అశ్రు నివాళి

తర్పణాలు త్రిశంకు స్వర్గాలు

 తర్పణాలు, త్రిశంకు స్వర్గాలు ............ మా సీతారాంపురం లో మా తాతకి చాలా పొలాలు ఉండేవి. మా తాత, చిన్న తాత ఇద్దరే పొలాలన్నింటిని పంచుకున్నా...